Friday, 25 October 2013

సీమాంధ్ర ప్యాకేజీకి వేళాయెరా!

సీమాంధ్ర  ప్యాకేజీకి వేళాయెరా!

ఏ. యం ఖాన్ యజ్దానీ (డానీ)

కలుసున్నవి విడిపోతాయి. విడిపోయినవి కలుస్తాయి. ఎలాగూ విడిపోతాయి కనుక కలవడం అనవసరం అనుకోవడమూ కుదరదు. ఎలాగూ కలిసిపోతాయి కనుక విడిపోవడం అనవసరం అనుకోవడమూ కుదరదు. దేని చారిత్రక సందర్భం దానికి వుంటుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇది విభజన సందర్భం.

  విడిపోవడం అనేది ఒక ప్రజాస్వామిక హక్కు. విడిపోయే హక్కు మనుషులకేకాదు ప్రాంతాలకూ వర్తిస్తుంది. ఒక వ్యక్తి మరోవ్యక్తి నుండి, ఒక ప్రజాసమూహం మరో ప్రజా సమూహం నుండి ఎందుకు  విడిపోవాలనుకుంటున్నది? అనేది ప్రాణప్రదమైన అంశం.

దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలకు పరిమాణంకన్నా గుణం గొప్పది. ఏ రంగంలో అయినా సరే బిగ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది సామ్రాజ్యవాదుల నినాదం. అప్పట్లో బ్రిటీష్ వలస వాదులు ఈ నినాదాన్ని బలంగా ప్రచారంచేసి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించారు. కానీ, ఆ సామ్రాజ్యంలోని దేశాలూ, ఆ దేశాల్లోని జాతులు, ఆ జాతుల్లోని ప్రజలు బ్రిటీష్ నినాదంతో ఏకీభవించలేదు. దేశాలు స్వాతంత్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని, మనుషులు స్వేఛ్ఛనూ కోరుకుంటారు.  

ఒక రాష్ట్రం ఇంకోరాష్టాన్ని, ఒక భాష ఇంకోభాషని, ఒక ప్రాంతం ఇంకో ప్రాంతాన్ని, ఒక జాతి ఇంకోజాతిని, ఒక తెగ ఇంకో తెగని, ఒక మతం ఇంకో మతాన్ని అణిచివేస్తూవుంటే ఏ ప్రాంత సమగ్రత అయినాసంక్షోభంలో పడిపోతుంది. అలాంటి సందర్భాల్లో ఎవరైనా ఆవేదన చెందాల్సింది దేశమో, రాష్ట్రమో ముక్కలైపోతున్నదనికాదు; అణిచివేతను ఎలా అంతం చేయాలని. స్వేఛ్ఛ, సమగ్రాభివృధ్ధి లేనప్పుడు  సమగ్రతా వుండదు.

మనుషులకు పుట్టుక పెరుగుదల చావు  వున్నట్టే,  ప్రతి ప్రాంతానికీ, జాతికీ, సామాజికవర్గానికి కూడా సాంస్కృతికంగా పుట్టుక వైభవం పతనం మూడూ వుంటాయి. పారిశ్రామిక విప్లవం ఆరంభం నుండి రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసే వరకు మొత్తం ప్రపంచానికి ఇంగ్లండ్ హ్యాపెనింగ్ ప్లేస్.  ఆ కాలంలో హాలివుడ్‌తోసహా సమస్త రంగాల్ని బ్రిటీష్‌వాళ్ళే ఏలారు. ఆ తరువాత ఇంగ్లండ్‌ది గత చరిత్రే! గత వైభవం అనేమాటను ప్రాంతాలు, దేశాలు, కట్టడాల గురించి చెప్పినంత సులువుగా మానవ సమూహాల గురించి చెప్పడం సాధ్యంకాదు. మానవ మొఖమాటం అడ్డువస్తుంది. అయితే మనుషుల మొఖమాటాలతో సమాజ సూత్రాలకు పనిలేదు. అవి తమ నిర్దేశిత మార్గంలో ముందుకు సాగుతూనేవుంటాయి.

అంధ్రప్రదేశ్‌లో విభజన, సమైక్య ఉద్యమాలు సమాజశాస్త్రాలకు పెద్ద సవాలు విసిరాయి. ఇరుప్రాంతాల పాలకవర్గాలు భావోద్వేగాల్ని  రెచ్చగొట్టడంలో సఫలం కావడంతో సమాజ చలన సూత్రాలే ఇప్పుడు ఎవరికీ గుర్తుకు రావడంలేదు. ఇరుప్రాంతాల ప్రజలు ఇప్పుడు పాలకవర్గాలు అనే పదాన్ని ఉఛ్ఛరించడానికే ఇబ్బంది పడుతున్నారు. ఇది ఈ రెండు ఉద్యమాల్లో పాలకవర్గాలు సాధించిన సాంస్కృతిక విజయం అనవచ్చు! 1940-50 ల నాటి తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం విషయాలేలావున్నా, తొమ్మిదేళ్ల క్రితం  పీపుల్స్ వార్,  జనశక్తి నక్సలైట్లను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకూ తెలంగాణలో అనేక స్థాయిల్లో అనేక ఉద్యమాలు, పొరాటాలు జరిగాయి. అవన్నీ స్థానిక పాలకవర్గాలపై సాగినవే. ఆ చారిత్రక వాస్తవాలని తెలంగాణలో దాదాపు అందరూ మరిచిపోయారు. ఇప్పటికీ కొంచెం భిన్నంగా యస్సీ, యస్టీ, మత అల్పసంఖ్యాకవర్గాలు, కార్మిక, కర్షక కోణంలో  ఆలోచించే సమూహాలు తెలంగాణలో వున్నప్పటికీ ఉద్యమంలో వాళ్లది ఉపస్రవంతేగానీ, ప్రధాన స్రవంతికాదు.

రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో అయితే ఈ అంశం మరీ ఘోరం. తెలంగాణలో ఉద్యమాన్ని అధికారవర్గాల్లో అసమ్మతివర్గం  మొదలెట్టగా, రాయలసీమ, తీరాంధ్రల్లో ఏకంగా అధికారపక్షపు ప్రజాప్రతినిధులే నేరుగా ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టారు.   1960-70 ల నాటి శ్రీకాకుళ పోరాట ప్రభావాన్ని పక్కన వుంచినా, సమీపగతంలో జరిగిన దళిత ఉద్యమాల ప్రభావం కూడా ఇప్పుడు అక్కడ కనిపించడంలేదు. ఇతర దృక్పధాలకు సహితం స్థానం కల్పించడంలో రాయలసీమ, తీరాంధ్ర ఉద్యమంకన్నా తెలంగాణ ఉద్యమం చాలా మెరుగు అనే చెప్పాలి. అక్కడ దళిత, బహుజన, శ్రామిక వాదాలకు కనీసం ఉపస్రవంతి స్థానం అయినా ఇచ్చారు. సీమాంధ్ర పాలకవర్గాలు కనీస స్థాయిలో కూడా ఉపస్రంతిని ఎదగనివ్వలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, గత అర్ధ శతాబ్దం కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాధించిన సామాజిక చైతన్యాన్ని ఈ రెండు ఉద్యమాలూ చెరో పధ్ధతిలో మింగేశాయి.

ఇప్పటి తెలంగాణ ఉద్యమ సిధ్ధాంతకర్త ఆచార్య జయశంకర్ బహుజనులు కావడాన వారి ప్రభావం దాని మీద బలంగా పనిచేసింది. సీమాంధ్ర ఉద్యమంలో ఇలాంటి సామాజిక కోణం పూర్తిగా లోపించింది. పైగా అక్కడ విషాదకరంగా అనేక తిరోగామి అలోచనల్ని పునరుధ్ధరించారు. అది సహజంగానే ఉద్యమం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

పంతొమ్మిదో శతాబ్దపు మధ్యలో, కాలవ వ్యవసాయం ప్రవేశంతో మొదలైన  వుభయ గోదావరి, వుభయ కృష్ణా జిల్లాల వైభవం, స్వాతంత్రోద్యమం వుధృతంగా సాగిన కాలంలో ప్రస్పుటంగా వెలుగులోనికి వచ్చింది. అల్లూరి శ్రీరామరాజు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యలతో మొదలైన ఈ క్రమం అనేక మలుపులు తిరుగుతూ ముందుకు సాగింది. సాంస్కృతికంగా బ్రాహ్మణ వ్యతిరేకత, రాజకీయంగా కాంగ్రెస్ వ్యతిరేకత, తాత్వికంగా సామ్యవాద సానుకూలత, సాంకేతికంగా ప్రయోగ సన్నధ్ధత, వాణిజ్యపరంగా  విపత్తుల్ని తట్టుకునే స్తోమత అన్నీ కలిసి, ఆ ప్రాంతపు  బలమైన సామాజికవర్గాల్ని పురోగామి సమూహంగా మార్చింది. ఈ క్రమానికి నాయకత్వం వహించిన  కమ్మ సామాజికవర్గానికి సహజంగానే ఇందులో సింహవాటా దక్కింది.

బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంతో మొదలైన పురోగతి ఐతరేయ బ్రాహ్మణాన్ని వుటంకించే దశకు చేరడం పతనమో, పురోగమనమో తేల్చడం పెద్దకష్టం ఏమీకాదు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా వున్న రాజకీయపార్టి, కొత్తరాష్ట్రానికి  దళితుడ్ని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినట్టు, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు ’పోటీకోసం అయినా’ అంధ్రప్రదేశ్ కు దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించలేకపోయారు. దళిత, బహుజన శక్తులు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గోనకపోవడానికి ఇది ప్రధాన కారణం.

సమైక్య ఆంధ్రజాతివాదులు ఐతరేయ బ్రాహ్మణం దగ్గరే ఎందుకు ఆగాలి? అనే ఒక్క ప్రశ్న చాలు ఈ వాదన బూటకాన్ని బద్దలుగొట్టడానికీ? అంతకన్నా వెనక్కు, దానికన్నా వెనక్కు వెళితే, ప్రపంచ జనాభా అంతా ఒకే ఒక నరమానవుని సంతతి అని తేలుతుందికదా? మనం దానికి సిధ్ధంగా వున్నామా? వాస్తవం ఏమంటే, పాలకవర్గాలు తమ ఆస్తుల పరిరక్షణకు మానవ  ముసుగు కప్పుతాయి. ప్రజలు ఎన్నడూ ఆ వలలో పడిపోరాదు. రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతపు పాలకవర్గాలు హైదరాబాద్ పరిసరాల్లో సాగించిన విధ్వంసకర ఆర్ధిక విధానాల ఫలితంగానే ప్రస్తుత విభజన ఉద్యమం మొదలై, ఈ స్థాయికి వచ్చిందని గుర్తించలేనివాళ్ళు రెండు రకాలు. వాళ్ళు బొత్తిగా అమాయకులైనా అయ్యుండాలి. లేదా పూర్తిగా  మూర్ఖులైనా అయ్యుండాలి.

