3.
సీమ-ఆంధ్ర రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి ఇస్తున్నట్టు మొన్న నేను లోక్ సభలో చెప్పిన అంశాన్నే మరోమారు మీముందు
పునరుద్ఘాటించదలుచుకున్నాను. అంతేకాదు,
కొత్తగా ఏర్పడే అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ అభివృధ్ధి అవకాశాలను
పరిశీలించడానికీ, వాటిని సాకారం చేయడానికీ అవసరమైన ఆర్ధిక వనరుల్ని అందించడానికీ ప్రణళికా
సంఘంలో ఉపాధ్యక్షుని ఆధ్వర్యాన తక్షణం ఒక స్పెషల్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు సభకు
హామీ ఇస్తున్నాను.
అధ్యాయం - 1
సీమాంధ్ర ప్రయోజనాల కోసం ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు – 2014 లో పొందుపరిచిన అంశాలు .
1. హైదరాబాద్
· పది సంవత్సరాల కాల పరిమితికి మించకుండా ఉమ్మడి రాజధానిగా వుంటుంది .
· ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ యంసి ) సరిహద్దులే ఉమ్మడి రాజధానికి సరిహద్దులుగా వుంటాయి .
2. గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు
· కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారత రాష్ట్రపతి నిర్ణయించినంత కాలం ఉమ్మడి గవర్నర్ ఉంటారు.
· ఉమ్మడి రాజధాని ప్రాంతంలో నివసించే ప్రజల భద్రత, స్వేచ్ఛ, ఆస్తులనుకాపాడే ప్రత్యేక బాధ్యతలను గవర్నర్ నిర్వహిస్తారు.
· ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలు, అంతర్గతభద్రత, కీలకప్రాంతాలు, సంస్థాపనల భద్రత, ప్రభుత్వభవనాల కేటాయింపు, నిర్వహణల ప్రత్యేక బాధ్యతలను గవర్నర్ నిర్వహిస్తారు.
· పైన పేర్కొన్న విధుల నిర్వహణలో, తెలంగాణ రాష్ట్ర మంత్రులను సంప్రదించిన తర్వాత గవర్నర్ తన విచక్షణ మేరకు న్యాయమని తోచిననిర్ణయాన్ని తీసుకొని తగిన చర్యలు తీసుకుంటారు. ఈ విషయాలలో గవర్నర్ నిర్ణయమే అంతిమతీర్పుగా వుంటుంది.
3. కొత్త రాజధాని
· తెలంగాణ పోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కు కొత్త రాజధాని నిర్మాణానికి అనువుగా వుండే ప్రాంతాన్ని సూచించడానికి ఒక నిపుణుల బృందాన్ని నియమిస్తారు. ఈ బృందం ఆరు నెలలలోపు తన సూచనల్ని అందచేస్తుంది.
· సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు తదితర భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.
· సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైనపక్షంలో డీ-గ్రేడేడ్ అటవీ ప్రాంతన్ని సహితం డీ-నోటిఫై చేస్తారు.
4. విద్యారంగం
· రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటిలో ప్రవేశం కోసం ప్రస్తుతం అమల్లోవున్న కోటా విధానమే పదేళ్ల పాటు కొనసాగుతుంది.
· నెలకొల్పనున్న కొత్త విద్యాసంస్థలు
o ఐఐటి, ఎన్ ఐటి, ఐఐయం, ఐఐయస్ ఇఆర్, ఐఐఐటి లతోపాటూ కేంద్ర విశ్వవిద్యాలయం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలను కొత్త రాష్ట్రంలో నిర్మిస్తారు.
o ఏఐఐఎమ్ ఎస్ (ఏయిమ్స్) తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియూ బోధనా సంస్థను నిర్మిస్తారు.
o గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తారు.
o ప్రకృతి విలయాల నివారణ నిర్వహణ సంస్థను నెలకొల్పుతారు.
5. నదీ జలాలపంపకం
· కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, నిర్వహణలని పర్యవేక్షించడానికి ప్రత్యేక నదీజల మండలిని ఏర్పాటుచేస్తారు.
· ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయాలనీ, నీటి లభ్యత తక్కువగావున్న సందర్భాల్లో ప్రాజెక్టులవారీగా నీళ్ళ సర్దుబాటుకు విధివిధానాలను రూపొందించాలని కృష్ణా జలవివాదాల సంఘాన్ని కోరుతారు.
· నదీ జలాల ట్రిబ్యూనళ్ళు కృష్ణా-గోదావరి నదులపై వివిధ ప్రాక్టులకు కేటాయించిన నికరజలాల్లోగానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని విభిన్న ప్రాంతాలకు కేటాయించిన నికరజలాల్లోగానీ ఎలాంటి మార్ఫు వుండదు.
· భవిష్యత్తులో ఏదైనా నదీజలాల ట్రిబ్యూనల్ ఒకవేళ అదనపు జలాల కేటాయింపులు చేస్తే దానికి తెలంగాణ, భావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కట్టుబడివుండాలి.
· సముచిత ఆధారజల ప్రమాణాల ప్రకారం కృష్ణా, గోదావరి నదుల్లో అందుబాటులోవున్న నీటివనరులతో తెలంగాణ, భావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నదీజలాల సంఘం అనుమతిలేకుండానే కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టుకోవచ్చు. అలాంటి కొత్త ప్రాజెక్టుప్రతిపాదననలకు కేంద్ర జలసంఘం ఆమోదం పొందడానికి ముందు సంబంధిత జలమండలి మదింపుచేసి సాంకేతిక అనుమతులు ఇవ్వాల్సి వుంటుంది.
6. పోలవరం
· పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తుంది.
· పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడమేడమేగాక, దానికి అన్నిరకాల అనుమతులు పొందేందుకూ, సహాయక, పునరావాస ప్యాకేజీలను అమలుపరిచేందుకూ కేంద్ర ప్రభుత్వమే సంపూర్ణ బాధ్యత వహిస్తుంది.
· పోలవరం ముంపు గ్రామాలన్నీ సీమాంధ్రలో అంతర్భాగంగా వుంటాయి.
· పై అంశాలకు భావి తెలంగాణ రాష్ట్రం అంగీకారం తెలిపినట్టే భావించాల్సివుంటుంది.
7. ఆదాయ వనరులు
· ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కు పదమూడవ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల్ని భవిష్యత్తులో ఏర్పడే ర్రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదిక, ఇతర సూచికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పంఫకాలు చేస్తుంది.
· భవిష్యత్తులో ఏర్పడే రెండు రాష్ట్రాల్లో అందుబాటులోవుండే ఆదాయ వనరుల్ని పరిగణనలోనికి తీసుకుని వాటికి విడివిడిగా నిధుల్ని కేటాయించాలని పదమూడవ ఆర్థికసంఘాన్ని భారత రాష్ట్రపతి ఆదేశిస్తారు.
· కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయవనరులను పరిశీలించిన మీదట ఆ రాష్ట్రానికి తగినన్ని నిధుల్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. సీమాంధ్రరాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృధ్ధి కోసం ప్యాకేజీల రూపంలో భారీ ప్రయోజనాలనీ, ప్రోత్సాహకాలనీప్రకటిస్తుంది.
