యుధ్ధము ముగియలేదు ప్రభూ!;ఇప్పుడే ఆరంభము అయినది !!
ఉషా యస్ డానీ
వానపాముని చూపించి అనకొండ అనిపించడానికీ, ఎలుకను చూపించి డైనోజార్ అనిపించడానికీ, కూలీల్ని చూపించి అంతర్జాతీయ స్మగ్లర్లు అనిపించడానికీ, ఒక వాస్తవాన్నీ అబద్దం చేయడానికీ, ఒక అబధ్ధాన్ని నిజం అనిపించడానికీ సమస్త అధికారగణాలన్నీ ఇప్పుడు ఏకం అవుతున్నాయి.
అందరికీ తెలుసు వాళ్ళు చెట్లు నరికే కూలీలని. అందరికీ తెలుసు
స్మగ్లర్లు ఎండాకాలం అడవిలో గోచి చుట్టుకుని, గొడ్డళ్ళుపట్టి, చెమట కక్కుకుంటూ చెట్లు నరికే శ్రమజీవులు కారనీ. వాళ్ళు
కాళ్లకు చెప్పులు, ఒంటి మీద చొక్కాలు లేని కడుపేదరికంలో వుండరనీ. అందరికీ తెలుసు
ఎర్రచందనం స్మగ్లర్లు చెన్నైలోనో, బెంగళూరులోనో నక్షత్రాల హోటళ్లలో విలాసాలు చేస్తుంటారని. వాళ్ళు దొరికితే మారిషస్ లోనో, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో రాజభోగాలు అనుభవిస్తూ వుంటారని.
ఎర్రచందనం వృక్షాలు ప్రపంచంలో నల్లమల
అడవులు విస్తరించిన నాలుగు జిల్లాలకే ప్రత్యేకం అయినా వాటి ఉపయోగాలు గురించి పదేళ్ల క్రితం వరకు మన రాష్ట్రంలో ఎవరికీ తెలీదు. ఎర్రచందనానికి సంబంధించి ఇటీవల బయటపడిన రెండు ప్రధాన ఉపయోగాల్లో మొదటిది దీని పొడిని అణువిద్యుత్ కేంద్రాల్లో వినియోగిస్తున్నారనేది. రెండో ప్రయోజనం అంతకన్నా ఆసక్తికరమైనది. ఎర్రచందనం పొడికి లైంగిక పటుత్వాన్ని పెంచే గుణం (Aphrodisiac) వుందనేది.
దీనికి శాస్త్రీయ ప్రతిపత్తి వుందో లేదోగానీ, జపాన్ లో మాత్రం ఈ నమ్మకం బలంగావుంది. లైంగిక ఆసక్తి అతితక్కువగల దేశంగా జపాన్ ను పేర్కొంటూ ద గార్డీయన్, వాషింగ్ టన్ పోస్ట్ పత్రికలు రెండేళ్లక్రితం రెండు సంచలన కథనాలు ప్రచురించాయి. ఎర్రచందనం కోసం జపాన్ చూపుతున్న ఆసక్తిని గమనిస్తే ఈ కథనాలు నిజమే అనిపిస్తాయి. స్మగ్లర్ల ద్వార దొంగమార్గంలోకొన్నా,
ప్రభుత్వం ద్వార రాజమార్గంలో కొన్నా ఎర్రచందనం ప్రధాన దిగుమతిదారుడు మాత్రం జపానే.
ఇప్పుడు ఎర్రచందనం నిల్వలకు మరో ప్రాధాన్యం వచ్చింది. రాష్ట్రంలో హైదరాబాద్ ను మించిన రాజధాని నగరాన్ని కట్టాలని చంద్రబాబు కన్న కలల మీద నరేంద్ర మోదీ చల్లటి మంచునీళ్ళు చల్లారు. చంద్రబాబు ఇప్పుడు రాజధాని ఆశలన్నీ ఎర్రచందనం మీదే పెట్టుకున్నారు! జపాన్, చైనాలకు ఎర్రచందనాన్నీ అమ్మి రాజధాని నిర్మాణానికి నిధుల్ని
సమీకరించుకునే పనిలో వారున్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో తమకూ అవకాశం ఇవ్వాలని జపాన్ కూడా సింగపూర్ తో పోటీ పడుతోంది. అలా నల్లమల టూ జపాన్, జపాన్ టూ అమరావతి అంటూ ఒక రక్తచందనపు దారి ఏర్పడింది. గిరాకీ పెరగడంతో, ఏపీ రాజధాని నిర్మాణం ఎర్రచందనం కూలీల చావుకు వచ్చింది. అమరావతిలో భూమిపూజ జరగడానికి ముందే శేషాచలంలో ‘నరబలి’ జరిగిపోయింది!.