జాతికి, రాజ్యానికీ వున్న సంబంధం సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా వుండదు. ఆ సంబంధాన్ని చారిత్రక దశ నిర్ణయిస్తుంది. తగినంతగా అభివృధ్ధిచెందిన జాతులు జాతి రాజ్యాలుగా ఏర్పడడానికి ఆసక్తి చూపుతాయి. స్వతంత్రంగా మనలేని స్థితిలోవున్న జాతులు సమాఖ్యగా ఏర్పడతాయి. సమాఖ్యలోని జాతులు తగినంతగా అభివృధ్ధి చెందినపుడు విడిపోవడానికే ఆసక్తి చూపుతాయి. ఇది ఆయా జాతులకు ప్రాధమిక హక్కుకూడా. నిజానికి ఈ హక్కును గుర్తించిన తరువాతే సమాఖ్య ఏర్పడుతుంది. నిజానికి జాతి అనే భావనే పెట్టుబడీదారీ ఆలోచన. రాజరిక, భూస్వామ్య వ్యవస్థల్లో జాతి వుండదు.  కేవలం వంశాలుంటాయి.

మనం ఇక్కడ సమైక్య, విభజనవాదాల్లో తలమునకలైవుంటే, కేంద్ర ప్రభుత్వం  తనపని తావు చేసుకు పోతోంది. ఏన్జీవో సంఘాలు ఉద్యమానికి విరామాన్ని ప్రకటించి పక్కకు తప్పుకున్న తరువాత కేంద్ర మంత్రులు ఒకరొకరుగా రంగప్రవేశం చేసి, స్థానిక ప్రజల సమ్మతితోనో అసమ్మతితోనో విభజన విధివిధానాలను రూపొందిస్తున్నారు.  

అమాయకులు ఎప్పుడూ వుంటారు. విభజన తీర్మానంపై కేంద్రం శాసనభ అభిప్రాయాన్ని కోరుతుందనీ, ఆ అంశం శాసనసభకు తప్పక వస్తుందనీ, అలా వచ్చినపుడు దాన్ని అడ్డుకుంటామనీ,  శాసనసభ మెజారిటీ అభిప్రాయాన్ని కేంద్రం పాటించక తప్పదనీ, అలా పాటించకపోతే సమాఖ్య సాంప్రదాయానికి అర్ధమేలేదని  సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కొందరు  ఇప్పటికీ ప్రజాస్వామ్య ఆదర్శాలను తెగ వల్లిస్తున్నారు. కొందరైతే 371- డీ అధీకరణం సమైక్య రాష్టానికి సహజ కవచకుండలాలని చెప్పుకుని మరీ మురిసిపోతున్నారు.  చట్టానికి సంబంధించిన ఇలాంటి ఆదర్శాలని  ఉపాధ్యాయులు తరగతి గదుల్లో పిల్లలకు పాఠాలుగా వల్లిస్తే బాగుంటుంది. వాస్తవంలో చట్టం  అంత ఆదర్శవంతంగా ఎన్నడూ పనిచేయదు. పాలకులకు చట్టంలోని రహదారులకన్నా, దొడ్డిదారులంటేనే చాలా ఇష్టం.

చట్టంలోని రహదారులు అందరికీ అందుబాటులోవుంటాయి; కనీసం వున్నట్టు కనిపిస్తాయి. చట్టంలోని దొడ్డిదారులు మాత్రం పాలకవర్గాలకు మాత్రమే అందుబాటులో వుంటాయి. ఈ మాత్రం జ్ఞానబోధకు బోధివృక్షం కింద తప్పస్సు చేయాల్సిన పనిలేదు. ఏ చిన్న కేసులో అయినా సరే నిందితుడిగానేకాదు పిర్యాదిదారుడిగానైనాసరే ఒకసారి కోర్టు గుమ్మం ఎక్కితే చాలు చట్టం ముందు పాలకవర్గాలు మరింత సమానులని మొదటి మెట్టు దగ్గరే అర్ధం అవుతుంది.

హైదరాబాద్ విమానం ఎక్కకుండా, హాస్పిటల్ బెడ్డు ఎక్కడంతో ఆంటోనీ కమిటి కథ ఎలా ముగిసిందో చూసినవాళ్లకు రేపు కేంద్ర ప్రభుత్వానికి మంత్రుల బృందం సూచనలు ఎలా వుంటాయో, వాటిని ఎలా ఆమోదించి, ఎలా అమలు చేస్తారో ఊహించడం పెద్ద కష్టం  ఏమీకాదు. ఇప్పుడున్న సమాచారం మేరకు, విభజన విధివిధానాలు సూచించడానికి సీమాంధ్రులు తటపటాయిస్తుండగా, తెలంగాణులు చాలా ఉత్సాహంహా ఈ-మెయిళ్ళు పంపిస్తున్నారట! దీనివల్ల విభజన విధివిధానాలు కూడా తెలంగాణకే అనుకూలంగా ఉండే ప్రమాదంవుంది.

నదీజలాల సమస్యలు తలెత్తుతాయని ఆందోళనపడడమేతప్పా, దానికి విరుగుడు ఏమిటో కనిపెట్టాలనే కనీసపు ఆలోచన కూడా సీమాంధ్ర నేతలు ఇప్పటికీ చేస్తున్నట్టులేదు. మంత్రుల బృందం సూచనలు అందుకునే గడువు నవంబరు 5 న ముగుస్తుందని తెలిసినా, పార్లమెంటు శీతాకాలపు సమావేశాలకు ముందే మంత్రుల బృందం నివేదికను సమర్పిస్తానని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించినా,   సీమాంధ్ర నేతలు సమైక్యవాదం నినాదంతోనే కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు. విచిత్రం ఏమంటే,  రాజకీయాల్లో హత్యకు ఒకసారే అవకాశం వుంటుంది. ఆత్మహత్యలు చేసుకునేవాళ్లకు ఆ అవకాశం చాలాసార్లు వుంటుంది.

 ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం (ఏజేఎఫ్) సీమాంధ్ర ప్యాకేజీ విషయంలో ఈవారమే ఒక కసరత్తు మొదలెట్టింది. సీమాంధ్రలోని ప్రజలకు  హైదరాబాద్ స్థాయి జీవనశైలి. తెలంగాణలోని సీమాంధ్రులకు సీమాంధ్రస్థాయి ప్రశాంతత అనేది దీని లక్ష్యం. కేంద్ర మంత్రుల బృందానికి అందజేయనున్న ఈ సూచనల పట్టికలో ముఖ్యమైన అంశాలేమంటే:

  రేపటి తెలంగాణ రాష్ట్రానికి దిగువన కృష్ణా గోదావరి నదులపై ప్రస్తుతం నిర్మాణంలోవున్న, ప్రతిపాదనలోవున్న ప్రాజెక్టుల ముంపుప్రాంతాన్ని పూర్తిగా రాయలసీమ, తీరాంధ్రలో కలపాలి. ఆ విధంగా రెండు రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో ఎర్పడే జలవివాదాల్ని చాలా వరకు నివారించవచ్చు. కేవలం రాయలసీమకు సాగునీరు అందించడానికి తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రజలు, వారి ప్రతినిధులు సహకరించాలి.

దశాబ్దంన్నర క్రితం వరకు విజయవాడ విద్యాలవాడగా వుండేది. ఇప్పుడు ఆ ఘనత హైదరాబాద్ కు దక్కడమేకాదూ, ఆ రంగంలో హైదరాబాద్ జాతీయ ప్రమాణాలు అందుకుంది. ఇలాంటి ప్రమాణాలు రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లోనూ సాధించడానికి అవసరమైన ప్యాకేజీని ప్రకటించాలి. వైద్య ఆరోగ్య సేవల్లోనే కాదు, వైద్య విద్యలో, ముఖ్యంగా, సూపర్ స్పెషాలీటీస్‌లో రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలు హైదరాబాద్ కన్నా రెండు దశాబ్డాలు వెనకబడి వున్నాయంటే అతిశయోక్తికాదు. నిమ్స్ స్థాయి వైద్య ఆరోగ్య పరిశోధనా సంస్థలేగాక, ఏయిమ్స్ వంటి జాతీయ స్థాయి సంస్థల శాఖలు కూడా రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో నెలకోల్పాలి. ఐఐటి, ఐఐయంల కొత్త శాఖలు ఏర్పాటు చేయాలి.

రవాణారంగంలో విమానయానం తెలంగాణలో అంతర్జాతీయస్థాయికి చేరుకోగా, రైలుమార్గాలు రాయలసీమ, తీరాంధ్రాల్లో మెరుగ్గానే వున్నాయి. రాయలసీమ, తీరాంధ్రాల్లో రైల్వేజోన్ ను ఏర్పాటుచేయడమేకాక, రేపు ఏర్పడే సీమాంధ్ర రాజధాని నగరంలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మించాలి. నాకాశ్రయాల్లో తీరాంధ్రప్రాతం ప్రకృతి సిధ్ధంగానే ముందుంది. తీరాంధ్రలో నౌకాశ్రయాలు లేని ప్రతి జిల్లాలోనూ కొత్త నౌకాశ్రయాలు నిర్మించాలి.

రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతంలోని ఆదివాసులకు వారు కోరుకునే విధంగా వాళ్ల జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.

కేంద్రీకృత అభివృధ్ధిని నిరోధించడానికి వీలుగా చట్టసభలు, సాధరణ పరిపాలన, శాంతిభద్రతలు, న్యాయవ్యవస్థలతోసహా అన్ని రంగాల్లోనూ వీల్లున్నంతమేర వికేంద్రీకరణ విధానాన్ని పాటించాలి.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)

హైదరాబాద్
25 అక్టోబరు  2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
27 అక్టోబరు  2013 

Saturday, 19 October 2013

నిన్నటి హీరోలు, నేడు?

నిన్నటి హీరోలు, నేడు? 

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)


వెండితెర సినిమా తీయడంలో కేవీ రెడ్డి, రాజకీయ నాటకం ఆడించడంలో సోనియా గాంధీ ఇద్దరిదీ ఒకటే శైలి! కథా, స్క్రీన్ ప్లే, సంభాషణలు, పాటలు వగయిరాల పూర్తి బైండు కాపీ తాయారవ్వడమేగాక, దాని ఆంగ్లానువాద నకలు సినీమాటోగ్రాఫర్ మార్కస్ బారట్లేకు చేర్చి, నటీనటులతో పూర్తిస్థాయి రిహార్సులు చేయించి, మొత్తం సినిమా నిడివి ఎంతో లెఖ్ఖవేసి, దానికి సరిపడా ముడి ఫిలిం దగ్గర పెట్టుకునిగానీ కెవీ రెడ్డి షూటింగ్ మొదలుపెట్టేవారుకాదట! సోనియా గాంధీది కూడా సేమ్ టూ సేమ్ పంథా!

ఢిల్లీ టెన్ జన్ పథ్ పరిణామాల్ని గమనించిన వాళ్ళెవరికైనా ఆంధ్రప్రదేశ్ విభజన స్క్రిప్టు కనీసం ఆరునెలల క్రితమే సిధ్ధం అయిపోయినట్టు సులువుగానే అర్ధం అవుతుంది. విభజన ప్రకటన చేశాక తెలంగాణ, సీమాంధ్రల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? వాటిని ఎలా అదుపుచేయాలి? వాటిమీద నివేదికని పార్టీ కమిటి ఎలా ఇవ్వాలీ? ఆ తరువాత అంతిమ నివేదికని కేంద్ర మంత్రుల బృందం ఎలా ఇవ్వాలీ? ఇవన్నీ ఎన్నడో సిధ్ధం అయిపోయిన విషయాలు.

