Thursday 13 December 2018

On KCR's Non-Congress, Non-BJP Governments


 కాంగ్రెస్, బీజేపి ముఫ్త్ సర్కార్

డానీ


ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమను తాము పరిపాలించుకోవడం అనేది నిఘంటువు అర్థం మాత్రమే. ఎంత గొప్ప ఆదర్శ ప్రజాస్వామ్య దేశంలో అయినా అధికార పార్టీయే ప్రభుత్వ రూపంలో ప్రజల్ని పాలిస్తుంది. అందువల్ల ప్రజలకూ, ప్రభుత్వానికి మధ్య ఎప్పుడూ ఒక ఘర్షణ వుంటుంది.    ఘర్షణ ఒక్కోసారి కనిపించనంత  తక్కువగా వుండవచ్చు, ఒక్కోసారి భరించలేనంత ఎక్కువగానూ వుండవచ్చు. ప్రజలకూ, ప్రభుత్వానికి మధ్య కొనసాగే ఘర్షణను ఎన్నికలు క్రమబధ్ధం చేస్తుంటాయి.

ప్రజలు తమ ఆకాంక్షల్ని నెరవేర్చగల ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి వున్న రెండు ప్రధాన సాధనాల్లో ఎన్నికలు మొదటివి. ఇందులో ఒక పరిమితి వుంది. తమ ఆకాంక్షల్ని నేరవేరుస్తాయనే నమ్మకంతోనే ప్రజలు కొత్త రాజకీయ పార్టీలకు అధికారాన్ని కట్టబెడతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర అంత వరకే. కొత్తగా ఎన్నికయిన రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తాయా? లేదా అనేది వేరే అంశం.

 మరోవైపు, ప్రభుత్వాలు సహితం ఐదేళ్ళకు ఒకసారి తమ ఆధిపత్యానికి ప్రజల ఆమోదాన్ని తిరిగి పొందాల్సి వుంటుంది. అధికారం చేజారిపోతుందనే భయంతో అయినా అధికార పార్టీలు సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుకూలమైన విధానాలు కొన్నయినా అనుసరిస్తాయని  ప్రజాస్వామిక సిధ్ధాంతవేత్తలు గట్టిగా నమ్మేరు. అయితే, మన రాజకీయ నాయకులు అతి తెలివైనవారు. “ఓ ఐదేళ్ళు మేము ఓ ఐదేళ్ళు మీరు  వంతుల వారీగా అధికారాన్ని పంచుకుందాం” అంటూ ప్రత్యర్ధులతో సంతుష్టికరణ ఒప్పందాలు చేసుకుంటున్నారు.  రాజస్తాన్ దీనికి గొప్ప ఉదాహరణ. ప్రతి ఎన్నికల్లోనూ అధికారపార్టీని చిత్తుగా ఓడించేస్తున్నామనే ఆనందం రాజస్థానీయులకు దక్కుతూ వుండవచ్చుగానీ ఈ ఆటకు లబ్దిదారులు మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలే. 

మనది బహుళ రాజకీయ పార్టీల ప్రజాస్వామ్యం అనుకుంటాంగానీ, జాతీయస్థాయిలో అయినా, రాష్ట్రాల స్థాయిలో అయినా క్రమంగా రెండు శిబిరాల రాజకీయ వ్యవస్థ బలంగా రూపుదిద్దుకుంటోంది. జాతీయంగా బిజెపి- కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో టిడిపి-వైసిపి, తెలంగాణలో టిఆర్ ఎస్- కాంగ్రెస్, రాజస్తాన్, గుజరాత్ లలో బిజెపి- కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధులుగా కొనసాగుతున్నాయి. ఇలాంటి రెండు శిబిరాల రాజకీయవ్యవస్థలో మొదటి రెండు పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలన్నీ ఆటలో బుడంకాయలుగా మారిపోతున్నాయి.

ఓసారి ఎన్నికల్లో చేజారిన అధికారం తదుపరి ఎన్నికల్లో తిరిగి వచ్చేస్తుందనే ధీమాతో ప్రధాన రాజకీయ పార్టీలు వుంటున్నాయి. దానితో, ప్రజల శాంతి సౌభాగ్యాలను మెరుగుపరిచే అంశాలు పక్కకు పోతున్నాయి. మతవాద -మితవాద, హార్డ్ హిందూత్వ - సాఫ్ట్ హిందూత్వ వంటి కేవల భావోద్వేగ అంశాల మీద ఎన్నికలు జరుగుతున్నాయి. మనం సరిగ్గా గమనించలేదుగానీ నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరు గొప్ప హిందువు అనేది వచ్చే లోక్ సభ ఎన్నికల ప్రధాన జాతీయ ఎజెండాగా నిర్ణయం అయిపోయింది.

