విభజనాంశాలపై చర్చించండి
సీమాంధ్రలో హైదరాబాద్ స్థాయి జీవనం
హైదరాబాద్ లో సీమాంధ్ర స్థాయి భద్రత
యుధ్ధంలో గెలిస్తే యుధ్ధసొత్తు రావలసినదానికన్నా ఎక్కువగా వస్తుంది. యుధ్ధంలో
ఓడిపోతే యుధ్ధనష్టం వుండాల్సిన దానికన్నా ఎక్కువగా వుంటుంది. ఇప్పుడు యుధ్ధాన్ని
గెలిచిన ఉత్సాహం తెలంగాణాది. యుధ్ధాన్ని ఓడిన విషాదం రాయలాంధ్రాది.
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు
అధిష్టానం చేతుల్లో ముందు తాము మోసపోయి, తరువాత తమ ప్రజల్ని మోసంచేశారా? లేక,
అధిష్టానం మోసం చేస్తుందని ముందే తెలిసినా దాన్ని దాచిపెట్టి తమ ప్రజల్ని మోసం
చేశారా? అనేది ఔత్సాహిక పరిశోధకులకు ఆసక్తినిచ్చే అంశంకావచ్చు. అందరికీ
కనిపిస్తున్న వాస్తవం ఏమంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ దృఢంగా నిర్ణయించుకుంది. కేంద్ర మంత్రివర్గ
ఉపసంఘానికి గతంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అంగీకార
పత్రాలు ఇప్పుడు కాంగ్రెస్-యూపియే నిర్ణయానికి వత్తాసుగా కలిసివచ్చాయి.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటి
తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నదని జగన్ పార్టీ కొంచెం ముందుగానే
పసిగట్టింది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో తెలంగాణకన్నా సీమాంధ్రను నమ్ముకోవడమే మేలని
భావించి, పార్టి ప్లీనరీ తీర్మానాన్ని చివరి నిముషంలో రద్దుచేసుకుని సమైక్యాంధ్ర
నినాదాన్ని అందుకుంది.
తెలంగాణపై అంగీకార పత్రం
ఇవ్వడమేగాక, దాన్ని అడ్డుపెట్టుకుని తరచూ కాంగ్రెస్ నిజాయితీని ప్రశ్నిస్తూవచ్చిన
చంద్రబాబుకు "తూచ్" అనుకుని సీమాంధ్రకు వెళ్ళిపోయే అవకాశం
లేకుండాపోయింది. సమస్య వచ్చినపుడు రెండుపక్కలవారిని కూర్చోబెట్టి మాట్లాడే గ్రామపెద్దలపాటి విచక్షణను కూడా కాంగ్రెస్
చూపెట్టలేదని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు. అది నిజమేకావచ్చు. అయితే, ప్రణబ్
ముఖర్జీ కమిటీకి లేఖ ఇవ్వడానికి ముందు రెండుపక్కలవారిని కూర్చోబెట్టి మాట్లాడి
గ్రామపెద్దలపాటి విచక్షణను చంద్రబాబు అయినా పాటించారా? అనే ప్రశ్న ముందుకు
వస్తుంది. తాము సమర్పించిన అంగీకార పత్రంలో హైదరాబాద్ గురించీ, నదీజలాల పంపకాల
గురించీ, సీమాంధ్రలో ఉద్యోగ, ఉపాధి కల్పన గురించి, కొత్తరాజధాని నిర్మాణం గురించీ
ఆయన ప్రస్తావించారోలేదో కూడా బయటి ప్రపంచానికి తెలీదు. ఆ విషయాల్ని చంద్రబాబు కూడా
ఎప్పుడూ బహిరంగంగా ప్రస్తావించలేదు.
ఇప్పుడు కాంగ్రెస్ చేయలేదని
చంద్రబాబు ఆరోపిస్తున్న విషయాలని వారు అప్పుడు చేసివుండవచ్చు. వాటిని వారు అప్పుడే
బయటపెట్టివుంటే ఇప్పటి సీమాంద్రుల ఉద్యమానికి ఈ పాటికే ఒక ప్రాతిపదిక
ఏర్పడివుండేది. అయినా సమయం మించిపోలేదు. వారు ఇప్పుడయినా తన అంగీకార పత్రంలోని
అంశాలను బహిర్గతం చేయవచ్చు. అలాచేస్తే,
వారికి సీమాంధ్రలో ఆమోదాంశం పెరిగే అవకాశాలుంటాయి. గతకాలపు విషయాలెలావున్నా, సమైక్యాంధ్ర నినాదం
ఇవ్వడానికి చంద్రబాబు ఇప్పుడు సిధ్ధమేనా? అంటే సమాధానం సందేహమే!
ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ఒక
అవకాశవాదంతో కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని టీడీపి చేస్తున్న అభియోగం
కూడా పసలేనిదే. టీడిపి కూడా 2009 లో
ఎన్నికలకు ముందే తెలంగాణపై నిర్ణయం
తీసుకుంది. నిజానికి ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు
తీసుకుంటుంది. ఎవరైనా ప్రశ్నించాల్సింది
నిర్ణయ స్వభావాన్నేగానీ, సందర్భాన్నికాదు.
జగన్ కు బెయిల్ రావడానికీ, యూపియే మంత్రివర్గం
తెలంగాణపై తీర్మానం చేయడానికీ తానే పరోక్షకారణమని చంద్రబాబు ఒక కొత్త కథనాన్ని ముందుకు
తెస్తున్నారు. తాను ఢిల్లీ వెళ్ళి బీజేపి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ను కలిసిన
మరునాడే జగన్ కు కాంగ్రెస్ బెయిల్
ఇచ్చిందనీ, తాను మళ్ళీ ఢిల్లీ వెళ్ళి నరేంద్రమోడీని కలిసిన మరునాడే మంత్రివర్గ
సమావేశంపెట్టి తెలంగాణపై నిర్ణయం తీసుకుందనేది చంద్రబాబు కథనం. ఈ ఆరోపణల్లో
వాస్తవాలెలావున్నా వీటికి కొన్ని ప్రాధమిక ఆధారాలున్నాయన్నది మాత్రం నిజం. తన
చర్యలపై కాంగ్రెస్ ప్రతిచర్యల ఫలితంగానే తెలంగాణ వచ్చిందనేది చంద్రబాబు కథనం సారాంశం.
అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో
అందరికన్నా ముందు "ఒక ఓటు - రెండు రాష్ట్రాలు" నినాదం ఇచ్చిందే బీజేపి.
రాజ్ నాథ్ సింగ్, నరేంద్ర మోదీ, సుష్మా స్వరాజ్ తదితర బీజేపీ అగ్రనేతలు ఇటీవల
హైదరాబాద్ వచ్చి "కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ఇస్తానంటే పార్లమెంటులో మేము
మద్దతు ఇస్తాం. లేకపోతే అధికారంలోనికి రాగానే మేమే తెలంగాణ ఇస్తాం" అని
ఒకటికి నాలుగుసార్లు చెప్పివెళ్ళారు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం తెలంగాణపై
తీసుకున్న నిర్ణయాన్ని కూడా బీజేపి స్వాగతించింది. సీమాంధ్ర గురించి అంతగా ఆవేదన
చెందుతున్నాననే చంద్రబాబు, "ఇప్పటికీ విభజనకు కట్టుబడివున్నాం" అనే
బీజేపి అగ్రనేతల్ని తరచుగా ఎందుకు కలుస్తున్నట్టూ? అనే సూటి ప్రశ్న ఒక్కటిచాలు
వర్తమాన రాజకీయాలు ఎంతటి క్రూర పరిహాసంగా మారిపొతున్నాయో తెలియడానికి!
కాంగ్రెస్ ఎలాగూ స్వచ్చందంగా
రంగం నుండి తప్పుకుంది కనుక సీమాంధ్రలో ఇక జగన్, చంద్రబాబు మాత్రమే మిగిలారని
భావించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కోణంలో బాబూకన్నా జగనే మెరుగైన ఎంపికగా
కనిపించవచ్చుగానీ, ఆయన లోపాలు, శాపాలు ఆయనకున్నాయి. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో
టీఆర్ ఎస్ కు తొలుత పెద్దపీట వేసిందే వైయస్ రాజశేఖర రెడ్డి. ఈ అంశం వైయస్
వారసునిగా జగన్ ను తప్పక ఇబ్బంది పెడుతుంది. జగన్ మీద అంతకన్నా పెద్ద నింద
ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ ప్రాయోజిత నాయకుడనేది. విజయలక్ష్మీలతోసహా వైయస్సార్
కాంగ్రెస్ ఏమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసినా షర్మీల సమైక్యాంధ్ర యాత్రకు
పెద్దగా స్పందన రాలేదు. ఆ పార్టీ మీద జనానికి గురి కుదరలేదు. సీమాంధ్ర రాజకీయాల్లో
కీలక పాత్ర పోషించాలంటే, జగన్ ముందుగా ఈ ముద్రల్ని తొలగించుకోవాల్సి వుంటుంది.
2009 ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్ కు
శనిదశ నడిచింది. నిరాహారదీక్ష చేసి ఆయన రాజకీయ గ్రహాల్ని ప్రసన్నం చేసుకున్నారు. జగన్ కూడా కేసిఆర్
బాటలో నిరాహార దీక్షలు చేసి రాజకీయ శాంతి పూజలు జరిపితే కొన్ని సానుకూల ఫలితాలు
రావచ్చు.