సాధారణంగా అయితే కమిటీ వచ్చి, పరిస్థితుల్ని తెలుసుకుని వెళ్ళి  నివేదికను తయారు చేయాలి. కాంగ్రెస్ శైలి దీనికి భిన్నంగా వుంటుంది. నివేదిక తుది ప్రతి తయారు అయ్యాక కమిటీ వేస్తారు.  ఎలాగూ తుదిప్రతి తయారు అయిపోయింది కనుక, సంబంధిత వర్గాల్ని కలిసినా, కలవకపోయినా ఒకటే కనుక, కమిటి అసలు పర్యటనకే రాదు! ఇప్పుడు ఆంటోని కమిటి రాకుండానే, రాష్ట్ర విభజనపై కెబినెట్ తీర్మానం జరిగిపోయినట్టు రేపు మంత్రుల బృందం అంధ్రప్రదేశ్ కు రాకుండానే నివేదిక ఇచ్చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఐటీ విప్లవం వచ్చాక ప్రతీదీ వర్చ్యువల్ రియాలిటీగా మారిపోతున్నదిగనుక, మంత్రుల బృందం ఇంటర్నెట్ ద్వార భ్రాంతి పర్యటన చేయవచ్చు!!.

చంద్రబాబు ఉత్తినే కాంగ్రెస్ ను విమర్శిస్తుంటారుగానీ నిజానికి ఆయనదీ కాంగ్రెస్ శైలే! రాష్ట్ర విభజన అంశాన్ని తేల్చడానికి 2008లో వారు పార్టీ పోలిట్ బ్యూరో కమిటి ఒకదాన్ని వేశారు.  కే. ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు అందులో సభ్యులు. ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆ కమిటి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక మేరకు చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు. ఎర్రన్నాయుడు కమిటీ నివేదిక మేరకు చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారా? లేక చంద్రబాబు ఆదేశాల మేరకు ఎర్రన్నాయుడు కమిటి ఆ నివేదికను తయారు చేసిందా? అనేది వూహించడం పెద్ద కష్టం ఏమీకాదు!

ప్రజా ప్రతినిధుల వైఫల్యమో, కపటత్వమోగానీ రాజకీయ ప్రక్రియ ముందుకు సాగని ఫలితంగా, రాయలసీమ-తీరాంధ్ర  ఉద్యమం ఎన్జీవోల చేతుల్లోనికిపోయింది. ఏపీ ఎన్జీవోల నాయకుడు పరుచూరి అశోక్ బాబు ఒక్కరే యుధ్ధరంగంలో నిలిచారు. కానీ అప్పటికే అది ఓడిపోయిన యుధ్ధం. చనిపోయిన జీవి  దేహాన్నీ, ఓడిపోయిన యుధ్ధాన్నీ ఎక్కువ కాలం పరిరక్షించడం సాధ్యంకాదు!

ఎన్జీవోల ప్రపంచం చాలా చిన్నది. పైగా, ఎన్జీవోలు పుట్టుకరీత్యానే ప్రభుత్వంలో భాగం. ఆ పరిమితులు సహజంగానే వాళ్ళ నాయకత్వాన సాగిన ఉద్యమంలోనూ కొనసాగాయి. ఎన్జీవోల సమస్య జీతాల సమస్య, ప్రమోషన్ల సమస్య, జోన్ల సమస్య, పెన్షన్ల సమస్య వాళ్ళు పోరాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మీద. అలాంటిదే రాష్ట్ర రవాణా సంస్థ సీమాంధ్ర విభాగం ఉద్యోగుల సమస్య కూడా. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రవాణా సంస్థను నిర్వహించాలన్నది వాళ్ళ కోరిక. అది కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటమే.

సాక్షాత్తు ముఖ్యమంత్రే సచివాలయంలో కూర్చొని తానే పెద్ద సమైక్యవాదినని ప్రకటించుకుంటుంటే ఎన్జీవోలు, ఆర్టిసీ ఉద్యోగులు సేవ్ అంద్రప్రదేశ్ ఉద్యమాన్ని ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నట్టూ?. ప్రైవేటు బస్సు ఆపరేటర్లవల్ల ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని బందుపెట్టి, ప్రజారవాణా వ్యవస్థను రెండు నెలలుగా ప్రైవేటు ఆపరేటర్లకే అప్పచెప్పడం ఏం ఉద్యమం? ఏం వివేకం?

రాయలసీమ-తీరాంధ్ర  ప్రాంత సామాన్యప్రజల సమస్యలు ఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలకన్నా చాలా తీవ్రమైనవి. జటిలమైనవి. మౌలికమైనవి. రైతులు, విద్యార్ధులు, ఉద్యోగార్దుల సమస్యల్ని మరుగునపెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ల సమస్యల్ని ముందుకు తేవడం, కేంద్రప్రభుత్వం మీద చేయాల్సిన పోరాటాన్ని  రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంగా మార్చడం అమాయకత్వమైనా కావాలి, బూటకమైనా కావాలి.

తమ తమ సమస్యలకు ప్రభుత్వం నుండి పరిష్కారం దొరికేకొద్దీ వివిధ ఎన్జీవో సంస్థలు ఒకటొకటిగా రంగం నుండి తప్పుకుంటాయనీ, రాయలసీమ - తీరాంధ్రలో  రైతులు, విద్యార్ధులు, ఉద్యోగార్దుల్ని బలిపెట్టేస్తాయనీ   ఊహించలేనివాళ్ళు అమాయకులు. ఎన్జీవోలను హీరోలుగా పొగడ్తలతో ముంచెత్తినవాళ్ళు మరీ అమాయకులైనా కావాలి లేకపోతే మోసగాళ్లయినా కావాలి.    

  కష్టజీవుల పొరాటానికి విశ్రాంతజీవులు నాయకత్వం వహించకూడదు. వ్యవసాయ కూలీల పోరాటానికి రైతులు నాయకత్వం వహించకూడదు. అంధుల పోరాటానికి మెల్లకళ్లవాళ్ళు నాయకత్వం వహించకూడదు. మేకల పోరాటానికి తోడేళ్ళు నాయకత్వం వహించకూడదు. మన పోరాటానికి మనల్ని పాలిస్తున్నవాళ్ళు  నాయకత్వం వహించకూడదు. ప్రజల పోరాటానికి ప్రభుత్వ ఉద్యోగులు నాయకత్వం వహించకూడదు. ఈ ముక్క ముందుగా అన్నప్పుడు మిత్రులు చాలా మంది విరుచుకుపడ్డారు. భవిష్యత్తుని దర్శించేవాళ్ళు కొన్నితిట్లు తినక తప్పదు. ప్రభుత్వ వుద్యోగులు తమ హీరోలన్నారు. సీమాంధ్ర మంత్రి కోండ్రు మురళీకి ఇప్పుడు ఎన్జీవోలు "యూజ్ లెస్ ఫెలోస్" గా కనిపిస్తున్నారు.

బాధితుల సమస్యల్ని బాధితులు అర్ధం చేసుకున్నంతగా వెసులుబాటువున్నవాళ్ళు అర్ధంచేసుకోలేరు. ఏ పోరాటానికైనా అట్టడుగు బాధితులు నాయకత్వం వహించినపుడే లక్ష్యాలను సాధించే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. మనం ఎవరి మీద పోరాటం చేయాలో వాళ్లకే నాయకత్వం అప్పచెపితే ఎలాంటి ఫలితాలు వస్తాయో డిజిటల్ డిస్‌ప్లే‌లో చూపించారు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు.

భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను తీరాంధ్రలో కలిపే అంశం యంపి రాయపాటి సాంబశివరావు వంటివాళ్ళకు ఇప్పటికైనా గుర్తుకురావడం శుభసంకేతం.  తాము పోరాడాల్సింది కేంద్రప్రభుత్వం మీద అని రాయలసీమ-తీరాంధ్ర ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తించడం మొదలెట్టారు. ఆలస్యంగా అయినా ఇది శుభపరిణామం.          

అసలు సమస్య ఏమిటో తెలియకపోతే యుధ్ధం ఎందుకు చేయాలో అర్ధంకాదు. యుధ్ధం ఎందుకు  చేయాలో తెలియకపోతే, ఎవరితో యుధ్ధం చేయాలో అర్ధంకాదు. ఎవరితో యుధ్ధం చేయాలో తెలియకపోతే యుధ్ధం ఎలా చేయాలో అర్ధంకాదు. యుధ్ధం ఎలా చేయాలో అర్ధం కాకపోతే విజయాన్ని ఎలా సాధించాలో అర్ధంకాదు. విజయాన్ని ఎలా సాధించాలో అర్ధంకాకపోతే విజయం ఎప్పటికీ సాధ్యంకాదు.

ఇప్పటి రాయలసీమ-తీరాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ నాయకుల కపటత్వాన్నీ, ఎన్జీవో నాయకుల పరిమితుల్ని నేను పదేపదే చెప్పినమాట వాస్తవం. అలా చెప్పాల్సిన అవసరమూ వుంది. ఆ విషయంలో నా బాధ్యతను నేను సరిగ్గానే నిర్వర్తించాను. ఉద్యమాన్ని నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడం ఆలోచనాపరుల బాధ్యత. ఒక భయంకర ఉపద్రవం ముంచుకు వస్తున్నపుడు, దానికి కారణమైన వాళ్లనే రాయలసీమ-తీరాంధ్ర ప్రజలు చాలా కాలం నమ్మడంవల్ల సమస్య ఏమాత్రం పరిష్కారంకాకపోగా, తిరిగిరాబట్టుకోలేని విధంగా సమయనష్టం జరిగిపోయింది. ఇది బాధాకర పరిణామం.

ఇప్పటికైనా విభజనను ఆమోదిస్తే, విధివిధానాల్లో అయినా నష్టాల్ని చాలా వరకు నివారించుకునే అవకాశం రాయలసీమ-తీరాంధ్ర ప్రజలకు వుంటుంది. తెలివిగా వ్యవహరిస్తే మరిన్ని ప్రయోజనాలు సాధించుకునే అవకాశమూ వుంటుంది. అన్నిటికి మించి విభజన అనేది ఘర్షణాత్మకంగా కాక సామరస్యపూర్వకంగా జరిగే అవకాశమూ వుంటుంది.

నాయకత్వ సామాజికవర్గ స్వభావం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ఇంత వరకు సామాజికరంగంలో పెత్తనాన్ని సాగించడమేగాక, హైదరాబాద్ లో తమ వాణిజ్య లాభాల్ని పెంచుకోవడం కోసం రాయలసీమ-తీరాంధ్రల అభివృధ్ధిని నిలిపివేసిన సామాజికవర్గాల్నే ఇంకా నమ్మడం సరికాదు. ఒకసారి మోసం చేసినవాళ్ళు వందసార్లు మోసం చేయగలరు. కాలం చెల్లిన పాత పెత్తందారీ సామాజికవర్గాల్ని పక్కకు గెంటి కొత్త సామాజికవర్గాలు ముందుకు రావడానికి ఇది మహత్తర అవకాశం. కొత్త సామాజికవర్గాలు ముందుకు రానంత వరకు ఉద్యమంలో కొత్త విలువలు ముందుకురావు. కొత్త విలువలు, కొత్త సిధ్ధాంతాలు, కొత్త శక్తులు లేకుండా ఉద్యమాలే వుండవు.

తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి సామాజిక మార్పు జరిగిందా? అని ఎవరైనా అడగవచ్చు. అడగాల్సిన ప్రశ్నే ఇది. తెలంగాణలో కూడా విప్లవాత్మక మార్పులేవీ రాలేదుగానీ, సామాజిక సమీకరణలు చాలా వరకు మారాయి. పై అంతస్తుల్లో, చూసుకున్నా ఫోకస్ రెడ్ల నుండి వెలమల వైపుకు మళ్ళింది. రాజకీయ జేయేసి ఛైర్మన్ కోదండరామ్ సామాజికవర్గం రెడ్డే అయినా ఆయన సాంప్రదాయ రాజకీయ నాయకుడుకాదు; మేధావుల విభాగం నుండి వచ్చాడు. అనేక పౌరహక్కుల ఉద్యమాల్లో ఆరితేరిన కాయకర్త అతను. జయశంకర్, విమల, గద్దర్, అల్లం నారాయణ, బెల్లయ్య నాయక్ వంటి బలహీనవర్గాలు, వరవరరావు, హరగోపాల్, వేణుగోపాల్, బాలగోపాల్ వంటి ఆలోచనాపరులు ఇరుపైపుల నుండి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆలాంటి సమీకరణ రాయలసీమ-తీరాంధ్రలో లోపించింది. ఆ లోపమే అక్కడి ఉద్యమంలో ప్రతిఫలించింది. ఈ విషయంలో, తీరాంధ్రకన్నా రాయలసీమ ఉద్యమం కొంచెం మెరుగు. అక్కడి ఉద్యమంలో  మేధావులకు మరీ పెద్దపీట వేయకపోయినా చిన్న పీట అయినా వేస్తున్నట్టు కనిపిస్తోంది.

రాయలసీమ-తీరాంధ్రలో మేధావులు లేరనీ, ఒకవేళ వున్నా వాళ్ళంతా హైదరాబాద్ కు వలస పోయారనే వాదనా వుంది. ఇదీ తప్పే. రాయలసీమ-తీరాంధ్రలో ఆలోచనా పరుల అభిప్రాయాల్ని అక్కడి పాలకవర్గాలు నిర్దాక్షిణ్యంగా అణిచివేశాయి. ప్రకాశం జిల్లాలో బొక్క పరంజ్యోతి, గోసాల ఆశీర్వాదం, గుంటూరు జిల్లాలో దుర్గం సుబ్బారావు, విజయవాడలో కర్ణాటి రామ్మోహన రావు, దారా గోపి, ఏలూరులో గుండిమెడ రామచంద్ర శర్మ, రాజమండ్రిలో పెద్దాడ నవీన్ ఇలా చాలా మంది వున్నారు. వాళ్లను పట్టించుకున్నదెవరు. ఒంగోలు, చీరాల, గుంటూరు, విజయవాడ, రాజమండ్రిల్లో ఎవరైనా కొద్దిపాటి  భిన్నస్వరాన్ని వినిపించినా, వాళ్ళమీద దాడులు చేసిన సందర్భాలున్నాయి. కొత్త శక్తుల్ని రానీయకుండా కొత్త విలువలు ఎలా వస్తాయి. కొత్త విలువలు రాకుండా ఉద్యమంలో ఉత్సాహం ఎలా వుంటుంది?.

ప్రాంతీయ ఉద్యమాలన్నీ పెట్టుబడీదారీ ఉద్యమాలే. వాటిని సమర్ధించేవాళ్లకైనా, వ్యతిరేకించేవాళ్లకైనా ముందు ఈ స్పష్టత వుండాలి. ప్రాంతీయ, ఉపప్రాంతీయ పెట్టుబడిదారుల మధ్య అంతర్గతంగా వుండే పోటీ తీవ్రరూపం దాల్చిన ఫలితంగా విభజన - సమైక్య ఉద్యమాలు తలెత్తుతాయి. ప్రజల భుజాల మీద తుపాకులు పెట్టి ప్రాంతీయ, ఉపప్రాంతీయ పెట్టుబడిదారులు తలపడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో, ఇరుప్రాంతాల ప్రజల మధ్య ఐక్యతను సాధించడానికి నూతన ప్రజాసామ్యవాదులు ప్రయత్నించాలి. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ఇరుప్రాంతాల ప్రజాసామ్యవాదులూ, సామ్యవాదులు, కమ్యూనిస్టులు, విప్లవకమ్యూనిస్టులు అందరూ ఘోరంగా విఫలమయ్యారు.

సీమాంధ్రలో నాయకస్థాయి వున్నవాళ్లందరికి ఇప్పుడు ఒక విషయం క్షుణ్ణంగా తెలుసు; రాష్ట్రం విడిపోకతప్పదనీ. తెలియనట్టు నటిస్తున్నవాళ్ళు సమైక్యవాదులుగా చెలామణి అయిపోతున్నారు. ఉపద్రవం నష్టాలను తగ్గించేమార్గాల్ని  సూచించేవాళ్ళు విభజనవాదులుగా నిందల్ని మోస్తున్నారు. కేంద్ర మంత్రులు ఒకరొకరుగా సర్దుకుంటున్నారు. యంపీలు నిరంతర రాజీనామాయత్నాల్లో వుంటున్నారు. కొత్తనాయకత్వంముందుకు రాకపోతే, రైతులు, శ్రామికులు, ఉద్యోగార్ధులు, బలహీనవర్గాలు  మరోసారి మోసపోతారు!

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌: 90102 34336

హైదరాబాద్‌
 18 అక్టోబరు 2013

ప్రచురణ : సూర్య దిన పత్రిక
 20 అక్టోబరు 2013

Wednesday, 16 October 2013

Movements of Bifurcation and Unification

అసలైన అజెండాకు అడ్డుకట్ట !


విభజన, సమైక్య ఉద్యమాల పుట్టుక
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

                          కొంత యాధృఛ్ఛికంగానూ, కొంత ప్రయత్నపూర్వకంగానూ రాష్ట్రంలో విభజన, సమైక్య ఉద్యమాల ఆరంభాన్ని దగ్గర నుండి చూసే అవకాశం నాకు కలిగింది. రెండు ఉద్యమాలు ఒక కొలిక్కి వస్తున్న సమయంలో వాటిని ఒకసారి గుర్తుచేసుకోవడం మంచిది.

                          ఎన్టీ రామారావును గద్దె దించిన తరువాత, సామాజిక వత్తిడిని తట్టుకోవడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా  హరికృష్ణను దగ్గరికి తీశారు. ఎమ్మెల్యే కూడాకాని బామ్మర్దికి, విజయవాడ ప్రైవేటు బస్సు ఆపరేటర్లను  దృష్టిలో పెట్టుకుని రవాణాశాఖ ఇచ్చారు. మరోవైపు, రాజకీయంగా స్థిరపడడానికీ, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికీ చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగులో పీజీ చేసిన కేసిఆర్ తన భాషా ప్రావిణ్యంతో జన్మభూమీ నినాదాల్ని, పాటల్ని ఆకర్షణీయంగా మార్చి చంద్రబాబు దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.

                          హరికృష్ణ చారిత్రక పాత్ర ఆరు నెలల తరువాత ముగిసిపోయింది. అప్పటి వరకు హరికృష్ణ ఆధీనంలోవున్న రవాణాశాఖను 1996లో కేసిఆర్ కు అప్పగించారు చంద్రబాబు. ఆ పదవిలో కేసిఆర్  1999 నవంబరు వరకు కొనసాగారు.

                          ఆకాలంలోనే, పీపుల్స్ వార్ రెండో విడత తెలంగాణ ఉద్యమానికి నాందీ పలుకుతూ 1997 లో ప్రజాకవి కాళోజీ నాయకత్వాన వరంగల్ డిక్లరేషన్  నిర్వహించింది. ఆ సదస్సులోనే ప్రొఫెసర్ జయశంకర్ ను  ఉద్యమ కమిటీ కన్వీనర్ గా ప్రకటించారు. అంతకు ఏడాది క్రితం,  తెలుగుదేశం మంత్రిగా శాసనసభలో సిక్స్ పాయింట్ ఫార్మూలా, ఉద్యోగుల జోనల్ విధానంపై ప్రసంగించిన కేసిఆర్ , అవి రెండూ రాష్ట్రప్రభుత్వంపై అనవసర ఆర్ధిక భారాన్ని మోపడమేగాక, రాష్ట్రాభివృధ్ధికి అడ్దంకిగా మారుతున్నాయని విమర్శించారు. అయితే, వరంగల్ డిక్లరేషన్ తరువాత కేసిఆర్ ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆయన తెలంగాణ అంశం మీద దృష్టి సారించారు. వివిధరంగాల్లో తెలంగాణ వెనకబాటుతనంపై పరిశోధనలు జరిపించడానికి పూనుకొని, ఆ బాధ్యతను తనకు సన్నిహితులైన ఇద్దరు పాత్రికేయులకు అప్పచెప్పారు. ఆ పాత్రికేయులు సెంటర్ ఫర్ సబ్ ఆల్ట్రన్ స్టడీస్ (సియస్ యస్) అనే ఒక పరిశోధనా సంస్థను నెలకొల్పారు.

                          వ్యక్తిగతంగా నాకు వరంగల్ డిక్లరేషన్ తోనూ, సియస్ యస్ తోనూ సంబంధాలున్నాయి. వరంగల్ సదస్సుకు నేను ఆహ్వానసంఘ సభ్యుడ్నికాగా, సియస్ యస్ నిర్వాహకుడు కే నరసింహాచారి నాకు ఆత్మీయ మిత్రుడు. 1998  ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ టైమ్స్ పత్రికను మూసేశాక, నేను కొంత కాలం సియస్ యస్ లో పనిచేశాను. ఆ సంస్థ ప్రచురించిన ఆంగ్ల పత్రిక అండర్ కరెంట్ కు సంపాదకుడిగానూ వున్నాను.

                          రవాణాశాఖా మంత్రిగా కేసిఆర్ అధికార నివాసం అప్పట్లో తార్నాక చౌరాస్తాలో వుండేది. ఆ దగ్గర్లో  లాలాపేట్ ఫ్లై ఓవర్ సమీపంలోని శశాంక్ అపార్ట్ మెంట్స్ లో సియస్ యస్ కార్యాలయం వుండేది. ఇందులో, ఒక వైచిత్రి ఏమంటే, సియస్ యస్ ఏర్పాటుకు అవసరమైన  నిధుల్ని, విజయవాడకు చెందిన ప్రైవేటు బస్సు ఆపరేటర్లు అండర్ కరెంట్ పత్రిక్కి వాణిజ్య ప్రకటనల రూపంలో సమకూర్చారు.

