Monday, 16 May 2022

People's writers cannot survive without Peoples' movements!

 *ప్రజాఉద్యమాలు లేకుండ ప్రజారచయితలు బతకలేరు!*

-        *డానీ*  

 

ప్రముఖ దళిత కవి కలేకూరి ప్రసాద్ (యువక) చివరి రోజులు విఖ్యాత భారత కథా రచయిత సాదద్ హసన్ మంటో చివరి రోజుల్ని తలపిస్తాయి. నైరాశ్యం, అసహనం, మనోవైఫల్యం ఇద్దరికీ సామాన్య లక్షణాలు.

 

ఒంగోలులో కలేకూరి మంచాన పడి చనిపోవడానికి కొద్ది రోజులు ముందు, మరో కవి నూకతోటి రవికుమార్అన్నా! ఎందుకిలా (చింపిరిగా) వుంటున్నావూ? అందరిలాగా కులాసాగా, శుభ్రంగా ఉండవచ్చుకదా?' అని అడిగాడట.  దానికి కలేకూరి ఇచ్చిన జవాబును ఈరోజే రవికుమార్ ఫేస్ బుక్ వాల్ మీద  చూశాను.

 

“శుభ్రంగా ఉండడానికి, కులాసాగా మెలగడానికి ఒక కారణం ఉండాలి. ఒక నమ్మకం ఉండాలి, నేను ఏ ఉద్యమం మీద ఏ నమ్మకంతో నువ్వు చెప్పేవన్నీ చెయ్యాలి? దళిత విముక్తి ఉద్యమాలు నమ్మకాలు కోల్పోయాయి. పటిష్టమైన ప్రతిఘటన ఉద్యమాలు లేవు. పట్టుమని పదిమంది దళిత మేధావులు ఒకటిగా లేరు. ప్రజా సంఘాలు ఒక అంశం మీద ఒక సమాఖ్యగా కడదాకా నిర్మించే పోరాటాలు లేవు. బహుజన రాజకీయాలు నిర్మాణాత్మకంగా లేవు. అంతెందుకు, అంబేద్కర్ గురించి చెప్పే వాళ్లంతా వర్తమాన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పోరాటాలకు అంబేద్కర్ ను అనుసంధానిస్తూ రాస్తున్న వాళ్ళు ఎంతమంది? కనీసం అంబేద్కర్ ను సాహిత్య ఉద్యమంగా అయినా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఏరీ?  ఏ నమ్మకంతో మనం పరిశుభ్రంగా ఉండాలి?  ఏ నమ్మకంతో మనం సంతోషంగా ఉండాలి?”

 

          ఇవి కేవలం నూకతోటి రవి కుమార్ ప్రశ్నకు కలేకూరి ప్రసాద్ ఇచ్చిన జవాబు మాత్రమేకాదు; నిజానికి ఇవి వర్తమాన సామాజిక కార్యకర్తలకు కలేకూరి ప్రసాద్ వేసిన ప్రశ్నలు. ఇవన్నీ వస్తవాలే. ఇప్పటికీ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలే. ఈ ప్రశ్నలు నన్ను ఓ 45-50 యేళ్ళు వెనక్కి తీసుకునిపోయాయి.

 