ఉత్తర తమిళనాడులోని వేలూరు, ధర్మపురం, విల్లుపురం, సేలం, తిరువణ్ణామలై జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలు. ఎర్రచందనం స్మగ్లర్లు సాధారణంగా ఈ జిల్లాల కూలీలనే నల్లమల అడవుల్లో చెట్లు నరకడానికి తీసుకుని వస్తుంటారు. సేలం జిల్లాలో కొండప్రాంతమైన యేర్కాడ్ వుడ్ కట్టర్లు కాఫీతోటల్లో సిల్వర్
ఓక్ చెట్లను నరకే వృత్తిని శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. వేగంగా
చెట్లు నరకడం, వాటి బెరడు తొలగించడం, బరువైన
దుంగల్ని భజాలకు ఎత్తుకుని కొండలు, గుట్టలు ఎక్కడం వగయిరా పనుల్లో వీరు నిపుణులు. ఈ పనుల్లో మాలవైమక్కళ్ అనే గిరిజన తెగ వాళ్లది అగ్రస్థానం. యేర్కాడ్ లో వాళ్లకు ఘనపు అడుక్కి 30 రూపాయల కూలీ వస్తుంది. ఎర్రచందనం చెట్లు నరకడానికి కూలీ పది రెట్లు ఇస్తామని స్మగ్లర్ల బ్రోకర్లు వాళ్లకు ఆశ చూపుతారు. పది రోజులు కష్టపడితే ఓ 30 వేల రూపాయలు చేతికి వస్తాయనీ, దానితో కొన్ని అప్పుల బాధలు తీరుతాయని వీళ్లలో కొందరు ఆశపడతారు.
"వాళ్ళు ఎర్రచందనం దొంగలు కాకుంటే గడ్డి
కోసుకోవటానికి ఏమైనా తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వచ్చారా?" అని అటవిశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎగతాళి చేశారు. వాళ్ళు కూలీ డబ్బులకోసం ఎర్రచందనం చెట్లు నరకడానికే వస్తారు. అనుమతి లేకుండా అడవిలో ఏ చెట్టును నరికినా నేరమే. ఎర్రచందనం చెట్టును నరికినా నేరమే. ఆ విషయం ఆ కూలీలకు కూడా తెలుసు. అయినా, బ్రోకర్లు చూపించే ఆశను కాదనలేని పేదరికం వాళ్లది. నేరంలో వాళ్ళు
నిస్సందేహంగా పాత్ర ధారులు. అయితే ఆ నేరానికి వాళ్ళు సూత్రధారులు మాత్రం కాదు. ప్రధాన లబ్దిదారులు అంతకన్నా కాదు. సూత్రధారులు, ప్రధాన లబ్దిదారులు నిజానికీ అధికారవర్గం నీడలోనే వుంటారు. లేదా అధికారవర్గమే ప్రధాన లబ్దిదారులు, సూత్రధారుల నీడల్లో వుంటుంది.
గత ఎన్నికల్లో గెలవడానికి ఏపి శాసనసభ అభ్యర్ధులు 15 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చెసినట్టు సాక్షాత్తు ప్రధాన ఎన్నికల అధికారి బ్రహ్మ చెప్పి
పది రోజులు కూడా కాలేదు. యంఎల్ ఏ అభ్యర్ధులే ఈ మేరకు ఖర్చుపెట్టి వుంటే యంపీ అభ్యర్ధులు ఏ మేరకు ఖర్చుపెట్టి వుంటారో ఊహించుకోమని సిఇసి సెలవిచ్చారు. అభ్యర్ధులకు ఆ డబ్బులన్నీ ఇసక క్వారీల్లోంచో, కాంట్రాక్టుల్లోంచో,
గనుల్లోంచో, ఎర్రచందనం దుంగల్లోంచో వచ్చి వుండాలిగా.
