Monday, 20 July 2015

Karamchedu : Past, Present and Future Part - 3

కారంచేడు – గతం వర్తమానం భవిష్యత్తు.
(పార్ట్ -3)
ఉషా యస్ డానీ






నిందితులకు బెయిలు సంపాదించడానికి ఆ రాత్రి, మరునాడు ఉదయం అనేక మంది లాయర్ల ఇంటికి తిరిగాము. కారంచేడు  పెత్తందార్లకు భయపడి ఎవ్వరూ మా కేసును స్వీకరించడానికి సిధ్ధంగాలేరు. అదీగాక, వంద మందికి బెయిల్ తేవడానికి ధరావత్తు కోసం చాలా డబ్బు కావాలి. లాయర్లు మనల్ని పట్టించుకోకపోతే  మనమూ న్యాయస్థానాల్ని పట్టించుకోవద్దు అని ఒక తార్కిక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా న్యాయమూర్తి బెంచి మీద వుండగానే నినాదాలు చేసుకుంటూ కోర్టు బోనులో వున్నవాళ్లందరినీ బయటికి తీసుకుని వచ్చేశాను. ఇది సెప్టెంబరు 12 ఉదయం సన్నివేశం.

పోలీసులు అరెస్టు చేసిన 50 మందిని బెయిల్ లేకుండానే బయటికి తెచ్చివేయడం, జడ్జీ ముందే కోర్టుల్ని బహిష్కరించడం చీరాలలో  పెద్ద సంచలనంగా మారిపోయింది. రెండు రోజులు ప్రశాంతంగా గడిచాయి. కోర్టుల మీద విజయం సాధించాం అనుకున్నాం. ఆ దర్పంలో 13వ తేదీ రాత్రి కొంచెం అలసత్వంతో, ఏమీ జరగదనే ధీమాతో నా కోళ్ల గూటికి వెళ్ళకుండా పరంజ్యోతి వాళ్ల ఇంట్లో పడుకున్నాను. ఆ రాత్రే నాతోపాటు  పరంజ్యోతిని అరెస్టు చేశారు. ఆరోజే ఊరి నుండి వచ్చిన పరంజ్యోతి వాళ్ల అన్నయ్యనూ అరెస్టు చేశారు. పాపం ఆయనకు ఉద్యమంతో సంబంధంలేదు.  ఆ రాత్రి ఊర్లో అక్కడక్కడ అరెస్టు చేసిన ఇతరులతో కలిపి మొత్తం ఎనిమిది మంది అయ్యాము. మమ్మల్ని పోలీసు జీపుల్లో చాలా చోట్ల తిప్పారు. ఎన్ కౌంటర్ చేసేస్తారేమో అన్నంత భయోత్పాతం సృష్టించారు.

ఆ రాత్రంతా మమ్మల్ని విడివిడిగా వేరువేరు గదుల్లోవుంచి ఇంటరాగేషన్ చేశారు. పీపుల్స్ వార్ పంపిన ప్రతినిధి నేనే అని పోలీసు అధికారులకు ముందే సమాచారం వుంది. నాకు ఆదేశాలిచ్చే మరో నాయకుడు ఒకడు చీరాల పరిసరాల్లోనే వుండి వుంటాడని వాళ్లకు  గట్టి నమ్మకం.  దానితో నన్ను రెండు మూడుసార్లు  విడిగా కూర్చోబెట్టి ప్రశ్నించారు.

ఒక్కోసారి పోలీసు ఇంటరాగేషన్ కూడ చిత్రంగా వుంటుంది. డీయస్పీ (నరసింహారావు అని గుర్తు) దగ్గర మార్కులు కొట్టేయాలనేమో సిఐ (ఏదో జే. రెడ్డి) నన్ను బూతులు తిట్టాడు. ఆ డీయస్పీ మర్యాదస్తుడు. సిఐను  వారించాడు. “ప్రశ్నలు అడుగు. కానీ తిట్టవద్దు. వాళ్ళూ చదువుకున్నవాళ్ళే” అన్నాడు. డీయస్పీ ఆ మాట అనగానే సిఐ మరీ తగ్గిపోయాడు. అలా ఆరాత్రి గడిచింది గానీ మా భవిష్యత్తు మరునాడు ఉదయం జిల్లా ఎస్పీ తేలుస్తాడు అని తెలిసింది. అంతవరకు ఎన్ కౌంటర్ ఆప్షన్ వున్నట్టే!

ఉదయం టాయ్ లెట్ దగ్గర ఒక విచిత్రం జరిగింది. నేను లోపల వుండగా నన్ను తీసుకుని వచ్చిన కానిస్టేబుళ్ళలో ఒకడు “నీకూ నాకూ తేడాలేదన్నో ఓ పోలీసన్నా. పోరుతప్ప దారిలేదన్నో ఓ పోలీసన్న” పాట కూనీరాగం తీస్తున్నాడు. అతను మన మీద సానుకూల వైఖరితో వున్నాడనిపించింది. బయటికి రాగానే అతని దగ్గరే చిన్న కాగితం తీసుకుని విజయవాడ  ఆంధ్రప్రభలో పనిచేస్తున్న మా విరసం సహచరుడు బీ. జగన్ ఫోన్  నెంబరు రాసిచ్చాను. “నాకో సహాయం చేయండి. నన్ను ఈ పోలీస్ స్టేషన్లో  వుంచారని ఈ ఫోన్ నెంబరుకు ఎస్టీడి చేసి చెప్పండి. మీకివ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు” అని అభ్యర్ధించాను.

ఆరోజుల్లో సెల్ ఫోన్లు లేవు. ఎస్టీడీ చేయాలంటే సయమం డబ్బూ రెండూ వెచ్చించాలి. అయినా ఆ పని ఆ కానిస్టేబుళ్ళు చేసిపెట్టారు. ఎస్పీ  చీరాల చేరక ముందే, 12 గంటల ఆకాశవాణి విజయవాడ వార్తల్లో నన్ను అరెస్టు చేసినట్టు వచ్చేసింది. పైగా నా అరెస్టును నాగార్జున యూనివర్శిటీ నుండి అమంచర్ల సుబ్రహ్మణ్యం ఖండించినట్టూ వచ్చింది. రెండు గంటల వార్తల్లో అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ విద్యార్ధులు కొందరు నా విడుదల కోరుతూ  నిరసన ప్రదర్శన చేశారని, అనంతపురం-బెంగుళూరు రోడ్డు మీద రాస్తారోకో చేశారని వచ్చింది. అలా చేయమని వారికి అప్పటి తెలుగు విభాగం అధిపతి కొలకలూరి ఇనాక్ చెప్పారని, హైకోర్టులో కొందరు లాయర్లు నాకోసం హెబియస్ కార్పొస్ పిటీషన్ వేశారనీ,  ఢిల్లీలో కూడా కదిలిక వచ్చిందని, కొందరు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారని  నాకు తరువాతి కాలంలో తెలిసింది. ఏమైనా రాత్రి అయ్యేసరికి పోలీస్ స్టేషన్ లో మా టెన్షన్ తగ్గి పోలీసుల టెన్షన్ పెరిగింది.

అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వుంది. రాజీవ్ గాంధి ప్రధానమంత్రి. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో వుంది. సలగల రాజశేఖర్ సెప్టెంబరు మొదటి వారంలో కొందరు బాధితుల్ని రాజీవ్ గాంధి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అలా ప్రధానికి చీరాల పరిణామాలు కొంత తెలుసు. కేంద్రంలో రాష్ట్రంలో భిన్నమైన ప్రభుత్వాలు వుండడం కూడ కారంచేడు ఉద్యమానికి ఒక సానుకూల అంశం. 

 మరునాడు చీకటి పడ్డాక ఎస్పీ చీరాల పోలీసు స్టేషన్ కు వచ్చారు. “వీళ్ళ నెట్‍ వర్క్  ఢిల్లీ వరకు వుంది సార్ !” అని డీయస్పీ ఎస్పీకీ వివరించారు. ఆ తరువాత ఎస్పీ ఆదేశాల మేరకు మమ్మల్ని అర్ధరాత్రి మెజెస్ట్రేట్ ఇంట్లో ప్రవేశపెట్టారు. ఆ రాత్రికి మళ్ళీ చీరాల పోలీసు స్టేషన్ లో వుంచారు. మరునాడు ఉదయం ఆంధ్రప్రభ మొదటి పేజీలో “డానీ ఎక్కడా?” అని పెద్ద వార్తను ప్రచురించింది.  

మా కేసును వాదించడానికి గుంటూరు నుండి వై కోటేశ్వర రావు (వైకే) తదితర ప్రముఖ లాయర్లు చీరాల చేరుకున్నారు. ఈలోపులే చీరాల జడ్జి మాకు ఒంగోలు జిల్లా జైలులో పదిహేను రోజుల రిమాండ్‍ వేశారు. మేము జిల్లా జైలుకు చేరే లోపులో వైకే బృందం ఒంగోలు చేరుకుని జిల్లా జడ్జీ దగ్గర బెయిలు సాధించాలనేది మా ఆలోచన. అందుకు వీలుగా ఓ రెండు గంటలు ఆలస్యంగా ఒంగోలు చేరాలని భావించాం. అప్పటికే ఆ పోలీసు వ్యాన్ డ్రైవర్ కూ, ఎస్కార్ట్ పోలీసులకు మా మీద అభిమానం పొంగిపొర్లుతోంది. వాళ్ళు మాకు చాలా సహకరించారు. దారిలో రెండు మూడు చోట్ల ఆగి  టీలు తాగి ముందుగా అనుకున్నట్టు చీకటి పడ్డాక  ఒంగోలు చేరాం.

మేము ఒంగోలు జైలుకు చేరే సమయానికి  అక్కడ ఖైదీలకు రాత్రి భోజనాలు వడ్డిస్తున్నారు. ఆ ఖైదీల్లో కారంచేడు నిందితులూ వున్నారు. వాళ్ళూ మేమూ ఎదురుపడితే కొత్త ఘర్షణ జరుగుతుందని జైలు అధికారులు ఆందోళన చెందారు. మమ్మల్ని కాస్సేపు బయట ఆగమన్నారు.

పక్కన మన ప్రత్యర్ధులు వున్నారంటే వాళ్లను చూడాలనే ఆసక్తి సహజంగానే కలుగుతుంది. వాళ్ళేమీ పెద్ద భూస్వాములుగా దర్పంతో కనిపించలేదు. చిన్నా చితకా రైతులే అయ్యుంటారు అనిపించింది. ఒక విచిత్రం ఏమిటంటే పెద్ద భూస్వాములకు కులాభిమానంవున్నా దాన్ని వాళ్ళు బాహాటంగా ప్రదర్శించరు. వాళ్ళ సంపదే వాళ్ళ అధికారాన్ని ప్రదర్శిస్తూ వుంటుంది. చిన్న సన్నకారు రైతులకు ప్రదర్శించడానికి సంపద వుండదు. వాళ్ళే వీలున్నప్పుడు కులాభిమానాన్నేకాక కులాహంకారాన్ని కూడా ప్రదర్శిస్తూవుంటారు.

వాళ్ళు భోజనాలు పూర్తిచేసి గదుల్లోనికి వెళ్ళేలోపే మాకు బెయిళ్ళు వచ్చేశాయి. అలా జైలు గది లోనికి అడుగుపెట్టకుండానే బయటికి వచ్చేశాం.  అప్పటి వరకు మా మీద పెట్టిన కేసు ఏమిటో కూడా మాకు తెలీదు. “నేరం చేశారా?” అని జడ్జీ అడిగారు. “నేరం చేయలేదు” అని మేము సమాధానం చెప్పాం. అంతే. ఆర్టీసి బస్సుల్ని తగలెట్టిందీ, రైల్వే స్టేషన్లను  ధ్వంసం చేసిందీ మేమే అని మా మీద కేసి పెట్టారట. ఆ కేసులో నేను ఏ-ఒన్ అనగా  మొదటి నిందితుడ్ని.

మాకు కోర్టువారు ఇచ్చింది షరతులతో కూడిన  బెయిలు. దానిప్రకారం  మేము చీరాల దాటి బయటికి వెళ్ల కూడదు.  ప్రతిరోజూ సాయంత్రం చీరాల పోలీసు స్టేషన్ లో సంతకం పెట్టాలి. అదీ గాక పగటి పూట నా కదలికల్ని గమనించడానికి విజయనగర్  శిబిరం వద్ద ఒక పోలీసును ప్రత్యేకంగా నియమించారు. అతనూ నేను మొదట్లో ప్రత్యర్ధులుగా వుండేవాళ్లం. ఇక రోజూ ఇద్దరమే కలిసి బతకాలి కనుక నాలుగు రోజుల తరువాత స్నేహితులమై పోయాము.

ఈలోపు, ప్రభుత్వం ఒక ద్విముఖ వ్యూహాన్ని రచించింది. బాధితుల కోరికల మేరకు పక్కా ఇళ్ళ నిర్మాణం, వ్యవసాయ భూమి పంపిణి, ఉపాధికల్పన కోసం ఒక బహుళ ఉత్పత్తుల ఫ్యాక్టరీ, విద్యార్హతలు వున్నవారికి ప్రభుత్వ ఉద్యోగం వంటి భారీ ప్యాకేజీతో ముందుకు వచ్చింది.  ఈ ప్యాకేజీ రూపకల్పనలో స్టేట్ సెక్రటేరియట్ లో సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి శంకరన్ కీలకంగా వ్యవహరించారు. వీటి అమలు బాధ్యతను ఇప్పటి లోక్ సత్తా అగ్రనేత, అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎన్. జయప్రకాశ్ నారాయణకు అప్పచెప్పారు. ఉద్యమ నాయకులను ఉద్యమానికి దూరం చేయడం కూడ ఈ ప్యాకేజీలో కనిపించని భాగం.

అక్టోబరు 6 న (5న?) చీరాల డీయస్పీ నన్ను పిలిచి నువ్వు చీరాల మళ్ళీ రానని రాసిస్తే, ఈ కేసులో అందరి మీదా బెయిల్ కండీషన్ తీసేస్తాను అన్నారు. ఆ రోజు అప్పటికి మరో రెండు గంటల్లో విజయవాడలో దళిత మహాసభ బహిరంగ సభ జరగబోతోంది. 25 రోజులుగా గుంటూరులో అజ్ఞాతంలో వుంటున్న కత్తి పద్మారావు ఆ సభకు వస్తున్నారు. అక్కడ వారిని  అరెస్టు చేసి ఉద్యమానికి ముగింపు పలకాలనేది ప్రభుత్వ ఆలోచన అని డిఎస్పీ వివరించారు.

