Tuesday 18 February 2014

కరిగిన కల – కళ్ళెదుట నిజం!

కరిగిన కల – కళ్ళెదుట నిజం!   

ఏ. యం. ఖాన్ యజ్దాని (డానీ)


  తెలంగాణ అవిర్భవించింది. సమైక్య తెలుగురాష్ట్రం అధ్యాయం ముగిసింది.  ఇప్పుడు ఆరంభం అవ్వాల్సింది సీమాంధ్ర హక్కుల సాధన ఉద్యమం.

  తెలంగాణ అకాంక్ష  దాదాపు ఆరు దశబ్దాలుగా ఆ ప్రాంత ప్రజల్లో కొనసాగుతోంది, తరచూ  ప్రశాంతంగానూ, అంతర్లీనంగానూ, అప్పడప్పుడు వుధృతంగానూ కొనసాగిన ఆ వుద్యమం అంతిమంగా గమ్యానికి చేరుకుంది. సీమాంధ్రలో హక్కుల సాధన వుద్యమం చాలాకాలం క్రితమే ఆరంభం కావల్సివుండింది. కానీ, దాన్ని సమైక్యాంధ్ర భావుకత మింగేసింది.

  ప్రతి ఉద్యమంలోనూ సహజంగానే భావోద్వేగాలుంటాయి. ప్రజల భావోద్వేగాలని ఆచరణ సాధ్యమైన కోరికలుగా మార్చి, ఉద్యమాన్ని గమ్యానికి చేర్చడమే నాయకత్వం చేయాల్సినపని.  కేవలం భావోద్వేగాలు ఎన్నడూ ఏ ఉద్యమాన్నీ గమ్యానికి చేర్చలేవు. భావోద్వేగాలు ఆచరణాత్మక కోరికలుగా మారి, వాటికి సర్వత్రా ఆమోదాంశం లభించినపుడే అవి గమ్యం చేరుకోవడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తెలంగాణ ప్రజల  భావోద్వేగాల్ని  "నీళ్ళు, నిధులు, నియామకాలు" అనే మూడు లౌకిక కోరికల రూపంలోనికి మార్చింది ఆచార్య జయశంకర్. దాన్ని గమ్యానికి చేర్చింది కేసిఆర్. ఈ సుదీర్ఘ ప్రక్రియకు తోడ్పడిన పాత్రధారులు, సూత్రధారుల జాబితా చాలా పెద్దదేవుంది.

  రాయలసీమ, తీరాంధ్ర ప్రజలకూ లౌకిక కోరికలు అనేకం వున్నాయి. విద్యా, వైద్య సౌకర్యాలు, ఉపాధికల్పన అవకాశాలు, సాగునీటి హక్కుల పరిరక్షణ మొదలయిన జాబితా చాలానేవుంది. మొదటి నుండీ రాజధాని అంశంతోసహా ఈ ఆంశాలన్నింటినీ చాలా మంది ప్రస్తావిస్తూనే వున్నారు. కానీ, హఠాత్తుగా ఎగువ నుండి సమైక్యవాదం ప్రవేశించి, లౌకిక కోర్కెల్ని తుఛ్ఛమైనవిగా కొట్టిపారేసి,  భావోద్వేగాలని రెచ్చగొట్టింది. అయినప్పటికీ ఆర్థిక అంశాల్ని చాలామంది చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూనే వచ్చారు. పైన్నుండి దిగిన సమైక్యాంధ్ర హోరులో వాళ్ళ గొంతు అణగారిపోయింది.

