ఇప్పటి మీడియా వ్యాపారంలో పూర్వపు ఎథిక్స్ లేవు.
1998 తెలుగు పత్రికలకు గడ్డు కాలం.
ఆంధ్రపత్రిక, ఉదయం, ఏపిటైమ్స్, ఆంధ్రజ్యోతి, ఈనాడు కు ఒక ఇంగ్లీషు పత్రిక వుండేది,
అవన్నీ మూసేశారు. అంధ్రప్రభను అమ్మకానికి పెట్టారు. ఒక అంచనా ప్రకారం ఓ ఐదు వేల మంది
జర్నలిస్టులు రోడ్డున పడ్డారు.
ఆ తరువాత జర్నలిజం స్వభావం మారిపోయింది. అంతకు ముందు
కూడ మీడియాది వ్యాపారమే. ఇప్పుడూ వ్యాపారమే. కాకపోతే అప్పటి మీడియా వ్యాపారంలో కొన్ని
ఎథిక్స్ వుండేవి. సామాజిక బాధ్యత ఎంతో కొంత వుండేది. పార్టీ అభిమానం కూడ వుండేది;
కానీ, ఇతర పార్టీల వర్తల్ని కూడ అనిమతించేవారు. ఇప్పటి మీడియా వ్యాపారంలో పూర్వపు ఎథిక్స్
లేవు.
గతంలో ఎడిటర్ అనేది మీడియా సంస్థల్లో
అత్యున్నత స్థానం. నార్ల వేంకటేశ్వర రావు, సి. రాఘవాచారి వంటివారు ఆ గౌరవాన్ని పొందారు. ఏబికే, నండూరి రామ్మోహన రావు
వంటివారు మొదటి దశలో అలాంటి గౌరవాన్ని పొందారుగానీ, వాళ్ళ కెరీర్ చివరి దశల్లో వాళ్ళకు
అలాంటి గౌరవం దక్కలేదన్నది వాస్తవం.
ముట్నూరి కృష్ణారావు వంటివారు జర్నలిజానికి
ఒక గౌరవాన్ని తెచ్చారు. అయితే, గిరీష్ సంఘీ వంటివారు జర్నలిజంలో పతన విలువల్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు
దాదాపు అందరూ ఆ పతన విలువల్నే పాటిస్తున్నారు.
ఇప్పుడు జర్నలిజంలో ఎడిటర్ కన్నా సిఇవో
పెద్ద ఉద్యోగం. రెవెన్యూను తేగలిగిన వాళ్ళే ఇప్పుడు సిఇవోలు అవుతున్నారు. వాళ్ళు కూడ
రెవెన్యూను తేగలిగిన వాళ్ళనే రిపోర్టర్లుగా నియమిస్తున్నారు. ఇవ్వాళ జర్నలిజం మేడ్
ఈజీ అయిపోయింది. అప్పాయింట్ మెంట్ ఇచ్చిన క్షణమే రోజూ ఎవర్ని పొగడాలో ఎవర్ని తిట్టాలో
చెప్పేస్తున్నారు.
చిన్న పత్రికల వ్యవహారం మరీ ఘోరం. వాళ్ళకు రిపోర్టర్స్ తో పనిలేదు. యాడ్ ఎగ్జిక్యూటివ్స్
మాత్రమే కావాలి. జీతాలు ఇవ్వరు. యాడ్ తెచ్చి కమీషన్ తీసుకోమంటారు. వాళ్ళంతా రిపోర్టర్
ఐడెంటిటీ కార్డును మెడలో వేసుకున్న యాడ్ ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళు యాడ్ తెచ్చుకోవాలి.
లేకుంటే, మునిసిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఇనెస్పెక్టర్లకు సహాయకులుగా మారి నాలుగు
రూపాయలు సంపాదించుకోవాలి.
చదువుకున్నోళ్ళు వస్తే జర్నలిజం బాగుపడుతుందనే
భావన కూడ తప్పే. దేశంలో భారీ స్కాములు నడిపినవాళ్ళు వున్నత విద్యావంతులే. సోషల్ వర్కర్లు
జర్నలిజం లోనికి రావాలనడం సమంజసమైన సూచన కావచ్చు. భారతదేశంలో అత్యంత ఐశ్వర్యవంతుడే
అతి పెద్ద మీడియా సంస్థకు కూడ అధిపతి. ఈ స్థితిలో ప్రధాన స్రవంతి జర్నలిజం నుండి ప్రజాప్రయోజనాన్ని
ఆశించలేం.
మరోవైపు, జర్నలిస్టుల్ని ప్రజలు పోషిస్తున్నారనే
ఒక తప్పుడు భావన కూడ ప్రచారంలో వుంది. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు.
ఆ పన్నులతో ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు జీత భత్యాలు ఇస్తుంది. ఏ ప్రభుత్వం కూడ జర్నలిస్టులకు
జీతభత్యాలు ఇవ్వదు. అసలు జర్నలిస్టుల్లో సగం
మందికి అప్పాయింట్ మెంట్ ఆర్డరు వుండదు. అప్పాయింట్ మెంట్ ఆర్డరు వున్న వాళ్ళలో సగం
మందికి జీతాలు ఇవ్వరు.
అప్పాయింట్ మెంట్ ఆర్డరు వుండి, తగినంత
సర్విస్ వుంటే ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులు జారీచేస్తుంది. దానివల్ల ప్రభుత్వ బస్సుల్లో
టికెట్ రాయితీ వస్తుంది. అలా ఏడాదికి ఒక వెయ్యి
రూపాయలు కూడ కలిసి రావు. సీనియర్లకు ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇచ్చిన సందర్భాలున్నాయి.
జర్నలిస్టుల్లో ఒక ఐదు శాతానికి కూడ ఈ సౌకర్యం దక్కదు.
-
డానీ
విజయవాడ
1
సెప్టెంబరు 2021
No comments:
Post a Comment