8. పారిశ్రామీకరణ, ఆర్దికాభివృధ్ధి లకు ప్రోత్సాహం
· కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లోనూ పారిశ్రామీకరణ, ఆర్దికాభివృధ్ధి వేగవంతంగా సాగేలా ప్రోత్సహించం కోసం పన్ను రాయితీలతోసహా అనేక ఆర్ధిక చర్యలు, ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
· కొత్త మౌళికరంగ నిర్మాణానికి పెట్టుబడులు
o దూగరాజపట్నం వద్ద పెద్ద ఓడరేవు నిర్మాణం.
o వైయస్సార్ కడప జిల్లాలో భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి వున్న అవకాశాలను, కొత్త రాష్ట్రాలు ఏర్పడిన రోజు నుండి ఆరు నెలలలోగా సెయిల్ పరిశీలిస్తుంది.
o గ్రీన్ ఫీల్డ్ నూనెశుధ్ధి కర్మాగారం నెలకొల్పడానికి వున్న అవకాశాలను కొత్త రాష్ట్రాలు ఏర్పడిన రోజు నుండి ఆరు నెలలలోగా ఐవోసీ, గానీ హెచ్ పిసీఎల్ గానీ పరిశీలిస్తాయి.
o ఢిల్లీ-ముంబాయి పారిశ్రామిక కారిడార్ తరహాలో, విశాఖపట్నం- చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికున్న అవకాశాలను కొత్త రాష్ట్రాలు ఏర్పడిన రోజు నుండి ఆరు నెలలలోగా పరిశీలించడమేగాక, దాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుంటుంది.
o విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ప్రస్తుతమున్న విమానాశ్రాయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృధ్ధ్ది చేయడానికికున్న అవకాశాలను కొత్త రాష్ట్రాలు ఏర్పడిన రోజు నుండి ఆరు నెలలలోగా పరిశీలించడమేగాక, దానినిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది.
o కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వేజోన్ ను ఏర్పాటు చేసే అంశాన్ని అప్పాయింటెడ్ డే నుండి ఆరు నెలలలోగా పరిశీలించడమేగాక, దాని నిర్మాణానికి భారతీయ రైల్వేశాఖ చొరవ తీసుకుంటుంది.
o కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నుండి హైదరాబాద్ కు విస్తృత రోడ్డురవాణ సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
o విశాఖపట్నం, విజయవాడ – గుంటురు – తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటీ లలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టడానికికున్న అవకాశాలను కొత్త రాష్ట్రాలు ఏర్పడిన రోజు నుండి ఆరు నెలలలోగా పరిశీలించడమేగాక, దానినిర్మాణానికి భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది.
9. వెనుకబడినప్రాంతాలు
· భావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక అభివృధ్ధి ప్యాకేజి ఇవ్వడమేగాక, ఆ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు విస్తృత ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
· భౌతికనిర్మాణం, సామాజికనిర్మాణాలతో సహా వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధికి భావి ఆంధ్రప్రదేశ్ రాష్టం చేపట్టే పథకాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది.
10. రాయలసీమ
· రాయలసీమ ప్రాంతానికి స్పేషల్ డెవలప్ మెంటు ప్యాకేజీని ప్రకటిస్తారు.
· ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ దశలోవున్నట్టి దిగువ నీటిపారుదలా ప్రాజెక్టులన్నింటికీ ముందుగానే నిర్ణయించిన నీటి కేటాయింపుల్ని కొనసాగించడమే గాక వాటిని నిర్ణిత కాలపరిమితి లోగా పూర్తిచేస్తారు.
ఎ. హంద్రీ – నీవా
బి. తెలుగుగంగ
సి. గాలేరు – నగరి
డి. వెలిగొండ
11. విద్యుత్తు
· ప్రస్తుతం పనిచేస్తున్న, నిర్మాణంలోవున్న విద్యుత్ ప్రాజెక్టులతో వివిధ దిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు యధాతథంగా కొనసాగుతాయి.
· సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తో ప్రస్తుతం వివిధ సంస్థలకున్న బొగ్గు లింకేజీని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తారు.
12. భద్రత
· అదనపు పోలీసు బలగాలను సమకూర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది.
· గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం మూడేళ్ళ పాటు కేంద్రప్రభుత్వం ఆధీనంలో వుంటుంది. ఇది రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి సౌకర్యంగా వుంటుంది.
· సీమాంధ్రలో అత్యాధునిక గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది.
· గ్రేహౌండ్స్ కోసం కొత్త ఆపరేషన్ హబ్ ను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారాన్ని అందిస్తుంది.
13. ఉమ్మడి హైకోర్టు
· కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వంత హైకోర్టును నిర్మించుకునేవరకు ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకూ వుమ్మడి హైకోర్టుగా వుంటుంది.
14. ఉమ్మడి సౌకర్యాల కొనసాగింపు
· ప్రస్తుతమున్న 107 రాష్ట్రస్థాయి సంస్థల్లో సీమాంధ్రకు ఇప్పుడున్న సౌకర్యాలన్నింటినీ కొనసాగించడానికి రాష్ట్ర పునర్ విభజన బిల్లు - 2014లోని పదవ షెడ్యూలులో అవకాశం కల్పించారు. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వంతగా అలాంటి సంస్థల్నిఏర్పాటు చేసుకునేవరకు ఈ సౌకర్యాలు వుంటాయి.
అధ్యాయం - 2
సీమాంధ్రకు ప్రధాని ఆరు సూత్రాల హామీలు
1. రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలు, ఉత్తర తీరాంధ్ర ప్రాంతానికి చెందిన మూడు జిల్లాలతో పాటూ, మొత్తం పదమూడు జిల్లాలతో ఏర్పడే భావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అందించడానికి వీలుగా ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తారు. ఈ హోదా ఐదేళ్లపాటు అమల్లో వుంటుంది. దానివల్ల భావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక స్థితి పటిష్టంగా మారడానికి అవకాశం వుంటుంది.
2. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లో పారిశ్రామీకరణ, ఆర్ధికాభివృద్ధిని వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించే అంశాన్ని పునర్ వ్యవస్థీకరణ బిల్లులోనే పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని ఇతర రాష్ట్రాలకు అందిస్రున్న తరహాలోనే ఈ ప్రోత్సాహకాలు వుంటాయి.
3. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తర తీరాంధ్ర ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ని అందించే అంశాన్ని కూడా పునర్ వ్యవస్థీకరణ బిల్లులోనే పేర్కొన్నారు. ఒడీశా లోని కోరాపుట్ – బాలంగీర్ –కలహండి ( కే-బీ-కే), మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల్లోని బుందేల్ ఖండ్ ప్రాంతాలకు ప్రస్తుతం అందిస్తున్న ప్రోత్సాహకాల తరహాలో ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వుంటుంది.
4. పోలవరం పాజెక్టు కోసం భూసేకరణ, పునరావాస ప్యాకేజీని సమర్ధంగా, సంపూర్ణగా అమలుచేయడానికి వీలుగా ప్రతిపాదించే సవరణలు ఏవైనా సాధ్యమైనంత తక్కువ సమయంలో అమలు చేస్తామని గౌరవనీయ సభ్యులకు మరోసారి హామీ ఇస్తున్నాను. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరుతుంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావులేదు.
