AM Khan Yazdani (Danny)
AM Khan Yazdani (Danny)
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
We lost Shireesha but her Aalambanaa spirit continues.
శిరీషగారు లేరు; వారి ‘ఆలంబన’ స్పూర్తి కొనసాగుతుంది.
మనతరం అనేమాట ఎవరికైనాసరే గొప్ప నైతిక ధైర్యాన్ని ఇస్తూవుంటుంది. అలా నాకు గొప్ప నైతిక ధైర్యాన్ని ఇస్తూ వచ్చిన వ్యక్తుల్లో రచయిత్రి దాసరి శిరీష గారు ఒకరు. వారు మా రతం.
సమాజంలో ఒక మనిషి పుట్టడం మహత్తర విషయం అయినట్టు ఆత్మీయులు చనిపోవడం చాలా బాధాకర సన్నివేశం. మనతరం వాళ్ళు చనిపోయినపుడు మన
పునాదిరాళ్ళు కదిలిపోయి మన జీవన భవనం కూలిపోతున్నదనే భావన కలుగుతుంది. త్రిపురనేని శ్రీనివాస్, పతంజలి, బాలగోపాల్, తాడి మోహన్, ఉప్పుమావులూరి సాంబశిరావు (ఉసా), దేవిప్రియగార్లు చనిపోయినపుడు నేను అలాంటి
భావోద్వేగానికి లోనయ్యాను.
శిరీషగారు చనిపోయారని నిన్న మా రెండో అబ్బాయి హైదరాబాద్ నుండి ఫోన్ చేసి చెప్పినప్పటి నుండి ఆలోచనలు 50 యేళ్ళు వెనక్కి పోయాయి.
శిరీషగారు దాదాపు 48 యేళ్ళుగా తెలుసు. అప్పుడు నాకు 23 యేళ్ళు. ప్రతి మనిషి జీవితంలో ఇది చాల సంక్లిష్టమైన వయసు. మనుషులు ప్రేమలో పడే కాలం ఇది. జీవితంలో ఎలా స్థిరపడాలనే ఆరాటం ఒకవైపు, జీవిత భాగస్వామి గురించిన ఆలోచనలూ మరోవైపు వెంటాడుతుంటాయి. ఉపాధి, ప్రేమల మధ్య పొత్తు కుదరని సమయం అది. రెండింటిలో ఏదో ఒకదాన్ని వదులుకోలేక చాలా ఘర్షణ పడాల్సి వస్తుంది. జీవితంలో స్థిరపడితే పెళ్ళి చేస్తామని పెద్ద తరం అంటుంది. పెళ్లి చేసుకుంటే స్థిరపడతామని చిన్నతరం అంటుంది. అలాంటి ఒక ఘర్షణకు పరిష్కారం కోసం నేను తొలిసారిగా 1975లో భీమవరంలో శిరీషగారిని కలిశాను.
నాకు నరసాపురంలో చొప్పరపు ఉషారాణి అనే మంచి సాహిత్య స్నేహితురాలు వుండేది. స్నేహం వరకు బాగానే వుండిందిగానీ తను నన్ను ప్రపోజ్ చేసిన తరువాత మా ఇద్దరికీ కష్టాలు మొదలయ్యాయి. దానికి మతం ప్రధాన కారణం; నాకు స్థిరమైన ఉద్యోగం లేకపోవడం మరో కారణం. ఒకటి సాంస్కృతికం; మరొకటి ఆర్థికం.
ఇరువైపుల నుండి పెద్ద మనుషులు చెరొకరు నిలబడి పెళ్ళిచేయాలనే ఒక కాంప్రమైజ్ ఫార్మూల ఒక దశలో ముందుకు వచ్చింది. మా నాన్నగారి తమ్ముడు భీమవరంలో పేరున్న వ్యాపారి. అప్పట్లో ఉష మూడవ అక్క నర్శమాంబగారు కూడ భీమవరంలో ఉద్యోగం చేస్తూండేవారు. నేను భీమవరం వెళ్ళి మా బాబాయితో మాట్లాడి మా పెళ్ళికి ఒప్పించాను. అలాగే నర్శమాంబగారినీ కలిశాను. ఇటూ మా బాబాయి, అటు
నర్శమాంబగారు నిలబడితే సమస్య పరిష్కారం అయినట్టే.
నర్శమాంబగారికి సూత్రప్రాయంగా మా పెళ్ళి విషయంలో సానుకూలతే వుంది. అయితే, నన్ను స్క్రూటినీ చేసే బాధ్యతను వారు తన స్నేహితురాలు శిరీషగారికి అప్పచెప్పారు. అప్పట్లో శిరీషగారు కూడ భీమవరంలో ఉద్యోగం చేస్తూండేవారు.
