Constitution of India and Enforcement Practices
‘భారత రాజ్యాంగం - అమలు తీరు తెన్నులు’
- డానీ
“మనది ఒక జాతి అని నమ్ముడం అంటే మనం ఒక గొప్ప భ్రమను పెంచిపోషిస్తున్నామని అర్ధం”(Believing that
we are a nation, we are cherishing a great delusion)
- బాబా సాహెబ్ అంబేడ్కర్
జై భీమ్! జై మీమ్! లాల్ సలాం!
అందరికీ భారత రాజ్యాంగ 72వ దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా బాబాసాహెబ్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక ఆలోచన విధానాన్ని స్మరించుకోవాలనుకోవడం గొప్ప ఆలోచన.
ఈ మహత్తర ఆలోచనను సాకారం చేస్తున్న అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ విశాఖపట్నం వారికి జై
భీములు.
సొసైటి అధ్యక్షులు ఇంటి గురుమూర్తిగారికి, సొసైటి
కార్యదర్శి, ఈనాటి సదస్సుకు అధ్యక్షులు పి
రాజేశ్వర రావుగారికీ ప్రత్యేక అభినందనలు.
ఈ కార్యక్రమంలో నన్ను
కూడ భాగస్తుడ్ని చేసినందుకు, నా ఆలోచనల్ని మీతో పంచుకునే అవకాశం కల్పించినందుకు ఏఏంఎస్ నిర్వాహకులకు ధన్యవాదాలు.
ఈ సదస్సులో నాకన్నా
ముందు వివిధ అంశాల మీద ప్రసంగించి నా అవగాహనను
పెంచిన మిత్రులు జనచైతన్య మండలి అధ్యక్షులు పెయ్యల పావన ప్రసాద్ గారికి, సివిల్ లిబర్టీస్
అడ్వకేట్ పొట్టూరి సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు.
ప్రొఫెసర్ డాక్టర్ సత్యపాల్, బౌధ్ధ రచయిత బొర్రా గోవర్ధన్ గార్ల ఉపన్యాసాల్ని కూడ వినాలని
నేను ఆశించాను. అనివార్య కారణాలవల్ల వాళ్ళు
రాలేకపోయారు.
మిత్రులారా! ఈరోజు
నాకు కేటాయించిన అంశం :‘భారత రాజ్యాంగం - అమలు తీరు తెన్నులు’.ఈ అంశం విస్తృతి
చాలా పెద్దది. అయినప్పటికీ నాకు కేటాయించిన 40-45 నిముషాల సమయం లోపు ఈ అంశాన్ని వివరించే
ప్రయత్నం చేస్తాను. ఈ స్వల్ప ఉపోద్ఘాతంతో నేను నా ప్రసంగాన్ని ఆరంభిస్తాను.
1.
‘భారత రాజ్యాంగం-అమలు
తీరు తెన్నుల్ని పరిశీలించాలంటే ముందుగా మనం ప్రాణప్రదమైన మార్గదర్శక సూత్రం ఒకదాన్ని
నిర్ణయించుకోవాలి. రాజ్యాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఏమిటీ? అనేది ఆ సూత్రం.
2.
లోకంలో అన్నీ మేకలే
వున్నప్పుడు ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన అవసరం వుండదు. అలాగే, లోకంలో అన్నీ తోడేళ్ళే
వున్నప్పుడు కూడ ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన అవసరం వుండదు. తోడేళ్ల సరసన మేకలు
బతకాల్సి వచ్చినపుడు మాత్రమే ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
3.
తోడేళ్లకు అనాదిగానే
అనేక స్మృతులున్నాయి. వాటికి ఆధునిక రాజ్యాంగాలతో పనిలేదు. తమకు ఏమాత్రం అవకాశం వచ్చినా
తమ పాత స్మృతులకు తిరిగి ప్రాణం పోసుకుంటామని అవి తరచూ ఊళ వేస్తుంటాయి.
4.
తోడేళ్ళ బారి నుండి
మేకలకు రక్షణ (safeguard) కల్పించడానికి, మేకల
వికాసానికి, మేకల అభ్యున్నతికి రాజ్యాంగాల్ని
రాసుకోవాల్సి వుంటుంది.
5.
రాజ్యాంగాలనేవి తోడేళ్ళు,
మేకలు రెండింటి అభ్యున్నతి కోసమేనని కొందరు అనుకోవచ్చు. ఆ ఆలోచనే తప్పు. రాజ్యాంగాలు
రెండు ప్రమాణాలను పాటించాల్సి వుంటుంది. మొదటిది; తోడేళ్ళ ఆధిపత్యాన్ని అదుపులో వుంచాలి.
రెండోది; మేకల జీవన స్థాయిని అభివృధ్ధి చేయాలి. ఈ రెండు ప్రమాణాలను పాటించకపోతే అసలు అవి ఆధునిక రాజ్యాంగాలే కావు.
ఈ ప్రమాణాలు అర్థం కాకపోతే రాజ్యాంగాల అమలు
తీరు కూడ ఎప్పటికీ అర్ధంకాదు.
6.
1946 డిసెంబరు 9న మొదలై, రెండు సంవత్సరాల, 11 నెలల, 17 రోజులు కొనసాగి,
11 సమావేశాలు నిర్వహించి, 25 అధ్యాయాలు,
12 షెడ్యూళ్ళు, 448 అధీకరణలతో సువిస్తారంగా రూపొంది విరాజిల్లుతున్న లిఖిత పూర్వక రాజ్యాంగం
మనది.
7.
రాజ్యాంగం అమలు లోనికి
రావడానికి ముందు నుండేగాక, ఆ తరువాత కూడ తోడేళ్ళే రాజ్యం చేస్తుండడం మూలంగా భారత రాజ్యాంగం అనేక ఆటుపోట్లకు గురయ్యింది. అయినప్పటికీ, శ్రామిక కులాలకు, బలహీన వర్గాలకు, నిస్సహాయులకు, అణగారిన సమూహాలకు భారత రాజ్యంగం ఇప్పటికీ ఒక ఆశాజ్యోతిగా నిలబడి వుంటోంది.
8.
దానికి ప్రధాన కారణం
రాజ్యాంగానికి ఇంజిన్ వంటి దాని ప్రవేశిక. “న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం” అనే నాలుగు ఆదర్శాలు.
ఇవి భారత రాజ్యాంగానికి ప్రాణం.
9.
భారత రాజ్యాంగ పరిషత్తులో
299 మంది వున్నారు. వీళ్ళంతా భూస్వామ్య, పెట్టుబడీదారీ
వర్గాలకు చెందినవారు. మహాత్మా గాంధీ-జవహర్ లాల్ నెహ్రూ ఈ వర్గానికి తిరుగులేని ప్రతినిధులు.
మహా అయితే వీరిని ఆధునిక ఆకాంక్షలు కలిగిన పెట్టుబడీదారివర్గ ప్రతినిధులు అనవచ్చు.
భారత సమాజాన్ని భూస్వామ్య విధానం నుండి ఉదారవాద
పెట్టుబడీదారీ విధానం దిశగా నడిపించాలనే వీరి ఆకాంక్షల మేరకే రాజ్యాంగ రచన సాగిందనేది
మరచి పోరాదు.
