బాబూ మార్కు ద్విముఖ వ్యూహం
ఉషా యస్ డానీ
సినిమాల్లో మాత్రమే మనం ఇలాంటి సన్నివేశాలను చూస్తుంటాం;
నిజజీవితంలో
దాదాపుగా అసాధ్యం. తెలంగాణ శాసనసభలో టిడిపి ఉపనాయకుడు రేవంత్ రెడ్డి పుణ్యాన ఈ లోటు తీరింది. ఘనమైన ప్రజాస్వామ్య వవస్థలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో వారు (సిక్స్ క్యామ్ సెటప్ లో) డిజిటల్ డిస్ ప్లే ఇచ్చారు.
ఇలా ఎమ్మెల్యేల్ని కొనే సన్నివేశాల్ని
సినిమాల్లో చూసినపుడు అదో కళాత్మక అతిశయోక్తి అనుకునేవాళ్ళూ వుంటారు. వాస్తవంతో పోలిస్తే, సినిమాల్లో చూపించేది చాలా తక్కువని రేవంత్ రెడ్డి కేసు కుండబద్దలు కొట్టింది. పెద్దలసభ అని గౌరవంగా చెప్పుకునే శాసనమండలి ఎన్నికల్లో ఓటుకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వజూపారంటే ఒక
అభ్యర్ధి ఎమ్మెల్సీ కావడానికి తొంభై కోట్లు ఖర్చుపెట్టాలి. దాదాపు శతకోటి
ఆంధ్రప్రదేశ్ ను పునర్
నిర్మిస్తున్న తనను అవినీతిపరులు అనుక్షణం అడ్డుకుంటున్నారని మహానాడు వేదిక మీద చంద్రబాబు బాధపడి రెండు రోజులు కూడా కాలేదు. సంతలో
పశువుల్లా ప్రజాప్రతినిధుల్ని బేరాలాడుతున్నారని వారు ఆవేదన వెళ్లగక్కిన మరునాడే వారి దూత రేవంత్ రెడ్డి ఒక నామినేటెడ్ శాసనసభ్యునితో భారీ బేరసారాలాడుతూ అవినీతి నిరోధక శాఖ కు ‘పసుపు’ చేతులతో పట్టుబడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇంతటి బూటకాన్ని ఇటీవలి కాలంలో చూసివుండం.
రాజకీయార్ధిక సామాజికరంగాల్లో విస్తృత పరిశోధనలు చేసేవారికి ఎంతగానో ఉపయోగపడే దినుసులు రేవంత్ రెడ్డి వీడియో క్లిప్పింగుల్లో వున్నాయి. రెండు రాష్ట్రాల్లో
సామాజిక సమీకరణల మీద టిడిపీ జాతీయ అధ్యక్షుడు
చంద్రబాబు అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం గురించి రేవంత్ రెడ్డి చాలా పెద్ద వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ఫ్యాక్టర్ మూలంగా రెడ్డి సామాజికవర్గాన్ని పక్కన పెట్టడం
ద్వార జగన్ కు చెక్ పెట్టి,
తెలంగాణలో రేవంత్
రెడ్డి నాయకత్వాన రెడ్డి సామాజికవర్గాన్ని సమీకరించదం ద్వార కేసిఆర్ కు చెక్ పెట్టాలన్నది ఆ ద్విముఖ వ్యూహం
సారాంశం. రేవంత్ రెడ్డి బయట పెట్టిన ఈ ద్విముఖ వ్యూహాన్ని చంద్రబాబు నాయుడు ఇప్పటి
వరకు ఖండించలేదు.
చంద్రబాబు పాలన ప్రాధాన్యతల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాల్సివుంది. మహానాడు వేదిక నుండి వారు ఇచ్చిన ప్రధాన సందేశం "సంపదను సృష్టించాం" అని. దీనికి భూత భవిష్యత్కాలకు సంబంధించి రెండు అర్ధాలున్నాయి. ఇందులో మొదటిది, పుష్కరం క్రితం వారు హైదరాబాద్ లో సంపదను సృష్టించారన్నది. రెండోది; రేపు అమరావతి – విజయవాడల్లోనూ వారు అలాంటి సంపదను సృష్టిస్తారన్నది.
