Friday, 28 January 2022

How does the Indian media dealing with Muslims?

How does the Indian media dealing with Muslims?

ముస్లింలతో భారత మీడియా ఎలా వ్యవహరిస్తోంది?  

 

జై మీమ్

జై భీమ్

లాల్ సలాం

 

సదస్సు అధ్యక్షులు జనాబ్ ……………………………………………  గారికీ,

 

మీడియా అవగాహన వర్క్ షాపు నిర్వాహకులు జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ శాఖ వారికీ,

 

సదస్సులో ప్రసంగించడానికి నన్ను ఆహ్వానించిన మిత్రుడు జీలానీకీ,

మీడియా అవగాహన వర్క్ షాపులో పాల్గొంటున్ సభ్యులకు,

ఇతర ఉపన్యాసకులకు

అందరికీ అభినందనలు.

 

మిత్రులారా

సమయం తక్కువగావున్న కారణంగా నేను నేరుగా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను.

 

1.            నిర్వాహకులు రోజు నాకు ఇచ్చిన అంశం  మీడియా ఎలా పనిచేస్తుంది? అనేది. ఈమాట వినగానే నేను కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాను. ఇంత పాత ప్రశ్న ఇంత చిన్న ప్రశ్న ఇచ్చారేమిటీ అనుకున్నాను. తరువాత నాకు సదస్సు నిర్వాహకుల  మనోగతం అర్ధం అయ్యింది. పాత ప్రశ్నలకు మనం కొత్త జవాబును వెతుక్కుంటున్నామన్నమాట.

2.            కాలం మారుతుంది. మారుతున్న కాలంలో నిర్వచనాలు, నేరేటివ్స్ అవగాహన అన్నీ మారిపోతుంటాయి. రెండవ ప్రపంచ యుధ్ధకాలంలోనూ తరువాత పాతికేళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక విలువలు గొప్పగా వికసించాయి. దశను అనేక మంది  రాజకీయార్ధిక పరిశీలకులుపెట్టుబడీదారీ స్వర్ణయుగంఅంటారు. అప్పట్లో మీడియా కూడా సహజంగానే ఉన్నత విలువలతో సాగింది.

3.            ఒక అంచనా ప్రకారం 1975 నుండి, ఇంకో అంచనా ప్రకారం 1992 నుండి అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడ్డాక, అనేక దేశాల్లో సంస్కరణల ద్వార సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశించాక     పెట్టుబడీదారీ వ్యవస్థలో పతన విలువలు, మృత సంస్కృతి  ఆరంభం అయ్యాయి.

4.            జర్మన్ ఆర్థికవేత్త వెర్నెర్ సోంబార్ట్ దశను Late capitalism లేదా late-stage capitalism అని నామకరణం చేశాడు

5.            మార్కెట్ ను విస్తరింప చేయడానికి, వాణిజ్య లాభాలను  విపరీతంగా పెంచుకోవడానికి పెట్టుబడీదారీ వ్యవస్థలో అనేక రకాల  అసంబధ్ధాలు, వికారాలు, అత్యాశలు, ప్రవేశించిన కాలం ఇది.

6.            ఈ దశలో మీడియా కూడ సమస్త పతన విలువల్ని సంతరించుకుంది. నేపథ్యంలో, మన ప్రశ్ననువృధ్ధ దశ పెట్టుబడీదారీ వ్యవస్థలో మీడియా ఎలా పనిచేస్తుంది?” అని మార్చుకోవచ్చు.

7.            ఇప్పుడు ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇదొక బ్రహ్మపదార్ధం. బయటివాళ్ళకేకాదు; మీడియాలో సుదీర్ఘ కాలం పెద్ద పెద్ద హోదాల్లో  పని చేసిన వారికి కూడ వృధ్ధదశ పెట్టుబడీదారీ వ్యవస్థలో మీడియా ప్రధాన కార్యకలాపం గురించి స్పష్టంగా తెలీదు.

8.            మనలో చాలా మందికి మీడియా రూపాల గురించి మాత్రమే తెలుసు. దాని సారం గురించి తెలీదు.

