Saturday 19 October 2013

నిన్నటి హీరోలు, నేడు?

నిన్నటి హీరోలు, నేడు? 

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)


వెండితెర సినిమా తీయడంలో కేవీ రెడ్డి, రాజకీయ నాటకం ఆడించడంలో సోనియా గాంధీ ఇద్దరిదీ ఒకటే శైలి! కథా, స్క్రీన్ ప్లే, సంభాషణలు, పాటలు వగయిరాల పూర్తి బైండు కాపీ తాయారవ్వడమేగాక, దాని ఆంగ్లానువాద నకలు సినీమాటోగ్రాఫర్ మార్కస్ బారట్లేకు చేర్చి, నటీనటులతో పూర్తిస్థాయి రిహార్సులు చేయించి, మొత్తం సినిమా నిడివి ఎంతో లెఖ్ఖవేసి, దానికి సరిపడా ముడి ఫిలిం దగ్గర పెట్టుకునిగానీ కెవీ రెడ్డి షూటింగ్ మొదలుపెట్టేవారుకాదట! సోనియా గాంధీది కూడా సేమ్ టూ సేమ్ పంథా!

ఢిల్లీ టెన్ జన్ పథ్ పరిణామాల్ని గమనించిన వాళ్ళెవరికైనా ఆంధ్రప్రదేశ్ విభజన స్క్రిప్టు కనీసం ఆరునెలల క్రితమే సిధ్ధం అయిపోయినట్టు సులువుగానే అర్ధం అవుతుంది. విభజన ప్రకటన చేశాక తెలంగాణ, సీమాంధ్రల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? వాటిని ఎలా అదుపుచేయాలి? వాటిమీద నివేదికని పార్టీ కమిటి ఎలా ఇవ్వాలీ? ఆ తరువాత అంతిమ నివేదికని కేంద్ర మంత్రుల బృందం ఎలా ఇవ్వాలీ? ఇవన్నీ ఎన్నడో సిధ్ధం అయిపోయిన విషయాలు.

సాధారణంగా అయితే కమిటీ వచ్చి, పరిస్థితుల్ని తెలుసుకుని వెళ్ళి  నివేదికను తయారు చేయాలి. కాంగ్రెస్ శైలి దీనికి భిన్నంగా వుంటుంది. నివేదిక తుది ప్రతి తయారు అయ్యాక కమిటీ వేస్తారు.  ఎలాగూ తుదిప్రతి తయారు అయిపోయింది కనుక, సంబంధిత వర్గాల్ని కలిసినా, కలవకపోయినా ఒకటే కనుక, కమిటి అసలు పర్యటనకే రాదు! ఇప్పుడు ఆంటోని కమిటి రాకుండానే, రాష్ట్ర విభజనపై కెబినెట్ తీర్మానం జరిగిపోయినట్టు రేపు మంత్రుల బృందం అంధ్రప్రదేశ్ కు రాకుండానే నివేదిక ఇచ్చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఐటీ విప్లవం వచ్చాక ప్రతీదీ వర్చ్యువల్ రియాలిటీగా మారిపోతున్నదిగనుక, మంత్రుల బృందం ఇంటర్నెట్ ద్వార భ్రాంతి పర్యటన చేయవచ్చు!!.

చంద్రబాబు ఉత్తినే కాంగ్రెస్ ను విమర్శిస్తుంటారుగానీ నిజానికి ఆయనదీ కాంగ్రెస్ శైలే! రాష్ట్ర విభజన అంశాన్ని తేల్చడానికి 2008లో వారు పార్టీ పోలిట్ బ్యూరో కమిటి ఒకదాన్ని వేశారు.  కే. ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు అందులో సభ్యులు. ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆ కమిటి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక మేరకు చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు. ఎర్రన్నాయుడు కమిటీ నివేదిక మేరకు చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారా? లేక చంద్రబాబు ఆదేశాల మేరకు ఎర్రన్నాయుడు కమిటి ఆ నివేదికను తయారు చేసిందా? అనేది వూహించడం పెద్ద కష్టం ఏమీకాదు!

ప్రజా ప్రతినిధుల వైఫల్యమో, కపటత్వమోగానీ రాజకీయ ప్రక్రియ ముందుకు సాగని ఫలితంగా, రాయలసీమ-తీరాంధ్ర  ఉద్యమం ఎన్జీవోల చేతుల్లోనికిపోయింది. ఏపీ ఎన్జీవోల నాయకుడు పరుచూరి అశోక్ బాబు ఒక్కరే యుధ్ధరంగంలో నిలిచారు. కానీ అప్పటికే అది ఓడిపోయిన యుధ్ధం. చనిపోయిన జీవి  దేహాన్నీ, ఓడిపోయిన యుధ్ధాన్నీ ఎక్కువ కాలం పరిరక్షించడం సాధ్యంకాదు!

