శాంతిచర్చలకు వచ్చిన నక్సల్ నాయకుడిని ఒరిస్సాలోని డెన్ కు సురక్షితంగా చేర్చిన
*ఒక అద్భుత ప్రయాణం!*
శాంతి చర్చల సమయంలో ప్రభుత్వం
వున్నంత ఉదారంగా పోలీసులు వుండరు. మరీ ముఖ్యం నిఘా విభాగం పోలీసులు. నక్సల్స్
నాయకుల డెన్ ల ఆచూకీ తెలుసుకోవడానికి
రకరకాలుగా కూపీ లాగుతూనే వుంటారు.
రంజాన్ మాసం ఆరంభమయింది. నేను
ఉపవాసాలు చేస్తున్నాను. ఆరోజు అక్టోబరు 20 అనుకుంటాను. రాత్రి నిద్రపోవడానికి
ముందు ఫోన్ వచ్చింది. అవ్తల చెలం. “నన్ను నా ఏరియాలో దించుతావా?” అని అడిగాడు.
మరో ఆలోచనకు తావివ్వకుండ
“దించుతాను” అన్నాను.
చెలం అప్పట్లో ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్
జోనల్ (AOBZ) సెక్రటరీగా వుంటున్నాడు.
ఒరిస్సాలో విపరీతంగా ప్రయాణించిన అనుభవం నాకుంది. తను వెళ్ళాల్సిన చోటు
సీలేరు , మల్కాన్ గిరి ప్రాంతంలో వుంటుందని అనుకున్నాను.
చెలం ఆ రాత్రి నన్ను అలా కోరడం
మాత్రం ఆశ్చర్యం అనిపించింది.
నేను 1978లో సివోసిలో చేరాను.
అప్పట్లో దాన్ని బయటి జనం కొండపల్లి సీతారామయ్య గ్రూపు అనేవారు. ఆ తరువాత అది
పీపుల్స్ వార్ అయ్యింది. ముందు యూత్ వింగ్ లో చేరాను. అలాఅలా అక్షరాల నుండి ఆయుధాల
వరకు అన్ని విభాగాల్లోనూ పనిచేశాను. కొంత కాలం కొండపల్లి సీతారాయ్యకు కొరియర్ కమ్
బాడీగార్డ్ గానూ వున్నాను.
విప్లవోద్యమంలో అనేక దశలుంటాయి;
కనీసం ఐదు భిన్న దశలుంటాయి. జాగ్రత్తగా
గమనిస్తే 1920ల నాటి మన్యం తిరుగుబాటులో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. వాటన్నింటి
గురించి మాట్లాడడానికి ఇది సందర్భంకాదుగానీ మొదలయినపుడు వున్నంత సహృదయత, విశాల
దృక్పథాలు నాయకుల్లో తరువాతి కాలంలో వుండవు.
వాళ్ళలో బ్యూరాక్రసీ గట్టిగానే తలకెక్కుతుంది. చెవులు పనిచేయవు; నోరు
మాత్రమే పనిచేస్తుంది. వ్యక్తి సామర్ధ్యంకన్నా విధేయతకు ఎక్కువ మార్కులు
వేస్తారు. ప్రశ్నించిన వారిని వర్గ
శత్రువుకన్నా ఎక్కువగా వేధిస్తారు. విసిగిపోయి 1990లో పీపుల్స్ వార్ తో నేను
పూర్తి బంధాలనూ తెంచుకున్నాను.
పీపుల్స్ వార్ కన్నా దుందుడుకు
పార్టి మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్. అవి రెండూ కలిసి మావోయిస్టు పార్టి
ఏర్పడడంతో నా సంధిగ్ధం పోయింది. పీపుల్స్ వారే లేదుగా!. పైగా, నన్ను చాలా ఇబ్బంది
పెట్టిన రాష్ట్ర కమిటి కార్యదర్శి ముక్కు సుబ్బారెడ్డి (రంగన్న), కేంద్ర కమిటీ
సభ్యుడు నిమలూరి భాస్కర రావు ( మల్లిక్) ఇద్దరూ వీరోచితంగా ప్రభుత్వానికి లొంగిపోయారు.
వాళ్ళతో ఘర్షణ పడినందుకు ఇప్పటికీ నాకు గర్వంగానే వుంటుంది.
అయితే నాకో సరిహద్దు గోడ వుంది.
