ఎందువల్లనోగానీ చాలా మంది మీడియాను వాణిజ్య సంస్థలుగా కాకుండా
అమాయికంగా సేవాసంస్థలుగా పరిగణిస్తుంటారు. కనీసం వర్తమాన మీడియా ప్రపంచానికి
సంబంధించినంత వరకు ఇదొక పెద్ద అపోహ. మన దేశపు పార్టీ
ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో విలువల పతనానికి ఎంత చరిత్ర, ఎన్ని దశలు వున్నాయో మనదేశ
మీడియాలోనూ విలువల పతనానికి అంత చరిత్ర, అన్ని దశలు వున్నాయి.
ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా
మీడియాకు ఒక ముఖ్య భూమిక వుంది. ఇది రెండు రకాలు. ప్రజల ఆకాంక్షల్ని
ప్రభుత్వానికి తెలపడాన్ని పాత్రికేయం అంటారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు
తెలపడాన్ని గెజిట్ అంటారు. అంచేత అనేక దేశల్లో మీడియాకు ప్రజాస్వామిక భవనపు నాలుగవ
స్థంభం అంటూ గౌరవిస్తారు. అలాంటి గౌరవానికి తగినట్టుగా నేటి మీడియా వుందా? అని ప్రశ్నిస్తే సమాధానం లేదు అనే
వస్తుంది. ప్రజాస్వామిక ప్రక్రియకు చెందిన రెండు ప్రధాన కర్తవ్యాలని
నిర్వర్తించడం మీడియా మానేసి చాలా కాలం అయింది. అత్యాశపరులైన కార్పొరేట్ల
ఆకాంక్షల్ని నెరవేర్చే పనిలో మీడియా పూర్తిగా నిమగ్నమైపోయింది. సమాచారాన్ని పంపిణీ చేయాల్సిన మీడియా ప్రచారాలు సాగిస్తున్నది.
మీడియాలో ప్రచురణాంశాలు (కంటెంట్) చాలా కాలం సంపాదకుల ఇష్టాయిష్టాల
మీద నడిచేవి. సమాజంలో సాహిత్యంలో ఆలోచనాపరులుగా
ఖ్యాతి పొందినవారినే సంపాదకులుగా నియమించేవారు. పాఠకులు కూడా ముందు సంపాదకీయం
చదివి తరువాత వార్తలు చదివే రోజులు ఒకప్పుడు వుండేవి. మీడియా సంస్థకు పెట్టుబడులు
పెట్టిన వాళ్ళు కూడా కంటెంట్ లో జోక్యం చేసుకోవడానికి జంకేవాళ్ళు. 1980లకు ముందు కూడ
పత్రికలకు రాజకీయాభిమానం
వుండేది. తాము అభిమానించే పార్టీల వార్తల్ని కొంచెం సానుకూలంగా, వివరంగా ప్రచురించేవారు. అయితే ఇతర రాజకీయ పార్టీల
కార్యకలాపాల వార్తల్ని ఎన్నడూ ఆపేవారు కాదు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు చెందిన
నక్సలైటు, దళిత తదితర ఉద్యమాల వార్తలు కూడా మీడియాలో విస్తారంగా వచ్చేవి. తెలుగు పత్రికలకు అది చివరి స్వర్ణఘట్టం.
పత్రికల రాజకీయాభిమానం 1980- వ దశకంలో కొత్త
పుంతలు తొక్కింది. రాజకీయపార్టిల ప్రచార బాధ్యతల్ని నెత్తిన వేసుకోవడంతోపాటూ ఆ
పార్టీల సంస్థాగత వ్యవహారాల్లోనూ కొన్ని పత్రికలు జోక్యం చేసుకోవడం మొదలెట్టాయి. ఆ సాంప్రదాయం బలపడి
ఇప్పుడయితే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓ
పత్రిక, ఓ న్యూస్ ఛానల్, ఓ వెబ్ సైట్, ఓ యూ ట్యూబ్ చానళ్ళను
ప్రత్యక్షంగానో పరోక్షంగానో నెలకొల్పుకుంటున్నాయి.
21వ శతాబ్దంలో సమాచార సాంకేతిక విప్లవం తెచ్చిన వేగం ఫలితంగా
మీడియా సంస్థలకు భారీ పెట్టుబడులు అవసరమయ్యాయి.