9.            సమర్ధులైన సంపాదకులు,  మెరికల్లాంటి రిపోర్టర్లు, ఆసక్తిగా చదివించే  కాపీ రాయగల న్యూస్ డెస్క్, అందంగా ముస్తాబు చేయగల లేవుట్ ఆర్టిస్టులు ఉంటే జనాదరణ పెరిగి మీడియా సంస్థలు వెలిగిపోతాయని చాలా మంది నమ్ముతుంటారు

10.        ఇలాంటి భ్రమలతో స్వంత మీడియా సంస్థల్ని నెలకొల్పి చేతులు, కాళ్ళే కాకుండ మొత్తం ఒళ్ళు కాల్చుకున్న ప్రముఖ సంపాదకులు చాలా మంది వున్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు భావ్యంకాదు. మీరే ఊహించుకో గలరు.

11.        శాసన, పాలన, న్యాయ వ్యవస్థల్ని ప్రజాస్వామిక భవనానికి మూడు మూల స్థంభాలని అంటుంటారురాజ్యాంగబధ్ధ వ్యవస్థలైన   మూడు స్థంభాలే సామాజిక బాధ్యతను నిస్సిగ్గుగా తిరస్కరిస్తున్న రోజులివి.

12.        నామ్ కే వాస్తే నాలుగో స్థభం అనిపించుకుంటున్న మీడియా సామాజిక బాధ్యతను నెరవేరుస్తుందని ఆశించడం చాలా కష్టం.  

13.        కొందరైతే ఇప్పటికీ మీడియాను స్వచ్చంద సేవాసంస్థ అనుకుంటుంటారు. నిజానికి మీడియా అనేది ఒక వాణిజ్య వ్యాపార సంస్థ. వాణిజ్యాన్నీమీడియానూ విడదీయలేం. అవి అవిభాజ్యాలు. భారత దేశంలో అతి పెద్ద కార్పొరేట్ సంస్థ, అతి పెద్ద మీడియా సంస్థ రెండూ ఒకరివే Reliance and Network18 Group.  

14.        రెండవ అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అయిన ఆదానీ గ్రూపు కూడ ఇప్పుడు మీడియారంగంలో కాలు మోపింది.

15.     మీడియా సంఘటనల్ని సృష్టించదనీ, జరిగే సంఘటనల్ని  కేవలం నివేదిస్తుందనీ, ఆయా సంఘటనల మీద తన అభిప్రాయాన్ని సంపాదకీయం రూపంలో సూచించి ఊరుకుంటుందని మనం గతంలో నమ్మేవాళ్ళం.

16.    మాంచెస్టర్ గార్డియన్ పత్రిక్కి చాలాకాలం ఎడిటర్ గా పని చేసిన సిపి స్కాట్ పత్రికల గురించి ఒక శతాబ్దం క్రితం ఒక ఉపదేశం చేశాడు.  “అభిప్రాయాలు స్వేచ్చాయుతమైనవి; కానీ వాస్తవాలు పవిత్రమైనవిఅన్నాడు. “Comment is free but the facts are sacred”.

17.    సరళీకృత ఆర్ధిక వ్యవస్థలో ఇలాంటి పవిత్ర ఆదేశాలు పనిచేయవు. మీడియా ఇప్పుడు తన రాకజీయార్ధిక సాంస్కృతిక ప్రయోజనాల కోసం తనేవాస్తవాలనుసృష్టిస్తున్నది. దీనినే పోస్ట్ ట్రూత్ అంటున్నారు. వాస్తవానంతర అని మనం తెలుగులో అర్ధం చెప్పుకోవచ్చు.

18.    అమెరికాతత్వవేత్త నోఅమ్ చోమ్స్కి మీడియా స్కాలర్ ఎడ్వర్డ్ హెర్మాన్ కలిసి  1988లో మీడియా మీద ‘Manufacturing Consent’ అనే పుస్తకాన్ని రాశారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు అనుకూలంగా మీడియా ఒకసమ్మతిని తయారు చేస్తుందిఅని అందులో వాళ్ళు వివరించారు.

19.    మీడియా ఇప్పుడు పాలకులకు అనుకూలంగా సమ్మతిని ఉత్పత్తి చేయడమేగాక, దానికోసం కుత్రిమ సంఘటనల్ని సృష్టిస్తున్నది. దీనికి గత ఏడాది మార్చ్ నాటిమర్కజ్ కోవిడ్ కేస్గొప్ప ఉదాహరణ.