10.
భారత సమాజాన్ని భూస్వామ్య
వ్యవస్థ నుండి పెట్టుబడీదారీ వ్యవస్థ దిశగా నడిపించే రాజ్యాంగ రచనకు అన్ని విధాలా సమర్ధుడు
అంబేడ్కర్ అని వారు భావించారు. అంబేడ్కర్ ను రాజ్యాంగ పరిషత్తులో అణగారిన సమూహాల శ్రేయస్సును
కోరే ఏకైక ప్రతినిధి అనవచ్చు. తాను దాదాపు
ఏకాకిగా వున్నప్పటికీ రాజ్యాంగానికి ఒక సామాజిక సమానత్వ దృక్పధాన్ని అంబేడ్కర్ ఇవ్వగలిగాడు.
11.
భారత రాజ్యాంగానికి ప్రాణం వంటి
పీఠిక, ప్రవేశిక, ప్రియంబుల్ లో న్యాయం, స్వేఛ్ఛా,
సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను
అమర్చిన ఘనత పూర్తిగా అంబేడ్కర్ కే
చెందుతుంది. భారత రాజ్యాంగానికి ఎనలేని
గౌరవం, శక్తి సమకూరింది ఆ నాలుగు ఆదర్శాల
మూలంగానే అనవచ్చు.
12.
అంబేడ్కర్ ఈ నాలుగు ఆదర్శాలను ఫ్రెంచ్ విప్లవం నుండి స్వీకరించాడని
కొందరు, బుధ్ధుడి నుండి స్వీకరించాడని మరికొందరు తరచూ వాదిస్తుంటారు. ఆ వివాదాన్ని
పక్కన పెడితే, ఆనాటి భారత సమాజం 18వ శతాబ్దపు ఫ్రాన్స్ ను పోలివుందనేది ఒక వాస్తవం.
అంచేత ఆ నాలుగు ఆదర్శాలు మనకు సరిగ్గా సరిపోయాయి. అదొక చారిత్రక అవసరం. సరైన సమయంలో
సరైన దిశగా జాతిని నడిపించే ప్రయత్నం చేశాడు అంబేడ్కర్.
13.
భారత రాజ్యాంగానికి
పెట్టుబడీదారీ స్వభావంతో పాటు సామాజిక సమానత్వ దృక్పధం కూడ వుంది. విషాదకరంగా, ఇటు
మార్క్సిస్టులకు, అటు అంబేడ్కరిస్టులకు కూడ భారత రాజ్యాంగం సమగ్రంగా అర్ధం కాలేదు.
మార్క్సిస్టులు దాన్ని పెట్టుబడీదారుల ప్రయోజనాల్ని నెరవేర్చే గ్రంధంగా మాత్రమే చూస్తూ
అందులోని సామాజిక సమానత్వ దృక్పధాన్ని చూడ నిరాకరిస్తున్నారు. మరోవైపు, అంబేడ్కరిస్టులు
రాజ్యాంగంలోని సామాజిక సమానత్వ దృక్పధాన్ని మాత్రమే చూస్తూ అందులోని పెట్టుబడీదారీ
అంశాన్ని చూడ నిరాకరిస్తున్నారు.
14.
స్వేఛ్ఛా, సమానత్వం,
సౌభ్రాతృత్వం ఇవి విడివిడి ఆదర్శాలు కావు. ఇవి త్రికం. Trinity. ఒకదాని నుండి మరోదాన్ని
విడదీయరాదు. విడదీస్తే ఏదీ నిలబడదు. మూడూ అంతమైపోతాయి.
15.
ఇప్పుడు అసలు ప్రశ్న
ఏమంటే ఈ నాలుగు ఆదర్శాలనూ దేశంలోని అణగారిన సమూహాలు అస్వాదిస్తున్నాయా? అన్నది. దీనికి
సమాధానం బిగ్ నో.
16.
Article 17 అంటరానితనాన్ని
సమస్త రూపాల్లో నిషేధించింది. రాజ్యాంగం అంతటితో
ఆగలేదు. The enforcement of any disability arising out of
"Untouchability" shall be an offence and punishable in accordance
with law.
17.
Article 46 బలహీనవర్గాలకు,
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. Shall protect them from social
injustice and all forms of exploitation అని హామీ ఇచ్చింది.
18.
ఈ అధీకరణల్ని ఉటంకిస్తూ
అంటరానితనం ఏనాడో దేశాన్ని విడిచి పారిపోయిందనీ, దేశ ప్రజలందరూ వివక్ష అనేదే లేకుండ
సంతోషంగా వుంటున్నారని సోషల్ మీడియా వీరులు కొందరు చాలా గట్టిగా అంటుంటారు. పిల్లలకు స్కూలు టీచర్లు ఇలాంటి అమాయకత్వాన్ని నూరిపోస్తుంటారు.
19.
మనుస్మృతి వగయిరాలు
త్రేతా, ద్వాపర యుగాలకు మాత్రమే చెందినవనీ వీళ్లందరూ గొంతు చించుకుని విరుచుకుని పడుతున్నారు.
కలియుగంలో ఆ స్మృతులు వుండవని వీళ్ళు బుకాయిస్తుంటారు.
20.
అణగారిన సమూహాల్లో
కొందరు తరచూ ఒక తప్పు చేస్తున్నారు. అంటరానితనం పాత రూపాల్లోనే వుంటుందనే ఒక అపోహ మనలో
కొనసాగుతోంది. అంటరానితనం రూపాన్ని మార్చుకుంటుందనిగానీ, మార్చుకుందనిగానీ చాలామంది గమనించడంలేదు.
21.
అణచివేతైనా, దాని
మీద తిరుగుబాటైనా కొత్త రూపాల్ని సంతరించుకోకుండా కొనసాగలేవు.
22.
అంటరానితనం ఏఏ కొత్త
రూపాల్లో కొనసాగుతున్నదనేది పరిశీలించడం ఒక
అవసరం. అలాగే, మనుస్మృతి ఏఏ కొత్త రూపాల్లో
పనిచేస్తున్నదన్నది పరిశీలించడం అంతకన్నా పెద్ద
చారిత్రక అవసరం.
23.
అంటరానితనాన్ని మనం
సామాజిక భౌతిక వెలిగా మాత్రమే పరిగణిస్తుంటే అది తగ్గింది. అంటరానితనాన్ని మనం ఆర్థిక
రంగం నుండి వెలివేతగా చూస్తే అది బాగా పెరిగింది. ఇదే నయా మనుస్మృతి.
24.
కులవ్యవస్థకూ, కుల
అణిచివేతకు సైధ్ధాంతిక సమర్ధన నివ్వడమేగాక
దేశంలో జాతి అభివృధ్ధికి ప్రధాన ఆటంకంగా వుంటోందంటూ 1927 డిసెంబరు 25న బాబా
సాహెబ్ అంబేడ్కర్ మనుస్మృతిని బహిరంగంగా తగల బెట్టారు. మరీ గాంధీజీ ఫొటో దగ్గర పెట్టుకుని
ఈ పనిచేశాడు.
25.
