పారడైజ్ లాస్ట్
మార్క్సిస్టు లెనినిస్టు విప్లవోద్యమం నాకు స్వర్గం లాంటిది. అది లేకుంటే నేను బతికుండేవాడిని కాదు. అది నాకు సమాజం మీద నమ్మకాన్ని ఇచ్చింది. నా శరీరంలో ఒక ఉత్సాహాన్ని నింపింది.
కొంచెం వెనుక నుండి చెప్పాలి.
మాదొక మధ్యతరగతి కుటుంబం. మానాన్న మంచి మెకానిక్. అప్పట్లో డబ్బులు అపురూపం. ఒక్కోసారి డబ్బు పెట్టినా బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులు కూడ సులువుగా దొరికేవికావు. రేషన్ వుండేది. ఓ ఐదు కిలోలు గోధుమలు, పంచదార కొనాలంటే అసిస్టెంట్ గ్రెయిన్ పర్చేజింగ్ ఆఫీసర్ నుండి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఆ రోజుల్లో సైకిళ్ళే గొప్పవాహనాలు. వాటి విడిభాగాలూ దొరికేవి కావు. దేశంలో ఉత్పత్తిలేదు. మానాన్న కొన్ని రకాల విడిభాగాలను లేతు మిషన్ మీద తయారు చేసేవారు. టైర్ రీ-ట్రేడింగ్ కార్ఖానా పెట్టారు. మా కుటుంబానికి ఉమ్మడిలో నరసాపురం -అంత్రర్వేది మధ్య తిరిగే ఒక లాంచి వుండేది.
దేవుడు మమ్మల్ని పరీక్షించాలనుకున్నాడు. ఒకరాత్రి ఇవన్నీ పోయాయి. గోదావరి వరదలో లాంచి మునిగిపోయింది. కార్ఖాన మంటల్లో మాడిపోయింది. అప్పులు చుట్టుముట్టాయి. నాకు శ్వాసకోశ వ్యాధి బయట పడింది. భయంవల్లనూ కావచ్చు ఊపిరి ఆడేది కాదు. నాకు ఊపిరి పోయడానికి మానాన్న, మా అమ్మ చాల కష్టపడ్డారు. మాన్న స్వయంగా నాకు వర్కవుట్ నేర్పారు. గోదాట్లో ఈదడం నేర్పారు. శరీరం బాగుంటే మనుషుల మెదడులో ధైర్యం వస్తుంది.
ఇది కూడ దేవుడికి ఇష్టంలేదు. కష్టాలు పెరిగాయి. అప్పుల వాళ్ళు మానాన్నను నడిరోడ్డు మీద నిలదీశారు. ఆయన నేల మీద నిలబడలేక పోయారు. పక్క పట్టణానికి వెళుతున్నానని నాతో చెప్పి ఓ రెండు రూపాయలు చేతులో పెట్టి బస్సు ఎక్కారు. నేను ఆ రెండు రూపాయల నోటును చేత బట్టుకుని ఆనందంతో బస్ స్టాండ్ లో గెంతులు వేశాను. అంత ఆనందం దేవుడికి నచ్చలేదు. రెండు రోజుల తరువాత తెలిసింది మానాన్న అవమాన భారంతో పారిపోయారని.
మానాన్నది మెకానిక్ ఛాతి. చాలా వెడల్పుగా వుండేది. ఆయన చాతీ మీద పడుకోవడం నాకు చాలా ఇష్టం. నన్ను వదిలి వెళ్ళిపోవడానికి ఆయన ఎంత బాధపడ్డారో అని తలచుకుని చాలా ఏడ్చాను. నిజానికి అప్పుడు నేను ఎలా బతకాలి అని నా గురించి ఆలోచించాలి? కానీ మానాన్న మీద నాకు జాలి వేసింది. నేను మనిషిని అని నాకు మొదటిసారి తెలిసిన క్షణం అది. ఇది 1961లో జరిగింది. అప్పడు నాకు తొమ్మిదేళ్ళు.