 పునరావాస (ఆర్ ఆర్) ప్యాకేజిమి రూపొందిస్తున్నట్టు ప్రకటన వచ్చేసింది కనుక నేను చీరాల వచ్చిన పని పూర్తి అయిపోయింది. ఇక అవతారం చాలించాల్సిన సమయం అది. అప్పుడు నా తోటి నిందితుల అభిప్రాయం కూడ అలాగే వుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న పరంజ్యోతి, వాళ్ళ అన్నయ్యలు ఈ కేసు మూలంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో చీరాల వదిలేస్తానని పోలీసులకు రాసిచ్చాను. ఆ రాత్రే విజయవాడ తిరుగు ప్రయాణం అయ్యాను.

కారంచేడు దాడికి సూత్రధారిగా ఆరోపణలు వున్న దగ్గుబాటి చెంచురామయ్యను 1989 ఏప్రిల్ నెలలో ఉగాది రోజున పీపుల్స్ వార్ దళం చంపేసింది. నా అంచనా ప్రకారం చెంచురామయ్య నేరుగా కారంచేడు దాడిలో పాల్గొని వుండకపోవచ్చు, అసలు అతను దాడిని ప్రోత్సహించి వుండకపోనూవచ్చు. గానీ, అతను పోలీసు కేసుల నుండి తమను తప్పించగలడనే ధీమాతోనే కారంచేడులోని ఆయన స్వీయసామాజికవర్గం దళితుల మీద తెగబడి దాడికి పాల్పడింది అనడం ఏమాత్రం సత్యదూరంకాదు. ఈ దాడికి legal impunity factor గా ఆయన వున్నాడు.   వాళ్లకు ఆయన సింబాలిక్ నాయకుడు అయినట్టే పీపుల్స్ వార్ కూడా ఆయన్ని సింబాలిక్ గానే చంపింది అంటారు.

సెప్టెంబరు 10న నేను బస్ స్టాండుకే వెళ్ళలేదు. మా మీద బస్సుల్ని తగలబెట్టినట్టు కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ప్రత్యక్ష సాక్షులయిన ఆర్టీసి బస్సు డ్రైవర్లు “నిరసనకారులు పారిపోతుండగా వెనుక నుండి చూడడంవల్ల వాళ్ళ ముఖాలను గుర్తుపట్టలేం” అని కోర్టులో సాక్ష్యం చెప్పారు.  “ప్రాసిక్యూషన్ వారు నేరాన్ని రుజువు చేయలేకపోవడంవల్ల” మా కేసును 1989 జులై నెలలో కోర్టు కొట్టి వేసింది.

ఇంతవరకే చెప్పివదిలేస్తే ఉద్యమం గురించి సంపూర్ణంగా చెప్పినట్టుకాదు. ప్రతి ఉద్యమం వర్తమానం మీదనేకాదు భవిష్యత్తు, గతాల మీద కూడా ప్రభావాన్ని వేస్తుంది. కారంచేడు తరువాత అంబేడ్కర్, జ్యోతీబా ఫూలే ఆలోచనలకూ ఆంధ్రా ప్రాంతంలో గొప్ప ఆదరణ మొదలయింది. మార్క్స్, అంబేడ్కర్, జ్యోతీబా ఫూలేల  ఆలోచనల మధ్య ఒక  తాత్విక ఐక్యతను సాధించే ప్రయత్నాలు కూడ ఆరంభమయ్యాయి.  అంబేడ్కరిస్టులు ‘దేశీయ మార్క్సిజం’ అనే భావాల్ని ముందుకు తెచ్చారు. మార్క్సిస్టులు అంబేడ్కర్ ను అధ్యయనం చేయడం మొదలెట్టారు.

ఉద్యమాల్లో పాల్గొన్నవాళ్ళకు తాత్కాలికంగా కొన్ని భౌతిక, ఆర్ధిక ఇబ్బందులు కలుగుతుంటాయి. నాకూ కలిగాయి. ఓ నాలుగు నెలలు నా భార్యా పిల్లలు తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులు పడ్డారు. వాటి నుండి బయట పడడానికి మాకు ఏడాదికి పైగా పట్టింది. అప్పటి  నైతిక విలువల ప్రకారం కమ్యూనిస్టులు భూములు కొనకూడదు అనుకునేవాళ్ళం. నాకు సంతానం కలుగుతున్నదని తెలిసి వాళ్ళ కోసం భూమి కొనాలనుకున్నాను. 1984 మే నెలలో ప్రకాశం జిల్లా ఒంగోలు తాలుకా చేజర్ల గ్రామంలో 5 ఎకరాల డికె పట్టా భూమి (సర్వే నెం. 169-1/333-5, 169-1/397-5) సంపాదించాను. ఆ విషయాన్ని నా భార్యకు తప్ప. బహిరంగంగా ఎవరికీ చెప్పలేదు. అనుకోకుండ ప్రకాశం జిల్లాకే ఉద్యమ నాయకునిగా వెళ్ళాల్సివచ్చింది. అక్కడ నాకు ఒక రకం ‘జానపద కథానాయకుని’  ఇమేజ్ వచ్చేసింది. అదొక సామాజిక పెట్టుబడి (సోషల్ కేపిటల్). దాన్ని నిలబెట్టుకోవడానికి  చేజర్ల భూమిని వదిలేశాను.  

ఇప్పుడు చేజర్ల భూమి ధర చాలా ఎక్కువ వుండవచ్చుగానీ ఈ మాట ఇప్పుడు ఎందుకు చెపుతున్నానంటే ఉద్యమాలకు నాయకత్వం వహించే వారికి కొన్ని నైతిక విలువలుండాలి. అవసరం అయినపుడు కొంత త్యాగానికి సిధ్ధం కావాలి.  నష్టాన్ని కూడ భరించాలి. నిజానికి అది నష్టం కూడ కాదు; అదొక సామాజిక మదుపు. ఈ భూమ్మీద ఏ బీమా కంపెనీ ఇవ్వనంత డెవిడెండ్‍ ను సమిష్ఠిగా ఉద్యమాలు ఇస్తాయి. కాకపోతే వాటిని అందుకోవడానికి  కొంచెం సహనం కావాలి. తరువాతి కాలంలో నేను కష్టాల్లో వున్న సందర్భాల్లో కొందరు నన్ను గొప్పగా ఆదుకున్నారు. నా మీద వారికి అభిమానం కలగడానికి ఒకే ఒక కారణం ఉద్యమాలలో నేను పోషించిన పాత్రే. 

కారంచేడు ఉద్యమంలో పాల్గొనడంవల్ల నేను నష్టపోయాననిగానీ, త్యాగాలు చేశాననిగానీ నేను ఎన్నడూ అనుకోలేదు.  కారంచేడు, తదితర ఉద్యమాల్లో పాల్గొనడానికి నాకో ఉత్తేజం, ప్రయోజనం వున్నాయి. అప్పటికి కొన్ని నెలల ముందు సాగిన ఢిల్లీ శిక్కుల ఊచకోత నన్ను బాగా చలింపచేసింది. 1984 చివర్లో ఢిల్లీ వెళ్ళానుగానీ అక్కడ పనిచేసే సావకాశం నాకు అప్పుడు లేదు. కారంచేడు వుద్యమంలో దొరికిన అవకాశాన్ని నేను వదులుకోదలచలేదు. నా సామాజికవర్గం కూడ అణగారినవర్గం. దానికి కష్టం వచ్చినపుడు ఇతర అణగారినవర్గాలు సంఘీభావాన్ని తెలుపుతాయనే నమ్మకం నాకుండింది. అది ఇప్పుడూ వుంది.