అది జరిగిన 22 ఏళ్ళ
తరువాత ఆయనే భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించాడు. అప్పట్లో, ముంబాయిలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ
అవతరణతో దేశంలో మనుస్మృతికి ఇక కాలం చెల్లిందన్నాడు.
26.
అంబేడ్కర్ అభిప్రాయాల్ని
మనువాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన అయిదో రోజునే దాని మీద
ఆరెస్సెస్ విరుచుకు పడింది. ఆరెస్సెస్ అధికార వారపత్రిక ‘ఆర్గనైజర్’ 1949 నవంబరు 30 నాటి
సంచిక సంపాదకీయంలో భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రపంచమంతా గొప్పవాడని
గుర్తించి ఎంతగానో కీర్తిస్తున్న మనువును అంబేడ్కర్ నిర్లక్ష్యం చేశాడని తప్పుపట్టింది.
27.
1950 జనవరి 26న రాజ్యాంగం
అమలు లోనికి వచ్చింది. ఆ వెంటనే ఫిబ్రవరి 6న వెలువడిన ‘ఆర్గనైజర్’ పత్రిక ‘మనువు మా
హృదయాలను ఏలుతున్నాడు’ అనే శీర్షికతో బ్యానర్
స్టోరి ప్రచురించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శంకర్ సుబ్బ అయ్యర్ ఈ వ్యాసాన్ని
రాశాడు.
28.
“ప్రతీ హిందువుకు
భారత రాజ్యాంగం కంటే మనుస్మృతియే అంతిమ జీవన ధర్మంగా వుంటుంది”. “మను తదితర స్మృతుల్లో
ఉన్న సూత్రాలు, ఆదేశాలే హిందువుల దైనందిన జీవితాలను నేటికీ ప్రభావితం చేస్తున్నాయన్నది
వాస్తవం”. “మత సాంప్రదాయాలను పట్టించుకోని హిందువులు కూడ కనీసం కొన్ని విషయాలలో అయినా
స్మృతులు ఆదేశించిన నియమాలకు కట్టుబడి ఉండాలని భావిస్తారు” అని రాశాడు అతను.
29.
ఆరెస్సెస్ సిధ్ధాంతకర్త,
రెండవ సర్సంగ్ ఛాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ 1966లో రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ అనే పుస్తకంలోనూ భారత రాజ్యాంగాన్ని తెగ హేళన చేశాడు. “పాశ్చాత్య
దేశాల రాజ్యాంగాల నుండి తలో వాక్యాన్ని ఎత్తుకొచ్చి
భారత రాజ్యాంగంలో కుత్రిమంగా కూర్చేశారు. అదొక కలగూర గంప. మన జీవితాశయాలు, మన జాతీయ లక్ష్యం వంటి ఆదర్శాలు
ఒక్కటి కూడ అందులో లేవు” అన్నాడు.
30.
ఆరెస్సెస్ ది సాంస్కృతిక
జాతీయవాదం (Cultural Nationalism). ఈదేశ అణగారిన సమూహాలు కోరుకుంటున్నది ప్రాదేశిక
జాతీయవాదం
(Territorial nationalism)
31.
ఈ వివరాలన్నీ ఇప్పుడు
ఎందుకు చెపుతున్నానో మీకు ఈ పాటికి అర్థం అయ్యే వుంటుంది. భారత రాజ్యాంగాన్ని నిలువెల్లా
ద్వేషించే శక్తులు ఈ రోజు అధికారంలో వున్నాయి. అంటే, భారత రాజ్యాంగం ఆనాడు ముందుకు తెచ్చిన విలువల్ని నీరుగార్చే ప్రయత్నాలు ఇప్పుడు
న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థల సాక్షిగానే
జరుగుతున్నాయి.
32.
జస్టిస్ శంకర్ సుబ్బ
అయ్యర్ మనుస్మృతి తమ హృదయాలను ఏలుతున్నాడు అన్నారుగానీ ఇప్పుడు మనుస్మృతి ఏకంగా దేశాన్నే
ఏలుతున్నది. మనం 1940లలో రాసుకున్న రాజ్యాంగాన్ని అటక ఎక్కిస్తున్నది.
33.
రాజ్యాంగ అధీకరణాలతోనే
రాజ్యాంగానికి తూట్లు పొడవడం సాధ్యమా? ఏమిటీ
ఈ Paradox? ఏమిటీ ఈ వైచిత్రి? అని మీలో కొందరు అడగవచ్చు. ఇవి మనకు ఇప్పుడు వింతగా,
విషాదంగా కనిపించవచ్చు. కానీ ఈ పరిణామాల్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడే ఊహించాడు.
34.
మిత్రులారా! మీరందరూ
1949 నవంబరు 25న రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన చివరి ప్రసంగ పాఠాన్ని చదివి
వుంటారని భావిస్తాను. చదవకపోతే తప్పక చదవండి. అంబేడ్కర్ అవగాహన, సిధ్ధాంత పటిమ, దూరదృష్టి,
ఎక్కడ దూకాలి, ఎక్కడ తగ్గాలి అనే సమతుల్యత, పెద్దలను గౌరవించడం, బలమైన ప్రత్యర్ధులకు వాళ్ళ స్థాయిని గుర్తు చేయడం, మళ్ళా వాళ్ళు నొచ్చుకోకుండా కొంచెం హాస్య చతురతను
ప్రదర్శించడం. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించడం, దాన్ని ఎలా ఎదుర్కోవాలో హెచ్చరించడం... ఇలా ఒక్కటేమిటీ ఆ ప్రసంగంలో అంబేడ్కర్ తన విశ్వరూపాన్ని
ప్రదర్శించాడు.
35.
రాజ్యాంగంలో పొందుపరచిన
ఆదర్శాలకన్నా రాజ్యాంగాన్ని అమలు చేసేవారే కీలకమని ఈ ప్రసంగంలో అంబేడ్కర్ చాలాసార్లు గుర్తు చేస్తాడు. అమలు చేసేవారు
చెడ్డవారయితే ఎంత గొప్ప రాజ్యాంగం అయినా పనికిరాకుండా పోతుంది. అమలు చేసేవారు మంచివారయితే చెడ్డ రాజ్యాంగాలు కూడ
మంచి ఫలితాలను సాధిస్తాయి అంటాడు.
36.
పెన్సెల్వేనియా రాష్ట్రంలోని
గెట్టిస్ బర్గ్ పట్టణంలో 1863 నవంబరు 19న చేసిన
ప్రసంగంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం
లింకన్ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఒక కొత్త
నిర్వచనం ఇచ్చాడు. ప్రజాస్వామిక ప్రభుత్వం అంటే
ప్రజల యొక్క, ప్రజల ద్వార, ప్రజల కొరకు పనిచేసేది అన్నాడు. మనలో ప్రతి ఒక్కరూ
వేదిక ఎక్కితే చాలు ప్రజాస్వామ్యం అనగానే,
“a government of the people, by
the people and for the people” అని వల్లె వేస్తుంటారు.
37.
