AP Cabinet Re-Organization
ఆంధ్రప్రదేశ్ కొత్త
మంత్రివర్గం :
ఈ సామాజిక న్యాయానికి ఉన్న అధికారం ఎంత?
అభిప్రాయం
ఉషా ఎస్. డానీ
బీబీసీ కోసం
11 ఏప్రిల్ 2022
చిన్న రాష్ట్రాల్లో మంత్రివర్గ కూర్పు అంత ఈజీకాదు
చిన్న రాష్ట్రాల్లో
మంత్రివర్గ కూర్పు అంత సులభమైన వ్యవహారం కాదు. కుల సమీకరణలు బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్
వంటి రాష్ట్రాల్లో కేబినెట్ కూర్పు మరీ కష్టం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
వైయస్ జగన్మోహన రెడ్డికి అలాంటి పరిస్థితే ఎదురైంది. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించడం,
చేయకపోవడం రెండూ ఇబ్బందికరంగానే మారాయి.
ఆయన ముఖ్యమంత్రి పదవి
చేపట్టినప్పుడు చెప్పిన ప్రకారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఇప్పటికే ఆరు నెలలు ఆలస్యమైంది.
మరోవైపు, అసెంబ్లీ
ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగా ఇంక సాగదీతకు అవకాశం లేకుండా పోయింది. దీంతో మొత్తానికి
ఆ లాంఛనాన్ని సీఎం పూర్తి చేసేశారు. ఇది ఎన్నికల కేబినెట్ కనుక పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహాలు
కూడా ఇందులో భాగం.
జగన్ తన పాత కేబినేట్‌లోని
11 మందిని కొనసాగిస్తూ, 14 మందిని బయటికి పంపించేశారు. ఆ 14 స్థానాల్ని కొత్తవారితో
నింపారు.
పాత కేబినెట్ నుండి
కొత్త కేబినెట్ లోనికి కొనసాగిన ప్రముఖుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అంజాద్ బాషా ఉన్నారు. కొత్తగా కేబినెట్‌లోనికి
వచ్చిన వారిలో ధర్మాన ప్రసాదరావు వంటి అనుభవజ్ఞులతోపాటు అంబటి రాంబాబు, రోజా, విడదల
రజిని వంటి తొలిసారి మంత్రి పదవిని చేపడుతున్నవారూ వున్నారు.
వైసీపీలో కాంగ్రెస్ సంస్కృతి
ప్రాంతీయ పార్టీయే
అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో యూనిట్లు ఉన్న కారణంగా తెలుగుదేశం పార్టీని ఇటీవల జాతీయ
పార్టీ అంటున్నారు. చంద్రబాబు టీడీపీకి సాంకేతికంగా జాతీయ అధ్యక్షులు.
జగన్ వ్యవహారం అలా
కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీ.
ప్రాంతీయ పార్టీల్లో
సాధారణంగా అంతర్గత ప్రజాస్వామ్యం చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ పాలనో, కొండొకచో దంపతుల
పాలనో కొనసాగుతుంటుంది.
ఎన్టీఆర్ హయాంలో వారి
సతీమణి లక్ష్మీపార్వతి డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని అప్పట్లో అనుకునేవారు.
చంద్రబాబు హయాంలోనూ ఆయన కొడుకు లోకేష్ సూపర్ కేబినెట్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శలు
వచ్చాయి.
ప్రాంతీయ పార్టీల్లో
అధినేత అభిప్రాయాలనే విధిగా ఆమోదించాల్సి ఉంటుంది. కొన్ని నిర్ణయాల మీద అసంతృప్తి ఉన్నా
దాన్ని చాటుగా దిగమింగాల్సి ఉంటుందే కానీ జాతీయ పార్టీల్లోలా అసమ్మతివర్గం రోడ్డుకు
ఎక్కే అవకాశాలు ఉండవు.
అధినేత నిర్ణయాన్ని
బహిరంగంగా ధిక్కరించడం దాదాపు అసాధ్యం. నిన్నటి వరకు అలా అసాధ్యం అనుకున్నవి ఈ రోజు
సాధ్యంగా మారిపోతున్నాయి.
ఇప్పుడు వైయస్సార్
కాంగ్రెస్ పార్టీలో అలనాటి కాంగ్రెస్ సంస్కృతి పూర్తి స్థాయిలో కనిపిస్తోంది.
నిన్నటి వరకు హోం
మంత్రిగా పనిచేసిన సుచరిత ఏకంగా శాసన సభ్యత్వానికే రాజీనామాను ప్రకటించారు.
వైయస్ విజయమ్మగారికి
అత్యంత సన్నిహితులుగా భావించే ప్రకాశం జిల్లా సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని
మంత్రివర్గం నుంచి తప్పించడం రాజకీయ పరిశీలకులకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే పరిణామం.
మంత్రి పదవుల్ని కోల్పోయినవారి అనుచరులు, మంత్రి పదవిని ఆశించి భంగపడినవారి అభిమానులు
కొన్ని చోట్ల భోరున ఏడుస్తున్నారు, కొన్ని చోట్ల రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు.