1985కన్నా ముందు నాతో పార్టీలో పనిచేసినవారితో ఒక భావోద్వేగ అనుబంధం ఎప్పుడూ
వుంటుంది. తరువాత వచ్చిన వారి గురించి తెలుసుకోవాలని కూడ నేను అనుకోలేదు.
నేను వదిలేసినా పీపుల్స్ వార్
నన్ను వదలలేదు. అసందర్భంగా నైతిక పరీక్షలు పెట్టేది. “కొందరు ఎంసిసి సభ్యులు,
బీహారు వాళ్ళు; విజయవాడ బెంజ్ సర్కిల్ లో
బస్సు దిగారు. వాళ్ళను సురక్షిత ప్రాంతానికి చేర్చాలి” అని ఎవరో ఫోన్ చేస్తారు.
ఇంకోసారి బెజవాడ రైల్వేస్టేషన్ లో పంజాబ్ నుండి ముగ్గురు వచ్చి వున్నారు.
ఎనిమిది గంటలు వుంటారు. ఉదయం పినాకిని
క్స్ ప్రెస్ ఎక్కించాలి అని ఇంకో ఫోను. ఇంకెవరో అర్ధరాత్రి ఫోన్ చేస్తారు. “పాత
కామ్రేడ్ ఒకామె ఒక రహాస్య మీటింగుకు ఇల్లు ఇచ్చింది. అక్కడ కుళ్ళిన ఆహారం తిని
ఇద్దరు బెంగాలీ సభ్యులు చనిపోయే పరిస్థితి వచ్చింది. మీరే కాపాడాలి” అని. నేను
వెళితే ఒక ముప్పు; వాళ్లతోపాటు నేనూ అరెస్టు అవుతాను. వెళ్ళకపోతే ఇంకో ముప్పు;
“డానీకి చెప్పాము అతను వెళ్ళలేదు; దారి తెలీక వాళ్ళు అరెస్టు అయ్యారు” అని నిందిస్తారు. నాకేమిటీ ఈ గోల? వాళ్ళ అరెస్టు నింద నాకెందుకని రిస్క్
చేస్తాను.
“ప్లాన్ చేయడం రాదు; ఎగ్జిక్యూట్
చేయడం రాదు. వచ్చే ప్రమాదాన్ని ఊహించి విరుగుడును సిధ్ధం చేయడం అస్సలు తెలీదు. ఎవడ్రా
మిమ్మల్ని రిక్రూట్ చేసింది?” అని కొంచెం గట్టిగానే అరిచిన సందర్భాలూ వున్నాయి.
అప్పుడు వాళ్ళు “మీరు పెర్ఫెక్షనిస్టు అని మీకు చెప్పాము” అంటారు. అది వారి అమాయకత్వమో
అతి తెలివో? అర్ధం కాదు.
ఇలాంటి సంఘటనలు అనేకం. అవన్నీ
చెప్పుకుంటూ పోతే అది ఇప్పట్లో తేలదు.
“మీ ఆఫీసు వాళ్ళు కారు ఇస్తే
అందులో పోదాం. న్యూస్ ఛానల్ కారుగా. కొంచెం సేప్టి” అన్నాడు చెలం. అప్పటికే రాత్రి 10 కావస్తోంది. ముందు కారు కావాలి. డ్రైవరు కావాలి. కెమేరా మాన్
కావాలి. కారుకు పెట్రోలు కావాలి. వీటన్నింటికీ ఆఫీసు పర్మిషన్ కావాలి. ఆ డ్యూటి
నాకే వేయాలి. దాదాపు అసాధ్యమైన వ్యవహారం.
అయినా ధైర్యం చేసి ఆఫీసు జనరల్
మేనేజరు ధనేకుల సుందరయ్యకు ఫోన్ చేశా. సుందరయ్య నాకు మంచి మిత్రుడు. కాలేజీ
రోజుల్లో ఏఐఎస్ ఎఫ్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. జమిందార్ బిల్డింగులో తనది
మా పక్క రూమే.
“కారు కావాలి ఒరిస్సా వెళ్ళాలి”
అన్నాను.
సుందరయ్య ముదురున్నర ముదురు;
హైదరాబాద్ లో బెజవాడ రౌడి. వెంటనే “చెలాన్ని
దింపుతున్నావా?” అని అడిగేడు.
“అవును” అన్నాను.