20.     కోవిడ్ ను నియంత్రించడంలో భారత ప్రభుత్వం ఘోరంగా విఫలమయింది. ప్రభుత్వ నిర్లక్ష్య, నిర్లిప్త వైఖరి కారణంగా కోవిడ్ మన దేశంలో వేగంగా వ్యాపించింది. మూడున్నర కోట్ల మందికి సోకింది. నాలుగున్నర లక్షల మందిని  పొట్టనపెట్టుకుంది.

21.    కోవిడ్ వంటి విశ్వమారి విజృంభించినపుడు ప్రభుత్వాలు సహితం బిత్తరపోతాయి. అది నిజమే. కానీ, ప్రభుత్వ వైఫల్యాన్నీ కప్పిపుచ్చడానికీ,   నిందను దేశంలోని మైనారిటీ  సమూహాల మీదకు నెట్టి వేయడానికీ కొన్ని మీడియా సంస్థలు అతి నీచంగా బరి తెగించాయి.

22.    ముస్లిం ఛాందస సమూహం ఒకటి ముందు తమకు కరోనాను సోకించుకుని, తరువాత దేశవ్యాప్తంగా దాన్ని వ్యాపింపచేయడానికి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ ను కేంద్రంగా చేసుకుని కుట్ర చేశారనే  కథనాలను అవి  ప్రచారంలో పెట్టాయి.

23.    CAA, NPR, NRC సవరణ చట్టాలకు వ్యతిరేకంగా, మతసామరస్య  రాజ్యాంగ పరిరక్షణ కోసం కొనసాగుతున్న షాహీన్ బాగ్ ఉద్యమానికి మీడియా గ్రహణం కమ్మేసింది. 2020 మార్చి నెలలో మర్కజ్ లోవున్న   ముస్లింలనేగాక  దేశంలోవున్న మొత్తం ముస్లిం సమూహాలను    దోషులుగా చిత్రించి బోనులో నిలబెట్టింది అధికార మీడియా. “ముస్లింలకు నా దేశంలో చోటులేదుఅంటూ భారత రిపబ్లిక్ మీడియా పిచ్చికుక్కలా ఓవారం రోజులు మొరుగుతూనేవుంది.

24.    మర్కజ్ సమావేశం జరుగుతున్న కాలంలోనే దేశంలోని అనేక హిందూ ప్రముఖ దేవాలయాల ద్వారాలు తెరిచే వున్నాయి. నిత్యం వేలాదిమంది భక్తులు దర్శనం చేసుకుంటూనే వున్నారు. విషయం మీడియాకు స్పష్టంగా తెలుసు. మన మీడియను సెలెక్టివ్ మెమరీ లాస్ వెంటాడుతోంది.

25.    ఢిల్లీ హై కోర్టు 2020 డిసెంబరు 15 కేసును కొట్టివేసింది. మర్కజ్ లో అరెస్టు అయిన వారిలో ఒక్కరు కూడ కోవిడ్ సోకినవారు కాకపోవడం ఈకేసులో హైలైట్. వాళ్ళకు కోవిడ్ సోకిందని నిరూపించలేకపోయిన పరిశోధన బృందం వాళ్ళను కరోనా వైరస్సూపర్ స్ప్రెడర్లుగా ఎలా పేర్కొంటుంది అని ధర్మాసనం పోలీసుల్ని తప్పుపట్టింది. అయితే,  అప్పటికే ముస్లిం సమాజానికి జరగాల్సినంత   కీడు జరిగిపోయింది.

26.    Tablighi case: All foreigners freed, court slams police, says no proof. https://indianexpress.com/article/india/tablighi-case-all-foreigners-freed-court-slams-police-says-no-proof-7106554/

27.    మీడియాకు తరచూ ముస్లింలే ఎందుకు ఎరగా మారుతున్నారూ? అనేది మన ముందున్న ప్రశ్న. నేను గమనించిన ఒక కారణం ఏమంటే; ముస్లింలు స్థూలంగా మార్కెట్ కు వ్యతిరేకులు. ధోరణి ఇండియాలోనేగాక అత్యధిక  ముస్లిం దేశాల్లో కొనసాగుతోంది.

28.    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముస్లింలకు ఇచ్చిన హామీలను చూడండి. వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంక్, మద్యపాన నిషేధం. ఇవి రెండూ ప్రపంచ బ్యాంకు వ్యతిరేక విధానాలు. మార్కెట్ వ్యతిరేక విధానాలు.

29.    మీడియా మార్కెట్ కు ముద్దు బిడ్డ. అలా సహజంగానే అది యాంటీ ముస్లిం.