కొన్ని చోట్ల బాహాటంగా
పార్టీ పెద్దల్ని తిట్టిపోస్తున్నారు. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను అనుచరులు ఆత్మాహుతికి
కూడ సిధ్ధమయ్యారు.
రోడ్డెక్కిన అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ కేవలం
175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఒక చిన్న రాష్ట్రం. కేబినేట్‌లో ముఖ్యమంత్రి కాకుండా
మరో 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది.
మంత్రివర్గాన్ని కూర్చడానికి
2019లోనే జగన్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, రోజా
వంటి అనుభవజ్ఞులకు వారికి అప్పట్లో కేబినెట్లో స్థానం దక్కలేదు. సుపరిచితులు కాని సుచరిత
వంటి శాసనసభ్యులకు స్థానం కల్పించారు.
మొదటి కేబినెట్ లాంఛనమనీ,
రెండోది ఎన్నికల కేబినెట్ కనుక అది కీలకమని అన్నారు. ఎన్నికల కేబినెట్‌లో ముఖ్యులకు
స్థానం కల్పిస్తారని అప్పట్లో ఒక హామీ కూడా ఇచ్చారు.
కొత్త ప్రభుత్వం కనుక
అప్పట్లో అసంతృప్తి రోడ్లకెక్కలేదు. ఇది ఈ టెర్మ్‌కు చివరి కేబినెట్ కనుక మరో ఛాన్స్
వస్తుందనే ఆశ లేదు కనుక అసంతృప్తి భగ్గుమని రోడ్డెక్కింది.
ఇందులో ముఖ్యమంత్రి
చేసిన వ్యూహాత్మక తప్పిదాలూ ఉన్నాయి. మొత్తం 25 మందినీ తప్పించి మొత్తం కొత్త వారితో
రెండో కేబినెట్ ఏర్పాటు చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రే చెప్పారు. పాత మంత్రులందరూ
ఇంటి ముఖం పట్టడానికి మానసికంగా సిద్ధమయ్యారు కూడా. అయితే, సగం మందిని మాత్రమే తీసి
సగం మందిని కొనసాగించడంతో అసంతృప్తి రాజుకుంది.
సామాజిక న్యాయం అంకెల్లోనేనా?
కొత్త కేబినేట్‌లో
బలహీనవర్గాలకు పెద్ద పీట వేయడం చెప్పుకోదగ్గ విషయం. మొత్తం 25 స్థానాల్లో 17 స్థానాల్ని
అంటే 70 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించినట్టు ప్రభుత్వ సలహాదారు
సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు. దీనిని వారు 'సామాజిక మహా విప్లవం'గా పేర్కొని
కొనియాడారు.
అయితే, ఎస్సీ, ఎస్టీ,
బీసీ, మైనారిటీ మంత్రులు సంఖ్యాపరంగా ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ విధాన నిర్ణయాలు
తీసుకునే చోట వారి ప్రభావం ఎంత? ప్రాధాన్యం ఎంత అనేదే అసలైన ప్రశ్న.
వైసీపీ వ్యూహకర్తలు
చెబుతున్నట్టు కొత్త కేబినెట్ కూర్పులో సామాజిక న్యాయం కనిపిస్తున్నా భౌగోళిక సమతూకం
మాత్రం సాధించలేకపోయారు.
మంత్రివర్గ పునర్
వ్యవస్థీకరణకు సరిగ్గా వారం రోజులు ముందు జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జిల్లాల సంఖ్యను
13 నుండి 26కు పెంచింది,
26 జిల్లాల నుంచి
25 మంది మంత్రులు అంటే సింపుల్ మేథమేటిక్స్ ప్రకారం చూసినా ఒక జిల్లాకు ప్రాతినిధ్యం
దక్కదు. ఆపైన, కొన్ని జిల్లాల్లో ఒకరికన్నా ఎక్కువ మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు.
అంటే, కొత్త జిల్లాలలో
కొన్నిటికి ప్రాతినిథ్యం దక్కలేదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేంద్రంగా భావించే విజయవాడ
ఇప్పుడు కొత్త ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. కానీ, ఈ కొత్త జిల్లాకు కొత్త కేబినెట్లో స్థానం
దక్కలేదు.
అల్లూరి, విశాఖ, ఏలూరు,
ఎన్టీఆర్, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, శ్రీబాలాజి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం
దక్కలేదు. ఏకంగా ఎనిమిది జిల్లాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యంలేకపోవడం రేపు వైసీపీని
రాజకీయంగా ఇబ్బంది పెట్టొచ్చు.
కొడాలి, పేర్ని నానిల 'పోర్ట్‌ఫోలియో'లు ఎవరికంటే
ప్రతి రాజకీయా పార్టీలోనూ
అన్ని కులాలు, అన్ని మతాలకు చెందినవారుంటారు. ప్రతి పార్టీనీ ఏదో ఒక సామాజికవర్గం నాయకత్వం
వహిస్తూ ఉంటుంది.
తెలుగు దేశం పార్టీకి
కమ్మ సామాజికవర్గం నాయకత్వం వహిస్తుంటే, వైసీపీకి రెడ్డి సామాజికవర్గం నాయకత్వం వహిస్తోంది.