“చెలం ఐదు రోజులుగా ఇక్కడే
వున్నాడు గాబట్టి ఒరిస్సా వెళ్ళి ఇంటర్వ్యూ చేయ్యాల్సిన పనిలేదు. ఎండి ఒప్పుకోడు.
అక్కడ ఇంకో పెద్ద నక్సలైట్ ఇంటర్వ్యూ చేస్తానని చెపితే సరిపోతుంది. నువ్వు అలా
చెప్పు. మిగతావి నేను చూసుకుంటాను” అన్నాడు.
గంటలో కారు, డ్రైవరు, కెమేరా మేన్
అంతా సెట్ అయ్యారు.
చెలం మళ్ళీ ఫోన్ చేశాడు. అంతా సెట్
అయ్యింది అన్నాను. “అజిత కూడ వస్తే బాగుంటుంది’ అన్నాడు. “తనతో ఒక టెక్నికల్
పనుంది. అలా జర్నీలో ఫ్యామిలీగా కనిపిస్తాము. ఎవరికీ అనుమానం రాదు” అన్నాడు.
ఆరోజు అజిత హైదరాబాద్ లో లేదు.
విజయవాడలో వుంది. ఫోన్ చేసి చెప్పాను ఇలా చెలం అడిగాడు అని. తనూ వస్తానంది. టైమ్
కో-ఆర్డినేషన్ చాలా ముఖ్యం. తక్షణం బయలుదేరి హైదరాబాద్ ఎంజిబిఎస్ బస్ స్టాండ్
అరైవల్ టెర్మినల్ వద్ద వేయిట్ చేయమన్నా.
అందరం తెల్లారు జామున సి-టీవీ
ఆఫీసు నుండి బయలు దేరి బస్ స్టాండ్ లో అజితను ఎక్కించుకుని ఉదయం 9 గంటలకు శ్రీశైలం
చినఆరుట్ల చేరుకున్నాము.
కొద్ది సేపు ఎదురుచూసిన తరువాత
రెండు పార్టీల ప్రతినిధులు ఐదుగురు వచ్చారు. గద్దర్ వాళ్ళకు వీడ్కోలు చెప్పడానికి
వచ్చాడు.
అందరూ వెళిపోయాక మా కారు బయలు
దేరింది. ఈటీవి రిపోర్టరుకు నేను చెలం వెంట వెళుతున్నట్టు అర్ధం అయింది. నా
దగ్గరేదో బిగ్ న్యూస్ వుంటుందనుకుని తనూ నాతోనే వస్తానన్నాడు.
ఏ పదకుండింటికో బయలు దేరి దోర్ణాల
మీదుగా గుంటూరు సమీపంలోని ఫిరంగిపురం చేరుకున్నాం. చాలా లేటు అయ్యింది గానీ అక్కడే
డాక్టర్ జయకుమార్ నడుపుతున్న స్కూల్ లో లంచ్ చేశారు అందరూ.
రాత్రికి విజయవాడ చేరుకుని
సూర్యరావుపేటలో ఓ నర్సింగ్ హోం నిర్వాహకుని ఇంట్లో రాత్రి భోజనం చేసి అక్కడే
పడుకున్నాం. ఆయన విజయవాడలో ప్రముఖ నెఫ్రాలజిస్టు; చెలంకు ఎక్కడో క్లాస్ మేట్.
రెండో రోజు ఉదయం విజయవాడలో బయలు దేరి 9-10 గంటలకు
కొవ్వూరులొ గోదావరి గట్టుకు చేరుకున్నాం. అక్కడ తోరాడ నరసింహారావు, పెండ్యాల
మల్లేశ్వరరావు తదితరులు బ్రేక్ ఫాస్ట్ తో సిధ్ధంగా వున్నారు. మల్లేశ్వర రావు
చెలంకు కొంచెం సీనియర్. తోరాడ నరసింహారావు నాకు రాజమండ్రి సెంట్రల్ జైలులో తోటి
ఖైది.
రాడికల్ విద్యార్ధి నాయకుడు చెరుకూరి
రాజ్ కుమార్ (ఆజాద్) ను విడిపించడానికి 1980లో రాజమండ్రి మ్యూజియం రోడ్డు పోలీస్
స్టేషన్ కష్టడీని బ్రేక్ చేశారు. ఆ సందర్భంగా సిఐ, ఎస్సైలకు గట్టిగానే దెబ్బలు
తగిలాయి. ‘Attempt to murder on circle inspector and sub inspectors in police
station’ అనేది మా మీద పెట్టిన కేసు. తోరాడ నరసింహారావు A1. నేను A3.
