Love is emotion & Marriage is institution
ప్రేమ ఉద్వేగం – వివాహం వ్యవస్థ
- ఉషా యస్ డానీ
సమాజంలోని వ్యవస్థలన్నింటికీ ఆర్ధికం, సాంస్కృతికం అనే రెండు కర్తవ్యాలుంటాయి. ఆర్ధిక కార్యకలాపమే ఏ వ్యవస్థకయినా ప్రాణప్రద అంశం. అయితే మనుషులకుండే ఆదిమ భావోద్వేగాలకు ఆర్ధిక కార్యకలాపాలకు పడదు. సమాజంలో భావోద్వేగాలు ముందు పుట్టి ఆర్ధిక కార్యకలాపాలు తరువాత వచ్చాయి. అందువల్లే, ప్రతి వ్యవస్థలోనూ అర్ధిక కార్యకలాపాలకు ఆమోదాంశాన్ని కల్పించడానికి దాని మీద సాంస్కృతిక మూతనో, తెరనో కప్పుతుంటారు. ఆసియా వాసులకు సెంటిమెంట్స్ ఎక్కువని పశ్చిమ దేశాలవాళ్ళు అంటుంటారు. దాని అర్ధం ఏమంటే, ఆసియా దేశాల్లో సాంస్కృతిక కప్పు దాదాపు ఇనప తెరలా వుంటుంది. దాన్ని అధిగమించి అందులో దాగున్న ఆర్ధికకోణాన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యం. మతాలన్నీ ఆసియా ఖండంలోనే ఆవిర్భవించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.
ఉత్పత్తి పెరిగితే పేదరికం తగ్గుతుందని నమ్మేవాళ్ళు కొందరు ఉంటారు. నిజానికి ఉత్పత్తి పెరిగేకొద్దీ వ్యక్తిగత ఆస్తి పెరుగుతుంది. వ్యక్తిగత ఆస్తి పెరిగేకొద్దీ మనుషుల్లో స్వార్ధం పెరుగుతుంది. స్వార్ధం పెరిగేకొద్దీ సమాజంలో పేదరికం పెరుగుతుంది. భూతాపం పెరిగి ఓజోన్ పొరకు రంధ్రాలుపడి అతినీల కిరణాల ధార్మికశక్తి విజృంభించినట్టు, మనుషుల్లో స్వార్ధం పెరిగేకొద్దీ సాంస్కృతిక పొరలకు చిల్లులుపడి వ్యవస్థల్లోని ఆర్ధిక కార్యకలాపాలు నగ్నంగా బయటపడిపోతాయి.
ప్రేమ వేరు. వివాహం వేరు. ప్రేమ ఉద్వేగం. వివాహం వ్యవస్థ ప్రేమలో ఆదిమ భావోద్వేగాలు పుష్కలంగా వుంటాయి. వివాహ వ్యవస్థలో వ్యక్తిగత ఆస్థి, అస్థిత్వాల పరిరక్షణ, వారసత్వాల భద్రత అనే నిర్దేశిత ఆర్ధిక కార్యకలాపాలు వుంటాయి. మరోమాటల్లో చెప్పాలంటే, సాంస్కృతిక వ్యవహారంగా కనిపించే పచ్చి ఆర్ధిక కార్యకలాపం వివాహ వ్యవస్థ. ఇటీవలి కాలం వరకు భారతదేశంలో స్త్రీలకు ఆస్థిహక్కు లేదు. వ్యక్తిగత ఆస్థిని కూడబెట్టడం భర్త కర్తవ్యం అయితే, భర్తకు వారసుల్ని కనడం, భర్త కూడబెట్టిన వ్యక్తిగత ఆస్థిని అతని సంతానానికి సంక్రమంగా చేర్చడం భార్య కర్తవ్యం. ఈ రెండు కర్తవ్యాలను నెరవేర్చమనడం అంటే భార్య పాతివ్రత్యాన్ని పాటించాలని అర్ధం.