సమాజము సాహిత్యము కళలు వంటి వాటిలో ఏమాత్రం ఆసక్తి లేకున్నా పెట్టుబడి పెట్టగల
స్తోమతగల ప్రమోటర్లు చాలా ఉత్సాహంగా మీడియా రంగంలో ప్రవేశించారు. దానితో మీడియాకు అప్పటి వరకువున్న
సామాజిక సేవ అనే పలుచటి ఆఛ్ఛాదన కూడ తొలగిపోయి పూర్తిగా వాణిజ్య లక్షణాలు
వచ్చేశాయి.
పెట్టుబడుల స్వభావంలో వచ్చిన
ఆధునిక మార్పులకు అనుగుణంగా మీడియా సంస్థల
నిర్వహణ, నిర్మాణాల్లో మార్పులు వచ్చాయి. సంపాదకుని గౌరవ స్థానం తగ్గిపోయి
కొత్తగా ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సిఇవో)ల వ్యవస్థ వచ్చింది.
గతంలో కంటెంటుకు సంబంధించిన అన్ని
విభాగాల్లోనూ సంపాదకులే స్వంత టీమ్ ను ఏర్పాటు చేసుకునేవారు. సమాచార పరిజ్ఞానం, భాషా నైపుణ్యం, ప్రాపంచిక దృక్పథాల ఆధారంగా ఆ రిక్రూట్
మెంట్లు జరిగేవి. సామ్యవాద భావాలు కలిగి వుండడం అప్పట్లో జర్నలిస్టు
ఉద్యోగానికి అదనపు అర్హతగా వుండేది.
ఈ సిఇవోలు మార్కెటింగ్, ఫైనాన్స్, రెవెన్యూ వ్యవహరాల్లో నిపుణులు. గొప్ప వ్యాపార దక్షత గలిగినవారు. రెవెన్యూ లక్ష్యాలను అధిగమించ
గలిగినవారు. ఇతర వాణిజ్యరంగాలలో ఎన్ని రకాల అవలక్షణాలున్నాయో
వాటినన్నింటినీ మీడియా సంస్థల్లో ఓ పాలు ఎక్కువగానే తేగలిగిన సమర్ధులు ఈ సిఇవోలు.
ఇప్పుడు న్యూస్ బ్యూరో, న్యూస్ డెస్క్ ల మీద కూడా సంపూర్ణ
ఆధిపత్యం సిఇవోలదే వుంటున్నది. రిక్రూట్ మెంట్
ప్రక్రియే మారిపోయింది. సమాచార పరిజ్ఞానం, భాషా నైపుణ్యం, ప్రాపంచిక దృక్పథాల మీద కాకుండా రెవెన్యూ తేగల స్తోమతల మీద
మీడియాలో ఉద్యోగాలు ఇస్తున్నారు. అన్ని
మీడియా సంస్థల్లోనూ ఇప్పుడు సంపాదకులు దాదాపుగా ‘గౌరవనీయమైన’ ప్రూఫ్ రీడర్లుగా మారిపోయారు.
నాలుగు డబ్బులు సంపాదించిన వాళ్ళు రాజకీయాలు, సినిమాలు, మీడియా వైపు ఆసక్తి పెంచుకుంటారు. వాళ్ళు ఈ మూడు రంగాలను
ఎంచుకోవడానికి కారణాన్ని దివంగత కాంగ్రెస్
నేత పాలడుగు వెంకట్రావు ఓ సందర్భంలో చాలా ఆసక్రికరంగా చెప్పారు. “జీవితంలో విలాసం అంటే లోపల మద్యం, మగువ, జూదం బయట సెలిబ్రెటి స్టాటస్. ఈ నాలుగు విలాసాలు ఈ మూడు రంగాలలో
సులువుగా దొరుకుతాయి” అన్నారాయన.
అసలు మీడియా ఉత్పాదన ఏమిటీ? అనేది ఒక మార్మిక వ్యవహారం. మీడియాలో
ఏళ్ల తరబటి పనిచేస్తున్న వారికి కూడా తాము దేన్ని ఉత్పత్తి చేస్తున్నారో తెలీదు. తాము అభిమానించే ప్రభుత్వానికో, రాజకీయ పార్టీకో, తమను పోషించే వాణిజ్య సంస్థలకో
అవసరమైన సానుకూల అభిప్రాయాన్ని ప్రజల్లో, మార్కెట్లో కలిగించడమే మీడియా చేసే
ప్రధాన ఉత్పత్తి. అమెరికాకు చెందిన ప్రముఖ
సామాజిక కార్యకర్త నోవమ్ చోమ్స్కి దీనినే ‘మాన్యుఫెక్చరింగ్ కన్సెంట్’ అంటూ మాస్ మీడియా రాజకీయ ఆర్ధిక
స్వభావాన్ని వివరించాడు. మీడియా సంస్థలు వార్తల్ని పంపిణి చేస్తాయని చాలా మంది
నమ్ముతారు. నిజానికి రాజకీయ పార్టీలు, వాణిజ్య సంస్థలకు అవసరమైన పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతల్ని మీడియా సమీకరించి
పెడుతుంది. అదే దాని ప్రధాన కార్యకలాపం. దానివల్ల లబ్దిపొందే రాజకీయ
పార్టీలు, వాణిజ్య సంస్థలు మీడియాకు పోషకులుగా వుంటాయి.
