Wednesday, 11 September 2024

The History of Prakasham Barrage

 మనం తెలుసుకోవాల్సిన ప్రకాశం బరాజ్ చరిత్ర

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

 

 

పెద్ద ఆపద ముంచుకుని వస్తేగానీ మనకు చరిత్ర గుర్తుకురాదు. అలా ఇప్పుడు ప్రకాశం బరాజ్ చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కృష్ణానది వరద సెప్టెంబరు 2న రికార్డు స్థాయిలో 11 లక్షల 50 వేల కుసెక్కుల వేగంతో ప్రహించింది. బెజవాడ నగరాన్ని, కృష్ణాడెల్టానేకాక మొత్తం ఆంధ్రప్రదేశ్ ను ఓ నాలుగు రోజులు భయపెట్టిన కృష్ణ వరద ఇప్పుడు తగ్గుముఖం పట్టేక  మనం నిర్లక్ష్యం చేసిన అనేక సమస్యలు వరదలా ముందుకు వస్తున్నాయి.

 

తిరుగుబాటుల్ని అణిచివేయడమా? సంక్షేమ పథకాల్ని అమలు చేయడమా?

 

ప్రస్తుతంవున్న ప్రకాశం బరాజ్ కు కొన్ని అడుగులు దిగువన గతంలో బెజవాడ ఆనకట్ట వుండేది. దాన్ని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1855లో నిర్మించింది. గోదావరి నది మీద ధవిళేశ్వరం వద్ద 1852లో ఆనకట్టను నిర్మించిన కెప్టెన్ ఆర్ధర్ థామస్ కాటనే బెజవాడ ఆనకట్టనూ డిజైన్ చేశాడు. అప్పట్లో గోదావరి కృష్ణా మండలాలు ఒకే కలక్టరేట్ పరిధిలో  వుండేవి.  అప్పటి కలెక్టర్ గోర్డన్ మెకంజీ (Gordon Mackenzie) అనుకుంటా. 

 

ఆనకట్ట ఎడమగట్టు ప్రధాన కాలువ మూడు కాలువలుగా చీలి బెజవాడ పట్టణం మీదుగా తూర్పు డెల్టా దిశగా సాగడం ఒక అందమైన ఇంజినీరింగ్ రూపకల్పన. వెనిస్ నగరాన్ని తలపించే వెనిటియన్ (Venetian) డిజైన్ ఇది. 11.8 లక్షల కూసెక్కుల నీటి విడుదల సామర్ధ్యంతో దీన్ని రూపకల్పన చేశారు.  అయితే, ధవిళేశ్వరం ఆనకట్ట నిర్మాణ కాలంలోనే కాటన్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. బెజవాడ ఆనకట్ట నిర్మాణ బాధ్యతను కెప్టెన్ చార్లెస్ అలెగ్జాండర్  ఆర్ర్ (Charles Alexander Orr) స్వీకరించి పూర్తి చేశాడు. ఈ ఆనకట్ట దాదాపు ఐదు లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు డెల్టా గ్రామాలకు తాగునీరు అందించేది.

 

కాటన్, ఆర్ర్ లకు ఒక ‘సినిమాటిక్’ చరిత్ర ఉంది. ఇద్దరూ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కెప్టెన్ స్థాయి సైనికాధికారులు. ఇప్పటి గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్ని అప్పట్లో సంవత్సరాల తరబడి క్షామం  పీడించింది. ఒక్క పూట తిండి కోసం పిల్లల్ని అమ్ముకోవడానికి తల్లిదండ్రులు సిధ్ధం అయ్యేవారు. అంతటి దయనీయ పరిస్థితి. జనం కంపెనీ పాలన మీద పీకలోతు కసితో రగిలిపోయారు.  ఇండియాలో తమ పాలన ఆరంభమయ్యి నూరేళ్ళు (1757-1857) కావస్తున్న సందర్భంగా అనేకచోట్ల తిరుగుబాట్లు చెలరేగవచ్చని కంపెనీ పాలకులు భయపడ్డారు. జరగబోయే తిరుగుబాట్లను ముందుగానే  అణిచివేయడానికి  సైనికాధికారుల్ని గోదావరి- కృష్ణా మండలానికి పంపించాడు అప్పటి గవర్నర్ జనరల్ (హెన్రీ హార్డింగే నా? డల్హౌసీ నా?). 

