Wednesday, 27 November 2024

Generation to generation is a new history!

 Generation to generation is a new history!

*తరం తరం ఒక కొత్త చరిత్ర!*

 

(చదివి మీ అభిప్రాయాలు తెలిపితే ఆనందిస్తాను; ఆలోచిస్తాను – డానీ)  




 

Generation to generation is a new history!

*తరం తరం ఒక కొత్త చరిత్ర!*

 

(చదివి మీ అభిప్రాయాలు తెలిపితే ఆనందిస్తాను; ఆలోచిస్తాను – డానీ)  

 

మనకు తెలిసినదే వాస్తవమని, తెలిసిన దానిలో మనకు నచ్చినదే జీవిత సత్యమని నమ్మే భావన ఒక సామాజిక అవగాహనగా దాదాపు మనందరిలోనూ స్థిరంగా కొనసాగుతూ వుంటుంది.  కానీ, భావనలు పాక్షికమైనవి. వాస్తవానికి భిన్నమైనవి. ప్రతి అంశానికీ విరుధ్ధమైన పూర్తి వ్యతిరేకమైన అంశం  మరొకటి వుండి తీరుతుంది. ఈ నియమం జీవరాశులకు మాత్రమే కాక, మనం సాధారణంగా నిర్జీవరాశులుగా భావించే రాళ్ళు, రప్పలు, ఖనిజాలు, యంత్రాలకు కూడ వర్తిస్తుంది. ప్రపంచంలో ప్రతీదీ నిరంతరం విరుద్ధ అంశాల పరస్పర సంఘర్షణ (dialectics) లోనే ముందుకు సాగుతుంటుంది.

 

చరిత్ర గమనాన్ని పరిశీలించడానికి మనకు అనేక రకాల పనిముట్లు అందుబాటులో వున్నాయి. అసలు పనిముట్ల ఆధారంగానే మానవ చరిత్రను వివరించే విధానం ఒకటుంది. పాత రాతియుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతియుగం, కంచు యుగం, ఇనుప యుగం, పురాతన యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం మొదలుకుని ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్సీల వరకు పనిముట్ల వినియోగం  ఆధారంగా మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని తద్వార సాగే సమాజ గమనాన్నీ వివరించవచ్చు.

 

రాజులు, చక్రవర్తులు వాళ్ళ కులమతాలు  వాళ్ళు అనుసరించిన పరిపాలన విధానాల ద్వార కూడ చరిత్రను వివరించే పధ్ధతులు కొన్నున్నాయి.

 

చరిత్ర అంటే గతం అనుకుంటాం; నిజానికి అది వర్తమానం కూడ కాదు; భవిష్యత్తు!. భవిష్యత్తును నిర్మించే లక్ష్యంతోనే మనిషి గతం నుండి కొన్ని అనుభవాలను, పరికరాలను ఎంచుకుంటాడు. అది అంత వరకే.  ‘రేపు-నిన్న-రేపు’ అనేది చరిత్రను అర్ధం చేసుకునే సమీకరణం.

 

మనకు ఒక సృష్టి రహాస్యం తెలిసినపుడు దానికి కుత్రిమ సృష్టి కూడా సాధ్యం అవుతుంది. గోరింటాకులో మనిషి చర్మాన్ని ఎర్రగా మార్చే ఎలిమెంట్ ఏమిటో కనుక్కో గలిగితే గోరింటాకు లేకుండానే ఎరుపు రంగు బాడీ పేయింట్ ను తయారు చేయవచ్చు. దీన్ని చరిత్రకు కూడా అన్వయించవచ్చు. భవిష్యత్ రాజకీయార్ధిక ప్రయోజనాల కోసం గత చరిత్రను వక్రీకరించే పధ్ధతులు ఇప్పుడు చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి.

 

మధ్యయుగాల్లో ముస్లిం పరిపాలకులు హిందువులను తీవ్రంగా హింసించారని ఒక అభియోగాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టి,  ఇప్పుడు ముస్లింలను సమస్త రంగాల్లో  హింసించి గతానికి తగిన  ప్రతీకారం తీసుకుంటామని శపథాలు చేసే సాంప్రదాయంవచ్చింది.  అలా చేస్తే ఓటర్లలో ఓ మూడవ భాగమైనా ఉత్తేజితులై బలపరుస్తారు. అప్పుడు అధికారం సులువుగా దక్కుతుందనేది ఆధునిక రాజకీయార్ధిక చరిత్ర రచనా ఫార్మూలా. మూడవ భాగం అనేది  అల్ప సంఖ్య. అయితేనేం? మల్టీపార్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మూడవ భాగం ఓట్లు మాత్రమే వచ్చినా సరే  ‘తిరుగులేని విజయం’ అని చెప్పుకోవచ్చు. 

