Only Kashmiri People Have to Decide the Future
ఇక కథ నిర్ణయించేది కశ్మీరీలే…!
డానీ
ఒప్పందాలు చేసుకున్నప్పుడు అందరూ పెద్దమనుషులేగానీ
ఒప్పందాలను పాటించే సమయంలో అందరివీ చిన్న మనసులు. 1937లో రాయలసీమ ప్రతినిధులతో చేసుకున్న
ఒప్పందాన్ని ఆంధ్రా పెద్దమనుషులు పాటించలేదు. 1956లో తెలంగాణ ప్రతినిధులతో చేసుకున్న
ఒప్పందాన్ని సీమాంధ్ర పెద్దమనుషులు పక్కన పడేశారు. ఫలితంగా పెద్ద ఉద్యమం సాగి తెలంగాణ
విడిపోయి మన కళ్ళ ముందే ప్రత్యేక రాష్ట్రంగా
ఏర్పడింది. ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగంలోని
370 అధీకరణం అనే ఇంకో ఒప్పందాన్ని చెత్త బుట్టలో
పడేశారు. అలాగే, కశ్మీర్ లో శాశ్విత నివాసుల్ని నిర్వచించే ఆర్టికల్ 35-ఏ ను కూడా రద్దు
చేశారు. ఆర్టికల్ 370, 35-ఏ ల కథ ముగిసిందని
ప్రధాని నరేంద్ర మోదీజీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ప్రకటించారు. అయితే ఈ కథ నిజంగానే
ముగిసిందో మరో కొత్త మలుపు తీసుకుంటుందో నిర్ణయించాల్సీంది కాశ్మీరీ ప్రజలు.
అయితే కశ్మీర్ వ్యాలీ ప్రతిస్పందనను తెలుసుకునే
అవకాశం ప్రస్తుతం లేదు. జమ్మూ- కశ్మీర్ లో ఇప్పుడు రాష్ట్రపతి పాలన వుంది. అక్కడ ఎన్నికయిన
ప్రజాప్రభుత్వం లేదు. మాజీ ప్రజాప్రతినిధుల్ని గృహ నిర్బంధంలో వుంచారు. వాళ్ళను విలాసవంతమైన
భవనాల్లో బంధించినట్టు కేంద్ర హోంమత్రి అమిత్ షా ఓ ప్రకటన చేశారు. కశ్మీర్ లో కర్ఫ్యూ
విధించారు. ఇంటర్ నెట్, టెలీఫోన్, టివి తదితర ప్రసార మాధ్యమాలను రద్దు చేశారు. కాలేజీలు,
విశ్వవిద్యాలయాలు, స్టూడెంట్ హాస్టళ్ళకు సెలవులు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల విద్యార్ధుల్ని
స్వరాష్ట్రాలకు పంపించివేశారు. అమర్ నాథ్ యాత్రను రద్దు చేశారు. సరిహద్దుల్లో భారీగా
సైన్యాన్ని మోహరించారు. సున్నిత ప్రాంతాల్ని కేంద్ర భద్రతా దళాలతో నింపేశారు. కశ్మీరీల గొంతు కాదుకదా నిట్టూర్పు
కూడా బయటికి వినిపించకుండా సకల చర్యలు పటిష్టంగా తీసుకున్నారు. కశ్మీర్ నుండి చీమ కూడ
బయటికి రాకుండా తీసుకుంటున్న చర్యల్ని బట్టి ఒకటి మాత్రం స్పష్టంగానే తెలుస్తోంది;
కశ్మీరీలు ఆర్టికల్ 370, 35-ఏ రద్దును వ్యతిరేకిస్తున్నారని.
రాజ్యాంగంలో ఆర్టికల్ 370ను పొందుపరచినందుకు కశ్మీర్
కు స్వయంప్రతిపత్తి కల్పించినందుకు ఇప్పుడు బిజేపి శ్రేణులు నాటి ప్రధాని జవహర్ లాల్
నెహ్రును విమర్శిస్తున్నారుగానీ ఆనాడు అలాంటి ఒప్పందం అనివార్యం మాత్రమే కాకుండా మహత్తరమైనదని
కూడ మరచిపోవడం న్యాయంకాదు. నాటి ఉద్విగ్నభరిత
సన్నివేశాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము.