నిర్ణిత గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్ సభతోపాటు శాసనసభ ఎన్నికలు జమిలిగా జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వున్నాయి. జాతీయ రాజకీయాల్లో బిజెపిని కాదనుకుంటే కాంగ్రెస్ తో కలవక తప్పదని తెలుగుదేశం పార్టి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సరిగ్గానే గుర్తించారు. ఆ మేరకు వారు చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ తో చాలా ఉత్సాహంగా సంబంధాలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబుది స్థూల తర్కం మాత్రమే.

దేశ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు సహితం జాతీయ ఎజెండా మీద జరిగితే ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయనే ఆశతో కమలనాథులు కొంత కాలంగా జమిలి ఎన్నికల్ని బలంగా ప్రతిపాదిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో బిజెపికి ఒక్క చోట కూడా అధికారం దక్కకుండా చేసిన ‘లోక్ సభ సెమీ ఫైనల్’ ఎన్నికల్ని జమిలిగా జరిపివుంటే ఫలితాలు తద్విరుధ్ధంగా వుందేవనేది కమలనాధుల అంచనా.

బిజెపి, కాంగ్రెస్ కలిసి నిర్ణయించిన జాతీయ రాజకీయ ఎజెండా హోరులో జమిలి ఎన్నికలు జరిగితే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ఎజెండాలు అప్రధానంగా మారిపోయే ప్రమాదం వుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పసికట్టారు. అలా గనుక జరిగితే తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బిజెపిల మధ్య సాగి  టిఆర్ ఎస్ అప్రధానం అయిపోతుందని వారు ఆందోళన చెందారు. తనకు కలిసి వచ్చే తెలంగాణ సెంటిమెంట్ మీద ఎన్నికలు జరగాలంటే లోక్ సభ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికల్ని జరిపేయాల్సిన అవసరాన్ని కేసిఆర్ గుర్తించారు. ముందు జాగ్రత్తతో ముందస్తు ఎన్నికలకు  తెరలేపారు.  కేసిఆర్ గతంలో చంద్రబాబుకు సహాయకునిగా పనిచేశారు. ఇప్పుడు వారు గురువును మించిన శిష్యునిగా మారి జమిలి ఎన్నికల సంక్లిష్ట తర్కాన్ని కూడా దర్శించగలిగారు

కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం మీద అనేక మంది అనేక రకాల ఊహాగానాలు చేశారు.  గానీ, తెలంగాణ సెంటిమెంట్ ను మరొక్కసారి ప్రధాన ఎజెండాగా మార్చడానికే వారు ఆ నిర్ణయం తీసుకున్నారని మాత్రం ఎవరూ గమనించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్ళు అయిపోయిన కారణంగా ప్రాంతీయ సెంటిమెంటు తీవ్రత సాధారణంగా తగ్గిపోతుంది. కానీ తెలంగాణ సెంటిమెంటుని రక్కి పెంచి కేసిఆర్ నెత్తిన పాలు పోసిన ఘనత ‘నటసింహ’ బాలకృష్ణది. కూకట్ పల్లి సెంటర్లో నిలబడి “ఆంధ్రాకు రా! చూసుకుందాం” అన్న డైలాగు  తెలంగాణ ఆంధ్రులకే బొత్తిగా నచ్చలేదు. వాళ్ళు సహితం సైకిల్ గుర్తును చూసి భయపడే పరిస్థితి తెచ్చారు బాలకృష్ణ. 

ప్రధాని నరేంద్ర మోదీ తనను దారుణంగా మోసం చేస్తున్నారని రాజకీయాల్లో ఆయనకన్నా ‘సీనియర్’ చంద్రబాబుకు నాలుగేళ్ళు తెలిసిరాలేదు. సరే. హరికృష్ణ ఇంటిలో తాను ప్రతిపాదించిన పొత్తును కేసిఆర్ తిరస్కరించినపుడయినా ముందస్తు ఎన్నికలకు జూనియర్ రచించిన గేమ్ ప్లాన్ ఆ సీనియర్ కు అర్ధం కావాలిగా? కాలేదు. కేసిఆర్ తెలంగాణ సెంటిమెంటుతోనూ, చంద్రబాబు అభివృధ్ధి నినాదంతోనూ బరిలో దిగారు. 