 

చరిత్ర తరచూ పునరావృతం అవుతుంది. పునరావృతం అవ్వడం అంటే జరిగిన సంఘటనలే సరిగ్గా అలాగే మళ్ళీమళ్ళీ జరుగుతాయనికాదు; వాటి స్థాయీ పెరుగుతుంది.  పైగా అవి గతానికి భిన్నంగా విరుద్ధంగా పునరావృతం అవుతుంటాయి. ఒకసారి విషాదంగా ముగిసిన సంఘటన ఇంకోసారి ప్రహసనంగా పునరావృతం కావచ్చు. ఒకసారి ప్రహసనంగా ముగిసిన సంఘటన ఇంకోసారి విషాదంగా పునరావృతం కావచ్చు.

 

        వలస పాలన కాలం సంగతి ఎలావున్నా ఆధునిక చారిత్రిక ఘటనలకు అనివార్యంగా రాజ్యాంగంతోనూ, దాని నుండి పుట్టిన  చట్టాలతోనూ ఒక సంబంధం వుంటుంది. రాజ్యాంగం మీద ఒక్కో చారిత్రక సందర్భంలో ఒక్కోరకం అభిప్రాయాలు వెలువడుతుంటాయి. రాజ్యాంగసభను బ్రిటీష్ పాలకులే ఎర్పాటు చేశారు కనుక అది వలస రాజ్యాంగం అనేవారున్నారు. భారత రాజ్యాంగం గొప్ప ప్రజాస్వామికమైనది అనే వారున్నారు.  కొందరు ఒక అడుగు ముందుకేసి అది సామ్యవాదాన్ని ఆకాంక్షిస్తుంది అంటుంటారు. దాన్ని పెట్టుబడీదారుల రాజ్యాంగం అనేవారూ వున్నారు. అసలు రాజ్యాంగ రచనే ఒక కుట్ర అన్నవారూ వున్నారు. రాజ్యాంగం గాంధీజీ-అంబేడ్కర్ల అహింస మార్గంలో  నడిపిస్తుంది  అనేవారున్నారు. ఎమర్జెన్సీని మించిన క్రూరమైన చట్టాలతో పీడిత ప్రజల్ని నిరంతరం పరమ  కిరాతకంగా అణిచివేయడానికి ఈ రాజ్యాంగమే దోహదపడుతుందనేవారూ వున్నారు. “దేవతలు నివసించడానికి ఒక ఆలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు దాన్ని స్వాధీనం చేసుకున్నాయి” అని ఓ సందర్భంలో అంబేడ్కరే అన్నాడు. ప్రభుత్వాలు; ప్రజలకు సామాజిక ఆర్ధిక సమానత్వాన్ని అందించకపోతే; ప్రజలు (సాయుధులై!) ప్రజాస్వామిక వ్యవస్థను పేల్చి పడేస్తారు అని ఆయనే హెచ్చరించాడు.

 

రాజ్యాంగానికి ఎంత చెద పట్టినాసరే ఇప్పటికి అదే మనకు గతి అంటున్నవారూ వున్నారు. ఇంగ్లీషులో కాన్ స్టిట్యూషన్ అంటే రాజ్యానికి మార్గదర్శకత్వం వహించేదని కొందరంటారు.   రాజ్యాంగం అంటే రాజ్యపు అంగం అనేది తెలుగు నిఘంటువు అర్ధం.  రాజ్యం అంగి; రాజ్యాంగం దాని అంగం.

ప్రజల ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాల ఆధారంగా ఇటు సమాజంలో అటు ప్రభుత్వ విధానాల్లో  వచ్చిన మార్పుల్ని వివరించడం చరిత్ర రచనలో ఇంకో పధ్ధతి. అయితే ఇందులో కూడ ఒక తిరకాసు వుంది. ఒక దశలో ప్రజాందోళనలు సాధించిన విజయాలు కూడ మరో దశలో  తిరుగుముఖం పడతాయి.