  సమైక్యవాదం అంటేనే తెలీని సీమాంధ్రులకు తానే దాన్ని నేర్పించానని  నిన్నమొన్నటి వరకు ఒకాయన గొప్పగా చెప్పుకునేవారు. ప్రస్తుతం వారు రాజకీయ సన్యాసం తీసుకున్నారు కనుక వారి విషయాన్ని వదిలేసి ఈ నినాదంలోని బూటకాన్ని ఇప్పుడైనా విశ్లేషించుకోవాల్సిన అవసరం వుంది. సమైక్యవాదాన్ని సీమాంధ్రులకు నేర్పాలనుకోవడమే  మొదటి తప్పు.  సమైక్యం అన్నప్పుడు అన్ని ప్రాంతాలవారినీ కలుపుకోగలగాలి ఒక ప్రాంతానికే పరిమితమైనపుడు సమైక్యానికి అర్ధమేవుండదు. అర్ధమేలేనిది ఎన్నడూ విజయాన్ని సాధించదు.   సమైక్యాంధ్ర అనడం మరో తప్పిదం. ఆంధ్ర అనే పదానికి చరిత్ర  పాఠాల్లోంచి ఉదాహరణలు చూపి ఎంత విస్తృత అర్ధాన్నైనా ఇవ్వవచ్చు.గానీ  ఉద్యమాల్లో చరిత్రకన్నా వర్తమాన అవసరాలే బలంగా పనిచేస్తుంటాయి. ఒకవైపు తెలంగాణవాళ్ళు తమ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నపుడు, మరోవైపు, కోస్తాతోకన్నా  తెలంగాణతో కలిసి రాయల తెలంగాణగా ఎర్పడడమే మేలు అని రాయలసిమవాళ్ళు  బాహాటంగా ప్రకటిస్తున్నపుడు ఆంధ్రా అనే పదం సంకుచితమైపోతుందని గమనించకపోవడం ఘోరతప్పిదం.

సీమాంధ్ర అనే పదం కూడా సమగ్ర ప్రాతినిథ్యం వహించేదికాదు. ఇందులో ఆంధ్రా ఒక్కటే నిర్ధిష్ట నామవాచకం. సీమ అనేది రాయల సీమకు మాత్రమే ప్రత్యేకంగా ప్రాతినిథ్యం వహించే పదం ఏమీకాదు. సీమ అంటే కోనసీమ కావచ్చు, పట్టిసీమ కావచ్చు, నడిగడ్డసీమ కావచ్చు రాయలసీమ కూడా కావచ్చు.  ఇంతకీ సీమాంధ్రలో సీమ అంటే రాయలసీమ అనుకుంటే ఆంధ్ర అనేది కోస్తా ప్రాంతమనేగా అర్ధం. మూడు ప్రాంతాలు కలిసికట్టుగా ఒక రాష్ట్రంగా వుండాలనుకున్నప్పుడు ఒక ప్రాంతం పేరునే మిగిలిన ప్రాంతాలకు ఎలా పెడతారూ? ఒకవైపు రాయల తెలంగాణ అంటున్నపుడు రాయల ఆంధ్రా అంటే బాగుండేది. ప్రస్తుతం  సీమాంధ్రగా పిలుస్తున్న ప్రాంతాన్ని ఇక ముందయినా  రాయలాంధ్ర అనిపిలవాలి. 1956 లో ఏర్పడిన  ఆంధ్రప్రదేశ్ పేరులో తెలంగాణకి ప్రాతినిథ్యం లేకపోవడం కూడా విభజన ఉద్యమం తలెత్తడానికి అనేకానేక కారణాల్లో ఒకటి.

  అయితే,  ఆర్ధిక, లౌకిక దృక్పథాలతోనేకాక, భావోద్వేగాలతో సమైక్యవాదాన్ని నమ్మినవాళ్ళూ తప్పకవుంటారు. దాన్ని  బూటకం అంటే వారి మనోభావాలు నిజంగానే దెబ్బతినవచ్చు.  అలాంటి వారికి ఒక మనవి. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడ్డాక   ఏపి ఎన్జీవోల సంఘ నాయకులు ఏం చేస్తున్నారో గమనిస్తే చాలు ఈ నినాదం బూటకం సులువుగా అర్ధం అవుతుంది. సందట్లో సడేమియాలా, రాష్ట్రం విడిపోక ముందే అలవెన్సులతోపాటూ ఉద్యోగ విరమణ వయస్సును కూడా  పెంచుకోవాలనే ఆతృతలో ఏపి ఎన్జీవో నాయకులు  తీరికలేకుండా వున్నారు. వారం క్రితం వరకూ వాళ్ళే  సమైక్యవాదానికి "రియల్ హీరోలు" చెలామణి అయ్యారు.