నిజానికి కేసిఆర్
ప్రభుత్వం అయినా, చంద్రబాబు ప్రభుత్వం అయినా, జగన్ ప్రభుత్వం అయినా, నరేంద్ర మోదీ ప్రభుత్వం
అయినా ప్రజాస్వామిక ప్రక్రియలో భాగంగా ఎన్నికల ద్వార ప్రజల చేత రాజ్యాంగ బధ్ధంగా ఏర్పడ్ద
ప్రభుత్వాలే. అంబేడ్కర్ తన ప్రసంగం చివర్లో
“ప్రజల చేత ఏర్పడే ప్రజల (యొక్క) ప్రభుత్వాలకన్నా ప్రజల ‘కొరకు’ పని చేసే ప్రభుత్వాలే
గొప్పవి” అని గుర్తు చేస్తాడు.
38.
మనదేశాన్ని ఇప్పటి
వరకు సాఫ్ట్ మనువాదులైన గాంధీ-నెహ్రూ కుటుంబమో
లేకుంటే హార్డ్ మనువాదులైన సంఘపరివారమో పాలిస్తూవచ్చారు. వాళ్ళకు చేతనైనన్నిసార్లు
రాజ్యాంగ ఆదర్శాలకు తూట్లు పొడిచారు. మరలా వాళ్ళే రాజ్యాంగం విఫలమయిందని గగ్గోలు పెడుతున్నారు.
“దొంగే దొంగ దొంగ” అని అరిచాడనే సామెతకు ఇంతకు మించిన ఉదాహరణ దొరకదు.
39.
భారత రాజ్యాంగం స్వర్ణోత్సవాల
సందర్భంగా 1999లో ప్రధానిగా వాజ్ పాయి, హోంమంత్రిగా అద్వానీ వున్న కాలంలో రాజ్యాంగాన్ని
సమీక్షించాలనేకాక ఏకంగా మార్చాలనే ప్రతిపాదనను
ముందుకు తెచ్చారు. ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రద్దు చేసి నయా మనువాద రాజ్యాంగాన్ని
ముందుకు తేవాలనేది వాళ్ళ అభిమతం.
40.
ఈ అంశం మీద అప్పట్లో
దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ సాగింది. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ “రాజ్యాంగం
విఫలమయిందా? లేక మనమే రాజ్యాంగాన్ని విఫలం
చేశామా? అంటూ దిమ్మదిరిగే ఒక ప్రశ్న వేశారు.
41.
ఈనాటి ప్రభుత్వాలు
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయనే అభిప్రాయం మనకు తరచూ కలుగుతోంది. అది సమంజసమైన
అభిప్రాయమే. అయితే, రాజ్యాంగం పుట్టిన రోజు
నుండే దాన్ని విఫలం చేసే ప్రక్రియ మొదలయింది. దానితో విసిగిపోయిన బాబాసాహెబ్ 1953లో
స్వయంగా రాజ్యసభలో ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు. “అయ్యా! రాజ్యాంగాన్ని నేనే రూపొందించానని
నా స్నేహితులు అంటున్నారు. కానీ దానిని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే అని చెప్పడానికి
నేను సిద్ధంగా ఉన్నాను. నాకు అది వద్దు. అది ఎవరికీ పనికిరాదు” అన్నాడు.
42.
మిత్రులారా! పాత్రికేయ
వృత్తితో పాటు ఒక సెఫాలజిస్టుగా (psephologist) కూడ నేను అనేకసార్లు పనిచేశాను. పేదరిక నిర్మూలన తదితర ప్రభుత్వ పథకాల
అమలు తీరుపై చేపట్టిన కొన్ని సర్వేల్లో పాల్గొన్నాను. ఫీల్డ్స్, రికార్డ్స్, రిపోర్ట్స్ తయారు చేయడమేగాక
స్వయంగా సర్వేయర్ గానూ పనిచేశాను.
43.
కొన్ని ఎకానమీ సర్వే
నివేదికల్ని పరిశీలిస్తే ఆధునిక భారత దేశంలో మనుస్మృతి ఎంత పటిష్టంగా అమలవుతున్నదో
అర్థం అవుతుంది.
44.
మన రాజ్యాంగానికి
ప్రజాస్వామ్యంతోపాటు సోషలిజమూ ప్రధాన ఆదర్శమే.
ఆ ఆదర్శాలలు పని చేస్తున్నవో లేదో తెలుసుకోవాలంటే దేశంలో సంపద ఎటు నుండి ఎటు వైపుకు
ప్రవహిస్తున్నదన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
45.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో
భారతదేశం 2.78 ట్రిలియన్ డాలర్ల సాలీన జిడిపితో ఏడవ స్థానంలో
కొనసాగుతున్నది. 5 ట్రిలియన్ డాలర్ల
జిడిపితో మూడవ స్థానానికి ఎగబాకబోతున్నదని
ప్రపంచ ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఈ సర్వే ప్రకారం భారత దేశం ధనిక దేశం.
45.
46.
ప్రస్తుత 790 కోట్ల
ప్రపంచ జనాభాలో భారతీయులు 17.5 శాతం అయితే
ప్రపంచ నిరుపేదల్లో భారతీయులు 25 శాతం. ఈ సర్వే
ప్రకారం భారత దేశం నిరుపేద దేశం.
47.
ఒకే దేశానికి ఒకే
సందర్భంలో రెండు ఆర్ధిక స్వభావాలు వుండడం విచిత్రం. నిజానికి మనదేశం పేద దేశమో సంపన్న
దేశమో తేల్చుకోలేని ఒక సంధిగ్ధ స్థితిలో మనం వున్నాం.
48.
IIFL
Wealth-Hurun India కొత్త నివేదిక ప్రకారం దేశంలోని కొన్ని కార్పొరేట్ల ఆదాయం రోజుకు
వెయ్యి కోట్ల రూపాయలకన్నా ఎక్కువగా వుంటున్నది. మరోవైపు, వృధ్ధ్యాప్య పెన్షన్ ను నెలకు
250 రూపాయలు పెంచుతామంటే చాలు ప్రజలు ఏకంగా ప్రభుత్వాలనే మార్చేస్తున్నారు.
49.
ఒక వైపు రోజుకు పది
రూపాయలు మరోవైపు రోజుకు వెయ్యి కోట్ల రూపాయలు. ఎక్కడయినా పొంతన వుందా? ఇంత వత్యాసం
వున్నదేశాలు ఎక్కడయినా వున్నాయా? మన ఐశ్వర్యవంతులు అమెరికాతో పోటీపడుతున్నారు. మన నిరుపేదలు
బురుండీ, సోమాలియా దేశాలతో పోటీపడుతున్నారు.
ఇదీ ఇండియన్ ఎకానమీలో వున్న పారడాక్సీ.
50.
మన వర్తమాన ఆర్ధిక
వ్యవస్థ ఒక వైపు పిడికెడు మందిని సూపర్ రిచ్ గా తయారు చేస్తున్నది. మరోవైపు వంద కోట్ల
మందిని నిరుపేదలుగా మారుస్తున్నది. ఇదే ఆర్ధిక మనువాదం. మనం మనువాదం అంటే కులవ్యవస్థ
అని మాత్రమే అనుకుంటాము. అదే పెద్ద తప్పు.
51.