రాజకీయ, వాణిజ్య రంగాలతో అనుబంధం
లేకుండా వర్తమాన మీడియా ఒక్క క్షణం కూడా
బతకలేదు. భారతదేశంలో అత్యంత భారీ వాణిజ్య సంస్థ రిలయన్స్. అతి పెద్ద మీడియా సంస్థ నెట్ వర్క్
– 18. రెండింటి అధినేత ముఖేష్ అంబానియే. గుజరాత్ ముఖ్యమంత్రిగావున్న
నరేంద్ర మోదీ ఇమేజ్ ను అభూత కల్పనలతో భారీగా పెంచేసి ప్రధానిని చేసిన వాణిజ్యవేత్తల్లో
ఆడానీలు, అంబానీలు ముఖ్యులు. రాజకీయ ఆర్ధిక రంగాలతో మీడియాకు వుండే అనుబంధం
అలాంటిది. నెట్ వర్క్ – 18కు దేశంలో
అనేక భాషల్లో అనేక స్వంత ఛానళ్ళు వుండడమేగాక ఇతర ఛానళ్ళలో వాటాలున్నాయి. పైగా రిలయన్స్
సంస్థతో మీడియా సంస్థలకు అనేక లావాదేవీలుంటాయి. అంచేత ఈ న్యూస్ ఛానళ్ళన్నీ అంబానీ ఇంట్లో
పెళ్ళి సంబరాలను వారం రోజులపాటు ప్రసారం చేస్తాయిగానీ, దేశవిదేశాల్లో ఆ సంస్థ సాగిస్తున్న
ఆర్ధిక అరాచకాలనూ, పర్యావరణ విధ్వంసాలను ఎప్పుడూ ప్రసారం చేయవు.
మీడియా ప్రయోజనాలను గమనించిన
ప్రపంచ భారీ వాణిజ్య సంస్థలు ఇప్పుడు ఆ
రంగం మీద దృష్టి పెట్టాయి. ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ఇప్పుడు మీడియా రంగంలో
విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రైమ్ వీడియో ద్వార సినిమా రంగంలో ప్రవేసించిన
అమేజాన్ ఇటీవల వాషింగ్టన్ పోస్టు దినపత్రికను కొనుగోలు చేసింది. వీళ్లందరికీ మార్గదర్శి
న్యూస్ కార్పొరేషన్, ట్వంటీ ఫస్ట్ సెంచరి ఫాక్స్ ల అధినేత రూపర్ట్ ముద్రోక్.
మీడియా సంస్థల మధ్య ఒక రకం పోటీ
కూడా కొనసాగుతు వుంటుంది. ఇందులో ఘర్షణ మాత్రమేగాక ఒక ఐక్యత కూడా వుంటుంది. ప్రతి మీడియా సంస్థ ఏదో ఒక రాజకీయ
పార్టిని ఆశ్రయిస్తుంది. అధికార రాజకీయ పార్టీని సమర్ధించే మీడియా అంతా సవ్యంగా
వుందనీ, సమాజం వెలిగిపోతున్నదనీ ప్రచారం చేస్తుంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీని సమర్ధించే మీడియా ప్రభుత్వ వ్యతిరేక వార్తల్ని
ప్రచురిస్తూ వుంటుంది. వాటి మధ్య ఘర్షణ అంత వరకే. వాణిజ్య సంస్థల ప్రమోషన్ విషయంలో మాత్రం అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల మీడియాలు
రెండూ కలిసే పనిచేస్తాయి.