రాజమండ్రి నుండి ఎర్రవరం వరకు
నేషనల్ హైవేలో వెళ్ళి అక్కడి నుండి మన్యంలోనికి ప్రవేశం. అడవిలో దొరకనివి
కొనుక్కోమని ఎలేశ్వరంలో ముందుగానే చెప్పారు. అక్కడి నుండి మన్యం పితూరీలో మనం వినే
ఊర్లు అన్నింటి మీదుగా ప్రయాణించడం గొప్ప థ్రిల్. కోనలోవ, జద్దంగి, రాజవొమ్మంగి,
పెద్ద వలస, ఆర్ వి నగర్ ల మీదుగా జికే వీధి చేరే సమయానికి రాత్రి 7 దాటింది. చలికాలం
కావడంతో బాగా చీకటిగా వుంది.
ఆ తరువాత దారీ ఊర్లు మాకు తెలీవు.
రోడ్డు దిగి అడవి బాట పట్టాము. ఒకతను బైక్ మీద మా కార్లకు ఒక గంట పాటు దారి
చూపిస్తూ వెళ్ళాడు. ఆ తరువాత ఆ దారికూడ లేదు. పచ్చిరోడ్డు. వర్షాలు పడి నీళ్ళు
ప్రవహిస్తునాయి. బైకు వాడు పోయి ఒక కుర్రోడు వచ్చాడు. అతను ముందు పరుగెడుతుంటే మా
కార్లు అతన్ని అనుసరించాయి. కొన్ని చోట్ల రాళ్ళ మీదుగా, బురదలో నుండి వెళ్ళడానికి
కార్లు మొరాయించాయి. పరిసరాల్లో వున్న చెట్ల కొమ్మలు నరికి దార్లో పరచి వాటి
మీదుగా కార్లను తోసుకుంటూ వెళ్ళాము. స్థానికులు తోవ చూపకపోతే ఆ దారుల్లో వెళ్ళడం
చాలా కష్టం. ఏమైనాగానీ రాత్రి పది దాటాక చెలం చెప్పిన గమ్యస్థానానికి చేరుకున్నాం.
అడ్డంగా కొండ. దానికి ఆవల ఒరిస్సా; ఈవల ఆంధ్రప్రదేశ్. నా బాధ్యత తీరిపోయింది. ఊపిరి పీల్చుకున్నాను.
ఏవో చిన్న దీపపు బుడ్డీలు
వున్నాయిగానీ వెలుతురు లేదు. భోజనం పెట్టారు. ఏం పెట్టారో తెలీదు. తినేశాం. పక్కనే
చిన్న బడి వుంది. అందులో నాలుగో ఐదో పొట్టి బల్లలున్నాయి. రెండేసి పక్కన చేర్చి
అదే మంచం అనుకుని పడుకున్నాం. మా స్టాఫ్ కార్లలొ పడుకున్నారు. బాగా చలి.
మరునాడు ఉదయం తెల్లారక ముందే సైనిక
దుస్తుల్లోవున్న కొందరు సాయుధులు మేమున్న
గది తలుపుల్ని తోసి గుమ్మానికి అడ్డంగా నిలిచారు. ఆ శబ్దానికి నేను కళ్ళు
తెరిచాను. ముందు వాళ్ళు పోలీసులేమో అనుకున్నాను. కొంచెం కంగారు కూడ వేసింది. ఒకతను
టార్చి లైటుతో గదంతా కలయ
చూస్తున్నాడు. నా ముఖాన్ని గుర్తుపట్టాడు.
“డానీ గారా? మీరా? మీ రచనలు దొరక్క మేము ఫొటోస్టాట్ కాపీలు తీసుకుని
చదువుకుంటున్నాం” అన్నాడు.
ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. నగరంలో
ఓ పాఠకుడు దొరికితేనే రచయితలు సంబరపడిపోతారు. అలాంటిది కాకులు దూరనీ కారడవిలో
గన్నుపట్టుకున్న పాఠకుడు దొరికితే ఎలా వుంటుందీ? టెన్షన్ పోయి సంతోషంగా ఊపిరి
పీల్చుకున్నాను.