  తెలంగాణలో ప్రజల ఆకాంక్షల్ని ఆ ప్రాంత నాయకులు  ఉద్యమ డిమాండుగా మారిస్తే, రాయలాంధ్రలో ఆ ప్రాంత నాయకులు తమ కోరికల్ని ఉద్యమ డిమాండుగా మార్చారు. ప్రధానంగా ఈ అంశమే విభజన, సమైక్య ఉద్యమాల భవిష్యత్తుని నిర్ణయించింది. ప్రజలు రాయాల్సిన చరిత్రను పాలకవర్గాలు రాశాయి.  పాలకవర్గాలు రాసిన చరిత్రకు అనేక వెర్షన్లు వున్నాయి. ఒక వెర్షన్ ప్రకారం ఈ కథ 2004 ఎన్నికలకు ముందు మొదలై 2014 ఎన్నికల ముందు ముగిసింది. ఇంకో వెర్షన్ ప్రకారం 2009లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి పుట్టిన రోజున ఆరంభమై, 2014లో టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ పుట్టిన రోజున ( మరీ కఛ్ఛితంగా చెప్పాలంటే ఆ మరునాడు) ముగిసింది. మూడో వెర్షన్ ప్రకారం ఈ కథ రాజకీయ నాయకునిగా మారిన సీమాంధ్ర పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ సమైకాంధ్ర భావోద్వేగాన్ని సృష్టించడంతో  మొదలై, ఆయన రాజకీయసన్యాసంతో ముగిసింది.

ప్రతి జాతినీ ఉధ్ధరించడానికి ఒక అంబేడ్కర్ పుట్టినట్టు ప్రతిజాతిలోనూ దాన్ని అప్రతిష్టపాలు చేయడానికి  "ఖాసిం రిజ్వీ" ఒకడు పుడుతుంటాడు. దురదృష్టావశాత్తు రాయలాంధ్రలో చాలామంది ఖాసీం రజ్వీలు పుట్టారు. ఆ పలితాలని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం.

  విభజన ప్రక్రియ మొదలయ్యాక రాజధాని ఎక్కడ? నిధులెక్కడా? ఉద్యోగాలు ఎక్కడా? నీళ్ళెక్కడా?  అని నిన్నటి మహానాయకులంతా ఇప్పుడు అమాయిక ముఖం పెట్టి ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇంతకు ముందే ఈ ప్రశ్నల్ని అడిగినవాళ్లను  ఈ మహానాయకులే  విభజనవాదులని ముద్రవేసి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. "సమైక్యవాదం నినాదంకాదు; విధానం" అంటూ విరుచుకుపడ్డారు.  ఇందులో ఆసక్తికర అంశం ఏమంటే రాయలాంధ్రలో సమైక్యవాదానికి భిన్నమైన స్వరాన్ని వినిపించినవాళ్ళలో అత్యధికులు ఎస్సీ, యస్టీ, బీసీ, మతాల్పసంఖ్యాక వర్గాలవాళ్ళు.. విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశిస్తున్నపుడు అంతిమ పోరాటంగా ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన మహాధర్నా వేదిక నుండి మాట్లాడుతూ,  కిషోర్‌చంద్రదేవ్, పనబాక లక్ష్మీ, చింతా మోహన్‌లను క్షమించేదిలేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు డొక్కా మణిక్యవరప్రసాద్, పీ. బాలరాజు కూడా సమైక్యవాదుల ఆగ్రహానికి గురయ్యారు. దీనినిబట్టి రాయలాంధ్రలో  సామాజికవర్గాల విభజన ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించడం కష్టం ఏమీకాదు. ఇప్పటివరకు  రాయలాంధ్రను వరకు ఏలినవారి హోరు చల్లబడింది కనుక సమీప భవిష్యత్తులో అక్కడ బలహీనవర్గాల గొంతు బలంగా వినిపించవచ్చు.