రాజా గులాబ్ సింగ్, మహారాజ హరిసింగ్ ల పాలనలోని
కశ్మీర్ సంస్థాన ప్రజల్లో అత్యధికులు తెగపరంగా
ఆదివాసులు, ఆర్ధికంగా నిరుపేదలు, మతపరంగా ముస్లింలు. 1932లో షేక్ అబ్దుల్లా, గులాం
అబ్బాస్ ల నాయకత్వంలో ఏర్పడిన జమ్మూ కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ సంస్థానంలో వ్యవసాయ సంస్కరణల కోసం అనేక పోరాటాలు
చేసింది. తరువాతి కాలంలో షేక్ అబ్దుల్లా తన
పార్టి పేరును నేషనల్ కాన్ఫరెన్స్ గా మార్చగా, గులాం అబ్బాస్ ముస్లిం కాన్ఫరెన్స్ పేరుతోనే కొనసాగారు. సామ్యవాద భావాలున్న షేక్ అబ్దుల్లా బ్రిటీష్ ఇండియాలో నెహ్రూతో సన్నిహితంగా మెలగ్గా, ముస్లిం లీగ్ నాయకుడు ముహమ్మద్
అలీ జిన్నాతో గులాం అబ్బాస్ సన్నిహితంగా మెలిగేవారు.
1947 నాటి భారత స్వాతంత్ర్య చట్టం దేశంలోవున్న
దాదాపు 750 సంస్థానాధీశులకు మూడు ఆప్షన్లు
ఇచ్చింది. వాళ్ళు ఇండియన్ యూనియన్ లో చేరవచ్చు, పాకిస్తాన్ రిపబ్లిక్ లో చేరవచ్చు స్వతంత్ర
దేశంగానూ వుండవచ్చు. దాదాపు అన్ని సంస్థానాలు ఇటు ఇండియాలోనో, అటు పాకిస్తాన్ లోనో
చేరిపోయాయి. లేదా నయాన్నో భయాన్నో చేర్చుకున్నారు. అయితే, నిజాం, జునాగడ్, కశ్మీర్
సంస్థానాధీశులు మాత్రం స్వతంత్ర దేశాలుగా కొనసాగాలనుకున్నారు. ఆ రోజుల్లో కశ్మీర్ కు అసలు ప్రాముఖ్యం లేదు. ఎక్కువ
భాగం మంచుకొండలు, హిమనీనదాలు కావడం, మిగిలిన ప్రాంతంలోనూ సారవంతమైన భూములు లేకపోవడం,
లోటు బడ్జెట్ సంస్థానం కావడంతో అటు పాకిస్తాన్ అధినేతలుగానీ, ఇటు భారత అధినేతలుగానీ కశ్మీర్ ను అస్సలు పట్టించుకోలేదు.
వాళ్ళ దృష్టంతా సుసంపన్నమైన నిజాం, జునాగడ్ మీదనే వున్నాయి.
మహారాజ హరిసింగ్ ఇండియాలో చేరడంకన్నా తను పాకిస్తాన్
లో చేరడం మేలు అనుకున్నాడు. అలా అనుకోవడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది; ఆనాడు ఇప్పుడు వున్నంత
మతతత్వం లేదు. రెండోది; నెహ్రూ, అబ్దుల్లా
సోషలిస్టు మిత్రులు కనుక రాచరిక వ్యవస్థకు చెందిన తనను వాళ్ళిద్దరు బతకనివ్వరని హరిసింగ్
భయపడ్డాడు.
1947 ఆగస్టు 14, 15 తేదీల్లో పాకిస్తాన్, ఇండియాల
ఏర్పాటు శాంతియుతంగా జరిగినట్టు కనిపించినా పక్షం రోజుల తరువాత సన్నివేశం హింసాత్మకంగా
మారిపోయింది. పాకిస్తాన్ వదిలి ఇండియాకు వస్తున్న హిందువులు, ఇండియా వదిలి పాకిస్తాన్
కు పోతున్న ముస్లింల మధ్య జరిగిన ఘర్షణల్లో వేల మంది చనిపోయారు.
ఒకవైపు స్వతంత్రంగా వుండాలనుకుంటూనే మరోవైపు ముందు
జాగ్రత్తగా పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ తో మంతనాలు సాగించాడు హరిసింగ్. నిజాం,
జునాగడ్ తమకు దక్కడంలేదని తేలిపోయాక జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ నిస్పృహకు గురై కశ్మీర్
నైనా దక్కించుకోవాలని ఉబలాటపడ్డారు. పాక్ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని ఫక్తూన్ తెగలకు
చెందిన ముస్లిం గిరిజనులు అక్టోబరు మూడవ వారంలో కశ్మీర్ భూభాగాల్లోనికి ప్రవేశించారు.
తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని ‘ఆజాద్ కశ్మీర్’గా ప్రకటించుకున్నారు. ఆ పరిస్థితిలో
నెహ్రూని సైనిక సహాయం అడగడానికి షేక్ అబ్దుల్లాను వెంటబెట్టుకుని ఢిల్లీకి పరుగులు
పెట్టుకుంటూ వచ్చాడు మహారాజ హరిసింగ్.
అప్పటికి భారత
గవర్నర్ జనరల్ గా కొనసాగుతున్న లార్డ్ మౌంట్ బాటెన్ రక్షణ విభాగానికి కూడ అధిపతిగా వున్నాడు. అటు పాకిస్తాన్
లోనూ, ఇటు ఇండియాలోనూ రక్షణశాఖల్లో డగ్లస్ గ్రేసీ, అచిన్ లెక్, మేజర్ విలియమ్ బ్రౌన్
వంటి బ్రిటీషర్లే వున్నతాధికారులుగా వున్నారు.
కశ్మీర్ పాకిస్తాన్ వశం కాకుండా చూడాలని నెహ్రు
చాలా ఆసక్తి చూపించారు. కశ్మీర్ మహరాజు తమ వద్దకు రావడమే గొప్ప వరం అని భారత్ భావించింది.
భారత్ తో కలిసి కొనసాగాలన్న కశ్మీర్ కోరికను ఆనందంగా ఆమోదించి అక్టోబరు 26న ఒప్పందం
(Instrument of Accession - IOA) చేసుకుంది. ఇది కలిసి కొనసాగాలన్న ఒప్పందమేగానీ విలీనం కాదు.
కశ్మీర్ రక్షణ, సమాచార-ప్రసార, విదేశీ వ్యవహారాలు భారత్ కు అప్పచెప్పారు. మిగిలిన అంశాల్లో కశ్మీర్
కు అప్పటి వరకువున్న స్వయంప్రతిపత్తి కొనసాగుతుంది. కశ్మీర్ స్వంత రాజ్యాంగం, స్వంత
పతాకాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అనేవి ఇందులో కీలకాంశాలు. ఆ మరునాడు అంటే అక్టోబరు 27న హరిసింగ్ దాని మీద
సంతకం చేశాడు. ఈ ఒప్పందమే మొదట్లో 306-ఏ గానూ చివరకు 370 గానూ భారత రాజ్యాంగంలో నమోదైంది.
ఆర్టికల్ 370కు అనుగుణంగా కశ్మీర్ శాశ్విత నివాసుల్ని నిర్ధారిస్తూ, వాళ్ళ
ఆస్తులకు వారసత్వ రక్షణ కల్పిస్తూ 1954 మే
14న రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వార ఆర్టికల్
35-ఏ వచ్చింది.
ఐవొఏను అటు కశ్మీర్ ఇటు భారత్ కూడా తాత్కాలిక ఒప్పందంగానే
భావించాయి. పాకిస్తాన్ తన బలగాలను వెనక్కి తీసుకున్నాక, కశ్మీర్ లో ప్రశాంత వాతావరణం
ఏర్పడ్డాక, ప్రజాభిప్రాయ సేకరణ సాగించి అంతిమ
నిర్ణయం తీసుకోవాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఆ సందర్భంగా ప్లెబిసైట్
(plebiscite)
అనే పదాన్ని లార్డ్ మౌంట్ బాటెన్ వాడాడు. మత
ఘర్షణలు పెద్ద ఎత్తున సాగుతున్న కాలంలో, భావోద్రేకాలు తారా స్థాయికి చేరుకున్న రోజుల్లో,
తమకు భౌగోళికంగానూ, మతపరంగానూ పాకిస్థాన్ అతి దగ్గరగా వున్నప్పటికీ కాశ్మీరీ ప్రజలు
ఢిల్లీనే నమ్మడం, కీలకమైన రక్షణ విభాగాన్ని భారత్ కు అప్పచెప్పడం చరిత్రలో ఒక మహత్తర విశేషం. అయితే ఇలాంటి మహత్తర
సన్నివేశాలను ఆస్వాదించే స్థితిలో ఇప్పడు ఎవరూ లేరు.
