Saturday, 30 April 2022

May Day - Hopes! Aspirations !

 మే డే ఎన్నీ ఆశలు ! ఏన్ని ఆశయాలు!

 

ఇప్పుడు రంజాన్ నెల గాబట్టి  ఉదయం నాలుగు గంటలకు ముందే లేస్తున్నాను. ఆ రోజుల్లో కూడ మేడే రోజు మేమంతా నాలుగు గంటలకు ముందే లేచేవాళ్ళం. 

మేడే శ్రామికుల దీక్షా దినం. విజయవాడ నగరంలో కనీసం పది సెంటర్లలో ఎర్రజెండ ఎగరేసి దీక్షబూనేవాళ్ళం. రిక్షాపుల్లర్లు, ఆటోడ్రైవర్లు, మెకానిక్కులు, రైల్వే వర్కర్లు,  హాకర్లు, కాలేజి విద్యార్ధులు ఒక్కో సెంటర్లో ఒక్కో సమూహం. అందరూ సమసమాజాన్ని సాధిస్తామని ప్రతిజ్ఞ చేయడం గొప్ప భావోద్వేగ సమయం. 

విజయవాడ నగరంలో కమ్యూనిస్టు కాదంటే అప్పట్లో  చాలా నామోషిగా వుండేది. ఇప్పుడు కమ్యూనిస్టు అంటే అంతకన్నా నామోషీగా వుంటున్నది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి సాయుధపోరాట పంథాను వదిలి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను ఎంచుకున్నాక కమ్యూనిస్టు అభిమానులు అనేక  వ్యాపారాల్లోనికి విస్తరించారు. మదరాసు వెళ్ళిన వాళ్లు సినిమాల్లోని వివిధ విభాగాల్లో చేరారు. కథ శ్రామికులది అయినా కాకపోయినా వీరికున్న పాత వాసనల కారణంగా ఆ సినిమాలో ఓ శ్రామిక పాటైనా వుండేది. అప్పుడది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్మూలాగా వుండేది.  నక్సలైట్ల ఉద్యమం బలంగా వున్న రోజుల్లోనూ అనేక సినిమాల్లో  ఆ ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపించేది. ఇప్పుడు ఉగ్ర జాతీయవాదం రాజకీయాలను ఏలుతున్నట్టు సినిమాల్లోనూ బాక్సాఫీసు సక్సెస్ ఫార్మూలాగా మారింది. ఎర్రజెండాను  కిందికి దించి కాషాయ జెండాను ఎగురేస్తూ పాన్ ఇండియా సినిమా కథలు అల్లుతున్నారు.     

అణగారిన సమూహాలకు ఎవరి సమస్యలు వారికి వుంటాయి. ప్రతి సమస్యా ప్రత్యేకమైనదే. సమసమాజం ఏర్పడితే అందరి సమస్యలు సమసిపోతాయనేది అందరి నమ్మకం. కొందరు ఆర్ధిక పీడన పోతుందనికునేవారు. కొందరు సాంస్కృతిక పీడన పోతుందనుకునేవారు. కొందరు కుల పీడన పోతుందనుకునేవారు. మరికొందరు మతపీడన పోతుందనుకునేవారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పీడన పోతుందని తమకుతామే అనుకునేవారు. ఇంతటి సమగ్ర దృష్టి ఆనాటి కమ్యూనిస్టు నాయకత్వానికి వుండిందనుకోవడమూ కష్టమే. 

నేను మత పీడితుడ్ని.  మత పీడన సమసిపోతుందనే ఆశతోనే నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాను. అందరి పీడనల్ని అంతం చేసేది కమ్యూనిస్టు పార్టీలే అని చాలా గట్టిగా నమ్మిన రోజులవి. అప్పుడది సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటి (సివోసి). ఆ తరువాత సివోసి రద్దు అయ్యి మరికొన్ని గ్రూపులతో కలిసి  ‘పీపుల్స్ వార్’ ఆవిర్భవించింది. కొండపల్లి సీతారామయ్య అధినేత. కేజి సత్యమూర్తి, ఐవి సాంబశివరావులు మా అగ్ర నేతలు. 

