Friday, 3 May 2019

విద్యార్ధుల ఆత్మహత్యలు - ప్రభుత్వ మేధావులు

Students Suicides and the state  Intellectuals

విద్యార్ధుల ఆత్మహత్యలు - ప్రభుత్వ మేధావులు

ఉషా యస్ డానీ 


సమాజంలో ఏదైనా ముఖ్యమైన పరిణామం జరిగినపుడు దానికి బాధితులు మాత్రమేగాక రచయితలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు, సోషల్ వర్కర్లు, యాక్టివిస్టులు, అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వం, అందులోని వివిధ శాఖలు, అశేష సామాన్యులు  సహితం  సహజంగానే స్పందిస్తారు. వీళ్లందరి స్పందనలు ఒకేరకంగా వుండవు. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఆ అంశం మీద స్పందిస్తారు. (Rashomon effect అన్నమాట). వాళ్లవాళ్ళ అస్థిత్వాలు, అవసరాలు ఆ అంశం మీద వాళ్ళ దృక్పథాలను నిర్ణయిస్తాయి. ఇవి పరస్పరం విరుధ్ధంగానూ వుంటాయి. ఈ దృక్పథాలనే సాహిత్యంలో వస్తువు అంటారు. కొందరు అమాయికత్వం వల్ల అంశాన్నే వస్తువు అని పొరబడుతుంటారు. ఒక అంశం మీద రచయిత దృక్పథమే వస్తువు. I repeat, ఒక అంశం మీద రచయిత దృక్పథమే వస్తువు.

ఇప్పుడు తెలంగాణను కుదిపేస్తున్న అంశం ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలు. ఒక్క వారం రోజుల్లోనే ఇరవై మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక పరంపరగా సాగిన ఈ సామాజిక అఘాయిత్యం, ఒక నరమేధం ఇక్కడితో ఆగిపోయిందనీ కూడ చెప్పలేము.

నాలుగు లక్షల మంది తెలంగాణ విద్యార్ధుల భవిష్యత్తును తేల్చే ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 18 సాయంత్రం  రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. ఫలితాల వెల్లడిలో జరిగిన ఘోరమైన తప్పిదాలు  కొందరు విద్యార్ధుల ఆత్మహత్యలకు దారితీశాయి. కొన్ని వేలమంది విద్యార్ధులు, వాళ్ల కుటుంబాలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి. 

ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకల మీద విద్యాశాఖ ఒక త్రిసభ్యకమిటీని వేసింది.  ఆ కమిటి నివేదికను అందుకున్న తరువాత జనార్దన్ రెడ్డి ఏప్రిల్ 27న మీడియాతో మాట్లాడారు.  “531 మందికి ఒక పేపరు మార్కుల్ని అసలు కలపలేదు. 4288 మందికి ర్యాంకుల్లో దశాంశాలే తేడా అయిపోయాయి. పరీక్షలు రాసిన 496 మందికి గైర్ హాజిరీ (ఆబ్సెంట్)  వేశారు. 99 మార్కులు వచ్చిన అమ్మాయికి ‘00’ రెండు సున్నాలు వేశారు.  సర్వర్ కు డేటా కెపాసిటీ సరిపోలేదు. ఆన్ లైన్ లో ఫలితాలు కనిపించడంలేదు. ఒక్కో వెబ్ సైట్ లో ఒక్కో రకంగా ఫలితాలు వున్నాయి” అని వారు త్రిసభ్యకమిటీ కనుగొన్న తప్పిదాలను ప్రకటించారు. ఈ తప్పిదాలను సరిదిద్దడానికి ఆరు రకాల తక్షణ చర్యలు తీసుకోవడమేగాక ధీర్ఘకాలిక చర్యలుగా విద్యారంగంలో మరికొన్ని సంస్కరణలు చేపట్టాలని కూడా త్రిసభ్యకమిటీ సూచనలు చేసిందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి అన్నారు.

ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన  అవకతవకల గురించి  విద్యార్ధులు, బాధితుల కుటుంబాలు, విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు,  సంఘసేవకులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చెపుతున్న జాబితా ఇంకా పెద్దదిగానే వుంది. వాటి నిజానిజాల వ్యవహారం ఎలావున్నా త్రిసభ్య కమిటి నిర్ధారించిన అంశాలు చాలు విద్యార్ధుల్ని తీవ్ర నైరాశ్యంలో ముంచివేయడానికీ, కొన్ని కేసుల్లో ఆత్మహత్యలకు పురికొల్పడానికీ. ఈనాటి జెట్ స్పీడు పోటీ ప్రపంచంలో ఒక్క మార్కు కూడా విద్యార్ధుల భవిష్యత్తుని గుణాత్మకంగా మార్చివేస్తుందని అందరికీ తెలుసు. అలాంటిది 99 మార్కులు సాధించగల అద్భుత ప్రతిభగల ఒక విద్యార్ధికి రెండు సున్నాలు వేస్తే ఆ లేత వయసులో ఎంత షాక్? వాళ్ళేమైపోతారూ?

