విడాకులు
ఒక ప్రజాస్వామిక పౌరహక్కు
దాంపత్య జీవితానికి ప్రవేశద్వారం వివాహం
అయితే నిష్క్రమణ ద్వారం విడాకులు. ఎప్పుడయినా ఎక్కడయినా నిర్భంధం అప్రజాస్వామికం కనుక
నిర్భంధం నుండి బయటపడడం ప్రజాస్వామిక హక్కు అవుతుంది. కలిసే స్వేఛ్ఛతో పాటు విడిపోయే స్వేఛ్ఛ కూడా మనుషులకు
ఒక హక్కుగా వుండాలి.
వివాహం, ఆస్తిహక్కు మొదలైన సామాజిక
వ్యవస్థల్లో ఏడవ శతాబ్దంలోనే ముస్లిం సమాజం అనేక సంస్కరణల్ని చేపట్టింది. స్త్రీలకు ఆస్తిహక్కు, వితంతు పునర్వివాహం, విడాకుల
సౌకర్యం వంటివి ఇస్లాం ఆవిర్భావం నుండే వున్నాయి.
వధువు కన్నె కావల్సిన అవసరం లేదనే ఒక మహత్తర విలువను కూడా ఇస్లాం ప్రవేశపెట్టింది.
13వ శతాబ్దంలో బానిస (మామ్లుక్) వంశానికి చెందిన మహిళ రజియా బిన్త్ ఇల్తుష్ మిష్ ను
భారత సుల్తాన (చక్రవర్తిణి) చేసిన ఘనత కూడా ఇస్లాందే.
ముస్లిం సమాజంలో విడాకుల్ని తలాక్ అంటారు.
వివాహబంధం నుండి విడిపోవాలనుకున్న భర్త నిర్ణిత వాయిదాల్లో మూడుసార్లు తలాక్ అని ఉఛ్ఛరించాలి.
విడాకులు ఇచ్చే సమయంలో భార్య గర్భవతి కాదని నిర్ధారించుకోవడానికి అవసరమైన కాలాన్ని
(ఇద్దత్) నిర్ణిత గడువుగా పాటించాలి. ఏదో ఒక
అవేశంలో భార్యకు తలాక్ చెప్పినా దంపతుల మధ్య మళ్ళీ సయోధ్య కుదరడానికి వీలుగా ఇద్దత్
గడువు ఉపయోగ పడుతుంది. కొన్ని పరిమితులతో విడాకులు కోరే హక్కు ఖులా పేరిట ముస్లిం మహిళలకు
కూడ వుంది.
పధ్ధెనిమిదవ శతాబ్దపు ఫ్రాన్స్ లో వాల్టేర్
రూస్సోలు వచ్చి 1790వ దశకపు ఫ్రెంచ్ విప్లవానికి నాందీ పలికే వరకు దాదాపు వెయ్యి సంవత్సరాలు
ఇస్లామిక్ సామాజిక సిధ్ధాంతాలే ప్రపంచంలో అత్యంత ఆధునిక భావనలుగా చెలామణి అయ్యాయి.
ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ ఉపదేశాలనూ,
జీవితాచరణను ఆదర్శంగా స్వీకరిస్తారు. దీనినే
హదీస్ అంటారు. హదీస్ అవతరించి 13 శతాబ్దాలు గడిచిపోయాయి గనుక మునుపటి ఆదేశాలకూ వర్తమాన
ఆధునిక జీవితానికీ మధ్య ఒక ఘర్షణ తరచూ తలెత్తుతుంటుంది. ఆధునిక మానవహక్కులకు అనుగుణంగా
హదీస్ ఆదేశాలను పరిష్కరించడానికి న్యాయమీమాంస
సాగించగల సమర్ధులు నేటి ముస్లిం సమాజానికి కావాలి.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 497ను గత ఏడాది ఆగస్టు 9న రద్దు చేస్తున్న
సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన మూడు వ్యాఖ్యలు పౌర జీవితానికి సంబంధించి
మహత్తరమైనవి. వాటిల్లో, వివాహేతర లైంగిక సంబంధాలు నేరపూరిత చర్యలు కావు అనేది మొదటిది.