ఈ భూమి మీద కోట్ల మంది శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలంటే మేము కొన్ని వేల మందిమి చనిపోక తప్పదని బలంగా నమ్ముతున్న కాలం అది. మరీ నెలరోజుల్లోనో, ఏడాది లోపో సమసమాజం వచ్చేస్తుందనే అతిశయం లేకపోయినా ఓ నాలుగైదు ఏళ్ళకయినా సమసమాజాన్ని సాధిస్తామనే నమ్మకం చాలా బలంగా వుండేది. సమసమాజంలో విహరిస్తున్నట్టు, ఎర్రకోట  బురుజు మీద ఎర్ర జెండా ఎగురుతున్నట్లు కలలు కూడ వచ్చేవి.  సుఖించే కోట్ల మందిలో వుంటారా? ప్రాణ త్యాగాలుచేసే  వేల మందిలో వుంటారా? అని అడిగితే అందరూ రెండో జాబితాలోనే స్థానం కల్పించండి అనేవారు. బలిదానాల జాబితాలో చోటు కోసం కామ్రేడ్స్  తహతహలాడేవారు. ప్రాణత్యాగానికి పోటీలు పడే మనుషులు ఈ నేల మీద సంచరించిన రోజులవి. 

సమసమాజం ఎలా వస్తుందంటే ఒక్కో కమ్యూనిస్టు పార్టి ఒక్కో సమాధానం చెప్పేది. సిపిఐ ది ఒకమార్గం; సిపియం ది ఇంకో మార్గం; నక్సలైట్లలో ఒక్కో గ్రూపుది ఒక్కో మార్గం. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఓ అరడజను గ్రూపులుండేవి. కొండపల్లి సీతారామయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి గ్రూపులు ముఖ్యమైనవి. లిన్ పియావో, వినోద్ మిశ్రా తదితర గ్రూపులు కూడ వుండేవి.   

‘దున్నేవాళ్ళకే భూమి నినాదంతో సాగే వ్యవసాయ విప్లవం ఇరుసుగా గల నూతన ప్రజాస్వామిక విప్లవం’ విజయవంతం కావాలని నినదించేవాళ్ళం.  అప్పట్లో ఇంతటి క్లిష్టమైన కార్యక్రమం కూడ అందరికీ అర్ధం అయ్యేట్టుగానే వుండేది. నినాదం ఇచ్చేవాళ్ళు, గొంతు కలిపేవారు ఇద్దరూ ఒకే భావోద్వేగంలో వుండేవారు. 

“పల్లెపట్టు పైరగాలి పట్టణాలను చుట్టును; భూతాలకు ప్రేతాలకు గోరీలే కట్టును” అంటూ శివసాగర్ ఈ నినాదాన్ని కవిత్వీకరించారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీల మీద అచంచల విశ్వాసం వుంటున్న కారణంగా ఈ నినాదాలు అర్ధం అయ్యేవి. ఇప్పుడు అలాంటి నమ్మకం లేనికారణంగా ఈ నినాదం అర్ధం కావడం లేదు. ఈరోజు ఈ నినాదం వినే వాళ్ళకే కాదు ఇచ్చే వాళ్ళకు కూడ అర్ధం కావడం లేదు. 

మత పీడన అప్పటికన్నా పెరిగింది. కుల పీడన పెరిగింది. తెగ పీడన పెరిగింది. ఆర్ధిక పీడన పెరిగింది. అనేక కొత్త పీడనలూ వెలుగులోనికి వస్తున్నాయి. సమసమాజ స్థాపన అవసరమూ పెరిగింది. కానీ, దానిని సాకారం చేసే పార్టి, గ్రూపు, సంస్థ ఏదీ కనుచూపుమేరలో కనిపించడంలేదు.

 

అణగారిన సమూహాలకు సామ్యవాదం మీద నమ్మకం పోవడమే ఈ దుస్థితికి కారణమని కొందరు ఆరోపించడాన్ని చూస్తున్నాము. అణగారిన సమూహాలకు సామ్యవాదం ఒక చారిత్రక అవసరం.  దాని మీద నమ్మకం పోవడం అనే ప్రశ్నే తలెత్తదు.  ఈ దుస్థితికి ప్రధాన కారణం కమ్యూనిస్టు పార్టిల నాయకత్వం. 

