Conspiracy To Demoralize The Unity Of
Oppressed Groups
అణగారిన సమూహాల ఐక్యతను దెబ్బతీసే కుట్ర
- ఏ ఎం ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ముస్లిం థింకర్స్ పోరం (MTF)
దళిత యువకుడు బిల్లా నాగరాజు హత్య ఒక దారుణ సంఘటన. నాగరాజు ముస్లిం యువతి నశ్రీన్ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. దీన్ని సహించలేని నశ్రీన్ అన్న నాగరాజును హత్య చేశాడు. దీన్ని ‘పరువుహత్య’ వంటి మర్యాదకర పదాలతో సరిపెట్టలేము.
ఇది ఒక ఉన్మాద హత్య.
నాగరాజు హంతకుల్ని కఠినంగా శిక్షించాలని కోరిన వారిలో దళిత, ప్రజాస్వామిక,
పౌర, మానవ హక్కుల సంఘాలవాళ్ళేకాక ముస్లిం ఆలోచనాపరులు, ముస్లిం సంఘాలు కూడ వున్నాయి. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించాలి.
నాగరాజు హత్య ఒక దారుణం అనుకుంటుంటే ఈ హత్య మీద అంతకన్నా దారుణమైన ప్రచారాలు సోషల్ మీడియాలో సాగుతున్నాయి.
నాగరాజు హంతకుడ్ని విమర్శించే నెపంతో మొత్తం ముస్లిం సమాజాన్ని బోను నెక్కించే ప్రయత్నం సాగుతోంది. ఇదే అదనుగా కొందరు నాలుగు అడుగులు ముందుకు వేసి, పాసిస్టు వ్యతిరేక ఉద్యమంలో క్రమంగా బలపడుతున్న దళిత-ముస్లిం ఐక్యతను దెబ్బతీసేందుకు నడుం బిగించారు. దానితో ఒక సామాజిక ఘర్షణ రాజకీయ ఘర్షణగా మారింది. ఇది యాధృఛ్ఛికమా?
లేక ఉద్దేశ్యపూర్వకమా?
ఇందులో రాజకీయ కుట్ర కోణం కూడ వుందా? అనేవి ఇప్పుడు మన ముందున్న ప్రశ్నలు.
ఎవరు అవునన్నా, కాదన్నా కులం అనేది భారత సామాజిక వాస్తవం. భారత సమాజంలో కులం సర్వాంతర్యామి. ‘ట్రంపెట్’ టైటిల్ తో నేను తీసిన డాక్యుమెంటరీ మూవీ నిర్మాత మాదిగ సామాజికవర్గానికి చెందిన మహిళ. వారికి ఏదైనా నచ్చకపోతే “ఛండాలం” అనేవారు. తన స్వీయ సామాజికవర్గాని తాను ఎద్దేవ చేస్తున్నట్టు వారికి స్పురించేది కాదు. మనందరిలో అంతగా ఇంకిపోయింది కుల సంస్కృతి. చివరకు ఎస్సీలు ఎస్టీల్లో అయినా కులసంస్కృతి లేదనగలిగిన స్థితి లేదు. పరువు హత్యలు మాల మాదిగ సమూహాల్లోనూ కొనసాగుతున్నాయి.
“అల్లాను విశ్వశించే వారందరూ సోదరులు” అంటూ ఇస్లాం ఒక సమతా (egalitarian) భావాన్ని ప్రతిపాదించినప్పటికీ ముస్లిం సమాజంలోనూ సామాజిక దొంతరలు లేకపోలేదు. భారతగడ్డ మీద హిందూ సమాజంలో వున్నంతగా కాకపోయినా ముస్లిం సమాజంలోనూ కులపోకడలు వున్నాయి. సయ్యద్, పఠాన్, బేగ్, మొఘల్ వంటి నాలుగు ‘అష్రాఫ్’ సమూహాలను వున్నత కులాలుగా పరిగణించి మిగిలిన ఓ 40-50 సమూహాలను వెనుకబడిన తరగతులుగా నిర్ధారిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిసి-ఇ జాబితాను తయారు చేసింది. వీరు కాకుండ అంతకు ముందే బిసి –బి, బిసి-డి జాబితాల్లో మరికొన్ని ముస్లిం కులాలున్నాయి.
ముస్లింలు అనగానే చాలామందికి స్పురించేది ఆ నాలుగు అష్రాఫ్ సమూహాలే. అత్తరు సాయిబులు, మోళీ సాయిబులు, పాముల వాళ్ళు (సపేరే) వగయిరా 50 కులాలవాళ్ళు ముస్లిం సమాజంలో అంతర్భాగమని చాలామందికి గుర్తుకురాదు. నిజానికి ఈ నలభై కుల సమూహాలను వాటి ఆర్ధిక, సాంస్కృతిక స్థాయినిబట్టి బీసీ ఎస్సీ జాబితాల్లో కాదు; న్యాయంగా ఎస్టీ జాబితాలో చేర్చాలి.