 

ఫ్రాన్స్, ఇంగ్లండ్ లలో రాచరిక - భూస్వామ్య వ్యవస్థ మీద పెట్టుబడీదారులు ప్రాణాలొడ్డి పోరాడారు. మన దేశంలో పెట్టుబడీదారులకు అంతటి అవసరం రాలేదు.   రాచరిక - భూస్వామ్య వ్యవస్థ మీద కమ్యూనిస్టులు మాత్రం కొన్ని సంస్థానాల్లో ప్రాణాలొడ్డి పోరాడారు. మన భూస్వాములు యూరప్ భూస్వాములకన్నా  బాగా తెలివైనవారు. పెట్టుబడీదారులతో తలపడితే తమ పతనం తప్పదని తెలుసుకుని వాళ్ళే పెట్టుబడిదారులైపోయారు. ఈ పరిణామాన్ని రాజ్యాంగ సభలోనూ చూడవచ్చు. సభ్యుల్లో అత్యధికులు రాచరిక - భూస్వామ్య వ్యవస్థ ప్రతినిధులు. అయినప్పటికీ వారు పెట్టుబడీదారి రాజ్యాంగానికి ఆమోదం తెలిపారు.

 

1970లలో రాజభరణాలు రద్దు, భూపరిమితి చట్టం, బ్యాంకుల జాతియీకరణ, అటవీ భూములపై ఆదివాసులకు ప్రత్యేక హక్కులు, రాజ్యాంగంలో సామ్యవాదం వగయిరా ఆదర్శ చట్టాలు వచ్చాయి. అప్పట్లో, ఉధృతంగా  విస్తరిస్తున్న నక్సలైట్ సాయుధ పోరాటాలకు భయపడి రూపొందించిన చట్టాలే ఇవన్నీ. ఆ మేరకు అవి ప్రజల విజయాలే. అయితే,  భూస్వామ్య రాజ్యం తన మనుగడ కోసం తన స్వభావాన్ని పెట్టుబడిదారీ రాజ్యంగా మార్చుకోవాలనుకోవడం దీనికి మరో ముఖ్యమైన  కారణం.

 

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు భూస్వాములు ముదిరి పెట్టుబడీదారులయ్యారు. పెట్టుబడిదారులు ముదిరి కార్పొరేట్లు అయ్యారు. వాళ్ళు ముదిరి మెగా కార్పొరేట్లయ్యారు. వాళ్ళు తిమింగలాలను మించిపోయారు. బ్లూ వ్హేల్, లివియాథాన్ (Leviathan) వంటివి అన్నమాట.  వీటిని తెలుగులో తిమింగలగిలం అంటారు. వాళ్ళకిప్పుడు అలనాటి జమిందారులు, జాగీర్దారులు ఆ మాటకొస్తే చక్రవర్తులకు వుండినంత భూమి కావాలి.   ఎయిర్ పోర్టు నిర్మాణానికి మూడు వేల ఎకరాల భూమి కావాలి. స్టీల్ ప్లాంటుకు ముఫ్ఫయి వేల ఎకరాలు కావాలి. ఇంకో ప్రాజెక్టుకు మొత్తం నికోబార్ ద్వీపం కావాలి. ఇంకొకరికి మొత్తం మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు కావాలి. వాళ్ళ అత్యాశల్ని నెరవేర్చడానికి అటవీ భూముల పరిరక్షణ చట్టాల్ని పార్లమెంటు సవరిస్తుంది. అలా  1970వ దశాబ్దంలో వచ్చిన మంచి  చట్టాలన్నీ ఒకదానివెంట మరొకటి రద్దయిపోతాయి. లేదా శవపేటికలో వుండిపోతాయి. ‘Undoing the doing’ అన్నమాట.

 

ఇవన్నీ దేశాభివృధ్ధి పేరిటే జరుగుతాయి. దేశాభివృధ్ధి మంత్రం ముందు మరేదీ నిలవదు. ఇంతకీ దేశాభివృధ్ధి అంటే ఏమిటీ? ఎవరి నిర్వచనం వారిది.  