మానాన్న ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడి నుండి లూధియాన వెళ్ళి అక్కడి కార్ఖానాల్లో పనిచేశారు. అలా నాకు బాల్యంలోనే ఢిల్లీ పంజాబ్ మా కుటుంబంలో భాగం అయ్యాయి. మూడేల్ల తరువాత మా నాణ్న తిరిగి వచ్చారు.
మానాన్న లేని కాలంలో మాకు మా అమ్మే మా నాన్న కూడ అయిపోయింది. దేవుడు నాకు గొప్ప నాన్నతోపాటు గొప్ప అమ్మనూ ఇచ్చాడు. మానాన్న అమాయకుడు మృదు స్వభావి. మా అమ్మ తెలివైనది. లక్ష్యం పెట్టుకున్నదంటే సాధించి తీరుతుంది. అమె రాక్షసి. కష్టాలను అడ్డంకుల్నీ లెఖ్ఖ చేయదు. “నువ్వు ఇంగ్లీషు మాట్లాడాలి” అని అదేశించింది. అంతేకాదు; “ఇంగ్లీషువాళ్లలా చొక్కా లోపలికి వెయ్యాలి. బూట్లు తొడగాలి. మెడలో టై వేసుకోవాలి” అంది. తనతోపాటు ముగ్గురు సంతానాన్ని పోషించడానికి రేయింబవళ్ళు కాగితపు సంచులు తయారు చేసేది. ఇంట్లో నేను తనకు సహాయపడేవాడిని. బయట ఒక షాపులో పార్ట్ టైమ్ వర్కర్ గా పనిచేసేవాడిని. పదవ యేట బాలకార్మికుడిని అయ్యాను.గొప్ప అనుభవం. కష్టాలు ప్రపంచాన్ని అర్ధం చేసుకునేలా చేస్తాయి. అదీ ఒక అదృష్టమే.
సన్నిహితులు తరచూ ఒక మాట అంటుంటారు.; నాకు జాలి కలిగినపుడు మా నాన్నలా మరిపోతానంటా; కసి పెరిగినపుడు మా అమ్మలా మారిపోతానంటా. రేర్ కాంబినేషన్.
చదువు నాకు బాగానే అబ్బింది. స్కులు పుస్తకాలే కాకుండా లైబ్రరీలోనూ పుస్తకాలు చదివేవాడిని. ఎయిత్ స్టాండర్డ్ కు అప్పట్లో పబ్లిక్ పరీక్ష వుండేది. నేను పశ్చిమ గోదావరిలో టాపర్ గా నిలిచాను. అప్పట్లో మా ఊర్లో మిషన్ హైస్కూలుకు చాలా పేరుండేది. తొమ్మిదిలో వున్న నాలుగు సెక్షన్లు నిండిపోయినా నాకు సీటు ఇచ్చారు. అప్పర్ మిడిల్ స్కూలు, హైస్కూలులో నా టీచర్లు చాలా గొప్పవారు. పాఠాలే కాకుండా ఇతర సాహిత్య విశేషాలూ చెప్పేవారు. హైస్కూలు మూడేళ్ళూ నాకు మెరిట్ స్కాలర్ షిప్ వచ్చేది. ద నరసాపురం కాలేజీలో పియుసి ఎంపిసి కూడా స్కాలర్ షిప్పు వచ్చింది. అంత వరకు బాగుంది.
కాలేజీలో నేను దారి తప్పాను. టెక్స్టు పుస్తకాల మీద శ్రధ్ధ తగ్గి ఇతర పుస్తకాలు చదవడం మీద ఆసక్తి పెరిగింది. నాటక సంఘాలతో పరిచయాలు ఎక్కువయ్యాయి. చదువు అటక ఎక్కింది. పియుసిలో అవమానకరమైన మార్కులు వచ్చాయి. మా అమ్మ గుండెలు అవిసేలా ఏడ్చింది.