హిందూసమాజంలో వున్నట్టు ముస్లిం సమాజంలోనూ కులవృత్తులు వున్నాయి. హజామ్ (మంగలి), ధోభీ (చాకలి), బున్ కర్ (సాలె), లోహార్ (కమ్మరి), సునార్ (కంసాలి), పథర్ ఫోడు (వడ్డెర) వగయిరా వగయిరా. అలాగే అనేక ఆదివాసి తెగలు సహితం ముస్లిం సమాజంలో కొనసాగుతున్నాయి. మెహతర్ అనేది హిందూ సమాజంలోని ‘పాకీ’ కులానికి ముస్లిం సమాజంలో పర్యాయపదం.
భారత ఉపఖండంలో అనాదిగా అణిచివేతకు గురవుతున్న సమూహాలు ఎస్టీలు, ఎస్సీలు, బిసిలు. దారుణమైన అణిచివేతను తట్టుకోలేక ఆ సమూహాలు ఆయా సందర్భాలలో చాలా పెద్ద సంఖ్యలో బౌధ్ధం, ఇస్లాం, క్రైస్తవ మతాలను స్వీకరించాయి.
సాంఘీక హోదా పెరుగుతుందని ముస్లింలుగా మారిన దళితుల కథలు తెలుగులో చాలానే వున్నాయి. తొలి దశలో, కొందరు అరబ్బులు, ఆఫ్ఘన్లు వ్యాపారం కోసమో, మత ప్రచారం కోసమో ఇక్కడికి వచ్చారు. అప్పటికి ముస్లిం రాజ్యాలు లేవు; ముస్లిం రాజులూ లేరు. అరబ్బులు తీసుకుని వచ్చిన కొత్త సమతాధర్మం ఇక్కడి అణగారిన కులాలు, తెగల్ని విపరీతంగా ఆకర్షించింది.
వారే తరువాతి కాలంలో భారత ముస్లింలుగా అవతరించారు. ఇప్పటి భారత ముస్లింలలో కొందరి పూర్వికులు హిందూ యజమాని కులాలవాళ్ళు అయ్యుండవచ్చుగానీ అత్యధికులు పూర్వ- బిసి, ఎస్సీ, ఎస్టీ లు. నాటి అణగారిన సమూహాల చేరికతోనే భారత ఉపఖండంలో ఇస్లాం విస్తరించింది. ఇస్లాం వాళ్ళను ప్రభావితం చేసినట్టుగానే వాళ్ళూ ముస్లిం సమాజాన్ని ప్రభావితం చేశారు. భారత ముస్లిం సమాజంలో కూడ కులపోకడలు వచ్చాయి.
ఎన్నడో 7, 8 శతాబ్దాల్లో ఇస్లాంను స్వీకరించిన ‘నేరానికి’ (అలా స్వీకరించినవారిలో ఓసిలు కూడ పెద్ద సంఖ్యలో వున్నప్పటికీ సహజంగానే ఎస్టీ, ఎస్సీ, బిసిలు అత్యధికులు) వాళ్ళను 21వ శతాబ్దంలో శిక్షించడానికి నేటి ఎస్టీ, ఎస్సీ, బిసిలను ప్రయోగించడం నయా మనువాదుల కపట నీతి. ఈ దుర్నీతిని ఖండించే ఆలోచనాపరులు కూడ నేటి ఎస్టీ, ఎస్సి, బిసి సామాజికవర్గాల్లో వుండడం మన అదృష్టం. అయితే, వారి ఆలోచనలు ఆయా సామాజికవర్గాల్లో కిందికి దిగాల్సినంతగా ఇంకా దిగలేదు.
దీనికి మరోపార్శ్వం కూడ వుంది. ఆనాడు ఇస్లాంను స్వీకరించినవారిని ఈనాడు శిక్షించబూనడం ఎంతతప్పో, నేటి హిందువులనుగానీ, ప్రత్యేకించి బ్రాహ్మణ సామాజికవర్గాన్నిగానీ మొత్తంగా ఒకే గాటనకట్టి- వాళ్ళ పూర్వికులు మనుస్మృతిని పాటించారన్న నెపంతో – ఇప్పుడు విమర్శించడం అంతే తప్పు. మనం విమర్శించాల్సింది మనుస్మృతిని కొత్తగా భారత రాజ్యాంగంగా మారుస్తామంటున్న రాజకీయ పార్టీలను, నయా మనువాదుల్ని మాత్రమే.