          కంచికచర్ల త్రయంగా భావించే కలేకూరి ప్రసాద్, మరియదాసు, బాల కోటయ్య నాకు వాళ్ళ విద్యార్ధి దశ నుండే తెలుసు. అప్పట్లో నేను కోస్తా జిల్లాల్లో రాడికల్ విద్యార్ధి యువజన, రైతు-కూలీ  సంఘాల్లోనికి కొత్తగా చేరిన వారికి రాజకీయాలు, తత్వశాస్త్రం అంశాల మీద ప్రాధమిక పాఠాలు  చెపుతుండేవాడిని. కంచికచర్లలో ప్రసాద్ నాకు ఎక్కువగా దగ్గరయ్యాడు. అభిమానంతో నన్ను గురువుగారు అనేవాడు. తను నా భార్యకు నందిగామలో కాలేజీ మిత్రుడు కనుక మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడ అయ్యాడు. 1998 వరకు అతని జీవితానికి సంబంధించిన  అనేక ముఖ్య సంఘటనలకు నేను సాక్షిగా వున్నాను. ఉద్యమంలో మా దారులు వేరయిపోయిన తరువాత కూడ నా మీద చాలా అభిమానం చూపేవాడు. ఒక హారర్ సంఘటనలో ఓ ఉన్మాద రచయిత  నా మీద  పగుల గొట్టిన బీరు బాటిల్ తో రెండుసార్లు దాడి చేసినపుడు “నా గురువుగారి మీద దాడి చేస్తావా?” అని రెండుసార్లూ తనే అడ్డుపడి నెత్తురుకారే గాయాల పాలయ్యాడు. నేనంటే తనకు అంతటి అభిమానం.

 

          రెండు రోజుల క్రితం ఒక వ్యాసంలో రాసినట్టు గుజరాత్ అల్లర్లు ప్రసాద్ ను చాలా బాధించాయి. ముస్లిం యాగంలో ఎస్సీ, బీసిలు పాల్గొన్నందుకు తను చాలా కలత చెందాడు.

 

మా అనుబంధానికి ఒక పునాది ఒక నేపథ్యం వుంది. అది కమ్యూనిస్టు ఉద్యమం.  నేను 1973 ప్రాంతంలో నరసాపురంలో ప్రజానాట్యమండలి యూనిట్ కు దగ్గరయ్యాను. నాటకాలు, నాటికలు మా ప్రధాన కార్యకలాపం. ఎంజి రామారావుగారు మాకు కుటుంబ పెద్ద, ధవళ సత్యంగారు దళపతి. రచయితగా తొలి దశలో నన్ను మోల్డ్ చేసింది వాళ్ళే. అనేక మంది నటులు, గాయకులు ఒకే కుటుంబంగా వుండేవాళ్ళం. ప్రజానాట్యమండలి అంటే సిపిఐ అనుబంధ సంస్థ. తరువాతి కాలంలో నేను రాజకీయాలు మారాను, పార్టి మారాను. అయినప్పటికీ  ఎంజి రామారావు, ధవళ సత్యంగార్ల మీద నాకు ఇప్పటికీ అదే గౌరవం. వాళ్ళ మీదనేకాదు అలనాటి పశ్చిమగోదావరి జిల్లా సిపిఐ నాయకులు డివివిఎస్ వర్మగారన్నా, పడాల శ్యామ సుందరరావు గారన్నా అదే అభిమానం.

 

వాసిరెడ్డి వెంకట కృష్ణారావు గారి ద్వార నేను 1970ల చివర్లో పీపుల్స్ వార్ లో చేరాను. శిష్యుల శక్తి సామర్ధ్యాలను సమర్థంగా వినియోగించే మార్గాన్ని చూపేవాడే గురువు. నా ఆవేశాన్నీ, తెగువను, రచన నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకునే మార్గాన్ని చూపింది వారే. నన్ను విరసంలో చేరమని ప్రోత్సహించిందీ వారే. ఓ రెండేళ్ళ తరువాత వారు పీపుల్స్ వార్ ను వదిలి వేరే పార్టిలోకి  వెళ్ళిపోయారు. అప్పటికీ ఇప్పటికీ నాకు  కృష్ణారావు గారంటే అదే గురుభావం. 