          మార్క్సిజం అణగారినవర్గాలకు ఒక చారిత్రాత్మక మేలు చేసింది.  అప్పటి వరకు ఎన్నడూ కలవని సమూహాలని అది వర్గ ప్రాతిపదిక మీద ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చింది. శ్రామికరాజ్యం అనే ‘సార్వజనీన కల’ను వాళ్ల ముందు వుంచి గొప్ప బైండింగ్ వైర్ గా పనిచేసింది.  అయితే కులం, మతం తదితర అస్తిత్వ సమస్యలను కమ్యూనిస్టు పార్టీల నాయకులు  స్థూల స్థాయిలో మాత్రమే పట్టించుకుని సూక్ష్మస్థాయికి వెళ్ళలేకపోయారు. ఇది మితవాద దోషం.

          మరోవైపు,  అస్తిత్వవాదం సహజంగానే అస్తిత్వ సమస్యల్ని సూక్ష్మస్థాయి వరకు అత్యంత లోతుగా అధ్యనం చేసి పరిష్కరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అది ఉద్దేశ్యపూర్వకంగానో, అనాలోచితంగానో ప్రతి అణగారినవర్గాన్ని మరో అణగారినవర్గానికి ప్రత్యర్ధిగా నిలబెట్టింది. ఇది అతివాద దోషం. దళితుల్లోని మాలమాదిగ సామాజికవర్గాల మధ్య చెలరేగిన వివాదం దీనికి ఒక ఉదాహరణ. అట్లే, హిందూ శ్రామిక కులాలు, ముస్లిం శ్రామిక కులాల మధ్య ‘వెనుకబడిన తరగతి’ గుర్తింపు కోసం సాగుతున్న  పెనుగులాట దీనికి మరో ఉదాహరణ.

ఇప్పుడు పరిస్థితి ఏ దశకు చేరుకున్నదంటే అణగారిన వర్గాలు తమను అణిచివేస్తున్న వర్గాలనుకన్నా తమ సాటి అణగారినవర్గాలనే ఎక్కువ శతృవులుగా భావిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో అవి శతృ సమూహాల మీద చేయాల్సిన పోరాటాన్ని మానేసి, సంఘీభావం తెలపాల్సిన మిత్ర సమూహాల మీద పోరాటం చేస్తున్నాయి. గుజరాత్ నరమేధం దీనికి ఒక ఉదాహరణ. మరలా అణగారినవర్గాలను ఐక్యం చేసే ఒక సార్వజనీన  ఆదర్శం, లక్ష్యం, అవసరం ఏర్పడే వరకు ఈ స్థితి తప్పకపోవచ్చు.

2004లో అప్పటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లను శాంతి చర్చలకు ఆహ్వానించినపుడు అణగారినవర్గాల ఏకీకరణ సాగుతున్నదనే సూచనలు కొన్ని కనిపించాయి. వామపక్షాలతో విభేదించి బయటికి వెళ్ళిపోయిన అనేక అస్తిత్వవాద సమూహాలు తమ సమస్యల పరిష్కారానికి సహకారాన్ని అందించాల్సిందిగా మార్క్సిస్టు-లెనినిస్టులను కోరడమూ కనిపించింది. అలాంటి ఐక్యత కోసం కృషి జరగాలి.




ఆలీశమ్మ – జార్జి ఫ్లాయిడ్

కారంచెడు దాడి కేసులో ప్రధాన సాక్షి దుడ్డు ఆలీసమ్మ. ఆమె కళ్ళ ముందే కొడుకు దుడ్డు వందనాన్ని చంపేశారు. డాడి జరిగిన మరునాడు కేసు నమోదు చేసే (FIR) సమయంలో పోలీసుల ముందు ఆమె వివరంగా  వాగ్మూలం ఇచ్చింది.  అది ఎలాగూ పోలీసు / కోర్టు / ప్రభుత్వ రికార్డుల్లో వుంటుంది. ప్రాంతీయ, జాతీయ మీడియా ముందు ఆమె మాట్లాడింది. పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ ముందు మాట్లాడింది. ప్రజాకోర్టులోనూ ఆమెతో మాట్లాడించాలి అనుకున్నాము. సమాజాన్ని సాక్షిగా మార్చాలి.  ప్రజలను కదిలించాలి. పైగా తమకు మద్దతుగా చాలామంది వున్నారనే నమ్మకాన్నీ బాధితులకు కల్పిస్తే వాళ్లు నైరాశ్యం నిస్పృహల నుండి బయటపడతారు. దీనికి 1985 ఆగస్టు 15 నాటి బహిరంగ సభ సరైన వేదిక అనుకున్నాము.  

నేను దుడ్డు ఆలీసమ్మను సభకు తీసుకుని వచ్చి స్వయంగా వేదిక మీదికి తీసుకుని వెళ్ళాను. “వీళ్లంతా నీ మనుషులు. ధైర్యంగా నీ బాధ చెప్పుకో”మన్నాను. ఆమె అరగంట మాట్లాడింది. ఆమె మాట్లాడుతున్నంత సేపూ పక్కనే నిలబడ్డాను. ఆమె మధ్యమధ్యలో భావోద్వేగంతో వణికిపోతూవుంది. నేను ధైర్యం చెపుతూ ఆమె చేతుల్ని గట్టిగా అదిమి పట్టుకున్నాను. ఆరోజు సభలో నా ఉపన్యాసంకన్నా అలీసమ్మ చెప్పిన కథనం పెద్ద సంచలనంగా మారింది.

          1985 జులై 17న జరిగిన దాడి ఒక క్షణికావేశం (Abrupt) మాత్రమే అని ఇప్పుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు వంటివాళ్ళు తేలిగ్గా కొట్టిపడేస్తున్నారు. ఇదొక పచ్చి అబధ్ధం. 1985 అక్టోబరు నెలలో ఆర్ ఆర్ ప్యాకేజీ ప్రకటనతో ఉద్యమం ఆగిపోయింది. ఉద్యమ నాయకులు ఇంటిదారి పట్టారు. చీరాలలో కాలనీ నిర్మాణం కూడ మొదలయింది. ఓ ఏడాది తరువాత అది పూర్తి అయింది. గృహప్రవేశాలు కూడ జరిగిపోయాయి. ప్రశాంత వాతావరణం నెలకొంది. అందరూ సాధారణ జీవిత కార్యకలాపాల్లో మునిగి పోయారు.

         ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ప్రధాన సాక్షి దుడ్డు ఆలీశమ్మ హత్య జరిగింది. 1987 ఆగస్టు నెలలో ఆలీసమ్మను చీరాలలోని ఆమె కాలనీ ఇంట్లోనే హత్య చేశారు.  సాక్ ష్యాన్ని ఒక పథకం ప్రకారం చంపడానికి హంతకులు కారంచేడు నుండి చీరాల వచ్చి విజయనగర్ కాలనీలో ప్రవేశించి జరిపిన హత్య ఇది.  ఇదొక విధంగా అమెరికా లోని జార్జ్ ఫ్లాయిడ్ కేసు వంటిది. అర్ధరాత్రి ఇంట్లోకి దూరి ఊపిరి ఆడకుండ తలగడతో అదిమిపట్టి వంటి మీద ఒక్క కత్తిగాటు కూడా లేకుండ ఆ ముసలామెను  చంపేశారు. సాక్షులకు భద్రత ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేదు. అప్పుడూ ఎన్టీఆర్ ప్రభుత్వమే వుంది.  ఆలీశమ్మ హత్య కూడ క్షణీకావేశంలో abruptగా జరిగిన హత్యే అంటారా? దగ్గుబాటి వేంకటేశ్వరరావు?

