అసలైన అజెండాకు అడ్డుకట్ట !
విభజన, సమైక్య ఉద్యమాల పుట్టుక
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
కొంత
యాధృఛ్ఛికంగానూ, కొంత ప్రయత్నపూర్వకంగానూ రాష్ట్రంలో విభజన, సమైక్య ఉద్యమాల
ఆరంభాన్ని దగ్గర నుండి చూసే అవకాశం నాకు కలిగింది. రెండు ఉద్యమాలు ఒక కొలిక్కి
వస్తున్న సమయంలో వాటిని ఒకసారి గుర్తుచేసుకోవడం మంచిది.
ఎన్టీ
రామారావును గద్దె దించిన తరువాత, సామాజిక వత్తిడిని తట్టుకోవడానికి చంద్రబాబు
వ్యూహాత్మకంగా హరికృష్ణను దగ్గరికి
తీశారు. ఎమ్మెల్యే కూడాకాని బామ్మర్దికి, విజయవాడ ప్రైవేటు బస్సు ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకుని రవాణాశాఖ ఇచ్చారు.
మరోవైపు, రాజకీయంగా స్థిరపడడానికీ, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికీ చంద్రబాబు
జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగులో పీజీ చేసిన కేసిఆర్ తన భాషా
ప్రావిణ్యంతో జన్మభూమీ నినాదాల్ని, పాటల్ని ఆకర్షణీయంగా మార్చి చంద్రబాబు దగ్గర
మంచి మార్కులు కొట్టేశారు.
హరికృష్ణ
చారిత్రక పాత్ర ఆరు నెలల తరువాత ముగిసిపోయింది. అప్పటి వరకు హరికృష్ణ ఆధీనంలోవున్న
రవాణాశాఖను 1996లో కేసిఆర్ కు
అప్పగించారు చంద్రబాబు. ఆ పదవిలో కేసిఆర్ 1999 నవంబరు
వరకు కొనసాగారు.
ఆకాలంలోనే,
పీపుల్స్ వార్ రెండో విడత తెలంగాణ ఉద్యమానికి నాందీ పలుకుతూ 1997 లో
ప్రజాకవి కాళోజీ నాయకత్వాన వరంగల్ డిక్లరేషన్
నిర్వహించింది. ఆ సదస్సులోనే ప్రొఫెసర్ జయశంకర్ ను ఉద్యమ కమిటీ కన్వీనర్ గా ప్రకటించారు. అంతకు
ఏడాది క్రితం, తెలుగుదేశం మంత్రిగా
శాసనసభలో సిక్స్ పాయింట్ ఫార్మూలా, ఉద్యోగుల జోనల్ విధానంపై ప్రసంగించిన కేసిఆర్ ,
అవి రెండూ రాష్ట్రప్రభుత్వంపై అనవసర ఆర్ధిక భారాన్ని మోపడమేగాక,
రాష్ట్రాభివృధ్ధికి అడ్దంకిగా మారుతున్నాయని విమర్శించారు. అయితే, వరంగల్
డిక్లరేషన్ తరువాత కేసిఆర్ ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆయన తెలంగాణ అంశం మీద
దృష్టి సారించారు. వివిధరంగాల్లో తెలంగాణ వెనకబాటుతనంపై పరిశోధనలు జరిపించడానికి
పూనుకొని, ఆ బాధ్యతను తనకు సన్నిహితులైన ఇద్దరు పాత్రికేయులకు అప్పచెప్పారు. ఆ
పాత్రికేయులు సెంటర్ ఫర్ సబ్ ఆల్ట్రన్ స్టడీస్ (సియస్ యస్) అనే ఒక పరిశోధనా
సంస్థను నెలకొల్పారు.
వ్యక్తిగతంగా
నాకు వరంగల్ డిక్లరేషన్ తోనూ, సియస్ యస్ తోనూ సంబంధాలున్నాయి. వరంగల్ సదస్సుకు
నేను ఆహ్వానసంఘ సభ్యుడ్నికాగా, సియస్ యస్ నిర్వాహకుడు కే నరసింహాచారి నాకు ఆత్మీయ
మిత్రుడు. 1998 ఫిబ్రవరిలో
ఆంధ్రప్రదేశ్ టైమ్స్ పత్రికను మూసేశాక, నేను కొంత కాలం సియస్ యస్ లో పనిచేశాను. ఆ
సంస్థ ప్రచురించిన ఆంగ్ల పత్రిక ’అండర్ కరెంట్’ కు సంపాదకుడిగానూ
వున్నాను.
