కిర్క్ హత్యలో కార్ల్ మార్క్స్ 'ప్రమేయం'!
ఈరోజు
(14 సెప్టెంబరు 2025) నా వ్యాసాన్ని అంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ప్రచురించింది. పత్రిక
యాజమాన్యానికీ, సంపాదకులకు, ఎడిట్ పేజీ నిర్వాహకులకు ధన్యవాదాలు.
వ్యాసాన్ని
చదివి మీ అభిప్రాయాలను తెలిపితే సంతోషిస్తాను.
డానీ
సమాజ
విశ్లేషకులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానస పుత్రుడైన చార్లీ క్రిక్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉథా వ్యాలీ యూనివర్శిటీలో సెప్టెంబరు 11న నిర్వహించిన ‘ద అమెరికన్ కమ్బ్యాక్ టూర్’ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా క్రిక్ ను కాలేజీ విద్యార్ధి ఒకడు తుపాకీతో కాల్చి చంపేశాడు. క్రిక్ 32 యేళ్ల యువకుడు. అయితే ఛాందసుడు. కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు అనే బాపతు!.
కాలేజీలు, యూనివర్శిటీల్లో అల్లరి మూకలు కాల్పులు జరిపిన వార్తలు అమెరికాలో తరచూ వింటుంటాం. ఇది అలాంటి హత్యకాదు. అమెరికన్లేగాక ఈ వార్త తెలిసినవారంతా దీన్ని ఒకనొక హత్యా సంఘటనగా తేలిగ్గా తీసిపడేయడంలేదు. దాన్నొక భిన్న సైధ్ధాంతిక శిబిరాల ఘర్షణగా చూస్తున్నారు. వివిధ దేశాలపై, వివిధ సమూహాలపై ట్రంప్ అనుసరిస్తున్న కక్షసాధింపు విధానాల మీద జరుగబోయే ప్రతిచర్యలకు ఇదొక మచ్చుతునక అంటున్నారు. ఇది ఇంతటితో ఆగదని కూడ కొందరు అంటున్నారు.
చార్లీ కిర్క్ మీద కాల్పులు జరిపినతన్ని పోలీసులు గుర్తించారు అరెస్టు చేశారు. అతని పేరు టేలర్ రాబిన్ సన్. 22 యేళ్ల యువకుడు. హంతకుడ్ని చూసి ఉథా గవర్నర్ స్పెన్సర్ కాక్స్ షాక్ కు గురయ్యాడు. రాబిన్ సన్ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. మంచి కుటుంబం; మంచి అబ్బాయి; కానీ ఇంతలో ఇలా ఎలా రాడికల్ గా మారిపోయాడు అంటూ ఆశ్చర్యపోయడు. అమెరికాలో కూడ కమ్యూనిస్టు తీవ్రవాదుల్ని రాడికల్స్ అంటారు.
చార్లీ కిర్క్ క్రైస్తవ మతవాది; అమెరికా అతివాద జాతీయవాది. సులువుగా చెప్పుకోవాలంటే అమెరికాలో పురాతన అమెరికన్లు, సనాతన క్రైస్తవులు మాత్రమే వుండాలని ప్రగాఢంగా నమ్మేవాడు. ఇంకా సులువుగా చెప్పుకోవాలంటే అతను అమెరికాలో
సంఘపరివారకుడు.
2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ “అమెరికాకు పూర్వ వైభవాన్ని పునరుధ్దరిద్దాం” (Make
America Great Again - MAGA) అనే నినాదాన్ని ఇచ్చాడు. ఉదారవాదాన్ని తిరస్కరించడం, ప్రపంచీకరణను వ్యతిరేకించడం, అమెరికాకు వలసల్ని అడ్డుకోవడం, అన్నింటా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం అనడం ఇందులో ముఖ్యమైన అంశాలు. రోనాల్డ్ రీగన్ 1980లలోనే ఇలాంటి నినాదాలు ఇచ్చాడు. అయితే, ట్రంప్ వాటికి మరింత పదును పెట్టాడు. ట్రంప్ విధానాలను ఛార్లీ గట్టిగా అందిపుచ్చుకున్నాడు. వాటిని దేశమంతటా విస్తృతంగా ప్రచారం చేయడానికి ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ ఏ’
అనే
సంస్థను నెలకొల్పాడు.