కులవృత్తి మెకానిజం వుందిగా. దాన్నే కొనసాగించాను. అప్పట్లో నేను రాసిన ‘ప్రగతి’ నాటిక పరిషత్తు నాటకాల్లో బహుమతులు గెలుచుకుంది. అప్పుడే ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టులతో పరిచయాలు ఏర్పడ్డాయి. మళ్ళీ గాడి తప్పాను. వృత్తిని నిర్లక్ష్యం చేశాను. అది నా మీద పగతీర్చుకుంది. రోడ్డున పడేసింది. ఊర్లో వుండలేక జేబులో మూడున్నర రూపాయలతో విజయవాడ చేరాను. కూలీ పనులు చేశాను. అయినా విజయవాడ ఆశ్రయం ఇచ్చింది. తల్లీ నీకు వందనం!
ఈలోగా ఒక విచిత్రం జరిగింది. నరసాపురం కాల్ గ్యాస్ కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తున్న ఉష నాకు లైబ్రరీలో పరిచయం అయ్యింది. పుస్తకాల మీద ఇష్టం వ్యక్తిగత ఇష్టంగానూ మారింది. నేను నిలబడడానికి నేల లేని సమయంలో తన్ను నన్ను ప్రపోజ్ చేసింది.
విజయవాడలో నిలబడడానికి మార్వాడీల దగ్గర చేరాను. హరిప్రసాద్ ఖండేల్ వాల్ నాకు అన్నగా మారారు. వాళ్ల కుటుంబ సభ్యుడ్ని అయిపోయాను. వాణిజ్య సూత్రాలు అర్ధం అయ్యాయి. మార్కెటింగ్, అకౌంటింగ్ లో మెళుకువలు తెలిశాయి. వాణిజ్యపన్నుల అధికారులతో డీల్ చేయడం వచ్చేసింది. నేను బతకడమేగాక మరో నలుగురికి పని ఇచ్చేంత వరకు అవకాశాలు వచ్చాయి.
హరిప్రసాద్ ఖండేల్ వాల్ సాక్షి సంతకంతో విజయవాడలో ఉషను రిజిస్టర్ పెళ్ళి చేసుకున్నాను. జీవితం మీద నమ్మకం కొంచెం అతిశయించింది.
ప్రతి ఆనందం నీడన విషాదం వుంటుంది. పెళ్ళి చేసుకున్నాంగానీ కాపురం పెట్టలేదు. మా పెళ్ళి ఉష కుటుంబ సభ్యులకు నచ్చలేదు. విడగొట్టడానికి ప్రయత్నించారు. ఆ వత్తిడిని తట్టుకోలేక ఉష ఆత్మహత్య చేసుకుంది.
ఆందోళన వత్తిడి కుంగుబాట్లు అన్నీ ఒక్కసారిగా ఆవరించాయి. అలాంటి మానసిక స్థితిలో మార్కెటింగ్ అస్సలు కుదరదు. తొమ్మిదో ఏట బస్ స్టాండ్ లో నిస్సహాయంగా నిలబడ్డట్టు ఇరవై ఏడో ఏట విజయవాడ రైల్వే స్టేషన్ లో వుండిపోయాను.
కష్టాల్లో వున్నవాళ్ల దగ్గరికి దేవుడు తన దూతల్ని పంపిస్తాడు. మా ఊరి మిత్రుడు ఒకడు కలిశాడు. ఉష ఒక మహిళా సంఘంలో పనిచేసేది. అది కమ్యూనిస్టు తీవ్రవాదుల సంఘం అని తను చెప్పాడు. “నువ్వు రచయితవు గనుక సమాజం కోసం చాలా చెయ్య గలవు” అన్నాడు. బతకడానికి ఓ దారి కనిపించింది. ఆ రోజు నుండి విజయవాడలో నక్సలైట్ల కోసం వెతకడం మొదలెట్టాను.