దాంపత్యంలోని పౌరతప్పిదాలకు పౌరపరిష్కారంగా విడాకుల్ని వాడుకోవాలనేది రెండవది. వివాహేతర లైంగిక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన ఒక
వ్యక్తిని జైలుకు పంపడం ఇంగితజ్ఞానంతో కూడిన చర్య అనిపించుకోదు (does not appeal
to common sense) అనేది మూడవది.
Common
sense is not so common అన్న అలనాటి వాల్టేర్ మాటలు ప్రధాని నరేంద్ర మోదీజీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి
వర్తిస్తాయి. సుప్రీం కోర్టు తీప్రుకు విరుధ్ధంగా వారు విడాకుల్ని నేరపూరిత చర్యగా పరిగణిస్తూ ‘ముస్లిం
మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు – 2017ను రూపొందించారు. ‘తక్షణ’ ట్రిపుల్ తలాక్
చెప్పిన భర్తకు మూడేళ్ళ జైలు శిక్షను విధించడం ఈ బిల్లులో కీలకాంశం. గతంలో లోక్ సభ
ఆమోదాన్ని పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది. రెండవసారి ప్రధాని
అయిన నరేంద్ర మోదీ ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదాన్ని పొందడానికి ఇప్పుడు ఎక్కువ ఆసక్తిని
కనపరుస్తున్నారు.
ముస్లిం వధూవరులు వివాహ సమయంలో పరస్పర
అంగీకారాన్ని బాహాటంగా ప్రకటిస్తారు. పరస్పర అంగీకారం లేని సంభోగం, గృహహింస వంటివి
ఎలాగూ శిక్షార్హమైన నేరాలు. అయితే, విడాకుల్ని సహితం శిక్షించదగ్గ నేరంగా పరిగణించడం
ఆధునిక స్వేఛ్ఛా భావనల్ని అడ్దంగా అత్యాచారం చేయడమే అవుతుంది.
ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై వివాదం చెలరేగడానికి
ముస్లిం సమాజం సహితం బాధ్యత వహించాలి. సమాచార సాంకేతిక విప్లవం ఫలితంగా రంగప్రవేశం
చేసిన స్మార్ట్ ఫోన్లు, ఎస్సెమ్మెస్, ఇంటర్నెట్, ఫేస్ బుక్, మెసెంజర్, వాట్స్ అప్ తదితర
సామాజిక మాధ్యమాల ద్వార కొందరు భర్తలు చెపుతున్న ‘తక్షణ’ ట్రిపుల్ తలాక్ చెల్లదని ముస్లిం
సమాజం ముందే ప్రకటించి వుండాల్సింది. ముస్లిం పౌరస్మృతి సంస్థలు సకాలంలో మేల్కొని స్వీయ
సమాజాన్ని గాడిలో పెట్టి వుండాల్సింది. హదీస్ ఇచ్చిన ఒక సౌకర్యాన్ని దుర్వినియోగం చేసి,
ట్రిపుల్ తలాక్ ను ‘తక్షణ’ ట్రిపుల్ తలాక్ గా కల్తీ చేసి, ఇద్దత్ గడువును దాట వేసి
భార్యను బయటికి గెంటేసిన కుంటుంబాల మీద సాంఘీక బహిష్కరణ విధించి వుండాల్సింది. కానీ, అలా జరగలేదు.
వర్తమాన ముస్లిం యువకుల్లో ఎక్కువమంది
భారీగా కట్న కానుకలు తీసుకుంటున్నారు, అట్టహాసంగా వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు.
డబ్బుల కోసం భార్యను అత్తమామల్ని క్రూరంగా
వేధిస్తున్నారు. ఇవేకాదు; హదీస్ కు వ్యతిరేకంగా ఇంకా అనేక అనేక పనులు చేస్తున్నారు.
కానీ, విడాకుల సందర్భం వచ్చినపుడు మాత్రం హదీస్ ను ఆశ్రయిస్తున్నారు. ఇది అపచారం; పచ్చి
అవకాశవాదం.
