పోల‘వర’మా, శాపమా?
ఏ. యం. ఖాన్ యజ్దాని (డానీ)
August 24, 2013
నీటి వనరులు పుష్కలం
యాజమాన్య పద్ధతులదే లోపం
ఓటు బ్యాంకు రాజకీయాలతో సమస్య
విభజన ప్రకటనతో భయాందోళనలు
పరిష్కార మార్గాలు లేకపోలేదు!
నిల్వ సామర్ధ్యంలో పొరుగు రాష్ట్రాలే మిన్న
సహృద్భావ సూచిక ‘తెలుగు గంగ’
వివాద పరిష్కారమే సామర్ధ్య పరీక్ష
యాజమాన్య పద్ధతులదే లోపం
ఓటు బ్యాంకు రాజకీయాలతో సమస్య
విభజన ప్రకటనతో భయాందోళనలు
పరిష్కార మార్గాలు లేకపోలేదు!
నిల్వ సామర్ధ్యంలో పొరుగు రాష్ట్రాలే మిన్న
సహృద్భావ సూచిక ‘తెలుగు గంగ’
వివాద పరిష్కారమే సామర్ధ్య పరీక్ష
దక్షణ భారత దేశంలో అతిపెద్ద నదులు గోదావరి, కృష్ణా. ఈ రెండూ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రహించి, తూర్పున బంగాళా ఖాతంలో కలుస్తాయి. పైగా, ఈ రెండు నదుల పరివాహక ప్రాంతంలో అత్యధిక భాగం అంధ్రప్రదేశ్ లోనే వుండడం ఇంకో విశేషం. తమిళనాడుతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ లో నీటి వనరులకు కొదువలేదు. లోపం ఏదైనా వుంటే అది నదీజలాల యాజమాన్య పధ్ధతుల్లోనే వుంది. ఆంధ్రప్రదేశ్ లో నీటి అవసరాలు, నదీజలాల లభ్యతల్ని పరిగణనలోనికి తీసుకుంటే, మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ నీళ్ళే అందుబాటులో వున్నాయని సులువుగానే అర్ధం అవుతుంది. అయితే, మూడు ప్రాంతాల నాయకులు ఆడే ఓటు బ్యాంకు రాజకీయల కారణంగా మనం మనకున్న జలవనరుల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం.
అంధ్రప్రదేశ్ లో గోదావరి నది తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. కృష్ణానది రాయలసీమ, తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. గోదావరినది నీటి మీద వాటాదార్లు ఇద్దరే తెలంగాణ, తీరాంధ్ర. కృష్ణానది నీటి మీద వాటాదార్లు ముగ్గురు రాయలసీమ, తెలంగాణ, తీరాంధ్ర. ఇందులో విచిత్రం ఏమంటే, గోదావరి నదిలో నీళ్ళు ఎక్కువ వాటాదార్లు తక్కువ. కృష్ణానదిలో నీళ్ళు తక్కువ వాటాదార్లు ఎక్కువ.
రేపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే, కృష్ణా, గోదావరి నదుల నీటిని తీరాంధ్ర ప్రాంతానికి పారవు, పారనివ్వరు అనేది ఒక ఆరోపణ. తెలంగాణ ఉద్యమ కాలంలో కొందరు నాయకులు, కొన్ని సందర్భాల్లో అతిఉత్సాహంతో చేసిన హెచ్చరికలు కూడా ఇలాంటి భయాందోళనలకు దోహదం చేశాయి. తెలంగాణకు చెందిన ఉదారవాదులు ఇలాంటి అపొహల్ని అనేకసార్లు కొట్టివేసినా సీమాంధ్రలో అవి కొనసాగుతూనే వున్నాయి. ఈ భయం కారణంగానే తాము ’సమైక్యాంధ్రా’ను కొరుతున్నామని వాదించేవాళ్ళు తీరాంధ్రలో పెద్ద సంఖ్యలోనే వున్నారు. ఎక్కడైనా సమస్య ఉదారవాదులతోరాదు, దుందుడుకువాదులతోనే వస్తుంది.