విజయవాడ మొఘల్రాజపురం నవోదయకాలనీలో వాసిరెడ్డి వెంకట కృష్ణారావు గారిని కలిశాను. నక్సలైట్లలో చాలా గ్రూపులు వుంటాయని నాకు తెలీదు. యాధృఛ్ఛికంగా కృష్ణారావు గారిని కలిశాను. వేవ్ లెంగ్త్ కుదిరింది రాడికల్ గా మారిపోయాను. దానికి అగ్రనేత కొండపల్లి సీతారాయయ్య అని చాలా కాలం తరువాత తెలిసింది.
స్వల్పకాలంలోనే కృష్ణారావు నేను గురుశిష్యులమై పోయాము. వారు నా బలాలు బలహీనతల్ని గొప్పగా విశేషించారు. వాణిజ్యరంగంలో దాన్ని స్వాట్ (SWOT) రిపోర్టు అంటారు. మన బలం, మన బలహీనతలు, మనుకున్న అవకాశాలు, ముంచుకు వస్తున్న ముప్పులు. వీటిని ఎప్పటి కప్పుడు బేరీజు వేసుకుంటూ వుండాలి.
నాకు ఫిజిక్ తో పాటు బ్రెయిన్ వుందని కృష్డారావు గుర్తించారు. దేన్ని ఎప్పుడు వాడాలి అని నిర్ణయించడానికి ఒక గురువు కావాలి. ఆ పని వారు నిర్వర్తించారు. ఆయన నన్ను దాడులు చేయడానికీ ఉపయోగించారు; కమ్యూనిస్టు పత్రికల్లో వ్యాసాలు రాయడానికీ ఉపయోగించారు.
మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించేవాళ్ళు కలిసి బతకడంకన్నా ఈ భూమ్మీద స్వర్గం అంటూ ఏమీ వుండదు. అలాంటి స్వర్గంలో నేను మూడేళ్ళు వున్నాను.
నా కోసం ఒక కొత్త ప్రపంచం ద్వారాలు తెరుచుకున్నాయి. అద్భుతమైన మనుషులుండే కొత్త ప్రపంచం. అది చాలా విశాలమైనది. ఒక్క విజయవాడలోనే వందకు పైగా కుటుంబాల్లో నేను సభ్యుడ్ని అయిపోయాను. మద్రాసు, కలకత్తా, బొంబాయి, ఢిల్లి, బరంపురం ఎక్కడికి వెళ్ళినా బంధువర్గాన్ని మించిన కామ్రేడ్లు వుండేవారు. ప్రయాణానికి డబ్బులు లేవు. అయినా ఇండియా అంతటా కలయ తిరగేసేవాడిని. ఫోన్లు లేవు, కామ్రేడ్స్ మధ్య ఒక విధమైన టెలీపతి పనిచేసేదేమో అనిపిస్తుంది. కలకత్తా వెళితే ఒకాయాన సైకిలు వేసుకుని హౌరా స్టేషన్ ముందు నాకోసం ఎదురు చూస్తుండేవాడు. లూసన్ మీద అధారిటీ అనదగ్గవాడు విజయవాడలో ఒకడున్నాడు; లూసన్ శతజయంతోత్సవాలకు అతన్ని పిలిస్తే బాగుంటుందని జవహర్ లాల్ నెహ్రు యూనివర్శిటీ ఫారిన్ లాంగ్వేజెస్ డిపార్ట్ మెంటుకు ఒకడు సూచించేవాడు. ఏం నెట్ వర్క్ అదీ! ఇప్పటి డిజిటల్ నెట్ వర్క్ మనుషుల్ని కలపడంలేదు; విడగొడుతోంది.