మన దేశ మార్క్సిస్టులు
సాధారణంగా ఆర్థిక విశ్లేషణతో ఆగిపోతుంటారు. అంబేడ్కరిస్టులు అంతకన్నా వివరమైన సర్వేలు
జరపాల్సివుంటుంది. సర్వే రికార్డుల్లో అనేక సోషల్ ఫీల్డ్స్ ను పెంచాల్సి వుంటుంది.
52.
భారతదేశంలో బిలియన్
డాలర్లను (7,445 కోట్ల రూపాయలు) మించిన సంపద కలిగిన ఐశ్వర్యవంతుల జాబితాను తీసుకోండి. వాళ్ళను సామాజిక
సమూహాల ప్రకారం వర్గీకరించండి. వాటిల్లో ఏఏ సామాజిక సమూహాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కిందో,
ఏ సామాజిక సమూహాలకు తక్కువ ప్రతినిథ్యం దక్కిందో లెఖ్ఖలు తీయండి. ఇది చాలా సులభం కూడ.
53.
అంబేడ్కర్ తన జీవితకాలం
తపించిన శ్రామిక కులాలకు నిస్సందేహంగా బిలియన్ డాలర్ క్లబ్బులో స్థానం వుండదు.
54.
అలాగే మీరు దేశంలో
సాగిన భారీ స్కాం లను, బ్యాంకుల ఫ్రాడ్ లను
పరిశీలించండి. శ్రామిక కులాలకు చెందిన వారు ఒకరిద్దరు కూడ ఈ స్కాముల్లో కనిపిస్తారు.
కానీ, అత్యధికులు యజమాని కులాలకు చెందినవారే అయ్యుంటారు. సందేహంలేదు.
55.
సంపద మొత్తం యజమాని
కులాల చేతుల్లోనూ, పేదరికం మొత్తం శ్రామిక కులాల చేతుల్లోనూ వుండడంకన్నా మనువాదం ఏముంటుందీ?
శ్రామిక కులాలంటే ఎస్సీఎస్టి బిసి మైనారిటీలని నేను కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
56.
మిత్రులారా! మనం ఈసారి
జైళ్ళ సర్వేను పరిశీలిద్దాం. మీరు ఏ జైలునయినా తీసుకోండి. ఖైదీలందర్ని సామాజిక సమూహాలుగా
వర్గీకరించండి. మీకు రెండు విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఖైదీల్లో అత్యధికులుగా ఎస్సీ,
ఎస్టి, బిసి, మైనారిటీలు వుంటారు. ఖైదీల్లో యజమాని కులాలకు చెందినవారు అతి తక్కువ మంది
మాత్రమే వుంటారు.
57.
ఈ వర్గీకరణ శిక్షా
కాలానికి కూడా వర్తిస్తుంది. పెత్తందారీ కులాలకు చెందినవాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా
నిర్దోషులుగా విడుదలై పొతుంటారు. లేదా వెంటనే బెయిల్ పొంది బయట తిరుగుతుంటారు. అణగారిన కులాలకు
చెందినవాళ్ళు చిన్న చిన్న నేరాలకు కూడా బెయిల్ కు నోచుకోక ఏళ్ళ తరబడి జైళ్లలో మగ్గుతుంటారు.
58.
నాకు తెలిసినంతవరకు భారత దేశంలో అత్యంత సీనియర్ ఖైదీలు సాతులూరి చలపతి
రావు, గంటెల విజయవర్ధన్. ఇద్దరూ ఎస్సీలే. చిలకలూరిపేట
బస్ బర్నింగ్ కేసు దోషులు. చలపతి రావు, విజయవర్ధన్ నేరం చేశారు. అందులో సందేహం లేదు.
వారికి మాత్రమే అంత సుదీర్ఘకాల శిక్షలు వేశారెందుకనేది సందేహం రావలసిన అంశమే.
59.
మన దేశం పశ్చిమ తీరంలోనీ ఒక ప్రముఖ పోర్టులో ఇటీవల మూడు ఓడల డ్రగ్స్
వచ్చాయి. ఒక్కో ఓడ 33 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ను తెచ్చింది అని వార్తలొచ్చాయి.
అంటే ఈ కన్సైన్ మెంట్ లో లక్ష కోట్ల రూపాయల
డ్రగ్స్ వచ్చాయి. వీటిల్లో మూడో ఓడ పట్టుబడడంతో
ఈ వ్యవహారం బయటికి వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈ కేసులో ఎవర్నీ అరెస్టు చేయలేదు. దేశ ఆర్ధిక
వ్యవస్థనే షేక్ చేసేసే ఈ స్మగ్లింగ్ వ్యవహారం మీద మీడియా మాట్లాడలేదు. ముంబాయిలో ఒక
పిల్ల ఖాన్ 20 గ్రాముల కొకైన్ తో పట్టుబడ్డాడని
ఓ పదిహేను రోజులు గగ్గోలు పెడుతూ మీడియా ఆ కేసు మీద బతికేసింది.
60.
సంఝౌతా ఎక్స్ ప్రెస్,
మాలెగావ్ పేలుళ్ళు, అజ్మీర్, హైదరాబాద్ మక్కా మసీదు పేలుళ్ళు తదితర సంఘటనల్లో నిందితులు యజమాని కులాలకు చెందినవాళ్ళు. వాళ్ళను కోర్టులన్నీ
మానవతా దృక్పథంతో విడుదల చేసేశాయి. వాళ్ళలో
కొందరు ఇప్పుడు మనకు ఎంపీలుగా వున్నారు. ఏమిటీ ఈ వైరుధ్యం?
61.
వ్యక్తిగత ఆస్తి నేరం
అన్నాడు ప్లేటో. అసలు పేదరికమే నేరం అన్నాడు విక్టర్ హ్యూగో. భారత దేశంలో శ్రామిక కులమతాల్లో
పుట్టడం నేరంగా మారిపోయింది.
62.
శ్రామిక కులాలకు అధిక శిక్షలు వేయడం, యజమాని కులాలకు
శిక్షల్లో మినహాయింపులు (legal impunity) ఇవ్వడాన్ని మనం తరచూ చూస్తున్నాం. దీనిని నయా మనుస్మృతి అనికాక మరేమనాలి?
63.
కేంద్ర ప్రభుత్వం
2016లో పెద్దనోట్లను రద్దు చేయడాన్ని మనం చూశాం. Demonetization ఒక పెద్ద విఫల పథకం.
దాని గురించి అంతకు మించిన వివరాల్లోనికి ఇప్పుడు నేను వెళ్ళను. ఇప్పుడు Monetization మొదలయింది. దీన్ని నగదీకరణ
అంటున్నారు.
64.
నగదీకరణలో భాగంగా,
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసి
తీరుతామని కేంద్ర ప్రభుత్వం కరాఖండీగా తేల్చి పడేసింది. ప్రైవేటీకరణను ఆపాలంటూ దాదాపు
ఏడాది కాలంగా ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన సాగిస్తున్నారు.
65.
కేంద్రంలో అధికారంలోవున్న
బిజేపి జాతీయ నాయకులు విశాఖపట్నం వచ్చి ప్రైవేటీకరణ జరిగినంతమాత్రాన ఉక్కు ఫ్యాక్టరీ
ఎక్కడికీ పోదనీ అది ఇక్కడే వుంటుందని గడుసుగా చెప్పి వెళ్ళారు.
