మాట్లాడుకుందాం రండి!
డానీ
జాతియోద్యమ కాలం నాటి ఆలోచనారంగంలో ఒక మాట బలంగా వినిపించేది. “ముందు బెంగాల్ ఆలోచిస్తుంది; ఆ తరువాత ఇండియా ఆలోచిస్తుంది” అనేవారు. ఆనాటి ఆంధ్రాప్రాంతంలో విజయవాడకు అలాంటి ఘనత వుండేది. ముందు విజయవాడ ఆలోచిస్తుంది ఆ తరువాత ఆంధ్రా ప్రజలు ఆలోచిస్తారు అనేవారు. కాంగ్రెస్ రాజకీయాలకేకాదు, వామపక్ష రాజకీయాలకు కూడ విజయవాడే కేంద్రంగా వుండేది. మధ్యాంధ్రా నాయకులే కాక, ఉత్తరాంధ్ర, దక్షణాంధ్రా , రాయలసీమకు చెందిన వారు సహితం విజయవాడ కేంద్రంగానే పనిచేసేవారు. నీలం సంజీవ రెడ్డిది రాయలసీమ, పుచ్చలపల్లి సుందరయ్యగారిది దక్షణాంధ్రా, గౌతులచ్చన్నగారిది ఉత్తరాంధ్ర. అయినా వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా సాగేవి. ఈ ప్రాంతానికే చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు, ఎన్ జి రంగా, చండ్ర రాజేశ్వరరావు వంటి ఉద్దండులు ఎలాగూ వున్నారు.
ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి తెలుగువాళ్ళు విడిపోవాలనే ఆలోచనలు (1930లలో) మొదలయినపుడు రాయలసీమ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాము మదరాసు రాష్ట్రంలోనే వుంటామన్నారు. ఇప్పటి వరకు తాము దక్షణాదివారి ఆధిపత్యాన్ని చూస్తున్నామనీ, ఇకముందు ఉత్తరాదివారి ఆధిపత్యాన్ని చూడాల్సి వస్తుందని కడప కోటి రెడ్డి అన్నారు. మదరాసు నుండి విడిపోవడం అనివార్యమయితే, ఆంధ్రా ప్రాంతం నుండి కూడా విడిపోవడం మేలుకదా అని పప్పూరి రామాచార్యులు అన్నారు. రాయలసీమ ప్రాంతం విడిగా ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే వాదన ముందుకు వచ్చింది.
ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు చొరవ తీసుకుని మదరాసులోని తన నివాసం శ్రీభాగ్ లో రాయలసీమ, కృష్ణా గుంటూరు, నెల్లూరు జిల్లాల ప్రముఖ నాయకుల్ని కూర్చోబెట్టి కాస్సేపు సంభాషించుకోమన్నారు. ఆ సంభాషణ నుండి పుట్టిందే శ్రీభాగ్ ఒప్పందం. ఆ తరువాత పప్పూరి రామాచార్యులు, కడప కోటిరెడ్డిని విజయవాడ నగర వీధుల్లో ఏనుగు అంబారీల మీద ఊరేగించి సన్మానించారు.
ఆంధ్రా-తెలంగాణ కలుస్తున్నప్పుడూ ఇలాంటి వివాదమే తలెత్తింది. ఆంధ్రా ప్రాంతంతో కలవడానికి తెలంగాణ నాయకుడు కేవి రంగా రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా వుండగా అయ్యదేవర కాళేశ్వర రావు చొరవ తీసుకుని కేవి రంగా రెడ్డి డెబ్భయ్యవ పుట్టిన రోజు వేడుకల్ని విజయవాడలో ఘనంగా జరిపించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మహత్తర ఘట్టలుగా భావించే ఉక్కు ఫ్యాక్టరీ, జైఆంధ్రా ఉద్యమాల కేంద్రం కూడ విజయవాడయే.
ఇప్పుడయితే శాసన రాజధాని, పాలన రాజధాని, న్యాయ రాజధాని అని చర్చలు జరుగుతున్నాయిగానీ అప్పటి దృక్పధాలు వేరు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ రాజకీయ రాజధానిగా విజయవాడయే కొనసాగింది. ఆ తరువాత వచ్చిన నక్సలైట్ ఉద్యమ నిర్మాతలు, (కొండపల్లి సీతారామయ్య- కేజి సత్యమూర్తి), కాంగ్రెస్ కు పోటీగా ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టి వ్యవస్థాపకులు (ఎన్ టి రామారావు) పుట్టినిల్లు కృష్ణా జిల్లాయే.
కాంగ్రెస్- కమ్యూనిస్టులనేది ప్రధాన స్రవంతి రాజకీయాల విభజన మాత్రమే. విజయవాడలో ఉపస్రవంతి రాజకీయాలు అనేకం వుండేవి. నక్సలైట్లలోనే ఓ అరడజను గ్రూపులు పనిచేస్తుండేవి. బయటి ప్రపంచానికి అంతగా తెలీని ఎంఎన్ రాయ్, అన్వర్ హోక్సా, కౌట్స్కీలకు కూడ విజయవాడలో అభిమానులు వుండేవారు. అనేక నాస్తిక, హేతువాద సంఘాలు పని చేస్తుండేవి. లిన్ పియావో మార్కు దుందుడుకు హింసావాదులు, గాంధీ మార్కు అహింసావాదులు తారసపడేవారు. అనేక అంశాల మీద వాళ్ళంతా ఒకే వేదికల మీద కనిపించేవారు. ఎవరి అభిప్రాయాన్ని వారు చెప్పుకునేవారు. ప్రజా సమస్యల మీద కలిసి పనిచేసేవారు.