అప్పట్లో విప్లవోద్యమం మీద చాలా నమ్మకం వుండేది. కామ్రేడ్ల మధ్య ఆత్మీయత చాలా గొప్ప స్థాయిలో వుండేది. ఎలాంటి రిస్కుకు అయినా సిధ్ధపడేవాడిని. అక్షరాలు కూర్చడం నుండి ఆయుధాల తయారీ వరకు ఏ రంగంలో టాస్క్ ఇచ్చినా పూర్తి చేసేవాడిని. పెర్ఫెక్షనిస్టు అనే పేరుండేది.
నేను కృష్ణాజిల్లా రాడికల్ యూత్ లీగ్ కు అధ్యక్షుడిగా వుండేవాడిని. తరువాతి కాలంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్టుగా మాడిన బి. చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడుగానూ, పాలఫ్యాక్టరి లింగం నాగేశ్వరరావు కార్యదర్శిగానూ వుండేవారు. మా మధ్య ఆత్మీయ సంబంధాలు చాలా బాగుండేవి. మరోవైపు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు మెంటార్ గా వుండేవాడిని. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘానికి కూడ కృష్ణాజిల్లాలో తొలి కన్వీనర్ ని నేనే. విరసంలో చేరాక కృష్ణా వుభయగోదావరి జిల్లాలకు ప్రాంతీయ కన్వీనర్ గా వున్నాను.
అప్పట్లొ విజయవాడలో రాష్ట్ర పార్టి పొలిటికల్ క్లాసులు జరిగాయి. తరువాతి కాలంలో బిగ్ బిగ్ నేమ్స్ గా మారిన వాళ్ళు ఆ క్లాసుల్లో స్టూడెంట్స్. కొండపల్లి, సత్యమూర్తి, వంటివారు టీచర్లు. నాకు అప్పటికి ఆ క్లాసుల్లో విద్యార్ధి అయ్యేంత అర్హత లేదు. క్లాసుల నిర్వహణలో వాలంటీరుగా పనిచేసే అవకాశం వచ్చింది. చాలా ఛాలెంజింగ్ బాధ్యత. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ క్లాసులు జరుగుతున్నట్టు బయటికి తెలియరాదు. భోజనాల ఏర్పాటుల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికయినా తిండి వికటిస్తే రోగం వస్తుంది. రోగం వస్తే డాక్టరు వస్తాడు. డాక్టరు వస్తే వెనక పోలీసులు వస్తారు. అదీ డేంజరు. దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. నా సామర్ధ్యం రాష్ట్ర నాయకత్వానికి తెలిసిన సందర్భం అది.
ఆ క్లాసుల తరువాత కొండపల్లి కొన్ని రోజులు కృష్ణాజిల్లాలో వున్నారు. స్థానికులకు క్లాసు చెప్పారు. ఆ సమయంలో వారికి కొరియర్ -కమ్- బాడీ గార్డ్- ఒకరు కావలసి వచ్చారు. జిల్లా రాడికల్ కార్యదర్శి లింగం నాగేశ్వర రావుది బిగ్ ఫ్రేమ్ బాడి. అతన్నే సెలెక్ట్ చేస్తారు అనుకున్నాను. కానీ ఆ అవకాశం నాకు వచ్చింది. బాడీ కొంచెం చిన్నదేగానీ ఏదైనా జరిగితే నేను చాలా వేగంగా రియాక్ట్ అవుతానని కృష్టరావు భావించారు. ఆ సమయంలోనే సుప్రసిధ్ధ స్వీడిష్ రచయిత జాన్ మీర్డాల్ విజయవాడ వచ్చి కొండపల్లి సీతారామయ్యను కలుసుకున్నారు. విప్లవోద్యమంలో నా ఇగోను ఎంతగానో సంతృప్తి కలిగించిన రోజులవి.