66.
ఉక్కు ఫ్యాక్టరీని
ప్రైవేటికరిస్తే ముందుగా దెబ్బపడేది ఉపాధి వ్యవస్థలోని రిజర్వేషన్ల మీద. మనకు ప్రైవేటు
రంగంలో రిజర్వేషన్ల సౌకర్యం లేదు కనుక దాదాపు 50 శాతం ప్రభుత్వ వుద్యోగ అవకాశాలు అలా
పోతాయి.
67.
ఇది నేరుగా ఆర్టికల్ 46 మీద దాడి. అది అణగారిన సమూహాలకు చాలా పెద్ద నష్టం.
68.
నగదీకరణ అనేది ఉపాధి
వ్యవస్థలో ప్రవేశించిన వస్తున్న మనుస్మృతి.
69.
సమాజంలో అసమానత్వం,
సాంస్కృతిక రంగంలో అంతస్తులు, ఆర్థిక వ్యవస్థలో యజమానులు బానిసలు వుండాలని కోరుకునేవారు
ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో వున్నారు.
70.
బిజేపి సీనియర్ నేత
మాజీ కేంద్రమంత్రి అనంతకుమార్ హేగ్డే వంటివాళ్ళు
కొందరు బయటపడి చెప్పారుగానీ, బయటికి చెప్పకపోయినా “స్వేచ్ఛ”, “సమానత్వం”, “సౌభ్రాతృత్వం” “న్యాయం” అనే ఆదర్శాలను రాజ్యాంగం
నుండి తొలగించాలని చూస్తున్నవాళ్ళు ఇప్పుడు చాలా బలంగా వున్నారు.
71.
రాజ్యాంగానికి కష్టోడియన్
అయిన సుప్రీం కోర్టులోనూ వీళ్లు క్రికెట్ ఆడుకోగలరు. న్యాయమూర్తుల్ని నియమించగలరు;
వాళ్ళను నియంత్రించగలరు.
72.
1985 నాటి కారంచేడు
ఉద్యమం ఫలితంగా 1989లో The Scheduled Caste and Scheduled Tribe (Prevention of
Atrocities) Act వచ్చింది.
73.
ఎస్సీ ఎస్టి ల మీద
అత్యాచారాల నిరోధక చట్టం యజమాని కులాలకు నచ్చదు.
74.
బిజేపికి అణగారిన
సమూహాల మీద నమ్మకం లేదు. దానిది మజమాని కులాల
సంతుష్టీకరణ విధానం.
75.
ఎస్సీ ఎస్టి ల మీద
అత్యాచారాల నిరోధక చట్టాన్ని రద్దు చేయాలంటూ ‘అనంతకుమారులు’ సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఈ పనిని వాళ్ళు
2019 లోక్ సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చేశారన్నది గుర్తు పెట్టుకోవాలి.
76.
2018 మార్చి 20న ఈ
చట్టాన్ని సరళీకరిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు
వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శలు సాగాయి. వీటిల్లో పదిమందికి
పైగా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు.
77.
ఎస్సీఎస్టీల నిరసనల్ని
ఆపడానికి సుప్రీం కోర్టు ఆర్డరు మీద భారత ప్రభుత్వ అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్
2018 ఏప్రిల్ 3న నాటకీయంగా రివ్యూ పిటీషన్ వేశారు.
కేసు వేసిందీ వాళ్ళ మనుషులే, రివ్యూ పిటీషన్ వేసిందీ వాళ్ల ప్రభుత్వమే.
78.
2019 లోక్ సభ ఎన్నికలకు
రెండు నెలలు ముందు కేంద్ర ప్రభుత్వం యజమాని కులాలకు ఆర్థికంగా వెనుకబడిన తరగతులనే నెపంతో
10 శాతం EWS రిజర్వేషన్లు ప్రకటించింది.
79.
ఒక విధంగా జాతీయోద్యమ
కాలంలోనూ, ఆ తరువాత రాజ్యాంగ రూపకల్పన కాలంలోనూ అణగారినవర్గాలు సాధించుకున్న వెసులుబాటులు,
సౌకర్యాలను ఒకదాని తరువాత మరోదాన్ని వరుసగా రద్దు చేసే ప్రక్రియ ఇప్పుడు సాగుతోంది.
80.
మిత్రులారా! మనువాదులు
రాజ్యాంగానికి ఎలా ఎలా తూట్లు పొడుస్తున్నారో, రాజ్యాంగ ఆదర్శాలను ఎలా నిర్వీర్వం చేస్తున్నారో
చెప్పుకుంటూ పోతే రోజులూ, వారాలు సరిపోవు. అంచేత ఈ విషయాన్ని ఇక్కడ ఆపి మనం నెరవేర్చాల్సిన
ఒక ముఖ్యమైన కర్తవ్యాన్ని వివరిస్తాను.
81.
ఈ దుష్ పరిణామాలను
చూసి విలపిస్తూ వుండడమేనా మన పని? వీటిని అడ్డుకోలేమా? రాజ్యాంగ విలువల్ని పునరుధ్ధరించలేమా?
ఇదీ ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం.
82.
1924లో ‘బహిష్కృత్
హితకారిణి సభ’ను ఆరంభించినపుడు
బాబాసాహెబ్, బోధించు పోరాడు, నాయకత్వం వహించు (Educate, Agitate and Organize) అంటూ
ఉద్యమ నిర్మాణానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను
మన ముందు వుంచాడు. ఇప్పుడు మనకు ఉద్యమ
స్పృహే లేనప్పుడు ఉద్యమ నిర్మాణ సూత్రాలు ఎలా గుర్తుంటాయి!
83.
నేను పైన పేర్కొన్న
ప్రసంగంలోనూ - రాజ్యాంగం అమలు పధ్ధతులు పర్యవసానాల మీద బాబాసాహెబ్ అనేక ప్రత్యామ్నాయాలను
మన ముందు పెట్టి వాటి మంచిచెడుల్ని విశ్లేషించాడు.
84.
“సామాజిక ఆర్థిక లక్ష్యాలను
సాధించుకోవడానికి రాజ్యాంగబధ్ధ పద్ధతులకు దారులు తెరిచి వున్నప్పుడు రాజ్యాంగ విరుద్ధ
పద్ధతులకు ఎలాంటి సమర్థనా ఉండదు. కానీ, సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి
రాజ్యాంగబధ్ధ పద్ధతులకు మార్గాలు మూసుకున్నప్పుడు
రాజ్యాంగ విరుద్ధ పద్ధతులకు మార్గాలు తెరుచుకుంటాయి. రక్తపాత విప్లవాలకు గొప్ప సమర్ధన
వస్తుంది. మనం అలాంటి పరిస్థితిని రానివ్వకూడదు” అన్నాడు.
85.
ఆనాటి వుమ్మడి భారత
కమ్యూనిస్టు పార్టి అనుసరిస్తున్న పోరాట పంథాను
పరోక్షంగా ప్రస్తావిస్తూ అంబేడ్కర్ ఈ మాటలన్నాడు.