ఇన్ స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అమల్లో రాగానే షేక్ అబ్దూల్లా ‘ప్రధానమంత్రి’గా,
హరిసింగ్ కుమారుడు కరణ్ సింగ్ ‘రాష్ట్రపతి’గా కశ్మీర్ లో అత్యవసర ప్రభుత్వం ఏర్పడింది. షేక్ అబ్దుల్లా ప్రధానిగా
పదవిని చేపట్టగానే పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి గడువు విధించి గట్టి హెచ్చరిక చేయాలని నెహ్రూను కోరాడు. గడువులోగా పాకిస్తాన్ కశ్మీర్
నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోని పక్షంలో ఆ దేశం మీద పూర్తి స్థాయి యుధ్ధం చేయాలని
కూడా సూచించాడు. షేక్ అబ్దుల్లా సూచన నెహ్రూకు కూడా నచ్చింది. అయితే, మౌంట్ బాటెన్
వారించాడు. ఐక్య రాజ్య సమితిలో ఇండియా వాదన బలహీనపడిపోయే ప్రమాదం వుందన్నాడు మౌంట్
బాటెన్.
షేక్ అబ్దుల్లా ప్రధాన మంత్రిగా వున్నంత కాలం కశ్మీర్
లో ఉగ్రవాద జాడలు లేవు. పాకిస్తాన్ కూడా నియంత్రణ రేఖను దాటే సాహసం చేయలేదు. సంఘపరివారం అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి రామమందిరాన్ని
నిర్మిస్తామని శపథం చేసినపుడు కూడ కశ్మీర్ లోయలో కదలిక రాలేదు. కామన్ సివిల్ కోడ్
ను రూపొందిస్తాము అన్నప్పుడూ కశ్మీరీల ఇస్లాం ధార్మిక అస్తిత్వం పెద్దగా
స్పందించలేదు. బిజేపి 1980వ దశాబ్దపు చివర్లో రాజ్యాంగంలోని 370, 35-ఏ అధీకరణాలను రద్దుచేసి
కశ్మీర్ ను ఇండియాలో సంపూర్ణంగా విలీనం చేస్తామని శపథం చేసిన తరువాతే కశ్మీర్ లోయ
తీవ్రంగా స్పందించింది. అది ఉగ్రవాదం పుట్టుకకు, చొరబాటుదార్లకు అవకాశం
కల్పించింది.
ఉగ్రవాదం పుట్టుకకు ఎన్నైనా కారణాలు వుండవచ్చుగానీ ఉగ్రవాద కార్యకలాపాలకు
ఎలాంటి సమర్ధన వుండదు. వుండరాదు. ఉగ్రవాదం తరచూ తాను ప్రకటించుకున్న లక్ష్యాలకు
పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించి తనను తానే అంతం చేసుకుంటుంది.
కశ్మీర్ లోయలోని వారికి రెండు అస్తిత్వాలు ఒకే సందర్భంలో చురుగ్గా
వుంటాయి. మొదటిది; కశ్మీరి జాతి అస్తిత్వం (కశ్మీరియత్). రెండోది; ఆదివాసి /
గిరిజన తెగ అస్తిత్వం. కశ్మీరిల జాతి అస్తిత్వం పార్లమెంటరీ ప్రజాస్వామిక
వ్యవస్థను స్వయంప్రతిపత్తినీ కోరుకుంటుంది. కశ్మీరీల గిరిజన అస్తిత్వం
ప్రధాన స్రవంతి నుండి పరిరక్షణ కోరుకుంటుంది. కశ్మీరీల్లో అత్యధికులు
ముస్లింలు కావడం ఒక ధార్మిక అస్తిత్వం. ఈ మూడవ అస్తిత్వం
స్వీయ సమాజపు సాంస్కృతిక పరిరక్షణని కోరుకుంటోంది.
బయటి శక్తులన్నీ కశ్మీరీల ఒక్కో అస్తిత్వంతో ఒక్కో విధంగా ఇంత కాలం
చెలగాటమాడుతూ వచ్చాయి. కశ్మీర్ వల్ల ఇన్ని శక్తులకు ఇన్ని ప్రయోజనాలు
వుండవచ్చుకానీ, నిరంతరం మండుతూ వుండడం కశ్మీరీలకు ఎంత కష్టం?
(రచయిత సీనియర్
పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
మొబైల్
: 9010757776
రచన : ఆగస్టు 8, 2019
ప్రచురణ : ఆగస్టు 9,
2019, ఆంధ్రజ్యోతి దినపత్రిక
No comments:
Post a Comment