అప్పటికి నాకు శీరీషగారి గురించి పరోక్షంగా కొంత తెలుసు. నా కాలేజి మిత్రుడు, అత్యంత సన్నిహితుడు పల్లం రామానుజాచారి వాళ్ళది కృష్ణాజిల్లా గండేపల్లి గ్రామం. అక్కడ శిరీషగారి అమ్మగారు; రచయిత్రి పరిపూర్ణ గారితో ఆచారీ కుటుంబానికి ఒక అనుబంధం వుండేది. ఆ అనుబంధంతో శీరీషగారు నరసాపురంలో ఆచారీ ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళారు. నాకో
దారి దొరికినట్టయింది. “డానీ ఒక మంచిబాలుడు. నమ్మి అమ్మాయిని ఇవ్వవచ్చు” అంటూ ఆచారి దగ్గర ఒక ‘రికమెండేషన్ లెటర్’ తీసుకుని, భీమవరం వెళ్ళి ‘పెళ్ళి ఇంటర్వ్యూ’ కు శిరీషగారి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాను.
విజయవాడ మారుతీనగర్ లోని శిరీషగారి ఇంట్లోనే 1978 చివర్లో నాకు ఆర్టిస్టు
తాడి మోహన్ పరిచయం అయ్యాడు. హైదరాబాద్ కు
మారిన తరువాత కూడ శిరీషగారి కుటుంబంతో పాత అనుబంధం కొనసాగింది.
మనుషులు రెండు రకాలు. నాయకత్వం వహించేవారు; నాయకుల వెంట నడిచేవారు.
లీడర్స్ అండ్ ఫాలోయర్స్. కొందరు వయసు పెరిగే కొద్దీ జీవితానుభవంతో రాటుదేలుతారు. కొందరు బాల్యంలోనే జీవితానుభవాన్ని చవిచూస్తారు. అలాంటివారు సాధారణంగా కుంగిపోతారు. వాళ్ళల్లో కొందరు మాత్రం రాటుదేలి నాయకులుగా ఎదుగుతారు. వీళ్ళనే మనం ‘బోర్న్ లీడర్స్’ అంటాం. నిజానికి వీళ్ళకు కూడ స్వంత సమస్యలు అనేకం వుంటాయి. అయినప్పటికీ, వీళ్ళు తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలగడమేగాక తమ చుట్టూవున్న వాళ్ళ సమస్యల్ని కూడ పరిష్కరిస్తుంటారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చి, ప్రోత్సహించే సామర్థ్యం వారికి సహజంగానే ఉంటుంది. శిరీషగారు నాకు తెలిసినప్పటి నుండి చనిపోయే వరకు తన టీమ్ కు తిరుగులేని నాయకురాలు. ఆ
సమూహంలో వారి స్థానం నిత్యం ఒక మెట్టు పైన వుండేది. వారి మనస్తత్వానికి ప్రతిరూపమే ‘ఆలంబన’.
శిరీషగారికి నివాళులు,
తోట అపర్ణకు ప్రగాఢ సానుభూతి.
పరిపూర్ణగారికి
వచ్చిన కష్టం ఒకరు ఓదార్చగలిగేది కాదు. అనేక తూఫాన్లను తట్టుకుని నిలిచిన నావ వారు. ఇప్పుడు దీనిని కూడ తట్టుకోగలరని ఆశిస్తాను.
శిరీషగారు లేరు; వారి ‘ఆలంబన’ స్పూర్తి కొనసాగుతుంది.
ఇప్పటి మీడియా వ్యాపారంలో పూర్వపు ఎథిక్స్ లేవు.
1998 తెలుగు పత్రికలకు గడ్డు కాలం.
ఆంధ్రపత్రిక, ఉదయం, ఏపిటైమ్స్, ఆంధ్రజ్యోతి, ఈనాడు కు ఒక ఇంగ్లీషు పత్రిక వుండేది,
అవన్నీ మూసేశారు. అంధ్రప్రభను అమ్మకానికి పెట్టారు. ఒక అంచనా ప్రకారం ఓ ఐదు వేల మంది
జర్నలిస్టులు రోడ్డున పడ్డారు.
ఆ తరువాత జర్నలిజం స్వభావం మారిపోయింది. అంతకు ముందు
కూడ మీడియాది వ్యాపారమే. ఇప్పుడూ వ్యాపారమే. కాకపోతే అప్పటి మీడియా వ్యాపారంలో కొన్ని
ఎథిక్స్ వుండేవి. సామాజిక బాధ్యత ఎంతో కొంత వుండేది. పార్టీ అభిమానం కూడ వుండేది;
కానీ, ఇతర పార్టీల వర్తల్ని కూడ అనిమతించేవారు. ఇప్పటి మీడియా వ్యాపారంలో పూర్వపు ఎథిక్స్
లేవు.
