Outcry of a Donkey – Intro
గాడిద ఆత్మఘోష - పరిచయం
జంతువులను పాత్రలుగా చేసి ప్రతీకాత్మకంగా కథలు రాయడం కొత్తేమీకాదు. నీతి చంద్రిక నుండే మనకు ఈ సాంప్రదాయం వుంది. మన జానపద సాహిత్యంలోనూ ఈ శైలి వుంది. అరేబియన్ నైట్స్ లో ఇది మరోదశకు చేరుకుంది. వీటిని మొదట ‘అలీఫ్ లైలా’ ధారావాహికంగా మా అమ్మమ్మ ఫాతిమున్నీసా ద్వార విన్నాను. తరువాత సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ (1821-1890) పుస్తకాలు "One Thousand and One Nights." ద్వార చదివాను. ఇందులో నాకు నచ్చిన అంశం ఏమంటే కథానాయకి షెహరాజాదే (Scheherazade) ప్రతిరోజూ ప్రతి కథనూ ఆసక్తికరంగా చెప్పి తీరాలి. లేకుంటే మరునాడు రాజు షహర్యార్ (Shahryār) ఆమెను నిర్దాక్షిణ్యాంగా చంపించేస్తాడు. చావోబతుకో తేల్చుకోవాల్సిన సందర్భం వస్తేనే ఇంత మంచి కథలు పుడతాయేమో అనే ఒక వైల్డ్ ఆలోచన వచ్చేస్తుంది.
సాంఘీక, రాజకీయ, నైతిక అంశాల మీద విమర్శలు, వాఖ్యానాలు చేయడం కోసం మార్మికతను వాడే ప్రక్రియను లాటిన్ అమెరికన్ సాహితీవేత్తలు గొప్పగా అభివృధ్ధి చేశారు. జార్జ్ బోర్జెస్ (Jorge Francisco Isidoro Luis Borges Acevedo 1899 –1986), గేబ్రియల్ గార్షియా మార్క్వెజ్ (Gabriel José de la Concordia García Márquez 1927 –2014) వీరిలో ప్రసిధ్ధులు. వీరి శిష్యుడిగా ముందుకొచ్చిన పౌలో కొయెల్హో (Paulo Coelho de Souza ) మీద కూడ అరేబిమన్ నైట్స్ ప్రభావం కనిపిస్తుంది.
సామాజిక వాస్తవికత, పోరాట వాస్తవికత, విప్లవ వాస్తవికతలు ఒక దశలో గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చాయి. మరోవైపు, అవి మాత్రమే ఏకైక వస్తుశిల్పాలు అనుకునే అతివ్యాప్తి దోషంవల్ల సాహిత్య సృజనకు బోలెడు నష్టం కూడ జరిగింది. సాహిత్యంలో వైవిధ్యం లేకుండాపోయింది. వైవిధ్యంలేని సాహిత్యం చప్పబడిపోతుంది. చప్పబడిపోయిన సాహిత్యం ఫెయిల్ అయిన సినిమా లాంటిది. ఫెయిల్ అయిన సినిమాను ఓటిటిలో ఉచితంగా వేసినా ఎవరూ చూడరు.
జాక్ లండన్ రచనా శైలి మాత్రమేగాక అతను జీవించిన విధానం కూడ నాకు చాలా ఇష్టం. జాక్ 'ఐరన్ హీల్' గొప్ప డెస్టోపియన్ నవల. అందులో అణువణువునా అతని మేధస్సు కనిపిస్తుంది. అయితే, దానికన్నా అతని 'కాల్ ఆఫ్ ద వైల్డ్', ‘వైట్ ఫాంగ్’ నాకు మరీ ఇష్టం. కుక్కను, తోడేళ్లను పెట్టి కథను నడిపించిన తీరు, అనుక్షణం కొనసాగించిన సామాజిక, రాజకీయ వ్యాఖ్యానాలు అద్భుతం అనిపిస్తాయి. అన్నింటికి మించి జాక్ లండన్ కాల్పానిక సృజనాత్మకత సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.
పందులు, కుక్కలు, గుర్రాలు, గాడిదల్ని ప్రధాన పాత్రలుగా పెట్టి జార్జ్ ఆర్వెల్ 'యానిమల్ ఫార్మ్' రాశాడు. జేవీ స్టాలిన్ భక్తులకు ఇది నచ్చకపోవచ్చు. శిల్పపరంగా ప్రపంచ సాహిత్యంలో ఇంతగొప్ప పొలిటికల్ సెటైర్ మరెవ్వరయినా రాశారేమో నాకు తెలీదు. నేను ప్రపంచ సాహిత్యం మొత్తం చదివినవాడిని కానని ఇందుమూలముగా అందరికీ తెలియజేసుకుంటున్నాను.
పదిహేను వందల కిలో మీటర్లు ప్రవహించే గోదావరినది వశిష్టా గోదావరిగా చీలి సముద్రంలో కలిసే చోట పుట్టాను. రోజూ గోదావరిని చూస్తూ పెరిగాను. హాస్యం, వెటకారం, ఎద్దేవ, అధిక్షేపణ, వ్యంగ్యం నరసాపురోళ్ళ జన్మహక్కు.
