Saturday 7 December 2013

Division, Votes and Seats

విభజన వెనుక ఓట్లు, సీట్లు, వ్యధలు  
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

        ఏనుగు నమిలే దంతాలను పైకి చూపించదు. పైకి చూపించేదంతాలతో నమలదు. కాంగ్రెస్ కు పార్టీ గుర్తుగానీ, ఎన్నికల గుర్తుగానీ  ఏనుగుకాదు; కానీ,  దాని నమిలే పాలసీ మాత్రం ఏనుగు దంతాలదే! అనుమానం వున్నవాళ్ళు పూటకొకటి చొప్పున జీవోయం విడుదలచేస్తున్న  ప్రకటనల్ని చూడవచ్చు.  కాంగ్రెస్ ఏం చెపుతోంది? అని అలోచించడం మొదలేడితే మనం తప్పులో కాలేసినట్టే! కాంగ్రెస్ ఏం ఆశిస్తోంది అని అని ప్రశ్నించుకుంటే ఎంతో కొంత సమాధానం దొరుకుతుంది.

        నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణను ప్రకటించినపుడు రాష్ట్రంలో సంకేతాలన్నీ ఆ పార్టీకి అనుకూలంగా కనిపించాయి. రాయలసీమ-తీరాంధ్రాలో కొంచెం ఇబ్బంది అయినా ఆ లోటును జగన్ ద్వార పూడ్చుకుంటారనే    ప్రచారం కూడా బలంగా సాగింది. ఇది నిజమో కాదోగానీ, దత్తపుత్రుడు విభజనపుత్రుడు సిధ్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది కాంగ్రెస్ కే చెందిన సీమాంధ్ర యం.పీ. లగడపాటి రాజగోపాల్.

        జీవోయం నోట్ ను  కేంద్ర మంత్రివర్గానికి సమర్పించేనాటికి సన్నివేశం చాలా మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెసుకు వీర విధేయుడిగా వుంటారనుకున్న కేసిఆర్ తల ఎగరేయడం మొదలెట్టారు. టిఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసేది లేదీ అని ప్రకటించేశారు. ఇది ధిక్కారంగానె కాంగ్రెస్ పెద్దలు భావించారు. తెలంగాణ ఇచ్చిన ఖ్యాతి కాంగ్రెస్ ఖాతాలో పడిపోవడం ఇష్టంలేని  బీజేపి ఎదో ఒక వంకతో దాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో వుంది. మా మద్దతు లేకుండా తెలంగాణ బిల్లు పాస్ కాదు అంటూ బీజెపి నాయకులు హెచ్చరిస్తూ వున్నారు. లోకసభలో  ప్రస్తుతమున్న సంఖ్యాబలం రీత్యా బీజేపి మద్దతు లేకుండా  తెలంగాణ బిల్లును తనంతట తానుగా గట్టెక్కించడం కాంగ్రెస్ కు సాధ్యం అయ్యేపనికాదు.

        రాయలసీమ – తీరాంధ్రాలో చంద్రబాబు, జగన్,  కిరణ్ కుమార్ రెడ్డిల సమైక్యాంధ్ర పోటీ హద్దులు మీరడంతో  కాంగ్రెస్ మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇన్ని సమస్యల్ని ఒకేసారి అధిగమించా కాంగ్రెస్ తన అంబులపోదినుండి రాయల- తెలంగాణ అస్త్రాన్ని బయటికి తీసి ప్రయోగించింది. కర్నూలు జిల్లా నుండి కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, అనంతపురం జిల్లా నుండి జేసి దివాకర రెడ్డి  చాలా కాలంగా రాయల తెలంగాణ జపం చేస్తూ వుండడం,  ఎంఐయం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహితం దానికి వత్తాసు పలకడం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది.