5. ఉమ్మడిరాష్ట్రంలోని సిబ్బంది, ఆదాయం, ఆస్తులు-అప్పుల పంపిణీల ప్రక్రియ సజావుగా పూర్తి కావడానికి అవసరమైన వ్యవధిని ఇచ్చేలా కొత్త రాష్ట్ర ఏర్పాటుకు ’అప్పాయింటెడ్ డే’ ను నిర్ణయిస్తారు.
6. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఏడాది, - మరీ ముఖ్యంగా అప్పాయింటెడ్ డే నుండి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలోగా-, తలెత్తే రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు 2014-15 జాతీయ బడ్జెట్ లోనే నిధుల్ని కేటాయిస్తారు.
అధ్యాయం - ౩
సీమాంధ్రకు కేంద్ర హోంమంత్రి మూడు సూత్రాల హామీలు
1. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి పూర్తిచేయాలనేది మా ధృఢనిశ్చయమని పునర్ వ్యవస్థీకరణ బిల్లు స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతుల్ని పొందడమేగాక, భూసేకరణ-పునరావాస పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాను.
2. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తర తీరాంధ్ర లకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
3. సీమ-ఆంధ్ర రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి ఇస్తున్నట్టు మొన్న నేను లోక్ సభలో చెప్పిన అంశాన్నే మరోమారు మీముందు పునరుద్ఘాటించదలుచుకున్నాను. అంతేకాదు, కొత్తగా ఏర్పడే అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ అభివృధ్ధి అవకాశాలను పరిశీలించడానికీ, వాటిని సాకారం చేయడానికీ అవసరమైన ఆర్ధిక వనరుల్ని అందించడానికీ ప్రణళికా సంఘంలో ఉపాధ్యక్షుని ఆధ్వర్యాన తక్షణం ఒక స్పెషల్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు సభకు హామీ ఇస్తున్నాను.
అధ్యాయం – 4 : కేంద్ర విద్యా సంస్థలు
విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే సోపానాలు కేంద్ర విద్యాసంస్థలు. ఐఐటి, ఐఐఎం, ఎన్ ఐటి వంటి భారత కేంద్ర విద్యాసంస్థలు ప్రమాణాల్లో అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించాయి. ఆంధ్రప్రదేశ్ విభజన అంశం ముందుకు వచ్చినపుడు సీమాంధ్ర విద్యార్ధిలోకం ఆందోళన వ్యక్తం చేసింది కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాన్ని కోల్పోతామనే భయంతోనే. దానికి కారణం ఏమంటే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని కేంద్ర విద్యాసంస్థలన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఈ విద్యాసంస్థలన్నీ భావి తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం అయిపోతాయి. అప్పుడు సీమాంధ్ర విద్యార్ధులు తెలంగాణలోని కేంద్ర విద్యాసంస్థల్లో నాన్-లోకల్ అయిపోతారనే అందోళన బలంగా వ్యక్తమయింది.
సీమాంధ్ర విద్యార్ధుల ఆందోళనని కేంద్రప్రభుత్వం శ్రధ్ధగా పరిగణనలోనికి తీసుకుంది. విద్యార్ధుల అనుమానాల్ని నివృత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రూపకర్తలు ప్రత్యేక ఆసక్తి కనపరిచారు. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశావకాశాల్ని పరిరక్షించడానికి పునర్ వ్యవస్థీకరణ బిల్లులోనే అనేక నిబంధనల్ని చేర్చారు. పునర్ వ్యవస్థీకరణ బిల్లులో 11వ భాగమైన ఉన్నత విద్యావకాశాలు అధ్యాయంలో, ఉన్నత విద్యావకాశాల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలున్నాయి. అలాగే, బిల్లు చివరి షెడ్యూలు అయిన 13వ షెడ్యూల్లో విద్య, మౌళిక సదుపాయాల వినియోగానికి సంబంధించిన నిబంధనల్ని పేర్కొన్నారు.
“కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుకునేందుకు సమానావకాశాలు కల్పించడానికి వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యాసంస్థలన్నింట్లో ప్రస్తుతమున్న వుమ్మడి అడ్మిషన్ల కోటాను పదేళ్ల కాలపరిమితికి మించకుండా యధాతధంగా కొనసాగించాలి. “ అని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు 11వ అధ్యాయంలో నిబంధనను పొందుపరిచారు.
“కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 12, 13 పంచవర్ష ప్రణాళికల కాలంలో, అంటే 2022లోగా, కేంద్ర విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒక ఐఐటీ, ఒక ఎన్ఐటీ, ఒక ఐఐఎం, ఒక ఐఐఎస్ఈఆర్, ఒక సెంట్రల్ విశ్వవిద్యాలయం, ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒక ఐఐఐటీ ఏర్పాటు చేయాలి. ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్-కమ్-టీచింగ్ సంస్థను, ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి“ అని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు 13వ షెడ్యూలులో పేర్కొన్నారు.
జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు నెలకొల్పితే విద్యార్ధులు, విద్యారంగానికేకాక, దానికి అనుబంధంగా పరిసరాల్లో అభివృధ్ధి వేగాన్ని పుంజుకుంటుందన్నారు సామాజిక విశ్లేషకులు చోరగుడి జాన్సన్! కొత్త తరం అభివృధ్ధిలో బడుగు బలహీనవర్గాలు చురుగ్గా భాగం పంచుకుని పురోగతి సాధిస్తారని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సీమాంధ్రలో ఇప్పుడున్న విశ్వవిద్యాలయలకు తోడు మరో పది కేంద్ర విశ్వవిద్యాలయాలు వస్తే, వున్నత విద్య మీద ఆసక్తీ, అవకాశాలు రెండూ పెరుగుతాయన్నారు సీనియర్ పాత్రికేయులు పెద్దాడ నవీన్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయితే, ఉపాధి, విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళినవాళ్ళు కూడా తిరిగి వస్తారనీ రాజకీయార్ధిక విశ్లేషకులు డానీ అన్నారు. సీమాంధ్ర విద్యావంతులు, వృత్తి నిపుణులు ఉపాధి కోసం గతంలో హైదరాబాద్ తదితర మహానగరాలను వలసపోవడంతో ఆ ప్రాంతంలో ’బ్రెయిన్ డ్రెయిన’చోటుచేసుకుందనే అభిప్రాయం వుంది. ఇప్పుడు తిరుగు వలసలు మొదలవడంతో, సీమాంధ్ర నగరాలైన విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు,. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప అభివృధ్ధిపథంలో వెలుగులోనికి వస్తాయని వారు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రూపకర్త, కేంద్రమంత్రుల బృందం (జీవోయం) లో కీలకసభ్యుడు కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఇటీవల జరిపిన రాష్ట్ర పర్యటనలో ఐదు నుంచి పదేళ్ల లోపునే సీమాంధ్ర భారీగా అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్రలో 11 జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ వస్తే నిజంగానే భావి ఆంధ్రప్రదేశ్ సూపర్ ఎడ్యుకేషన్ రాష్ట్రంగా మారే అవకాశాలున్నాయి.