గతంలో ఎడిటర్ అనేది మీడియా సంస్థల్లో
అత్యున్నత స్థానం. నార్ల వేంకటేశ్వర రావు, సి. రాఘవాచారి వంటివారు ఆ గౌరవాన్ని పొందారు. ఏబికే, నండూరి రామ్మోహన రావు
వంటివారు మొదటి దశలో అలాంటి గౌరవాన్ని పొందారుగానీ, వాళ్ళ కెరీర్ చివరి దశల్లో వాళ్ళకు
అలాంటి గౌరవం దక్కలేదన్నది వాస్తవం.
ముట్నూరి కృష్ణారావు వంటివారు జర్నలిజానికి
ఒక గౌరవాన్ని తెచ్చారు. అయితే, గిరీష్ సంఘీ వంటివారు జర్నలిజంలో పతన విలువల్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు
దాదాపు అందరూ ఆ పతన విలువల్నే పాటిస్తున్నారు.
ఇప్పుడు జర్నలిజంలో ఎడిటర్ కన్నా సిఇవో
పెద్ద ఉద్యోగం. రెవెన్యూను తేగలిగిన వాళ్ళే ఇప్పుడు సిఇవోలు అవుతున్నారు. వాళ్ళు కూడ
రెవెన్యూను తేగలిగిన వాళ్ళనే రిపోర్టర్లుగా నియమిస్తున్నారు. ఇవ్వాళ జర్నలిజం మేడ్
ఈజీ అయిపోయింది. అప్పాయింట్ మెంట్ ఇచ్చిన క్షణమే రోజూ ఎవర్ని పొగడాలో ఎవర్ని తిట్టాలో
చెప్పేస్తున్నారు.
చిన్న పత్రికల వ్యవహారం మరీ ఘోరం. వాళ్ళకు రిపోర్టర్స్ తో పనిలేదు. యాడ్ ఎగ్జిక్యూటివ్స్
మాత్రమే కావాలి. జీతాలు ఇవ్వరు. యాడ్ తెచ్చి కమీషన్ తీసుకోమంటారు. వాళ్ళంతా రిపోర్టర్
ఐడెంటిటీ కార్డును మెడలో వేసుకున్న యాడ్ ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళు యాడ్ తెచ్చుకోవాలి.
లేకుంటే, మునిసిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఇనెస్పెక్టర్లకు సహాయకులుగా మారి నాలుగు
రూపాయలు సంపాదించుకోవాలి.
చదువుకున్నోళ్ళు వస్తే జర్నలిజం బాగుపడుతుందనే
భావన కూడ తప్పే. దేశంలో భారీ స్కాములు నడిపినవాళ్ళు వున్నత విద్యావంతులే. సోషల్ వర్కర్లు
జర్నలిజం లోనికి రావాలనడం సమంజసమైన సూచన కావచ్చు. భారతదేశంలో అత్యంత ఐశ్వర్యవంతుడే
అతి పెద్ద మీడియా సంస్థకు కూడ అధిపతి. ఈ స్థితిలో ప్రధాన స్రవంతి జర్నలిజం నుండి ప్రజాప్రయోజనాన్ని
ఆశించలేం.
మరోవైపు, జర్నలిస్టుల్ని ప్రజలు పోషిస్తున్నారనే
ఒక తప్పుడు భావన కూడ ప్రచారంలో వుంది. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు.
ఆ పన్నులతో ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు జీత భత్యాలు ఇస్తుంది. ఏ ప్రభుత్వం కూడ జర్నలిస్టులకు
జీతభత్యాలు ఇవ్వదు. అసలు జర్నలిస్టుల్లో సగం
మందికి అప్పాయింట్ మెంట్ ఆర్డరు వుండదు. అప్పాయింట్ మెంట్ ఆర్డరు వున్న వాళ్ళలో సగం
మందికి జీతాలు ఇవ్వరు.
అప్పాయింట్ మెంట్ ఆర్డరు వుండి, తగినంత
సర్విస్ వుంటే ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులు జారీచేస్తుంది. దానివల్ల ప్రభుత్వ బస్సుల్లో
టికెట్ రాయితీ వస్తుంది. అలా ఏడాదికి ఒక వెయ్యి
రూపాయలు కూడ కలిసి రావు. సీనియర్లకు ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇచ్చిన సందర్భాలున్నాయి.
జర్నలిస్టుల్లో ఒక ఐదు శాతానికి కూడ ఈ సౌకర్యం దక్కదు.
-
డానీ
విజయవాడ
1
సెప్టెంబరు 2021