Thursday, 14 March 2024

Gurujada Apparao

 *గురజాడ గురించి మరికొంత* 


 గురజాడ  అప్పారావు బ్రాహ్మణ సమాజం గురించి మాత్రమే  రాశాడు అని పెదవి విరిచేవాళ్ళూ, అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళూ వున్నారు. ఒక రచనను సామాజిక కోణంలో చూసే విధానం అది కాదు.  


నవలలో  ఒక్క కార్మిక పాత్ర కూడ లేకుండ మొత్తం కథనాన్ని ముంబాయి కంబల్లా హిల్స్  ఆల్టా మౌంట్ రోడ్ లోని 27 అంతస్తుల ముఖేశ్ అంబానీ నివాస గృహం 'అంటీలియా'లోనే నడపవచ్చు. అంతమాత్రాన దాన్ని కార్పొరేట్ కథ అనలేం. అనకూడదు. ఒక్క కార్మిక పాత్ర కూడ లేకుండ కార్మిక దృక్పథంతో రచన చేయవచ్చు. అలాగే, మొత్తం కార్మిక పాత్రలతోనే కార్మిక వ్యతిరేక రచన చేయవచ్చు. 


కథను రచయిత ఏ దృక్పథం తో రాశాడు అన్నది ముఖ్యం. స్థలం, కాలం, సందర్భం, పాత్రలు అనేవి కథాంశానికి (టాపిక్) సంబంధించిన అంశాలు. వాటి మీద రచయిత దృక్పథం ఏమిటీ అనేదే వస్తువు.


గురజాడ అప్పారావు ప్రధానంగా బ్రాహ్మణ పాత్రలతో, నాటి బ్రాహ్మణ కుటుంబ వాతావరణంలో రచనలు చేశాడు. కానీ, కన్యాశుల్కాన్నీ, బాల్యవివాహాలని విమర్శించాడు; వితంతు పునర్వివాహాలను సమర్ధించాడు.  అది అతని దృక్పథం. సాంప్రదాయ విద్య నేర్చినవారు చేసే మోసాలగురించి అప్పటికే సమాజంలో ఒక అవగాహన వుంది. ఆధునిక ఆంగ్ల విద్య నేర్చుకున్న గిరీశం వంటివారు చేయబోయే మోసాలనూ గురజాడ పసికట్టాడు. అందుకే ఆ కాలానికి ఆధునికుడు అయ్యాడు. 


 ఆహారం నిద్ర లానే సంభోగం కూడ ఒక కీలక శరీరధర్మం.  ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాల భాగస్వాములుగా మారి, దాంపత్య వ్యవస్థలో ప్రవేశించి, ఇనుప తలుపుల్ని శాశ్వితంగా మూసివేసిన  తరువాత   మాత్రమే సంభోగ అవసరాలు తీర్చుకోవాలనే కఠిన నిబంధన వున్నప్పుడు సమాజంలో  సరుకు సంభోగాన్నీ సరఫరా చేయడానికి వాణిజ్య వేశ్య (public prostitution) వ్యవస్థ పుట్టుకు వస్తుంది.    ఇదొక అనివార్య ఏర్పాటు. 


 కార్ల్ మార్క్స్ - ఫ్రెడరిక్ ఏంగిల్స్  ఇద్దరూ ఇంచుమించు  ఇలాంటి అభిప్రాయాన్నే కమ్యూనిస్టు ప్రణాళికలోని 'శ్రామికులు - కమ్యూనిస్టులు'   అనే అధ్యాయంలో  చెప్పారు. గురజాడ కూడ ఈ హేతువునే పాటించాడనిపిస్తోంది.  


బాల్య వివాహాలు, బాల్య వితంతువులు, వితంతు పునర్వివాహాలు, కన్యాశుల్కం వగయిరా అంశాల మీద  ఒక నాటకాన్ని రాస్తున్నప్పుడు ఒక వేశ్యపాత్ర కేంద్రబిందువుగా వుండాలని గురజాడ  భావించాడు. ‘కన్యాశుల్కం నాటకంలో స్త్రీపురుష సంబంధాలు’ అనే అంశం మీద ఒక విస్తృత పరిశోధనా గ్రంధం రాయవచ్చు. 


 ఇటువైపు పాతివ్రత్యం, ఏకపత్నీవ్రతం వున్నంత వరకు అటువైపు వాణిజ్య వేశ్యావ్యవస్థ వుంటుంది. గురజాడ ఒక్కడేకాదు; కుటుంబ వ్యవస్థలోని లోపాలను  చిత్రించాలనుకున్న అంతర్జాతీయ స్థాయి  రచయితలు  అనేకులు వేశ్య పాత్రల్ని కేంద్ర బిందువుగా మార్చుకున్నారు. వేశ్య పాత్రలు ముసుగులు, తొడుగులు పెట్టుకోవు. సూటిగా స్పష్టంగా మాట్లాడుతాయి. సమాజం మీద ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల మీద వాళ్ళు చేసే వ్యాఖ్యానాలే ప్రామాణికమైనవి. 

No comments:

Post a Comment