ఇదంతా గతం. విభిన్న అభిప్రాయాలు విద్వేషాలుగా మారిపోయాయి. భావోద్వేగాలు భావోద్రేకాలుగా మారిపోయాయి. పేరుకన్నా ముందు కులం అడుగుతున్నారు. కులం పేరు చెపితే చాలు రాజకీయాభిమానాన్ని అంటగట్టేస్తున్నారు. “నీ కులం ఏమిటో చెప్పు; గత ఎన్నికల్లో నువ్వు ఎవరికీ ఓటేశావో చెప్పేస్తా. నీ అభిమాన రాజకీయపార్టి ఏదో చెప్పు నీ కులం ఏదో చెప్పేస్తా. అసలు నీ అభిమాన సినిమా హీరో ఎవరో చెప్పు చాలు; నీ జాతకం మొత్తం చెప్పేస్తా” అంటున్నారు. కరోనా భౌతిక దూరాన్ని పెంచడానికి ముందే ఆంధ్రా సమాజం బౌధ్ధిక దూరాన్ని పెంచేసింది. నలుగురు కూర్చోని మాట్లాడుకోవడం ఒక సుదూర కలగా మారిపోయింది.
ఇంతటి సామాజిక విధ్వంసానికి కారణం ఎవరూ? అనేది అనవసర ప్రశ్న ఏమీకాదుగానీ దానికి సమాధానం కోసం సుదీర్ఘ పరిశోధనలు జరపాలి. మనం కూర్చోని మాట్లాడుకోలేమా? అన్నది అంతకన్నా అవసరమైన ఆచరణాత్మక ప్రశ్న అవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం వాసిరెడ్డి వేంకట కృష్ణారావు.
కృష్ణారావు గుంటూరు జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టారు. వామపక్ష వాతావరణంలో పెరిగారు. భారత సైన్యంలో పనిచేశారు. బయటికి వచ్చాక చారు మజుందార్ మీద అభిమానంతో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని పీపుల్స్ వార్ లో పనిచేశారు. కృష్ణాజిల్లాలో పీపుల్స్ వార్ కు పునాదులు వేసింది ఆయనే. ఆ తరువాత వినోద్ మిశ్రా నాయకత్వంలోని ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ లో పనిచేశారు. హింద్ మజ్దూర్ కిసాన్ పంచాయత్ కార్మిక సంఘం ద్వార జార్జి ఫెర్నాండేజ్ కు సన్నిహితులుగా మారారు. జార్జి ఫెర్నాండేజ్, నితీష్ కుమార్ జనతాదళ్ నుండి బయటికి వచ్చి కొత్తగా ఏర్పరచిన సమతా పార్టీలో పనిచేశారు. వాజ్ పాయి ప్రధానిగా వున్న కాలంలో సమతా పార్టి ఎన్డీఏలో సభ్యసంస్థగావుంది. అప్పుడు కృష్ణారావు సమతా పార్టీకి జాతీయ అధ్యక్షులు.
ఒక చిన్న గ్రామం నుండి వచ్చి ఒక పార్లమెంటరీ పార్టికి జాతీయ నాయకునిగా ఎదగడం గొప్ప విషయమే అయినప్పటికీ కృష్ణారావు గురించి చెప్పుకోవడానికి అంతకన్నా మహత్తర విషయాలు అనేకం వున్నాయి. రాజకీయ పార్టీలతో సంబంధంలేకుండ తన చుట్టూ వున్న ప్రతి ఒక్కరి మేలును వారు కోరుకుంటారు. గ్రామంలో జరిగే చిన్న విషయాల దగ్గర నుండి అంతర్జాతీయంగా జరిగే పెద్ద విషయాల వరకు ప్రతిదాన్నీ ఆయన పట్టించుకుంటారు. ఆయనొక ‘గ్లోబల్ గ్రామీణుడు’. 1970ల నుండి ఓ నాలుగేళ్ళ క్రితం వరకు విజయవాడలో ఆయన పట్టించుకోని సమస్య లేదంటే అతిశయోక్తికాదు. వయసు ఎనభైవ పడిలో పడినా వారు సామాజిక బాధ్యతను వదలలేదు. ఆరేళ్ళుగా జనవరి నెలలో సంక్రాంతికి ముందు వచ్చే శనివారం విజయవాడలో ఒక ఆత్మీయ సదస్సును నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయా పార్టీలన్నింటి ప్రతినిధుల్నిమాత్రమేగాక, వివిధ ప్రాంతాల్లో సాగుతున్న ప్రజాందోళనల నాయకులందర్ని ఆహ్వానిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ మాత్రమేకాదు ఒక గ్రే స్పేస్ కూడా వుండాలని బలమైన సంకేతాలు ఇస్తున్నారు. ఇది ఇప్పటి చారిత్రక అవసరం. విజయవాడలో మరీ అవసరం. ఈసారి ‘వివి కృష్ణారావు ఆత్మీయ కలయిక’ జనవరి 8 సాయంత్రం విజయవాడ మొగల్రాజపురంలోని సిధ్ధార్ధ కళాశాల ఆడిటోరియంలో జరుగుతోంది. రాజకీయ విబేధాల్ని, కుల పంచాయితుల్ని పక్కన పెట్టి మాట్లాడుకుందాం రండి.
4 జనవరి 2022
8 జనవరి 2022
https://www.andhrajyothy.com/telugunews/vasireddy-venkata-krishna-rao-ngts-editorial-1922010812423558
No comments:
Post a Comment