కృష్ణారావుగారు కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని పీపుల్స్ వార్ ను వదిలి వినోద్ మిశ్రా నాయకత్వంలోని ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ కు వెళ్ళిపోయారు. ఆ కాలంలో నేను కృష్ణా జిల్లా పీపుల్స్ వార్ పార్టి బాధ్యతలు నిర్వర్తించాను.
పుస్తకాలు పాత సందేహాలకు సమాధానం చెపుతాయి. కొత్త సందేహాలను రేకెత్తిస్తాయి. అదే వాటి పని. చదవడంవల్ల కొత్త సందేహాలు వచ్చేవి. పార్టి రాష్ట్ర నాయకులు చాలా ఓపిగ్గా మా సందేహాలను తీర్చేవారు. చాలా సంయమనం పాటించేవారు. అందరి మధ్య గొప్ప సమన్వయం కూడ వుండేది. కొండపల్లి సీతారామయ్య, కేజి సత్యమూర్తి, ఐవి సాంబశివరావు వంటి అగ్రనేతలు నెలకు ఒక్కొకరు చొప్పున వచ్చి కలిసేవారు.
నేను చేరక ముందు కొండపల్లి సీతారామయ్య సాయుధపోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించి చాలా విమర్శల్ని ఎదుర్కొన్నారు. సివోసి నుండి పీపుల్స్ వార్ గా మారేక పార్టి గతంకన్నా చాలా ఎక్కువగా విస్తరించింది. నక్సలైట్ పార్టీల్లో అన్నింటికన్నా పెద్దది చురుకైనది అనిపించుకుంది. రైతాంగ పోరాటాలు మొదలు, కళాసాహిత్య రంగాలు, పౌరహక్కుల ఉద్యమం అన్నింట్లోనూ దానిదే అగ్రస్థానం.
శ్రీశ్రీ మొదలు కొడవటిగంటి కుటుంబరావు, కేవి రమణారెడ్డి, రావిశాస్త్రీ, కాళీపట్నం రామారావు వంటిసాహిత్య వుద్దండుల్ని ఒక వేదిక మీదికి తీసుకుని రావడం. గద్దర్, వంగపండు వంటి వాగ్గేయకారుల్ని సృష్టించడం, బాలగోపాల్ వంటి పౌరహక్కుల నేతను, వరవరరావు వంటి సామాజిక కార్యకర్తను, త్రిపురనేని మధుసూదన రావు వంటి తత్వవేత్తను తయారు చేయడం సివోసి-పీపుల్స్ వార్ కే సాధ్యం అయింది.
నా విప్లవ అతిశయాన్ని చూసి ఏలూరి భీమయ్య అనే రైతు ముచ్చట పడ్డారు. తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్ళి చేశారు.
పార్టి నాయకులకు ఆలోచనాపరులతో ఎలాగూ ఒక ఇబ్బంది వుంటుంది. పార్టి ముఖ్యులు కనిపించినప్పుడెల్లా ఆలోచనాపరులు “చైనాను ఇంకా విప్లవకేంద్రం ఎందుకు అంటున్నాము?” “జాతీయ బూర్జువావర్గం ఇండియాలో ముందుకు వస్తుందా?” వంటి ఇబ్బందికర ప్రశ్నలు వేస్తారు. దానికి వారు సంతృప్తికర సమాధానం చెప్పలేరు. ఎక్కువగా మాట్లాడితే “పార్టి లైన్” అంటారు. ఆ మాట అంటే అందరూ నోరు మూసుకోవాల్సిందే.
ఆలోచనాపరుల నుండి ఎదురయ్యే ఇబ్బందులకు వాళ్ళొక పరిష్కారాన్ని కనుగొన్నారు. “ఆలోచనాపరులది పెట్టీ బూర్జువా మనస్తత్వం; వాళ్ళు పూర్తిస్థాయి విప్లవకారులుకాలేరు” అనే మాటను ప్రచారంలో పెట్టారు. ఇది సమస్యను పరిష్కరించకపోగా కార్యకర్తలకూ ఆలోచనాపరులకు మధ్య ఒక వైరుధ్యాన్ని పెంచింది.
