Saturday 11 April 2015

చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెపుతున్నాను.

చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెపుతున్నాను.

నాకు పార్లమెంటరీ రాజకీయాల మీద నమ్మకంలేదు. నేను ఏ  రాజకీయ పార్టీలోనూ సభ్యుడ్నికాను. బీజేపీతోసహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలలోనూ నాకు స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు వున్నారు. ఉద్యోగపరమైన  పరిమితులు అనేకం వున్నప్పటికీ, ఏ సందర్భంలో అయినా సరే, ఏ మాత్రం వీలున్నా నేను ప్రజల పక్షం వహించాలనుకుంటాను. ఆ మేరకు అధికారవర్గాలతో తలపడుతుంటాను.  ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వున్నాయి. చేసిన వాగ్దానాల్ని నెరవేర్చనపుడు వాటిని విమర్శించక తప్పదు. ఇలాంటి  విమర్శలు కొన్ని సందర్భాలలో  విపక్ష రాజకీయ పార్టీలతో  భావసారూప్యం కలిగివున్నా వుండవచ్చు.  నా రచనల్ని అధికారపక్ష మీడియా ప్రచురించదు కనుక అవి అపధ్ధర్మంగా విపక్ష మీడియాలో  వస్తూ వుండవచ్చు.  అదేమీ విపరీతంకాదు.  అయితే, కొందరు ముఖపుస్తక మిత్రులు  నాకు విపక్షాలతో అపవిత్ర కలయికను  కుదిర్చే పనిలో పడ్డారు.


శేషాచలం కాల్పుల మీద నేను పెడుతున్న పోస్టులు సహజంగానే అధికార పార్టి అభిమానులకు ఇబ్బంది కలిగించి వుంటాయి. వాళ్ళు నా పోస్టుల మీద  స్పందించడానికి బదులు  ముదిగొండ కాల్పుల సందర్భంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని నేను విమర్శించానా? లేదా? అనే పరిశోధనలో పడ్డారు.  ఇలాంటి మెసేజులు నాకు చాలా వస్తున్నాయి. ఫోన్లూ వస్తున్నాయి. విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి వివరణ ఇవ్వాలని ఈ పోస్టు పెడుతున్నాను.

2007లో ముదిగొండ కాల్పులు జరిగినపుడు నేను సీ-టీవీలో సీనియర్ రిపోర్టరుగా పనిచేస్తున్నాను. సాక్షాత్తు ముఖ్యమంత్రి పేషీ బీటు చూస్తున్నాను. పైగా , అప్పట్లో రాష్ట  ప్రభుత్వం చేపట్టిన బ్రాడ్ బ్యాండ్‍ ప్రాజెక్టు కాంట్రాక్టు సీ-టీవీ చేతుల్లోనే వుంది. అంటే, వైయస్ కు సీ-టీవీ మీద అసహనం  రాకుండా చూసుకోవడం కూడా నా విధి నిర్వహణలో భాగం. అన్నింటికన్నా ముఖ్యమైనది సి-టీవి అధినేత ఆర్వీఆర్ చౌదరి గారితో నాకున్న సెంటిమెంటల్  అనుబంధం. ఇన్ని పరిమితులు వున్నప్పటికీ ముదిగొండ కాల్పుల మీద నేను స్పందించకుండా వుండలేకపోయాను.  జలయజ్ఞం విషయంలోనూ నేను వైయస్ ను, ఆయన నీడిపారుదలా సలహాదారుల్ని వదలలేదు. మీడియా సమావేశాల్లో వైయస్ ను నా అంతగా ఇరుకున పెట్టినవాళ్ళు కూడా వుండరు.

కాల్పులు జులై 28న జరిగాయి, ఆ మరునాడే నేను స్పందించాను. అప్పట్లో  హైదరాబాద్ మిర్రర్ దినపత్రికలో నేను రాస్తున్న'కొంచెం తీపి - కొంచెం చేదు'  కాలమ్  లో "2000 నుండి 2007 వరకు" శీర్షికతో వ్యాసం రాశాను. అందులో ఏకంగా వైయస్ పాలన  అంతమయ్యి చంద్రబాబు పాలన వస్తుందనే సంచలన సంకేతాలు కూడా ఇచ్చాను. అవి :

1. ప్రజలు ప్రభుత్వాధినేతను ఎన్నుకుంటే, ప్రభుత్వాధినేతలు పోలీసుల్ని నమ్ముకుంటారు.
2. ప్రజలపై ఉక్కుపాదాన్ని మోపిన ప్రభుత్వాలన్నీ అనతికాలంలోనే పతనమైపోయాయి.
3. ముదిగొండ కాల్పుల తరువాత తెలుగుదేశం శిబిరంలో మళ్ళీ అధికారాన్ని చేపడతామనే ఆశలు చిగురించాయి.  .... రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు రూపుదిద్దుకుంటున్నట్టు అప్పుడే తొలి సూచనలు వెలువడ్డాయి.
4. పోలీసులు తొలుత ముఖ్యమంత్రికి నీడలా మారారు. ఆ పిదప ముఖ్యమంత్రే పోలీసుల నీడన చేరిపోయారు.

పూర్తి వ్యాసం చదవాలనుకునేవాళ్ల సౌకర్యార్ధం  దాన్ని  నా బ్లాగులో పెట్టాను.






















No comments:

Post a Comment