పరీక్షల నిర్వహణలో ఏ చిన్నపొరపాటు జరిగినా  దానికి మొదట బాధ్యత పడాల్సింది ఇంటర్ మీడియట్ బోర్డు. ఆపైన విద్యాశాఖ. ఆ పైన విద్యామంత్రి. ఆ పైన రాష్ట ప్రభుత్వం. ఫలితాలు వెలువడిన కొన్ని నిముషాల్లోనే అవకతవకలు జరిగినట్టు తెలిసిపోయింది. వాటివల్ల విద్యార్ధుల మానసిక స్థితిలో కలిగే ప్రమాదకర  ప్రభావాన్ని విద్యాశాఖలోని బాధ్యులు వెంటనే గ్రహించి క్షణాలలో ప్రమాద నివారక చర్యలు చేపట్టి వుండాల్సింది. తక్షణం మొత్తం ఫలితాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించి, రెండు మూడు రోజుల తరువాత సరిచేసిన ఫలితాలను ప్రకటిస్తే సరిపోయేది. ఎలాగూ ఏప్రిల్ 12న ప్రకటిస్తామన్న ఫలితాలను ఆరు రోజులు ఆలస్యంగా ప్రకటించారు. ఇంకో రెండు రోజుల వ్యవధి తీసుకునివున్నా పెద్దగా నష్టం వుండేది కాదు.   

అలా జరక్కపోగా  ఇంటర్ మీడియట్ బోర్డు తన తప్పుల్నికప్పిపెట్టి అడ్డంగా బుకాయించడానికి పూనుకుంది.  వివరాలు తెలుసుకోవడానికి బోర్డు ఆఫీసుకు వచ్చిన విద్యార్ధులు, వాళ్ళ తల్లిదండ్రుల మీద దౌర్జన్యాలకు, పోలీసు జులుంకు పాల్పడింది. ఇలాంటి చర్యలు విద్యార్ధుల్ని మరింత నైరాశ్యానికి గురిచేశాయి. ఈలోగా ఇదంతా కొత్తగా కాంట్రాక్టు దక్కించుకున్న ఓ ఐటీ కంపెనీ నిర్వాకమని బయటికి వచ్చింది. అనేక సంవత్సరాలుగా పరీక్షల  ఫలితాలను ప్రాసెస్ చేస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను కాదని గ్లోబరీన డెత్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ కు ఈ కాంట్రాక్టును ఎందుకు ఇచ్చారనే అనుమానం కూడ బలపడింది. కాంట్రాక్టు విలువ మీద కూడ అనేక ఊహాగానాలు వినిపించాయి. ఈలోగా 23 పసిప్రాణాలు గాల్లోకి ఎగిరిపోయాయి. ఈ కేసులో నిస్సందేహంగా ప్రధమ ముద్దాయి ఇంటర్మీడియట్ బోర్డు.

విద్యాశాఖ కార్యదర్శి మీడియాకు త్రిసభ్యకమిటి  నివేదిక వివరాలు వెల్లడి చేసిన రోజే డాక్టరేట్ సంగిశెట్టి శ్రీనివాస్ ‘ఇంటిదొంగలే ఇంటర్కు శాపం’ అనే వ్యాసం రాసి, ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. పేరుకు ముందు డాక్టరేట్ వుంటే పరిశోధనల్లో దిట్ట అని అర్ధం.  సంగిశెట్టి శ్రీనివాస్ వంటి పేరున్న మేధావి, తనకు “తెలంగాణ అబ్సెషన్” అని తరచు ప్రకటించుకునే రచయిత, ఒక సాంఘీక కల్లోల సమయంలో ఒక వ్యాసం రాశారంటే - విద్యార్ధుల ఆత్మహత్యలకు దారితీసిన ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహణ వైఫల్యాలతో పాటూ అనేక సామాజిక రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక మానవీయ కోణాల్ని సహితం ఆవిష్కరిస్తారనీ వాటి నివారణకు  మహత్తర పరిష్కారాలు చూపుతారనీ ఆశించడం సహజం. వారు ఎంత గొప్ప పరిశోధనాత్మక వ్యాసం రాశారో ఇప్పుడు పరిశీలిద్దాం.