ఉదయం ఏవో ఆ గెరిల్లా దళాల
కసరత్తులు వగయిరా విన్యాసాలు చూశాము. పరిసరాల్లో కమతాలు చూశాము. అంతర పంటల విధానం
వుంది అక్కడ. మధ్యాహ్నం ఏదో భోజనం పెట్టారు. తీపి గుమ్మడికాయ కూర వండారు. దాదాపు
నూనె లేకుండా వండినా బాగుందనిపించింది.
పార్టీవాళ్ళు కొందరు వచ్చి
కలిశారు. అజితకు కంప్యూటర్ల పరిజ్ఞానం వుందని వాళ్ళకు సమాచారం వుంది. అజితను ఒక
వారం రోజులు వుండమని వాళ్ళు కోరారు. అజితకు కూడ అడవి అన్నా అన్నలన్నా పిచ్చి
అభిమానం. తను వుండిపోయింది. మేము ఆ సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యాము. సీలేరు,
చింతురు, భద్రాచలం, కొత్తగూడెం మీదుగా రాత్రి పదింటికి ఖమ్మం చేరుకున్నాం. అక్కడ డాక్టర్ గోపీనాథ్ మాకు భోజనం ఏర్పాటు
చేశాడు. మరునాడు ఉదయం హైదరాబాద్ చేరుకున్నాము.
ఇంకా కథ ముగియలేదు.
ఈ ఎపిసోడ్ లో నేను సాధించిన
విజయంకన్నా అజిత సాధించిన విజయం గొప్పది.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అజిత వారం రోజుల తరువాత తిరిగి
వచ్చింది. అక్కడి మీడియా విభాగానికి కంప్యూటర్ మెళుకువలు నేర్పింది. మన్యంలో
కొన్ని రోజులు వుండడం మూలంగా తనకు మలేరియా రావచ్చని అక్కడి వాళ్ళు చెప్పారు. మలేరియా
లక్షణాలు కూడ వివరించారు. సోకినట్టు అనుమానం రాగానే మందులు వాడడం మొదలెట్టాలని కూడ
హెచ్చరించారట. హైదరాబాద్ తిరిగి వచ్చిన వారం రోజులకు అజితకు మలేరియా లక్షణాలు
కనిపించాయి. హాస్పిటల్ కు వెళ్ళి మలేరియా అని చెప్పినా హైదరాబాద్ డాక్టర్లు
ఒప్పుకోలేదు. వ్యాధిని ముదరబెట్టి క్రానిక్ దశకు తెచ్చారు. కిడ్నీలు పాడైపోయి
బ్లాక్ వాటర్ వచ్చేసింది. చనిపోతుంది ఇక ఇంటికి తీసుకుపొండి అని డాక్టర్లు
చెప్పేశారు.
అక్కడి నుండి కేర్ హాస్పిటల్ కు
మార్చాము. పి. ఫాల్సిపారిమ్ మలేరియా
బ్లాక్ వాటర్ స్థితికి వచ్చాక నయం అయిన కేసు అప్పటికి ఇండియాలో ఒక్కటి కూడ లేదు.
అలా బయటపడిన తొలి పేషెంట్ అజిత. ఆమె కేసును ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫెరెన్స్ కు
రిఫర్ చేశారు. అజితను డిశ్చార్జ్ చేసిన రోజున డాక్టర్ తాళ్ళూరి శరత్ చంద్ర
ఆయన టీమ్ వచ్చి ఆమెకు పూల బొకే ఇచ్చి గ్రూపు ఫొటో దిగారు.
ఇంతకన్నా గొప్ప కథ మరొకటి వుంది.
అడవి నుండి తిరిగి వచ్చాక అజిత
ఆనారోగ్యం పాలైందని, చావు బతుకుల్లో వుందని తెలియగానే మావోయిస్టు పార్టి రంగంలో
దిగింది. ముఖ్యంగా వరవరరావు సమన్వయం చేశారు.
మొత్తం హాస్పిటల్ ఖర్చు వాళ్ళే భరించారు. నెల తరువాత అజితకు మళ్ళీ అలాగే
వచ్చింది. రెండోసారి కూడ వాళ్లే ఖర్చులు పెట్టుకున్నారు. అజితకు మూడో నెలలోనూ
మళ్ళీ తిరగబడింది. మూడోసారి ఖర్చులు మాత్రం నేను భరించాను.