                          1999  ఎన్నికల తరువాత చంద్రబాబు, కేసిఆర్ ల మధ్య దూరం పెరిగింది. కొత్త మంత్రివర్గంలో కేసిఆర్ కు స్థానం కల్పించలేదు. తాను మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కేసిఆర్ రాష్ట్ర విభజన నినాదాన్ని అందుకున్నారని చంద్రబాబు పదేపదే అంటుంటారు. పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపొయిన  కేసిఆర్ తో 2009 ఎన్నికల్లో  పొత్తు పెట్టుకున్న విషయాన్ని వారు తెలివిగా దాస్తుంటారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం, 2008 విజయ దశమి రోజున కుదుర్చుకున్న ఆ ఎన్నికల పొత్తు కోసం కేసిఆర్ కన్నా చంద్రబాబే ఎక్కువ ఆసక్తి కనపరచారు.

                          మంత్రి పదవి దక్కనందుకు కేసిఆర్ అలగడం నిజమేగానీ, అప్పుడే తెలంగాణవాదాన్ని భుజాలకు ఎత్తుకున్నారనడం వాస్తవంకాదు.  1999  ఎన్నికలకు దాదాపు రెండున్నరేళ్ళు ముందుగానే తెలంగాణ ఉద్యమానికి అవసరమైన కసరత్తును కేసిఆర్ పూర్తిచేసి సిధ్ధంగా వుంచుకున్నారు. ఆ తరువాత ఏడాదిన్నరకు ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు.

                          2004  ఎన్నికల్లో కాంగ్రెస్ తో  జతకలిసి వెలుగులోనికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి 2009  ఎన్నికల్లో అనూహ్యంగా ఘోరపరాజయాన్ని చవిచూసింది. తెలంగాణలో 120  అసెంబ్లీ స్థానాలుండగా ఆ పార్టికి కేవలం 10 స్థానాలు మాత్రమే దక్కాయి. అందులోనూ ఏడు స్థానాలు కరీంనగర్, అదిలాబాద్ నుండే వచ్చాయి. మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో చెరో స్థానం మాత్రమే దక్కింది. ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టికి ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రతిష్టాత్మక రాజధాని నగరం గ్రేటర్ హైదరాబాద్‌లో బోణీ కూడా కాలేదు. అత్యుత్సాహంగా టిఆర్‌ఎస్ తో పొత్తుపెట్టుకున్న టీడీపీకి కూడా హైదరాబాద్‌లో దాదాపు పరిపూర్ణ నిరాదరణే ఎదురైంది.

                          ఎన్నికల్లో పరాజయం తరువాత సాక్షాత్తు తెలంగాణ భవన్ లోనే కేసిఆర్ అనేక విమర్శల్ని ఎదుర్కొన్నారు. అనేక పరాభవాల్ని చవిచూశారు. దాదాపు ఆరు నెలల అవమాన ఘట్టం తరువాత ఆయన చేపట్టిన నిరాహారదీక్ష పరిస్థితుల్ని తలకిందులుచేసి, టీఆర్‌ఎస్ ను మళ్ళీ వెలుగులోనికి తెచ్చింది. 2011  డిసెంబరు 9  రాత్రి యూపియే ప్రభుత్వ హోం  మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభిస్తున్నామని  ప్రకటించారు.

                          చిదంబరం ప్రకటన వెలువడిన మరునాడు ఉదయమే రాయలాంధ్ర ప్రాంతం నుండి తొలుత స్పందించిన వ్యక్తి వసంత నాగేశ్వరరావు. అప్పట్లో ఆబ్కాబ్ ఛైర్మన్‌గావున్న ఆయన తన పదవికి రాజీనామా చేసి, మళ్ళీ "జైఆంధ్ర" ఉద్యమాన్ని మొదలెడతానని ప్రకటించారు. ఆ వేంటనే చేగోండి హరిరామ జోగయ్య (హరిబాబు) కూడా "జైఆంధ్ర" అన్నారు.

                          జైఆంధ్ర ఉద్యమంతోనూ నాకు ఒక అనుబంధంవుంది. ఆ వుద్యమంలో కాకాని వెంకటరత్నం, గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాధం తదితరులు మొదటిశ్రేణి నాయకులు కాగా,  యం. వెంకయ్య నాయుడు, వసంత నాగేశ్వరరావు తదితరులు ద్వితీయశ్రేణి నాయకులు. అప్పట్లో కొంతకాలం క్రియాశీలంగావుండిన ఆంధ్రా నిరుద్యోగ సంఘానికి అమ్మనమంచి కృష్ణశాస్త్రి అధ్యక్షుడు, నేను కార్యదర్శి.

                          వసంత నాగేశ్వరరావు ప్రకటన వెలువడిన సాయంత్రమే, పాత అనుబంధంతో నేను మాదాపూర్ లోని అయన ఇంటికి వెళ్ళాను. తెలంగాణ ఇచ్చేసిన తరువాత రాయలసీమ, తీరాంధ్ర ప్రజల హక్కులకు పరిరక్షణ ఏమిటీ? అనేది మా ఆవేదన. వాటి సాధన కోసం విజయవాడ వెళ్ళి మళ్ళీ జైఆంధ్ర ఉద్యమాన్ని మొదలెడదామనుకున్నాము. ఆ రోజు రాత్రే బయలుదేరి విజయవాడ వెళ్ళాము.

                          మరునాడు విజయవాడ చేరుకున్న తరువాత సన్నివేశం మారింది. విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేశారని ఢిల్లీ నుండి  వార్త వచ్చింది. ఆయన కూడా "జై ఆంధ్రా" అంటారనే వుద్దేశ్యంతో నేను మొగల్రాజపురంలోని రాజగోపాల్ క్యాంపు ఆఫీసుకు వెళ్ళాను. ఆయన అప్పటికి ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకోలేదు. ఎంపీ ఆఫీసులో అప్పటి కార్యదర్శి రామచంద్రరావు (నాని) ఆంధ్రజ్యోతిలో నాకు సహోద్యోగి.  రాజగోపాల్ ది జైఆంధ్ర బాటకాదనీ, సమైక్యాంధ్ర బాట అని నానీ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. "వాళ్ళే విడిపోదాం అంటున్నప్పుడు మనమూ విడిపోతాం అనడంవల్ల ప్రయోజనం ఏమిటీ? మనం సమైక్యంగా వుంటామన్నప్పుడేకదా మన డిమాండ్లు నెరవేరేవీ" అని రాజగోపాల్ ఆలోచిస్తున్నట్టు నానీ అన్నాడు.

                          తెలంగాణ వుద్యమంలో ప్రస్తుత దశ  1997 లోనే మొదలైనప్పటికీ, అప్పటి వరకు "సమైక్యాంధ్ర" అనేమాట ఎక్కడా ఎవరినోటా వినలేదు. అలాంటి అవగాహన కూడా ఎవరికీ వున్నట్టు కనిపించలేదు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు రాయలసీమ, తీరాంధ్ర హక్కుల సాధన పరిరక్షణ కోసం ఒక ఉద్యమం ఆరంభం కావలసిన చారిత్రక సందర్భంలో, సమైక్యాంధ్ర నినాదాన్ని ముందుకు తేవడం అంటే సమస్యను పక్కదారిపట్టించడమే అనిపించింది.   

                          రాజకీయ సంఘటన కుదరకపోయినా ఆలోచనాపరులైన పాత్రికేయుల సంఘటన అయినా  కుదురుతుందనే నమ్మకంతో విజయవాడ ప్రెస్ క్లబ్ కు వెళ్ళాను. పాతమిత్రులు చావ రవి, అన్నవరపు బ్రహ్మయ్య కలిశారు. నేనూ బ్రహ్మయ్య వెంటనే పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసి, రాయలసీమ-తీరాంధ్ర  హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడాము. దానితో కొంచెం అగ్గిరాజుకున్నట్టు కనిపించింది. అదేరోజు రాత్రి ఏబిఏన్- ఆంధ్రజ్యోతి టీవీ న్యూస్ ఛానల్ మా ఇద్దరితో ఓ  ప్రత్యక్ష చర్చా కార్యక్రమం కూడా నిర్వహించింది.

                          ఒక వారం తరువాత నేను మళ్ళీ విజయవాడ వెళ్ళే సమయానికి సన్నివేశం అదుపుతప్పిపోయి వుంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులైన కొందరు హైదరాబాద్లో తమ ఆర్ధిక ప్రయోజనాలని కాపాడుకోవడానికీ, తమ రాజకీయ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికీ ఒక ప్రణాళిక ప్రకారం సమైక్యాంధ్ర పేరిట ప్రజల్లో బలంగా భావోద్వేగాలని రెచ్చగొట్టారు.  నకిలీ రాజీనామాలు, నిరాహారదీక్షలు చేసి, రాష్ట్ర విభజనను అడ్డుకోగలమని  వీళ్ళు ప్రజల్ని నమ్మించగలిగారు.

                          తక్షణం కాకపోయినా సమీప భవిష్యత్తులోనయినా  అంధ్రప్రదేశ్ విభజన తప్పదన్న వాదనను  అంగీకరించడానికి ఎవరూ సిధ్ధంగాలేరు. ఆంధ్ర జర్నలిస్టుల ఫోరం ఏర్పాటుకు కూడా మద్దతు దొరకలేదు. అంతకు ముందు సానుకూలంగా కనిపించిన అన్నవరపు బ్రహ్మయ్య కూడా నాతో కొనసాగలేనని స్పష్టంచేసేశాడు.     

                          ఈ పరిణామాలు వసంత నాగేశ్వరరావు, కత్తి పద్మారావు తదితర జైఆంధ్రావాదుల్ని నిరుత్సాహ పరిచాయి. విజయవాడలో సీనియర్ న్యాయవాది కర్ణాటి రామ్మోహనరావు వంటివారు జైఆంధ్ర ఉద్యమానికి ప్రాణం పోయాలని చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. వాళ్ళు ముందుకు తెచ్చిన ఆచరణాత్మక ప్రతిపాదనల్ని ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ల ఉపన్యాసాల్ని అడ్డుకున్నారు. సభలపై దాడులు చేశారు. అయినప్పటికీ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దళిత, బహుజన నాయకులు ఉపస్రవంతి రాజకీయాలని ఏదో ఒకస్థాయిలో కొనసాగించారు. వాళ్ల కార్యక్రమాల్ని ప్రధాన స్రవంతి రాజకీయాలు  అణిచివేశాయి. మీడియా అస్సలు పట్టించుకోలేదు.

                          రాయలసీమ-కోస్తాంధ్రాలో తటస్థులు ఇంకో వాదనను అభివృధ్ధిచేశారు. మొదట్లో, ఒక ఎత్తుగడగా,  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదలయ్యే జనసమీకరణ క్రమంగా రాయలసీమా-తీరాంధ్ర హక్కుల సాధన ఉద్యమంగా మారుతుందనేది వారి వాదన సారాంశం. గతంలోనూ అనేక ఉద్యమాలు ఎవోకొన్ని తక్షణ ప్రేరణలతో మొదలయ్యి, వుధృతం అయ్యేకొద్దీ,  భిన్నరూపం తీసుకున్న సందర్భాలున్నాయి. రాయలసీమ- కోస్తాంధ్రా ఉద్యమంలోనూ అలాంటి మలుపు సంభవించవచ్చని భావించినవాళ్ళలో నేనూ ఒకడ్ని.  కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు తాత్కాలిక ఎత్తుగడను శాశ్వితఎత్తుగడగా మార్చారు. రాయలసీమ- కోస్తాంధ్రా పునర్నిర్మాణం అనేది ఇప్పటికీ ఎజెండాలోనికి రాకుండా అడ్డుకున్నారు.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ ః 90102 34336

హైదరాబాద్‌
14 అక్టోబరు 2013

ప్రచురణ : ఆంధ్రప్రభ దినపత్రిక
16 అక్టోబరు  2013 




Wednesday, 9 October 2013

మరో యన్టీఆర్ కావాలి!