పాతివ్రత్యం అనేది వందల సంవత్సరాలు ఒక సాంస్కృతిక విలువగా కొనసాగినప్పటికీ మహిళలందరూ దాన్ని ఆమోదించారనికాదు. వీలు దొరికినప్పుడెల్లా దాన్ని వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖండిస్తూనే వున్నారు. ఆస్థిహక్కు, ఆర్ధిక స్వేఛ్ఛ వచ్చేకొద్దీ మహిళల నిరసనకు మార్గాలు పెరుగుతాయి, దానితో సాంస్కృతిక పొర పలచబారిపోతుంది.
సాంస్కృతిక విభాగం బలంగా వున్నప్పుడు ఏ వ్యవస్థ అయినా ఉద్వేగ భరితంగా కనిపిస్తుంది. అందులోని ఆర్ధిక విభాగం బాహాటంగా బయటికి వచ్చినపుడు ఉద్వేగమంతా ఆవిరైపోతుంది. బయట చెలరేగిపోతున్న ఆర్ధికపోటీ, స్వార్ధం ఇంటిలోనికి ప్రవేశించినపుడు దాంపత్య కర్తవ్యాలను నిర్వర్తించడం భార్యకేకాక భర్తకు కూడా ఇబ్బందిగా మారుతుంది. ప్రేమ వంటి భావోద్వేగాలు అంతరించిపోయి కఠినమైన ఆర్ధిక నియమాలు విజృంభిస్తాయి. భార్యకు భర్త ఒక అణిచివేతయంత్రంగా కనిపిస్తే, భర్తకు భార్య గుదిబండగా కనిపిస్తుంది. వివాహ వ్యవస్థలో తలెత్తే ఇలాంటి వత్తిళ్ళు వివాహేతర సంబంధాలకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.
సరిగ్గా ఇక్కడి వరకు వచ్చి ఆగుతుంది అపర్ణ తోట కథ ‘ ప్రేమకథ - రిఫైన్డ్’. పెళ్ళయి భర్త, పిల్లలున్న ఒకామెకు, పెళ్ళయి భార్యా. పిల్లలున్న ఒకతనికి మధ్య ఏర్పడిన వివాహేతర ఆకర్షణ, అందులోని ఘర్షణని అపర్ణ బాగా చిత్రించింది.
సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది కుప్పిలిపద్మ కథ సెకండ్ హజ్బెండ్. ఆ కథలో, దక్షిణ - అనిల్ ఇద్దరికీ సెకండ్ మ్యారేజే. అనిల్ ఇంటి పూజగదిలో మొదటి భార్య గౌరిది పెద్ద ఫొటో వుంటుంది. ఆమె పుట్టిన రోజును అతను ఆడంబరంగా చేస్తుంటాడు. దక్షణ మొదటి భర్త విశ్వాస్ పుట్టిన రోజున అతని ఫొటోను కూడా పూజకు పెట్టడంతో వివాదం మొదలవుతుంది. భార్యకు బహుళ అస్థిత్వాలు వుండడాన్ని వివాహ వ్యవస్థ ఒప్పుకోదు.
ఆఫీసు, ఇల్లు మాత్రమేకాదు సమాజంలోని వ్యవస్థలన్నీ రాజ్యానికి ప్రతిరూపాలే. వివాహేతర సంబంధాలు వివాహంగా మారితే మళ్ళీ ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ వ్యవస్థలో మొదటి భర్త అయినా వందో భర్త అయినా పెద్దగా మార్పు వుండదు. సాంస్కృతిక ముసుగులో సాగే ఆర్ధిక ఘర్షణను, ఆ క్రమంలో వచ్చే సన్నివేశాల్ని హ్యాండిల్ చేయడంలో కుప్పిలిపద్మ అనుభవం, నైపుణ్యం రెండూ ప్రస్పుటంగా కనిపిస్తాయి.
- ఉషా ఎస్ డానీ
రచయిత, విమర్శకుడు
మొబైల్ : 90107 57776
హైదరాబాద్
4 జూన్ 2015
ప్రచురణ : సాక్షి సాహిత్యం, 21 జూన్ 2015
http://www.sakshi.com/news/opinion/marriage-system-love-exictment-250428
No comments:
Post a Comment