వాణిజ్య సంస్థలకు లాభాలు పండించేలా
మార్కెట్లో కొనుగోలు ఉత్సాహాన్ని కల్పించడం మీడియా సంస్థల బాధ్యతల్లో ప్రధాన మైనది. అంచేత పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతల్లో మార్కెట్ నైరాశ్యాన్ని
నింపే వార్తల్ని మీడియా క్రమంగా తగ్గించేస్తుంది. ఒకప్పుడు అణగారిన సమూహాల వార్తల్ని
ప్రచురించడమే సమాజసేవ అనుకున్న మీడియా ఇప్పుడు అలాంటి వార్తల్ని నిషేధిస్తుంది. ఆ స్థానంలో వినోద కార్యక్రమాలని ప్రోత్సహిస్తుంది. 24 పేజీల
దినపత్రికల్లో ఓ నాలుగు పేజీలు తప్ప మిగిలిన పేజీలన్నింటినీ సినిమా, క్రీడలు, వంటలు,
ఫ్యాషన్, స్టైల్ వంటి ఫీచర్స్ తో నింపేస్తున్నారు. వార్తా పత్రికలు ఇప్పుడు డైలీ మేగజైన్లుగా మారిపోయాయి. సామ్యవాద భావాలు కలిగి వుండడం జర్నలిస్టు ఉద్యోగానికి ప్రధాన
అనర్హతగా తయారయ్యింది.
సమాజ పరిణామాల్ని నివేదించడం(రిపోర్టు చేయడం) ఆ పరిణామాల మీద భావసంచయాన్ని
సాగించడం మీడియా ధర్మం అని గతంలో అనేవారు. ఇప్పుడు ఆ విలువలు మారిపోయాయి. ప్రభుత్వం అద్భుతంగా
పనిచేస్తున్నదనో, మార్కెట్ దూసుకుపోతున్నదనో, అభివృధ్ధి కొత్త పుంతలు
తొక్కుతున్నదనో చెప్పడానికి వార్తల్ని సృష్టిస్తున్నారు. గణాంకాలను తారుమారు చేసేస్తున్నారు. అబధ్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ అనేది
మీడియా సాంప్రదాయాల్లో భాగం అయిపోయింది.
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న
నల్లధనాన్ని వెనక్కు తీసుకుని రాగల మహాయోధునిగా గత ఎన్నికల్లో భారత మీడియా
నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేసింది. పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని
లక్షల కోట్ల రూపాయల నల్లధనం బయటికి వచ్చేస్తోందనీ దానితో వంట గ్యాస్ ను ఉచితంగానూ, పెట్రోలు డీజిల్ లను లీటరు పది
రూపాయలకు ఇవ్వవచ్చనీ, పేదరికాన్ని దేశ సరిహద్దుకు ఆవల తరిమికొట్టి పాకిస్తాన్ లో
పడేయవచ్చని మీడియా మోడియా బాకాలూ ఊదింది. ఇదంతా పచ్చి అబధ్ధమని
తెలియనివారు ఇప్పుడూ ఎవరూ లేరు.
మనలో చాలా మందికి వాణిజ్య వ్యాపారాల కార్యకలాపాల గురించి తెలీదు. కొంత పెట్టుబడి పెట్టి సరుకుల్ని
తయారు చేసి వాటిని అమ్మి పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడంతో పాటూ కొంత లాభాన్ని
కూడా వ్యాపారులు పొందుతారని పాఠ్యపుస్తకాల్లో చెప్పే నిర్వచనాలే నిజమని ఇప్పటికీ చాలా
మంది నమ్ముతారు. ప్రాయోజిత పెట్టుబదీదారీ వ్యవస్థ (క్రోనీ కేపిటలిజం) వాణిజ్య నిర్వచనాలను మార్చివేసింది. ప్రభుత్వాధినేతలతో అనుబంధాన్ని
పెంచుకుని ప్రాజ్రెక్టుల కాంట్రాక్టులు పొందడంతోపాటూ భూమి, అడవులు, సముద్రం, నదులు, గనులు, తదితర సహజ వనరుల్ని వ్యక్తిగత ఆస్తిగా మార్చుకుని కార్పొరేట్లు
మరింత ఐశ్వర్వవంతులుగా ఎదగడమే క్రోనీ
కేపిటలిజం.