 

1979లో నేను విరసంలో చేరాను. ఇప్పటి పరిస్థితులతో చూస్తే విరసం ఒక అద్భుత సమ్మిళిత సమాజం. కేవి రమణా రెడ్డి గారు తరచూ ఒక మాట అంటుండేవారు. ఒక ఉద్యమ సంస్థ మనుగడ సాగించాలంటే అందులో మూడు తరాలుండి తీరాలి. వారి దృష్టిలో  శ్రీశ్రీ, కొడవటిగంటి, కేవిఆర్ పెద్ద తరం. (అప్పటికి, విరసం నుండి బయటికి వెళ్ళిపోయిన కాళీపట్నం, రావి శాస్త్రి కూడ విరసంతో ఒక అనుబంధాన్ని కొనసాగించేవారు.)  త్రిపురనేని మధుసూదనరావు, చలసాని ప్రసాద్, వరవరరావు,  సిఎస్ ఆర్ ప్రసాద్, కళ్యాణరావు తదితరులు  మధ్యతరం. అల్లం రాజయ్య, బిఎస్ రాములు, ఉషా ఎస్ డానీ, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, అట్టాడ అప్పల్నాయుడు యువతరం అనేవారు. ఇదే విరసం అంతర్గత శక్తి అనేవారు.

 

మా అందరి రచనా శైలులు వేరు. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలున్న సందర్భాలున్నాయి. తగవు పడిన సందర్భాలున్నాయి. అంతిమంగా అందరం ఒకే మాట మీద వుండేవాళ్లం. మేము పీపుల్స్ వార్ వాళ్లం. అయినప్పటికీ చండ్రపుల్లారెడ్డి గ్రూపుకు చెందిన  రత్నమాల, విమల తదితరులతోనూ అదే అనుబంధంతో వుండేవాళ్ళం. ఎస్ ఎం రవూఫ్ అభిమానులు కూడ విరసంలో వుండేవారు. బాలగోపాల్, సివి సుబ్బారావు వంటి తటస్తులు కూడ విరసంలో వుండేవాళ్ళు. సమస్త శక్తుల కలయిక కావడంవల్లనే విరసం ఆ కాలంలో గొప్పగా నిలిచి వెలిగింది.

 

తరువాతి కాలంలో శిష్యులు మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు. కొన్ని విభాగాల్లో గురువులను మించనూ వచ్చు. అయినప్పటికీ పునాది వేసిన గురువు విలువ ఎన్నటికీ తగ్గదు. విరసానికి నేను 2001లో రాజీనామా చేశాను. (దానికి  కారణాలను ఇంకో సందర్భంలో వివరిస్తాను.) అయినప్పటికీ ఇప్పటికీ కేవి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, చలసాని ప్రసాద్, వరవరరావుగార్లను నేను గురువులుగానే భావిస్తాను. వాళ్ళ నుండి నేను చాలా పొందాను.

 

నా గురువుల్లోనూ లోపాలు లేకపోలేదు. విచిత్రం ఏమంటే ఆ లోపాల్ని గుర్తించే జ్ఞానాన్ని మాకు ఇచ్చిందీ వాళ్ళే.   

 

అలనాటి కమ్యూనిస్టు పార్టీలుగానీ, మా కాలపు విప్లవ కమ్యూనిస్టు పార్టీలుగానీ రాజకీయ ఆర్థిక రంగాల్లో నికరంగా సాధించింది ఏమిటీ? అనే విషయంలో నాకు అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. వాటిని నేను బహిరంగంగా చెపుతూనే వున్నాను. కానీ, సామాజిక రంగంలో ఒక అద్భుత  మానవీయ సమూహాన్ని ఇవి సృష్టించాయి అనడంలో నాకు ఎన్నడూ కొంచెమయినా అనుమానం లేదు.

 

అంబేడ్కర్ రచనలు 1950ల నుండే ఆంధ్రప్రదేశ్ లో  అందుబాటులో వున్నాయి. రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియాకు ప్రాంతీయ శాఖలున్నాయి. ఆ పార్టి అభ్యర్ధులు ప్రతి ఎన్నికల్లోనూ పాల్గొనేవారు. ఇంతటి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వున్నా తెలుగునాట భాగ్యరెడ్డి వర్మ తరువాత చెప్పుకోదగ్గ ఆలోచనాపరుడు వెలుగులోనికి రాలేదు. కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావంతోనే ఎస్టీలు ఎస్సీలు, బిసిలు, ముస్లిం ఆలోచనాపరులకు కొత్తగా సామాజిక పెట్టుబడి (సోషల్ కేపిటల్)  వచ్చింది. దానితో ఒక స్వతంత్ర గొంతు వచ్చింది.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలకు తొలి దశలో నాయకత్వం వహించిన వారందరూ  పూర్వాశ్రమంలో కమ్యూనిస్టులే అన్నది ఎవ్వరూ కాదనలేని చారిత్రక వాస్తవం.  ఇది తెలంగాణ ఉద్యమం వరకు సాగింది.