 

దీపావళికి ముందు బంగారం ధర పెరుగుతుంటుంది. ఆ ఊపులో అవసరానికి మించి పెరిగిపోతుంది. దీపావళి తరువాత ధర తగ్గుముఖం పడుతుంది. ఆ నైరాశ్యంలో అవసరానికి మించి తగ్గిపోతుంది. మళ్ళీ సంక్రాంతికి ధర పెరుగుతుంది. ఈసారి కూడా అవసరానికి మించి పెరుగుతుంది. మళ్ళీ అవసరానికి మించి తగ్గుతుంది. స్టాక్ మార్కెట్లో షేర్లు కూడ అంతే. పెరిగేటప్పుడూ అతిశయమే తగ్గేటప్పుడూ అతిశయమే. రాజకీయాలూ అంతే; అతిశయాలతో నిండిపోతాయి. అప్పుడు ‘Undoing the doing’ అనివార్యమైపోతుంది.

 

కొన్నాళ్ళు వామపక్షమే మేలనిపిస్తుంది. అది అతిశయించినపుడు కుడిపక్షం మేలనిపిస్తుంది. అదీ అతిశయిస్తుంది. అప్పుడు మళ్ళీ వామ పక్షం మేలనిపిస్తుంది. ఈ వృత్తం పూర్తి అయ్యే సమయానికి పాత వామపక్షమూ వుండదు; పాత కుడిపక్షమూ వుండదు. వాటి మధ్య పాత పోరాట రూపమూ వుండదు. అన్నీ మారిపోతాయి. అన్నింటి స్థాయి పెరిగిపోతుంది. నిలువుగా పైకి ఎగబ్రాకే స్ప్రింగు చుట్టలా స్పైరులాకృతి లో సమాజం ముందుకు సాగిపోతుంటుంది. 

 

ప్రజాస్వామ్య వైఫల్యాల నుండే ఫాసిజం పుడుతుంది. ఫాసిజం అతిశయాల నుండే సమానత్వ భావనలు పుడుతాయి. ఇవ్వాల్టి ఫాసిజం గత శతాబ్దపు ఫాసిజం కాదు. నిన్న దాటిన మైలు రాయి మళ్ళీ ఎదురైనట్టు అనిపిస్తుంది. ఆ మైలురాయి నిన్నటిదికాదు. నిన్నలా దాన్ని దాటడమూ కుదరదు. కొత్తదానితో డీల్ చేయడానికి ఒక కొత్త పధ్ధతి కావాలి.  అందుకు అవసరమైన కొన్ని సూచనలు మాత్రమే మనకు గతం నుండి దొరుకుతాయి. వర్తమానానికి కావలసింది సరికొత్త సృజనాత్మకత. అదే చరిత్రను ముందుకు నడుపుతుంది.

 

ప్లస్సుకు మైనస్సు వ్యతిరేకం అయినట్టు, పగటికి రాత్రి వ్యతిరేకం అయినట్టు కొందరు మెజారిటీ మతతత్త్వానికి విరుగుడు మైనారిటీ మతతత్త్వం అంటున్నారు. సమాజం మరీ ఎలిమెంటరీ స్కూలు లెఖ్ఖలంత ఈజీ కాదు. మతతత్త్వానికి విరుగుడు మతసామరస్యమని వాళ్ళకు కొంచెం గట్టిగానే చెప్పాలి.

 

వాళ్ళు శాంతిదూత బిరుదాంకితులు కావచ్చు, బౌధ్ధం శరణం గఛ్ఛామి అనోచ్చు అయినా మయన్మార్ శ్రీలంక పాలకుల్ని నియంతలు అనకుండా వుండగలమా? ఇరవయ్యవ శతాబ్దపు ఫాసిస్టులు, నాజీయిస్టులు పాటించిన డ్రెస్ కోడ్ ను ఇరవై ఒకటో శతాబ్దపు ఫాసిస్టులు పాటించరు. ఇండియా జర్మనీని దాటడానికి ఇంకా ఒక్క అడుగే వుందిట. ఎప్పటి జర్మనీని దాటాలనుకుంటున్నారూ? ఇంకా ఎంతకాలం జార్జి డిమిత్రోవ్, రజిని పామే దత్ నిర్వచనాల్లో మునిగితేలుతుందాం? కొంచెం కొత్త గాలి కొత్త నీళ్ళు కొత్త ఆలోచనల కోసం  వెతుకుదాం. 