బ్రాహ్మణీ స్టీల్స్ రాకతో రాయలసీమ
ప్రాంత పారిశ్రామిక ముఖ చిత్రమే మారిపోతుందన్నట్టు పన్నెండేళ్ళ క్రితం పెద్ద
ప్రచారం సాగింది. ఫ్యాక్టరీ కోసం ఇనప ఖనిజపు గనుల్ని ఓబుళాపురం మైనింగ్
కంపెనీకి లీజుకు కు ఇచ్చారు. దాని అధినేత గాలి జనార్దన రెడ్డి స్టీల్ ఫ్యాక్టరీని
నిర్మించలేదుగానీ బెలెకెరి పోర్టు ద్వార 35 లక్షల టన్నుల ఇనప ఖనిజాన్ని చైనాకు
అక్రమంగా తరలించి కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. తన దేశభక్తి గురించి అతిగా ప్రచారం చేసుకునే బిజిపిలో
జనార్దన రెడ్డి ప్రముఖ నాయకుడు. ఆయన మాత్రం భారత భూమిని చదరపు అడుగుల లెఖ్ఖన తవ్వేసి టన్నుల లెఖ్ఖన ప్రత్యర్ధి దేశం చైనాకు
అమ్మేశాడు. వీటన్నింటినీ మీడియా పతాక శీర్షికల్లో
ప్రచురించదు. తప్పని సరయినపుడు లోపలీ పేజీల్లో గుర్తించ వీలులేనట్టు చిన్నవార్తగా
ప్రచురిస్తుంది.
నరేంద్ర మోదీ దేశప్రధాని అయ్యాక
ఆడానీ సంస్థలకు మేలుకలిగేలా ప్రత్యేక ఆర్ధిక (సెజ్) మండళ్ళ మార్గదర్శకాలను కేంద్ర
ప్రభుత్వం మార్చివేసింది. ఈ వార్తను
ప్రచురించినందుకు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంపాదకుడు పరంజియో గుహ ఠాకుర్తా
రాజీనామా చేయాల్సి వచ్చింది. మోదీ ప్రధాని కాగానే అమిత్ షా కొడుకు జే షా వ్యాపారం 16 వేల రెట్లు పెరిగిపోయిందన్న వార్తను రాసినందుకు ద వైర్ వెబ్ ఛానల్ అనేక కోర్టు
కేసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జే షా వ్యాపారాభివృధ్ధి గురించి హైదరాబాద్ నుండి వెలువడే ఓ
ఆంగ్ల పత్రిక కూడ రెండు రోజులు పతాక శీర్షికల్లో ప్రచురించింది. మూడో రోజు ఆ పత్రిక ఎడిటర్ ను
మార్చేశారు.
అంచేత ఎలాంటి దుస్సాహసాలు చేయకుండా క్రోనీ కేపిటలిజంకు వంత
పాడి తాము కూడా నాలుగు రూపాయలు వెనకేసుకోవాలని మీడియా సంస్థలు భావిస్తున్నాయి. అసలు మీడియా సంస్థలు సహితం కార్పొరేట్ సంస్థలనే వాస్తవాన్ని
మనం తరచూ మరచిపోతుంటాం.
వర్తమాన మీడియా సంస్థలకు ప్రస్తుతం
ఆరు రకాల రెవెన్యూ వస్తుంది. స్పాట్స్, కమ్మర్షియల్స్, స్క్రోలింగ్స్ ద్వార వచ్చేది మొదటిరకం రెవెన్యూ. కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులకు
ప్రచారం కల్పించడం వల్ల వచ్చేది రెండో రకం రెవెన్యూ. వివిధ ప్రభుత్వ శాఖల కార్యకలాపాల ప్రచారం, టెండర్ల పిలుపుల ప్రకటనల ద్వార
వచ్చేది మూడో రకం రెవెన్యూ. ఈ మూడు రకాల రెవెన్యూల్ని సాపేక్షంగ ధర్మబధ్ధమైనవి అనవచ్చు.
పొలిటికల్ పార్టీల ప్రచారం కోసం
వచ్చేది నాలుగో రకం రెవెన్యూ. ఇది కింది స్థాయి నాయకుల
జన్మదినోత్సవాలు మొదలుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రత్యేక ఇంటర్ వ్యూలు, ఎన్నికల ప్రచారం వరకు అనేక దశల్లో
వుంటుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ముందు అధికార పార్టీ తన సంక్షేమ
కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని మీడియా సంస్థల్ని కోరుతుంది. మీడియా సంస్థల ప్రాచూర్యాన్ని
బట్టి ఓ మొత్తాన్ని కేటాయిస్తారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు పెద్ద సంస్థలకు పెద్ద
మొత్తాలు చిన్న సంస్థలకు చిన్న మొత్తాలు
దక్కుతాయి. అది కోట్ల రూపాయల్లో వుంటుంది. అదీగాక, ఇతర కార్పొరేట్
సంస్థల బాటల్లోనే మీడియా సంస్థలు కూడా ప్రభుత్వం నుండి సెజ్ లు, పవర్ ప్రాజెక్టులు,
కాంట్రాక్టులు వంటి మేళ్ళు పొందుతుంటాయి. ఇది
ఐదవ రకం రెవెన్యూ.