ఓ సామాజికవర్గంలో ఓ నలుగురు ఆలోచనాపరులు వున్నంత మాత్రాన ఆ సామాజికవర్గం మొత్తం సమతావాదులతో వర్ధిల్లుతున్నదని అనుకోవడం కష్టం. కంచ ఐలయ్య షెఫర్డ్ పుస్తకం ‘నేనెట్ల హిందువునౌతా’ చదివి దేశంలోని ఆయన సామాజికవర్గం మొత్తం హిందూ ధర్మాన్ని త్యజించిందని అనుకుంటే అంతకన్నా పిచ్చోళ్ళు మరొకరు వుండరు. ఈ సూత్రం బిసి, ఎస్సీ ఆలోచనాపరులకే కాక ముస్లిం ఆలోచనాపరులకూ వర్తిస్తుంది.
ఒకప్పుడు త్రిపురనేని రామస్వామి మార్గంలో హేతువాదాన్ని ఆశ్రయించినవారి సంతతి, ఆ పిదప కమ్యూనిస్టు పార్టీల్ని నడిపినవారి సంతతి ఇప్పుడు మనుస్మృతిని స్మరిస్తూ వుండడాన్ని మనం చూస్తున్నాం.
మనందరిలో కులంతోపాటు మనుస్మృతి కూడ అంతగా ఇంకిపోతున్నది.
యాధృఛ్ఛికంగా ముస్లింగా పుట్టినవాళ్ళకన్నా అల్లా-ప్రవక్తల్ని నమ్మి ఇస్లాంను స్వీకరించినవాళ్ళు వున్నతులనేది ముస్లిం ధార్మిక ప్రమాణం. వాళ్ళను ‘నౌ ముస్లిం’ అని ప్రత్యేకంగా గౌరవిస్తుంది ముస్లిం సమాజం. By chance కన్నా by choice మిన్న అన్నమాట. ఓ ఐదేళ్ళ క్రితం ‘హైదరాబాదీ’ ‘దహఖనీ’ ‘నిజామీ’ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి పెళ్ళి చాలా వైభవంగా జరిగింది. అసదుద్దీన్ ఒవైసీ వంటి ప్రముఖులు హాజరయిన పెళ్ళి అది. మెహదీపట్నం లో జరిగిన ఆ పెళ్ళికి మా కుటుంబానికి కూడ ఆహ్వానం అందింది. నేను వెళ్ళలేకపోయానుగానీ మా అమ్మీ వెళ్ళింది. ఈ పెళ్ళిలో విశేషం ఏమంటే పెళ్ళి కొడుకు ఎస్సి. పెళ్ళికి ముందు ఇస్లాం ను స్వీకరించాడు. ముస్లిం ధార్మిక ప్రమాణాల్లో అదొక ఉత్సవ సందర్భం.
తాను ముస్లింగా మారతానని నాగరాజు అన్నట్టు తెలిసింది. అల్లా పట్ల విశ్వాసాన్ని ప్రకటించిన వ్యక్తిని చంపడంకన్నా పెద్ద నేరం ఇస్లాం ప్రమాణాల్లో ఏముంటుందీ? నశ్రీమ సోదరుడు అంతటి ధార్మిక అపచారానికి పాల్పడ్డాడు. న్యాయస్థానాలకన్నా ముందే ముస్లిం సమాజమే అతన్ని శిక్షించాలి.
ఇదే హైదరాబాద్ నగరంలో, ఒక బిసి కులానికి చెందిన తన కూతురు మరో బిసి కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు ఓ తండ్రి నడిరోడ్డు మీద పట్టపగలు దారుణంగా హత్య చేయడాన్ని మనందరం చూశాం. అప్పుడు ఆ బిసీ కులం మొత్తాన్ని ఒక గాటనకట్టి, వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇలాంటి దాడులు జరగలేదు. మాదిగ సామాజికవర్గానికి చెందిన తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఆక్రోసించి బోధన్ అంబేడ్కర్ నగర్ లో మాలసామాజికవర్గానికి చెందిన సుంకరి సందీప్ మీద 2020లో మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసినపుడూ మొత్తం ఎస్సీ సమాజం మీద వ్యతిరేక ప్రచారం ఈస్థాయిలో సాగలేదు. ఇప్పుడు మొత్తం ముస్లిం సమాజం మీద ఎందుకు దాడి జరుగుతున్నట్టూ?
భూమి ప్రధాన ఉత్పత్తిశక్తిగా వుండడంతో ఎస్సీలు, బిసిలు, హిందూ యజమాని కులాల మధ్య ఉత్పత్తి సంబంధాలు ఏర్పడ్డాయి. యజమాని కులాలు – శ్రామిక కులాలు అనే సామాజిక వర్గీకరణకు భూమి ప్రాతిపదిక. భూమేలేని ముస్లిం అష్రాఫ్ (కులీన) సమాజానికి హిందూ ఎస్టి, ఎస్సీ, బిసిలతోనేకాదు ముస్లిం ఎస్టీ, ఎస్సీ, బిసిలతోనూ ఉత్పత్తి సంబంధాలకు ప్రాతిపదిక లేదు. ఉత్పత్తి సంబంధమే లేనప్పుడు అణిచివేత అనే అంశానికి తావు వుండదు. అయితే, అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ ల మధ్య సాంస్కృతిక తారతమ్యాలు వున్నాయి. అష్రాఫ్ సామాజికవర్గాల్లో ఎండోగామీ మాత్రమేకాదు; ఎగ్జోగామీ కూడ సర్వ సాధారణం. మా తాత పఠాన్, మా నాయనమ్మ షరీఫ్, వారి తల్లి మళ్ళీ పఠాన్. మా మేనత్త పఠాన్ ఆమె భర్త సయ్యద్. అలాగే, అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ సామాజికవర్గాల మధ్య కూడ ఎగ్జోగామి వున్నదిగానీ అది ఇప్పుడు తక్కువ స్థాయిలో వుంది. దాన్ని విస్తృతంగా కొనసాగించడానికి ముస్లిం సమాజం ప్రత్యేకంగా కృషి చేయాల్సివుంది.