ఎన్జీవోల ప్రపంచం చాలా చిన్నది. పైగా, ఎన్జీవోలు పుట్టుకరీత్యానే ప్రభుత్వంలో భాగం. ఆ పరిమితులు సహజంగానే వాళ్ళ నాయకత్వాన సాగిన ఉద్యమంలోనూ కొనసాగాయి. ఎన్జీవోల సమస్య జీతాల సమస్య, ప్రమోషన్ల సమస్య, జోన్ల సమస్య, పెన్షన్ల సమస్య వాళ్ళు పోరాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మీద. అలాంటిదే రాష్ట్ర రవాణా సంస్థ సీమాంధ్ర విభాగం ఉద్యోగుల సమస్య కూడా. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రవాణా సంస్థను నిర్వహించాలన్నది వాళ్ళ కోరిక. అది కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటమే.

సాక్షాత్తు ముఖ్యమంత్రే సచివాలయంలో కూర్చొని తానే పెద్ద సమైక్యవాదినని ప్రకటించుకుంటుంటే ఎన్జీవోలు, ఆర్టిసీ ఉద్యోగులు సేవ్ అంద్రప్రదేశ్ ఉద్యమాన్ని ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నట్టూ?. ప్రైవేటు బస్సు ఆపరేటర్లవల్ల ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని బందుపెట్టి, ప్రజారవాణా వ్యవస్థను రెండు నెలలుగా ప్రైవేటు ఆపరేటర్లకే అప్పచెప్పడం ఏం ఉద్యమం? ఏం వివేకం?

రాయలసీమ-తీరాంధ్ర  ప్రాంత సామాన్యప్రజల సమస్యలు ఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలకన్నా చాలా తీవ్రమైనవి. జటిలమైనవి. మౌలికమైనవి. రైతులు, విద్యార్ధులు, ఉద్యోగార్దుల సమస్యల్ని మరుగునపెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ల సమస్యల్ని ముందుకు తేవడం, కేంద్రప్రభుత్వం మీద చేయాల్సిన పోరాటాన్ని  రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంగా మార్చడం అమాయకత్వమైనా కావాలి, బూటకమైనా కావాలి.

తమ తమ సమస్యలకు ప్రభుత్వం నుండి పరిష్కారం దొరికేకొద్దీ వివిధ ఎన్జీవో సంస్థలు ఒకటొకటిగా రంగం నుండి తప్పుకుంటాయనీ, రాయలసీమ - తీరాంధ్రలో  రైతులు, విద్యార్ధులు, ఉద్యోగార్దుల్ని బలిపెట్టేస్తాయనీ   ఊహించలేనివాళ్ళు అమాయకులు. ఎన్జీవోలను హీరోలుగా పొగడ్తలతో ముంచెత్తినవాళ్ళు మరీ అమాయకులైనా కావాలి లేకపోతే మోసగాళ్లయినా కావాలి.    

  కష్టజీవుల పొరాటానికి విశ్రాంతజీవులు నాయకత్వం వహించకూడదు. వ్యవసాయ కూలీల పోరాటానికి రైతులు నాయకత్వం వహించకూడదు. అంధుల పోరాటానికి మెల్లకళ్లవాళ్ళు నాయకత్వం వహించకూడదు. మేకల పోరాటానికి తోడేళ్ళు నాయకత్వం వహించకూడదు. మన పోరాటానికి మనల్ని పాలిస్తున్నవాళ్ళు  నాయకత్వం వహించకూడదు. ప్రజల పోరాటానికి ప్రభుత్వ ఉద్యోగులు నాయకత్వం వహించకూడదు. ఈ ముక్క ముందుగా అన్నప్పుడు మిత్రులు చాలా మంది విరుచుకుపడ్డారు. భవిష్యత్తుని దర్శించేవాళ్ళు కొన్నితిట్లు తినక తప్పదు. ప్రభుత్వ వుద్యోగులు తమ హీరోలన్నారు. సీమాంధ్ర మంత్రి కోండ్రు మురళీకి ఇప్పుడు ఎన్జీవోలు "యూజ్ లెస్ ఫెలోస్" గా కనిపిస్తున్నారు.

బాధితుల సమస్యల్ని బాధితులు అర్ధం చేసుకున్నంతగా వెసులుబాటువున్నవాళ్ళు అర్ధంచేసుకోలేరు. ఏ పోరాటానికైనా అట్టడుగు బాధితులు నాయకత్వం వహించినపుడే లక్ష్యాలను సాధించే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. మనం ఎవరి మీద పోరాటం చేయాలో వాళ్లకే నాయకత్వం అప్పచెపితే ఎలాంటి ఫలితాలు వస్తాయో డిజిటల్ డిస్‌ప్లే‌లో చూపించారు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు.

భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను తీరాంధ్రలో కలిపే అంశం యంపి రాయపాటి సాంబశివరావు వంటివాళ్ళకు ఇప్పటికైనా గుర్తుకురావడం శుభసంకేతం.  తాము పోరాడాల్సింది కేంద్రప్రభుత్వం మీద అని రాయలసీమ-తీరాంధ్ర ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తించడం మొదలెట్టారు. ఆలస్యంగా అయినా ఇది శుభపరిణామం.          

అసలు సమస్య ఏమిటో తెలియకపోతే యుధ్ధం ఎందుకు చేయాలో అర్ధంకాదు. యుధ్ధం ఎందుకు  చేయాలో తెలియకపోతే, ఎవరితో యుధ్ధం చేయాలో అర్ధంకాదు. ఎవరితో యుధ్ధం చేయాలో తెలియకపోతే యుధ్ధం ఎలా చేయాలో అర్ధంకాదు. యుధ్ధం ఎలా చేయాలో అర్ధం కాకపోతే విజయాన్ని ఎలా సాధించాలో అర్ధంకాదు. విజయాన్ని ఎలా సాధించాలో అర్ధంకాకపోతే విజయం ఎప్పటికీ సాధ్యంకాదు.

ఇప్పటి రాయలసీమ-తీరాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ నాయకుల కపటత్వాన్నీ, ఎన్జీవో నాయకుల పరిమితుల్ని నేను పదేపదే చెప్పినమాట వాస్తవం. అలా చెప్పాల్సిన అవసరమూ వుంది. ఆ విషయంలో నా బాధ్యతను నేను సరిగ్గానే నిర్వర్తించాను. ఉద్యమాన్ని నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడం ఆలోచనాపరుల బాధ్యత. ఒక భయంకర ఉపద్రవం ముంచుకు వస్తున్నపుడు, దానికి కారణమైన వాళ్లనే రాయలసీమ-తీరాంధ్ర ప్రజలు చాలా కాలం నమ్మడంవల్ల సమస్య ఏమాత్రం పరిష్కారంకాకపోగా, తిరిగిరాబట్టుకోలేని విధంగా సమయనష్టం జరిగిపోయింది. ఇది బాధాకర పరిణామం.

ఇప్పటికైనా విభజనను ఆమోదిస్తే, విధివిధానాల్లో అయినా నష్టాల్ని చాలా వరకు నివారించుకునే అవకాశం రాయలసీమ-తీరాంధ్ర ప్రజలకు వుంటుంది. తెలివిగా వ్యవహరిస్తే మరిన్ని ప్రయోజనాలు సాధించుకునే అవకాశమూ వుంటుంది. అన్నిటికి మించి విభజన అనేది ఘర్షణాత్మకంగా కాక సామరస్యపూర్వకంగా జరిగే అవకాశమూ వుంటుంది.

నాయకత్వ సామాజికవర్గ స్వభావం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ఇంత వరకు సామాజికరంగంలో పెత్తనాన్ని సాగించడమేగాక, హైదరాబాద్ లో తమ వాణిజ్య లాభాల్ని పెంచుకోవడం కోసం రాయలసీమ-తీరాంధ్రల అభివృధ్ధిని నిలిపివేసిన సామాజికవర్గాల్నే ఇంకా నమ్మడం సరికాదు. ఒకసారి మోసం చేసినవాళ్ళు వందసార్లు మోసం చేయగలరు. కాలం చెల్లిన పాత పెత్తందారీ సామాజికవర్గాల్ని పక్కకు గెంటి కొత్త సామాజికవర్గాలు ముందుకు రావడానికి ఇది మహత్తర అవకాశం. కొత్త సామాజికవర్గాలు ముందుకు రానంత వరకు ఉద్యమంలో కొత్త విలువలు ముందుకురావు. కొత్త విలువలు, కొత్త సిధ్ధాంతాలు, కొత్త శక్తులు లేకుండా ఉద్యమాలే వుండవు.

తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి సామాజిక మార్పు జరిగిందా? అని ఎవరైనా అడగవచ్చు. అడగాల్సిన ప్రశ్నే ఇది. తెలంగాణలో కూడా విప్లవాత్మక మార్పులేవీ రాలేదుగానీ, సామాజిక సమీకరణలు చాలా వరకు మారాయి. పై అంతస్తుల్లో, చూసుకున్నా ఫోకస్ రెడ్ల నుండి వెలమల వైపుకు మళ్ళింది. రాజకీయ జేయేసి ఛైర్మన్ కోదండరామ్ సామాజికవర్గం రెడ్డే అయినా ఆయన సాంప్రదాయ రాజకీయ నాయకుడుకాదు; మేధావుల విభాగం నుండి వచ్చాడు. అనేక పౌరహక్కుల ఉద్యమాల్లో ఆరితేరిన కాయకర్త అతను. జయశంకర్, విమల, గద్దర్, అల్లం నారాయణ, బెల్లయ్య నాయక్ వంటి బలహీనవర్గాలు, వరవరరావు, హరగోపాల్, వేణుగోపాల్, బాలగోపాల్ వంటి ఆలోచనాపరులు ఇరుపైపుల నుండి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆలాంటి సమీకరణ రాయలసీమ-తీరాంధ్రలో లోపించింది. ఆ లోపమే అక్కడి ఉద్యమంలో ప్రతిఫలించింది. ఈ విషయంలో, తీరాంధ్రకన్నా రాయలసీమ ఉద్యమం కొంచెం మెరుగు. అక్కడి ఉద్యమంలో  మేధావులకు మరీ పెద్దపీట వేయకపోయినా చిన్న పీట అయినా వేస్తున్నట్టు కనిపిస్తోంది.