ఎప్పటిలానే చంద్రబాబు ‘అభివృధ్ధి’ మంత్రం ఈసారి కూడా పని చేయలేదు. వరుసగా 2004, 2009, 2014 (తెలంగాణ) ఎన్నికల్లో పరాజయం పాలయినా సరే తను కొనసాగిస్తున్న  ‘కార్పొరేట్ పెరుగుదల’ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుందని వారు గుర్తించలేక పోతున్నారు. 2016 జీహెచ్ ఎంసి ఎన్నికల్లో ఆధునిక హైదరాబాద్ నిర్మాతను తనేనని ప్రచారం  చేసుకుంటే 150 డివిజన్లలో అవమానకరంగా ఒక్కటంటే ఒక్క డివిజన్ మాత్రమే వారికి దక్కింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో సైబరాబాద్ నేనే నిర్మించాను అని చంద్రబాబు చెప్పుకోవడం ఓటర్లకు చీదర పుట్టించింది. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ సిఇవో వచ్చి బెజవాడ, ధవిళేశ్వరం ఆనకట్టలు నేనే నిర్మించాను అంటే  ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు వేస్తారా? అందుకే, మీడియా నుండి గొప్ప మద్దతు లభించినా టిడిపికి రెండు స్థానాలు (1.68శాతం) మాత్రమే దక్కాయి. 

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, కొత్తగా రాజకీయ నాయకుని అవతారం ఎత్తిన శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద విస్తృతంగా ప్రచారం చేస్తే బిజెపికి వున్న ఐదు సీట్ల లో నాలుగు పోయాయి. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ నడిచిన మార్గంలో స్వామి పరిపూర్ణానంద  శ్రీపీఠం నుండి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠానికి పయనమయ్యారని గట్టిగానే ప్రచారం సాగింది. వారంతా మరో రెండు రోజులు పర్యటిస్తే ఆ మిగిలిన గోషామహల్ సీటును కూడా పోగొట్టి వుండేవారు. 2014లో మోదీ ఎక్కడికి వెళ్ళినా పది ఓట్లు వచ్చేవి. ఇప్పుడు మోదీ ఎక్కడికి వెళ్ళినా  పది సీట్లు పోతున్నాయి.

కోదండరామ్ కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని ఊరుకుంటే సరిపోయేదేమోగానీ ఆయన టిడిపితో కలవడంతో కేసిఆర్ పని సులభమైపోయింది. గద్దర్ కూడా సరిగ్గా ఆ తప్పే చేశారు. ప్రజాయుధ్ధ నౌక మూసీ నదిలో మునిగింది. వీళ్ళెవరికీ తెలంగాణ సెంటిమెంటును స్వంతం చేసుకోవడం సాధ్యం కాలేదు. మరోవైపు, తనను ఒక్కడ్ని చేసి ఓడించడానికి తన శత్రువులందరూ ఎకమయ్యారని కేసిఆర్ చెప్పుకోవడానికి వీళ్లంతా గొప్పగా  దోహదపడ్డారు.

ఈ ముందస్తు ఎన్నికల ఆది మధ్యాంతాలు అన్నీ కేసిఆర్ ప్లానింగ్ ప్రకారమే జరిగాయి. జాతీయ ప్రధాన పార్టీల్లో ఒకటయిన బిజెపి తెలంగాణలో భూమట్టానికి పడిపోయింది. కాంగ్రెస్-టిడిపిలు చావుతప్పి లొట్టపోయాయి. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రభుత్వం ఏర్పడింది. కేసిఆర్ మాటల్లో అది “కాంగ్రెస్ ముఫ్త్, బీజేపి ముఫ్త్ సర్కార్”.

ఎన్నికల్లో టిఆర్ ఎస్ ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తే, విజయానంతరం కేసిఆర్  చేసిన ప్రసంగం ఒక భూకంపంపాన్ని సృష్టించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలను కొత్త విలువలతో పునర్ నిర్వచిస్తామన్నారు. ఉమ్మడి జాబితాను రద్దు చేస్తామన్నారు. ఎస్ టి, ఎస్ సి, బిసి, ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల ఫెడరల్ హక్కుల్ని కాలరాసే తీర్పులు ఇస్తే సుప్రీం కోర్టును కూడా అదుపు చేస్తామని ఒక హెచ్చరిక చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి రాజకీయ నాయకులు సుప్రీం కోర్టు మీద ఈ స్థాయి వ్యాఖ్యలు చేయడం భూకంపంకన్నా తక్కువేమీ కాదు.  కేసిఆర్ నిర్ణయాన్ని ఆహ్వానిద్దాం. మద్దతునిద్దాం.

తాము జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపి ముఫ్త్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా కేసిఆర్ అంటున్నారు. ఇది పునః పరిశీలించాల్సిన అంశం. ఎందుకంటే,  రేపటి లోక్ సభ ఎన్నికల్లో బిజేపి వ్యతిరేక ఓటు పూర్తిగా కాంగ్రెస్ శిబిరానికి పడకపోతే, సంఘపరివారం మళ్ళీ లబ్దిపొంది, కేంద్రంలో యధాస్థితి కొనసాగే ప్రమాదం వుంటుంది.

(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు)
సెల్ ఫోన్ : 9010757776

రచన : 13 డిసెంబరు 2018
ప్రచురణ : మన తెలంగాణ దినపత్రిక, 14 డిసెంబరు 2018

No comments:

Post a Comment