 

తిరుగుబాటుని నివారించడానికి ఇక్కడికి వచ్చిన కెప్టెన్ కాటన్ దైవ భక్తుడు. పక్కనే గోదావరి, కృష్ణా వంటి గొప్ప నదులు ప్రవహిస్తున్నప్పటికీ మనుషులు  తిండిలేక చనిపోతుండడాన్ని చూసి చలించిపోయాడు. ఆకలితో అలమటిస్తున్నవారిని  తుపాకులతో అణిచివేయడం ఆయనకు నచ్చలేదు. గోదావరి మీద ఓ నాలుగు అడుగుల ఎత్తున్న ఆనకట్ట కట్టి కొంచెం సాగునీరు అందిస్తే  పండించుకుని తింటారు. కడుపులో తిండి పడితే తిరుగుబాట్లు చేయరుకదా అని ఆలోచించాడు.

 

భారీ ఖర్చుతో కూడిన ఆనకట్ట నిర్మాణం ప్రతిపాదనను కంపెనీ ఒప్పుకోలేదు. కరువు మూలంగా ఆదాయం పడిపోవడంతో కంపెనీ దగ్గర నిధులు కూడ లేవు.  అయినా కాటన్ పట్టు వదలలేదు. కంపెనీకి అనేక ఆర్ధిక ప్రయోజనాలు సమకూరుతాయని వివరిస్తూ రెండో నివేదిక సమర్పించాడు. నీటిశిస్తు విధించి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చు; కాలువలతో పడవ రవాణా సౌకర్యం అభివృధ్ధి చెందుతుంది; ఇక్కడి భూముల్లో  పత్తి పండిస్తే మాంచెస్టర్  కాటన్ మిల్లులకు ముడి సరుకు చౌకగా దొరుకుతుంది; వగయిరా ఆశలు కల్పించాడు. కాటన్ రెండో ప్రయత్నం ఫలించింది. అలా  గోదావరి మీద ధవిళేశ్వరం ఆనకట్ట సాకారం అయ్యింది. అదే వరవడిలో కృష్ణా మీద బెజవాడ ఆనకట్ట మొదలయ్యింది. తిరుగుబాటుదార్లను అంతం చేయడమా? సంక్షేమ పథకాల్ని అమలు చేయడమా? అని అడిగితే రెండోదే మంచి ఆప్షన్ అనేది కాటన్ అభిప్రాయం.  

 

 

97 ఏళ్ళు సమర్ధంగా పనిచేసిన  బెజవాడ ఆనకట్ట 1952 సెప్టెంబరు నెలలో కూలిపోయింది. అప్పట్లో విజయవాడ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేది. సి రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా వుండేవారు. ఆంధ్రా ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా ఉద్యమం సాగుతోంది. అందులో భాగంగా పొట్టి శ్రీరాములు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రాజకీయ సంక్షోభ కాలంలో బెజవాడ ఆనకట్టను మద్రాసు ప్రభుత్వం పట్టించుకోలేదు.

 

1953 అక్టోబరు 1న  టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం, నిధుల కొరతున్న రాష్ట్రం. అయినప్పటికీ  బెజవాడ ఆనకట్టకు కొన్ని అడుగుల ఎగువన ఏకంగా 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే భారీ బరాజ్ ను నిర్మించడానికి  1954లో ప్రకాశం పంతులు నడుం బిగించారు. ఈలోగా ఆంధ్రరాష్ట్రం, తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి  1957లో దీన్ని పూర్తి చేశారు. అంతటి రాజకీయ సంక్షోభంలోనూ, అంతకన్నా తీవ్రమైన  ఆర్ధికలోటులోనూ, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రపరికరాలు  అంతగా అందుబాటులోలేని కాలంలో ఇంతటి భారీ ప్రాజెక్టును మూడేళ్ళలో పూర్తి చేయడం మహత్తర విషయం. అప్పటికి అది దేశంలోనే అత్యంత ఆధునిక ప్రాజెక్టు.