రవాణాశాఖా
మంత్రిగా కేసిఆర్ అధికార నివాసం అప్పట్లో తార్నాక చౌరాస్తాలో వుండేది. ఆ
దగ్గర్లో లాలాపేట్ ఫ్లై ఓవర్ సమీపంలోని
శశాంక్ అపార్ట్ మెంట్స్ లో సియస్ యస్ కార్యాలయం వుండేది. ఇందులో, ఒక వైచిత్రి
ఏమంటే, సియస్ యస్ ఏర్పాటుకు అవసరమైన
నిధుల్ని, విజయవాడకు చెందిన ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ’అండర్ కరెంట్’ పత్రిక్కి వాణిజ్య
ప్రకటనల రూపంలో సమకూర్చారు.
1999 ఎన్నికల తరువాత
చంద్రబాబు, కేసిఆర్ ల మధ్య దూరం పెరిగింది. కొత్త మంత్రివర్గంలో కేసిఆర్ కు స్థానం
కల్పించలేదు. తాను మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కేసిఆర్ రాష్ట్ర విభజన
నినాదాన్ని అందుకున్నారని చంద్రబాబు పదేపదే అంటుంటారు. పార్టీని విడిచిపెట్టి
వెళ్ళిపొయిన కేసిఆర్ తో 2009 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న విషయాన్ని వారు తెలివిగా
దాస్తుంటారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం, 2008 విజయ దశమి రోజున కుదుర్చుకున్న ఆ ఎన్నికల
పొత్తు కోసం కేసిఆర్ కన్నా చంద్రబాబే ఎక్కువ ఆసక్తి కనపరచారు.
మంత్రి
పదవి దక్కనందుకు కేసిఆర్ అలగడం నిజమేగానీ, అప్పుడే తెలంగాణవాదాన్ని భుజాలకు
ఎత్తుకున్నారనడం వాస్తవంకాదు. 1999 ఎన్నికలకు దాదాపు
రెండున్నరేళ్ళు ముందుగానే తెలంగాణ ఉద్యమానికి అవసరమైన కసరత్తును కేసిఆర్
పూర్తిచేసి సిధ్ధంగా వుంచుకున్నారు. ఆ తరువాత ఏడాదిన్నరకు ఆయన తెలంగాణ రాష్ట్ర
సమితిని ఏర్పాటు చేశారు.
2004 ఎన్నికల్లో
కాంగ్రెస్ తో జతకలిసి వెలుగులోనికి వచ్చిన
తెలంగాణ రాష్ట్ర సమితి 2009 ఎన్నికల్లో
అనూహ్యంగా ఘోరపరాజయాన్ని చవిచూసింది. తెలంగాణలో 120 అసెంబ్లీ
స్థానాలుండగా ఆ పార్టికి కేవలం 10 స్థానాలు
మాత్రమే దక్కాయి. అందులోనూ ఏడు స్థానాలు కరీంనగర్, అదిలాబాద్ నుండే వచ్చాయి.
మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో చెరో స్థానం మాత్రమే దక్కింది. ఖమ్మం,
మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టికి ప్రాతినిధ్యం దక్కలేదు.
ప్రతిష్టాత్మక రాజధాని నగరం గ్రేటర్ హైదరాబాద్‌లో బోణీ కూడా కాలేదు. అత్యుత్సాహంగా
టిఆర్‌ఎస్ తో పొత్తుపెట్టుకున్న టీడీపీకి కూడా హైదరాబాద్‌లో దాదాపు పరిపూర్ణ
నిరాదరణే ఎదురైంది.
ఎన్నికల్లో
పరాజయం తరువాత సాక్షాత్తు తెలంగాణ భవన్ లోనే కేసిఆర్ అనేక విమర్శల్ని
ఎదుర్కొన్నారు. అనేక పరాభవాల్ని చవిచూశారు. దాదాపు ఆరు నెలల అవమాన ఘట్టం తరువాత
ఆయన చేపట్టిన నిరాహారదీక్ష పరిస్థితుల్ని తలకిందులుచేసి, టీఆర్‌ఎస్ ను మళ్ళీ
వెలుగులోనికి తెచ్చింది. 2011 డిసెంబరు 9 రాత్రి యూపియే ప్రభుత్వ హోం మంత్రి
చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభిస్తున్నామని ప్రకటించారు.
