Friday, 5 September 2025

Arguments against the capital are fueled by hatred

 Arguments against the capital are fueled by hatred

రాజధానిపై ద్వేషంతోనే ముంపు వాదనలు

 

డానీ

సమాజ విశ్లేషకులు




 

అమరావతి మునిగిపోయిందనే ఒక వార్త మీద కొంచెం తీవ్రంగానే చర్చ జరుగుతోంది. నిర్మాణంలోవున్న ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ముంపు నివారణ మార్గాల్ని అన్వేషించడం కోసం  ఈ చర్చ జరుగుతూ వుంటే దాన్ని అందరూ ఆహ్వానించాలి. అలా కాకుండా, ఆంధ్రప్రదేశ్ కు అసలు రాజధానియే లేకుండా చేయడానికి ఈ వాదనలు ముందుకు వస్తుంటే మాత్రం వాటిని తీవ్రంగా ఖండించాలి.

 

ఏ ప్రాజెక్టుకు అయినా అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ వుంటాయి. అనుకూలతల్ని పూర్తిగా వాడుకుంటూ ప్రతికూలతల్ని తగ్గించుకోవడమే మానవ ప్రయత్నం.

 

విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద నీటి విడుదల గరిష్ట సామర్ధ్యం 11 లక్షల 90 వేల క్యూసెక్కులు. గత ఏడాది సెప్టెంబరు 1, 2 తేదీల్లో 11 లక్షల 80 వేల క్యూసెక్కుల వేగంతో వరద నీరు ప్రవహించింది. గోదావరి, కృష్ణా వరదలకు తోడు బుడమేరు పొంగింది. ఆ రోజు ఇంకొక్క శాతం వరద పెరిగివుంటే జలప్రళయం సంభవించేది.  ఆ నష్టాన్ని ఉహించడానికి కూడ భయం వేస్తుంది. విచిత్రం ఏమంటే రెండు వారాల్లో ప్రజా జీవితం సాధారణ స్థితికి చేరుకుంది. జీవన శౌందర్యం అంటే అదే!

 

1964 అక్టోబరు నెలలో కృష్ణ నదికి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వేగంతో వరద వచ్చింది. విజయవాడ పరిసరాల్లో నదీతీరాన్న వున్న నివాసాలు వేల సంఖ్యలో కొట్టుకుపోయాయి. విఖ్యాత ఇంజినీరు డా. కేఎల్ రావు పర్యవేక్షణలో విజయవాడ ముంపు ప్రమాదాన్ని నివారించడానికి ఎత్తైన కరకట్ట నిర్మించారు. నదీ పరివాహక ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకున్నవారిని నగరం వెలుపలున్న ప్రాంతాలకు తరలించారు. అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలు అలా ఎర్పడ్డాయి.

 

తరువాతి కాలంలో అనేక ఆసక్తికర పరిణామాలు జరిగాయి. కరకట్ట నేషనల్ హైవేగా మారింది. హైవేకు ఆవల నదీ పరివాహక ప్రాంతంలో మళ్ళీ నివాసాలు వచ్చి కృష్ణ లంక, పడమటి లంక ఏర్పడ్డాయి. అక్కడ ఇప్పుడు ఓ పది మునిసిపల్ డివిజన్ల జనం నివసిస్తున్నారు. ప్రతి ఐదేళ్ళకో పదేళ్ళకో వరద నీళ్ళు నివాసాల్లోనికి వచ్చేసి ముంచేస్తుంటుంది. దానితో వాళ్లు ఆందోళనలు చేసి ఇటీవల రిటైనింగ్ వాల్ కట్టించుకున్నారు.  వరద ముప్పును తప్పించుకున్నారు.

 

ఈకథ ఇంతటితో ముగియలేదు. 1960లలో కృష్ణ వరద  నిర్వాసితులుగా అజిత్ సింగ్ నగర్ చేరివాళ్ళు అక్కడా ఇంకో పది డివిజన్ల మేర పెరిగారు. విజయవాడ దుఖ్ఖదాయనిగా భావించే  బుడమేరు పరివాహక ప్రాంతం లోనికి కూడ విస్తరించారు.  ఐదేళ్ళకో  పదేళ్ళకో ఒకసారి బుడమేరు కూడ పొంగుతుంటుంది. నివాసాలు మునుగుతుంటాయి. నగర జనం పడవల్లో ఇళ్ళకు వెళతారు. నాలుగు రోజులు రెవెన్యూశాఖ రిలీఫ్ క్యాంపులు నిర్వహిస్తుంది. మళ్ళీ సాధారణ జీవితం మొదలవుతుంటుంది.

