సాహిత్యంలో 'ఇస్లాంవాదం' మంచి ప్రయోగం కాదు.
కరీముల్లా గొప్ప వ్యక్తీకరణ గల మంచి కవి. అయితే, తన కవిత్వానికి 'ఇస్లాంవాదం' అని పేరు పెట్టడం నాకు మొదటి నుండీ ఇష్టం లేదు. నామకరణాల (nomenclature) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాహిత్యంలో మత ప్రతీకలు వుంటాయి. శ్రీశ్రీ మహాప్రస్తానంలో హిందూ ప్రతీకలు అనేకం మనకు కనిపిస్తాయి. కమ్యూనిస్టు భావాల్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి హిందూ సమాజంలో బాగా ప్రచారంలోవున్న ప్రతీకల్ని శ్రీశ్రీ విరివిగా వాడాడు. అయితే, శ్రీశ్రీ కవిత్వం హిందూవాదం కాదు. అది హిందూవాద కవిత్వం అని ఆయనా చెప్పుకోలేదు.
ఉర్దూ కవులు అనేకులు ఇస్లాం ప్రతీకల్ని వుపయోగించారు. ప్రముఖ కమ్యూనిస్టులు అయిన ఫైజ్ అహ్మద్ ఫైజ్, మఖ్ధుం మొహియుద్దీన్ కవిర్తల్లోనూ ఇస్లాం ప్రతీకలు అనేకం వుంటాయి. అయితే, వాళ్ళ కవిత్వం ఇస్లాంవాదం కాదు. అది ఇస్లాంవాద కవిత్వం అని వాళ్ళూ చెప్పుకోలేదు.
వీర్ సావర్కార్, కేబి హెగ్డేవార్, ఎంఎస్ గోల్వాల్కర్ ల వారసత్వంలో భారత రాజకీయాల్లో హిందూవాదం పెరిగింది. రాజ్యాధికారాన్ని సాధించే సిధ్ధాంతాన్నే వాదం (ism) అంటారు. ఇది రాజకీయ ప్రత్యయం.
కరీముల్లా ఓ పదిహేనేళ్ళ క్రితం తన కవిత్వం 'ఇస్లాంవాదం' అని ప్రకటించుకున్నారు. చాలామంది కవులు కళాకారులకు మతానికీ, మతతత్వానికీ తేడా తెలీదు. హిందువు వేరు; హిందూవాదం వేరు. ఇస్లాం వేరు; ఇస్లాం వాదం వేరు. హిందూవాదమన్నా హిందూ మతతత్వమన్నా అర్ధం ఒకటే అయినట్టు, ఇస్లాంవాదమన్నా, ఇస్లాం మతతత్వమన్నా అర్ధం ఒక్కటే. కొందరు తెలియక చేసే ఇలాంటి అపభ్రంశ ప్రయోగాల వల్ల హిందూవాదానికి ఆమోదాంశం పెరిగి ముస్లిం సమాజానికి మరింత చేటు చేస్తుంది. ఒకరు మతం మాటున రాజకీయం చేస్తుంటే, మరొకరు సాహిత్యం మాటున మతప్రచారం చేస్తున్నారు. ఏది ఒప్పు? ఏది తప్పు?
నిజానికి 'ముస్లింవాదం' అనేది కూడ మంచి వ్యక్తీకరణకాదు. దానికి బదులుగా మైనారిటీవాదం, మత అల్పసంఖ్యాకుల వాదం అనడం మంచిది. ఎస్సీలు దళితవాదం అనే పేరు పెట్టుకున్నట్టు తాము ముస్లింవాదం అనే పేరును ఖరారు చేసుకున్నట్టు కొందరు అంటుంటారు. ఈ వాదన సరైనది కాదు. దళిత అనేది అణగారిన సమూహం అనే అర్ధంవున్న సామాజిక ప్రత్యయం. ముస్లిం అనేది ఇస్లాంను అనుసరించేవారు మరియూ వారి సంతతి అనే అర్ధం వున్న మత ప్రత్యయం. ఆధునిక సాహిత్యం ఒక సామాజిక సిధ్ధాంతాన్ని ప్రచారం చేయాలిగానీ ఒక మతాన్ని ప్రచారం చేయకూడదు.
హిందూవాదం (నయామనువాదం)కు విరుగుడు మతసామరస్యం మాత్రమే. షాహీన్ బాగ్ ఉద్యమం ఈ నినాదం నుండే పుట్టింది. ఇంకా పాత వాదనలు చేయడం సమంజసంకాదు.
వర్తమాన భారత సమాజంలో అంతరించిపోయే ముప్పు
(Extinction Crisis)ను తీవ్రంగా ఎదుర్కొంటున్న సమూహం ముస్లింలు. వాళ్ళు నిస్పృహతో
మతవాదాన్ని ముందుకు తెస్తే ప్రత్యర్ధులు తలపెట్టిన హననాన్ని తామే ఆహ్వానించినవాళ్ళవుతారు.
వాళ్ళు ఎంత వీరావేశంతో మాట్లాడినా చివరకు అవన్నీ ప్రత్యర్ధిని తమ సమూహం మీదికి
ఉసిగొల్పుకునే (agent provocateur) చర్యలుగా మిగిలిపోతాయి.
మతసామరస్య భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, సర్వధర్మ ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని రక్షించుకోవడం ఒక్కటే
భారత ముస్లిం సాహిత్యకారులు, కళాకారులు, ఆలోచనాపరుల లక్ష్యం కావాలి.
డానీ
22 మార్చి 2022
No comments:
Post a Comment