30.    ఇప్పుడు నేను మీడియా ఎలా పనిచేస్తుందనే ప్రశ్నను కొంచెం సాగదీస్తూ మీడియా దేనిని ఉత్పత్తి చేస్తుందనే అంశానికి వస్తాను.   ప్రశ్నకు మీలో ఎక్కువమంది మీడియా వార్తల్ని వండివార్చుతుందని చెపుతారని నాకు తెలుసు. కానీ సమాధానం తప్పు

31.    వార్తల్ని వండివార్చడం అనేది మీడియాకు ఒక మాధ్యమం మాత్రమే. గమనం మాత్రమే. దాని గమ్యం వేరు.  మర్కజ్ ను అప్రదిష్ట పాలుచేయడం మీడియా లక్ష్యంకాదు. అది మాధ్యమం మాత్రమే. తద్వార ముస్లిం వ్యతిరేకుల్ని తన పాఠకులుగానో, వీక్షకులుగానో సమీకరించడం మీడియా లక్ష్యం.

32.    మీడియా లక్ష్యం పాఠకుల్ని, వీక్షకుల్ని సమీకరించడం.  ఇదే దాని అసలు ఉత్పత్తి

33.    మీకు ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే, పాఠకులు, ప్రేక్షకులు మీడియాకు ఒక్క పైసా కూడ చెల్లించరు.  అయినప్పటికీ పాఠకులు, ప్రేక్షకులు పెరిగే కొద్దీ మీడియా లాభాలు పెరుగుతాయి. అదే మీడియా ట్రేడ్ లో మాయా.

34.    మనం పత్రికలు కొని చదువుతున్నాముకదా, టీవీలకు చార్జీలు చెల్లిస్తున్నాముకదా అని మీలో కొందరు అడగవచ్చు. మీ వైపు నుండి చూస్తే ఆమాట నిజమేగానీ అందులో మీడియా సంస్థలకు చేరేది చాలా తక్కువ, ఈనాడున్న ప్రధాన స్రవంతి  దినపత్రికల్ని అచ్చు వేసి మీ దగ్గరికి చేర్చడానికి ఒక్కోక్క కాపీకి 30 నుండి 40 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అందులో  మనం చెల్లించేది ఆరవ వంతు కూడ కాదు. టీవీ న్యూస్ ఛానళ్ళకు అయితే ప్రేక్షకుల నుండి ఆమాత్రం కూడ చేరదు.

35.    మరి మీడియా సంస్థలకు లాభాలు ఎలా వస్తాయీ? అనేది సందర్భంగా ఎవరికయినా రావల్సిన సందేహం.

36.    తాము  పోగేసిన పాఠకులు, ప్రేక్షకుల్ని మీడియా సంస్థలు వాణిజ్య సంస్థలకూ, రాజకీయ పార్టీలకు గంపగుత్తగా అమ్ముకుంటాయి. దాని కోసం కార్పొరేట్లు,  రాజకీయ పార్టీలు మీడియా సేవలకు గానూ వాణిజ్య ప్రకటనల రూపంలోనో,  నగదు రూపంలోనో, వివిధ మేళ్ళు రూపంలోనో భారీ మొత్తాన్ని చెల్లిస్తాయి. అలా మీడియా సంస్థలకు లాభాలు వస్తాయి.

37.    పచ్చిగా చెప్పాలంటే మీడియా అంటే కార్పొరేట్లు,  రాజకీయ పార్టీలకు పాఠకులు, ప్రేక్షకుల్ని  సరఫరా చేసే సంస్థ అన్నమాట.  దీన్ని మీరు సప్లయర్ అనిగాక బ్రోకర్ అనుకున్నా తప్పుకాదు. లేబర్ బ్రోకర్స్ లా, వ్యూయర్స్ బ్రోకర్స్, రీడర్స్ బ్రోకర్స్ అన్నమాట.

38.    నా మిత్రులు, సీనియర్ జర్నలిస్టు తోట భావ్నారాయణ 2005లోటెలివిజన్ జర్నలిజంఅనే పుస్తకాన్నీ ప్రచురించారు. అందులో తొలి వాక్యం ఏమిటో తెలుసా? “వాణిజ్య ప్రకటనలకు ప్రేక్షకుల్ని సమకూర్చిపెట్టడం టీవీ ఛానల్స్ పని”.