        రాయల-తెలంగాణ అస్త్రం కాంగ్రెస్ కు సర్వరోగ నివారిణిలా పనిచేసింది. 10 జిల్లాలకి బదులు 12 జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసే  అంశాన్ని జీవోయం పరిశీలిస్తున్నదన్న విషయం బయటికి రాగానే ఢిల్లీ నుండి ఏపీలో గల్లీ వరకు అల్లకల్లోలం చెలరేగింది. తెలంగాణలో మూడు నెలలుగా కొనసాగుతున్న విజయోత్సాంహంతో కాంగ్రెస్ ను ధిక్కరించే వరకు సాహసించిన కెసిఆర్ కాళ్ళ కింద భూమి రాయల-తెలంగాణ ప్రతిపాదనతో కూలిపోయింది. చేజారుతున్న పరువును నిలబెట్టుకోవడానికి వారు  మళ్ళీ దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది.

        సీమాంధ్రలో ప్రస్తుతం దూసుకుపోతున్నట్టు కనిపిస్తున్న జగన్ కు రాయల-తెలంగాణ బాణం తగలరాని చోట తగిలింది. ముందు రాయలసీమ నాయకుడనిపించుకుని, తర్వాత సీమాంధ్ర నాయకుడు అనిపించుకుంటున్న జగన్ కు సగం రాయలసీమ లేకుండా పోవడం అంటే రాజకీయంగా అది హత్యకన్నా తక్కువదేంకాదు. సమైక్యాంధ్ర నినాదాన్ని కాస్సేపు పక్కన పెట్టి, రాయలసీమను చీల్చవద్దూ అని  విలపించేస్థితికి   జగన్  చేరుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ పేరును తెలంగాణగా మార్చే  వరకు  వారు వెళ్ళారు.  

        సీమాంధ్రబరిలో సాగుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబులది కూడా రాయలసీమే కావడంతో  వాళ్ళు జగన్ కన్నా ఎక్కువగా గిలగిల్లాడిపోయారు.  సమైక్యాంధ్ర హార్డ్ హిట్టర్ గా భావిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఆతృతగా సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఫోన్ చేసి రాయలసీమ విభజనను అడ్డుకోండని కోరాల్సి వచ్చింది. 

        జాతీయ రాజకీయాల్లో యూపియే ప్రధాన ప్రత్యర్ధి ఎన్డీయే శిబిరంలోనూ “10-12” కలవరం సృష్టించింది. రాయల-తెలంగాణ ఇస్తే యంఐయం బలపడిపోతుందని రాష్ట్ర బీజేపి నేత కిషన్ రెడ్డి తమ ఆందోళనని బయట పెట్టారు. బీజేపి జాతీయ నేతలు హెచ్చరికలు మానేసి,  పది జిల్లాల తెలంగాణ అయితే మేము మద్దతు ఇస్తాము అని దౌత్య సందేశాలు పంపించారు. లోక్ సభలో బీజేపి పక్షనేత సుష్మాస్వరాజ్ అయితే ఒక అడుగు ముందుకేసి, పార్లమెంటు శీతాకాల సమావేశాల కార్యక్రమ పట్టికలో తేలంగాణ బిల్లు ఎందుకు లేదని ప్రశ్నించారు.

        ఈ వివాదానికి గులాం నబీ ఆజాద్ ముగింపు పలికారు. రాయల తెలంగాణ వద్దేవద్దని పది జిల్లాల తెలంగాణనే కాంగ్రెస్ వాగ్దానం చేసింది కనుక దానికే కట్టుబడి వుండాలని జోవోయంకు ఆజాద్  ఒక డిసెంట్ నోట్ పంపించడమే గాక దాన్ని మీడియాకు లీకు చేశారు. అంతిమంగా, పది జిల్లాల, 17 లోక్ సభ నియోజకవర్గాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల తెలంగాణనే కేంద్ర కేబినేట్ ఆమోదించింది.