           ప్రత్యర్ధులు సాక్షుల్ని చంపడానికి తెగించడంతో పీపుల్స్ వార్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఆలీశమ్మ హత్య తరువాతే దగ్గుబాటి చెంచురామయ్యను హతం చేయాలని ఆ పార్టి నిర్ణయించిందని అంటారు. 1989లో పీపుల్స్ వార్ దళం దగ్గుబాటి చెంచురామయ్యను హత్య చేసినపుడు కత్తి పద్మారావు కూడా హర్షం వ్యక్తం చేశారు.

          కారంచేడు కేసు గుంటూరు అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో 1994 వరకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1998 వరకు, ఆ తరువాత సుప్రీంకోర్టులో 2008 వరకు మొత్తం 23 ఏళ్ళు సాగింది. చివరికి ఒకరికి జీవితకాలం, 29 మందికి మూడేళ్ళ కాలం చొప్పున సుప్రీం కోర్టు శిక్షలు ఖరారు చేసింది. 
విజయాలు – గుణపాఠాలు
          దాదాపు నిందితులందరూ అరెస్టు కావడం, కోరుకున్న విధంగా పునరావాస పథకాన్ని పొందడం కారంచేడు ఉద్యమం సాధించిన తక్షణ విజయాలు. జాతీయ స్థాయిలో ఎస్టీ ఎస్సీలపై అత్యాచారాల నిరోధక  చట్టాన్ని సాధించడం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే విజయం.
          సాధారణంగా ప్రతి ఉద్యమంలోనూ ఉద్యమకారులు, మొదటి దశలో,  నిందితుల్ని అరెస్టు చేయాలనీ, కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరుతుంటారు. కారంచేడు ఉద్యమంలో అయితే దోషుల్ని చీరాల గడియారం స్థంభం దగ్గర బహిరంగంగా ఉరి తీయాలి అని నినదించేవారు. 
          నిజానికి నిందితులు అరెస్టు అయిన తరువాత మొత్తం వ్యవహారం న్యాయవ్యవస్థ పరిథిలోనికి పోతుంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు మాట్లాడుకునే భాషే వేరు. అక్కడ ఉద్యమకారులు చేయగలిగింది ఏమీ వుండదు; కోర్టు హాలులో మౌన ప్రేక్షకుల్లా చూస్తూ నిలబడడంతప్ప.  సుదీర్ఘ ప్రయాణాలు చేసి వాయిదాలకు హాజరు కావడం, లాయర్లను నియమించుకోవడం చాలా ఖర్చుతో కూడిన పని. ఉద్యోగులైతే శెలవులు పెట్టడం మరీ కష్టం. కేసులు కోర్టుల్లో దశాబ్దాలు సాగుతాయి. అనేక కోర్టులు మారుతాయి. సుప్రీం కోర్టు వరకు వెళ్ళాల్సివుంటుంది. అన్నేళ్ళు సమయాన్ని, డబ్బును వెచ్చిస్తూ కోర్టుల చుట్టూ తిరగడం బాధితులకు ఉద్యమకారులకు దాదాపు అసాధ్యం.
          ఉద్యమాల్లోనీ ఈ ఆర్థిక బలహీనతల్ని తెలుసుకున్న ధనిక దోషులు తెలివితో స్వచ్చందంగా అరెస్టు అయ్యి బెయిల్ తీసుకుని బయటికి వచ్చేసిన సందర్భాలూ వున్నాయి. అక్కడి నుండి బాధితులు, సాక్షులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వుంటుంది. దోషులకు కోర్టులు శిక్షలు విధిస్తాయోలేదోగానీ కోర్టుల ఏళ్ళ తరబడి కోర్టుల చుట్టూ తిరగడం బాధితులకు, సానుభూతిపరులకు చాలా పెద్ద శిక్ష. మొదట్లో సానుభూతితో వున్న లాయర్లు కూడ కొన్నాళ్ళకు నీరసపడిపోతుంటారు. వాయిదాలకు సరిగ్గా హాజరుకారు.  ఈ ఇబ్బందులు పడలేక కొన్ని కేసుల్లో పిర్యాదిదారులు కేసు మీద అశలు వదులుకుంటారు. కొన్ని కేసుల్లో లొంగిపోతారు కూడ.
          చుండూరు కేసులో స్థానిక కోర్టులో న్యాయం జరిగినట్టు కనిపించింది. పైకోర్టులో అందుకు వ్యతిరేకమైన తీర్పులు వచ్చాయి. పైగా న్యాయ వ్యవస్థలో డబ్బుతోపాటూ కులం, మతం కూడ వుంటాయి.  కొన్ని అతి అరుదైన కేసుల్లోతప్ప, న్యాయవ్యవస్థలో అంతిమంగా ధనవంతులే గెలుస్తుంటారు.  మనం ఇప్పటికిప్పుడు న్యాయవ్యవస్థను మార్చలేం. ఆర్ధిక వ్యవస్థనూ మార్చలేం. కులవ్యవస్థనూ మార్చలేం. ఉద్యమాలన్నింటిలోనూ అప్పటి నుండి ఇప్పటి వరకు న్యాయ విభాగంలో ఈ అన్యాయం  కొనసాగుతూనే వుంది. 
గత ఏడాది భారత పార్లమెంటు పౌరసత్వ సవరణ బిల్లును  పాస్ చేయడాన్ని నిరసిస్తూ డిసెంబరు 11 తరువాత దేశమంతటా ‘షాహీన్ బాగ్’ ఉద్యమం చెలరేగింది. ఇందులో సమస్త అస్తిత్వవాద సమూహాలే కాకుండ, సామ్యవాదులు, మతసామరస్యవాదులు, మానవతావాదులు, మానవహక్కులవాదులు అందరూ పాల్గొన్నారు. ఈ ఉద్యమం వెంటనే ‘భారత లౌకిక రాజ్యంగ పరిరక్షణ ఉద్యమం’గా రూపాంతరం చెందింది.  భారత రాజ్యాంగపు ప్రవేశిక, న్యాయము, స్వేఛ్ఛ, సమానత్వము, సోదరభావం అనే నినాదాలు  అణగారిన సమూహాలకు బైండింగ్ వైర్ గా మారాయి.  కరోనా వచ్చి ఆ ఉద్యమం ఆగిందిగానీ, కరోనా గ్రహణం తొలగగానే ‘భారత లౌకిక రాజ్యంగ పరిరక్షణ ఉద్యమం’ ఊపందుకుంటుందని ఆశిద్దాం.