పట్టణీకరణ వేగవంతంగ జరుగుతున్న వర్తమాన దశలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనువైన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులో లేదు. కొత్తగా ఏర్పడే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ లోటును తీరుస్తుందని కృష్ణాజిల్లా రైతు చెరుకూరి నరసింహారావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
చెన్నై, కోల్ కత (అప్పట్లో మద్రాసు - కలకత్తా) నగరాలను కలుపుతూ అప్పటి బ్రిటీష్ వలస పాలకులు నిర్మించిన గ్రాండ్ ట్రంకు రోడ్డు, రైలు మార్గాలకు ఒక భౌగోళిక ప్రత్యేకత వుంది. ట్రంకు రోడ్డుకు తూర్పున పెన్నా, కృష్ణా, గోదావరి తదితర నదుల డెల్టా భూములు వుండగా, పశ్చిమాన తూర్పుకనుమలు, అటవీ ప్రాంతాలు వున్నాయి. సుప్రసిధ్ధ నల్లమల, దండకారణ్యాలు గ్రాండ్ ట్రంకు రోడ్డుకు పశ్చిమ దిక్కునే వున్నాయి. వేలాది సంవత్సారాలుగా ఈ రెండు అటవీ ప్రాంతాలు యానాదులు, కోయలు, చెంచులు, గదపలు, సవరలు, కొండదొరలు, బగతలు, వాల్మీకులు, జాతాపులు తదితర తెగలకు చెందిన ఆదివాసులకు నివాసంగా వున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో పట్టణీకరణ విస్తారంగా జరిగినప్పటికీ గిరిజనుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. “అభివృధ్ధికి సంబంధించి గిరిజనుల దృక్పధానికీ, మైదాన ప్రాంతాల వారి దృక్పథానికీ పొంతనలేదు. గిరిజనుల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంవల్ల సీమాంధ్ర ప్రాంతపు ఆదివాసుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం వుంది” అన్నారు సంఘసేవకులు పవన్ స్వాధికార్.
అధ్యాయం – 5 : నదీజలాల పంపిణి
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణలో అత్యంత ప్రాణప్రదమైన అంశం నదీజలాల పంపిణీ. నదీ జలవివాదాల పరిష్కార సంఘాలు ప్రాజెక్టుల వారీగా ఆంధ్రప్రదేశ్ లో నదీ జలాలను పంపిణీ చేశాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా కొనసాగిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో, ప్రధాన ప్రాజెక్టులు అన్నింటిలోనూ కొత్తగా జలవివాదాలు తలెత్తుతాయని సీమాంధ్ర రైతాంగం ఆందోళన వ్యక్తం చేసింది.
గోదావరి నది మీద 1852లో ధవిళేశ్వరం వద్ద, కృష్ణానది మీద 1854లో విజయవాడ వద్ద బ్రిటీష్ వలస పాలకులు ఆనకట్టలు నిర్మించారు. ఈ రెండు నదుల మీద ఇవే తొలి ఆనకట్టలు. దాదాపు వందేళ్ల తరువాత ఈ రెండు ఆనకట్టల్ని బ్యారేజిలుగా ఆధునీకరించారు. కృష్ణా, గోదావరి నదుల డెల్టాలోవున్న కారణంగా ఈ రెండు నదుల వరద వుధృతిని తట్టుకోవాల్సిన భారం కూడా ఈ రెండు బ్యారేజీలపై వుంది.
కృష్ణా, గోదావరి నదుల ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర,, ఒడీషా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లకు తెలంగాణ కూడా చేరడంతో దిగివ రాష్ట్రమైన భావి ఆంధ్రప్రదేశ్ లో సాగునీరుతోపాటూ, తాగునీటికీ ఇబ్బంది తప్పదనే అభిప్రాయం కొట్టిపడవేయదగిందేమీ కాదు. అందుకే, సీమాంధ్ర రైతుల ఆందోళనని పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఈ చట్టంలోని 14వ అధ్యాయంలో 84 నుండి 91వ నిబంధన వరకు జలవనరుల నిర్వహణ, అభివృద్ధి అంశాలకు సంబంధించి ఎనిమిది నిబంధనల్ని పొందుపరిచారు.
కొత్త చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణను పర్యవేక్షించడానికి, అప్పాయింటేడ్ డే రోజునే కేంద్ర ప్రభుత్వం ఒక అపెక్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తుంది. అపెక్స్ కౌన్సిల్ కు కేంద్ర జలవనరుల మంత్రి చైర్పర్సన్గానూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగానూ ఉంటారు. అప్పాయింటేడ్ డే నుండి అరవై రోజుల లోపు గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డు, కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డును పేరిట రెండు ప్రత్యేక మండళ్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ మండళ్ల పనితీరును అపెక్స్ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. అవసరమైన సందర్భాల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రతిపాదనలను రూపొందించడం, ఆమోదించడంతోపాటు కేంద్ర జలసంఘానికి నదీ జలాలనిర్వహణ మండళ్లు అందజేసే ప్రతిపాదనలను కూడా అపెక్స్ కౌన్సిల్ ముందుగా మదింపు చేస్తుంది. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపణీ మీద ఏదైనా వివాదం తలెత్తినపుడు సంప్రదింపుల ద్వారా దాన్ని పరిష్కరించడానికి అపెక్స్ కౌన్సిల్ కృషిచేస్తుంది.
అంతర్ రాష్ట్ర నదీ జలవివాదాల చట్టం ప్రకారం ఏర్పడిన కృష్ణా నదీజలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ కిందకు రాని కొత్త వివాదాలను పరిష్కరించడానికి ఒక ట్రిబ్యునల్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
నదీలలాల నిర్వహణ బోర్డులు రెండూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వయం ప్రతిపత్తిగల సంస్థలుగా పనిచేస్తాయి. ఈ బోర్డుల చైర్మన్లను, సభ్యులను కూడా కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. రెండు బోర్డులకు కేంద్రం నియమించే చీఫ్ ఇంజనీర్ హోదా గల అధికారులు పూర్తిస్థాయి సభ్యకార్యదర్శిగా ఉంటారు. గోదావరినదీ నిర్వహణ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రంలోనూ, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని భావి ఆంధ్రప్రదేశ్లోనూ ఏర్పాటు చేస్తారు.
అంతర్రాష్ట నదీజలాల వివాదాల ట్రిబ్యునళ్ళు ఇచ్చిన తీర్పుల్నీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్టాలతోగానీ, కేంద్ర పాలిత ప్రాంతంతోగానీ చేసుకున్న ఒప్పందాల్నీ అమలు చేస్తూ, కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటి సరఫరా నియంత్రణ, విద్యుత్ సరఫరా నియంత్రణ తదితర బాధ్యతల్ని ఈ బోర్డులు నిర్వహిస్తాయి. నీటిప్రవాహం తగ్గిన సందర్భాల్లో ప్రాజెక్టులవారీగా నీటి విడుదలకు ఒక సమంజసమైన విధివిధానాలను రూపొందించి అమలు చేస్తాయి.
ఇలాంటి నదీలలాల నిర్వహణ బోర్డు ఒకటి ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టులో వుంది. ఆ బోర్డులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సభ్యత్వం వుంది. ఇకముందు తుంగభద్ర బోర్డులో తెలంగాణ రాష్టానికి కూడా సభ్యత్వం కల్పిస్తారు.
