అరుణ్ ! హ్యాపీ బర్త్ డే!
నేను తండ్రి కాబోతున్నానని తెలిసినపుడే పుట్టబోయే బిడ్డకు పేరు కూడ నిర్ణయించుకున్నాను.
ఆడపిల్ల పుడితే ఉష, అబ్బాయి పుడితే అరుణ్. అరుణ్ అంటే
మా అమ్మకు సంతృప్తి కలగలేదు. ఇక్బాల్ ఖాన్ అనిపిలిచేది. ఖాన్ ఎప్పుడైతే వచ్చిందో అజితవాళ్ళు
చౌదరి తగిలించారు. వెరసి వాడు అరుణ్ ఇక్బాల్ ఖాన్
చౌదరి అయ్యాడు.
కనీస భద్రతను ఏర్పాటు చేయకుండ పిల్లల్ని కనడం తప్పని నేను భావిస్తాను. విజయవాడలో
ఒక ఇల్లు, ఒంగోలు దగ్గర కొంత పొలం కూడబెట్టాను. అయితే, అరుణ్ మూడు నెలల వయసులో వుండగా కారంచేడు ఉద్యమంలో పాల్గొనడానికి
చీరాల వెళ్ళిపోయాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒంగోలు పొలాన్ని వదులుకున్నాను.
తనను మూడేళ్ళ వయసులో వదిలి వెళ్ళిపోయానన్నమాట సహజంగానే వాడికి నచ్చివుండదు.
ఉద్యమాల్లో పాల్గొనేవారి కుటుంబాల్లో ఇలాంటి భావోద్వేగ సమస్యలుంటాయి. తరువాతి కాలంలో
ఆ లోటును తీర్చడానికి చాలా ప్రయత్నించానుగానీ పిల్లలిద్దరూ ‘అమ్మకొడుకులు’గా వుండిపోయారు.
తమను గట్టెక్కించడంలో అమ్మ పాత్ర ముఖ్యమని వాళ్ళు భావిస్తుంటారు.
తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఆస్తి వచ్చినట్టు అలవాట్లూ వస్తాయి. అలవాట్లు అంటే
అనారోగ్యాలు కూడ. మానాన్నది ధృఢమైన కార్మికుని శరీరం. అది నాకు వచ్చింది. ఆయనకు సినిమాలు,
నాటకాలు, పాటలు అంటే చాలా ఇష్టం. బొమ్మలు కూడ గీసేవారట. అవన్నీ నాకూ వచ్చాయి. ఆయనకు
ఉబ్బసం వుండేది. అది కూడ నాకు వచ్చింది. ఆర్థిక వ్యవహారాల్లో మానాన్న చాలా అమాయకుడు.
అన్నార్తులకు అన్నం పెట్టాలంటే ఆయనకు ఎంత ఆనందమో చెప్పలేము. ఇంట్లో వుందా లేదా అని
కూడ చూడకుండ ఎవరెవర్నో ఇంటికి తీసుకుని వచ్చి ఆకలితో వున్నాడంట భోజనం వడ్డించు అనేవారు. మా అమ్మ తెలివైంది గాబట్టి ఆర్థిక వ్యవహారాల్ని
చక్కబెట్టి మమ్మల్ని గట్టెక్కించింది.
మానాన్న చాలా గొప్ప టెక్నీషియన్. మొదటితరం యంత్రపరికరాలు వేటిని చూసినా (విశ్వామిత్రుడిలా)
‘ప్రతిసృష్టి’ చేసే నైపుణ్యం ఆయనకు వుండేది. కొంతకాలం నేను ఆయన వెంట మెకానిక్ బాటలో
నడిచానుగానీ మా అమ్మ తప్పించేసింది. నాకు మా పెద్దాడిలో మా నాన్న కనిపిస్తారు; రెండోవాడిలో
మా అమ్మ కనిపిస్తుంది. ఒకడిది భావోద్వేగం, ఇంకొకడిది నిర్వహణ సామర్థ్యం. పెద్దాడ్ని
చూస్తే ప్రేమ కలుగుతుంది; చిన్నాడ్ని చూస్తే ధైర్యం కలుగుతుంది.
మార్కులు ర్యాంకుల కోసం పిల్లల్ని నేను ఎప్పుడూ వత్తిడి చేయలేదు. అప్పట్లో మా
తాహతుకు మించిన పని అయినా సరే ఆడుకుంటూ చదువుకోమని స్పోర్ట్స్ స్కూల్ లో చేర్పించాము. అలాగని అస్సలు పట్టించుకోకుండ వుండలేదు.
మూడవతరం యంత్రపరికరాల్ని అంటే ఎలక్ట్రానిక్ పరికరాల్ని
ప్రతిసృష్టించే నైపుణ్యం మా పెద్దాడిది. వాడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఫస్ట్
క్లాస్ గ్రాడ్యుయేట్. డెల్, సత్యం సంస్థల్లో పనిచేశాడు. హఠాత్తుగా ఒకరోజు ఉద్యోగం మానేస్తాను అన్నాడు. నా జీవితంలో వున్న రొమాంటిసిజం వాడి సాప్ట్ వేర్ వుద్యోగంలో
లేదట. ఇది తనకు విసుగ్గా వుందట. సినిమాల్లో
టెక్నీషియన్ గా పనిచేస్తాను అన్నాడు. “మనసుని
లగ్నం చేసి కృషిచేస్తే ఏ రంగంలో అయినా సరే విజయం వస్తుంది” అని మానాన్న అనేవారు. నేను
నాటకాలు రాస్తున్నా ఆడుతున్నా మా నాన్న అభ్యంతరం
పెట్టేవారుకాదు. ఎక్కడయినా సరే చిత్తశుధ్ధి వుండాలనేవారు. నేనూ మా వాడిని కాదనలేదు. సినిమారంగంలో సక్సెస్ రేటు చాలా తక్కువ అని మాత్రం గుర్తు చేశాను.