(దుడ్డు ఆలీశమ్మ, బొక్క రాజమ్మలకు అంకితం)

(ఆలీసమ్మ- జార్జి ఫ్లాయిడ్, విజయాలు గుణపాఠాలు అనే అధ్యాయాల్ని 17 జులై 2020న చేర్చాను) 

(అయిపోయింది)

Karamchedu : Past, Present and Future Part - 2


కారంచేడు – గతం వర్తమానం భవిష్యత్తు.
(పార్ట్ -2)
ఉషా యస్ డానీ











పార్టీ రీజినల్ కమిటీ (ఆర్ సి) సెక్రటరీ మల్లిక్ (నెమలూరి భాస్కర రావు) నుండి “వెంటనే కారంచేడు వెళ్లండి అక్కడ మీ అవసరం వుంది” అని కబురు వచ్చినపుడు చాలా ఆనందం వేసింది. “మీరు మాత్రమే చేయగలరు” అంటే చాలు ఎవరికైనా అహం చాలా సంబరపడిపోతుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించడం కోసం మనుషులు అనేక సాహసాలు దుస్సాహసాలు కూడా చేస్తారు. అలాంటి అతి ఉత్సాహంతోనే నేను చీరాల (కారంచేడు) చేరుకున్నాను.

అప్పుడు నాకు పెళ్లయి రెండేళ్ళు. పెద్దబ్బాయి పుట్టి మూడు నెలలు. అప్పట్లో నేను ఆటోమోబైల్స్ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. విజయవాడ సున్నపుభట్టీల సెంటరులో మా పూరిల్లును పడగొట్టి డాబా కట్టే ప్రయత్నంలో వున్నాం.  గోడలు వరకు పూర్తి చేసి, శ్లాబ్ వేసే ప్రయత్నంలో డబ్బుల కోసం తిరుగుతున్నాము. అంటే మా కుటుంబం దాదాపు రోడ్డు మీద వుంది. చిత్తూరు క్యాంపులో వుండగా  ఆర్ సి కబురు వచ్చింది. ఆఫీసుకు చెప్పలేదు. నా భార్య అజితకు మాత్రం కబురు చేశాను. “పిల్లోడి గురించి భయపడకు నేను చూసుకుంటాను” అంది. సెల్ ఫోన్ లేని ఆరోజుల్లో విప్లవ సమూహాల మధ్య ఒక అద్భుత కొరియర్ సర్విస్ వుండేది.

వైచిత్రి ఏమంటే కారంచేడులో దాడి చేసినవారిదీ, నా భార్యదీ ఒకటే సామాజికవర్గం. వర్గంలో కులం వున్నట్టే కులంలోనూ వర్గం వుంటుంది. సమాజసేవకుల ఇల్లాళ్ళు భర్తలవల్ల తరచూ ఇబ్బందులుపడే మాట వాస్తవమేగానీ, ఉద్యమ నాయకుల భార్యగా వుండడాన్ని ఆడవాళ్ళు గొప్పగా ఆస్వాదిస్తారు.

కారంచెడులో దాడి జరగడానికి ఓ ఏడాది ముందు నుండే ఆ గ్రామంలో రాడికల్ యూనిట్ వుంది. అక్కడి వ్యవసాయ కూలీల్లో విప్లవ చైతన్యాన్ని తీసుకు రావడానికి పరిమితస్తాయిలో పనిచేస్తున్నది.  1985 ఫిబ్రవరిలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రాండ్స్ లో జరిగిన అఖిల భారత విప్లవ విద్యార్ధి సమాఖ్య (ఏఐఆర్ ఎస్ ఎఫ్) మహాసభల్లో కారంచెడు గ్రామం నుండి నలుగురు యువకులు పాల్గొన్నారు. దాడి జరగ్గానే చీరాల హాస్పిటల్లో ఫొటోలు తీయించి మీడియాను కలిసింది కూడా వాళ్ళే.  ఆ తరువాత హాస్పిటల్ దగ్గరకు వచ్చిన కత్తి పద్మారావు  గొప్ప చొరవను ప్రదర్శించారు.
కత్తి పద్మారావు ఆర్తీ, ఆవేదన వున్న మనిషి. ప్రేమాస్పదులు. సామాజికవర్గ (కుల) దృక్పథం అప్పట్లో ఆయనకూ కొత్తే. మాకూ కొత్తే. సైధ్ధాంతిక అంశాలపై అప్పట్లో వారితో సాగించిన వాదోపవాదాలు నిర్మాణానికి, ఉద్యమానికి సంబంధించినవేతప్ప వ్యక్తిగతమైనవి కానేకావు. భిన్న తాత్విక దృక్పథాలు కలిగినవాళ్ళు ఒక ఉద్యమంలో కలిసి పనిచేసినపుడు ఐక్యతతోపాటూ కొంత ఘర్షణ కూడా వుంటుంది. వాటిని వ్యక్తిగత వ్యవహారంగా చూడకూడదు. కత్తి పద్మారావుతో కలిసి పనిచేయడాన్ని నేను గొప్పగా ఆస్వాదించాను. ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకు వచ్చినపుడు చాలా ఆనందంగా వుంటుంది.

 కారంచెడు ఉద్యమంలో దళితమహాసభ ఒక ఫ్యాక్టర్; పీపుల్స్ వార్ ఇంకో ఫ్యాక్టర్. ఇటీవల అంబేడ్కరిస్టులు కొందరు పీపుల్స్ వార్ ఫ్యాక్టర్ ను తీసివేయడానికో తగ్గించడానికో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పీపుల్స్ వార్ అభిమానులు కొందరు దళితమహాసభ ఫ్యాక్టర్ ను తీసివేయడానికో తగ్గించడానికో ప్రయత్నిస్తున్నారు. ఇవి రెండూ వీరాభిమానంతో చేసే చారిత్రక తప్పిదాలే. ఇలాంటి పనులు భవిష్యత్ ఉద్యమాల్లో ఐక్య సంఘటనకు విఘాతం కలిగిస్తాయి.
 
అప్పటి నిర్భంధ వాతావరణంలో బహిరంగంగా పనిచేసే అవకాశాలు పీపుల్స్ వార్ కార్యకర్తలకు ఏమాత్రం లేవు. కత్తి పద్మారావును బలపరచడంతప్ప ఆ పార్టీకి మరో మార్గంలేదు. మరోవైపు కత్తి పద్మారావుకు ఉద్యమాలని నడిపిన పూర్వానుభవమూలేదు. ముకిరి విక్టర్ శ్యాంసన్ చర్చి ప్రతినిధి. సలగల రాజశేఖర్ కాంగ్రెస్ నాయకుడు. వాళ్ళిద్దరి పోటీని తట్టుకుని ఉద్యమానికి ప్రధాన నేతగా నిలబడాలంటే పీపుల్స్ వార్ సహకారం తీసుకోవడంతప్ప కత్తి పద్మారావుకు మరో మార్గంలేదు. సంస్థ నిర్మాణం విషయంలోగానీ, బహిరంగ-రహాస్య పనివిధానాల విభజనతో ఫలితాలను రాబట్టడంలోగానీ, మీడియా మేనేజ్ మెంటులోగానీ పీపుల్స్ వార్ కు వున్న అపార అనుభవం ఎవ్వరూ నిరాకరించలేనిది.