బిటీ రణదీవె నాయకత్వాన 1948 ఫిబ్రవరి
28 నుండి మార్చి 6 వరకు కలకత్తాలో జరిగిన రెండవ మహాసభలో దేశంలో సామ్యవాద విప్లవాన్ని
విజయవంతం చేయడానికి సాయుధ పోరాట పంథాను చేపట్టాలని సిపిఐ తీర్మానించింది.
86.
భారత రాజ్యాంగ రచన
సాగుతున్న కాలంలోనే నిజాం సంస్థానంలోని తెలంగాణ రైతాంగం సిపిఐ నాయకత్వాన సాయుధ పోరాటాన్ని సాగించింది. అయితే, 1948 సెప్టెంబరు మూడవ వారంలో సిపిఐ తెలంగాణ
కమిటి సాయుధ పోరాట విరమణ ప్రకటించింది. 1951 అక్టోబరు మూడవ వారంలో ఫైజ్ పూర్ లో జరిగిన
సిపిఐ జాతీయ సమితి మూడవ కాంగ్రెస్ సాయుధ పోరాట
పంథాను విరమించుకుని రాజ్యాంగబధ్ధ పార్లమెంటరీ
పంథాను చేపట్టాలని 1951 అక్టోబరు 21న తీర్మానం
చేసింది.
87.
ప్రజలు తమ సామాజిక
ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి రాజ్యాంగబధ్ధ పద్ధతులకు మార్గాలు మూసుకున్నప్పుడు రాజ్యాంగ విరుద్ధ పద్ధతుల్ని చేపడతారని
అంబేడ్కర్ చెప్పినట్టు 1967లో నక్సల్ బరీ రూపంలో సాయుధపోరాట పంథా గొప్ప ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది.
88.
ఇప్పుడు ఆ పరిస్థితి
లేదు. సాయుధ పోరాట సంస్థలకు ప్రజల సమర్ధన తగ్గిపోయింది. దానికి కారణం ప్రభుత్వ నిర్బంధాలా? సాయుధ పోరాట
సంస్థల నాయకుల స్వీయ తప్పిదాలా? అనేది చాలా పెద్ద చర్చ. ఇప్పుడు నేను ఆ తేనె తుట్టెను
కదపదలచలేదు. ఇంకో సందర్భంలో దాని గురించి విపులంగా మాట్లాడుతాను.
89.
ఇక ఆప్షన్స్ లేవు.
ఇప్పుడు మతసామరస్య, సామ్యవాద, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ఒక్కటే మార్గం.
90.
తమది ప్రజాస్వామిక
పార్లమెంటరీ ఎన్నికల విధానం అని ఘనంగా ప్రకటించుకున్నవాళ్ళు సహితం అధికారాన్ని చేపట్టగానే
రాజ్యాంగ విలువల్ని ఆదర్శాలనూ తుంగలో తొక్కుతున్నారు. ఇటీవలి కాలంలో, పార్లమెంటు సాక్షిగా
సాగిన కొన్ని సంఘటనల్ని మీ ముందుకు తెస్తాను.
91.
2019లో తిరిగి అధికారాన్ని
చేపట్టిన బిజెపి క్రమంగా తన అసలు ఎజెండాను అమలు పరచడం మొదలెట్టింది. ఈ క్రమంలో ముందుగా
ముస్లిం మైనార్టీల మీద విరుచుకు పడింది.
92.
కొత్త ప్రభుత్వం ఏర్పడగానే, ముస్లిం విడాకుల్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే
చట్టాన్ని చేసింది. ఆ తరువాత కశ్మీర్ కు ప్రత్యేక
ప్రతిపత్తి నిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రామమందిర నిర్మాణానికి అనుకూలంగా
సుప్రీం కోర్టు నుండి ఆదేశాలు తెచ్చుకుంది. ఆ తరువాత CAA, NRC, NPR సవరణ చట్టాలు వచ్చాయి.
93.
రామమందిర నిర్మాణం,
ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి అనే మూడు అంశాలు ఆరెస్సెస్-బిజెపిల లక్ష్యాలని
అందరికీ తెలుసు.
94.
కానీ, మనుస్మృతిని
పునరుధ్ధరించడం, దేశ సంపదను కార్పొరేట్లకు అప్పచెప్పడం ఆరెస్సెస్-బిజెపిల అసలు లక్ష్యమని
మనలో చాలామంది ఇప్పటికీ గుర్తించలేదు. అంటే,
మతసామరస్య, సామ్యవాద, ప్రజాస్వామిక రాజ్యాంగానికి పెద్ద ముప్పు ఏర్పడిందని అర్థం.
95.
కేంద్ర హోం మంత్రి,
బిజెపి అధ్యక్షుడు అమిత్ షా 2019 డిసెంబరు
9న పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. డిసెంబరు 10న లోక్ సభ, డిసెంబరు
11న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి.
96.
భారత ముస్లింల జీవితాల్లో
డిసెంబరు 11 ఒక చీకటి రోజు. వస్త్రాపహరణం సన్నివేశంలో నిస్సహాయురాలైన ద్రౌపతి ‘నీవే
దిక్కు’ అని వేడుకున్నట్టు
ఆ కారుచీకట్లలో ముస్లిం మహిళలకు రాజ్యాంగం ఒక్కటే ఆశాదీపంగా కనిపించింది.
97.
ఢిల్లీ శివార్లలోని
షాహీన్ బాగ్ కు చెందిన కనీజ్ ఫాతిమా తదితరులకు “మనం రాజ్యాంగాన్ని కాపాడుకుంటే మనల్ని
రాజ్యాంగం కాపాడుతుంది” అనే ఒక గొప్ప ఆలోచన వచ్చింది.
98.
మూడు రంగుల జాతీయ
జెండా నీడన నిలబడి, ఒళ్ళో గాంధీజీ అంబేడ్కర్ల ఫొటోలు పెట్టుకుని, ఒక చేతితో భారత మతసామరస్య
రాజ్యాంగాన్ని పట్టుకుని, ఇంకో చేతితో పిడికిలి బిగించి “న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావం” అంటూ భారత ముస్లింలు నినదించారు.
99.
నయా మనువాద నియంతృత్వాన్ని
దేశ రాజధాని నగరంలోనే దిగ్భందించే ఒక వ్యూహాన్ని ముస్లిం మహిళలు కనుగొన్నారు. అదే షాహీన్
బాగ్ ఉద్యమం. అలా మొదలయింది ‘భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’.
100.
ఆ తరువాత, గత ఏడాది
సెప్టెంబరు 20న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను పార్లమెంటు ఆమోదించింది. అప్పుడూ భారత
రైతాంగాన్ని ఒక విషాదం ఆవరించింది. షాహీన్ బాగ్ బాటలో వాళ్ళూ ‘దేశ రాజధాని దిగ్భంధనం’ ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త్ కిసాన్
మోర్చా, ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటి సగౌరవంగా షాహీన్ బాగ్ ఉద్యమాన్ని
తమకు “దారి చూపిన తల్లి”గా పేర్కొన్నాయి.
101.
మతసామరస్య, సామ్యవాద,
ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి షాహీన్ బాగ్ ఒక మార్గం. ఇంకా ఇలాంటి
అనేక మార్గాలను ఇప్పుడు మనం అన్వేషించాల్సి వున్నది.