దురదృష్టావశాత్తు మన దేశ కమ్యూనిస్టు నాయకులు ఎవ్వరూ రష్యా, చైనా, వియత్నాం దేశాల కమ్యూనిస్టు నాయకులంతటి మేధావులు, ఆలోచనాపరులు, ప్రభావశీలురు కాదు. రష్యానో, చైనానో అనుకరించినవాళ్ళు మాత్రమే. ఈ నకలుకొట్టే అంతర్గత బలహీనత కారణంగా మనదేశంలో ప్రజల వైవిధ్య పూరిత వాస్తవ సమస్యల్ని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. 

సుందరయ్యగారి తెలంగాణ రైతాంగపోరాటం - గుణపాఠాలు, తరిమిల నాగిరెడ్డిగారి తాకట్టులో భారత దేశం, కొండపల్లి సీతారామయ్య గారి నూతన ప్రజాస్వామిక విప్లవం, వ్యవసాయిక విప్లవం అప్పట్లో కొందర్ని ఉత్తేజ పరచి వుండొచ్చుగానీ, ఈ తరానికి అవన్నీ అమెచ్యూర్ రచనలుగా కనిపిస్తాయి. కార్ల్ మార్క్స్, లెనిన్ రచనల వంటి సర్వకాలీనత, ప్రాసంగికత వాటికి లేదు. సుందరయ్య గారు ఆ పుస్తకాన్ని 1950 తరువాత రాశారు. అందులో పోలిస్ యాక్షన్ గా పిలువబడే సైనిక చర్య గురించి ఎందుకు రాయలేదో ఇప్పటికీ మాలాంటి వాళ్ళకు పెద్ద పజిల్. 1940ల నాటి తెలంగాణ పోరాటంగానీ. 1970ల నాటి ‘జగిత్యాల జైత్రయాత్ర’తో సహా ఉత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు గానీ నికరంగా సాధించిందేమీటీ? ఆ ఉద్యమాలు సమాజంలో ఎలాంటి మార్పులు తెచ్చాయని ఎప్పుడయినా  ఎవరయినా బెరీజు వేసుకున్నారా? కమ్యూనిస్టు పార్టిలు మహత్తరంగా చెప్పుకునే అనేక ఉద్యమాలు, పోరాటాలు అంతిమంగా పెట్టుబడీదారీ వ్యవస్థనేకాక కుల వ్యవస్థను సహితం  బలపరిచాయి అనే అభిప్రాయం మాలాంటి వాళ్ళలో తరచూ కలుగుతోంది. 

చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్య, చారు మజుందార్, కొండపల్లి సీతారామయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి తరానికే అన్వయ సృజనాత్మకత తక్కువ అనుకుంటుంటే ఆ తరువాత ఆయా పార్టీలకు నాయకత్వం వహించినవారు మరీ నాసిరకం. ఈ కమ్యూనిస్టు నాయకుల నోటెంట 21వ శతాబ్దంలో ఒక్క ఉత్తేజకర వాక్యమైనా విన్నామా? 

మొక్కై వంగనిది మానై వంగునా అని ఒక సామెత. చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్యలకే టాటా, బిర్లాలను ఎదుర్కోవడం సాధ్యం కాలేదు. ఇప్పటి నాసిరకం కమ్యూనిస్టు నాయకులు ఆదానీ, అంబానీలను ఎదుర్కోగలరని ఎవరయినా నమ్ముతారా? 

కొందరు రష్యాను భూలోక స్వర్గంగా ప్రచారం చేస్తే మరి కొందరు  చైనాను కమ్యూనిస్టు విప్లవ కేంద్రంగా చేస్తూ కాలం గడిపేశారు. చైనా మరో అమెరికాలా తయారైంది గాబట్టి గట్టెక్కిందిగానీ, నూరేళ్ళు సోషలిస్టు సమాజంలో గడిపిన రష్యా మహిళలు పేదరికం కారణంగా ఇతర దేశాలకు వలస వెళ్ళి పడుపు వృత్తి చేసుకుని బతుకుతున్నారు. వాస్తవాలు ఇంత కఠినంగా వుంటే సోషలిజానికి ఆమోదాంశం వుంటుందా? 

