Monday, 26 April 2021

తను నన్ను ఇప్పటికీ సూపర్ స్టార్ అనుకుంటుంది!  


  AM Khan Yazdani (Danny) and Eluri Agitha



తను నన్ను ఇప్పటికీ సూపర్ స్టార్ అనుకుంటుంది!   

 

 

అజిత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జగమొండి. Tough. బస్సు సౌకర్యం కూడ లేని ఓ కుగ్రామంలోని పొలాల దగ్గర నుండి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డూప్లెక్స్ వరకు, ఓ ప్రముఖ టీవీ ఛానల్లో అడ్మిన్ వరకు అన్ని స్థాయిల్లోనూ వ్యవహారాల్ని చక్కదిద్దగల నిర్వహణ సామర్థ్యం తనది. తను అనుకున్నది ఏదైనాసరే దాన్ని ప్రేమతోనో కసితోనో సాధించేవరకు నిద్రపోదు. ఫొటో షాప్ ను ముందు తను నేర్చుకుని మా పెద్దాడికి నేర్పింది.  

 

అమ్మాయిని పార్టీలో ఇద్దామనుకుంటున్నాను ఓ మంచి కుర్రాడ్ని చూడండి అని మా మావగారు ఏలూరి భీమయ్య ఓసారి కొండపల్లి సీతారామయ్యను కోరారట. మీ జిల్లాలో డానీ వున్నాడుగా అని కేఎస్‍ అన్నారట. పశ్చిమ గోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో ఓ అరుగురు అమ్మాయిలు పార్టీ పెళ్ళికి సిధ్ధంగా వున్నారు అని ఓసారి నిమలూరి భాస్కరరావు చెప్పారు. భార్యకు భర్త టాలెంటును అర్థం చేసుకోగలిగినంత జ్ఞానమూ, లోకంలో తన మొగుడే సూపర్ స్టార్ అనుకునేంత అజ్ఞానమూ వుండాలి అని మా గురువుగారు ఎంజీ రామారావుగారు అనేవారు. అలాంటి  జ్ఞానం అజ్ఞానం తూకంలో నాకు అజిత నచ్చింది. పార్టి పెద్దల అభిప్రాయం నా ఎంపిక రెండూ ఒకటే కావడంతో 1983 ఏప్రిల్ 27న మా పెళ్ళి జరిగింది.

 

భార్యాభర్తలు ఒకరుగా కనిపించే రెండు వ్యక్తిత్వాలు. వాళ్ళ మధ్య ప్రేమ వున్నట్టే ఘర్షణ కూడ వుంటుంది. అజితది ప్రధానంగా పల్లెటూరి మనస్తత్వం. నాది మొదటి నుండి పట్టణ దృక్పథం. అంచేత మా మధ్య ఆమేరకు నిరంతరం ఒక ఘర్షణ కూడ కొనసాగింది. ప్రేమించుకుంటూ కొట్లాడుకుంటూ జీవితాన్ని నిర్మించుకుంటూ 38 సంవత్సరాలు పూర్తి చేసేశాం.

 

మార్క్సిస్టు భాషలో చెప్పాలంటే మా అనుబంధంలో పరిమాణాత్మక మార్పు ఒక గుణాత్మక మార్పుకు దారితీసింది.  మా కుటుంబంలో విప్లవానికి ముందు నన్ను నేను జ్ఞానిగా భావించుకోవడమే కాకుండ తనను అజ్ఞానిగానూ భావించడం మూలంగా తనకు నేను పాఠాలు చెప్పేవాడిని. విప్లవం విజయవంతం అయ్యాక తనను తాను జ్ఞానిగా భావించుకోవడమే కాకుండ నన్ను అజ్ఞానిగానూ భావించడం మూలంగా ఇప్పుడు తను నాకు పాఠాలు చెపుతోంది.

 

తను నెలకు ఒకసారయినా విడిపోవాలని గట్టిగా అనుకుంటూ వుంటుంది. నాకు తన మీద చాలా కోపం వచ్చిన సందర్భాలున్నాయిగానీ విడిపోవాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. కారంచేడు తదితర ఉద్యమాల కోసం నేను ఇల్లు వదిలి వెళ్ళినపుడూ, పనిచేసే పత్రికలు మూతబడినపుడు, నా కష్టకాలాల్లో తను చాలా దృఢంగా నిలబడింది. ఓసారి ఓ టీవీ ఆఫీసులో వాతావరణం నచ్చక తనకు ఫోన్ చేశాను. “నువ్వు తలవంచి ఒకచోట పనిచేయాల్సిన అవసరం లేదు. తక్షణం రిజైన్ చేసి ఇంటికి వచ్చేయి. చూసుకుందాం” అంది. తను అలా సపోర్ట్ చేయకపోతే మీడియాలో నా ‘పొగరు’ కొనసాగేది కాదేమో!

 

నా కాస్ట్యూమ్ డిజైనర్ తనే. షర్ట్స్, ట్రౌజర్స్ దగ్గర నుండి బూట్లు, వాచీలు, కాస్మెటిక్స్, గాడ్జెట్స్ వరకు అన్నీ తనే సెలెక్ట్ చేస్తుంది. అయితే, అజితతో నాకు కొన్ని ఇబ్బందులూ వున్నాయి.  తను ఇప్పటికీ నన్ను ఓ సూపర్ స్టార్ అనుకుంటోంది. అంత వరకే అయితే నాకూ ఆనందమే. కానీ,  ఎవరయినా నన్ను ఎత్తుకుపోతారని ఈ వయసులోనూ  అనుమానిస్తూ వుంటుంది.

 

సమీప భవిష్యత్తులో వివాహ వ్యవస్థ అంతరించిపోతుందని నా అంచనా. కొత్త తరంలో పెళ్ళి మీద ఆసక్తి తగ్గిపోతోంది. సుదీర్ఘ కాలం ఒక అనుబంధంలో కొనసాగడం అనేది ఒక రకం నిర్బంధంగా భావిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వుంది. మా పెళ్ళికి పురోహితునిగావున్న చలసాని ప్రసాద్ వంద పెళ్ళిళ్ళు చేశాడు. వాటిల్లో 99 ఫెయిల్. మేము మాత్రమే ఇంకా కలిసున్నాం. బహుశ మమ్మల్ని ఐదు  అంశాలు కట్టిపడేశాయి అనుకుంటాను. మొదటిది; కుటుంబానికి తన కాంట్రిబ్యూషన్ ను నేను గౌరవిస్తాను, నా కాంట్రిబ్యూషన్ ను తను  గౌరవిస్తుంది. రెండోది; పిల్లలకు  పేరెంట్స్ సౌకర్యాలు కల్పించాలిగానీ సమస్యలు సృష్టించకూడదని ఇద్దరం గట్టిగా అనుకుంటాం. మూడోది; కామన్ ఫ్రెండ్స్. నాలుగోది; కమ్యూనిస్టు అభిమానం. చివరిదయినా ముఖ్యమయినది తనంటే నాకు చాలా ఇష్టం.

 

27 ఏప్రిల్ 2021 

No comments:

Post a Comment