చిదంబరం
ప్రకటన వెలువడిన మరునాడు ఉదయమే రాయలాంధ్ర ప్రాంతం నుండి తొలుత స్పందించిన వ్యక్తి
వసంత నాగేశ్వరరావు. అప్పట్లో ఆబ్కాబ్ ఛైర్మన్‌గావున్న ఆయన తన పదవికి రాజీనామా
చేసి, మళ్ళీ "జైఆంధ్ర" ఉద్యమాన్ని మొదలెడతానని ప్రకటించారు. ఆ వేంటనే
చేగోండి హరిరామ జోగయ్య (హరిబాబు) కూడా "జైఆంధ్ర" అన్నారు.
జైఆంధ్ర
ఉద్యమంతోనూ నాకు ఒక అనుబంధంవుంది. ఆ వుద్యమంలో కాకాని వెంకటరత్నం, గౌతు లచ్చన్న,
తెన్నేటి విశ్వనాధం తదితరులు మొదటిశ్రేణి నాయకులు కాగా, యం. వెంకయ్య నాయుడు, వసంత నాగేశ్వరరావు
తదితరులు ద్వితీయశ్రేణి నాయకులు. అప్పట్లో కొంతకాలం క్రియాశీలంగావుండిన ఆంధ్రా
నిరుద్యోగ సంఘానికి అమ్మనమంచి కృష్ణశాస్త్రి అధ్యక్షుడు, నేను కార్యదర్శి.
వసంత
నాగేశ్వరరావు ప్రకటన వెలువడిన సాయంత్రమే, పాత అనుబంధంతో నేను మాదాపూర్ లోని అయన
ఇంటికి వెళ్ళాను. తెలంగాణ ఇచ్చేసిన తరువాత రాయలసీమ, తీరాంధ్ర ప్రజల హక్కులకు
పరిరక్షణ ఏమిటీ? అనేది మా ఆవేదన. వాటి సాధన కోసం విజయవాడ వెళ్ళి మళ్ళీ జైఆంధ్ర
ఉద్యమాన్ని మొదలెడదామనుకున్నాము. ఆ రోజు రాత్రే బయలుదేరి విజయవాడ వెళ్ళాము.
మరునాడు
విజయవాడ చేరుకున్న తరువాత సన్నివేశం మారింది. విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి
రాజగోపాల్ రాజీనామా చేశారని ఢిల్లీ నుండి
వార్త వచ్చింది. ఆయన కూడా "జై ఆంధ్రా" అంటారనే వుద్దేశ్యంతో నేను
మొగల్రాజపురంలోని రాజగోపాల్ క్యాంపు ఆఫీసుకు వెళ్ళాను. ఆయన అప్పటికి ఢిల్లీ నుండి
విజయవాడకు చేరుకోలేదు. ఎంపీ ఆఫీసులో అప్పటి కార్యదర్శి రామచంద్రరావు (నాని)
ఆంధ్రజ్యోతిలో నాకు సహోద్యోగి. రాజగోపాల్
ది ’జైఆంధ్ర’ బాటకాదనీ, ’సమైక్యాంధ్ర’ బాట అని నానీ
చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. "వాళ్ళే విడిపోదాం అంటున్నప్పుడు మనమూ
విడిపోతాం అనడంవల్ల ప్రయోజనం ఏమిటీ? మనం సమైక్యంగా వుంటామన్నప్పుడేకదా మన
డిమాండ్లు నెరవేరేవీ" అని రాజగోపాల్ ఆలోచిస్తున్నట్టు నానీ అన్నాడు.
తెలంగాణ
వుద్యమంలో ప్రస్తుత దశ 1997 లోనే మొదలైనప్పటికీ, అప్పటి వరకు
"సమైక్యాంధ్ర" అనేమాట ఎక్కడా ఎవరినోటా వినలేదు. అలాంటి అవగాహన కూడా
ఎవరికీ వున్నట్టు కనిపించలేదు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు రాయలసీమ, తీరాంధ్ర
హక్కుల సాధన పరిరక్షణ కోసం ఒక ఉద్యమం ఆరంభం కావలసిన చారిత్రక సందర్భంలో,
సమైక్యాంధ్ర నినాదాన్ని ముందుకు తేవడం అంటే సమస్యను పక్కదారిపట్టించడమే
అనిపించింది.
