చంద్రబాబు చైనా యాత్ర మరోకోణం
డానీ
చంద్రబాబు చైనా యాత్రలో సాధించిన విజయాల గురించి మీడియాలో రంగురంగుల కథనాలు అనేకం వచ్చాయి. వస్తున్నాయి. రాష్ట్రంలో అపారంగావున్న ఎర్రచందనం నిల్వల్ని చైనాకు అమ్మడానికి రంగం సిధ్ధం అయిందనీ, అలా సమకూరే నిధులతో కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడతారనేది ఈ కథనాల్లో ప్రధానాశం.
కొత్త రాజధాని నిర్మాణానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఏడాదిన్నర క్రితమే చంద్రబాబు అంచనావేశారు. అ నిధుల్ని తాను మిత్రపక్షంగా వుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అందింస్తుందని వారు ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రజల్ని నమ్మిస్తూ వచ్చారు.
నిజానికి కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం, రైతుల రుణమాఫీ అనే రెండు అంశాలు చంద్రబాబు పక్షాన లేకుంటే మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజల తీర్పు భిన్నంగా వుండేది. రైతుల రుణమాఫీని హామీలమాఫీగా మార్చడానికి ఏడాది కాలంగా ప్రభుత్వ పెద్దలు ఎన్ని విధాలుగా రేయింబవళ్ళు శ్రమిస్తున్నారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కొత్తరాజధానికి కేంద్ర నిధుల వ్యవహారం కూడా అటక ఎక్కినట్టే కనిపిస్తోంది. అనుమానం వున్నవాళ్ళు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సాక్షాత్తు పార్లమెంటులో ఇచ్చిన డిజిటల్ డిస్ ప్లే ను చూడవచ్చు. “ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమూ లేదు. మాకు ఆ ఉద్దేశమూ లేదు” అని వారు కుండ బద్దలుగొట్టారు. పదేళ్ల ప్రత్యేక హోదానే ఇవ్వనివాళ్ల నుండి రాష్ట్ర రాజధానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఆశించడం అమాయకత్వమే అవుతుంది.
ఇప్పుడు ఐదు లక్షల కోట్ల రుపాయలు సమకూర్చుకోవడానికి చంద్రబాబు దగ్గరున్న ఏకైక వనరు ఎర్రచందనం నిల్వలే. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ద్వార 4,160 టన్నుల ఎర్రచందనం దుంగలను అమ్మకానికి పెట్టినపుడు సగటున టన్నుకు 18 లక్షల రూపాయల చొప్పున మొత్తం 750 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ఈ లెఖ్ఖన 5లక్షల కోట్ల రూపాయల నిధుల్ని సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగల్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మాల్సి వుంటుంది. ఆస్థాయిలో గిరాకీ వున్నదా? అనేది ఒక ప్రశ్న అయితే, అసలు అంతటి నిల్వలు మన దగ్గర వున్నాయా? అనేది ఇంకో ప్రశ్న. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసియన్) సంస్థ అంతరించిపోతున్న వృక్షసంతతిగా పేర్కొన్న ఎర్రచందననాన్ని ప్రభుత్వం ఆస్థాయిలో అమ్మకానికి పెట్టవచ్చునా? అనేది ఇంకో సందేహం.
ప్రపంచ పటం మీద ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాలకే పరిమితమైన ఎర్రచందనాన్ని భారీ వెలపెట్టి కొంటున్న అంతర్జాతీయ దిగుమతిదారులు దాన్ని దేనికోసం వాడుతున్నారు? అనేది అన్నింటికన్నా కీలక ప్రశ్న. చైనా , జపాన్ దేశాల్లో ఫర్నిచర్, సాంప్రదాయ వాయిద్యాల తయారీ కోసం వాడుతుంటారని చాలా కాలం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. లైంగిక పటుత్వాన్ని పెంచే మందుల్లో వాడుతున్నారనీ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇవన్నీ రక్షణ రహాస్యాల్ని దాచడం కోసం చైనా. జపాన్ దేశాలు ప్రణాళికాబధ్ధంగా సాగించిన తప్పుడు ప్రచారమనే అభిప్రాయం కూడా బలంగావుంది.
2012 అక్టోబరులో అంతర్జాతీయ బయో డైవర్సిటీ సదస్సు హైదరాబాద్ లో జరిగినప్పుడే ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ డాక్టర్ ఆర్ హంపయ్య ఫర్నిచర్ తయారీ కోసం ఎర్రచందనాన్ని వాడుతున్నారనే వాదనని కొట్టివేశారు. పెళుసుగా వుండే ఎర్రచందనం కలప ఫర్నిచర్ కు పనికిరాదనీ, దాన్ని అణువిద్యుత్ కేంద్రాల్లో వినియోగిస్తున్నారని చైనా గుట్టు విప్పారు. బెంగళూరులో రహాస్యంగా ఒక కలప కోత మిల్లు నడుపుతున్న నలుగురు చైనీయుల్ని మొన్న జనవరిలో కర్ణాటక సెంట్రల్ రేంజి ఐజిపి అరుణ్ చౌదరి అరెస్టుచేశారు. చైనాకు దొంగ ఎర్రచందనం ఎగుమతి చేయడంలో వాళ్లది కీలక పాత్ర అని గుర్తించారు. దీనితో ఎర్రచందనం స్మగ్లింగ్ ను పొత్సహించడంలో చైన పాత్ర స్పష్టమయిపోయింది.