కమ్యూనిస్టు అభిమానుల్ని ‘బూర్జువా’ పార్టీల అభిమానులుగా మార్చింది కమ్యూనిస్టు పార్టిలు. ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ను బలపరచడం మొదలు, కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకోని పార్టి ఏదైనా వుందా? “ఉప్పరోడి వీపు నాకడంకన్నా, అత్తర్ సాయిబు చంక నాకడం మేలు” అని ఒక మొరటు సామెత వుండేది. ఉప్పరోళ్ళ వీపు ఉప్పగా వుంటుందనీ, అత్తరు సాయిబు చంకలో అత్తరు వాసన వుంటుందని దీని అర్ధం. ప్రజలు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. “మా కూటమి అధికారంలోనికి వస్తే పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి" అని కమ్యూనిస్టులు ప్రకటిస్తే జనం  కమ్యూనిస్టులకన్నా వాళ్ళే బెటర్ అనుకుంటారు.  అనుకుంటున్నారు. 

కమ్యూనిస్టులు 1970లలో కాంగ్రెస్ ను సమర్ధించడం తప్పయితే 2008లో యూపిఏ నుండి బయటకు రావడమూ అంతకన్నా పెద్ద  తప్పు. సరిగ్గా ఆ గ్యాప్ లో సంఘపరివారం ప్రవేశించి బలపడింది. ఒకప్పుడు హేతువాదం, ఆధునికత వగయిరా ఆదర్శాలతో మార్కెట్ ను విస్తరించుకున్న పెట్టుబడీదారీ వర్గం ఇప్పుడు మతాన్ని వాడుకొని తన సంపదను, ఆధిపత్యాన్నీ పెంచుకుంటున్నది. 

భారత సమాజం పెట్టుబడీదారులకూ, కార్పొరేట్లకు, వాళ్ళ అంతర్జాతీయ కేంద్రం ప్రపంచ బ్యాంకుకు అర్ధం అయినంతగా ఏ దశలోనూ కమ్యూనిస్టు నాయకులకు అర్ధం కాలేదు. ఆధునిక పెట్టుబడీదారీ వ్యవస్థకు విరుగుడును కనిపెట్టడంలో ఈతరం కమ్యూనిస్టు నాయకులు విఫలమయ్యారు. మరోవైపు, కమ్యూనిస్టు పోరాటాలు, ఉద్యమాల నుండి గుణపాఠాలు నేర్చుకుని పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత బలపడింది. 

ఇటీవల కేరళలో జరిగిన సిపిఎం జాతీయ మహాసభల్లో ఒక ఎస్సీ కామ్రేడ్ కు పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించారట. ఇప్పుడది ఒక పెద్దవార్త.  ఒక అణగారిన కులానికి ఒక శతాబ్ద కాలం స్థానం కల్పించని కమ్యూనిస్టు పార్టి ఇప్పుడు సమసమాజాన్ని సాధిస్తుందని మెదడు వున్నవాడు ఎవడయినా ఆశించగలడా?   

భారత ప్రజల్లో ఏఏ సమూహాలు ఏఏ సమస్యల్ని ఎదుర్కొంటూన్నారు? వాళ్ళు  ఎలాంటి పరిష్కారాల్ని కోరుకుంటూన్నారని భారత కమ్యూనిస్టు నాయకులు ఈ నూరేళ్ళలో ఏ దశలోనూ నిజాయితీగా ఒక సర్వే జరిపిన సందర్భం లేదు. సమాజం అర్ధం కానివాళ్ళను సమాజం నమ్మదు. ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను నమ్మడం మానేశారు. 

అయితే, సమసమాజాన్ని సాధించాల్సిన అవసరం రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయాలను వెతుకుతారు. వెతుకుతున్నారు. ఇప్పటి తెట్టును గట్టుకు గెంటేసే కొత్త నీరు వస్తుంది. సమానత్వం అనేది ఒక పార్టి కార్యక్రమం కాదు; అది సమాజ నిరంతర అవసరం.

 

మేడే వర్ధిల్లాలి.

 

మే డే 2022

No comments:

Post a Comment