ఎస్సీలని ముస్లింలు ధేడ్ - చంబార్ అంటారని కొందరు విమర్శిస్తున్నారు. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొనసాగుతున్న అపార్ఢం. మహర్, చామర్ అనే కుల విభజన అనాదిగా హిందూ సమాజంలో వుంది. వీటికి తెలుగు పేర్లే మాల- మాదిగ. ఇంతకీ మాల, మాదిగ అనే పేర్లను ఆయా సామాజికవర్గాలు ఇష్టంగా పెట్టుకున్నాయో లేక ఇతరులు వాళ్ళకు అలా నామకరణం చేశారో ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. అదెలా వున్నా ఈ రెండు కులాల పేర్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహానాడులు, దండోరాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఉనికి ఉద్యమాల్లో భాగంగా కొందరు తమ పేర్ల చివర కొత్తగా మాల- మాదిగ అని చేర్చుకుంటున్నారు. వీటికి ఉర్దూ తర్జుమాయే ‘ధేడ్ - చంబార్’. ముస్లింలను తప్పుపట్టాల్సింది ఎస్సీలను ధేడ్, చంబార్ అంటున్నందుకు కాదు; వాళ్ళను తక్కువగా చూస్తున్నందుకు.
దళిత ముస్లిం అంతరాన్ని నివారించడానికి ముస్లిం ఆలోచనాపరులు కొంతకాలంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
(నేను నాయకత్వం వహిస్తున్న) ముస్లిం థింకర్స్ ఫోరం 2018 రంజాన్ మాసంలో ‘దళిత్-ముస్లిం ఇఫ్తెహార్’ పిలుపు ఇచ్చింది. హజ్రత్ మొహానీ-అంబేడ్కర్ లతో జాతియోద్యమ కాలంలో ఆరంభమయిన సాంప్రదాయానికి ఇది కొనసాగింపు. ‘దళిత్-ముస్లిం ఇఫ్తెహార్’ ఏపి-తెలంగాణల్లోని అనేక జిల్లాల్లో ఓ మూడేళ్ళు విజయవంతంగా సాగింది. మతఛాందసులని పేరుపడిన హైదరాబాదీ ముస్లింలు సహితం దీన్ని పాటించారు. సాలార్ జంగ్ మ్యూజియం పక్కనున్న ఒక మాల్ వాళ్ళు నిర్వహించిన ఇఫ్తార్ విందులో రోజుకో దళిత ప్రముఖుల్ని పిలిచి సన్మానించారు.
నన్ను, అబ్దుల్ వాహెద్ ను పిలిచిన రోజునే అరుణ గోగులమండగారిని కూడ ఆహ్వానించారు. కరోనా రాకతో ‘దళిత్-ముస్లిం ఇఫ్తెహార్’ కార్యక్రమం తాత్కాలికంగా ఆగింది.
1992 డిసెంబరు 6న మాబ్రీ మసీదును కూల్చి వేశారు.
ఆ రోజు అంబేడ్కర్ వర్ధంతి కూడ. నయామనువాదులు ప్రణాళిక బధ్ధంగా తేదీ ముహూర్తం చూసి ఆరోజే
మసీదును కూల్చారనేది కొట్టిపడేయదగ్గ ఆరోపణకాదు. రెండేళ్ల తరువాత 1994లో కవి ఖాదర్ మొహియుద్దీన్, నేను ఢిల్లీ వెళ్ళి ఎర్రకోట గోడల మీద నిలబడి డిసెంబర్
6ను ‘దళిత్ –ముస్లిం ఐక్యతా దినం’ గా ప్రకటించాము. కారంచెడు ఉద్యమానికి కొనసాగింపుగా
ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్య ప్రతిఏటా ‘దళిత్ –ముస్లిం ఐక్యతా దినం’
నిర్వహించేది. ఆ సమాఖ్యకు నేనే అధ్యక్షుడిని. సమాఖ్య అనుబంధ సంస్థ అయిన ముస్లిం హక్కుల
పరిరక్షణ సమితి (ఎంహెచ్ పిఎస్) కి నెల్లూరు
కేఎంఏ సుభాన్ అధ్యక్షులు. దేశంలో మొదటిసారిగా యానాది సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేసింది కూడ నా నాయకత్వంలోని బలహీనవర్గాల సమాఖ్యనే. తొలి దళిత పోరాటంగా భావించే కారంచెడు ఉద్యమంలో నేను నిర్వహించిన పాత్ర గురించి నేనే చెప్పడం స్వోత్కర్షగా వుంటుంది. ఇప్పుడు ఆ పని చేయదలచలేదు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లాల్ కిషన్ అడవాణి, మురళీ మనోహర్ జోషి ముఖ్యులు. వాళ్ళిద్దరూ యజమాని సామాజికవర్గాలకు చెందినవారు. వీరావేశంతో గుమ్మటం ఎక్కి గునపాలతో మసీదును కూల్చిన కూలీల సామాజికవర్గాలు ఏమిటీ? ఇది ఎవరికయినా రావలసిన సమంజసమైన సందేహం.