 

గత ఏడాది బుడమేరు మరీ విజృంభించింది. దాదాపు లక్ష మందిని బాధితులుగా మార్చేసింది. ముంపు  ప్రాంతాల్లోని  నివాసాలను తొలగించాలని కొందరు స్వఛ్ఛంద మేధావులు ప్రభుత్వానికి ఉచిత సలహాలు పడేశారు. గట్టున వున్నవాళ్లకన్నా నిండా మునిగిన వాళ్ళకు పరిష్కారాలు తోస్తాయి. వాళ్లు కొంచెం విజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. పాములా మెలికలు తిరిగే బుడమేరులో వరద నీరు వేగంగా ప్రవహించదు. అంచేత ముంపు ఎక్కువ రోజులు వుండిపోతుంది. బుడమేరు స్ట్రేయిట్ కట్ నిర్మిస్తే ప్రవాహ వేగం పెరిగి సమస్య పరిష్కారం అవుతుంది. రిటైనింగ్ వాల్ కూడ నిర్మిస్తే ఇంకా సురక్షితం.

 

కృష్ణానదికి ఎడమ గట్టున బుడమేరు కలిసినట్టే కుడిగట్టున కొండవీటి వాగు కలుస్తుంది. దీనికి కూడ అమరావతి దుఖ్ఖదాయని అనే పేరుంది. దీనిని అమరావతి వరప్రదాయనిగా మార్చడం ఎలా అన్నది మన ముందున్న సవాలు.

మనకు నిజామ్ ఉదాహరణ ఉంది. 1908 సెప్టెంబరు 28న మూసీనదికి కనీవినీ ఎరుగని వరదలొచ్చి హైదరాబాద్ ను ముంచెత్తాయి. కనీసంగా 15 వేలమంది చనిపోయారు. అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ సుప్రసిధ్ధ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించి మూడు పనులు అప్పచెప్పాడు.  మొదటిది; మూసీ వరద క్రమబధ్ధీకరణ, రెండోది; ముంపు నివారణ, మూడోది; తాగునీటి సరఫరా పథకాల రూపకల్పన. 1912లో నిజాం పాలకునిగా మారిన మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఈ పథకాల నిర్మాణాలను చేపట్టాడు.

వరదల్ని చూసి భయపడి దుకాణం బంద్ చేద్దామని అనుకోకపోగా, మూసీ నదిలో చేప పిల్లలు లక్షలు కోట్లుగా పెరుగుతున్నట్టు  హైదరాబాద్ జనాబా పెరగాలని ఉస్మాన్ ఆలీ ఖాన్ కోరుకున్నాడట. జనాభా పెరిగినపుడు అవసరమయ్యే తాగునీటిని అంచనావేసి అపుడే పటిష్టమైన ఏర్పాట్లు చేశాడు. ఆయన కోరుకున్నట్టే జరిగింది. హైదరాబాద్ జనాభా కోటి దాటింది. ఆ కాలంలో నిజాం నవాబు  నిర్మించిన చెరువులే 1990వ దశాబ్దం వరకూ హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించాయి.

కృష్ణానదికన్నా కొండవీటి వాగు పల్లంలో వుంటుందని చాలామంది అంటుంటారు. ఇది పాక్షిక సత్యం మాత్రమే. కృష్ణానది ప్రశాంతంగా ప్రవహిస్తున్నపుడు కొండవీటివాగు సహజంగానే పైన్నుండి అందులో కలుస్తుంది. వరద ఉధృతి ఎక్కువగా వున్నప్పుడు నది నీటి మట్టం 27 అడుగుల వరకు పెరుగుతుంది. అప్పుడు వాగులో నీటిని నది లోనికి ఎత్తిపోయాల్సి వుంటుంది. అలాగే వాగులో వరద లేనప్పుడు కృష్ణానది నీటిని రివర్సబుల్ పంపింగ్ స్కీమ్ ద్వార ఎత్తిపోయవచ్చు. పంపింగ్ స్కీమ్ కు ఇప్పుడున్న సామర్ధ్యం సరిపోకపోతే దాన్ని పెంచుకోవచ్చు. అలాగే, 29 గ్రామాల రాజధాని  ప్రాంతంలో ఇతర వాగులతోపాటు కొన్ని చెరువులు కూడ వున్నాయి. వీటివల్ల తలెత్తే  సమస్యల్ని పరిష్కరించడం కూడ అసాధ్యం ఏమీకాదు.