1920 నవంబరు నెలలో
జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో
డెమోక్రాట్ జో బెడెన్
చేతిలో ట్రంప్ ఓడిపోయాడు.
అయినా ప్రెసిడెంట్ ఎలెక్ట్
కు అధికారాన్ని అప్పచెప్పి గద్దే దిగడానికి
ట్రంప్ ఒప్పుకోలేదు. 2021 జనవరి
6న వాషింగ్ టన్ డిసిలో
తన అనుచరులైన అల్లరి మూకలతో
ఒక కపట
దాడిని నిర్వహించాడు. ఆ
అల్లర్లలో ఛార్లీ క్రిక్
కీలక పాత్ర పోషించి
ట్రంప్ కు మరింత
దగ్గర అయ్యాడు. ట్రంప్
రెండోసారి శ్వేతభవన నివాసి
కావడంతో ఛార్లీ
క్రిక్ మరింత రెచ్చిపోయాడు.
అమెరికాలో
జరిగే అధికార అనధికార కార్యక్రమాలన్నింటిలోనూ ముందు చార్లి పేరే
వుండేది.
ఛార్లికి ఉదారవాదం
అస్సలు పడదు. ఒక్కసారి
అందులో పడితే కొట్టుకుపోతాం
అనేది అతని ప్రగాఢ
నమ్మకం. ఉదారవాదం అంటే
ఇతర మతాలను, ఇతర దేవుళ్ళను
గౌరవించాలి. మహిళల్ని
ఆదరించాలి. అతనికి గర్భశ్రావం, విడాకులు
కూడ నచ్చవు. ఎల్ జి
బిటి క్యూ హక్కులు
అస్సలు నచ్చవు.
ఉదారవాదాలకు మూలం
కార్ల్
మార్క్స్ అని అతని అక్కసు. తన
ప్రత్యర్ధుల్ని ‘సాంస్కృతిక మార్క్సిస్టులు’
అని తిట్టేవాడు. ఇదో
విచిత్ర పదబంధం. మార్క్సిజం
ఆర్ధిక మూలాలను మాత్రమే
పట్టించుకుంటుందిగానీ సాంస్కృతిక అంశాలను
పట్టించుకోదని మన దేశంలో
నయా అంబేడ్కరిస్టులు కొందరు విమర్శిస్తుంటారు.
చార్లీ క్రిక్ మార్క్సిజాన్ని
ఒక సమగ్ర ఉపద్రవంగా పరిగణించేవాడు.
ఒకసారి మార్క్సిస్టు వలలో
పడితే ఆర్ధిక, రాజకీయ,
సామాజిక, సాంస్కృతిక అంశాలన్నింటిలోనూ
రాజీపడాల్సివస్తుందని అతను భావించేవాడు.
ప్రపంచ
పటం మీద అమెరికా బలపడాలంటే ఫాసిజం,
నాజిజం వంటి సిధ్ధాంతాలను
పునరుధ్ధరించాల్సిందే
అని నమ్మేవాడు.
‘సాంస్కృతిక బోల్షివిక్కు’
అనే మాటను హిట్లర్ కాలపు
జర్మనీలో ఒక తిట్టుగా
వాడేవారు. కమ్యూనిస్టు సాహిత్యాన్ని
తగులబెట్టడానికీ, చిత్రపటాలను చించివేయడానికీ,
కార్యకర్తల్ని చంపివేయడానికీ ఈ
మాటను వాడేవారు. ఇప్పుడు
అమెరికాలో ట్రంప్ అనుయాయులు తమ ప్రత్యర్ధుల మీద ఇదే మాటను ప్రయోగిస్తున్నారు.