 

కమ్యూనిస్టు పార్టీల కర్తవ్యాల్లో పెట్టుబడీదారి వ్యవస్థ కూల్చివేత, సామ్యవాద సమాజ నిర్మాణం అనే రెండు విభాగాలుంటాయి. కమ్యూనిస్టు పార్టీల నుండి వచ్చిన అస్తిత్వవాదులు కూల్చివేత అంశాన్ని పట్టించుకున్నంత బలంగా నిర్మాణ అంశాన్ని పట్టించుకోలేదు. వీరిలో ఆర్గనైజేషన్ స్పృహ చాలా తక్కువ. ఈ లక్షణాలను తెలంగాణ ఉద్యమ అనంతర కాలంలోనూ చూడవచ్చు.

 

వ్యష్టి సమిష్టి అనే విభజన అనాదిగా వుంది. పెట్టుబడీదారీ వ్యవస్థ సమిష్టిని అంతం చేసి వ్యష్టిని ప్రోత్సహిస్తుంది. రష్యా- తూర్పు యూరోపుల పతనం, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావం, భారత దేశంలో పాత తరహా కమ్యూనిస్టు పార్టీలకు ఆమోదాంశం తగ్గిపోవడం మొదలు, అస్థిత్వ ఉద్యమాలు తలెత్తడం, నయామనువాదుల విజృంభణ దాదాపు ఒకే కాలంలో సంభవించాయి. వీటి మధ్య ఒక అవినాభావ సంబంధం వుందని సులువుగానే అర్ధం అవుతుంది. వీటన్నింటి వెనుక ప్రపంచ బ్యాంకు వుందని మొత్తం వ్యవహారం మార్కెట్ సూత్రాల ప్రకారమే నడుస్తున్నదని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

 

 ఆలోచనాపరుల్ని ప్రపంచ బ్యాంకు వ్యక్తులుగా మార్చేసింది. కవులు, రచయితల్ని అకాడమీ అవార్డుల రేసు లోనికి దింపింది. ఇక అందరూ వ్యక్తులే. ఎవరి లక్ష్యం వారిదే. ఇప్పుడు సమిష్టి అనే మాటకు తావులేదు. గురువులేడు; శిష్యుడూ లేడు. మార్గదర్శిలేడు; అభిమానులూ లేరు. ఈ వ్యక్తివాదాన్ని ఆధునిక సోషల్ మీడియా మరింతగా ప్రోత్సహించింది. అందర్నీ ‘వాట్సప్ వారియర్స్’గా మార్చిపడేసింది. అది కూడ ప్రపంచ బ్యాంకు పనితనమే.

 

వీరిలో ఒకరికి మరొకరంటే  గిట్టదు. ఒకరు మరొకరితో కలవరు, ప్రజలతో అసలు సంబంధం వుండదు. పేస్ బుక్ వాల్ లో ఖడ్గ విన్యాసాలు చేస్తుంటారు. ఎవడికి వారు తానే తోప్ అనుకుంటారు. ఇలాంటి సంస్కృతి గలవారు ప్రజల్ని ప్రభావితం చేయలేరు. ప్రజల్ని ప్రభావితం చేయలేనివారు సమాజాన్ని ఎన్నటికీ మార్చలేరు.