ముస్లింల వైభవం 1857 నాటి సిపాయిల తిరుగుబాటు పరాజయంతో అంతమయిపోయింది. ఆ తరువార ముస్లిం సమాజంలో కొనసాగింది “పరాజితుల ఆక్రందన” మాత్రమే. నిజాం వైభవం కూడ 1948 తరువాత ఆరిపోయింది. జాతియోద్యమ కాలం నాటికి భారత ముస్లిం సమాజంలో రెండు ధోరణులు కనిపిస్తాయి.
ఒక పక్క కొందరు ధనికవర్గంగా కనిపించినా మరోపక్క అత్యధికులు పేదలుగానే కొనసాగుతున్నారు. మనం తరచుగా మాట్లాడేది ఈ ధనిక ముస్లింల గురించే. నిరుపేద ముస్లింల సాంస్కృతిక వైవిధ్యం గురించీ, ఆర్ధిక బలహీనతల గురించీ బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఇది ఒక విధంగా అవ్యక్త సమాజం.
1932 నాటి బ్రిటీషు చట్టంతో ముస్లింలు పొందిన ఉద్దీపన చర్యలు (రిజర్వేషన్లు)
రాజ్యాంగ అవతరణతో అంతమైపోయాయి. ఒకప్పుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ ను పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించి రాజ్యాంగ సభకు పంపించగలిగిన భారత ముస్లిం సమాజం ఇప్పుడు చట్ట సభల్లో తన ప్రాతినిధ్యం కోసం పెనుగులాడుతోంది. విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం క్రమంగా తగ్గిపోయింది.
వాణిజ్యరంగంలో ముస్లింలు కొంచెం ఊపిరి పీల్చుకున్న చోటెల్లా వాళ్ళ మీద మూకుమ్మడి దాడులు, మూకోన్మాద దాడులు (లించింగ్) జరుగుతున్నాయి.
గతంలో ఇలాంటి దాడులు ప్రభుత్వ పరోక్ష ప్రాయోజిత కార్యక్రమంగా వుండేవి. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యక్షంగా రంగంలోనికి దిగి బుల్ డోజర్లను ఉపయోగించి ముస్లిం ఆర్ధిక పునాదుల నిర్మూలన పథకాన్ని (ముస్లీం హఠావో యోజన) అమలు చేస్తున్నది. ఇలాంటి పథకాలు ముస్లిం సమాజాన్ని తీవ్ర నైరాశ్యం లోనికి గెంటేస్తాయి; తీవ్ర ఫ్రస్టేషన్ కు గురిచేస్తాయి.
“సామాజిక సమానత్వాన్ని,
ఆర్ధిక సమానత్వాన్ని సాధించకపోతే బాధితులు హింసా మార్గాన్ని ఎంచుకుంటారు” అని సాక్షాత్తు రాజ్యాంగ సభలో స్వయంగా అంబేడ్కర్ హెచ్చరించాడు.
ముస్లింలలో ఫ్రస్టేషన్ తోపాటు హింసా ప్రవృత్తి పెరిగిపోయిందని ఇప్పుడు కొందరు ఆరోపిస్తున్నారు.
వాళ్ళు, బుల్ డోజర్ ఆర్ధిక విధానాన్ని కూడ వ్యతిరేకిస్తే బాగుంటుంది. ఏది కార్యం? ఏది కారణం? భరించలేని అణిచివేత కారణంగా ముస్లిం యువకులు కొన్ని చోట్ల విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చర్యలు భారత ముస్లిం సామాజికవర్గానికి చాలా హాని తెస్తుంది. ఎందుకంటే చాలా మందికి ముస్లిం నైరాశ్యంలో మాత్రమే హింస కనిపిస్తుంది; బుల్ డోజర్లలో హింస కనిపించదు.
విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఎస్సీలకన్నా ముస్లింలు వెనుకబడివున్నారని సచార్ కమిటి నివేదిక పేర్కొన్నది. విద్యా, ఉపాధి, రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలని 2006లోనే సూచించింది. అది కార్యరూపం ధరించలేదుగానీ,
రాజ్యాధికారం నయా మనువాదులకు దక్కింది. మైనారిటీల మీద వేధింపులు మొదలయ్యాయి. దీనినే మనం ఫాసిస్టు దశ అంటున్నాం.
తెగ వ్యవస్థలో అత్యంత పీడితులు ఆదివాసులు అయినట్టు, కుల వ్యవస్థలో అత్యంత పీడితులు దళితులు అయినట్టు, పెట్టుబడీదారీ వ్యవస్థలో అత్యంత పీడితులు అస్థిర కార్మికులు (ప్రికారియేట్) అయినట్టు, ఫాసిస్టు వ్యవస్థలో అత్యంత పీడితులు మతఅల్పసంఖ్యాక వర్గాలు. మన దేశంలో మత అల్పసంఖ్యాకులంటే ముస్లింలు శిక్కులు, క్రైస్తవులు, బౌధ్ధులు, జైనులు. ఎన్నికల్లో తమకు రాజకీయంగా లాభించే విధానంగా మారడంతో ప్రస్తుత దేశాధినేతలు ముస్లింలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘హిజాబ్, హలాల్, అజా’ లకు వ్యతిరేకంగా ప్రచారాన్ని సాగిస్తుంటే లీటరు పెట్రోలు ధర వెయ్యి రూపాయలకు పెరిగినా ప్రజలు పట్టించుకోరని వారికి అర్ధం అయిపోయింది. నేటి భారత ముస్లింల స్థితి గతులు 1930-40ల నాటి జర్మనీలోని యూదుల్ని పోలివున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తున్న దృగ్విషయం.
మత వ్యవస్థలో ముస్లింల తరువాత తీవ్ర అణిచివేతను అనుభవిస్తున్న సమూహాలు క్రైస్తవులు, శిక్కులు. రాజకీయ రంగంలో కమ్యూనిస్టులు మరీ ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టులు ఈరకం అణిచివేతకు గురవుతున్నారు.
ఈ సమూహాలన్నీ ముస్లింలకు సహజ మిత్రులని ముస్లిం ఆలోచనాపరులు భావిస్తున్నారు.
మొత్తం ముస్లిం సమాజం ఇలాగే ఆలోచిస్తున్నదని చెప్పడం ఇక్కడ అతిశయోక్తి అవుతుంది. ఎస్సి, ఎస్టీ, ముస్లిం ఐక్యత మాత్రమేగాక సమాజంలోని ఇతర అణగారిన సమూహాలన్నీ ఏకం కావల్సిన తరుణం ఇది.
బిజేపిలో వున్న ముస్లింల మాటేమిటీ అనేది ఈ సందర్భంలో ఎవరికయినా రావల్సిన సందేహమే. బిజెపికి సేవలందిస్తున్న ముస్లింలను ముస్లిం సమాజం గుర్తించడంలేదు; వాళ్ళను బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు; బిజేపి పంచన చేరిన ముస్లింలకూ అక్కడ పరాభవమే కలుగుతోంది. వాళ్ళు “నా ఘర్ కా నా ఘాట్ కా” అయిపోయారు.
మనుస్మృతికి వ్యతిరేకంగా మహాత్మా ఫూలే 19వ శతాబ్దంలో మహత్తర పోరాటం సాగించారు. ఆయన ముస్లింలను బిసిలకు సహజ మిత్రులుగా భావించారు. 20వ శతాబ్దంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ మనుస్మృతి మీద రాజీలేని పోరాటం చేశారు. ఈనాటి ఫూలే - అంబేడ్కర్ వారసులు అలా ముక్తకంఠంతో మనుస్మృతిని వ్యతిరేకిస్తున్నారని అని చెప్పడం చాలా కష్టం. నయా మనువాదులు ముందుగా ఫూలే వారసుల్ని అంటే బిసి సమూహాలని ఆకర్షించే ప్రయత్నాలు మొదలెట్టారు.
అందులో వారు చాలా వరకు విజయాన్ని సాధించారు. అంబేడ్కర్ శిబిరంలో అతిరథ మహారధులు అనుకున్నవారు సహితం ఒకరి తరువాత మరొకరు మనువాదుల ఉచ్చులో పడుతున్నారు.