కారంచెడు ఉద్యమానికి మీడియా సపోర్టు చాలా గొప్పగా వుంది. నెంబర్ ఒన్ న్యూస్ పేపర్ ఈనాడు అయినప్పటికీ అప్పట్లో దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో వచ్చిన ఉదయం దినపత్రిక గొప్ప వెలుగులో వుంది. నక్సలైట్ ఉద్యమ అభిమానులు అనేకులు ఉదయం, ఆంధ్రప్రభ దినపత్రికల్లో అనేక కీలక స్థానాల్లో వున్నారు. వీరిలో  కే శ్రీనివాస్, వేమన వసంతలక్ష్మి, బుధ్ధా జగన్ ముఖ్యులు. ‘ఉదయం’ ఎడిటర్ గా ఏబికే ప్రసాద్ వున్నారు. వారు తొలిరోజే ‘కారంచెడు కండకావరం అనే ఎడిటోరియల్ రాశారు. ‘ఉదయం’ విజయవాడ ఎడిషన్ ఇన్ చార్జీ కే రామచంద్రమూర్తి ఉద్యమం మీద సానుకూల వైఖరితో వున్నారు. న్యూస్ డెస్క్ లో తాడి ప్రకాష్, మురళి, నాంచారయ్య, ఖాదర్ వంటి సానుభూతిపరులు వున్నారు. ప్రాంతీయ, జాతీయ పత్రికలు ఆ ఉద్యమానికి  గొప్ప కవరేజి ఇచ్చాయి. జిల్లాస్థాయి నుండి సుప్రీం కోర్టు వరకు ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఏపిసిఎల్ సి) నెట్ వర్క్ చాలా పటిష్టంగా వుంది.  మరోవైపు ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది గాబట్టి పోలీసులు కూడా సెప్టెంబరు 10 వరకు మౌనంగా వున్నారు. ఉద్యమ వుధృతికీ, వ్యాప్తికి  ఇవన్నీ కలిసివచ్చాయి.

కారంచేడు ఉద్యమంలో పీపుల్స్ వార్ పక్షాన రాజకీయ విభాగంలో సెంట్రల్ ఆర్గనైజర్ (సివో)గా విరపని వేంకటేశ్వర రావు వుండగా. సాంస్కృతిక విభాగంలో దివాకర్, డప్పు రమేష్, కుమారి, కలైకూరి ప్రసాద్ (యువక) వుండేవారు. చంద్రశ్రీ అప్పుడు కొత్తగా పాటలు పాడుతున్నది.  

కారంచేడు ఉద్యమంలో నాకు ప్రధాన అండ బి. పరంజ్యోతి. తను ఆంధ్రా యూనివర్సిటీలో రాడికల్ విద్యార్ధిగా చురుగ్గా పనిచేశాడు. శాంతినగర్ లో వాళ్లది విద్యావంతులయిన గౌరవనీయ కుటుంబం. నేను బహిరంగంగా వున్నప్పుడు పరంజ్యోతి ఇంట్లోనే భోజనం చేసేవాడిని. వాళ్ల అమ్మ రాజమ్మగారు చాలా ఆప్యాయంగా భోజనం వడ్డించేవారు. రహాస్యంగా వుండాల్సినపుడు ఇసాక్, ప్రభాకర్ ల ఇంట్లో వుండేవాడిని. అప్పుడప్పుడు ఆరు బయట ఇసకలో ఆకాశం కింద పడుకునేవాడిని. నిఘా ఎక్కువగా వుందనుకున్నప్పుడు కోళ్ల ఫారంలో పడుకోవాల్సి వచ్చేది. వెళ్ళింది నేను ఒక్కడ్నే కాదుగా; నీతోనే నేనూ అంటు నా అస్థమా కూడా నాతో వచ్చింది. వర్షాకాలం ముసురు కమ్మినపుడు అస్తమా రెచ్చిపోతుంది. రాత్రుళ్ళు జ్వరం వచ్చేది. పోలీసుల కళ్ళు గప్పడానికి నేనూ ఇరపని అప్పుడప్పుడు తలపాగ, పంచ చుట్టి  మారువేషాల్లో మారు పేర్లతో పరిసర గ్రామాల్లో తిరిగేవాళ్ళం.  

రాజకీయ తాత్విక రంగాల్లో కారంచేడు ఉద్యమం శక్తివంతంగా ముందుకు తెచ్చిన పదం ‘దళిత’. తరువాతి కాలంలో కొందరు దీనికి సంకుచిత అర్ధం చెప్పండం మొదలెట్టారుగానీ, తొలి దశలో దళితులంటే అణగారిన కులాలు, తెగలూ, మతాలు అనే విస్తృత అర్ధమే వుండేది. శ్రామికవర్గంతో సహా అందరి అన్నిరకాల అస్థిత్వాలు ఇందులో వున్నాయి. సమాజాన్ని కేవలం ఆర్ధికవర్గం దృష్టితో చూడడం తగదనీ, ఆర్ధికవర్గేతర  అస్థిత్వాలు అనేకం వుంటాయనే అవగాహనని ఈ ఉద్యమం ముందుకు తెచ్చింది.  ఆ తరువాత తెలుగు రాజకీయాలు, సాంఘీక పరిణామాలూ కారంచెడు ఉద్యమం ముందుకు తెచ్చిన ఎజెండా చుట్టే తిరిగాయంటే అతిశయోక్తికాదు.

కారంచెడు ఉద్యమ నాయకశ్రేణి ప్రధానంగా మూడు సంఘాల సమాఖ్య.   ఇందులో మొదటిది; బాధితుల సంఘం. ఇదే కీలమైనది. దీనికి తేళ్ళ జడ్సన్ నాయకుడు. ఆయన మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు. కారంచేడు బాధితులకు సంఘీభావంగా మరో రెండు సంఘాలు ఏర్పడ్డాయి. వాటిల్లో మొదటిది కత్తి పద్మారావు నాయకత్వంలోని సంఘీభావ సంఘం, రెండవది; పీపుల్స్ వార్ నాయకత్వంలోని సంఘీభావ సంఘం. దానికి నేను నాయకుడ్ని. ఈ మూడు సంఘాల మధ్య మంచి సమన్వయం వుండేది.

 పీపుల్స్ వార్ విభాగానికి చెందిన సంఘీభావ సంఘం ఆగస్టు 15ను ‘నల్లదినంగా’ ప్రకటించి చీరాల గడియారం స్థంభం సెంటరులో పెద్ద బహిరంగ సభ నిర్వహించింది. కారంచెడు ఉద్యమంలో అదే మొట్టమొదటి బహిరంగ సభ. కత్తి పద్మారావు నాయకత్వంలోని సంఘీభావ సంఘం బొజ్జా తారకంతో కలిసి 1985 సెప్టెంబరు 1న దళిత మహాసభగా ఆవిర్భవించింది. మరోవైపు,   పీపుల్స్ వార్ విభాగానికి చెందిన సంఘీభావ సంఘమే తరువాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్య గా మారింది. దళిత మహాసభది వర్గేతర దృక్పథంకాగా, బలహీనవర్గాల సమాఖ్యది వర్గమూ, వర్గేతరము కలిసిన సంయుక్త దృక్పధం. ఆంధ్రప్రదేశ్ బలహీన వర్గాల సమాఖ్యకు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. గోసాల ఆశీర్వాదం ప్రధాన కార్యదర్శి. బి. పరంజ్యోతి కోర్ కమిటి కన్వీనర్.  

