Friday, 8 February 2019

Brief Profile of Danny


Brief Profile of Danny 


June, 2018

ఒక మీడియా సంస్థవారు నన్ను తమ సలహాదారుల్లో ఒకనిగా నియమించారు. ఆ సందర్భంగా నా  సంక్షిప్త పరిచయం అడిగారు. గతంలో ప్రముఖ జర్నలిస్టు తోట భావనారాయణ, రంగావఝ్ఝాల భరద్వాజ మరి కొందరు ఆయా సందర్భాల్లో తమదైన శైలిలో నా పరిచయాన్ని రాశారు.  అవన్నీ కలిపి కొత్తగా కొంత జోడించి ఇలా సంస్కరించాను.  



డానీ – సంక్షిప్త పరిచయం

సాంఘీక ఉద్యమాల నుండి పాత్రికేయ వృత్తి లోనికి వచ్చిస్కాలర్ జర్నలిస్టు”గా  సుపరిచితులయిన  డానీ పూర్తి పేరు అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ జర్రానీ. మీడియాలో ఇటు పత్రికా రంగంలోనూ అటు టీవీ రంగంలోనూ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లోనూ విజయవంతంగా పని చేసిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఉదయం పత్రికలో ఫ్రీలాన్సర్ గా  మొదలయిన డానీ పాత్రికేయ ప్రస్తానం మూడున్నర దశాబ్దాలు సాగింది. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్, ఏపీ టైమ్స్, రీడిఫ్ డాట్ కామ్, సీ-టీవీ, హెచ్ ఎంటీవీ, వనితా టివి, ఎన్-టీవీ, ఎక్స్ ప్రెస్ టీవీల్లో ఆయన చీఫ్ రిపోర్టర్, బ్యూరో చీఫ్,  స్పెషల్ కరస్పాండెంట్, అవుట్ పుట్ ఎడిటర్ స్థాయిల్లో    పనిచేశారు.  ఇండియన్  వారపత్రిక, జైకిసాన్ టీవీల్లో ఎడిటర్ బాధ్యతల్ని నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్ర పాత్రికేయునిగా,  డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా వుంటున్నారు. 

వర్తమాన రాజకీయాల్ని వ్యాఖ్యానించడంలోనూ, సమాజ పరిణామాల్ని విశ్లేషించడంలోనూ డానీ  నిపుణులు.

గోదావరి నది సముద్రంలో కలిసే చోట నరసాపురం డానీ పుట్టిన వూరు. పెట్టిబడిదారులు, ప్రభుత్వాలు నిర్వహించే అకడమిక్ విద్య మీద డానీకి సదభిప్రాయంలేదు. బానిస విద్యా విధానం నశించాలని నినదించిన తరం వారిది. చిలుక పలుకులు నేర్పే విశ్వవిద్యాలయాల్లో ఎప్పటికీ సమాజం అర్ధం కాదు; సమాజాన్ని అందులో జీవిస్తు మాత్రమే అర్ధం చేసుకోగలం అంటారాయన. తను స్వీయ విద్యావంతుల ((self-taught, autodidact, Heutagogy) విభాగానికి చెందుతానంటారాయన.

నివాసాన్ని విజయవాడకు మార్చి విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో పాతికేళ్ళు  క్రియాశీలంగా పనిచేశారు. కొండపల్లి   సీతారామయ్య,  త్రిపురనేని మధుసూదనరావు,  ఆర్ ఎస్ రావు వంటి ఉద్దండుల దగ్గర రాజకీయ, తత్త్వ, ఆర్ధిక శాస్త్రాల్లో మెళుకువలు నేర్చుకున్నారు. ముహమ్మద్ ప్రవక్త,  సయ్యద్ అహ్మద్ ఖాన్, కార్ల్ మార్క్స్, బీ ఆర్ అంబేడ్కర్ తనకు ఆదర్శం అంటారు డానీ. ఒక శూద్ర సమూహాన్ని ఆధిపత్య సామాజికవర్గంగా మార్చిన త్రిపురనేని రామస్వామి చౌదరి సంస్కరణోద్యమాన్ని అణగారిన సమూహాలన్నీ అధ్యయనం చేయాల్సిన అవసరం వుందంటారాయన. ప్రతి సమూహంలోని - ఆ మాటకు వస్తే   ప్రతి వ్యక్తిలోని- విప్లవ, విప్లవ ప్రతిఘాత దశల్ని, కోణాల్ని గుర్తించడమే చారిత్రక భౌతికవాద దృక్పథం అంటారాయన.    