"కేంద్రం ఒక మిధ్య" అనలిగిన  ధీశాలి 
మరో యన్టీఆర్ కావాలి! 

        సీమాంధ్రులపైన కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న అహంభావ ధోరణి హద్దులు మీరుతోంది. సీమాంధ్రుల మీద కాంగ్రెస్ అధిష్టానం కక్ష కట్టిందనే సందేహం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజనను సమర్ధించేవాళ్ళు కూడా సమర్ధించలేనంత నిరంకుశంగా వుంది యూపియే సర్కారు వైఖరి.

        ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రెండు నెలలుగా  రాయలసీమ, కోస్తా ప్రాంత ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పార్టీ విభేదాలు, వర్గవైషమ్యాలు ఎన్ని వున్నప్పటికీ మినహాయింపులేకుండా ఆ ప్రాంతపు ప్రజా ప్రతినిధులందరూ ఉద్యమాన్ని సమర్ధిస్తున్నారు. అరడజను మంది కేంద్ర మంత్రులు, పాతిక మంది యంపీలు, నూట డెభ్భయి ఐదు మంది ఎమ్మెల్యేల ప్రాతినిధ్యాన్ని నిరాకరించే వ్యవస్థని పార్లమెంటరీ  ప్రజాస్వామ్యం అనడం కష్టం.

 తెలంగాణ అంశం 2004 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పరిశీలనాంశాల్లో చేరింది. మరో ఎస్సార్సీ ద్వార తెలంగాణ సమస్యను పరిష్కారిస్తానని ఆ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ తరువాత ఈ అంశం మీద రెండుప్రాంతాల్లోనూ అనేక దశల్లో అనేక రకాలుగా దాగుడు మూతలు ఆడింది ఆ పార్టి. 2009 చివర్లో కేసిఆర్ నిరశన దీక్ష సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి ప్రకటించడం ఈ క్రమంలో పెద్ద మలుపు. దానికి ప్రతిస్పందనగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. రెండు వారాల్లోనే ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కేంద్ర ప్రభుత్వ వెనుకడుగు సమైక్యవాదులకు ఓదార్పుగానూ, విభజనవాదులకు నిట్టుర్పుగానూ మారింది. దానితో కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు అంగీకరిస్తుందని తెలంగాణవాదులూ ఆశించలేదు. సీమాంధ్రులూ నమ్మలేదు. అయితే, ఆ తరువాత  తెలంగాణలో అనేక దశలో, అనేక రూపాల్లో ఉద్యమాలు కొనసాగగా, సీమాంధ్రలో మాత్రం  అక్కడి యంపీల హామీల మేరకు  అక్కడి ప్రజలు నిశ్చింతగా వుండిపోయారు.

        రాష్ట్ర విభజన, కొత్తరాష్ట్ర ఏర్పాటు అనేది కనీసం ఎనిమిది నెలల ప్రక్రియ. రానున్న ఎన్నికల ప్రక్రియ గడువుతో కలపుకుంటే మొత్తం  ఏడాది వ్యవధి కావాలి.  నిర్ణిత గడువు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో లోక్‌ సభ / ఏపి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వున్నాయి. మే నెల వరకు కేంద్ర ప్రభుత్వంలో అలికిడి లేకపోవడంతో, ఇక యూపియే హయాంలో రాష్ట్ర విభజన జరగదని ఇటు తెలంగాణులు, అటు సీమాంధ్రులు కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఉరుముల్లేకుండా వర్షం కురిసినట్టు జులై నెలాఖర్లో హఠాత్తుగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది యూపియే ప్రభుత్వం. ఈ హఠాత్‌  పరిణామానికి తక్షణ ప్రేరణ ఏమిటో ఇదమిత్తంగా బయటి ప్రపంచానికి తెలియక పోయినా, తెలంగాణవాళ్లకు ఇది అనుకోని వరంగానూ, సీమాంధ్రులకు శాపంగానూ మారింది.

        ఎన్డీయే హయాంలో, ఒక్క లాఠీ కూడా వాడకుండా  మూడు రాష్ట్రాల్ని విభజించామని బీజేపి తరచూ గొప్పగా చెప్పుకుంటున్నదిగానీ, విభజనోద్యమాల్లో ఝార్ఖండ్‌, ఛత్తీస్‌ గడ్‌, ఉత్తరాఖండ్‌ లతో పొలిస్తే తెలంగాణ ఉద్యమం  మౌలికంగా భిన్నమైనది. సాధారణంగా, రాజధాని నగరానికి దూరంగావున్న ప్రాంతాలే కొత్త రాష్ట్రం  కావాలని అడుగుతాయి. అక్కడ రాష్ట్ర విభజనకు రాజధాని నగరాలకు కుడా పెద్దగా అభ్యంతరం వుండదు. అందుకే ఆ మూడు రాష్ట్రాల శాసనసభలు సులభంగా విభజన తీర్మానాలు చేశాయి.

        రాజధాని నగరమున్న ప్రాంతమే, విడిపోతానని అడుగుతుండంవల్ల ఆంధ్రప్రదేశ్‌ విభజన  అనేది భిన్నమైన ప్రక్రియ మాత్రమేగాక, సంక్లిష్టమైన సమస్య. రాజధాని నగరాలైన లక్నో, పాట్నా, భోపాల్‌  అభివృధ్ధిలో ఏ విధంగానూ  హైదరాబాద్‌ మహానగర దరిదాపుల్లోకి రాగల  ఆర్ధికశక్తులుకావు.  అంచేత,  ఏపి విభజనకు సాధారణ గడువుకన్నా మరింత ఎక్కువ కాలం ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరంవుంది.  ఈ ప్రత్యేకతను యూపీయే ప్రభుత్వంగానీ, దానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ గానీ పరిగణనలోనికి తీసుకోకపోవడంవల్ల  తెలుగు సమాజంలో కల్లోలం చెలరేగింది.

        దిగువన వుండే ప్రజల నుండి వచ్చే అభిప్రాయాల్ని ఎగువన నిర్ణయంగా మార్చి అమలు చేయడమే ప్రజాస్వామ్యం. దానికి విరుధ్ధంగా, ఎగువనవుండే ప్రభుత్వాలు ముందే నిర్ణయాలను చేసి దిగువన వున్నవారిపై రుద్దడం మొదలెడితే  ప్రజలకు పార్లమెంటరీ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. అదే జరిగితే, ఇప్పుడు రాజకీయ పార్టీలు పొందుతున్న తక్షణ, తాత్కాలిక ప్రయోజనాలకు కొన్ని వందల రెట్లు నష్టపరిహారం చెల్లించాల్సివుంటుంది.

        ప్రస్తుత దశలో, తెలంగాణ ఉద్యమం పదేళ్లకుపైగా కొనసాగడంవల్ల, రాష్ట్ర విభజన అంశం మీద భిన్నాభిప్రాయాల్ని తొలిగించుకుని దాదాపు ఏకాభిప్రాయానికి రావడానికి అక్కడి రాజకీయపార్టీలకు సమయం దొరికింది. సీమాంధ్రలో రాజకీయ పార్టీల మధ్య, పార్టీలలోని నాయకుల మధ్య పోటీ వుండాల్సిన దానికన్నా ఎక్కువయిపోయి, ఉద్యమానికి సారధ్యం వహించాల్సిన రాజకీయ సంయుక్త కార్యాచరణ సమితి ఏర్పడడం కూడా దాదాపు అసాధ్యంగా మారిపోయింది. ఫలితంగా, జానపద కథలో చెప్పినట్టు, తాబేలులా కనిపించిన తెలంగాణ లక్ష్యానికి చేరుకుంది. కుందేలులా కనిపించిన సీమాంధ్ర కుదేలు అయిపోయింది.

        రాష్ట్ర విభజన సందర్భంగా  సీమాంధ్ర ప్రయోజనాలని కాపాడడానికీ,  జరగబోయే నష్టాలని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి నడుం బిగించాల్సిన చారిత్రక సంధి సమయంలో అక్కడి ప్రజాప్రతినిధులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. మరోవైపు, హైదరాబాద్‌ ను కార్యక్షేత్రంగా మార్చుకున్న సీమాంధ్రప్రాంతపు ప్రాయోజిత పెట్టుబడిదారులు క్రియాశీలంగామారారు.  అందివచ్చిన అవకాశాన్ని తమ ఆర్ధిక ప్రయోజనాల కోసం వాడుకున్నారు. సమైక్యవాదం అనే ఆలోచన కూడా లేని సీమాంధ్రుల్లో, కుత్రిమ నిరాహార దీక్షల ద్వార  సమైక్యాంధ్ర అనే నినాదాన్ని నెమ్మదిగా ఎక్కించి, దాన్ని ఉన్మాదంగా మార్చి, ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించి, తమ నేలతల్లికే  తీరని అపచారం చేశారు.

        రాష్ట్ర విభజన ప్రకటన చేశాక, సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలను, సూచనలను తెలుసుకోవడానికీ, వాటికి పరిష్కారమార్గాలను, ప్రత్యామ్నాయాలనూ సూచించడానికీ  యూపియే సమన్వయ సంఘం ఏకే ఆంథోని కమిటీని వేసింది. ఇది రాజకీయ కమిటీ కనుక ఈ కమిటీని కాంగ్రెస్‌ వర్గాలుతప్ప ఇతర పార్టీలు, సంస్థలు కలిసి తమ గోడు చెప్పుకునే అవకాశం లేదు. సీమాంధ్రలో ప్రస్తుత ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఎన్జీవోల సంఘం నాయకులు ఈ కారణంగానే ఆంథోని కమిటీని కలవడానికి నిరాకరించారు. చివరకు, సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల మనోభావలనైనా వినడానికి ఆ కమిటీ శ్రధ్ధ చూపినట్టు కనిపించలేదు.

        అప్పట్లో, డజనున్నర ఎమ్మెల్యేలు కూడాలేని చిరంజీవి పార్టిని కాంగ్రెస్‌ లో విలీనంచేసే ప్యాకేజీ మాట్లాడడానికి ఇదే ఆంటోని స్వయంగా హైదరాబాద్‌ వచ్చారు.  ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ప్రాతిథ్యం వహిస్తున్న సీమాంధ్ర ప్రాంత మనోభావాలను పరికించడానికి ఒక్కసారి కూడా రాకపోవడాన్ని నిర్లక్ష్యం, అహంభావం అనే పదాలు సరిపోవు.