కాన్షీరామ్ “మనం (ఎస్టి, ఎస్సీ, బిసి, ముస్లింలు) 85 శాతం; వాళ్ళు (మనువాదీ) 15 శాతం” అనేవారు. మాయావతిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేస్తామని ఆశచూపి ఎస్సీ, బిసిల మధ్య చీలిక తెచ్చేందుకు 1995లో మనువాదులు పన్నిన వలలో అంతటి కాన్షీరామ్ కూడ పడిపోయారు. ఇప్పుడు మనువాదులు “మనం 80 వాళ్ళు 20” అనే దశకు చేరుకోవడానికి పునాది 1995లోనే పడింది. తనను తాను అంబేడ్కర్ బ్రిగేడ్ కు సేనాని అని ప్రకటించుకున్న రాం విలాస్ పాశ్వాన్ బిజేపి సేవలోనే తరించారు. ఉదిత్ రాజ్ చరిత్ర కూడ దాదాపు అంతే. రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు అంబేడ్కర్. అది ఇప్పుడు అనేక శాఖలుగా చీలింది. అందులో ఒక శాఖ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. దాని అధినేత రామ్ దాస్ అథవాలే ఇప్పుడు బిజెపికి మౌత్ పీస్. వారు తన మార్కు అంబేడ్కరిజంతో మనువాదులకు సేవలు అందిస్తున్నారు.
అంచేత, వర్తమాన ఫూలే-అంబేడ్కరిస్టులు అంటే ఒకటి కాదు; రెండు. వీరిలో ఒకరు, ఫూలే-అంబేడ్కర్ల మార్గంలో నయా మనువాదం మీద రాజీలేని పోరాటం చేసే వాళ్లు. మరొకరు రాజీపడిపోయి ఫూలే-అంబేడ్కర్ల సిధ్ధాంతాన్ని నయామనువాదులకు తాకట్టు పెట్టేవారు. వీరిలో మొదటి సమూహం ముస్లింలకు సహజ మిత్రులు. రెండో సమూహం ముస్లింలకు బధ్ధవ్యతిరేకులు. దురదృష్టావశాత్తు ఇప్పుడు వీరిలో మొదటి సమూహం బలహీనంగా వుంది; రెండో సమూహం వేగంగా బలపడుతున్నది.
రామ్ దాస్ అథవాలే మార్కు ఫూలే-అంబేడ్కర్ సిధ్ధాంతాల 'తాకట్టు వీరులకు' తమదైన ఒక నేరేటివ్; ఒక సమర్ధన వుంది. “నేటి పాలకులైన నయా మనువాదులు రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడానికి ముస్లిం వ్యతిరేక రాజకీయాల్ని నడుపుతున్నారు.
మనం కూడ ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని సాగిస్తే పాలకులైన నయామనువాదులకు దగ్గర అవుతాం. దానివల్ల ఎస్సీ, బిసీలకు ఇప్పుడు రాజ్యాంగ బధ్ధంగావున్న రాయితీలు కొనసాగుతాయి. నయామనువాదులతో మన బంధం బలపడితే మరిన్ని కొత్త రాయితీలు కూడ వస్తాయి. అలా కాకుండ ముస్లింలతో సఖ్యతగా వుంటే కొత్త రాయితీలు రాకపోగా ఇప్పుడు పొందుతున్న రాయితీలకే ముప్పు వస్తుంది. నయామనువాదులు ఇప్పటికే రాజకీయ రిజర్వేషన్ల మీద ఒక వివాదం మొదలెట్టారు. రేపు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల మీద కూడ వివాదం మొదలెడుతారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నయామనువాదులు మళ్ళీ గెలిస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి నేరుగా మనుస్మృతినే రాజ్యాంగంగా ప్రకటిస్తారు. ముస్లింలతో కలిసి నడిచి నయామనువాదుల ఆగ్రహానికి గురికావడంకన్నా ముస్లిం వ్యతిరేకతను కొనసాగించి నయామనువాదుల అనుగ్రహాన్ని పొందడం అన్ని విధాలా మేలు” అనేది వీరి సిధ్ధాంతం. నయా మనువాదుల మీద పోరాడితే త్యాగాలే మిగులుతాయి, నయామనువాదులకు సిధ్ధాంతాన్ని తాకట్టు పెడితే లాభాలు వస్తాయి అని సూటిగా చెప్పే తెగువ కూడ వీరికి లేదు. డొంకతిరుగుడు మాటలతో ఎస్సి, బిసి సమూహాలను మనువాదుల శిబిరం లోనికి నడిపించడమే వీరి రోజువారీ కార్యకలాపం.
ఈ ‘నయామనువాద-నయాదళిత సిధ్ధాంతం’ ప్రతిఫలనాలనే ఇప్పుడు మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము. అణగారిన సమూహాల ఐక్యతను దెబ్బతీసేందుకు నయామనువాదులు చేస్తున్న కుట్రగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
దీనికీ ఒక విరుగుడు లేకపోలేదు. నయామనువాద ఫాసిస్టు మూకలతో తలపడాల్సిన అవసరంవున్న ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనారిటీ, ప్రజాస్వామిక, సామ్యవాద, సామరస్యవాద, పౌర-మానవ హక్కుల సమూహాలన్నీ ఏకం కావడం ఒక్కటే ఆ విరుగుడు. ఆ ప్రక్రియ ఎంత వేగంగా సాగితే అంత పటిష్టంగా నయామనువాదుల్ని అదుపు చేయవచ్చు. ఇప్పుడు మనువాదులు, 'నయాబహుజన - మనువాదులు' సాగిస్తున్న ముస్లిం వ్యతిరేక ప్రచారం కూడ అప్పుడు సహజంగానే ప్రాసంగికతను కోల్పోతుంది.