ఈ భయాందోళనల్ని పరిశీలించే ముందు మనం మరికొన్ని వాస్తవాలను గమనించాల్సివుంది. ఉత్తర ఆఫ్రికా ఖండంలోని నైలునది పదకొండు దేశాల మీదుగా ప్రవహిస్తుంది. వీటిల్లో, ఈజిప్టు, సుడాన్ దేశాలకు నైలునది మినహా మరో నీటి వనరు లేదు. సింధూనది చైనాలోని మానససరోవరంలో పుట్టి, భారత్, పాకిస్తాన్ ల మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారత - పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతతల గురించి అందరికీ తెలుసు. సింధూ, దాని ఉపనదుల్ని 53 సంవత్సరాలుగా భారత, పాకిస్తాన్ లు వివాదంలేకుండా పంచుకుంటున్నాయని చాలా మందికి తెలీదు. 19 సెప్టెంబరు 1960 న దాయాది దేశాలు రెండూ కరాచీలో, సింధూ జలాల ఒప్పందం చేసుకున్నాయి. గడిచిన యాభై యేళ్లలో భారత_పాకిస్తాన్ ల మధ్య మూడు యుధ్ధాలు జరిగాయి. అయినప్పటికీ, సింధూ వాటర్స్ ట్రీటీ అమలుకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదు.
దాయాది దేశాలే నిరంతరం నదీజలాల్ని పంచుకుంటున్నప్పుడు, దాయాది రాష్ట్రాలు పంచుకోలేవా? అంధ్రప్రదేశ్ సమైక్యంగా వున్న నాటితో పోలిస్తే, విభజనానంతరం కొన్ని కొత్త ఇబ్బందులు తలెత్తే మాట నిజమేగానీ, వాటిని అధిగమించడానికి ఆధునిక మార్గాలు, పరిష్కారాలు, ఏర్పాట్లు, మార్గదర్శకాలు లేకపోలేదు.
రెండు రాష్ట్రాలు సంయుక్తంగా నీటిపారుదలా ప్రాజెక్టుల్ని నిర్మించి, నిర్వహించడం మన దేశంలో కొత్తేమీకాదు. ఇప్పటికే తుంగభద్రా ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని నిర్వహణ కోసం ఏర్పడిన తుంగభద్ర కంట్రోలు బోర్డులో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల చీఫ్ ఇంజినీరు స్థాయి అధికారులు సభ్యులుగానూ, కేంద్ర జలసంఘం నియమించిన అధికారి అధ్యక్షునిగానూ వుంటారు. రేపు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక, రాజోలిబండ, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టుల ల సంయుక్త నిర్వహణకు కొత్తగా అంతర్ రాష్ట్ర మండళ్ళు పెట్టుకోవాల్సి రావచ్చు. అంతకు మించి నదీజలాల గురించి మరీ ఆందోళన పడాల్సిన పనిలేదు. అయితే, తీరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు హైదరాబాద్ లా ప్రారిశ్రామిక ప్రాంతాలుకాదు కాదు. ముఖ్యంగా, తీరాంధ్ర ప్రాతం నూట అరవై సంవత్సరాలుగా కాల్వ వ్యవసాయం సాగిస్తున్న ప్రాంతం. తీరాంధ్రుల్ని ఆర్ధర్ కాటన్ సంతతి అన్నా, కాల్వల సంతితీ అన్నా తప్పుకాదు. వాళ్లకు నీళ్ళుతప్ప, మరో వనరు తెలీదు. అందువల్ల, నదీ జలాలగురించి వాళ్ళు సహజంగానే ఎక్కువగా ఆతృత కనపరుస్తారు.
వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. రెండు దేశాలు, రెండు రాష్ట్రాల మధ్య నిర్మించే ప్రాజెక్టుల్లోనేకాదు, రెండు ప్రాంతాలు, రెండు జిల్లాల మధ్య నిర్మించే ప్రాజెక్టుల్లోనూ వివాదాలుంటాయి. అంతెందుకూ, దిగువస్థాయిలో, రెండు చేల మధ్య, ఇద్దరి కమతాల మధ్య కూడా వివాదాలుంటాయి. మనం చేయాల్సిందల్లా, ఇరువర్గాలకు న్యాయంచేసే పరిష్కారాన్ని వెదకడం ఒక్కటే!
నూరేళ్లలో డెభ్భయి ఐదు సంవత్సరాల నీటిలభ్యత ప్రాతిపదికగా నికరజలాలను నిర్ధారిస్తారు. నదుల్లో కొన్ని సందర్భాల్లో, బహుశ, ఐదారేళ్లకు ఒకసారి వరదలు వస్తుంటాయి. ఆ సందర్భంలో వచ్చే నీళ్ళను అదనపుజలాలు, మిగులు జలాలు, వరదనీళ్ళు అంటారు. కొత్త ప్రాజెక్టులకు అన్నిరకాల అనుమతులు, గుర్తింపులు, ఆర్థికసంస్థల సహాయ సహకారాలు రావాలంటే, తప్పనిసరిగా నికరజలాల కేటాయింపులుండాలి. అదనపుజలాలు నమ్మదగ్గవికావు. వీటిని నమ్ముకుని కొత్త ప్రాజెక్టులు కడితే న్యాయపరంగానేకాక, ప్రకృతి పరంగానూ తీవ్ర ఇబ్బందులు తప్పవు.
నికరజలాలను నిర్ధారించడానికి ఎలాంటి గణన పధ్ధతిని అనుసరించారన్నదీ కీలకమే. ఒక నదిలో గరిష్ట నీటి లభ్యత సంవత్సరాలను పరిగణనలోనికి తీసుకున్నారా? కనిష్ట నీటి లభ్యత సంవత్సరాలను పరిగణనలోనికి తీసుకున్నారా? అన్నది ముఖ్యం. కనిష్ట నీటి లభ్యత సంవత్సరాలను పరిగణనలోనికి తీసుకుని నికర జలాలను నిర్ధారిస్తే, ప్రతి సంవత్సరం ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతానికి కఛ్ఛితంగా నీరు లభిస్తాయి. అలా కాకుంగా, గరిష్ట నీటి లభ్యత సంవత్సరాలను పరిగణనలోనికి తీసుకుని నికర జలాలను నిర్ధారిస్తే, ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతానికి ఆశించిన మేరకు నీరు రాక వ్యవసాయం ఇబ్బందులకు గురవ్వాల్సి వుంటుంది.
కృష్ణానది నీటి వనరుల్లో, ఆంధ్రప్రదేశ్ వాటాకు 811 శతకోటి ఘనపు అడుగుల (టీయంసీ) నికరజలాల్ని ఆర్.యస్. బచావత్ కృష్ణా జలవివాదాల ట్రిబ్యూనల్ 1976లో కేటాయించింది. ఈ మొత్తం నికరజలాల్ని అప్పటికి కృష్ణానదిపై నిర్మించిన, నిర్మాణంలోవున్న, ప్రతిపాదనలోవున్న ప్రాజెక్టులకు విడివిడిగా కేటాయించేసింది. అంటే, బచావత్ ట్రిబ్యూనల్ తరువాత కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించడానికి ఎలాంటి అవకాశమూ లేదు. ఒకవేళ, నిర్మించినా వాటికి నికరజలాల కేటాయింపులు వుండవు. ఈ క్రమంలో సాగిన కృష్ణానదీ జలాల పంపకాల్లో, రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగింది. దీనిని సరిదిద్దనంత వరకు రాయలసీమ రగులుతూనే వుంటుంది.