నదీ నిర్వహణ బోర్డులు, అపెక్స్ కౌన్సిళ్ళు సమర్ధంగా పనిచేస్తే భావి ఆంధ్రప్రదేశ్ లో సాగునీటికీ, తాగునీటికీ, పరిశ్రమల నీటికి కోదవ వుండదని ఆశించవచ్చు.
అధ్యాయం – 6 : పోలవరం ప్రాజెక్టు
అంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణలో, హైదరాబాద్ నగరం తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న అంశం పోలవరం ప్రాజెక్టు. ఇది గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్టు. దాదాపు నూట అరవై సంవత్సరాల క్రితం సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడు ధవిళేశ్వరం ఆనకట్ట కట్టిన రోజుల్లోనే గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించాడు. అప్పటి నుండి పోలవరం ప్రాజెక్టు సీమాంధ్రుల మదిలో తరచూ మెరుస్తూనేవుంది. 1996 నుండి ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సీమాంధ్రలో అడపదడపా ఆందోళనలు సాగుతూనే వున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతూనే వుంది.
చాలా కాలం తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా వున్న భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత ఖమ్మం జిల్లాలో కలపగా, రాష్ట్ర విభజన సమయానికి ఈ ప్రాంతం తెలంగాణలో అంతర్భాగంగా వుంది. సీమాంధ్రకు చెందిన ఈ ప్రాజెక్టు ముంపుప్రాంతం గిరిజన ప్రాంతం కావడం, అది తెలంగాణలో వుండడం, పైగా ఆ ప్రాంతంలో భద్రాచలం వంటి సుప్రసిధ్ధ దేవాలయం వుండడం మొదలయిన అంశాలతో పోలవరం నిర్మాణం సాంకేతికంగా, రాజకీయంగా సంక్లిష్టంగా మారింది.
పోలవరం ప్రాజెక్టు లక్ష్యాలు, పరిధి, పరిమితులు దశాబ్దాలుగా అనేక మార్పులు చెందుతూ ప్రస్తుతం ఓక కొల్లిక్కి వచ్చాయి. గోదావరి నది నుండి 80 టీయంసీల నీటిని ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణానదిలోనికి మళ్ళించి, ఆమేరకు, నాగార్జునసాగర్ నుండి కృష్ణాడెల్టాకు విడుదల చేసే నీటిని ఆదాచేసి, రాయల సీమకు మేలుచేసే తెలుగుగంగ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్.ఎల్.బి.సి) లకు నికర జలాలను కేటాయించాలనేది పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత ప్రకటిత ప్రధాన లక్ష్యం. ఆ విధంగా దాన్ని తీరాంధ్ర నేలమీద కడుతున్న రాయలసీమ ప్రాజెక్టు అనవచ్చు. విశాఖపట్నానికి 23 టియంసీల తాగునీరు, కొత్త కాలువల పరివాహక ప్రాంతంలో 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడం, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం కూడా ఈ బహుళార్ధసాధక ప్రాజెక్టు లక్ష్యాల్లో వున్నాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనేకాక, నిర్వహణలోనూ అనేక మెలికలున్నాయి. భవిష్యత్తులో, దిగువ రాష్ట్రమైన అంధ్రప్రదేశ్ నదుల అనుసంధానంవల్ల అదనపు నీళ్ళను కృష్ణా బేసిన్ లోనికి మళ్ళిస్తే, అందులో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు వాటా ఇవ్వాలని 1976 నాటి ఆర్.యస్. బచావత్ కృష్ణా జల వివాదాల ట్రిబ్యూనల్ తీర్పులో ఒక నిబంధనవుంది.
పోలవరం నిర్మిస్తే, 80 టియంసీలలో మహారాష్ట్రకు 18 శాతంగా 14 టియంసీలు, కర్ణాటకకు 27 శాతంగా 21 టీయంసీల నీళ్ళు ఇవ్వాల్సి వుంటుంది. అంటే, ఎగువరాష్ట్రాలకు 35 టీయంసీలు పోగా మిగిలేది 45 టీయంసీలే. వీటిల్లో 30 టీయంసీలు ఎస్.ఎల్.బి.సి.కు 15 టీయంసీలు తెలుగుగంగకు కేటాయించాలని 1985లో, యన్.టీ. రామారావు ప్రభుత్వం నిర్వహింహించిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇప్పటివరకు నికర జలాల కేటాయింపులులేవు..
పొలవరం ప్రాజెక్టు పూర్తయ్యి, కృష్ణా బేసిన్ కు నీరు విడుదల అవ్వడం మొదలయ్యాక, మహారాష్ట్ర, కర్ణాటకల మీదుగా మన రాష్ట్రంలోనికి వచ్చే కృష్ణా నికరజలాలు అధికారికంగా 35 టీయంసీలు తగ్గిపోతాయి. మరో 45 టీయంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమకు విడుదలైపోతాయి. ఆమేరకు, నాగార్జునసాగర్ నుండి కృష్ణాడెల్టాకు విడుదలయ్యే నీటిలో 80 టీయంసీల కోత విధిస్తారు.
పోలవరం ప్రాజెక్టువల్ల కృష్ణాడెల్టాకు నీటి కేటాయింపులు ఏమీ పెరగవు. అయినా, ఆ ప్రాంతానికి రావలసిన వాటా నీరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో ముందుగానే అందుబాటులో వుండడంవల్ల కృష్ణాడెల్టా ఆయకట్టు రైతులు ఖరీఫ్, రబీ నాట్లు సకాలంలో వేసుకోవడానికి వీలు కుదురుతుంది. ఆ విధంగా పోలవరం అనేది రాయలసీమ, తీరాంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలకు మేలు చేసే ప్రాజెక్టు.
ముంఫు ప్రాంతం విస్తారంగా వుండడం, నిర్వాశితుల సంఖ్య ఎక్కువగా వుండడం, నిర్మాణ వ్యయం భారీగా వుండడం, ఒడీషా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలతో సరిహద్దు తగవులు వుండడం, తదితర కారణలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చాలా కాలంగా అడ్దంకిగా మారుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు తొమ్మిదో అధ్యాయంలో చేర్చింది. అందులోని తోభైయ్యవ క్లాజు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ప్రజోపయోగం కోసం ఈ ప్రాజెక్టుని నిర్మాణాన్ని చేపట్టి, పూర్తి చేసే బాధ్యతను కేంద్రప్రభుత్వం స్వీకరిస్తుందని విస్పష్టంగా పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో, సంప్రదింపులు జరిపి, పర్యావరణ, అటవీ, నిర్వాశితులకు సహాయక, పునరావాస ప్రమాణాలన్నీ పాటించి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు సంతృప్తి కలిగే విధంగా భద్రాచలం డివిజన్ ను విడగొట్టారు. విఖ్యాత శ్రీలక్ష్మణసమేత సీతారామరామచంద్రస్వామి ఆలయం వున్న భద్రాచలం రెవెన్యూ పట్టణాన్ని తెలంగాణకు ఇచ్చి, మిగిలిన ముంపు గ్రామాల్ని సీమాంధ్రలో కలిపారు.