మతానికి విప్లవోద్యమానికీ నమ్మకం విషయంలో తేడాలేదు. విప్లవోద్యమంలోనూ ఒక దేవుడు వుంటాడు. అతన్ని మనం హేతువుతో, తర్కంతో చూడకూడదు. అతనే సర్వస్వం అని నమ్మాలి. నమ్మకపోతే మతంలో అన్యులు అంటారు; విప్లవోద్యమంలో అన్యవర్గ భావజాలం అంటారు. ఇది నన్ను బాగా అసంతృప్తికి గురిచేసింది.
సమాజానికి విప్లవం ఆకలికి అన్నమంత అవసరం. అవసరాన్ని గుర్తిస్తే సరిపోదు అవసరమైన శక్తిసామర్ధ్యాలను సంతరించుకోవాలి. నేను పెట్టుబడీదారుల్ని చాలా దగ్గర నుండి చూశాను. వాళ్ళ వనరులు, శక్తి, సామర్ధ్యాలు, సంస్కృతి నాకు బాగా తెలుసు. కమ్యూనిస్టు తీవ్రవాదులతో సహా కమ్యూనిస్టుల దగ్గర అలాంటి శక్తి సామర్ధ్యాలు సంస్కృతి లేవని నాకు తరచూ అనిపించేది. పరిమిత జ్ఞానంతో, పరిమిత వనరులతో ఎవ్వరూ కొత్త తరాలను ఆకర్షించలేరు. విప్లవాలను విజయవంతం చేయలేరు.
శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం (1967-70)లో అయినా, కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ సాయుధ పోరాటం (1977 – 90)లో అయినా కమ్యూనిస్టు విప్లవవాదులు పెద్ద శత్రువుల్ని ముఖాముఖీ ఎదుర్కోలేదు. చిన్నాచితకవాళ్లని శిక్షించి అదే ఘన విజయమనుకున్నారు. ఇది కూడ నాకు సంతృప్తి నివ్వలేదు. వీటితో పోలిస్తే, అలనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొంచెం మెరుగు. నల్గొండ జిల్లాలో ఎర్రపహడ్ దొర ప్రతాప రెడ్డిని, వరంగల్ జిల్లాలో విసునూరు దొర రాంచంద్రారెడ్డిని గట్టిగా ఎదుర్కొన్నారు.
గతంలో రెండు నెలలకు ఒకసారి కలిసే అగ్రనాయకులు పార్టి విస్తరించేకొద్దీ జిల్లా పర్యటనలకు రావడం పూర్తిగా మానుకున్నారు. రీజినల్ కమిటీ నాయకుల ప్రాధాన్యం పెరిగింది. రీజినల్ కమిటీ కార్యదర్శులు విధేయులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన ఉద్యమ అభిమానుల్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టారు. ఆ పరిస్థితుల్లో నాలాంటి అసమ్మతివాది హోల్ టైమర్ గా వుండడం అసాధ్యం అనిపించింది. 1981 మేడే రోజున హోల్ టైమర్ జీవితాన్ని వదిలి పార్ట్ టైమర్ గా మారిపోయాను.