అనధికారికంగా అమెరికాలో
వుంటున్నవారినీ, అలాగే విద్యార్ధులుగానో,
పర్యాటకులుగానో అమెరికాకు వచ్చి
ఉపాధిని వెతుక్కుంటున్నవారినీ పట్టుకుని
నాటకీయంగా సంకెళ్ళు వేసి
స్వదేశాలకు పంపించే పనులు
ట్రంప్ అనేకం చేశాడు.
అయినప్పటికీ,
వాటివల్ల దేశంలో ఉపాధి
అవకాశాలు పెరగాల్సినంతగా పెరగలేదు.
అమెరికా స్థూల జాతీయ
ఉత్పత్తి 29 ట్రిలియన్ డాలర్లు
వుంటే, ఆ దేశ
మొత్తం రుణాలు 35 ట్రిలియన్
డాలర్లకు చేరుకున్నాయి.
వాగాడంబరంతప్ప ట్రంప్
వల్ల దేశానికి జరుగుతున్న
మేలు ఏమీలేదని భావించేవారి
సంఖ్యకూడ పెరుగుతూవుంది.
ఇలాంటి అభిప్రాయం
విద్యావంతుల్లో మరింత ఎక్కువగా వుంది. మరోవైపు,
ఇండియా, రష్యా, చైనా
తదితర దేశాలు ఇటీవల ఏకమౌతూ అమెరికాకు
గట్టి సవాలును విసురుతున్నాయి. అమెరికా పునాదులు కదులుతూ వుండడం సహజంగానే అమెరికా
యువతలో అశాంతిని రేపుతోంది.
ట్రంప్ బలహీనపడుతున్న
దశలో ఛార్లీ క్రిక్
చెలరేగిపోతుండడం చాలా మందికి చికాకు
తెప్పించింది. ఆ
మేరకు అమెరికా యువతరంలో
అతని మీద ఎవగింపు
కూడ పెరుగుతూ వచ్చింది. క్రిక్
హత్య కేసులో అరెస్టు
అయిన రాబిన్సన్ చాలాకాలంగా
అతని కదలికల్ని గమనిస్తున్నట్టు
విచారణలో తేలింది. క్రిక్ సనాతన
భావాల్ని అతను ఏవగించుకునేవాడట.
అతన్ని “ఫాసిస్టు” అనేవాడట.
ట్రంప్
కన్నా ముందు వీడి ఆట
కట్టించాలి అనే భావంతో
వుండేవాడట.
క్రిక్ హత్యకు
వాడిన తుపాకీతోపాటు కొన్ని
బుల్లెట్లను కూడ రాబిన్సన్
నుండి ఫెడరల్ పోలీసులు
స్వాధీనం చేసుకున్నారు. ఒక బుల్లెట్
కేసింగ్ మీద “రేయ్
ఫాసిస్ట్! అందుకో” అని
రాసివుంది. ఇంకో కేసింగ్
మీద “బెల్లా సియావో” అని
రాసివుంది. ముస్సోలిని ఫాసిస్టు
పాలన రోజుల్లో అతనికి
వ్యతిరేకంగా బాధితులు పాడుకున్న
ఇటాలియన్ పాట పల్లవి
అట ఇది. అంటే
ఛార్లీ క్రిక్ ను
రాబిన్సన్ ఎంతగా అధ్యయనం
చేశాడో అతని మీద ఎంతగా కసితో రగిలిపోయాడో అర్ధం
అవుతోంది.
రెండవ ప్రపంచ
యుధ్ధ కాలంలో ఇటలీలో
ఫాసిజాన్నీ, జర్మనీలో నాజీజాన్నీ
కార్ల్ మార్క్స్ అభిమానులు
అంతం చేశారు. ఇప్పుడు
అమెరికా ఫాసిస్టుల మీద
కూడ సాంస్కృతిక మార్క్సిస్టులే తిరగబడుతున్నారు.
13-09-2025
https://epaper.andhrajyothy.com/Hyderabad?eid=34&edate=14/09/2025&pgid=1177016&device=desktop&view=3
No comments:
Post a Comment