39.    వార్తల మధ్యలో కమ్మర్షియల్ యాడ్స్ వస్తున్నాయని మనం అనుకుంటూ వుంటాం. నిజం అదికాదు; కమ్మర్షియల్ యాడ్స్ ను చూపించడం కోసమే  వాటికి అటూ ఇటూ వార్తల్ని నింపుతారు.

40.    వార్తల స్వభావాన్ని కమ్మర్షియల్ యాడ్స్ నిర్ణయిస్తుంటాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే కమ్మర్షియల్ యాడ్స్ ను ఆకర్షించే వార్తల్నే మీడియా ప్రచురిస్తుందిమార్కెట్ లో ఉత్సాహాన్ని నింపేవార్తల్నే మీడియా ప్రచారం చేస్తుంది.

41.    మీడియా సంస్థలు, కార్పొరేట్లు, రాజకీయ పార్టిలు, పాఠకులు - ప్రేక్షకులుశ్రోతలు ఇదంతా ఒక వృత్తం. మొత్తం చైన్ లో ముస్లింలు ఎక్కడా? ఇదొక కీలకమైన ప్రశ్న.

42.    ముస్లింలు మీడియా సంస్థల ప్రమోటర్లుకారు. కార్పొరేట్లుకారు. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు కారు. చివరకు వాళ్ళు పాఠకులు -ప్రేక్షకులుశ్రోతలు కూడ కారు.

43.    ముస్లింలు టీవీలు చూడరాదనీ సంగీతం వినడానికి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లను ఉపయోగించరాదని పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని ఒక ముస్లిం ధార్మీక సంస్థ ఆదేశించింది. నిబంధనను వుల్లంఘించిన వారి మీద వెయ్యి రూపాయల జుర్మానా విధిస్తూ గత ఏడాది ఆగస్టు 9 ఒక ఫత్వా జారీ చేసింది

44.    ముస్లింలు మీడియాను బహిష్కరిస్తే మీడియా ముస్లింలను బహిష్కరిస్తుంది. మీడియాను తామే బహిష్కరించీ, మీడియా తమను బహిష్కరించిందని వాపోయే ముస్లింలు నాకు తరచూ తారసపడుతుంటారు.

45.    ముస్లింలు ముందు మీడియాకు పాఠకులుగానో, వీక్షకులుగానో మారాలి. ఇది తొలి అడుగు. తరువాత మలి అడుగుగా స్వంత మీడియా  గురించి ఆలోచనలు చేయవచ్చు.

46.    ఇప్పటి పోటీ ప్రపంచంలో మీడియా సంస్థను ఆర్ధికంగా లాభసాటిగా మార్చాలంటే కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. పెట్టుబడి ఒక్కటే సరిపోదు; కోట్ల సంఖ్యలో పాఠకులు,  వీక్షకులు కావాలి.  పైగా, అంతటి పెట్టుబడి పెట్టిన తరువాత వాణిజ్య నియమాలను పాటించాల్సి వుంటుంది. దానితో, మీడియా సంస్థల పాలసీ మారిపోతుంది.

47.    ముస్లింలకు సంబంధించి భాష మాధ్యమం  ఒక పెద్ద సమస్య. తెలుగులో మాట్లాడితే సగం మందికి అర్ధంకాదు ఉర్దూలో మాట్లాడితే ఇంకో సగం మందికి అర్ధంకాదు. విద్యావంతులు తక్కువ కనుక ఇంగ్లీషు మాధ్యమం కూడ పనికి రాదు.

48.    ఉత్తర భారత దేశంలో హిందీ-ఉర్దూ కలిసి హిందూస్తానీ రూపంలో  ఒక ఉమ్మడి భాష ఏర్పడి సమస్యను పరిష్కరించింది. దక్షణాది రాష్ట్రాల్లో తమిళనాడు ముస్లింలు తమిళాన్నీ, కేరళ ముస్లింలు మళయాళాన్నీ స్వతం చేసుకుని భాషా సమస్యను పరిష్కారం చేసుకున్నారు.

49.  తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు కమ్యూనికేషన్   సమస్య చాలా తీవ్రంగా వుంది నిజాం సంస్థానంలో వాడే దహఖనీ ఉర్దూ ఆంధ్రాప్రాంతం వారికి అర్ధం కాదు. అలాగే, ఆంధ్రా ప్రాంతంలో  అభివృధ్ధి చెందిన  ఉర్దూ యాస మీద తెలంగాణ  ప్రాంతంలో చిన్న చూపువుందిముస్లిం ఆలోచనాపరులు  ప్రత్యేక చొరవను ప్రదర్శించి ముందుగా  కమ్యూనికేషన్  భాషా  సమస్యను  పరిష్కరించాలి.