ఐదేళ్ల క్రితం తోడేళ్ళు, మేక పిల్లల్ని పెట్టి నేను 'మదరసా మేక పిల్ల' పేరుతో ఒక డెస్టోపియన్ కథ రాశాను. డెస్టోపియన్ అంటే మనం కోరుకోని సమాజం, మనం వద్దనుకునే సమాజం, మనం భరించలేని సమాజం, మనం నడుం బిగించి నాశనం చెయ్యాల్సిన సమాజం.
ఈసారి వ్యంగ్య నవల రాయాలనుకుంటున్నాను. అందులో నేను చెప్పదలచిన అనేక అంశాలకు గాడిద పాత్రయే సరైనది అనిపిస్తున్నది. అలనాటి కిషన్ చందర్ గాడిదను నాయుకగా పెట్టి ఏకంగా మూడు నవలలు (ట్రయాలజీ) రాశాడు. గోగోల్, మపాసా, లూసన్ వంటి ముగ్గురు ప్రపంచ ప్రసిధ్ధ రచయితలు ‘పిచ్చివాని డైరీ ‘ అనే ఒకే శీర్షికతో మూడు కథలు రాశారు. గాడిద ఆత్మకథ శీర్షికతో ఇతర భాషల్లోనూ కొన్ని నవలలు వచ్చాయి. మొరాకో రచయిత హసన్ ఔరిద్ (Hasan Aourid) రాసిన నవల అందులో ఒకటి.
ఇప్పుడు నేను మళ్ళీ గాడిదను ప్రధాన పాత్రను చేసి రాస్తే ఎవరికయినా తప్పకుండా కిషన్ చందర్ గుర్తుకు వస్తాడు. నా నవల చదువుతున్నప్పుడు అంతటి పెద్దవాడు గుర్తుకు వస్తే అది నాకు గౌరవమేగానీ నామోషీ ఏమీ కాదు. ఒక విధంగా ఇది కిషన్ చందర్ కు నా నివాళి. అంచేత, గాడిదే నా హీరో.
రాతలో పురుషాల గురించి చెపుతూ "వాడు ప్రధముండ, నువ్వు మధ్యముండ, నేను ఉత్తముండ" అన్నారుగా పరవస్తు చిన్నయ సూరిగారూ. నేను ఉత్తముండగా రాయదలిచాను. అనగా నేనే ఆ గాడిద కాదలిచాను!. ఇది ఫిక్స్. ఇంకొకళ్ళు మనల్ని గాడిద అనడానికి ముందే మనల్ని మనం గాడిద అనుకోవడం గొప్ప వివేకం కదా!.
ఈ నవల స్ట్రక్చరులో 15 అధ్యాయాలుంటాయి. 200 ప్లస్ పేజీల నవల మొత్తంగా రాసి పుస్తకంగా తేవాలా? ఎప్పటికప్పుడు ఏ పేజీకి ఆ పేజీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టేయాలా? అనే రెండు ఆలోచనలున్నాయి. సోషల్ మీడియాలో రెండు తొలి అధ్యాయాలు పెట్టి తరువాత పుస్తకంగా ప్రచురించడం మంచిదనిపిస్తోంది. టీజర్లు అన్నమాట.
ఇప్పుడు జరుగుతున్న జమిలీ ఎన్నికల హడావిడిలో దీన్ని మొదలుపెట్టవచ్చా అనే సందేహమూ ఒకటి వున్నది. కుల పోరాటాలు, మత యుధ్ధాలుగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఏవో విప్లవాత్మక మార్పులు వస్తాయని నమ్మడం కష్టం. ఎవరు గెలుస్తారూ? ఎవరు ఓడుతారు అనే దానితో పనిలేకుండానే సామాన్య గాడిదలకు గుప్పెడు గడ్డి కూడ దొరకనంత గడ్డు రోజులు రానున్నాయి.
కొన్ని నెలల క్రితం ఓ రైటర్స్ మీట్ లో ఓ రాత్రి మిత్రులతో పిచ్చాపాటిగా ఏవో పాత విషయాలు చెపుతుంటే వేల్పూరి సుజాత ఆసక్తిగా విని నా ఆత్మకథ రాయాలని చెప్పింది. దానికి ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్ అన్నీ తనే చేస్తానంది. మా మధయ ఈ ఒప్పందం ఇలా వుండగా నా జీవితంలోనికి ఓ గాడిద ప్రవేశించింది. దీనికి కూడ సంపాదకురాలిగా వుంటానని తనే స్వఛ్ఛందంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. పుస్తకాలు వేసే ఆర్ధిక స్తోమత లేదు కనుక ప్రచురణకర్తలు కూడ త్వరలో ముందుకు వస్తారని నమ్ముతున్నాను.
ఉష
యస్ డానీ
No comments:
Post a Comment