 

ఓ భగత్ సింగ్, ఓ అల్లూరి, ఓ చారు మజుందార్ మళ్ళీ పుట్టాలి అని కొందరు కవితలు రాస్తుంటారు. భావుకత వరకు అది సరేగానీ, ఇరవయ్యవ  శతాబ్దంలో వాడిన ఆయుధాలు ఇరవై ఒకటవ శతాబ్దాంలో పనికిరావు. ఆ ధర్మసూక్ష్మం తెలియడమే చారిత్రక దృష్టి. అది ఇప్పుడు చాలా అవసరం. చరిత్ర అంటే గతంకాదు భవిష్యత్తు. ప్రతి తరం ఒక కొత్త చరిత్ర రాయాల్సిందే.

 

డానీ

సమాజ విశ్లేషకులు

రచన : 19 నవంబరు 2024

ప్రచురణ : 28 నవంబరు 2024, ఆంధ్రజ్యోతి దినపత్రిక

 

https://www.andhrajyothy.com/2024/editorial/a-new-history-from-generation-to-generation-1340426.html

 

https://epaper.andhrajyothy.com/NTR_VIJAYAWADA_MAIN?eid=182&edate=28/11/2024&pgid=925374&device=desktop&view=3

 


ఆ మాట మార్క్స్ అనలేదా?

కార్ల్ మార్క్స్ 1852లో రాసిన " The Eighteenth Brumaire of Louis Bonaparte' పుస్తకం మొదటి అధ్యాయంలోని మొదటి వాక్యం : Hegel remarks somewhere that all great world-historic facts and personages appear, so to speak, twice."
రెండవ వాక్యం "He forgot to add: the first time as tragedy, the second time as farce".
ఇందులో మొదటి వాక్యంలో చారిత్రక సంఘటనలు, వ్యక్తుల మీద మీద హెగెల్ పరిశీలనను మార్క్స్ ఉటంకించాడు. రెండో వాక్యంలో హెగెల్ అభిప్రాయానికి అదనంగా ఒక సవరణ, జోడింపు, పూరింపు ఇచ్చాడు.
ఈ రెండు వాక్యాల్ని కలిపి, హెగెల్ భిప్రాయాన్ని మినహాయించి అచ్చంగా మార్క్స్ అభిప్రాయాన్నీ ఒక్క వాక్యంలో చెప్పడానికి ఎవరో "History repeats itself, first as a tragedy, second as a farce" గా పరిష్కరించారు. ఇది నాకూ నచ్చింది. దానినే నేను తెలుగులో “చరిత్ర తనంతతానుగా పునరావృతం అవుతుంది; మొదటిసారి విషాదంగానూ, రెండోసారి ప్రహసనంగానూ” అని రాశాను.
ఇందులో దొర్లిన తప్పేమిటో, వక్రీకరణ ఏమిటో, మార్క్స్ కు జరిగిన అపచారం ఏమిటో నాకేమీ బోధపడలేదు.
మార్క్స్ ఎద్దేవ, వ్యంగ్యం, వెటకారం, అధిక్షేపణ మిగిలినవాళ్లకన్నా గోదావరి జిల్లాల వాళ్ళకు మరింత బాగా అర్ధం అవుతాయి.
"Once as tragedy, and again as farce" అనేది కూడ మార్క్స్ మాటకాదా? అదీ మార్క్స్ మాట కాకపోతే ఈ విషాదం, ప్రహసనం అని ఆయన దేని గురించి అన్నట్టూ?
ఈ సందర్భంగా మార్క్స్ Napoleon Bonaparte, Louis-Napoleon Bonaparteల గురించి మాత్రమే చెప్పి ఊరుకున్నాడా? చరిత్ర గమన నియమాన్ని గురించి కూడా ఈ రెండు వాక్యాల్లో ఏమైనా చెప్పాడా? చెపితే అదేమిటీ?
నా వ్యాసాల్ని ఎన్ వేణుగోపాల్ చాలా శ్రధ్ధగా చదవుతుండడం నాకు ఇటీవల చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. వ్యాసాల్లోని చర్చనీయాంశాల జోలికి వెళ్లకుండా అచ్చు తప్పుల్ని టెక్నికల్ అంశాల్ని పట్టించుకునే వారి లక్షణం కూడ నాకు ఎంతగానో నచ్చుతోంది. అలా నాకు డబుల్ ఆనందంగావుంది.




No comments:

Post a Comment