102.
మన సామాజిక ఉద్యమాలను ఒక విషాదం ఆవరించింది. అణగారిన సమూహాలన్నీ ఏకం కావల్సిన చారిత్రక సందర్భంలో అందరం విడిపోతున్నాం.
103.
అంబేడ్కరిస్టులంటే
సామాజికవర్గాల్ని మాత్రమే పట్టించుకుంటారనీ, మార్క్సిస్టులంటే ఆర్థికాన్ని మాత్రమే
పట్టించుకుంటారనీ ఒక నేరేటివ్ స్థిరపడిపోయింది.
104.
నిజానికి బాబాసాహెబ్
అంబేడ్కర్ సామాజికార్ధిక రంగాలను ఎన్నడూ విడిగా చూడలేదు. ఆయన రచనలు, ప్రసంగాలు అన్నింటిలోను సామాజిక, ఆర్థిక అంశాలను కలిపే ప్రస్ర్తావిస్తాడు.
105.
రాజ్యంగ పరిషత్ లో
తన చివరి ఉపన్యాసంలో బాబాసాహెబ్ చేసిన ఒక హెచ్చరికను మీ ముందు ప్రస్తావించి నా ప్రసంగాన్ని
ముగిస్తాను. దానికి ముందు ఒక జర్మన్ నాటకంలోని ఒక సన్నివేశాన్ని మీకు వివరించాల్సిన
అవసరంవుంది.
106.
నాజిజం పాలన కాలంలో
జర్మన్ నాటక రచయిత బెర్తోల్ట్ బ్రెక్ట్ అమెరికాలో ప్రవాసం వున్నాడు. అన్యాయాలను చూస్తూ
నిర్లిప్తతంగా వుండిపోయే మనుషుల్ని ఈసడించుకుంటూ అతను 1943లో ‘The Good Woman of
Szechwan అనే ఒక నీతిబోధ (Parable) నాటకం రాశాడు.
107.
ఈ కథ చైనాలోని షేజ్వాన్
నగరంలో సాగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర ‘షేన్
థే’ ఒక వీధివేశ్య. కళ్ళముందు
దారుణ అన్యాయం జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు నిర్లిప్తంగా, నిరాసక్తితో వుండిపోయే మనుషుల్ని చూసి చూసి ఆమె ఒక రోజు రగిలిపోతుంది.
108.
“ఒరేయ్! అసంతృప్త
జీవుల్లారా! నిన్న వాళ్ళెవరో వచ్చి మీ పొరుగువాడిని చావగొట్టి వెళ్ళిపోయారు. మీరు నోళ్ళు
వెళ్ళబెట్టి చూస్తుండిపోయారు. ఈ రోజు ఇంకెవరో వచ్చి మీ సోదరుడ్ని చంపేసి పోయారు. మీరు మౌనంగా వుండిపోయారు. ఎలాంటి మనుషులు మీరు?. ఎలాంటి
బతుకులు మీవి?. ఛీ. మీ జిమ్మడ!. మీలాంటి పనికిమాలిన వాళ్ళు నివసించే నగరం సాయంత్రం
సూర్యుడు అస్తమించడానికి ముందే కాలి బూడిదైపోవాలి” అని ఆక్రోశిస్తుంది.
109.
రెండవ ప్రపంచ యుధ్ధం
ముగిసిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా సాగిన ప్రజాస్వామిక ఉద్యమాల్లో ఈ నాటకం గొప్ప ఆదరణను
పొందింది. ‘షేన్ థే’ పాత్ర ప్రభావం అంబేడ్కర్
ను సహితం తాకింది అంటారు. ఇప్పుడు నేను అంబేడ్కర్ మాటల్ని మీ ముందు వుంచుతాను.
110.
“(రాజ్యాంగం అమల్లోనికి
వచ్చాక) 1950 జనవరి 26న మనం ఒక వైరుధ్యాల జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నాం. రాజకీయ
రంగంలో సమానత్వం వుంటుందిగానీ, సామాజిక, ఆర్థిక
జీవితాల్లో అసమానతలు ఉంటాయి. మన సామాజికార్ధిక
నిర్మాణంలోని (ధార్మిక) లోపం కారణంగా
మన సామాజికార్థిక జీవితాల్లో ఒక మనిషి ఒకే విలువ అనే సూత్రాన్ని మనం తిరస్కరిస్తూనే
వుంటాము. ఈ వైరుధ్యాల జీవితాన్ని మనం ఎంతకాలం కొనసాగిద్దాం? మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో
సమానత్వాన్ని ఎంతకాలం నిరాకరిస్తుంటాం? సామాజికార్థిక జీవితాల్లో మనం సమానత్వాన్ని సుదీర్ఘకాలం నిరాకరిస్తూనే ఉంటే, మన రాజకీయ ప్రజాస్వామ్యం
కూడ ప్రమాదంలో పడిపోతుంది. సాధ్యమైనంత త్వరగా
ఈ వైరుధ్యాన్ని మనం తొలగించాలి. లేనిపక్షంలో సమాజంలో అసమానతతో బాధపడేవారు తిరగబడి
– మనం ఇన్నేళ్ళు కష్టపడి నిర్మించిన - రాజకీయ
ప్రజాస్వామ్య సౌధాన్ని పేల్చివేస్తారు (blow up)” అని హెచ్చరిస్తాడు. బాబాసాహెబ్ ఇంత
ఆవేశంగా మాట్లాడిన సందర్భం మరొకటి కనిపించదు.
111.
ఈ వాక్యాల్ని మళ్ళీమళ్ళీ గమనించండి
సామాజిక, ఆకార్థిక అంశాల్ని అంబేడ్కర్
ఏ సందర్భంలోనూ విడగొట్టి మాట్లాడలేదు. న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం
trinity అయినట్టు సాంఘీక, ఆర్థిక అంశాలను విడదీయలేం; విడదీయరాదు.
112.
“సామాజికార్థిక జీవితాల్లో
అసమానత్వాన్ని మనం ఇంకెంత కాలం కొనసాగిద్దాం?” అన్న అంబేడ్కర్ హెచ్చరిక ఇంకా మన చెవుల్లో
మార్మోగుతూనే వుంది. ఇప్పుడు ఇప్పుడే దీనికి మనం సమాధానం చెప్పాలి.
113.
మౌనానికి, నిర్లిప్తతకు
ఇప్పుడు తావులేదు. అదొక్కటే నేను చెప్పదలచినది.
నాకు మాట్లాడే అవకాశం
ఇచ్చినందుకు నిర్వాహకులకు,
ఇంతసేపూ నా ప్రసంగాన్ని
విన్నందుకు మీ అందరికీ,
ధన్యవాదాలు.
లాల్ సలామ్, నీల్
సలామ్, హర్యాలీ సలాం
72వ భారత రాజ్యాంగ
దినోత్సవం,
బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్
సొసైటీ, విశాఖపట్నం
26 నవంబరు 2021, శుక్రవారం,
సాయంత్రం
Apt analytic speech sir.. marvelous
ReplyDeleteThank you. Who is it.
ReplyDelete