మతాచార్యుల్లో కొందరు పురుషాధిక్య భావనతో
వ్యవహరిస్తారు. ఇస్లాం సాంస్కృతిక ఆదేశాలను పురుషుల దృక్పథంతో వ్యాఖ్యానించి ఫత్వాలు
జారీ చేస్తుంటారు. మహిళల హక్కుల్ని అణిచివేస్తుంటారు. ధార్మిక రంగంలో తమకు లభించిన
సాంస్కృతిక అధికారాన్ని అహంభావంతోనో, కొన్ని సందర్భాలలో డబ్బుకు ఆశపడో దుర్వినియోగం
చేస్తుంటారు. 2014 ఎన్నికల సమయంలో విజయవాడకు చెందిన ఒక మౌల్వి “ముస్లిం మహిళలు రాజకీయాలకు
అనర్హులు” అంటూ ఒక తప్పుడు ఫత్వా జారి చేశారు. ‘తక్షణ’ ట్రిపుల్ తలాక్ ఇస్లాం సాంప్రదాయం
కానప్పటికీ భర్త ఒకసారి చెప్పేశాక విడాకులు అమల్లోనికి వచ్చేసినట్టే అంటూ వికృత వ్యాఖ్యానాలు చేసిన మతాచార్యులూ వున్నారు.
ఇలాంటి మతాచార్యుల అండ చూసుకుని టెక్కీ (Techie) తరం భర్తలు చెలరేగిపోయారు. గడిచిన
మూడేళ్ళలో దేశ వ్యాప్తంగా ‘తక్షణ’ ట్రిపుల్ తలాక్ కేసులు దాదాపు 60 వరకు వెలుగులోనికి వచ్చాయి.
‘తక్షణ’ ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలు న్యాయం కోసం
సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ
సందర్భంగా ఖురాన్, హదీసుల్ని పరిశీలించిన సుప్రీం కోర్టు ‘తక్షణ’ ట్రిపుల్ తలాక్ అసలు
ఇస్లాం సాంప్రదాయమే కాదని 2017 ఆగస్టు 21న తేల్చి చెప్పింది. ఇస్లాం సాంప్రదాయం ప్రకారమైనా,
రాజ్యాంగం ప్రకారమైనా ‘తక్షణ’ ట్రిపుల్ తలాక్ చెల్లదు కనుక విడిపోయిన దంపతులు మళ్ళీ కలిసి కాపురం చేసుకోవచ్చని
చెప్పింది.
దంపతులిద్దరి ఆర్థిక స్థితిగతులు సమానంగా
వున్న సందర్భాల్లో ఎవరు ఎవరికి విడాకులు ఇచ్చినా
పెద్దగా ఇబ్బంది వుండదు. కానీ, మహిళల అర్థిక స్థితి పురుషులతో సమానంగా ఎదగని సమాజాల్లో
మహిళలు మాత్రమే విడాకులకు ప్రధాన బాధితులుగా వుంటారు. అంతమాత్రాన భర్తలే భార్యల్ని
వదిలేస్తారని తీర్మానించలేం. భార్యలు వదిలేసిన భర్తల సంఖ్య కూడా తక్కువేమీకాదు. భారత
దేశంలో విడిపోయిన స్త్రీలు 32.82 లక్షల మంది వుంటే విడిపోయిన పురుషులు 16.15 లక్షల
మంది వున్నారు.
మహిళలకు ఆర్ధిక వెసులుబాటు, కొనుగోలు
శక్తి పెరిగేకొద్దీ విడాకుల రేటు కూడ పెరుగుతుందని ప్రపంచ గణాంకాలు చెపుతున్నాయి. యూరప్
లో అతి చిన్న దేశం అయినప్పటికీ అతి బలమైన ఆర్థిక వ్యవస్థ గల లగ్జెంబర్గ్ లో విడాకుల
కేసులు ఏకంగా నూటికి 87 వరకు వున్నాయి. అభివృధ్ధి
చెందుతున్న దేశమైన భారత దేశంలో విడాకుల కేసులు కనిష్టంగా ఒక శాతం మాత్రమే వుండడం ఒక
సానుకూల అంశం.