 

గోదావరి, కృష్ణా జీవనదులు కావు. వర్షాకాలం మాత్రమే నీరు వచ్చి చేరుతుంది. వేసవిలో ఈ నదులు పూర్తిగా ఎండిపోతాయి. ఆ సమయంలో బరాజ్ గేట్లు, పిల్లర్లకు మరమ్మత్తులు చేసేలా,  రిజర్వాయర్ లో వచ్చి చేరే పూడికను తొలగించేలా డిజైన్ చేశారు.

 

ఇబ్రహీంపట్నం వద్ద విజయవాడ ధర్మల్ పవర్ ప్రాజెక్టు (VTPS) రావడంతో ప్రకాశం బరాజ్ కు కష్టాలు మొదలయ్యాయి. ధర్మల్ పవర్ ప్రాజెక్టులకు కూలింగ్ టవర్స్ వుండాలి. దానికి బోలెడు ఖర్చు అవుతుంది. వాటికి బదులు కృష్ణానదినే కూలింగ్ ప్లాంటుగా వాడుకునేలా డిజైన్ చేశారు. కృష్ణానది నది నుండి విటిపిఎస్ కు కూలింగ్  కెనాల్ ద్వార నీరు పారాలంటే (gravity flow)  బారేజ్ దగ్గర నిరంతరం 12 అడుగుల  లెవల్ లో నీరుండాలి. బారేజ్ క్రస్ట్ గేటు ఎత్తు కూడ 12 అడుగులు. అంటే నిరంతరం బారేజ్ రిజర్వాయరును నిండుగా (FRL) వుంచాలి. కరువు రోజుల్లోనూ  రిజర్వాయరులోని నీటిని వాడుకోవడానికి వీలు లేకుండాపోయింది. ఇది మొదటి ఇబ్బంది. ప్రతి వేసవిలో పూడికను తొలగించకపోతే మేటవేసి రిజర్వాయర్ లో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోతుంది. ఇది రెండో ఇబ్బంది. సంవత్సరాల తరబడి పిల్లర్లు, గేట్లకు వేసవి మరమ్మత్తులు  చేయడం సాధ్యంకాలేదు. జలాశయం నిరంతరం నిండుగా వుండడంతో నీటిలోవున్న గేట్ల పరిస్థితిని కనీసం పరిశీలించే అవకాశం కూడ లేకుండాపోయింది. ఇది ప్రమాదం.  ఇప్పుడయితే తాత్కాలికంగా డమ్మీ గేట్లను పెట్టి అసలు గేట్లను మార్చడానికి వీలుండేలా పిల్లర్లను డిజైన్ చేస్తున్నారు. ప్రకాశం బారేజీకి అలాంటి సౌకర్యం లేదు. ఇప్పుడు గేట్లు మార్చాలంటే అదో పెద్ద కార్యక్రమం అవుతుంది.

 

నిర్మాణానికి అప్పడప్పుడు పగుళ్ళు (Cracks and cavities) ఏర్పడతాయి. వాటిని ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పద్దతుల్లో పూడ్చాలి. లేకుంటే నిర్మాణం సామర్ధ్యం తగ్గిపోతుంది. ఇంకాస్త నిర్లక్ష్యం చేస్తే ఏకంగా నిర్మాణమే కూలిపోతుంది. ప్రకాశం బరాజ్ ను దగ్గరగా పరిశీలిస్తే సామాన్యుల కంటి చూపుకు కూడ పగుళ్ళు కనిపిస్తాయి. నీటిపారుదలశాఖా మంత్రులకు, అధికారులు – సిబ్బందికి ఈ పగుళ్ళు కనిపించవు.