గతంలో నా గురువులు నాకు చెప్పిన మాటే తనకు చెప్పాను. “వంట చేయడం దగ్గర నుండి రాకెట్
సైన్స్ వరకు అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో బేసిక్స్ కొన్ని వుంటాయి. వాటిని ముందు
అధ్యయనం చేయాలి. బేసిక్స్ తెలీనివాడు జీవితకాలం గొడ్డు చాకిరీ చేస్తాడేతప్ప ఏ రంగంలోనూ
రాణించలేడు. దిసీజ్ థంబ్ రూల్” అన్నాను. సినిమా అనేది విజువల్ ఆర్ట్. లెన్స్ లు, లైటింగ్
ఫిజిక్స్ కు సంబంధించినవి. ఫ్రేమ్ సెట్ చేయడం జామెట్రికి సంబంధించినది.
మొదట్లో, సి వనజతో కలిసి కొన్ని డాక్యుమెంటరీలు తీశాడు. ఆ తరువాత శ్రీప్రకాష్
తో కలిసి పనిచేశాడు. యూరేనియం బాధితుల మీద డాక్యుమెంటరీలు తీయడంలో శ్రీప్రకాష్ అంతర్జాతీయ
గుర్తింపు పొందాడు. 2009లో కమల్ హాసన్ మోహన్ లాల్, వెంకటేష్ లతో తమిళ్, తెలుగు భాషల్లో
నిర్మించిన ‘ఉన్నాయ్ పోల్ ఒరువన్’ (తెలుగులో ‘ఈనాడు’) సినిమాకు కెమెరా, ఎడిటింగ్ విభాగాల్లో
సహాయకుడిగా పనిచేశాడు. ఇందులో, రెండు ప్రత్యేకతలున్నాయి. కమల్ హాసన్ సినిమాలో పనిచేయడం
అనేది సినీ టెక్నీషియన్లకు ఒక కల వంటిది. అది అరుణ్ కు మొదటి సినిమాలోనే నెరవేరింది.
‘ఉన్నాయ్ పోల్ ఒరువన్’ భారతదేశంలో తీసిన మొదటి డిజిటల్ సినిమా. రెడ్ కెమేరాను ఆపరేట్ చేయడానికి లండన్ నుండి
టెక్నీషియన్లు వచ్చారు. అలా దేశంలో తొలి డిజిటల్
టెక్నీషియన్ గా వాళ్ళ దగ్గర పనిచేసే అవకాశం కూడ అరుణ్ కు దక్కింది. తరువాత తను
‘రెడ్’ అరుణ్ అయిపోయాడు. ఆ తరువాత 2011లో వచ్చిన
‘గగనం’ సినిమాకు ‘డిజిటల్ టెక్నాలజీ కన్సల్టెంట్’ గా పనిచేశాడు.
మన దేశంలోనికి డిజైనర్ డ్రోన్ లు రావడానికి ముందే స్వయంగా ‘డ్రోన్’ ను రూపొందించి
మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమాలో వాడాడు. అలాగే త్రీ - యాక్సిస్ గింబల్ ను తయారు
చేసి రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ సినిమాలో ‘ఫ్లో క్యామ్’ షాట్లు రూపొందించాడు. ఇప్పటికీ కొందరు ‘ఫ్లో క్యామ్’ షాట్లను ‘అరుణ్ షాట్’ అంటుంటారు. అలా తను స్పెషలిస్ట్
కెమేరామేన్ గా స్థిరపడ్డాడు. ‘ఫిదా’, ‘నిశ్శబ్దం’ తదితర సినిమాల్లో అమెరికాలో తీసిన
స్పెషల్ సన్నివేశాలు అరుణ్ కు మంచి పేరును తెచ్చాయి. ఇవన్నీ నాకు పుత్రోత్సాహాన్ని
కలిగించిన సంఘటనలు. కరోనా కాలంలో ఔడ్ డోర్ షూటింగులు తగ్గిపోవడంతో ఇప్పుడు తను వాస్తవ ఔడ్ డోర్ సీన్లను స్టూడియోలో
డిజిటల్ గా ‘ప్రతిసృష్టి’ చేసే ప్రయోగాలు చేస్తున్నాడు. సినిమా షూటింగు కోసం ఇటలీలో
రెండు వారాలుండి నిన్ననే హైదరాబాద్ చేరుకున్నాడు.
నాకు వున్నట్టే వాడి డ్రాబ్యాక్స్ వాడికున్నాయి. ప్రయోగాల్లో నిమగ్నమయిపోయాడంటే తిండి నిద్ర ఆరోగ్యం డబ్బును కూడ
పట్టించుకోడు. ఎకనామిక్స్ లో బాగా పూర్. మానాన్నకు మా అమ్మ, నాకు అజిత దొరికినట్టు
వాడికి ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దే జీవిత భాగస్వామి అయినా దొరకాలి. లేదా వాడే ఎకనామిక్స్
లో బేసిక్స్ అయినా నేర్చుకోవాలి.
అరుణ్ ! హ్యాపీ బర్త్ డే!
No comments:
Post a Comment