ఆరవ రెవెన్యూ
వినూత్నమైనది. ఇది వార్తల్ని ప్రచురించినందుకో, ప్రసారం చేసినందుకో కాకుండా
వార్తల్ని ప్రచురించనందుకు, ప్రసారం చేయనందుకు వచ్చే ఆదాయం. కార్పొరేట్లు అత్యాశపరులు. విచక్షణా రహితంగా అక్రమాలకు
పాల్పడుతుంటారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇనుప ఖనిజాన్ని అక్రమ రవాణా చేసే
సమయంలో టిప్పర్లను ఓవర్ లోడ్ చేసేవారు, వాహనాలనూ అతివేగంగా నడిపేవాళ్ళు, టిప్పర్ల పైన టార్పాలిన్
కప్పేవారుకారు. ఆ ఇనప రజను కళ్ళల్లోపడి ఆ రోడ్లెంట వున్న గ్రామాల్లోని ప్రజల్లో అనేకులు కంటి చూపుల్ని కోల్పోయారు. హెవీ లోడు బండ్లతో రోడ్లు
పాడైపోవడమేగాక ఆ దారిలో ప్రతి రెండు రోజులకు ఒక ప్రమాదం జరిగేది. ఇంకా లోతులకు వెళితే ప్రత్యర్ధుల
హత్యలతో సహా అనేక అక్రమాలు కనిపిస్తాయి. ఈ వార్తల్లో
చాలా వాటిని మీడియా ప్రచురించకుండా, ప్రసారం చేయకుండ ఆ కార్పొరేట్లకే
బేరానికి పెడుతుంది. ఇలా ప్రచురించని, ప్రసారం చేయని వార్తలకు భారీ మూల్యాలు చెల్లించే వారిలో
భారీ రియల్టర్లేగాక బాబాలు, స్వాములు కూడా
వుంటారు. ఈ పనుల్నిసిఇవోలు అయితే చురుగ్గా చేయగలరు; పనిలోపనిగా తమ
వ్యక్తిగత ఆదాయాన్నీ పెంచుకోగలరు. స్వామికార్యం స్వకార్యం అనే సామెత ఎలానూ వుంది.
మీడియా విషయంలో
పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలు చేసే తప్పు కూడా ఒకటుంది. వార్తలు చదవడానికి, చూడడానికీ, వినడానికీ పాఠకులు, వీక్షకులు, శ్రోతలు ఒక్క పైసా కూడా చెల్లించరు. మనం టివీ కోసం చెల్లించేది కేబుల్
ఆపరేటరుకే పోతుందిగానీ న్యూస్ ఛానల్ కు ఒక్క రూపాయి కూడా వెళ్లదు. పేపర్ బిల్లు కూడా అంతే. రంగుల్లో 24 పేజీల పేపరు అచ్చువేయడానికి 25 రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. మనం చెల్లించే 5 రూపాయలు దాన్ని మన ఇంటికి
చేర్చడానికి అయ్యే రవాణా ఖర్చుకూ, ఏజెంటు కమీషనుకూ సరిపోతుంది. వార్తల్ని వాళ్ళు వాటిని మనకు ఉచితంగా పంపిణి
చేస్తున్నారంటే అర్థం ఏమిటీ? పెట్టుబడి మొత్తాన్నీ,
ఆ పైన లాభాలను పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలు పక్షాన మీడియా సంస్థలకు మరెవరో
ఇస్తున్నారనేగా? అర్ధం. ప్రజలు తమ వార్తల కోసం కొంతైనా వెచ్చించడం మొదలు పెట్టనంత వరకు కార్పొరేట్లు, రాజకీయ పార్టీల వార్తల్నే ప్రధాన
స్రవంతి మీడియా మనకు చేరవేస్తూ వుంటుంది.
రచన : హైదరాబాద్, 3 మే 2019 (ప్రపంచ పత్రిక స్వేఛ్ఛా దినం)
ప్రచురణ : ప్రజాశక్తి దినపత్రిక, 17 మే 2019