రాయలసీమ-తీరాంధ్రలో మేధావులు లేరనీ, ఒకవేళ వున్నా వాళ్ళంతా హైదరాబాద్ కు వలస పోయారనే వాదనా వుంది. ఇదీ తప్పే. రాయలసీమ-తీరాంధ్రలో ఆలోచనా పరుల అభిప్రాయాల్ని అక్కడి పాలకవర్గాలు నిర్దాక్షిణ్యంగా అణిచివేశాయి. ప్రకాశం జిల్లాలో బొక్క పరంజ్యోతి, గోసాల ఆశీర్వాదం, గుంటూరు జిల్లాలో దుర్గం సుబ్బారావు, విజయవాడలో కర్ణాటి రామ్మోహన రావు, దారా గోపి, ఏలూరులో గుండిమెడ రామచంద్ర శర్మ, రాజమండ్రిలో పెద్దాడ నవీన్ ఇలా చాలా మంది వున్నారు. వాళ్లను పట్టించుకున్నదెవరు. ఒంగోలు, చీరాల, గుంటూరు, విజయవాడ, రాజమండ్రిల్లో ఎవరైనా కొద్దిపాటి  భిన్నస్వరాన్ని వినిపించినా, వాళ్ళమీద దాడులు చేసిన సందర్భాలున్నాయి. కొత్త శక్తుల్ని రానీయకుండా కొత్త విలువలు ఎలా వస్తాయి. కొత్త విలువలు రాకుండా ఉద్యమంలో ఉత్సాహం ఎలా వుంటుంది?.

ప్రాంతీయ ఉద్యమాలన్నీ పెట్టుబడీదారీ ఉద్యమాలే. వాటిని సమర్ధించేవాళ్లకైనా, వ్యతిరేకించేవాళ్లకైనా ముందు ఈ స్పష్టత వుండాలి. ప్రాంతీయ, ఉపప్రాంతీయ పెట్టుబడిదారుల మధ్య అంతర్గతంగా వుండే పోటీ తీవ్రరూపం దాల్చిన ఫలితంగా విభజన - సమైక్య ఉద్యమాలు తలెత్తుతాయి. ప్రజల భుజాల మీద తుపాకులు పెట్టి ప్రాంతీయ, ఉపప్రాంతీయ పెట్టుబడిదారులు తలపడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో, ఇరుప్రాంతాల ప్రజల మధ్య ఐక్యతను సాధించడానికి నూతన ప్రజాసామ్యవాదులు ప్రయత్నించాలి. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ఇరుప్రాంతాల ప్రజాసామ్యవాదులూ, సామ్యవాదులు, కమ్యూనిస్టులు, విప్లవకమ్యూనిస్టులు అందరూ ఘోరంగా విఫలమయ్యారు.

సీమాంధ్రలో నాయకస్థాయి వున్నవాళ్లందరికి ఇప్పుడు ఒక విషయం క్షుణ్ణంగా తెలుసు; రాష్ట్రం విడిపోకతప్పదనీ. తెలియనట్టు నటిస్తున్నవాళ్ళు సమైక్యవాదులుగా చెలామణి అయిపోతున్నారు. ఉపద్రవం నష్టాలను తగ్గించేమార్గాల్ని  సూచించేవాళ్ళు విభజనవాదులుగా నిందల్ని మోస్తున్నారు. కేంద్ర మంత్రులు ఒకరొకరుగా సర్దుకుంటున్నారు. యంపీలు నిరంతర రాజీనామాయత్నాల్లో వుంటున్నారు. కొత్తనాయకత్వంముందుకు రాకపోతే, రైతులు, శ్రామికులు, ఉద్యోగార్ధులు, బలహీనవర్గాలు  మరోసారి మోసపోతారు!

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌: 90102 34336

హైదరాబాద్‌
 18 అక్టోబరు 2013

ప్రచురణ : సూర్య దిన పత్రిక
 20 అక్టోబరు 2013

No comments:

Post a Comment