గోదావరినదిలో నికర జలాలు 3, 565 టీయంసీ లున్నట్టు బచావత్ ట్రిబ్యూనల్ (జీడబ్ల్యూడిటీ) 1980 లో అంచనావేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా 1495 టీయంసీ లు కేటాయించింది. ఇందులో, గోదావరినదిపై 2004 నాటికి నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లో కేవలం 600 టీయంసీల నీరు మాత్రమే వినియోగం అవుతున్న కారణంగా, మరో 895 టీయంసీల నికరజలాలు అందుబాటులో వున్నట్టు అంచనా వేశారు.
కృష్ణా బేసిన్ లో నీటి లభ్యత తక్కువగా వుండడం, గోదారి బేసిన్ లో నీటి లభ్యత ఎక్కువగా వుండడంతో, ఈ రెండు నదుల్ని అనుసంధానం చేయాలనే ప్రతిపాదన చాలా కాలం క్రితమే బలాన్ని పుంజుకుంది. దాని ఫలితమే పోలవరం ప్రాజెక్టు. ధవిళేశ్వరం, బెజవాడ ఆనకట్టల రూపశిల్పి సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడు 1850ల లోనే పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనని ముందుకు తెచ్చాడు.
గోదావరి నది నుండి 80 టీయంసీల నీటిని ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణానదిలోనికి మళ్ళించి, ఆమేరకు, నాగార్జునసాగర్ నుండి కృష్ణాడెల్టాకు విడుదల చేసే నీటిని ఆదాచేసి, తెలుగుగంగ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్. ఎల్. బి.సి) లకు నికర జలాలను కేటాయించాలనేది పోలవరం ప్రాజెక్టు లక్ష్యం. విశాఖపట్నానికి 23 టియంసీల తాగునీరు, కొత్త కాలువల పరివాహక ప్రాంతంలో 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడం, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం కూడా ఈ బహుళార్ధసాధక ప్రాజెక్టులో వున్నాయి.
అయితే, పైన చెప్పినంత సులువైన ప్రాజెక్టు కాదు పోలవరం. నిర్మాణ విధానం (డిజైన్) మొదలు, నీటి పంపకాల వరకు ఇందులో అనేక వివాదాలున్నాయి. 80 టీయంసీల నీటిని గోదావరి బేసిన్ నుండి కృష్ణాబేసిన్ కు మళ్ళించడానికి ఎలాంటి డిజైను అవసరమనేది ప్రధాన అంశం. ముంపు, గిరిజనప్రాంతాల్లో భూసేకరణ, పర్యావరణం, పొరుగు రాష్ట్రాల అంగీకారం, సహకారం తదితర అంశాలు ఇందులో వున్నాయి. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, పొరుగురాష్ట్రాల జాబితాలో ఆ రాష్ట్రం కూడా చేరుతుంది.
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా - గోదావరి నదుల్ని అనుసంధానం చేస్తే, కృష్ణానది ఎగువనున్న మహారాష్ట్రకు 18 శాతంగా 14 టియంసీలు, కర్ణాటకకు 27 శాతంగా 21 టీయంసీల నీళ్ళు అదనంగా ఇవ్వాలని బచావత్ ట్రిబ్యూనల్ సూచనల్లోనే ఒక నియమం వుంది. మనం చాలా వెనుకబడివున్నాంగానీ, ఈ అదనపు వాటా నీటిని నిల్వచేసుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అప్పుడే సంపూర్ణ ఏర్పాట్లు చేసుకుని కూర్చున్నాయి. పొలవరం ప్రాజెక్టు పూర్తయ్యి, కృష్ణా బేసిన్ కు నీరు విడుదల అయిన మరుక్షణం, కర్ణాటక నుండి మన రాష్ట్రంలోనికి వచ్చే కృష్ణాజలాలు అధికారికంగా 35 టీయంసీలు తగ్గిపోతాయి. అంటే, కృష్ణా బేసిన్ లోనికి మళ్ళించే 80 టియంసీలలో ఎగువరాష్ట్రాలకు 35 టీయంసీలు పోగా మిగిలేది 45 టీయంసీలే. వీటిల్లో 30 టీయంసీలు ఎస్.ఎల్.బి.సి.కు 15 టీయంసీలు తెలుగుగంగకు కేటాయించాలని 1985లో, యన్.టీ. రామారావు నిర్వహింహించిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇప్పటివరకు నికర జలాల కేటాయింపులు లేవు.