        యూపియే సమన్వయ కమిటీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి తెలంగాణపై తీర్మానం చేసినప్పటి నుండి కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదముద్ర వేసేంత వరకు వున్న  రెండు నెలల విలువైన కాలాన్ని  కాంగ్రెస్‌ అధిష్టానం దారుణంగా వృధాచేసింది.  ప్రతి పనికీ యూజ్‌, ఓవర్‌ యూజ్‌, మిస్‌ యూజ్‌, అబ్యూజ్‌ అనే నాలుగు దశలు వుంటాయంటారు. కాంగ్రెస్‌ అధిష్టానం తన అధికారాల వినియొగంలో నాలుగు దశల్నీ దాటిపోయింది.

        రాష్ట్ర విభజన ప్రక్రియ కోసం, ఇప్పుడు హోం మంత్రి  షిండే అధ్యక్షతన  ప్రధాని ప్రకటించిన మంత్రుల బృందం (జీవోయం) నియామకం తీరు కూడా  ప్రహసనంగా మారింది. మంత్రుల బృందంలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందినవాళ్లకు స్థానం కల్పించకపోవడం ఒక విశేషమైతే, ఇటీవల ఆసుపత్రి నుండి విడుదలై, ఇంకా పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకోని ఆంటోనీకి కూడా స్థానం కల్పించడం మరో విశేషం. యూపీయే సమన్వయ సంఘం ప్రతినిధిగా ఆంటోని కమిటి ప్రదర్శించిన అలసత్వాన్ని చూసినవాళ్లకు, ఇప్పుడు యూపియే మంత్రుల బృందం నిర్వహించబోయే నిర్వాకాన్ని ఊహించడం పెద్ద కష్టం ఏమీకాదు.

        తెలంగాణరాష్ట్రం సరిహద్దుల నిర్ధారణ, ఉమ్మడి రాజధాని స్వరూప స్వభావాలు మొదలు, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్తపేరు, రాజధాని నగరం ఎంపిక, దాని నిర్మాణం, నిధుల సేకరణ, సాగునీటి పంపకాలు-నియంత్రణ, వ్యవసాయానికి పరిరక్షణ, విద్య,  వైద్య, ఉపాధి రంగాల్లో సీమాంధ్రులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రెవెన్యూ, శాంతిభద్రతలు వరకు అనేకానేక అంశాల్ని మంత్రుల బృందం పరిశీలించాల్సి వుంటుంది. ఇంతటి కీలకమైన అంశాలపై నివేదిక ఇచ్చేందుకు మంత్రుల బృందానికి కేవలం ఆరు వారాల గడువు మాత్రమే ఇవ్వడాన్నిబట్టే, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంత మొక్కుబడిగా మార్చబోతున్నదో అర్ధం అవుతుంది.

        చేసిన సమస్త ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో, ఇక అంతిమంగా శాసనసభలో తమ సంఖ్యా బలంతో రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు. కానీ, అదీ అత్యాశ మాత్రమే! ఎందుకంటే, రాష్ట్ర విభజన ప్రక్రియలో శాసనసభ పాత్ర మీద భారత రాజ్యాంగంలో స్పష్టమైన వివరణలేదు. దానివల్ల, సంబంధిత అధీకరణల్ని ఎవరికివారు తమకు అనుకూలంగా అన్వయించుకునే వీలుంది.

        భారత రాజ్యాంగానికి యూనిటరి రిపబ్లిక్‌ స్వభావం ఎక్కువ. ఫెడరల్‌ రిపబ్లిక్‌ స్వభావం తక్కువ. రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన అధీకరణం 3 లో ఇది మరింత ప్రస్పుటంగా కనిపిస్తుంది. రాష్ట్రాల విభజన,  పునర్విభజనల బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు, రాష్ట్రపతి , సంబంధిత రాష్ట్ర శాసనసభ  అభిప్రాయాన్ని తెలుసుకోవాలని అందులోవుంది. అంతేతప్ప, శాసనసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి  పాటించాలనే నియమం ఏమీలేదు. అసలు, శాసనసభను సంప్రదించకుండానే రాష్ట్ర విభజన చేసేయడానికి రాజ్యాంగంలో అవకాశం వుందనేవారూ వున్నారు.

        చట్టంలో ప్రతి పనికీ షార్ట్‌ కట్లు, తత్కాల్‌ లు వుండవచ్చుగానీ, ఐదు కోట్ల మంది సువిశాల ప్రజానీకానికి జీవన్మరణ సమస్యలాంటి రాష్ట్ర విభజన అంశం మీద దొడ్డిదారులు, అడ్డదారులు తొక్కడం తీవ్రనిర్లక్ష్యం మాత్రమేకాదు. ఫక్తు నిరంకుశత్వం.

        సీమాంధ్రకు ఇప్పుడు ప్రధాన శాపం ఏమంటే ఇఛ్ఛాపురం నుండి తడ వరకు, చిత్తురు నుండి కర్నూలు వరకు దుర్భిణీ వేసి వెతికినా నాయక లక్షణాలు కలవారు ఒక్కరంటే ఒక్కరూ కనిపించడంలేదు. జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు లేకపోయినాసరే కనీసం ఒక జిల్లాకైనా నాయకత్వం వహించగల సమర్ధులు సహితం లేరు. రోడ్ల మీద తిరగడానికి కూడా ప్రజాప్రతినిధులకు ధైర్యం సరిపోవడంలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. యన్టీ రామారావు, వైయస్‌ రాజశేఖర రెడ్డిల దరిదాపుల్లోకి చేరగల నాయకులు కనుచూపుమేరలో కనిపించడంలేదు. బహుశ, వాళ్లను మనం సీమాంధ్రకు చివరి నాయకులు అనుకోవాలేమో!

        రాజకీయ నాయకత్వలేమివల్ల సీమాంధ్ర ఉద్యమం ఎన్జీవోల ఉద్యమంగా కుచించుకుపోయింది. గుడ్డిలో మెల్లగా ఎన్జీవోలయినా పోరాటం చేస్తున్నారని కొందరు సంతృప్తి పడవచ్చుగానీ, అంధుల పోరాటానికి మెల్లకళ్లవాళ్ళు నాయకత్వం వహించడం శ్రేయస్కరంకాదు. ఉద్యోగులు భద్రతగలిగిన వర్గం. తమకు రావల్సిన  రాయితీలు దక్కగానే భద్రతగలిగినవర్గం కాడి పడేస్తుంది. ఎన్నడైనా  అట్టడుగు బాధితులు నాయకత్వం వహించినపుడే ఉద్యమాలు లక్ష్యాలను సాధించగలుగుతాయి.

        ఇక నుంచి రాజకీయ పార్టిలు పోరాటం చేస్తాయి అని ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అంటే, ఉద్యమం లోనికి రాజకీయ పార్టిలు చొరబడుతున్నాయి అని ఏన్జీవోల నాయకులు పరుచూరి అశోక్‌ బాబు అభ్యంతరం చెప్పారు. రెండు రోజులు గడవక ముందే ఆ ఏన్జీవోల నాయకులే తమను ఢిల్లీ తీసుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్దిని కోరారు.  తాను ముఖ్యమంత్రిగా వున్నంత కాలం రాష్ట్ర విభజన జరగదు అని ముఖ్యమంత్రి వాళ్లకు గట్టి హామీఇచ్చారు. మరోవైపు హైదరాబాద్‌ లో జరిపిన ఎన్జీవోల సభకు సూత్రధారి  ముఖ్యమంత్రే అని తాజా మాజీ డీజీపి  దినేష్‌ రెడ్డి అరోపిస్తున్నారు. ఇంకోవైపు నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి ప్లగ్గు పీకేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసి‌ఆర్‌ బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ నాలుగు  సంఘటనలు చాలు సీమాంధ్ర రాజకీయ పరిస్థితి ఎంత దయనీయంగావుందో అర్ధం చేసుకోవడానికి.

        రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని బలంగా ధిక్కరించిన నాయకుడు యన్టీ రామారావు. ఫెడరల్‌ వ్యవస్థ పరిరక్షణ కోసం ఆయన సుదీర్ఘపోరాటం
చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాన్నిచ్చే  రాజ్యాంగ అధీకరణ 356 మీద భీకర తిరుగుబాటు చేశారు. కేంద్రం ఒక మిధ్య అనలిగిన ధీశాలి అప్పటికీ ఇప్పటికీ బహుశ ఆయనొక్కడే!   ఇప్పుడు సీమాంధ్రులకు కేంద్రం ఒక మిధ్య అనగలిగిన  మరో యన్టీ‌ఆర్‌ కావాలి!

. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్ :  90102 34336
హైదరాబాద్
9  అక్టోబరు  2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, 13  అక్టోబరు  2013

Saturday, 5 October 2013

విభజనాంశాలపై చర్చించండి

విభజనాంశాలపై చర్చించండి
సీమాంధ్రలో  హైదరాబాద్ స్థాయి జీవనం
హైదరాబాద్ లో సీమాంధ్ర స్థాయి భద్రత

యుధ్ధంలో గెలిస్తే యుధ్ధసొత్తు రావలసినదానికన్నా ఎక్కువగా వస్తుంది. యుధ్ధంలో ఓడిపోతే యుధ్ధనష్టం వుండాల్సిన దానికన్నా ఎక్కువగా వుంటుంది. ఇప్పుడు యుధ్ధాన్ని గెలిచిన ఉత్సాహం తెలంగాణాది. యుధ్ధాన్ని ఓడిన విషాదం రాయలాంధ్రాది.

        సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అధిష్టానం చేతుల్లో ముందు తాము మోసపోయి, తరువాత తమ ప్రజల్ని మోసంచేశారా? లేక, అధిష్టానం మోసం చేస్తుందని ముందే తెలిసినా దాన్ని దాచిపెట్టి తమ ప్రజల్ని మోసం చేశారా? అనేది ఔత్సాహిక పరిశోధకులకు ఆసక్తినిచ్చే అంశంకావచ్చు. అందరికీ కనిపిస్తున్న వాస్తవం ఏమంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్  దృఢంగా నిర్ణయించుకుంది. కేంద్ర మంత్రివర్గ ఉపసంఘానికి గతంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అంగీకార పత్రాలు ఇప్పుడు కాంగ్రెస్-యూపియే నిర్ణయానికి వత్తాసుగా కలిసివచ్చాయి.

        కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నదని జగన్ పార్టీ కొంచెం ముందుగానే పసిగట్టింది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో తెలంగాణకన్నా సీమాంధ్రను నమ్ముకోవడమే మేలని భావించి, పార్టి ప్లీనరీ తీర్మానాన్ని చివరి నిముషంలో రద్దుచేసుకుని సమైక్యాంధ్ర నినాదాన్ని అందుకుంది.