భారత జనాభా కమీషనర్ విడుదల చేసిన 2011వ సంవత్సరపు నివేదికలో వివాహబంధం
తెగిపోయిన వాళ్ళను రెండు రకాలుగా వర్గీకరించారు. దేశంలో విడిపోయిన స్త్రీలు 23 లక్షల
72 వేల 754 మందికాగా. విడాకులు పొందిన స్త్రీలు
9 లక్షల 9 వేల 574 మంది అని తేల్చారు. విడాకులు పొందిన స్త్రీల్లో ముస్లింలు 2 లక్షల ఒక వెయ్యి 15 మంది అనగా 22.1
శాతం. దేశ జనాభాలో ముస్లింలు 14 శాతం మాత్రమే కనుక ఈ గణాంకాలను బట్టి ముస్లిం సమాజంలో
విడాకుల శాతం ఎక్కువగా వున్నట్టు కనిపిస్తోంది. అయితే, ముస్లింలు రహాస్యంగా విడాకులు
తీసుకోరు కనుక దాదాపు ప్రతి విడాకుల కేసు కూడ రికార్డుల్లో నమోదు అవుతుంది. హిందూ స్త్రీల విషయం అలాకాదు. విడాకులు పొందారో లేదో
తేలని కేసులు అనేకం వుంటాయి. అందుచేత, విడిపోయిన విభాగంలో సహజంగానే హిందూ స్త్రీలు
చాలా ఎక్కువగానూ ముస్లిం స్త్రీలు చాలా తక్కువగానూ వుంటారు. రెండు విభాగాలను కలిపి
చూస్తే ముస్లింలలో విడాకుల రేటు జనాభాలో వాళ్ళ శాతానికి కొంచెం అటుఇటుగా మాత్రమే వుంటుంది.
దాంపత్యంలో వివాదం తలెత్తినపుడు భార్యలు
సాధారణంగా సయోధ్యను కోరుకుంటారు. కేసు పెడితే భర్తను జైలుకు పంపుతారని ముందే తెలిస్తే
కేసు పెట్టడానికి ఏ భార్య కూడా సాహసించదు.
ఆ కోణంలో మోదీ బిల్లు భర్తలకే ఉపయోగ
పడవచ్చు!. ఈ బిల్లువల్ల ఇంకో ప్రమాదం కూడ వుంది. వివాహేతర సంబంధాల మూలంగా భర్తల్ని,
పిల్లల్ని చంపేస్తున్న భార్యల గురించి ఇటీవల అనేక సంఘటనలు వెలుగు లోనికి వస్తున్నాయి.
అలాంటి గృహిణిలకు కొత్త బిల్లు మోదీ ఇచ్చిన వరం కూడ కావచ్చు!.
భర్తలు వదిలేసిన మహిళల మీద మోదీజీ ప్రభుత్వానికి
సానుభూతి కనుక వుంటే వాళ్ళకు ఆర్ధిక సహాయాన్ని అందించడానికి కొన్ని సంక్షేమ పథకాలను
ప్రవేశపెట్టవచ్చు. విడాకులు చెప్పిన భర్త ఆదాయంలో, ఆస్తిలో మాజీ భార్య, పిల్లలకు కొంత
హక్కు కల్పించవచ్చు. ఆ పనులేమీ చేయకుండా ముస్లిం
భర్తల్ని జైళ్ళకు పంపడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకంత ఉవ్విళ్ళూరుతున్నట్టూ? విడాకులు
ఇచ్చిన హిందూ భర్తల్ని వదిలేసి కేవలం ముస్లిం భర్తల్నే శిక్షిస్తామంటే అది మతవివక్ష
అవ్వదా? రాజ్యాంగ లౌకిక ఆదర్శాలకు విరుధ్ధంగా
ప్రభుత్వం వ్యవహరించవచ్చా? ప్రజాస్వామిక ప్రభుత్వం నెరవేర్చాల్సిన ప్రధాన బాధ్యతల్లో
అల్పసంఖ్యాకుల సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం కూడా ఒకటి అని మరచిపోవడం ఏ పరిణామాలకు దారితీస్తుందీ?
ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ
నెపంతో ముస్లిం సమాజానికి ప్రభుత్వం తల పెట్టిన వేధింపు చర్యల్ని ప్రజాస్వామికవాదులు
అందరూ ఖండించాలి. ముస్లిం సమాజం వీధుల్లోనికి వచ్చి ప్రజాస్వామిక హక్కుల కోసం ఇతరులతో
కలిసి ఉద్యమించాల్సిన తరుణమిది. లేకుంటే, వాళ్ళ ఇళ్ళలోనే వాళ్ళు చనిపోతారు.
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్
: 9010757776
రచన : 20 జూన్ 2019
ప్రచురణ : ఆంధ్రజ్యోతి, 21 జూన్ 2019
No comments:
Post a Comment