సంగిశెట్టి శ్రీనివాస్ తనకు “తెలంగాణ అబ్సెషన్” వుందని ప్రకటించుకుంటే అమాయకులు అనేకులు తలలూపవచ్చు. గానీ, ఆ లండన్ హైగేట్ శ్మశానం సమాధిలో అశాంతిగా కదులుతున్న జర్మనీ గెడ్డపాయన కార్ల్ మార్క్స్ ఒప్పుకోడుగాక ఒప్పుకోడు. తెలంగాణలో ఎవరి మీద వారి అబ్సెషన్? “ అని అడుగుతాడు. సంగిశెట్టివారి అబ్సెషన్ (ఇప్పటికి)  చనిపోయిన 23 మంది విద్యార్ధుల మీదా?  ఇంటర్మీడియట్ బోర్డు మీదా? అని నిలదీస్తాడు.  

సంగిశెట్టి శ్రీనివాస్  తన వ్యాసానికి ‘ఇంటిదొంగలే ఇంటర్కు శాపం’ అని శీర్షిక పెట్టారు. దీనికి రెండు అర్ధాలున్నాయి. ‘తెలంగాణ ఇంటిదొంగలే ఇంటర్మీడియట్ విద్యార్ధులకు శాపం’ అనేది ఒక అర్ధం. ఇంటిదొంగలే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు శాపం’ అనేది రెండో అర్ధం. మొదటి అర్ధాన్ని కాదని రెండో అర్ధాన్ని నిరూపించడానికి వారు ఈ వ్యాసంలో అనేక కసరత్తులు, గారడీలు చేశారు.  

 (ఇప్పుడు) “వార్తలొస్తున్న విధంగా ఎస్సెస్సీ బోర్డులో ఇంటర్బోర్డుని విలీనం చేసినట్లయితే 1969 నుంచి అంటే 50 ఏండ్లుగా విడిగా మనుగడలో ఉన్న ఇంటర్బోర్డు ఉనికి మాయం కానున్నది. దీనివల్ల ఎంతోమంది జూనియర్లెక్చరర్లను త్రిశంకు స్వర్గంలోకి నెట్టివేసినట్లయితది” అని వారు వ్యాసం చివరి పేరాలో తెగ బాధపడిపోయారు. 
 
త్రిసభ్య కమిటీ నిర్ధారించి ప్రకటించిన తప్పుల్ని ఒప్పుకోవడానికి కూడ సంగిశెట్టి శ్రీనివాస్ సిధ్ధంగా లేరు. వ్యాసం మొత్తంలో ఎక్కడా ఆ తప్పుల ప్రస్తావన గురించి ఒక్క వాక్యం కూడ లేదు. అంతేకాదు విద్యార్ధుల ఆత్మహత్యల గురించి వారు చాలా అమానవీయ వ్యాఖ్యలు చేశారు.

ఇట్లా ప్రతి సంవత్సరం వత్తిడిని తట్టుకోలేని విద్యార్థులు పదుల సంఖ్యల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు” అని ఒకవైపు గుర్తిస్తూనే మరోవైపు ఆ నేరాన్ని ఇంటర్మీడియట్ బోర్డు నుండి తప్పించి విద్యార్థి సంఘాలు, విపక్ష రాజకీయ పార్టీల మీదకు నెట్టివేసే నీచ ప్రయత్నాలు కూడా సంగిశెట్టి శ్రీనివాస్ నిస్సిగ్గుగా చేశారు.

విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు “(విద్యార్ధుల) చావులను హైలైట్చేస్తూ పరోక్షంగా విద్యార్ధుల్ని ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారు” అని ఈ దార్శినికులు ఒక గొప్ప సామాజిక సత్యాన్ని ఆవిష్కరించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను కోరడాన్ని కూడ  ఈ తత్వవేత్త ఏమాత్రం సహించలేకపోయారు.  ఈ వ్యాసాన్ని రాస్తున్నపుడు వారిని విద్యామంత్రి పూనారో, లేక విద్యామంత్రికి వారే (గాత్రదానంలా) మెదడు దానం చేశారో ఎవరయినా పరిశోధిస్తే మరికొన్ని మహత్తర అంశాలు ఆవిష్కారం అవుతాయి.