        ఒక్కమాటలో చెప్పాలంటే,  గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి పార్టి, ప్రతి నాయకుడు అచ్చంగా కాంగ్రెస్ స్క్రిప్టు ప్రకారమే ప్రవర్తించారు. కాంగ్రెస్ కోరుకున్న ప్రకటనలే చేశారు.  అంతకన్నా నిజం ఏమంటే, కాంగ్రెస్ అధిష్టానం అసలు ఎన్నడూ రాయల-తెలంగాణ గురించి ఆలోచనే చేయలేదు. గాడితప్పిన స్వపక్షాన్నీ, మిత్రుల్ని, విపక్షాల్ని,  గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ సృష్టించిన మాయావాదం ఇది.

        సీమాంధ్ర ప్రజలు అన్ని విధాలా మోసపోయారు.  వాళ్లను వాళ్ల ప్రతినిధులు మోసం చేశారు. వాళ్ల ప్రతినిధుల్ని ఢిల్లీ పెద్దలు మోసం చేశారు. కాంగ్రెస్ వరకు ఈ సూత్రమే వర్తిస్తుంది.  తాము అన్ని విధాలా కాంగ్రెస్ కు భిన్నమని చెప్పుకునే  తెలుగు తమ్ముళ్ళు కూడా సీమాంధ్రకు సానుకూలంగా చేసింది ఏమీలేదు. వాళ్ళు కూడా ఇష్టంగాగానీ, అయిష్టంగాగానీ తెలంగాణ నాయకులు ఆడమన్నట్టే ఆడారు.  రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాణప్రదమైన గత  నాలుగేళ్ళ కాలంలో సీమాంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సంఘటన ఒక్కటీ లేదు. ప్రతి కీలకమైన సందర్భంలోనూ వారు ఎదో ఒక ద్వితీయ ప్రాధాన్య అంశాన్ని తీసుకుని అందులో తలమునకలై వుండిపొయేవారు. కేంద్ర మంత్రివర్గం తెలంగాణ బిల్లును ఆమోదిస్తున్నపుడు కూడా  రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత బ్రిజేష్ కుమార్ కృష్ణాజలాల ట్రిబ్యూనల్ తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

        మరో మాటల్లో చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది కేసిఆర్ కు సింగిల్ పాయింట్  ప్రోగ్రాం అయినట్టు,  సమైక్యాంధ్ర పరిరక్షణను సింగిల్ పాయింట్ కార్యక్రమంగా చేసుకున్న నాయకుడు ఒక్కడూ సీమాంధ్రలో కనిపించరు.  సీమాంధ్రకు చివరి క్షణం వరకూ ఉద్యమ నాయకత్వం, ఉద్యమ కేంద్రం రెండూలేవు.  సీమాంధ్ర నాయకులందరికీ సమైక్యాంధ్ర ఉద్యమం పార్ట్ టైం వ్యాపకం మాత్రమే! వాళ్ల  అసలు వ్యాపకాలు వేరే వున్నాయి. పైగా, వాళ్లందరికీ రాష్ట్ర విభజన జరిగిపోతున్నదని స్పష్టంగా తెలుసు.  సీమాంధ్ర నాయకులందరూ రేపు ఏర్పడే రాష్ట్రంలో తమ స్థానాన్ని రిజర్వు చేసుకోవడానికే తమ శక్తియుక్తులన్నింటినీ ధారబోశారేతప్ప, విభజనను ఆపడానికి ప్రాణాలొడ్డి పోరాడాలని వాళ్ళు ఎన్నడూ అనుకోలేదు. రేపటి ప్రభుత్వంలో తమ స్థానం కోసం వాళ్ళు కనపర్చిన ఆతృతలో కొంతైనా  తమ నేలతల్లి హక్కుల పరిరక్షణ కోసం కనపర్చివుంటే, ఆంధ్రప్రదేశ్ విభజన సీమాంధ్రకు ఇంత విషాదంగా వుండేదికాదు.
 
       
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్ : 90102 34336
హైదరాబాద్
7 డిసెంబరు  2013

ప్రచురణ : సూర్య దినపత్రిక, ఎడిట్ పేజీ, 8 డిసెంబరు 2013



No comments:

Post a Comment