1970-90 దశకాల్లో సాగిన అనేక ఉద్యమాల్లో డానీ క్రియాశీలంగా పాల్గొన్నారు. కారంచేడు దళిత ఉద్యమంలో పీపుల్స్ వార్ ప్రతినిధిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్యకు అధ్యక్షునిగా వున్నారు. చినగంజాం ఉప్పు ఫ్యాక్టరీ, వాడరేవు షిప్ బ్రేకింగ్ యూనిట్ నిర్మాణానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు  నాయకత్వం వహించారు. గడిచిన నాలుగు దశాబ్దాల్లో రెండు  తెలుగు రాష్ట్రాల్లో సాగిన ప్రతి ఉద్యమంతోనూ డానీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుబంధవుంది. భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆరంభమయిన షాహీన్ బాగ్ ఉద్యమంలోనూ,  ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం సాగిస్తున్న ఆందోళనలోనూ ఆయన స్వయంగా పాల్గొన్నారు. 

సాహిత్యరంగంలో డానీ కలం పేరు ఉషా యస్ డానీ. 1970లలో చనిపోయిన స్నేహితురాలు చొప్పరపు ఉషారాణి పేరును ఆయన తన కలం పేరులో చేర్చుకున్నారు. సమాజం, సాహిత్యం, రాజకీయాలపై వారు వందల కొద్ది విశ్లేషణాత్మక  వ్యాసాలు రాశారు. డజను కథలు రాశారు.  జూలియస్ ఫ్యూజిక్ (1981), వ్యంగ్యం (2011) ట్రిపుల్ తలాక్ (2018) మదరసా మేకపిల్ల (2019), నయా మనువాదం – నయా ఫాసిజం (2019) పుస్తకాలను ప్రచురించారు. 1986 నుండి  ఆయన  కొనసాగిస్తున్న ‘ముస్లిం సంవాదం’ వ్యాస సంకలనం మొదటి భాగం (తొలి అధ్యాయం)  త్వరలో మార్కెట్ లోనికి రానున్నది.

ప్రస్తుతం డానీ ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)కు రెండు తెలుగు రాష్ట్రాల  కన్వీనర్ గా, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజానికి కార్యదర్శిగా, బహుజన ప్రతిఘటన వేదికకు కో-కన్వీనర్ గా వుంటున్నారు.

సమాజంలోని అణగారిన సమూహాలన్నింటినీ ఏకం చేయాలనేది డానీ లక్ష్యం. అణగారిన సమూహాలు ప్రతి దానికీ తమవైన ప్రత్యేక కార్యక్రమాలు వుండడమేగాక వాటి మధ్య వైర్యుధ్యాలూ వుండడంతో వీటిని సమన్వయ  పరచడం నేటి సామాజిక కార్యకర్తలకు పెద్ద సవాలుగా మారిందంటారు డానీ. హిందూ అగ్రవర్ణాలు, పెత్తందారీకులాలతో మతసామరస్యం కోసం ప్రత్యేకంగా కృషి చేయడమే వర్తమాన ముస్లిం కార్యక్రమం అంటారాయన.  భారత ఆకాశంలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం పతాకాలు సమున్నతంగా ఎగరాలనేది వారి ఆకాంక్ష. లాల్ సలాం, నీల్ సలాం, హర్యాలీ సలాం అనేది వారి అభివాదం.
----

No comments:

Post a Comment