        తెలంగాణపై అంగీకార పత్రం ఇవ్వడమేగాక, దాన్ని అడ్డుపెట్టుకుని తరచూ కాంగ్రెస్ నిజాయితీని ప్రశ్నిస్తూవచ్చిన చంద్రబాబుకు "తూచ్" అనుకుని సీమాంధ్రకు వెళ్ళిపోయే అవకాశం లేకుండాపోయింది. సమస్య వచ్చినపుడు రెండుపక్కలవారిని కూర్చోబెట్టి మాట్లాడే  గ్రామపెద్దలపాటి విచక్షణను కూడా కాంగ్రెస్ చూపెట్టలేదని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు. అది నిజమేకావచ్చు. అయితే, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇవ్వడానికి ముందు రెండుపక్కలవారిని కూర్చోబెట్టి మాట్లాడి గ్రామపెద్దలపాటి విచక్షణను చంద్రబాబు అయినా పాటించారా? అనే ప్రశ్న ముందుకు వస్తుంది. తాము సమర్పించిన అంగీకార పత్రంలో హైదరాబాద్ గురించీ, నదీజలాల పంపకాల గురించీ, సీమాంధ్రలో ఉద్యోగ, ఉపాధి కల్పన గురించి, కొత్తరాజధాని నిర్మాణం గురించీ ఆయన ప్రస్తావించారోలేదో కూడా బయటి ప్రపంచానికి తెలీదు. ఆ విషయాల్ని చంద్రబాబు కూడా ఎప్పుడూ బహిరంగంగా ప్రస్తావించలేదు.

        ఇప్పుడు కాంగ్రెస్ చేయలేదని చంద్రబాబు ఆరోపిస్తున్న విషయాలని వారు అప్పుడు చేసివుండవచ్చు. వాటిని వారు అప్పుడే బయటపెట్టివుంటే ఇప్పటి సీమాంద్రుల ఉద్యమానికి ఈ పాటికే ఒక ప్రాతిపదిక ఏర్పడివుండేది. అయినా సమయం మించిపోలేదు. వారు ఇప్పుడయినా తన అంగీకార పత్రంలోని అంశాలను బహిర్గతం చేయవచ్చు. అలాచేస్తే,  వారికి సీమాంధ్రలో ఆమోదాంశం పెరిగే అవకాశాలుంటాయి.  గతకాలపు విషయాలెలావున్నా, సమైక్యాంధ్ర నినాదం ఇవ్వడానికి చంద్రబాబు ఇప్పుడు సిధ్ధమేనా? అంటే సమాధానం సందేహమే!

        ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ఒక అవకాశవాదంతో కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని టీడీపి చేస్తున్న అభియోగం కూడా పసలేనిదే. టీడిపి కూడా  2009 లో ఎన్నికలకు ముందే  తెలంగాణపై నిర్ణయం తీసుకుంది. నిజానికి ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది.  ఎవరైనా ప్రశ్నించాల్సింది నిర్ణయ స్వభావాన్నేగానీ, సందర్భాన్నికాదు. 

         జగన్ కు బెయిల్ రావడానికీ, యూపియే మంత్రివర్గం తెలంగాణపై తీర్మానం చేయడానికీ తానే పరోక్షకారణమని చంద్రబాబు ఒక కొత్త కథనాన్ని ముందుకు తెస్తున్నారు. తాను ఢిల్లీ వెళ్ళి బీజేపి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ను కలిసిన మరునాడే జగన్ కు కాంగ్రెస్  బెయిల్ ఇచ్చిందనీ, తాను మళ్ళీ ఢిల్లీ వెళ్ళి నరేంద్రమోడీని కలిసిన మరునాడే మంత్రివర్గ సమావేశంపెట్టి తెలంగాణపై నిర్ణయం తీసుకుందనేది చంద్రబాబు కథనం. ఈ ఆరోపణల్లో వాస్తవాలెలావున్నా వీటికి కొన్ని ప్రాధమిక ఆధారాలున్నాయన్నది మాత్రం నిజం. తన చర్యలపై కాంగ్రెస్ ప్రతిచర్యల ఫలితంగానే తెలంగాణ వచ్చిందనేది చంద్రబాబు  కథనం సారాంశం.

        అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరికన్నా ముందు "ఒక ఓటు - రెండు రాష్ట్రాలు" నినాదం ఇచ్చిందే బీజేపి. రాజ్ నాథ్ సింగ్, నరేంద్ర మోదీ, సుష్మా స్వరాజ్ తదితర బీజేపీ అగ్రనేతలు ఇటీవల హైదరాబాద్ వచ్చి "కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ఇస్తానంటే పార్లమెంటులో మేము మద్దతు ఇస్తాం. లేకపోతే అధికారంలోనికి రాగానే మేమే తెలంగాణ ఇస్తాం" అని ఒకటికి నాలుగుసార్లు చెప్పివెళ్ళారు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని కూడా బీజేపి స్వాగతించింది. సీమాంధ్ర గురించి అంతగా ఆవేదన చెందుతున్నాననే చంద్రబాబు, "ఇప్పటికీ విభజనకు కట్టుబడివున్నాం" అనే బీజేపి అగ్రనేతల్ని తరచుగా ఎందుకు కలుస్తున్నట్టూ? అనే సూటి ప్రశ్న ఒక్కటిచాలు వర్తమాన రాజకీయాలు ఎంతటి క్రూర పరిహాసంగా మారిపొతున్నాయో తెలియడానికి!

        కాంగ్రెస్ ఎలాగూ స్వచ్చందంగా రంగం నుండి తప్పుకుంది కనుక సీమాంధ్రలో ఇక జగన్, చంద్రబాబు మాత్రమే మిగిలారని భావించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కోణంలో బాబూకన్నా జగనే మెరుగైన ఎంపికగా కనిపించవచ్చుగానీ, ఆయన లోపాలు, శాపాలు ఆయనకున్నాయి. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో టీఆర్ ఎస్ కు తొలుత పెద్దపీట వేసిందే వైయస్ రాజశేఖర రెడ్డి. ఈ అంశం వైయస్ వారసునిగా జగన్ ను తప్పక ఇబ్బంది పెడుతుంది. జగన్ మీద అంతకన్నా పెద్ద నింద ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ ప్రాయోజిత నాయకుడనేది. విజయలక్ష్మీలతోసహా వైయస్సార్ కాంగ్రెస్ ఏమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసినా షర్మీల సమైక్యాంధ్ర యాత్రకు పెద్దగా స్పందన రాలేదు. ఆ పార్టీ మీద జనానికి గురి కుదరలేదు. సీమాంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలంటే, జగన్ ముందుగా ఈ ముద్రల్ని తొలగించుకోవాల్సి వుంటుంది.

        2009 ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్ కు శనిదశ నడిచింది. నిరాహారదీక్ష చేసి ఆయన రాజకీయ గ్రహాల్ని  ప్రసన్నం చేసుకున్నారు. జగన్ కూడా కేసిఆర్ బాటలో నిరాహార దీక్షలు చేసి రాజకీయ శాంతి పూజలు జరిపితే కొన్ని సానుకూల ఫలితాలు రావచ్చు.

        జగన్ ఆమరణ దీక్ష చేసి పునీతులైపోతుంటే చంద్రబాబు ఊరికే వుండలేరుకద! సీమాంధ్ర పోటీలో వుండాలంటే వారూ పునీతులు కావాలి! జగన్ హైదరాబాదులో దీక్ష మొదలెడితే రెండురోజుల తరువాత చంద్రబాబు ఢిల్లీలో  దీక్ష మొదలెట్టవచ్చు. రేపు ఏ లగడపాటి వంటివారో ఏకంగా సోనియా గాంధీ ఇంటి ముందు దీక్ష చేయవచ్చు. ఎలాగూ నాలుగు రోజుల తరువాత పోలీసులు రంగప్రవేశంచేసి ఆత్మహత్య నిరోధక  చట్టం నెపంతో  దీక్షాశిబిరాన్ని ఎత్తివేస్తారనే నమ్మకం రాజకీయాల్లో బలంగా పనిచేస్తోంది. పోలీసుల్ని ఇంతగా నమ్మే సందర్భం మరొకటీ కనిపించదు. రాజకీయాల్లో రాజీనామాలు అనేవి ప్రహసనంగామారి చాలా కాలమైంది. ఇప్పుడు ఆత్మాహుతులు, ఆమరణ నిరాహార దీక్షలూ కూడా ఆ జాబితాలో చేరిపోతున్నాయి.  

        చంద్రబాబుతో పోలిస్తే జగన్ కున్న సానుకూల అంశం ఆయన ఇంతవరకు సియంకాదనేదే! నిజానికి చంద్రబాబా? జగనా? అనేది కూడా నకిలీ ప్రతిపాదన (Spurious Choice)  రాయలాంధ్రులు ఇప్పుడు అంతకన్నా మెరుగైన ప్రత్యామ్నాయాల్ని అన్వేషించాలి.

        విభజన విధివిధానాల గురించి మాట్లాడడం అంటేనే, సమైక్యాంధ్ర సిధ్ధాంతాన్ని వదులుకున్నట్టే అనే భావోద్వేగంతో సీమాంధ్ర ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఈ అంశాన్ని క్షమించరానంతగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడైనా ఈ అంశంపై విస్తృత చర్చ ఆరంభంకావాలి. ఒక కోరికల పట్టిక తయారు కావాలి. వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం నుండి చట్టపరమైన హామీలు కావాలి. రాయలాంధ్ర ఉద్యమం ఇక ముందు ఆ దిశగా సాగాలి.

        సాగునీటితో మొదలెట్టి ఉపాధికల్పన, రాజధాని నిర్మాణం వరకు చాలా చాలా అంశాలుంటాయి విభజన విధివిధానాల్లో. ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం  కోరిక మేరకు మా సభ్యుడొకడు ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేశాడు. అందులో, రైల్వేలు, నౌకాశ్రయాలు, సహజవనరులు, జాతీయ విద్యా, వైద్య, సాంకేతిక విజ్ఞాన సంస్థలు, పారిశ్రామికవాడలు తదితర అంశాలు వంద వరకు వున్నాయి. ఇంత కీలకమైన అంశాల్ని ఇంతకాలం మరిచిపోయామా అనిపించింది.  రాయలాంధ్రులకు "సీమాంధ్రలో  హైదరాబాద్ స్థాయి జీవనం, హైదరాబాద్ లో సీమాంధ్ర స్థాయి భద్రత" అనేది ఆ ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్ సారాంశం.

        సీమాంధ్రలో జీవనస్థాయిని పెంచడం ఎంత అవసరమో, హైదరాబాద్ లో సామాజిక భద్రతను పాటించడం కూడా అంతే అవసరం. హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్రుల భద్రత గురించి తెలంగాణ అగ్రనేతలు అనేక హామీలు ఇస్తున్నారు. అవన్నీ ఆహ్వానించదగ్గవి. అయితే, దిగువ స్థాయిలో రాయలాంధ్రులు అప్పుడే బెదిరింపుల్ని కూడా ఎదుర్కొంటున్నారనే అంశం తీసివేయదగ్గదేమీకాదు. తెలంగాణ నాయకుల మధ్య అధికారం కోసం జరిగే పోటిలో సామాన్య రాయలాంధ్రుల్ని సహితం బలిపెట్టే ప్రమాదాన్ని కొట్టిపడవేయలేం. దీని నివారణకు సామాజికంగానూ, చట్టబధ్ధంగానూ ఒక ఏర్పాటు వుండాలి. తెలంగాణలోని ఉదారవాదులు దీన్ని ఒక చారిత్రక కర్తవ్యాంగా భావిస్తారని ఆశిద్దాం!

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌: 90102 34336 హైదరాబాద్‌
 5 అక్టోబరు 2013

ప్రచురణ : సూర్య దినపత్రిక
 6 అక్టోబరు 2013