వాస్తవాలను తన ప్రత్యర్ధులు “మరుగున పడేస్తుంటే” “నీరక్షీర వివేకంతో !!!”నిష్పక్షపాతంగా !!!” సోషల్మీడియా ద్వారా వారు వెలుగులోకి తెచ్చిన మహత్తర విషయాలు ఇవి!! వీటిని  కూడా కొందరు భరించలేక పోతున్నారని వారు వాపోయారు. తన రచనల్నిప్రతిఫలాపేక్షతోటి ప్రభుత్వాలకనుకూలంగా రాస్తున్నారని” దుష్ప్రచారం చేస్తున్నారని ఇంకో ఆవేదన ప్రకటించారు. వారు ప్రభుత్వాలకు అనుకూలంగా రాస్తున్నారనేది ఈ సందర్భంగా చాలా చిన్న ఆరోపణ. ఇంటర్మీడియట్ బోర్డు మీద విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన రెడ్డికన్నా సంగిశెట్టి శ్రీనివాస్ ఎక్కువ శాఖాభక్తిని ప్రదర్శించారు.  పూర్వం రాజుల కాలంలో, దీనినే రాజుని మించిన రాజ్యభక్తి అనేవారు.


ఆత్మహత్యల మీద ఒక వ్యాసం రాయాలనుకున్నప్పుడు సమాజ విశ్లేషకులు సహజంగా 19వ శతాబ్దపు ఫ్రెంచ్ తత్వవేత్త ఎమిలి డర్ఖేమ్  వైపు చూస్తారు. ఆయన 1897లో ఆత్మహత్యల మీద ‘లె సూసైడ్స్’ అనే ఒక మహత్తర గ్రంధాన్ని రాశాడు. అలాగే మనస్తత్వ శాస్త్రవేత్తలు సహితం ఆత్మహత్యల మీద అనేక సిధ్ధాంతాలు, పరిష్కారాలు చెప్పివుంటారు. వృత్తి పరిశోధకులు అయిన  సంగిసెట్టి శ్రీనివాస్ కొంచెం వాటిని అధ్యనం చేసి వర్తమాన ఆత్మహత్యల్ని విశ్లేషిస్తే సమాజానికి కొంచెం మేలు జరిగేది. వ్యాసం ఆదియు, అంతమునూ, మధ్యముల్లో వారిది ఇంటర్మీడియట్ బోర్డును కాపాడే ఆతృతే అయిపోయిందాయే!.

ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యల వ్యవహారంలో సంగిశెట్టి శ్రీనివాస్ బెంగంతా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును ఎస్సెస్సీ బోర్డులో కలిపేస్తారనే. అలా కలపొద్దు అని చెప్పడానికే వారు ఈ వ్యాసం రాశారు. వారి అబ్సెషన్ అంతా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గురించేగానీ తెలంగాణ విద్యార్ధుల గురించి కాదు.

సంగిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ కొలువు తనంతట తానుగా పాపపు పని ఏమీకాదు. పొట్టకూటి కోసం ఎవరి తంటాలు వాళ్ళు పడుతుంటారు. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం ఒక రకంగా కుదరదు. అందుకే కొందరు మహారచయితలు కలం పేర్లతో రాస్తారు. మరికొందరు రచయితలు తాముగా రాసే అవకాశాలు లేనపుడు తమ దగ్గరున్న సమాచారాన్ని ఆధారాలని ఇతర రచయితలకో, పాత్రికేయులకో ఇచ్చి అవి ఏదో ఒక విధంగా బయటి ప్రపంచానికి తెలిసేలా సహకరిస్తారు. ఇవేవీ కుదరనప్పుడు అన్నీ మూసుకుని కూర్చుంటారు. అంతే తప్ప ప్రభుత్వ భజన చేయరు.  

సుదీర్ఘ పరిశోధనలవల్ల సాహిత్య చరిత్రలో సంగిశెట్టి శ్రీనివాస్ సాధించిన గొప్ప విజయం ఒకటి వుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగుతున్నప్పుడు ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ నిజాం సంస్థానంలో కొలువు చేసేవాడని కనుగొన్నది వీరే. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న ఆ విషయాన్ని ప్రపంచానికి చాటుతూ సోషల్ మీడియాలో ఒక పోస్టును వీరు తప్పక పెడుతూ జాతిని జాగృతం చేస్తుంటారు. ఇంత గొప్ప విషయాన్ని కనుగొన్న మహా సామాజిక ఆలోచనాపరుడు కూడ తెలంగాణలో ఒక పరంపరగా విద్యార్ధుల ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ప్రభువుల కొలువులో వున్నాడని రేపటి ప్రపంచానికి ఎవరో ఒకరు చెప్పాలిగా !!  