50.    ముస్లింలు భాషా సమస్యను పరిష్కరించుకోనంతవరకు మీడియా సమస్యకు పరిష్కారం దొరకదు

51.    మీడియాను ఈమధ్య అందంగా ఇన్ఫోటైన్మెంట్ అంటున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ కూడ ఎంటర్ టైన్మెంట్ గా మారిపోయిన కారణంగా మీడియా అంటే టోటల్ ఎంటర్ టైన్మెంట్ అనే నేరేటివ్ స్థిరపడిపోయింది.  

52.    మీడియా ఇప్పుడు కార్పొరేట్లు, యజమాని కులాలు, మెజారిటీ మత సమూహాలకు వినోదాన్ని పంచడమే తన కార్యకలాపంగా కర్తవ్యంగా మార్చుకుంది.

53.    ప్రధాన స్రవంతి మీడియా పూర్తిగా అన్ సోషల్ గా మారిపోయాక, కొన్నాళ్ళ క్రితం సోషల్ మీడియా ముందుకు వచ్చింది.

54.    స్వల్ప పెట్టుబడితో యూట్యూబ్ ఛానల్  వంటి సోషల్ మీడియాను నెలకొల్పే అవకాశాలు ఇప్పుడు పెరిగాయి.  అయితే, సామాజిక వాతావరణమే అసహనంతో కలుషితమయి పోతున్నప్పుడు సోషల్ మీడియాలోనూ ముస్లింలు రాబట్టగల ఫలితాలు తక్కువే.

55.    హలీం ఎలా తయారు చేయాలీ? మటన్ దమ్ బిర్యాని ఎలా వండాలి? వంటి అంశాల మీద కుకింగ్ వీడియోలు తీసి అప్  లోడ్ చేయండి. లక్ష్లల మంది చూస్తారు. ఆదాయమూ  వస్తుంది. కానీ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముస్లింల మీద సాగుతున్న వివక్ష, అణిచివేతల మీద వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తే వ్యూస్ రావు. నిజం చెప్పాలంటే వాటిని ముస్లింలే చూడరు.  

56.    ముస్లిం సమాజంలోని పాఠకులు, ప్రేక్షకుల్ని వినోదం నుండి సామాజిక అంశాల మీదికి దృష్టిని మళ్ళించాలంటే అనేక సామాజిక ఉద్యమాలు జరగాలి. వాటిల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి

57.     ప్రధాన  స్రవంతి  మీడియాలో ముస్లిం ఆలోచనాపరులు కొందరు చేరితే వాళ్ళ రాతలవల్ల సమాజంలో అసహన వాతావరణం కొంతయిన తగ్గుతుందనే ఆశ ఒకటి కొన్నాళ్ళ క్రితం వుండేది.

58.     అపట్లో మీడియాలో బ్లాక్ అండ్ వైట్ తో పాటు  గ్రే ఏరియా కూడ కొంత వుండేది. కొంత ఉదారత్వం వుండేది. ఇప్పుడు వాటికి తావులేదు.

59.    ఆర్ధిక వర్గాల పరంగా, మతపరంగా, రాజకీయపార్టీల పరంగా మీడియాలో ఇప్పుడు లోతైన  సమీకరణ జరిగిపోయింది. భిన్నత్వానికి అవకాశమే లేదు.

60.     మీడియా సంపాదకుల్లో ఉదార, సామ్యవాద, సౌమ్యవాద,  మతసామరస్య భావాలు కలిగినవాళ్ళు కొందరు కనిపిస్తారు. అయితే, సామాజిక అంశాలమీద వీరి ఆలోచనలకూ,  వీరు పనిచేసే మీడియా సంస్థలు ప్రచారంచేసే అభిప్రాయాలకూ పొంతనే  వుండదు

61.    మీడియా సంస్థల్లో ఇప్పుడు సిఇఓలదే ఆధిపత్యం. సంపాదకుల పాత్ర  ప్రూఫ్ రీడింగుకే ప్రిమితం. కావాలంటే, వాళ్ళను మర్యాదపూర్వకంగా Glorified proof readers అనుకోవచ్చు.