సీమాంధ్రలో ఇప్పటివరకు సాగినదానికన్నా రసవత్తరమైన  రాజకీయం ఇక ముందు వుధృతం కానుంది. వారం క్రితం వరకూ  సమైక్య ఆదర్శాన్ని వల్లించినవాళ్ళు సహితం ఇప్పుడు "తేడావస్తే రక్తపాతం సృష్టిస్తాం" అంటున్నారు. సంయుక్త తెలుగు రాష్ట్రంలో  నిన్నటి వరకు హైదరాబాద్ కోసం సాగిన యుధ్ధం ముగిసి, ఇప్పుడు రాయలాంధ్రలో రాజధాని నగరం కోసం పోరు మొదలయింది. రాయలసీమ _ కోస్తాంధ్ర ప్రాంతంలో రాజధాని నగరం అనగానే గుర్తుకు వచ్చే నగరాలు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. ఇవికాక, విస్తారమైన ప్రభుత్వ భూములున్న అనేక పట్టణల పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రతి పట్టణానికీ తనదైన చరిత్ర,, సంస్కృతి, భౌగోళిక సౌకర్యాలేకాక, రాజకీయ కోణాలు సామాజికవర్గాల సమీకరణలు వున్నాయి. కొందరయితే తిరుపతి, వినుకొండ విషయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా తమ వాదనకు వత్తాసుగా ఉటంకిస్తున్నారు. 



రాయలాంధ్రులకు హైదరాబాద్ ఒక అందమైన కలేకావచ్చుగానీ, అదినేర్పిన కొన్ని చేదు పాఠాలున్నాయి.  అభివృధ్ధి కేంద్రీకరణ సృతి మించితే, అది అసమానతలకూ వివాదాలకూ, వినాశనానికి దారి తీస్తుందని హైదరాబాద్ అనుభవం చాటిచెప్పింది. మళ్ళీ ఆ పొరపాటు జరగ కూడదు. కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటూ ఉత్తర సర్కారు, రాయలసీమ ప్రాంతాల అభివృధ్ధికి ప్రత్యేక ప్యాకేజీలు రానున్నాయి. ఒక ప్రాంతంలో అభివృధ్ధి ప్యాకేజీలు, మరో ప్రాంతంలో సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ఇంకో ప్రాంతంలో హైకోర్టు, మరోచోట జాతీయ విద్యాసంస్థలు నిర్మిస్తే అన్ని జిల్లాలూ సమానాభివృధ్ధి సాధించేందుకు వీలుంటుంది. ఇప్పుడు రాయలాంధ్రులు ఈ దిశగా ఆలోచన సాగించాలి. "తేడాలొస్తే ఫ్యాక్షనిజాన్ని పునరుధ్ధరిస్తాం" అని రెచ్చగొట్టేవాళ్ళు ఎప్పుడు వుంటారు. ఇప్పుడు కావల్సింది రెచ్చగొట్టే ప్రసంగాలుకాదు.; సమిష్టిగా అభివృధ్ధిని సాధించడం. మనలో చాలా మంది ఇన్నాళ్ళూ కళ్ళు తెరచి చూడలేదుగానీ అభివృధ్ధిలో కొత్తపుంతలు తొక్కగల వనరులన్నీ రాయలాంధ్ర గడ్ద మీద వున్నాయి.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

విజయవాడ
24   ఫిబ్రవరి  2014

ప్రచురణ :
ఆంధ్రప్రభ, ఎడిట్ పేజి, 26 ఫిబ్రవరి 2014


No comments:

Post a Comment