 

 

ఈ ఏడాది కృష్ణా వరద ప్రమాద హెచ్చరికల స్థాయికి చేరుకున్నా నదీ నీళ్ళు కరకట్ట దాటలేదు. అమరావతి లోనికి వరద నీరు ప్రవేశించలేదు. అయితే, ఆగస్టు 12 నుండి 19 వరకు కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అయినా, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రమాదకర ముంపు అంటూ ఏమీలేదు. అయితే, దీనికి ఒక మినహాయింపు వుంది. రాయపూడిలో  ఒక్కొక్కటి నలభై అంతస్తులుగల నాలుగు ఐకానిక్  టవర్స్ నిర్మిస్తున్నారు. వాటికోసం 100-150 అడుగులకు పైగా పునాది స్థంభాలు (పైల్స్ ) దించుతున్నారు. మూడు టవర్స్ లో పునాది పని పూర్తి అయింది. నాలుగో టవర్ లో పునాది కోసం తవ్వకాలు సాగుతున్నాయి. ఈలోగా వర్షాలొచ్చి నీరు చేరింది. పంపు సెట్లు పెట్టి నాలుగో టవర్ లో నీళ్ళు తోడుతున్నారు. వర్షాకాలంలో సాగే భవన నిర్మాణపు పనుల్లో ఇలాంటి ఇబ్బందులు చాలా సహజం. 

 

వర్షమో వరదో ఎదో ఒక సాకు చూపి అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని ఆపాలని ఒక సమూహం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోరాడుతోంది. వీరి వాల్ లోనికి వెళ్ళి చూస్తే వైసిపితో రాజకీయ అనుబంధం కనిపిస్తుంది.

 

వైయస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా  అమరావతిలో శాసన రాజధానిని కొనసాగిస్తామన్నారు. గానీ, వైసిపి అభిమానులు దానికి కూడ ఒప్పుకుంటున్నట్టులేరు. ఆ మధ్య మంగళగిరి - కాజా దగ్గర క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షం కురిసింది.  ఆ కారణంగా రాజధాని నిర్మాణాన్ని అమరావతిలో ఆపి నల్లమల అడవులకు మార్చాలని కొందరు సూచిస్తున్నారు. నల్లమల అడవుల్లో ఏకంగా కుమిలోనింబస్ వర్షాలు (cumulonimbus rain) కురిసిన దాఖలాలున్నాయి. వాటి కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయారన్న విషయాన్ని  వైసిపి అభిమానులు ఇంత త్వరగా మరచిపోవడం ఆశ్చర్యకరం!. 

 

జగన్ మూడు రాజధానుల సిధ్ధాంతం పైకి సమ పంపకంగా కనిపిస్తుందే గానీ, అందులో ఒక బూటకం వుంది. అమరావతిలో శాసన రాజధాని నిర్మాణాలను ఆయన ప్రభుత్వం కొనసాగించలేదు. విశాఖపట్నంలో పాలనా రాజధాని కోసం నిర్మాణాలను మొదలెట్టలేదు. కర్నూలులో న్యాయ రాజధాని నిర్మాణం అనేది ఆయన చేతుల్లో లేదు. రాష్ట్ర హైకోర్టు ఎక్కడ పెట్టాలనే అంశాన్ని పార్లమెంటు తీర్మానించాలి; రాష్ట్రపతి ఉత్తర్వులివ్వాలి, భారత ప్రధాన న్యాయమూర్తి జడ్జీలను నియమించాలి. అన్ని అనుమతులు వచ్చాక హైకోర్టు భవనాన్ని నిర్మించడం, నిర్వహణ భారం మోయడం ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వం పని.

జాగ్రత్తగా గమనిస్తే  రాష్ట్రానికి అసలు రాజధానియే లేకుండా చేసే పథకం జగన్ మూడు రాజధానుల సిధ్ధాంతంలో కనిపిస్తుంది.

 

రాజధాని నిర్మాణం విషయంలో వైయస్ జగన్, చంద్రబాబులవి పరస్పర విరుధ్ధమైన దృక్పథాలు. తప్పనిసరిగా చేయాల్సిన పనుల్నికూడ జగన్ చేయరు. చేయలేని పనుల్ని కూడ చంద్రబాబు చేస్తానంటుంటారు. రాజకీయ విభజన ఏ దశకు చేరుకుందంటే ఏపికి రాజధాని కావాలని కోరేవాళ్ళు టిడిపి; రాజధాని అక్కరలేదనేవారు వైసిపిగా తయారైంది. చంద్రబాబు మార్కు అతిశయాలను అదుపు చేయడం వేరు; కొత్త ఆంధ్రప్రదేశ్ కు అసలు రాజధానియే లేకుండా చేయడం వేరు.

 

-డానీ సమాజ విశ్లేషకులు

Updated Date - Sep 04 , 2025 | 01:21 AM


https://www.andhrajyothy.com/2025/editorial/from-flood-risks-to-political-manipulation-1443429.html?fbclid=IwY2xjawMny0BleHRuA2FlbQIxMQABHi4kqAXOh2DUAHqu7fRIbGwTIO37ceNADDFndReUF2hGAyD_lvdXk-34FBLY_aem_Htoz6RPMwfw2mU7qz-8saw

No comments:

Post a Comment