జగన్ ఆమరణ దీక్ష చేసి
పునీతులైపోతుంటే చంద్రబాబు ఊరికే వుండలేరుకద! సీమాంధ్ర పోటీలో వుండాలంటే వారూ
పునీతులు కావాలి! జగన్ హైదరాబాదులో దీక్ష మొదలెడితే రెండురోజుల తరువాత చంద్రబాబు
ఢిల్లీలో దీక్ష మొదలెట్టవచ్చు. రేపు ఏ
లగడపాటి వంటివారో ఏకంగా సోనియా గాంధీ ఇంటి ముందు దీక్ష చేయవచ్చు. ఎలాగూ నాలుగు
రోజుల తరువాత పోలీసులు రంగప్రవేశంచేసి ఆత్మహత్య నిరోధక చట్టం నెపంతో
దీక్షాశిబిరాన్ని ఎత్తివేస్తారనే నమ్మకం రాజకీయాల్లో బలంగా పనిచేస్తోంది.
పోలీసుల్ని ఇంతగా నమ్మే సందర్భం మరొకటీ కనిపించదు. రాజకీయాల్లో రాజీనామాలు అనేవి
ప్రహసనంగామారి చాలా కాలమైంది. ఇప్పుడు ఆత్మాహుతులు, ఆమరణ నిరాహార దీక్షలూ కూడా ఆ
జాబితాలో చేరిపోతున్నాయి.
చంద్రబాబుతో పోలిస్తే జగన్
కున్న సానుకూల అంశం ఆయన ఇంతవరకు సియంకాదనేదే! నిజానికి చంద్రబాబా? జగనా? అనేది
కూడా నకిలీ ప్రతిపాదన (Spurious Choice) రాయలాంధ్రులు ఇప్పుడు
అంతకన్నా మెరుగైన ప్రత్యామ్నాయాల్ని అన్వేషించాలి.
విభజన విధివిధానాల గురించి
మాట్లాడడం అంటేనే, సమైక్యాంధ్ర సిధ్ధాంతాన్ని వదులుకున్నట్టే అనే భావోద్వేగంతో
సీమాంధ్ర ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఈ అంశాన్ని క్షమించరానంతగా నిర్లక్ష్యం
చేశారు. ఇప్పుడైనా ఈ అంశంపై విస్తృత చర్చ ఆరంభంకావాలి. ఒక కోరికల పట్టిక తయారు
కావాలి. వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం నుండి చట్టపరమైన హామీలు కావాలి. రాయలాంధ్ర
ఉద్యమం ఇక ముందు ఆ దిశగా సాగాలి.
సాగునీటితో మొదలెట్టి
ఉపాధికల్పన, రాజధాని నిర్మాణం వరకు చాలా చాలా అంశాలుంటాయి విభజన విధివిధానాల్లో.
ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కోరిక మేరకు మా
సభ్యుడొకడు ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేశాడు. అందులో, రైల్వేలు, నౌకాశ్రయాలు,
సహజవనరులు, జాతీయ విద్యా, వైద్య, సాంకేతిక విజ్ఞాన సంస్థలు, పారిశ్రామికవాడలు
తదితర అంశాలు వంద వరకు వున్నాయి. ఇంత కీలకమైన అంశాల్ని ఇంతకాలం మరిచిపోయామా
అనిపించింది. రాయలాంధ్రులకు
"సీమాంధ్రలో హైదరాబాద్ స్థాయి జీవనం,
హైదరాబాద్ లో సీమాంధ్ర స్థాయి భద్రత" అనేది ఆ ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్ సారాంశం.
సీమాంధ్రలో జీవనస్థాయిని పెంచడం
ఎంత అవసరమో, హైదరాబాద్ లో సామాజిక భద్రతను పాటించడం కూడా అంతే అవసరం. హైదరాబాద్ లో
స్థిరపడిన సీమాంధ్రుల భద్రత గురించి తెలంగాణ అగ్రనేతలు అనేక హామీలు ఇస్తున్నారు.
అవన్నీ ఆహ్వానించదగ్గవి. అయితే, దిగువ స్థాయిలో రాయలాంధ్రులు అప్పుడే
బెదిరింపుల్ని కూడా ఎదుర్కొంటున్నారనే అంశం తీసివేయదగ్గదేమీకాదు. తెలంగాణ నాయకుల
మధ్య అధికారం కోసం జరిగే పోటిలో సామాన్య రాయలాంధ్రుల్ని సహితం బలిపెట్టే
ప్రమాదాన్ని కొట్టిపడవేయలేం. దీని నివారణకు సామాజికంగానూ, చట్టబధ్ధంగానూ ఒక
ఏర్పాటు వుండాలి. తెలంగాణలోని ఉదారవాదులు దీన్ని ఒక చారిత్రక కర్తవ్యాంగా
భావిస్తారని ఆశిద్దాం!
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మోబైల్: 90102 34336 హైదరాబాద్
5 అక్టోబరు 2013
ప్రచురణ : సూర్య దినపత్రిక
6 అక్టోబరు 2013
No comments:
Post a Comment