హైదరాబాద్ లో వారు ఎలాంటి సంపదని సృష్టించారో
తెలుసుకోవడానికి ముందు ఆ సంపద విస్తృతిని పరిశీలించాల్సివుంది. హైదరాబాద్ లో నైరుతీ, ఆగ్నేయ మూలలకు విస్తరించిన పాతబస్తీని చంద్రబాబు సంపద ఎన్నడూ చేరలేదు. ఈశాన్య మూలన వున్న సికంద్రాబాద్ ప్రాంతంలోనూ వారు పెద్దగా సంపదను సృష్టించింది లేదు. వారు చెపుతున్న సంపద కేవలం వాయువ్య దిక్కున వున్న బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, మాధాపూర్ పరిసర ప్రాంతాలది. ఇది ఐటీ కంపెనీల వల్ల వచ్చిన మార్పు.
నిజానికి అప్పుడు సిలికాన్ వ్యాలీలో చంద్రబాబు చేసిన వ్యక్తిగత ప్రయత్నంకన్నా, గ్లోబల్ వాతావరణమే సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇండియాకు విస్తరించడానికి అనుకూలంగా వుంది. మానవనరుల్ని భారత దేశం నుండి అమెరికాలో దిగుమతి
చేసుకోవడంకన్నా అక్కడే తక్కువ వేతనానికి పనిచేయుంచుకోవడం లాభదాయకమని యంఎన్ సీలు భావిస్తున్న రోజులవి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సియంగా చంద్రబాబు వుండడం ఒక యాధృఛ్ఛికం. వారుకాక మరొకరున్నా అదే జరిగేది.
ఐటీ బూమ్ ఒక రుతువులా వచ్చింది. ఒక రుతువులా పోయింది. ఆ బూమ్ శాశ్వితమని అమాయికంగా నమ్మింది చంద్రబాబు. వారి నమ్మకం చాలా అనర్ధాలకు
దారితీసింది. వందలాది ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్ని మంచాన్న పడేశాయి. ఇవి చాలవన్నట్టు వందలాది బీసిఏ, ఎంసిఏ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చి, బూమ్ పడిపోగానే అంతరించిపోయాయి. దానితో, లక్షలాది మంది విద్యార్ధులు రోడ్డున పడ్డారు. వేలాది కుటుంబాలు చితికిపోయాయి. ఫలితంగా బాబూ మార్కు హైటెక్కు అభివృధ్ధి మీద విసిగి వేసరిపోయిన ప్రజలు తమ ఆక్రోశాన్నివరుస రెండు ఎన్నికల్లో చూపించారు.
చంద్రబాబు అంత గొప్పగా చెప్పుకునే హైదరాబాద్ నగరంలో అయినా ప్రజలు ఆయన్ని ఆదరించారా అంటే అదీలేదు. 2004. 2009 ఎన్నికల్లో జంటనగరాల్లో ఆ పార్టీకీ వచ్చిన సీట్లను చూస్తే చాలు వారు సృష్టించిన సంపద మీద ప్రజలకు ఎంతటి ఏవగింపు కలిగిందో తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పొలిమేరల వరకు టిడిపిని తరిమేశారు జనం. హైదరాబాద్
తో సహా, అటు ఆంధ్రా, ఇటు తెలంగాణల్లో సామాన్య ప్రజలకు వారు సృష్టించింది
పేదరికాన్ని మాత్రమే!