నిజానికి శేషాచలం అడవుల్లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఆ 20 మంది అలా నేరం చేయడానికి వచ్చినవాళ్ళు కూడా కాదు. బస్సులో ప్రయాణిస్తున్నవాళ్ళను పోలీసులు దారిలో ఆపి ఎత్తుకుపోతుండగా చూసినవాళ్ళున్నారు.
అంటే నేరం చేసినందుకుకాక నేరం చేయబోతున్నారనే అనుమానంతోనే వాళ్లను పోలీసులు చంపేశారు అనుకోవాలి.
పేదలను బుజ్జగిస్తూ ధనికుల ఉమ్మడి ప్రయోజనాలను కాపాడడమే ప్రభుత్వాల పని. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సామాన్య ప్రజలకు చేసే వాగ్దానాలన్నీ ఎలాగైనా గెలవాలనే ఆతృతలో చేసేవేతప్ప ఆచరించడానికి చేసేవికావు. మరోవైపు ఆశించిన మేరకు పనిచేయని ప్రభుత్వాల మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. దాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వాధినేతలు సహజంగానే పోలీసులతో ఒక రక్షణా కవచాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కొందరైతే అధికారాన్ని చేపట్టగానే ముందుచూపుతో పోలీసులకు భారీ ప్రోత్సాహకాలు అందిస్తారు. కాలం గడిచేకొద్దీ, ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేకొద్దీ, ప్రభుత్వాధినేతలు పోలీసుల
మీద ఆధారపడడం కూడా అంతకు రెట్టింపు స్థాయిలో పెరుగుతూ వుంటుంది.
గత ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయించిన అంశం రైతు రుణమాఫి. తొలిసంతకం పెడతానంటూ అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఏడాది గడుస్తున్నా ఆ పని మాత్రం పూర్తిచేయలేదు. రుణమాఫీ పొందని రైతులు వందల సంఖ్యలో హైదరాబాద్ చేరుకుని సచివాలయంలో ప్రణాళీకా సంఘం ఉపాధ్యక్షుని ఛాంబరును ముట్టడించినంత పని చేశారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే శేషాచలం ఎన్ కౌంటర్ జరగడం ఒక యాధృఛ్ఛికం కావచ్చు; కాకపోనూవచ్చు.
గీత దాటిన పేదవాళ్ళను అక్కడికక్కడే అధికారికంగా చంపవచ్చు అనే మధ్యయుగాల శిక్షాస్మృతిని రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా ప్రవేశపెట్టింది. శేషాచలం ఎన్ కౌంటర్ " అంతం కాదు ఆరంభమే" అని అటవీ మంత్రి అంటున్నారు. నిజానికి చంద్రబాబు తొలివిడత పాలన అనగానే రైతులకు కాల్దారి కాల్పులు, వామపక్షాలకు బషీర్ బాగ్ కాల్పులు, విప్లవకారులకు కొయ్యూరు ఎన్ కౌంటర్ గుర్తుకు వస్తాయి. వారి మలివిడత పాలనలో పోలీసు కాల్పులు శేషాచలం తో మొదలయ్యాయి. కాల్దారీలో ఇద్దరు రైతులు చనిపోతే, శేషాచలంలో చెట్లు
నరికే కూలీలు ఇరవైమంది చనిపోయారు. మలివిడత ఆరంభమే
ఈ స్థాయిలో వుంటే ముగింపు ఏ స్థాయిలో వుంటుందో వూహించడానికే భయంగా వుంది. పోలీసు కాల్పులు, ఎదురుకాల్పులు ప్రభుత్వ కార్యక్రమంగా మారినపుడు ప్రజలు
కూడా వాళ్ళ కార్యక్రమాన్ని రూపొందించుకుంటారు.
యుధ్ధము ముగియలేదు; ఇప్పుడే ఆరంభము అయినది !!
(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు)
మొబైల్ నెం. 9010757776
10 April 2015
ప్రచురణ : సాక్షి దినపత్రిక
16-4-2015
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/16042015/Details.aspx?id=2727698&boxid=25589940
10 April 2015
ప్రచురణ : సాక్షి దినపత్రిక
16-4-2015
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/16042015/Details.aspx?id=2727698&boxid=25589940
No comments:
Post a Comment