 

ఇక్కడ బి-స్టోరి ఒకటుంది. 1960లలో  అప్పటి విజయవాడ మునిసిపల్ కమీషనర్ అజిత్ సింగ్ కృష్ణలంకలోని కృష్ణానది ముంపు బాధితులకు పట్టణ శివార్లలో పునరావాసం కల్పించారు. అలా ఆయన పేరిట సింగ్ నగర్ ఏర్పడ్డది. అది బుడమేరు పరివాహక ప్రాంతంలో వుంది. ఎప్పుడు వరద వస్తుందో ఎప్పుడు ఎండిపోతుందో ఊహించ శక్యంకాని చిన్న ఏరు బుడమేరు. దాని నడక కూడ వేగంగా పాకుతున్న పాములా అనేక మెలికలు తిరుగుతూ వుంటుంది. కానీ, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసినప్పుడు దానికి అకస్మాత్తు వరదలు (Flash Floods) వస్తుంటాయి. దాని సహజ మార్గం ఆక్రమణలతో పూడిపోవడంతో వరద సమయంలో బుడమేరు నగరం మీదికి వచ్చేస్తుంది. అలా దానికి విజయవాడ దుఖ్ఖఃదాయిని (Sorrow of Vijayawada) అనే పేరు వచ్చింది.  

 

నిరంతరం విస్తరించే నగరాన్ని ఎవ్వరూ ఆపలేరు. కనుక, బుడమేరు సమస్యను 1980లలో రెండు రకాలుగా పరిష్కరించారు. సింగ్ నగర్ పరిసరాల్లో వరదకట్ట నిర్మించారు; వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటర్ నిర్మించి బుడమేరు మళ్ళింపు కాలవ (BDC) తవ్వారు. ఈ బిడిసి; ఎన్టిపిఎస్ ఔట్ ఫ్లో కూలింగ్ కెనాల్ తో జతకూడి ఇబ్రహీంపట్నం ఫెర్రి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. కొత్తగా తవ్విన గోదావరి-కృష్ణా అనుసంధానం కాలువను కూడ వీటిలోనే కలిపారు.

ఆగస్టు చివరి వారంలో ఖమ్మం జిల్లా నుండి బుడమేరుకు భారీ వరద వచ్చింది. మరోవైపు, గోదావరి-కృష్ణా అనుసంధానం నీళ్ళొచ్చాయి. విటిపిఎస్ కూలింగ్ కెనాల్ నీళ్ళు ఎలాగూ వున్నవే.  సరిగ్గా అప్పుడు రికార్డు స్థాయి భారీ వరదతో ప్రవహిస్తున్న కృష్ణానది ఈ మూడు నీళ్ళను  స్వీకరించకపోగా తిప్పికొట్టింది. రాజకీయ ప్రాబల్యం గలవారు ఎప్పుడో బుడమేరు వరదకట్ట మట్టిని తవ్వి అమ్ముకున్నారు. కృష్ణా వరద ధాటికి బుడమేరు ప్రవాహం వెనక్కు పరుగులు తీసింది. కరకట్ట లేదు కనుక ఉగ్రంగా మారి నగరం మీద పడింది. విజయవాడలో నాలుగో భాగం  నీట మునిగింది.   ఈ విషాదానికి దోషులు ఒక్కరు కాదు;  అనేకులు!

ఈరోజు సాక్షి దినపత్రికలో న వ్యాసం 'బెజవాడ ముంపు పాపం ఎందరిదీ?' వచ్చింది.
స్థలాభావం వల్ల కొంత భాగం అచ్చుకాలేదు. ఆసక్తిగలవారు ఇక్కడ చదవచ్చు.
మీ అభిప్రాయాలూ తెలిపితే ఆనందిస్తాను.