అయినప్పటికీ మహానాడు వేదిక మీద నుండి సంపదను
సృష్టించాం అని మళ్ళీ అన్నారంటే చంద్రబాబు ఆశిస్తున్న రాజకీయార్ధిక ప్రయోజనాలు
వేరు. ఆర్ధికరంగంలో ఒక ముఖ్యవిషయం ఏమంటే, వినియోగదారులు రెండు రకాలుగా వుంటారు; మార్కెట్లో
నిత్యావసర సరుకుల్ని సమకూర్చుకోవడానికే ఆపసోపాలుపడేవాళ్ళు, విలాస వస్తువులు
కొనగలిగేవాళ్ళు. అభద్రలోక్, భద్రలోక్. ఆర్ధికంగా స్థిరపడడమేగాక, తమ ఆర్ధిక
ప్రయోజనాల కోసం ప్రభుత్వాలని వాడుకోగలిగిన భద్రలోక్ వర్గమే భావప్రకటనా వ్యవస్థలో చురుగ్గా,
ప్రభావశీలంగా వుంటుంది. భద్రలోక్ సుఖమే అందరి సుఖంగానూ, వాళ్ల బాధే అందరి
బాధగానూ చెలామణి అవుతుంటుంది.
భద్రలోక్ ఆనందంగా వుంటే ప్రభుత్వం సమర్ధంగా
పనిచేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతుంటాయి. భద్రలోక్ చేసే హోరులో ఆ సమాజపు పేదల
ఆర్తనాదాలు వినిపించవు. 2004 ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు చంద్రబాబు ప్రభుత్వం అంత
హీనంగా పతనం అయిపోతున్నదని ప్రధాన మీడియాలో ఎప్పుడయినా వినిపించిందా? ఈ సూత్రాన్ని
తిరగేసి చూస్తే ఒక వ్యూహం కనిపిస్తుంది. అదేమంటే, పేదల ఆర్తనాదాలు వినిపించకుండా వుండాలంటే భద్రలోక్
హోరు కొనసాగాలి. వాళ్ల హోరు జోరుగా కొనసాగుతూ వుండాలంటే వాళ్ల సంపద పెరుగుతూ
వుండాలి. తొలి సంతకం చేస్తానన్న రైతురుణమాఫి హామిని ఇప్పటి వరకు సంపూర్ణంగా
నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వోద్యోగులకు, పోలీసులకు భారీగా జీతాలు పెంచడం, సింగపూర్
ను తలదన్నే రాజధాని కడతాననడం వంటి ఆర్భాటం అంతా భద్రలోక్ ను సంతృప్తిపరచడానికే. వాళ్ల
ఆనందపు హోరులో పేదల ఆర్తనాదాల్ని నొక్కేయడానికే !
(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు)
మొబైల్ : 90107 57776
High Lights
రాజకీయార్ధిక సామాజికరంగాల్లో విస్తృత పరిశోధనలు చేసేవారికి ఎంతగానో ఉపయోగపడే దినుసులు రేవంత్ రెడ్డి వీడియో క్లిప్పింగుల్లో వున్నాయి. రెండు రాష్ట్రాల్లో సామాజిక సమీకరణల మీద టిడిపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం
గురించి రేవంత్ రెడ్డి చాలా పెద్ద వివరణ
ఇచ్చారు.
Word Count
Words-654, No Spaces 4796, With Spaces
5470
ప్రచురణ : సాక్షి ఎడిట్ పేజి, 9
జూన్ 2015
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/09062015/Details.aspx?id=2795510&boxid=25837660
ఆయనగారు అభద్ర లోక్ సెక్షన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 40 ఏళ్ళు అయ్యింది . ఆ సెక్షన్ నుంచి భద్ర లోక్ సెక్షన్ కు గ్లామర్ కు అల్లుదవడంతో గెంతెసారు . హైటెక్ తప్ప అంతరంగాలు మరిచిపోయి చాలాకాలము అయిపొయింది . ఎలక్షన్ కు ముందు ప్రజల మనిషి అని నమ్మిన అభద్ర లోక్ సెక్షన్ కి ఐదు సంతకాల రోజే జలక్ ఇచ్చిన మహానుబావుడు . ధన్యవాదాలు సార్..
ReplyDelete