త్వరలో ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో నిర్మితమయ్యే ప్రాజెక్టు కనుక పోలవరంకు కూడా నదీజలాల నిర్వహణ మండలి, అపెక్స్ సంఘం వుంటాయి. భవిష్యత్తులో తలెత్తే వివాదాలను ఇవి పరిష్కరిస్తాయి. నదీజలాల నిర్వహణ మండలి ఇచ్చే ఆదేశాలను ఏ రాష్ట్రమైనా అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం విధించే కఠిన పెనాల్టీని సదరు రాష్ట్రం ఎదుర్కోవాల్సి వుంటుందని రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు 11వ షెడ్యూలులో పేర్కొన్నారు.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం మీద ఆసక్తిని కనపరఛడం విశేషం. ఈ బిల్లు రూపశిల్పి, కేంద్ర మంత్రుల బృందం ( జీవోయం)లో కీలక సభ్యుడైన జైరాం రమేశ్ ఇటీవల జరిపిన రాష్ట్ర పర్యటనలో పశ్చిమగోదావరిజిల్లా పరిధిలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని, దేవరగొంది నిర్వాసిత గ్రామాన్ని, పునరావాస గ్రామాలను స్వయంగా సందర్శించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి మ్యాప్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున 90 శాతం నిధులు కేంద్రమే భరిస్తుందని మరోమారు గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు 45 వేల కుటుంబాలు నిర్వాసితులవుతారని అంచన. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క మీటర్ తగ్గిస్తే ముంపు ప్రాంతం ఎంత తగ్గుతుందనే విషయంపై పరిశీలన చేయాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు ప్రర్యవేక్షక ఇంజినీరు పోలేశ్వరరావును కేంద్ర మత్రి కోరారు. 2013 సెప్టెంబర్ నుండి ప్రత్యేక భూసేకరణ చట్టం అమల్లో వున్నందున పోలవరం నిర్వాసితులకు కూడా న్యాయం చేయడం జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. 16 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 2019 నాటికి పూర్తి అవుతుంది. nATiki
అధ్యాయం – 7 : ఆదాయ వనరులు
వుమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి దాదాపు ఆరున్నర దశాబ్దాలుగా పారిశ్రామిక అభివృధ్ధి అంతా రాజధాని నగరమైన హైదరాబాద్ పరిసరాల్లోనే సాగింది. దానితో, రాష్ట్రంలో ప్రాంతాల మధ్య తీవ్ర అసమతుల్యత చోటుచేసుకుంది. రాష్ట్ర విభజన అంశం ముందుకు వచ్చినపుడు సీమాంధ్రుల్ని ఆందోళనకు గురిచేసిన అంశం ఇదే.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పదవ అధ్యాయంలో మౌలిక సదుపాయాlu, ప్రత్యేక ఆర్థిక చర్యలకు సంబంధించిన నిబంధనల్ని పొందుపరఛడమేగాక, 12, 13వ షెడ్యూLLaళ్లలో వీటిని అమలు పరిచే ప్రణళికను చేర్చారు.
బొగ్గు, చమురు, సహజవాయువు, విద్యుదుత్పత్తి, ట్రాన్స్మిషన్, పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మూల సూత్రాలు, మార్గదర్శకాలు, ఆదేశాలు, ఉత్తర్వులను కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు, అవి ఏర్పాటైన తేదీ నుంచే అమలు చేయాలని పదవ అధ్యాయంలో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లోనూ పారిశ్రామికీకరణను, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి పన్ను ప్రోత్సాహకాలు అందించడంతోపాటూ అవసరమైన ఆర్థిక చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని నిర్దేశించారు. రెండు రాష్ట్రాల్లో భౌతిక, సాంఘికపరమైన విస్తరణతోసహా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అండించాలని పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణానికి నిధులెక్కడ? అని సీమాంధ్రులు అడుగుతున్న ప్రశ్నలకూ సమాధానం ఇవ్వడానికి ఈ బిల్లు ప్రయత్నించింది. రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ఇతర మౌలిక సదుపాయాలుసహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిలో అవసరమైన సౌకర్యాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాలని బిల్లులో పేర్కొన్నారు. అవసరమని భావిస్తే అటవీ ప్రాంతాన్ని డీ నోటిఫై చేసయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్రం వీలు కల్పించాలన్నారు.
సింగరేణి కాలరీస్ సంస్థతో ఇప్పటికే చేసుకున్న బొగ్గు ఒప్పందాలన్నీ ఎటువంటి మార్పులు లేకుండా యథావిథిగా కొనసాగుతాయని బిల్లు 12వ షెడ్యూలులోపేర్కొన్నారు. ప్రస్తుత థర్మల్ కేంద్రాలకున్న కేటాయింపుల ప్రకారం సింగరేణి సంస్థ బొగ్గును సరఫరా చేయాలని నిర్దేశించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే కొత్త కోల్ ఒప్పంద విధానం ప్రకారం కొత్త రాష్ట్రాలు బొగ్గు కేటాయింపు ఒప్పందాలు చేసుకోవడానికి వీలుకల్పించారు.
చమురు, సహజ వాయువు వెలికితీతపై వచ్చే రాయల్టీని సంబంధిత రాష్ట్రానికే చెల్లించాలని పేర్కొన్నారు. అంటే ఆ రాయల్టీ ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సి వుంటుంది.
ఏపీ జెన్కోకు చెందిన విద్యుత్కేంద్రాలు ఎక్కడ ఉన్న కేంద్రాలు ఆయా రాష్ట్రాలకే చెందుతాయి. ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న, నిర్మాణంలోవున్నప్రాజెక్టులు డిస్కంలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు యదాతధంగా కొనసాగుతాయన్న నిబంధనలవల్ల కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా మేలు జరుగుతుంది. ఆ రాష్ట్రంలో విద్యుత్ లోటు లేకపోగా మిగులు వుండే అవకాశాలుంటాయి.
విద్యుత్ ఉత్పత్తితో పాటూ బొగ్గు, సహజవాయువుల సరఫరాకు ఇబ్బంది లేనపుడూ కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతోధికంగా పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అవకాశాలేర్పడతాయి.
అధ్యాయం – 8 : మౌళికరంగ అభివృధ్ధి
ఎక్కడయినా మౌళికవసతుల్ని ఏర్పాటు చేయడమే అభివృధ్ధికి తొలి అడుగు అవుతుంది. మౌళిక వసతులు పెరిగితే అభివృధ్ధి దానికదే ముందుకు సాగుతుంది. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామీకరణ, ఆర్దికాభివృధ్ధి వేగవంతంగా సాగేలా ప్రోత్సహించం కోసంపన్ను రాయితీలతోసహా అనేక ఆర్ధిక చర్యలు, ప్రోత్సాహకాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన అనేక అంశాలను బిల్లు లోనే చేర్చారు. ఆ తరువాత రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధాని మరికొన్ని హామీలను ఇచ్చారు.
కొత్త మౌళికరంగ నిర్మాణ పథకంలో దూగరాజపట్నం ఓడరేవు, వైయస్సార్ కడప జిల్లాలో భారీ ఉక్కుకర్మాగారం. గ్రీన్ ఫీల్డ్ నూనెశుధ్ధి కర్మాగారం, విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్, అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, రైల్వే జోన్, మెటో రైళ్ళు తదితర అంశాలున్నాయి.
కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్తీకరణ బిల్లు ఇచ్చిన గొప్పవరం నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం నౌకాశ్రయ నిర్మాణం. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టులలో ఒకటిగా దుగరాజపట్నం పోర్టును తీర్చిదిద్దుతామన్నారు. దుగరాజపట్నం నౌకాశ్రయం తొలిదశ నిర్మాణాన్ని 2018 నాటికిపుర్తి చేస్తామని రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్నారు.
దాదాపు తొమ్మిది వందల కీలోమీటర్ల పొడవున్న ఆంధ్ర ప్రదేశ్ తీరప్రాంతంలో డజన్ల సంఖ్యలో భారీ, మధ్యతరహా, చిన్న తరహా ఓడరేవులు నిర్మించడానికి అవకాశముందని చోరగుడి జాన్సన్ వంటివాళ్ళు చాలా కాలంగా చెపుతూవస్తున్నారు. హైదరాబాద్ ఆకర్షణలోపడిపోయిన సీమాంధ్ర నేతలు తమ ప్రాంతంలో అభివృధ్ధికి వున్న అపార అవకాశాలను గమనించడంలేదని వారంటున్నారు.
బ్రాహ్మణీ స్టీల్ ప్రాజెక్టు ఆగిపోవడంతో రాయలసీమ ప్రజలు నిరాశకు గురై వున్నారు. వైయస్సార్ కడప జిల్లాలో భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి వున్న అవకాశాలను పరిశీలింఛే బాధ్యతను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్ ) కు ఇచ్చారు. సెయిల్ ఆరు నెలలలోగా ఈ అంశంపై తన నివేదికను భారత ప్రభుత్వానికి అందజేయాల్సి వుంటుంది. సెయిల్ నివేదిక సానుకూలంగా వుంటే, రాయలసీమలో భారీ వుక్కు కర్మాగారం సాకారం కావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.
తీరాంధ్రలో కొత్తగా ఒక గ్రీన్ ఫీల్డ్ నూనెశుధ్ధి కర్మాగారం నెలకొల్పడానికి వున్న అవకాశాలను పరిశీలింఛే బాధ్యతను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కుగానీ, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ కుగానీ అప్పగిస్తారు. ఈ సంస్థలు కూడా భారత్ ప్రభుత్వానికి తమ నివేదికల్ని ఆరు నెలలలోగా సమర్పించాల్సి వుంటుంది. ఆ నివేదిక ఆధారంగా కెంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఢిల్లీ-ముంబాయి పారిశ్రామిక కారిడార్ తరహాలో, విశాఖపట్నం- చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికున్న అవకాశాలను కొత్త రాష్ట్రాలు ఏర్పడిన రోజు నుండి ఆరు నెలలలోగా పరిశీలించడమేగాక, దాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది.
అధ్యాయం –9 : రవాణ వ్యవస్థ అభివృధ్ధి
రోడ్లు నాగరీకతను ప్రసరించే నాడీమండలాలు. రవాణ వ్యవస్థ పటిష్టంగా లేనిదే ఎక్కడా అభివృధ్ధి వేగాన్ని పుంజుకోదు. కొత్తగా ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన రవాణా సౌకర్యాలని అభివృధ్ధి చేయడం ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ లో మాత్రమే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలున్నాయి. సీమాంధ్రలోని తిరుపతి , విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లో సాధారణ విమానాశ్రయాలున్నాయి, వీటిల్లో కొన్ని చోట్ల నైట్ సర్విసులకు కూడా అవకాశం లేదు. సీమాంధ్ర ప్రాంతంలో విమానయాన సర్వీసును తక్షణం ఆధునీకరించాల్సిన అవసరం వుంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ప్రస్తుతమున్న విమానాశ్రాయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృధ్ధ్ది చేయడానికికున్న అవకాశాలను పరిశీలించే బాధ్యతను భారత విమానయాన సంస్థకు ఇవ్వనున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఆరు నెలలలోగా భారత విమానయాన సంస్థ తన నివేదికను సమర్పించాలని ఒక కాలపరిమితిని కూడా విధించారు. భారత విమానయాన సంస్థ నివేదిక అందిన తరువాత విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల ఆధునీకరణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది.
కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైలు రవాణ వ్యవస్థను అభివృధ్ధి చేయడం కూడా కీలక పథకం. ఇప్పటి వరకూ అన్ని రైళ్లు, అన్ని రోడ్లు హైదరాబాద్ వైపుకు వేళ్ళేవి. ఇక కొత్త రైళ్ళు కొత్త రాజధాని వైపు మళ్ళాల్సివుంటుంది. సీమాంధ్రలో, రైల్వే నేట్ వర్క్ ను అభివృధ్ధి చేయడానికి వీలుగా ఆ ప్రాంతంలో ఒక రైల్వే జోన్ ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా నలుగుతూ వుంది. ఇప్పుడు కొత్త రాష్ట్రం ఎర్పడింది కనుక ఈ ప్రతిపాదనకు కొత్త బలం వచ్చినట్టు భావించవచ్చు. రైల్వే జోన్లు అనేది రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడే సాంప్రదాయం లేనప్పటికీ సీమాంధ్రలో కొత్త జోన్ ను ఏర్పాటు చేయాలనే గట్టి తలంపుతో కేంద్ర ప్రభుత్వం వుంది. ఛత్తీస్ గడ్ లో కొత్త రైల్వేజోన్ ఎర్పడ్డాక అక్కడ అభివృధ్ధి వేగాన్ని పుంజుకుంది. సీమాంధ్రలో కొత్త రైల్వేజోన్ ను ఏర్పాటు చేసే అంశాన్ని అప్పాయింటెడ్ డే నుండి ఆరు నెలలలోగాపరిశీలించడమేగాక, దాని నిర్మాణానికి భారతీయ రైల్వేశాఖ చొరవ తీసుకుంటుందని రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్నారు.
మహానగరాల ప్రజారవాణ వ్యవస్థలో మెట్రో రైళ్ళు కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రమే మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ దశలో వుంది. విశాఖపట్నంతో పాటూ, విజయవాడ – గుంటూరు - – తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటీ నగరాలలో కూడా మెట్రో రైలుమార్గాల నిర్మాణం చేపట్టాల్సి వుంది. ఈ ప్రాజెక్టుల్ని చేపట్టడానికికున్న అవకాశాల్ని ఆరు నెలలలోగా అధ్యయనం చేసి, వాటి నిర్మాణానికి చొరవ తీసుకుంటామని భారత ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇచ్చింది.
రాష్ట్రం విడిపోయినా, హైదరాబాద్ తో సీమాంధ్రది విడిపోయే బంధంకాదు. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నుండి హైదరాబాద్ కు విస్తృత రోడ్డురవాణ సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
అధ్యాయం – 10 : రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులు
కృష్ణానది కర్ణాటక నుండి రాయలసీమలో ప్రవేశించి, తెలంగాణ మీదుగా ప్రవహించి, తీరాంధ్ర చేరి బంగాళాఖాతంలో కలుస్తుంది. రాష్ట్రంలో కృష్ణానది ప్రవేశద్వారం దగ్గర వున్నప్పటికీ ఆ నదీజలాల్లో రాయలసీమకు దక్కినవాటా చాలా తక్కువ.