ఇక్కడ ఇంకో సూక్ష్మం వుంది. నిజాం సంస్థానంలో కొలువు చేస్తున్నపుడు కూడ శ్రీశ్రీ రైతాంగ పోరాటానికి వ్యతిరేకంగా కవితలు రాయలేదు.  శ్రీశ్రీ రికార్డును సంగిశెట్టి శ్రీనివాస్ బ్రేక్ చేశారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నపుడు ప్రభువుల మెప్పు కోసం ఆ శవాల మీద తన భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నంలో ఇంటర్మీడియట్ బోర్డు పరిరక్షణ పథకానికి అక్షర సేవలు అందించారు.   

  అసలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మీద  మహా ఆలోచనాపరుడు అయిన సంగిశెట్టి శ్రీనివాస్ సెంటిమెంట్ ఎంత ప్రగాఢమైనదీ? అనేది ఇప్పుడు మరో కీలక ప్రశ్న.  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జులై 4న ఆరంభమయింది. కరీంనగర్ జిల్లాలో ఇసక రవాణాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని నేరెళ్ళ పోలీసు స్టేషన్ లో 2017 జులై 4 రాత్రి  స్థానిక ఎస్పీ చాలా కర్కశంగా చిత్రహింసలు పెట్టాడు. బాధితులు చాలా కాలం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. ప్రముఖ దినపత్రికలు అన్నింటిలోనూ ఈ వార్తలు వచ్చాయి.  అప్పుడు సంగిశెట్టి శ్రీనివాస్ తన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సెంటిమెంటును బయటికి తీశారా? లేక ఆ సెంటిమెంటును లోదుస్తుల్లో గట్టిగా దాచుకున్నారా? ద్వంద్వ ప్రమాణాలను పాటించేవారిని అసలు మనిషి  అనడం కూడా తప్పు; ఆలోచనాపరుపరుడు అనడం చాలా పెద్ద తప్పు.  

ఈ సందర్భంగా ఒక మాట చెప్పకుండ వుండలేము. మౌఖిక, లిఖిత సాహిత్యాల్లో తెలంగాణకు ఒక గొప్ప సాంప్రదాయంవుంది. ఆ వాసనలేవీ ఈ ఇంటర్మీడియట్ బోర్డు మేధావికి అబ్బినట్టులేవు. బోర్డు పరిరక్షణ కోసం రాసిన వ్యాసంలో ఒక్క వాక్యానికయినా జీవం వుందా? భాషలో జీవం ప్రజలవైపు నిలబడినప్పుడు వుంటుంది. ప్రభుత్వం వైపు నిలబడినపుడు భాష నిర్జీవం అయిపోయి ప్రభుత్వ ఉత్తర్వుల్లా మాడిపోతుంది.

విద్యార్ధుల ఆత్మహత్యల మీద వారు రాసిన వ్యాసం మీద బహిరంగ చర్చను కొనసాగిద్దామని ప్రతిపాదించినపుడు సంగిసెట్టి శ్రీనివాస్ తాను “ప్రభుత్వ ఉద్యోగి” అంటూ పరిమితుల్ని గుర్తుచేశారు. అయితే వారి స్వీయ అస్థిత్వం ప్రకటన చారిత్రికంగా మహత్తరమైనది.   తెలంగాణ ఉద్యమం సాగుతున్న రోజుల్లో విద్యార్ధులేగాక ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు సహితం పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి అప్పటి ప్రభుత్వాన్నీ, ప్రభుత్వాధినేతల్ని పేర్లు పెట్టి విమర్శీంచేవారు. అప్పుడప్పుడు తిట్టేవారు కూడ. నిజంచెప్పాలంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాలే ముందుండి నడిపాయి. ఆ విశాల ప్రజాస్వామ్యం గతించిన కాలమని, ఇప్పుడు నోరు మెదపడానికి కూడ అవకాశాలు లేవని సంగిసెట్టి శ్రీనివాస్ చాలా అద్భుతంగా చెప్పారు. ఈ చారిత్రక వాస్తవ ప్రకటనకు వారిని మెచ్చుకోకుండా వుండలేం!

రచన : హైదరాబాద్, మే డే, 2019
ప్రచురణ : 

No comments:

Post a Comment