బెజవాడ ముంపు పాపం ఎందరిదీ?
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
రెండు ఆబ్జెక్ట్స్ ఒకే సమయంలో ఒకే స్పేస్ లో ప్రవేశించే ప్రయత్నం చేస్తే యాక్సిడెంట్ జరుగుతుందనేది ఫిజిక్స్ సూత్రం. మనుషులు సామాజిక జీవితంలోనూ తరచూ ఇలాంటి తప్పులు చేస్తుంటారు. అనవసర సమస్యల్ని కోరి తెచ్చుకుంటుంటారు. పాపం వాళ్ళకు ఫిజిక్స్ లోని యాక్సిడెంట్ సూత్రం తెలికపోవచ్చు. కానీ, సివిల్ - మెకానికల్ ఇంజినీరింగుల్లో లో పిహెచ్ డీలు చేసి రాష్ ట్రానికి ఇంజినీర్ – ఇన్-చీఫ్ వంటి అత్యంత బాధ్యతగల పదవుల్ని నిర్వహిస్తున్న వారికి అయినా యాక్సిడెంట్ సూత్రాలు తెలియాలిగా? తెలియకపోతే విజయవాడ ముంపు లాంటి విషాదాలే జరుగుతాయి!.
ప్రకృతి విపత్తులు ఒక రుతు క్రమంలోనే జరుగుతుంటాయి. వాటివల్ల విధ్వంసం జరిగితే ఆ తప్పు ప్రకృతిదికాదు; ప్రకృతితొ చెలగాటం ఆడిన మనుషులది. ఇప్పుడు మనం మొన్నటి కృష్ణానది వరద గురించీ, విజయవాడ ముంపు గురించీ మాడ్లాడుకుందాము.
ప్రకాశం బారేజిని చాలా కష్టకాలంలో చాలా కష్టపడి ఆంధ్ర రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు దశల్లో నిర్మించాయి. ఇప్పటి ప్రకాశం బ్యారేజికి కొన్ని అడుగులు దిగువన ఇంతకు ముందు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన ‘బెజవాడ ఆనకట్ట’ వుండేది. దీన్ని 1852లో మొదలెట్టి 1855లో పూర్తిచేశారు. ఆ ఆనకట్టను కెప్టెన్ ఆర్ధర్ థామస్ కాటన్ డిజైన్ చేయగా మరో కెప్టెన్, ఛార్లెస్ అలెగ్జాండర్ ఆర్ర్ (Charles Alexander Orr) నిర్మించాడు. దాదాపు ఒక శతాబ్ద కాలం సమర్ధంగా పనిచేసిన కాటన్ – ఆర్ర్ ఆనకట్ట 1952 సెప్టెంబరు నెలలో కూలిపోయింది.
అప్పుడు ఈ ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేది. సి రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా వుండేవారు. సరిగ్గా అప్పుడే ఆంధ్రా ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం వుదృతంగా ఉద్యమం సాగుతోంది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టడంతో రాజకీయం బాగా వేడెక్కింది. ఇంతటి రాజకీయ సంక్షోభ సమయంలో విలవిల్లాడుతున్న మద్రాసు ప్రభుత్వం, బెజవాడ ఆనకట్ట కూలిపోవడాన్ని పట్టించుకోలేదు. 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
కొత్త రాష్ట్రం; చిన్న రాష్ట్రం; నిధుల కొరత వున్న రాష్ట్రం. అయినా సరే పాత ఆనకట్ట స్థానంలో భారీ బారేజ్ కట్టాలని తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నడుం బిగించారు. పాత ఆనకట్ట ఆయకట్టుకన్నా మూడురెట్లు ఎక్కువ - అంటే దాదాపు 13 లక్షల ఎకరాలకు- సాగునీరు, డెల్టా గ్రామాలకు తాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ వద్ద కృష్ణానది వరద గరిష్టంగా 12 లక్షల కుసెక్కులు ప్రవహిస్తుందని 175 యేళ్ళ క్రితం ఆర్ధర్ థామస్ కాటన్ అంచనా వేశాడు. దాన్ని తగ్గించడం కుదరదు. అలా 12 అడుగుల ఎత్తు క్రస్ట్ గేట్లతో ఒక భారీ బరాజ్ డిజైనింగ్ రూపుదిద్దుకుంది.