నిత్యకరువు ప్రాంతంగా రాయలసీమ పేరున్న రాయలసీమకు నీరందించడానికి గతంలో కేసి కెనాల్, శ్రీశైలం ఎడమగట్టు కాలవ, తెలుగుగంగ ప్రాజెక్టుల్ని నిర్మించారు. వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భారీగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రాయలసీమలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల్నీ. ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టునూ చేపట్టారు. ప్రస్తుతం ఇవి నిర్మాణదశలో వున్నాయి. వీటిల్లో కేసి కెనాల్ కు తప్ప మిగిలినవాటికి నికరజలాల కేటాయింపులు లేవు. అవన్నీ అదనపు జలాలు, వరదజలాల మీద ఆధారపడి నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులు.
రాయలసీమ ప్రాజెక్టుల్ని ప్రస్తుతం రెండు రకాల భయాలు వెంటాడుతున్నాయి. ఇందులో మొదటిది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పు. రెండోది రాష్ట్ర విభజన. 75 శాతం ఆధార జలాల్ని లెఖ్ఖగట్టిన బచావత్ ట్రిబ్యూనల్ కృష్ణానదిలో 2, 132 శతకోటి ఘనపు అడుగుల నికర జలాలున్నట్టు తేల్చింది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ 65 శాతం ఆధార జలాల్ని లెఖ్ఖగట్టి 2, 293 శతకోటి ఘనపు అడుగుల నికర జలాలున్నట్టు తేల్చడమేగాక అందులో 118 శతకోటి ఘనపు అడుగుlల నీటిని మహారాష్ట్ర, కర్ణాటకలకు కేటాయించేసింది.
రాష్ట్ర విభజనవల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాల నీటిపారుదలా ప్రాజెక్టులు రెండు రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాయని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర రెడ్డి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వుమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ముందు బలమైన వాదననీ వినిపించలేక పోయిన ప్రభుత్వం, చిన్న రాష్ట్రంగా మారిపోయినపుడు అంతకన్నా మెరుగైన ఫలితాలని రాబట్టుకోగలదా? అనేది మొదటి సమస్య. పెద్దరాష్ట్రం, భారీ బఘ్జెట్ వున్నప్పుడే కేటాయించలేని నిధుల్ని చిన్నరాష్ట్రం కేతాయించగలదా? అనేది ఇంకో సమస్య.
ఈ సందేహాలకూ ఇంకో పార్శ్వం కూడా వుంది. ఇప్పటి వరకు ఇరవై మూడు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ నాలుగు జిల్లాలు మాత్రమే. అంటే దాదాపు ఆరో వంతు. ఇక ముందు 13 జిల్లాల అంధ్రప్రదేశ్ లో రాయలసీమ మూడో వంతు. ఆ మేరకు కొత్త ప్రభుత్వంలో రాయలసీమ ప్రాబల్యం పెరుగుతుంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను కలుపుకుంటే, భావి ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో సగానికిపైగా వెనుకబడిన ప్రాంతాలే అవుతాyiయి. అందువల్ల కొత్త రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్రలదే ఆధిపత్యం వుండే అవకాశాలున్నాయి.
మరోవైపు, రాయలసీమ, ప్రకాశం జిల్లాల నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ దశలోవున్న, హంద్రీ – నీవా, తెలుగుగంగ, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజెక్టులన్నింటికీ ముందుగానే నిర్ణయించిన నీటికేటాయింపుల్ని కొనసాగించడమేగాక వాటిని నిర్ణిత కాలపరిమితి లోగా పూర్తిచేస్తామని రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో హామీ ఇచ్చింది.
అధ్యాయం – 11 : వెనుకబడినప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ
పదమూడు జిల్లాలతో ఏర్పడే భావి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీకాళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటూ రాయలసీమకు చెందిన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలను వెనుక బడిన పాంతాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఆంశాన్ని ప్రస్పుటంగా బిల్లులో పొందుపరచడమేగాక, రాజ్యసభలో ప్రధాని ప్రకటించిన ఆరు సూత్రాల హామీల్లోనూ పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించడానికి వీలుగా ఐదేళ్ళపాటు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తారు. దానివల్ల భావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక స్థితి పటిష్టంగా మారడానికి అవకాశం వుంటుంది. పారిశ్రామీకరణ, ఆర్ధికాభివృద్ధిని వేగవంతం ప్రస్తుతం కొన్ని ఇతర రాష్ట్రాలకు అందిస్రున్న తరహాలోనే ఈ పన్ను రాయితీలు కల్పించే ప్రోత్సాహకాలు వుంటాయి. కొత్త రాష్ట్రానికి ఇది ఒక వరం అనే చెప్పాలి.
కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అందించే ప్రోత్సాహం ప్రత్యేక ప్రతిపత్తి హోదాకే పరిమితంకాదు. సీమాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తర తీరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ని కూడా అందిస్తారు. ఒడీషా లోని కేబీకే, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల్లోని బుందేల్ ఖండ్ ప్రాంతాల్ని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి అభివృధ్ధి చేస్తోంది.
ఒడీషా నైరుతి ప్రాంతంలోని కలహండి, బాలంగీర్, కోరాపుట్ జిల్లాలను కేబికే జిల్లాలు అంటారు. తూర్పుకనుమల్లో కొండలు, అడవి, కొద్దిపాటి వ్యవసాయ భూములతోవున్న ఈ మూడు జిల్లాలు ఒడీషా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా పేరుగాంచాయి. కేంద్ర ప్రభుత్వం 1992లో ఈ మూడు జిల్లాలని వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింపునిచ్చి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ని ప్రకటించింది. అభివృధ్ధి పథకాల ఫలితాలు గ్రామస్థాయి వరకు అందేలా ముందుగా ఈ మూడు జిల్లాలని ఎనిమిది జిల్లాలుగా, 14 డివిజన్లుగా, 37 తాలుకాలుగా విడగొట్టారు. వీటి అభివృధ్ధికి అష్టవర్ష ప్రణాళికని రూపొందించి, కేంద్ర బడ్జేట్ నుండి దాదాపు 4 వేల కోట్ల రుపాయల ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు.
దక్షణ ఉత్తరప్రదేశ్ లోని ఏడు జిల్లాలని, ఉత్తర మధ్యప్రదేశ్ లొని ఆరు జిల్లాలని కలిపి బుందేల్ ఖండ్ ప్రాంతం అంటారు. నిరంతం కరువు కోరల్లో వుండే ఈ ప్రాంతంలోనే మనకు తెలిసిన ఝాన్సీ, చిత్రకూట్ జిల్లాలున్నాయి. ముందేల్ ఖండ్ ను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2009లో 7, 266 కోట్ల రూపాయల వ్యయంతో మూడేళ్ల కాలపరిమితికి ఒక అభివృధ్ధి ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్యాకేజీని 2009 నవంబరు 19 న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దేశంలోని వెనుకబడిన ప్రాంతాల జాబితాలో బుందేల్ ఖండ్, కేబికే ప్రాంతాల సరసన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను చేర్చడం కూడా ఒక విధంగా వరం అనే చెప్పాలి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృధ్ధికి కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రణళికను రచించి, భారీగా ఆర్ధిక సహాయాన్ని అందించే అవకాశాలున్నాయి. సాక్షాత్తు ప్రధాన మంత్రే, రాజ్యసభ సాక్షిగా హామీ ఇచ్చారు కనుక రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల దశ మారిందనుకోవచ్చు.