Monday, 15 December 2025

Chrismas Message - కొలకలూరులో క్రిస్మస్ సందేశం

 

కొలకలూరులో క్రిస్మస్ సందేశం

 

సోదరులారా! మిత్రులారా!




 

మినీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇవ్వడానికి అవకాశం కల్పించిన జేజే సొసైటీ నిర్వాహకులు శ్రీమతి సువర్చలా శశికిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

 

నేను ధార్మికంగా ముస్లింని. అయితే హిందూ, క్రైస్తవ సమూహాలతో నాకు ప్రగాఢమైన అనుబంధాలున్నాయి. జైన, శిక్కు సమూహాలతోనూ ఎంతో ఆత్మీయంగా మెలిగిన అనుభవాలు ఉన్నాయి.

 

ప్రతి మతానికీ ఒక కేంద్ర భావన ఉంటుంది. హిందూ మతం—తన తన కర్తవ్యాలను నిష్ఠతో ఆచరించాలనే ధర్మాన్ని బోధిస్తుంది. ఇస్లాం—అంకితభావాన్ని బోధిస్తుంది. నువ్వు నమ్ము. నమ్మినదాన్ని కొనసాగించు.  క్రైస్తవం—కరుణను, క్షమను బోధిస్తుంది.

 

మూర్ఖులు ఏసుక్రీస్తును బంధించి శిలువ వేశారు. అంతటి క్రూరత్వాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఆయనకు కోపం రాలేదు. పైగా, వారిని క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాడు—“Forgive them, for they know not what they do.” ఈ క్షమాగుణమే క్రైస్తవ మత సారమని నేను భావిస్తాను.

 

No curse. No retaliation. No call for revenge. Only faith, restraint, and silence

 

జీసస్ ప్రభావం గాంధీజీ మరణంలోనూ కనిపిస్తుంది. ద్వేషులు పేల్చిన గుండ్లకు ఆయన “హే రామ్” అంటూ నేలకు ఒరిగిపోయారు. అయినా తన హంతకులపై పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా, వారిని క్షమించమని సంకేతాలు చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతారు.

 

ఆంధ్రా క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ (ACTC) ఫాదర్ జోనథన్ గారు వేదికపై ఉండగా క్రైస్తవం గురించి మాట్లాడటం నాకు ఒక కొత్త అనుభవం.

 

నేను నరసాపురం గోదావరి డెల్టా మిషన్ హైస్కూలులో చదివాను. మాకు లంచ్ అవర్‌కు ముందు పదిహేను నిమిషాల బైబిల్ క్లాస్ ఉండేది. అది పాఠ్యక్రమంలో భాగం కాదు—ఐచ్ఛికం మాత్రమే. మాది తెలుగు మీడియం చదువు. అయినా బైబిల్ క్లాస్‌కు హాజరైతే ఇంగ్లీషు మెరుగుపడుతుందని ఆసక్తితో తరచూ అటెండ్ అయ్యేవాడిని. విశేషం ఏమిటంటే, నా క్లాస్‌మేట్లలో ఓ ముగ్గురు తరువాత కాలంలో ప్రసిద్ధ బిషప్‌లయ్యారు. మా హైస్కూల్ నుంచే అయితే ఓ డజను మంది బిషప్‌లు అయ్యుంటారు.

 

నా హైస్కూల్ అనుభవం మరోదాన్ని కూడా మీతో పంచుకోవాలి. ఫ్రంట్ బెంచీలో మేము ముగ్గురం కూర్చునేవాళ్లం—అమ్మనమంచి కృష్ణశాస్త్రి, పిట్టా కాల్విన్ విక్టర్ బాబ్, నేను. మొదటివాడు హిందువు, రెండోవాడు క్రైస్తవుడు, మూడోవాడు ముస్లిం. మూడేళ్లూ మాది ఇదే కలయిక. ఈ రోజు జేజే సొసైటీ నిర్వాహకురాలు సువర్చలా శశికిరణ్ గారు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, నేను ఒకే వేదికపై వరుసగా కూర్చుంటే—నాకు నా హైస్కూల్ ఫ్రంట్ బెంచీ నాటి మతసామరస్యం గుర్తుకు వచ్చింది. ధన్యవాదాలు మనోహర్ గారూ!.

 

మత సామరస్యం గురించి గొప్పగా మాట్లాడటం మాత్రమే కాదు; దాన్ని ఒక ఆదర్శంగా ఆచరించాలి. ఒక సందేశం ఇవ్వమని నన్ను పిలిచారు. అయితే, ఇక్కడి నుంచి నేను ఇంకో గొప్ప సందేశాన్ని అందుకుని వెళ్తున్నాను.

 

ఈ అపూర్వ అనుభవాన్ని నాకు అందించిన నిర్వాహకులకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

 

కొలకలూరు 15 డిసెంబరు 2025