 

ప్రజల్లో అక్షరాశ్యత, ప్రచార, ప్రసార మాధ్యమాలు  నామమాత్రంగా వున్నరోజుల్లో శ్రీశ్రీ మహాకవి అయ్యాడు. రహాస్య విప్లవ జీవితంలో వుంటూనూ  శివసాగర్ ఇంకో మహా కవిగా అవతరించాడు. ప్రచార, ప్రసార మాధ్యమాలు విజృంభించి, ప్రజల్లో అక్షరాశ్యత  ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో సహితం శ్రీశ్రీ, శివసాగర్ లలా ప్రజల నోటి మీద పేరు నానుతున్న కవి ఒక్కడయినా వున్నాడా? ఒక్క ఆలోచనాపరుడైనా ఈ తరం  హౌస్ హోల్డ్ రైటర్ గా వున్నాడా? ఇంతటి దురదృష్టకర సన్నివేశానికి నాకు తోస్తున్న కారణాలు రెండు. మొదటిది; మనలో సమిష్టితత్వం లోపించడం.  రెండోది; మనందరం తెలిసోతెలియకో ప్రపంచ బ్యాంకుకు లొంగిపోవడం.

 

“పట్టుమని పదిమంది దళిత మేధావులు ఒకటిగా లేరు” అని కలేకూరి ప్రసాద్ ఆక్రోసించాడు. పదిమంది కాదుకదా ముగ్గురు ఆలోచనాపరులు  కలిసి పనిచేస్తున్న సందర్భం కూడ ఈనాడు కనిపించడంలేదు. వేలాది మంది, లక్షలాది మందితో బహిరంగ సభల కాలం పోయింది. రౌండ్ టేబుల్ సమావేశాల కాలం వచ్చింది. పాల్గొనేవారందరూ  నాయకులే. వినేవారు ఎవరూ వుండరు. అదీపోయి ఆన్ లైన్ సమావేశాలు వచ్చాయి. ఎవరి ఇళ్ళలో వారు ఉంటూ లోకానికి సందేశాలు ఇస్తుంటారు. జీవం లేని ఈ సమావేశాల్ని ‘లైవ్’ అని ఎందుకంటారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు.

 

కలేకూరి ప్రసాద్ నైరాశ్యమూ ఫ్రస్టేషన్ సమంజసమైనది. మనం ఒంటరి యోధులుగా వున్నంత కాలం సమాజం ఎలాగూ మారదు. జరిగేది ఒక్కటే కలేకూరి ప్రసాద్ లా సమాజం పట్ల కొంచెం సెన్సిటివ్ గా స్పందించే మరి కొందరు నైరాశ్యానికి గురవ్వడం.  

 

ఆలోచనాపరులు సమిష్టిగా పనిచేయకపోతే ప్రజల్లో సమాజం మారుతుందనే నమ్మకం పోతుంది. ప్రజలకు నమ్మకం కలుగనంత వరకు  విప్లవాలు సంభవించవు. పైగా, తమకు తోచిన రాజకీయ పార్టిల్ని గెలిపించి అదే పెద్ద ఘనకార్యం సాధించినట్టు  ప్రజలు సంతృప్తి పడుతుంటారు. వైసిపి, టిడిపి, బిజేపి, కాంగ్రెస్ ల మధ్య నాలుగు స్థంభాలాట ఆడుతుంటారు. అదే వినోదం; అదే విషాదం.  

 

ఆలోచనాపరుల్లో సమిష్టితత్వం అంతరించిందనే ఆవేదనతోనే కలేకూరి ప్రసాద్ చనిపోయాడు. అతని జీవితం నుండి మనం నెగటివ్ గా  నేర్చుకోవాల్సింది అదే;  సమిష్టి తత్వం. ఉద్యమాలకు అదే జీవం.

 

 

17 మే 2022

 

(మా రెండో అబ్బాయి అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి తొలి పుట్టిన రోజు సందర్భంగా 1987 సెప్టెంబరు 26న మా ఇంట్లో తీసిన పై ఫొటోలో నేనూ, నా భార్య అజితతో పాటు కే శ్రీనివాస్, ఎన్ వేణుగోపాల్, కలేకూరి ప్రసాద్ వున్నారు)

No comments:

Post a Comment