ఈ వివాదం ఇంతటితో, ఆగలేదు. ”దృఢనిశ్ఛయంవుంటే దారి దానికదే తెరుచుకుంటుంది” అని నమ్మే వైయస్ రాజశేఖరరెడ్డి, జలయజ్ఞంలో భాగంగా కృష్ణా బేసిన్ లో వరదనీటి ఆధారంగా అనేక కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు వీటిల్లో ముఖ్యమైనవి. రేపు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక వీటికి నికరజలాల కేటాయింపు సమస్య తప్పక ముందుకు వస్తుంది. అప్పుడు పోలవరం స్తోమతను మరింతగా పెంచాల్సి రావచ్చు. లేదా, గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేసే ప్రాజెక్టులు మరిన్ని నిర్మించాల్సి రావచ్చు. దానికి తీరాంధ్రతోపాటూ, తెలంగాణ కూడా సహకరిస్తేనే వీటి నిర్మాణం సాధ్యం అవుతుంది.
నీటి వివాదాల గురించి, అన్నీ చెడ్డ ఉదాహరణలేకావు అనేక మంచి ఉదాహరణలూ వున్నాయి. 1953లో ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి ఆంధ్రాప్రాంతం విడిపోయింది. భావోద్వాగాలతో ముడిపడివున్న మద్రాసు నగరాన్ని వదులుకోవాల్సి వచ్చింది. మద్రాసును వదిలి వెళ్ళిపొమ్మని అప్పటి ముఖ్యమంత్రి సీ. రాజగోపాలాచారి (రాజాజీ) ఆదేశించడం ఆంధ్రా నాయకులు మరిచిపోలేని ఒక చేదు అనుభవం. అయితే ఆంధ్రులు ఆ చేదు అనుభవాన్ని చాలా త్వరగా మరిచిపోయారు. 1980వ దశకంలో మద్రాసు నగరం తీవ్ర నీటి ఎద్దడికి గురయింది. తాగునీటికి కూడా అవకాశంలేక మద్రాసు నగరవాసులు కటకటలాడిపోయారు. విజయవాడ నుండి కృష్ణా నీటిని ప్రతిరోజూ ఎన్నో వ్యయప్రయాసలతో ప్రత్యేక రైళ్లలో మద్రాసు నగరానికి సరఫరా చేసేవారు. అప్పటి ముఖ్యమంత్రి యన్టీ రామారావు, చెన్నపట్నంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని, కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ వాటా నుండి 5 టియంసీలు మద్రాసు నగర ప్రజల తాగునీటీ కోసం ఇవ్వాలని నిర్ణయించారు. మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఉదారంగా స్పందించి చెరో 5 టియంసీల నీరు మద్రాసుకు కేటాయించాయి. మద్రాసుకు 15 టీయంసీల నీరు పంపడంతోపాటూ, పనిలోపనిగా రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో కొంత కొత్త ఆయకట్టుకు కూడా సాగునీరు అందించాలని యన్టీఆర్ భావించారు. అలా రూపుదిద్దుకున్నదే తెలుగుగంగ ప్రాజెక్టు.
ఇలాంటి సహృధ్భావ సంఘటనలు అనేకం ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కూడా జరుగుతాయననే ఆశిద్దాం. ఇరువైపులా భావోద్వేగాలు తీవ్రంగా వున్నప్పటికీ నీటి వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించడమే మన సామర్ధ్యానికి పరీక్ష!
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మోబైల్ ః 90102 34336
హైదరాబాద్
22 ఆగస్టు 2013
No comments:
Post a Comment