టీడీపీలో రెడ్డి ఎమ్మెల్యాలు
వున్నట్టే, వైసీపీలో కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొత్త కేబినెట్‌లో 4 స్థానాలను రెడ్డి
సామాజిక వర్గానికి, మరో 4 స్థానాలను కాపు సామాజికవర్గానికి కేటాయించారు. ఇతర ఓసీలయిన
కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజికవర్గాలకు కేబినెట్‌లో స్థానం కల్పించలేదు.
ఈ స్థాయి నిరాకరణ గతంలో ఎన్నడూ లేదు.
కమ్మ సామాజికవర్గానికి
చెందిన గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని గత కేబినెట్లో నిత్యం వార్తల్లో ఉండేవారు.
పౌర సరఫరాలు వారి
శాఖ అయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని తిట్టడమే వారి 'పోర్టుఫోలియో'గా
ఉండేది.
అలాగే, పేర్ని నానిని
తప్పించడం కూడ చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. రాష్ట్ర రాజకీయాల్లో క్రమంగా పుంజుకుంటున్న
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను నిరంతరం ఎదుర్కొన్నది పేర్ని నానీనే. కొత్త మంత్రివర్గంలో
కొడాలి నాని 'పోర్ట్‌ఫోలియో'ను రోజాకు, పేర్ని నాని 'పోర్ట్‌ఫోలియో'ను అంబటి రాంబాబుకు
ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తిట్టడమే వారి
పని.
‘కమ్మ’ ఓటు తనకు రాదని జగన్
ఫిక్సయిపోయినట్లేనా?
కమ్మ సామాజికవర్గంలో
ఎక్కువ భాగం గత ఎన్నికల్లో టిడిపికి ఓటేసినా, వారిలో కొంత భాగం వైసిపికి కూడ ఓటేసినట్టు కొన్ని
సంకేతాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం తనకు ఓటు వేయదని ఇప్పుడు జగన్
ఫిక్స్ అయిపోయినట్టున్నారు.
రేపు జనసేన, టీడీపీ
మధ్య పొత్తు కుదిరినా వైసీపీకి ఇబ్బంది కలగరాదనే వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు
అయిన కాపుల్ని గట్టిగా అక్కున చేర్చుకున్నారు.
2024 ఎన్నికల్లో చంద్రబాబు
కన్నా పవన్ కల్యాణ్ నుంచి తనకు గట్టి పోటీ ఉంటుందని జగన్ వ్యూహకర్తలు భావిస్తున్నట్టు
కనిపిస్తోంది. మరోవైపు, కొత్త కేబినెట్ కూర్పువల్ల కమ్మ సామాజికవర్గం టీడీపీకి అనుకూలంగా
మరింత పోలరైజ్ కావచ్చు.
కొత్త కేబినెట్‌ను
ప్రకటించిన వెంటనే రెడ్డి, కాపు యేతర సామాజికవర్గాలను బుజ్జగించడానికి కొన్ని ఫీలర్లను
ప్రభుత్వ పెద్దలు బయటికి పంపించారు.
వీటి ప్రకారం, ఏపీ
స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఒకదాన్ని ఏర్పాటు చేసి దానికి కేబినేట్ హోదా కలిగిన చైర్మన్‌గా
కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నానిని నియమిస్తారు.
బ్రాహ్మణ సామాజికవర్గానికి
చెందిన మల్లాది విష్ణును స్టేట్ ప్లానింగ్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్‌గా నియమిస్తారు.
వైశ్య సామాజికవర్గానికి
చెందిన కోలగట్ల వీరభద్రస్వామిని శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తారు.
క్షత్రియ సామాజికవర్గానికి
చెందిన ముదునూరి ప్రసాదరాజును శాసనసభ చీఫ్ విప్‌గా నియమిస్తారు.
అయితే, ఈ కొత్త పదవులు
ఆయా సామాజికవర్గాల్ని ఏ మేరకు బుజ్జగిస్తాయన్నది ఒక సందేహం.
కేబినెట్ ‘లో’ ఉండడం
వేరు, కేబినెట్ హోదా ’తో’ ఉండడం వేరు అని అప్పుడే కొడాలి నాని అసంతృప్తి గళం విప్పారు.
'లో' నుండి వెలుపలికి
వచ్చినవారు 'తో' తో సంతృప్తి చెందక త్వరలో కొంచెం గొంతు పెంచే అవకాశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ
పునర్వ్యవస్థీకరణ కులప్రాతిపదికగా జరిగింది కనుక అది రాష్ట్రంలో కుల వ్యవస్థీకరణకు
దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.
రానున్న పరిణామాలు
జగన్‌కు అనుకూలంగా మారుతాయా? లేక వ్యతిరేకంగా మారుతాయా? అన్నది వేచిచూడాల్సిన అంశం.
(వ్యాసకర్త సీనియర్
జర్నలిస్ట్, సామాజిక విశ్లేషకులు, అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం)
10 ఏప్రిల్ 2022
No comments:
Post a Comment