62.    మీడియాకు డబ్బు ఆశపెరిగింది. ఒక రకంగాకాదు పది రకాలుగా దానికి డబ్బు కావాలి. ముస్లింలను బూచీలుగా చూపి ప్రేక్షకుల్ని, పాఠకుల్ని పెంచుకుని డబ్బు చేసుకుంటుంది. మరోవైపు  సంఘపరివారానికి చెందిన ప్రధానిని జాతి రక్షకునిగా ప్రచారం చేసి ఇంకో రకంగా డబ్బు చేసుకుంటుంది. తమకు మేళ్ళు చేకూరుస్తున్న ప్రధానిని అవతారపురుషునిగా చిత్రించే మీడియాను కార్పొరేట్లు ప్రోత్సహిస్తాయి.

63.    ముస్లింలు పని చేసినా దానికి జిహాద్ అనే పదాన్ని చేర్చడం మీడియాకు ఒక అలవాటుగా మారిపోయింది. ముస్లింలు ప్రేమిస్తే లవ్  జిహాద్, వ్యాపారంలో రాణిస్తే ఎకనామిక్స్ జిహాద్, భూమి కొంటే జమీన్ జిహాద్,  బాగా చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టాపర్ గా నిలిస్తే నౌకరీ జిహాద్. ఇలా సాగుతోంది వరస.

64.    నిజానికి రోజూ భారత మీడియా ముస్లింల మీద అసలు సిసలు న్యూస్ జిహాద్ సాగిస్తోంది.

65.    జర్నలిస్ట్ జైనబ్ సికందర్ గత ఏడాది ఏప్రిల్ 13 ప్రింట్పత్రికలో రాసిన వ్యాసంలో   “Indian media is waging a holy war against Muslims. It acts like hyenas” అని రాసింది.  వాక్యాలు కటువుగా వున్నప్పటికీ ఇది వాస్తవం.

66.    మిత్రులారా? మీడియా  ఎలా  పనిచేస్తున్నదో తెలుసుకుంటే చాలదు. మీడియాతో ఎలా పని చేయుంచుకోవాలీ? మీడియాను ముస్లిం ఫ్రెండ్లీగా ఎలా మలుచుకోవాలీ? అనేది  ఆలోచించాలి.

67.    దీనికి సమాధానం మీడియాలో దొరకదు. దీనికి సమాధానం కోసం మనం సమాజంలో వెతకాలి.

68.    మిత్రులారా! వర్తమాన భారత దేశంలో అత్యధిక వివక్షను, అణిచివేతను అనుభవిస్తున్న సమూహం ముస్లింలు. అయితే, దేశంలో  వివక్షను, అణిచివేతను అనుభవిస్తున్న సమూహాలు ఇంకా అనేకం వున్నాయి. వాళ్ళతో కలిసి ఒక విశాల వేదికను ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ముస్లీంల ఉనికి గుర్తింపును పొందుతుంది.

69.    దీనినే నేను కొంతకాలంగా లాల్, నీల్, హర్యాలీ ఏక్తా అంటున్నాను. ముందు ఈ సమూహాల మధ్య ఐక్యత ఏర్పడాలి. అది రాజకీయ ఐక్యతగా ఎదగాలి.

70.    అప్పుడు మీడియాలో అయినా, రాజకీయార్ధిక రంగాలలో అయినా  ముస్లిం సమాజానికి పర్చేజింగ్ కెపాసిటీ, బార్గైనింగ్ కెపాసిటీలు వస్తాయి.

 

మీరంద్రూ దిశగా ఆలోచిస్తారని ఆశిస్తాను.

నా ఉపన్యాసాన్ని విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.

 

విజయవాడ 17-12-2021 శుక్రవారం.

 

 

డియర్ స్కైబాబా! నేను నాలుగు నెలల క్రితం చేసిన ఉపన్యాసం ఇది. దీన్నీ ఎక్కడా ప్రచురించలేదు. చమన్ పత్రికలో ప్రచురించవచ్చు.

నేను కొన్ని రోజులు ఆగి జగన్ – ముస్లింలు అనే అంశం మీద కూడ ఒక వ్యాసం రాసి పంపుతాను.

-         డానీ.

ప్రచురణకు ఎక్కడా ఇవ్వను. భవిష్యత్తులో ఒక పుస్తకంగా వేస్తాను.