బరాజ్ నిర్మాణ కాలంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా ఆంధ్రాప్రాంతానికి తెలంగాణా ప్రాంతం కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి హయాంలో 1957లో బారాజ్ నిర్మాణం పూర్తయింది. మూడు రాష్ట్రాలు నలుగురు ముఖ్యమంత్రులు మారినా అంతటి బరాజ్ నిర్మాణం మూడేళ్ళలో (1954-57) పూర్తి అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పటికీ చిత్తశుధ్ధి తగ్గిపోయిన కారణంగా భారీ బరాజ్ ల నిర్మాణానికి దశాబ్దాలు పడుతోంది.
సాంకేతికంగా ప్రకాశం బరాజ్ నిర్మాణంలో ఒక మెలిక వున్నది. వర్షాకాలంలో మాత్రమే బరాజ్ కు నీరు వచ్చి చేరుతుంది. వేసవిలో ఎగువ నుండి నీరు రావు. బరాజ్ రిజర్వాయర్ లో నిల్వవుండే మూడు టిఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడేవారు. నది ఎండిపోయినపుడు క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేసేవారు. ఆయిల్ పోసేవారు; గ్రీజు పట్టించేవారు. అవసరం అయితే పాత గేట్లకు బదులు కొత్త గేట్లు అమర్చేవారు. జలాశంలో చేరిన మేటను తొలగించేవారు. ఇప్పుడయితే జలాశయంలో నీరువుండగానే గేట్లు మార్చే ‘స్టాప్ లాగ్ గేట్ల’ సౌకర్యం వచ్చింది. ప్రకాశం బరాజ్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు. అయితే, అప్పటికి స్టాప్ లాగ్ గేట్ల పరిజ్ఞానం అభివృధ్ధి కాలేదు. ఆ అవసరమూ అప్పుడు లేదు.
సుబ్బి పెళ్ళి వెంకి చావుకు వచ్చినట్టు విజయవాడ సమీపంలో థర్మల్ పవర్ స్టేషన్ (విటిపిఎస్) రావడంతో ప్రకాశం బారేజ్ కు ముప్పు మొదలయింది. థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో వేడి నీటిని చల్లార్చి మళ్ళీ వాడడానికి వీలుగా కూలింగ్ టవర్స్ ను ఏర్పాటు చేయాలి. విటిపిఎస్ నేరుగా కృష్ణానదిని కూలింగ్ యూనిట్ గా మార్చుకుంది. అందుకు అనువుగా కృష్ణ నది నుండి విటిపిఎస్ కు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కాలువలు నిర్మించారు. ఇన్ ఫ్లో కాలువ లోనికి కృష్ణానది నీరు పారాలంటే (గ్రావిటీ ఫ్లో) రిజర్వాయర్ నీటి మట్టాన్ని పూర్తి స్థాయిలో (FRL) నిరంతరం నిండుగా వుంచాల్సి వచ్చింది.