రాజకీయ
సంఘటన కుదరకపోయినా ఆలోచనాపరులైన పాత్రికేయుల సంఘటన అయినా కుదురుతుందనే నమ్మకంతో విజయవాడ ప్రెస్ క్లబ్ కు
వెళ్ళాను. పాతమిత్రులు చావ రవి, అన్నవరపు బ్రహ్మయ్య కలిశారు. నేనూ బ్రహ్మయ్య
వెంటనే పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసి, రాయలసీమ-తీరాంధ్ర హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడాము. దానితో
కొంచెం అగ్గిరాజుకున్నట్టు కనిపించింది. అదేరోజు రాత్రి ఏబిఏన్- ఆంధ్రజ్యోతి టీవీ
న్యూస్ ఛానల్ మా ఇద్దరితో ఓ ప్రత్యక్ష
చర్చా కార్యక్రమం కూడా నిర్వహించింది.
ఒక
వారం తరువాత నేను మళ్ళీ విజయవాడ వెళ్ళే సమయానికి సన్నివేశం అదుపుతప్పిపోయి వుంది.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులైన కొందరు హైదరాబాద్లో తమ ఆర్ధిక ప్రయోజనాలని
కాపాడుకోవడానికీ, తమ రాజకీయ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికీ ఒక ప్రణాళిక ప్రకారం
సమైక్యాంధ్ర పేరిట ప్రజల్లో బలంగా భావోద్వేగాలని రెచ్చగొట్టారు. నకిలీ రాజీనామాలు, నిరాహారదీక్షలు చేసి,
రాష్ట్ర విభజనను అడ్డుకోగలమని వీళ్ళు
ప్రజల్ని నమ్మించగలిగారు.
తక్షణం
కాకపోయినా సమీప భవిష్యత్తులోనయినా
అంధ్రప్రదేశ్ విభజన తప్పదన్న వాదనను
అంగీకరించడానికి ఎవరూ సిధ్ధంగాలేరు. ఆంధ్ర జర్నలిస్టుల ఫోరం ఏర్పాటుకు కూడా
మద్దతు దొరకలేదు. అంతకు ముందు సానుకూలంగా కనిపించిన అన్నవరపు బ్రహ్మయ్య కూడా నాతో
కొనసాగలేనని స్పష్టంచేసేశాడు.
ఈ
పరిణామాలు వసంత నాగేశ్వరరావు, కత్తి పద్మారావు తదితర జైఆంధ్రావాదుల్ని నిరుత్సాహ
పరిచాయి. విజయవాడలో సీనియర్ న్యాయవాది కర్ణాటి రామ్మోహనరావు వంటివారు జైఆంధ్ర
ఉద్యమానికి ప్రాణం పోయాలని చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. వాళ్ళు ముందుకు
తెచ్చిన ఆచరణాత్మక ప్రతిపాదనల్ని ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ల ఉపన్యాసాల్ని
అడ్డుకున్నారు. సభలపై దాడులు చేశారు. అయినప్పటికీ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో
దళిత, బహుజన నాయకులు ఉపస్రవంతి రాజకీయాలని ఏదో ఒకస్థాయిలో కొనసాగించారు. వాళ్ల
కార్యక్రమాల్ని ప్రధాన స్రవంతి రాజకీయాలు
అణిచివేశాయి. మీడియా అస్సలు పట్టించుకోలేదు.
రాయలసీమ-కోస్తాంధ్రాలో
తటస్థులు ఇంకో వాదనను అభివృధ్ధిచేశారు. మొదట్లో, ఒక ఎత్తుగడగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదలయ్యే జనసమీకరణ
క్రమంగా రాయలసీమా-తీరాంధ్ర హక్కుల సాధన ఉద్యమంగా మారుతుందనేది వారి వాదన సారాంశం.
గతంలోనూ అనేక ఉద్యమాలు ఎవోకొన్ని తక్షణ ప్రేరణలతో మొదలయ్యి, వుధృతం
అయ్యేకొద్దీ, భిన్నరూపం తీసుకున్న
సందర్భాలున్నాయి. రాయలసీమ- కోస్తాంధ్రా ఉద్యమంలోనూ అలాంటి మలుపు సంభవించవచ్చని
భావించినవాళ్ళలో నేనూ ఒకడ్ని. కానీ, ఆ
ప్రాంత ప్రజాప్రతినిధులు తాత్కాలిక ఎత్తుగడను శాశ్వితఎత్తుగడగా మార్చారు. రాయలసీమ-
కోస్తాంధ్రా పునర్నిర్మాణం అనేది ఇప్పటికీ ఎజెండాలోనికి రాకుండా అడ్డుకున్నారు.
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మోబైల్ ః 90102 34336
హైదరాబాద్
14 అక్టోబరు 2013
ప్రచురణ : ఆంధ్రప్రభ దినపత్రిక
16 అక్టోబరు
2013
No comments:
Post a Comment