ఇప్పుడు చంద్రబాబుగారు చైనా వెళ్ళి చేసింది ఏమంటే, దొంగదారిన కొనుగోలు చేస్తున్న ఎర్రచందనాన్ని రాజమార్గాన పట్టుకుపొండి అని.
ఎర్ర చందనాన్ని చైనా అణువిద్యుత్ కేంద్రాల్లోనే వినియోగిస్తోందా? లేక అణ్వాయుధాల తయారీలోనూ వినియోగిస్తోందా?అన్నది కూడా ఎవరికయినా రావలసిన సందేహమే. దీనికి సమాధానం రెండోది కూడా అయితే చైనా అణ్వాయుధ పాటవాన్ని పెంచుకోవడంలో ’మనం సహితం ఎర్రచందనం పేడు ఒకటి ధారబోస్తున్నా’ మన్నమాటా. ఇది తెలిసే జరుగుతూ వుంటే అదో ఇది. తెలియక జరుగుతున్నా అదో ఇదే.
ఎప్పుడయితే అణ్వాయుధాల మాట వస్తుందో చైనాతో మన సంబంధాలు కూడా చర్చకు వస్తాయి. చైనాలో చంద్రబాబు11 ఒప్పందాలు చేసుకున్నారనే వార్త వచ్చిన రోజునే చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. కీలకమైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై చైనా ప్రభుత్వం నిఘా ఉంచిందని ఆసంస్థ ఓ నివేదికలో పేర్కొంది. చైనా హ్యాకర్లు ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నారన్నది దీని సారాంశం భారత్ తోపాటు దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా, నేపాల్, సింగపూర్, ఇండోనేషియా లాంటి ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్యం సాగిస్తోందని ఆ సెక్యూరిటీ సంస్థ చెపుతోందీ. మరో వైపు తమ దేశంపై గూఢచర్యం చేస్తున్న ఉపగ్రహాలను కనుగొన్నామని రష్యా చేసిన ప్రకటన చైనా గూఢచర్య కార్యకలాపాలను నిర్ధారిస్తున్నాయి.
చంద్రబాబు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాక చైనాలో జరిగిన పరిణామాలు మరింత ఆసక్తికరంగా సాగాయి. చంద్రబాబు ఇండియా విమానం ఎక్కిన మరునాడే చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ పాక్ స్థాన్ విమానం ఎక్కారు. నవాజ్ షరీఫ్ ని ఆలింగనం చేసుకుని “మన స్నేహబంధం కొండలకన్నా ఎత్తైనది, సముద్రాల కన్నా లోతైనది, తేనెకన్నా తీయ్యనైనది” అన్నారు. “ప్రపంచపటం మీద చైనా ఒంటిరిగా వున్నప్పుడు బీజింగ్ కు స్నేహహస్తాన్ని చాచింది ఇస్లామాబాద్ ఒక్కటే” అని గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది తన విదేశీ పర్యటనని పాకిస్తాన్ తోనే మొదలుపెట్టానని గొప్పగా చెప్పుకున్నారు. అటు నవాజ్ షరీఫ్ కూడా జిన్ పింగ్ కు దేశంలోనే అత్యున్నత పౌరపురస్కారమైన 'నిషాన్-ఈ -పాకిస్థాన్'తో సత్కరించారు. ఇది మన భారతరత్నతో సమానం.
ఒకవైపు, సాంస్కృతిక సారూప్యత రీత్యా ఎపి కొత్త రాజధాని అమరావతిని చైనీయులు రెండో స్వగృహంగా భావించాలని చంద్రబాబునాయడు కోరివస్తే, మరోవైపు చైనా తన దేశం నుండి మధ్యధరాసముద్రానికి చేరే చారిత్రక శిల్క్ రూట్ పునరుధ్ధరణకు పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుంది. రూ. 3 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ3వేల కిలోమీటల కారిడార్ ప్రాజెక్టు వల్ల పాకిస్తాన్-చైనా మధ్య రోడ్డు లింకులు రైల్లు మార్లాలు, పైపు లైనులు నిర్మించనున్నారు.
చంద్రబాబు అమరావతి –బీజింగ్ మధ్య రక్తచందన మార్గం నిర్మించాలని ఆశిస్తుంటే, జింగ్ పింగ్ బీజీంగ్ – ఇస్లామా బాద్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేరడానికి ’పట్టు రహదారి’ని నిర్మించేపనిలోపడ్డారు! వర్తమాన చరిత్రలో ఇంతకన్నా వైచిత్రి ఏముంటుందీ?
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
మొబైల్ నెం. 7674999063
ప్రచురణ : సాక్షి దినపత్రిక
30 - 4- 2015
No comments:
Post a Comment