ఈ సందర్భంగా గుజరాత్ మారణహోమాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ ముస్లిం యాగానికి కాల్బలంగా పనిచేసింది బిసీ, ఎస్సీ సమూహాలన్న విషయం తెలియనివాళ్ళు ఎవ్వరూ వుండరు. ప్రముఖ దళిత కవి కలేకూరి ప్రసాద్ (యువక) అప్పట్లో నన్నోసారి కలిసి “సారీ సర్ ! అంతా చేసింది మావాళ్ళే. చాలా బాధగా వుంది. మీకు ఎన్నిసార్లు ఎన్నిసారీలు చెప్పినా తక్కువే” అన్నాడు.
కలేకూరి ప్రసాద్ అలా క్షమాపణలు చెప్పడం అతని మంచితనం. అప్పటికి చెడిపోని ఉదిత్ రాజ్ కూడ అహ్మదాబాద్ వచ్చి తన సామాజికవర్గం తరఫున క్షమాపణలు చెప్పాడు. అదీ అతని మంచితనమే. అప్పటి ముస్లిం సమాజం అంతకన్నా ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని ప్రదర్శించింది.
‘గుజరాత్ గాయం’ మీద అనేక వేల వ్యాసాలు, కవితలు వచ్చాయి. ఆ నరమేధానికి కీరీటధారులు,
సూత్రధారులు, పాత్రధారుల్ని తీవ్రంగా విమర్శిస్తూ అనేకులు మాట్లాడారు. కానీ, ఒక్కరూ ముస్లిం యాగంలో
పనిచేసిన కాల్బలాన్నిగానీ, హిందూ సమాజాన్నిగానీ పల్లెత్తు మాట అనలేదు. గుజరాత్ అల్లర్ల కాల్బలం విషయంలో ముస్లిం సమాజం వ్యూహాత్మక మౌనాన్ని పాటించింది. అన్నట్టు గుజరాత్ దాడుల్లో ఎస్టీలు పాల్గొనలేదు. అప్పట్లో అక్కడ ఓ మేరకు
క్షత్రియ, ఆదివాసి, ముస్లింల మధ్య ఐక్యత (KAM)
కొనసాగుతుండింది.
నడిరోడ్డు మీద ఓ నిండుగర్భీణీ పొట్టను చీల్చి, లోపలి పిండాన్ని బయటికి పీకి కత్తి మొన మీద నిలబెట్టి విజయగర్వంతో ఊరేగించిన ఆ ఉన్మాదాన్ని ఏమంటారూ? ఆ ఉన్మాదికి ఒక సామాజికవర్గం కూడ వుంటుందిగా?
అప్పట్లో అహ్మదాబాద్ తోసహా పలు పట్టణాలలో జమాతే ఉలేమా ఏ హింద్ ధార్మిక సంస్థ బాధితుల కోసం అనేక తక్షణ సహాయక శిబిరాలను నిర్వహించింది. ఆ సంస్థ గుజరాత్ కన్వీనర్ మహమ్మద్ సిరాజుద్దీన్ ను నేను “కాల్బలానికి మినహాయింపు ఇచ్చారెందుకు” అని అడిగాను. “భవిష్యత్తులో మనం కలిసి పనిచేయాల్సింది ఎస్టీ ఎస్సీ బిసిలతోనే కదా!” అన్నారాయన. మహమ్మద్ సిరాజుద్దీన్ ఒక్కరేకాదు మొత్తం భారత ముస్లిం సమాజం అప్పుడు ఇలాంటి ఉన్నత అవగాహనతో వ్యవహరించింది.
పిల్లలకు ఈ విషయాలు తెలియక పోవచ్చు!
10 మే 2022
విజయవాడ
జిలుకర శ్రీనివాస్, గుంటూరు లక్ష్మీనర్సయ్య, భార్గవ
గడియారం. చిగురుపాటి భాస్కరరావు, జహా ఆరా, స్కైబాబా
మిత్రమా,
బిల్లా నాగరాజు హత్య, తదనంతరం మొదలయిన ముస్లిం వ్యతిరేక ప్రచారం మీద ఒక వ్యాసం రాశాను. దీన్ని ప్రచురించడానికి ముందు మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు తప్పక ఈ వ్యాసాన్ని చదివి క్లుప్తంగా మీ సూచనలు తెలుపగలరు.
ఎదురు చూస్తుంటాను
డానీ
https://khanyazdani.blogspot.com/2022/05/a-conspiracy-to-demoralize-unity-of.html