ఒక ప్రత్యేక లక్ష్యం కోసం నిర్మించిన బారేజ్ ను వేరే లక్ష్యంతో నిర్మించిన విటిపిఎస్ తో లంకె పెట్టడం పెద్ద పొరపాటు. ఒకే సమయంలో ఒకే స్పేస్ లో రెండు ఆబ్జెక్ట్స్ ప్రవేశించాయి. దీనివల్ల నాలుగు ప్రమాదాలు జరిగాయి. మొదటిది, జలాశయాన్ని నిరంతరం నిండుగా వుంచాల్సి రావడంతో వేసవిలో దిగువ గ్రామాలకు తాగునీరు అందించడం సాధ్యం కాలేదు. రెండోది; వేసవిలో బరాజ్ క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేపట్టడం కుదరలేదు. మూడోది, బరాజ్ నిర్మాణం, పిల్లర్లు, క్రస్ట్ గేట్ల పరిస్థితి నీటిలో ఎలా వున్నాయో కనీసం పరిశీలించడానికి కూడ వీలు కాలేదు. నాలుగోది, మేటను తీయడం సాధ్యం కాకపోవడంతో జలాశయంలో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోయింది.
ప్రకాశం బరాజ్ బలం తగ్గుతోందనే భయాలు 1980ల లోనే మొదలయ్యాయి. విటిపిఎస్ తో లింకు తెగ్గొట్టాలని ఆయకట్ట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సమస్యకు ప్రిష్కారంగా విటిపిఎస్ ఇన్-ఫ్లో కెనాల్ కోసం బరాజ్ ఎగువన పంపింగ్ స్టేషన్ నిర్మించారు.
ఒక ప్రశ్నకు సమాధానం మరో ప్రశ్నకు దారితీస్తుంది అనేది జ్ఞాన సూత్రం. ఒక సమస్యకు పరిష్కారం మరో సమస్యకు దారితీయడం అజ్ఞాన సూత్రం. అలాంటిది విటిపిఎస్ ఔట్ ఫ్లో (కూలింగ్) కెనాల్ విషయంలో జరిగింది.
ఆ వివరాల్లోనికి వెళ్ళడానికి ముందు బుడమేరు చరిత్రను కొంచెం పరిశీలించాలి. అదొక చిన్న వాగు. తరచూ నీళ్లు లేక ఎండిపోయి వుంటుంది. ఏరు మార్గం వేగంగా పాకుతున్న త్రాచుపాములా అనేక మెలికలు తిరిగి వుంటుంది. నేరుగా వెళితే 10 కిలోమీటర్లు కూడా లేని దూరాన్ని మెలికలతో 33 కిలో మీటర్లు సాగుతుంది. అలా కిందికి పోయి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఖమ్మం జిల్లాలోనో, కృష్ణాజిల్లా వాయువ్య ప్రాంతంలోనో భారీ వర్షాలు కురిసినపుడు బుడమేరుకు అకస్మిక వరదలు (flash Floodస) వస్తాయి. వరద రోజుల్లో బుడమేరులో 20 వేల కుసెక్కుల వేగంతో నీరు పారుతుందని అంచనా. వరద వేగానికి వాగు మెలికలు తట్టుకోలేవుగనుక గట్లు తెగి నీరు విజయవాడ మీద పడుతుంది. అందుకే బుడమేరుకు ‘విజయవాడ దుఖ్ఖఃదాయని’ అని ఓ చెడ్డ పేరుంది.
1960లలో విజయవాడ కృష్ణలంకను వరద ముంచేసినపుడు ఆ బాధితులకు పట్టణ శివార్లలో పునరావాసం కల్పించారు అప్పటి మునిసిపల్ కమీషనర్ అజిత్ సింగ్. అలా ఆయన పేరున సింగ్ నగర్ ఏర్పడింది. నగరం విస్తరించే కొద్దీ సింగ్ నగర్ కూడ అనేక పేర్లతో మరింతగా విస్తరించింది. విచిత్రం ఏమంటే ఆ పరిసరాలన్నీ బుడమేరు పరివాహక ప్రాంతం. దాని అర్ధం ఏమంటే కృష్ణా ముంపు బాధితులు బుడమేరు ముంపు బాధితులుగా మారారు.