కారంచేడు ఇష్యూను డీల్ చేయమని నన్ను కోరడంతో మళ్ళీ కొన్నాళ్ళు హోల్ టైమర్ గా మారాను. ఇదేమీ గొప్ప త్యాగం కాదు. ఇందులో నా స్వార్ధం కూడ వుంది. మార్క్సిజం ఆర్ధిక వ్యవహారాలతో తప్ప సాంస్కృతిక వ్యవహారాలతో డీల్ చేయలేదనే ఒక అపభ్రంస నింద వుంది. నాకు మత వివక్షను పట్టించుకోవాలనే ఒక ప్రత్యేక ఆసక్తి వుంది. 1984 నాటి ఢిల్లీ అల్లర్లు, శిక్కుల ఊచకోత సమయంలో నేను గద్దర్ తో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ టూర్ లో వున్నాను. ఢిల్లీ వెళ్ళడం కుదరలేదు. కుల వివక్షను ప్రత్యక్షంగా అధ్యయనం చేసే ఒక గొప్ప అవకాశం నాకు కారంచేడు ఉద్యమం ఇచ్చింది. కారంచేడు ఉద్యమం తాను ఆశించిన సమస్త ఆర్ధిక సౌకర్యాలనూ, చట్ట భద్రతను పొందింది. ఆ తరువాత మరే ఉద్యమం అలాంటి విజయాలను సాధించలేదు.
1950లలో కమ్యూనిస్టు కాకపోయినా, 1970లలో నక్సలైటు కాకపోయినా, 1990లలో ఉనికివాది కాకపోయినా, 2020లలో కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి వ్యతిరేకి కాకపోయినా మనం ప్రజలతో వున్నట్టు కాదు.
ఆంధ్రప్రదేశ్ లో 1989నాటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంలో పీపుల్స్ వార్ పాత్ర కూడ వుందని ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి భావించారు. నక్సలైట్ల మీద నిర్బంధాన్ని తొలగించారు. ఇతర వెసులు బాటులు కూడ కల్పించారు. విప్లవం విజయవంతం కాకుండానే విప్లవ పార్టీ నాయకులకు ప్రభుత్వంలో ప్రాబల్యం వచ్చింది. దానితో బ్యూరాక్రసీ పెరిగింది. అది అన్నిజిల్లాలకు వ్యాపించింది. ఆ బ్యూరాక్రసీని తట్టుకుని పార్టీలో కొనసాగడం నాకు చాలా ఇబ్బందిగా మారింది. 1990 జూన్ నెలాఖరులో పీపుల్స్ వార్ నుండి పూర్తిగా బయటికి వచ్చేశాను. ఆ తరువాత మరే పార్టీలోనూ చేరకూడదనుకున్నాను.
ఒక గొప్ప విషయం అయితే ఉద్యమంలో వుండేది. కార్యకర్తల్లో విపరీతమైన అంకిత భావం వుండేది. ఎవ్వరూ చావుకు కూడ భయపడేవారు కాదు. అది సామాన్యమైన విషయం కాదు. చాలా మహత్తరమైనది. అలాంటి తరాన్ని ఈ భూమి మళ్ళీ పుట్టిస్తుందా? అనే అనుమానం వస్తుంటుంది. ఆ గౌరవం వాళ్ళ మీద సదా వుంది. వుంటుంది.
పార్టి నుండి బయటికి వచ్చేసినా నేను చేయగల పని, నేను మాత్రమే చేయగల పని ఏది అప్పజెప్పినా అహాన్ని పక్కన పెట్టి పూర్తి చేసి ఇచ్చాను. ఎందుకంటే నాకు బోలెడు అసంతృప్తి వుండోచ్చు. కానీ, అది నాకు మరోజన్మ నిచ్చిందనే వాస్తవం కన్నా ఆ అసంతృప్తి గొప్పదేంకాదు.
కమ్యూనిస్టు పార్టీల గురించి ఎవరయినా అధ్యయనం చేయాలనుకుంటే ‘1990కు ముందు 1990 తరువాత” అని ఒక విభజన రేఖను స్పష్టంగా గీసుకోవాలి. నేను 1990 వరకు పీపుల్స్ వార్ లో వున్నాను.
(మావోయిస్టుల కథ ఒక ముగింపుకు వచ్చిందనే వార్తలతో కొంచెం మనస్తాపం కలిగి గతాన్ని ఇప్పుడు ఇలా అందరితో పంచుకోవాలనిపించింది)
23-09-2025
No comments:
Post a Comment