బుడమేరును అదుపు చేయడానికి 1980 లలో మూడు ప్రతిపాదనలు వచ్చాయి. మొదటిది, స్ట్రయిట్ కట్ నిర్మించాలనేది. రెండోది, అజిత్ సింగ్ నగర్ పరిసరాల్లో కరకట్ట నిర్మించాలనేది. మూడోది, వెలలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ నిర్మించి సగం నీటిని కృష్ణానదిలోనికి మళ్ళించడానికి బుడమేరు డైవర్షన్ ఛానల్ (బిడిసి) కట్టాలనేది. స్ట్రయిట్ కట్ నిర్మించలేదు గానీ మిగిలిన రెండూ సాకారం అయ్యాయి.
ఈ పరిష్కారాల్లోనూ ‘రెండు ఆబ్జెక్ట్స్ ఒకే సమయం ఒకే స్పేస్’ అనే సూత్రాన్ని మరచిపోయారు. బిడిసి కోసం ప్రత్యేకంగా కాలువ తవ్వకుండా దాన్ని విటిపిఎస్ కూలింగ్ కెనాల్ లో కలిపారు. అలాగే, రాజకీయ నాయకులు మట్టి ఇసుక కొండలు అడవులు ఒకేచోట వుండవుకదా! కరకట్ట మట్టిని రాజకీయ నాయకులు తవ్వుకొని అమ్మేసుకున్నారు!.
గ్రావిటీ ఫ్లోలో బిడిసి, విటిపిఎస్ కూలింగ్ కెనాల్ నీళ్ళు ఇబ్రహీంపట్నం ఫెర్రీవద్ద కృష్ణానదిలో కలిపోతాయని ప్రాజెక్టు డిజైనర్లు భావించారు. వరద కాలంలో కృష్ణా పారుదల లెవెల్ పెరిగి బిడిసి, విటిపిఎస్ కూలింగ్ కెనాల్ ల లోనికి కృష్ణా నీళ్ళు ఎదురు వస్తాయనే ఆలోచన వారికి రాకపోవడం విచిత్రం.
ఈ విచిత్రం ఇంతటితో ఆగలేదు. గోదావరి బేసిన్ నీటిని పట్టిసీమ పంపింగ్ స్టేషన్ నుండి కాలువల ద్వార కృష్ణా బేసిన్ లోనికి మళ్ళించడం మొదలెట్టారు. ఆ కాలువను కూడ బిడిసితో కలిపారు. విటిపిఎస్ కూలింగ్ వాటర్, బుడమేరు వరద నీరు, గోదావరి అనుసంధానం నీరు మొత్తం మూడు నీళ్ళు ఒకే కాలువ ద్వార కృష్ణా నదిలో పారాలి. ఆ సమయంలో కృష్ణా నదికి వరద వస్తే ఏమిటీ పరిస్థితి? నాలుగు ఆబ్జెక్టులు ఒకేసమయంలో ఒకే స్పేస్ లో కలుస్తాయి. ఇది ఎంతటి దుస్సాహసమో చెప్పనలవి కాదు. కృష్ణా వరద బిడిఎస్ లోనికి వెనక్కు రాకుండా కనీసం ఒక లాక్ సిష్టం పెట్టాలనే ఆలోచన కూడ ఇంజినీరింగ్ డిజైనర్లకు రాలేదు.
నీటిపారుదలా శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన ప్రకారం ఆగస్టులో గోదావరి అనుసంధానం కాలువలో 8 వేల కుసెక్కుల నీరు పారుతోంది. ఆ సమయంలో బుడమేరులో ఎగువ నుండి 40 వేల కూసెక్కుల వేగంతో వరద వచ్చింది. సరిగ్గా అదే సమయంలో కృష్ణానది వందేళ్ళలో ఎన్నడూ లేనంత వుదృతంగా పారుతోంది. లాక్ సిస్టం లేదు కనుక కృష్ణానది బిడిఎస్ ద్వార బుడమేరు లోనికి వచ్చేసింది. తన నీటినే తట్టుకోలేని బుడమేరు; కృష్ణా వరదను తట్టుకుంటుందా? మూడు నీళ్లు కలిసి విజవాడలో మూడో భాగాన్ని ముంచేశాయి.
అంతిమంగా నీతి ఏమంటే, ఇళ్ళకు నీరు కావాలిగానీ, ఇళ్ళ లోనికి నీరు రాకూడదు. ఇళ్ళూ నీళ్ళూ ఒకే సమయంలో ఒకే స్పేస్ లో వుండడం అస్సలు కుదరదు. నీటిలో ఇళ్ళుకట్టినా, ఇళ్ళలోనికి నీరు వచ్చినా విపత్తు తప్పదు.

11-09-2024
//EOM//

https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=11/09/2024&pgid=461686&device=desktop&view=3