దాదాపు రెండు వందల కుటుంబాలు, ఆరు వందల మంది బాధితులకు చీరాలలో నివాసాలు ఏర్పాటు చేయడం, వంద రోజుల పాటు  వాళ్లకు భోజన వసతి కల్పించడం కారంచేడు ఉద్యమం ఎదుర్కొన్న తక్షణ  సమస్య. తొలి ప్రయత్నమే అయినా అది చాలా సమర్ధంగా సాగింది. ఉద్యమ వ్యూహం, కార్యాచరణ, న్యాయపోరాటం రెండో సమస్య. నాయకులతో సహా అందరికీ అన్నీ కొత్తే. అప్పటికి ఎస్టీ, ఎస్సీ లపై అత్యాచారాల నిరోధక చట్టం లేదు. మేము అనుసరించడానికి మా ముందు మరో ఉద్యమ నమూనా లేదు. మేమే తరువాతి ఉద్యమాలకు నమూనా అయ్యాం. సినిమా భాషలో చెప్పాలంటే “మేము ట్రెండ్ ను ఫాలో కాలేదు; మేమే ట్రెండ్ ను సృష్టించాం”.  

ఉద్యమాలకు సంబంధించి ఒక నిర్మాణ సూత్రం నియమం ఏమంటే ఒకరు అంకిత భావంతో పోరాటానికి సిధ్ధం అయి రోడ్డు మీద నిలబడినపుడు జనం, డబ్బు వాటికవే వచ్చి చేరుతాయి. ఒకరి పోరాట పటిమ ఇతరుల్లో పోరాట స్వభావాన్నీ, దానగుణాన్ని మేల్కొలుపుతుంది. మనం ఎన్నడూ ఊహించని వ్యక్తులు సహితం వచ్చి స్వచ్చందంగా సహాయ సహకారాలు అందిస్తారు. కారంచెడులో అదే జరిగింది. అనేక మంది తమకు చేతనయిన సహాయం చేశారు.

దాడి జరిగిన కొత్తలో రక్షణత్మకంగా వ్యవహరించి, దాదాపు ముఖం చాటేసిన ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమం ఉదృతం కావడంతో నిర్బంధాన్ని తీవ్రం చేసింది. అప్పటి వరకు కనిపించని పోలీసులు హఠాత్తుగా బూట్ల నాడాలు ముడివేసి, నడుముకు బెల్టులు బిగించి, తుపాకి గొట్టాలు శుభ్రం చేసుకున్నారు. నిర్బంధం లేనప్పుడు ఉద్యమాన్ని నడపడం వేరు; నిర్బంధ కాలంలో ఉద్యమాన్ని నడపడం వేరు. ఆ నైపుణ్యం ఆనాడు నక్సలైట్ల దగ్గరే వుంది.   

సెప్టెంబరు 10న నిర్వహించిన రాష్ట్ర బంద్ ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ రోజు ప్రకాశం, గుంటూరు జిల్లాలో అనేక చోట్ల ఆర్టీసీ బస్సుల్ని నిరసనకారులు తగలబెట్టారు.  బాపట్ల తదితర రైల్వేస్టేషన్లలో  సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. మదరాసు-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నిలిపేశారు. ఆరోజు రాత్రి చీకటిపడ్డాక  చీరాలలో రైల్వే పట్టాల మీద ధర్ణా చేస్తున్న నిరసనకారులు వంద మందిని అరెస్టు చేయడంతో వాతావరణం బాగా వేడెక్కింది. రైల్వే పట్టాల మీద అరెస్టు చేసినవారిలో సలగల రాజశేఖర్ వున్నారు.

ఆ వరుసలో కత్తి పద్మారావును, నన్నూ అరెస్టు చేస్తారనే సంకేతాలొచ్చాయి. ఆరోజు నేను మారు వేషంలో వెళ్ళి  రైల్వే పట్టాల మీద  నిరసన ప్రదర్శన చేస్తున్న వారిని పరామర్శించి వచ్చాను. అరెస్టును తప్పించుకోవడానికి చీరాల వదిలి వెళ్ళిపోవాలని కత్తి పద్మారావు నిర్ణయించుకున్నారు. ఆ మరునాడు అరెస్టులకు వ్యతిరేకంగా తలపెట్టిన నిరసన ప్రదర్శన మధ్యలో వారు  నిర్వహణ బాధ్యతను నాకు అప్పచెప్పి గుంటూరు కన్నమ రాజా దగ్గరికి  వెళ్ళిపోయారు.

ప్రధాన బాధ్యతల్ని స్వీకరించిన మరుక్షణం నేను ఊరేగింపును చీరాల పోలీస్ స్టేషన్ వైపుకు నడిపాను. అరెస్టు చేసిన వాళ్లను విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్ణా చేశాము. పొలీసులు లాఠీచార్జి చేశారు. బాధితులు, సానుభూతిపరులు చాలామంది గాయపడ్డారు. జనం కూడా పోలీసుల మీద తిరగబడ్డారు.  తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళల్ని బల్లరిక్షాలో వేసుకుని నేను చీరాల ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాను.

ప్రతి ఉద్యమంలోనూ ఇలాంటి భీభత్స సంఘటనలు వుంటాయి. వీటిల్లో ఒక అనిర్వచనీయమైన గొప్ప ఉద్వేగమూ వుంటుంది. నాకు ఆ గాయపడ్డవారూ తెలీదు. రిక్షాను లాక్కొని వచ్చినవాడూ తెలీదు. రిక్షాను తొక్కినవాడూ తెలీదు. అసలు ఆ పట్టణంలో  ప్రభుత్వాసుపత్రికి వెళ్ళే దారి కూడా తెలీదు.  అందరూ నా రక్తసంబంధీకుల్లా ప్రవర్తించారు. ఏదో మంత్రం వేసినట్టు నాకు తెలీకుండానే నేను చేయాల్సిన పనులన్నీ వరుసగా జరిగిపోయాయి.

  హాస్పిటల్ లోనూ అంతే ఒక డాక్టర్ పరుగున  వచ్చి “వీళ్లకు నేను ట్రీట్ మెంట్ చేస్తానుగానీ. ముందు మీరు ఇక్కడి నుండి పారిపొండి. యస్పీ, కలెక్టర్ ఇద్దరూ వస్తున్నారు” అన్నారు. నా చేతి గాయానికి చిన్న కట్టుకట్టిన నర్సు నా భజం పట్టుకు లాక్కొని పోయి ఆ చీకట్లో ఒక గోడను చూపెట్టి “అది ఎక్కి దూకేయండి. అటు ఇసకే వుంది. ఆ మామిడి తోటలో నుండి లైట్లు వున్న వైపుకు పోతే బాపట్ల రోడ్డు ఎక్కుతారు అంది” గోడ దూకి రోడ్డెక్కిన తరువాత నాకో జ్ఞానోదయం అయింది. మనం గమనించంగానీ, ఉద్యమాలకు తోడ్పడడానికి పైకి కనిపించని ఒక బలమైన నెట్ వర్క్ ఈ సమాజంలో ఎప్పుడూ వుంటుంది. మనకు ఉద్యమించే మనసే లేనపుడూ అది లేనట్లుగా వుంటుంది. మనం ఉద్యమించడానికి సిధ్ధమైనపుడు అది మన కళ్లముందు ప్రత్యక్షం అవుతుంది. అంతేకాదు; మనం ఊహించిన దానికన్నా గొప్పగా చకచకా పనులు చేసేస్తుంది.

(ఇంకావుంది)

Karamchedu : Past, Present and Future Part - 1


కారంచేడు – గతం వర్తమానం భవిష్యత్తు.
ఉషా యస్ డానీ






(నన్ను మరీమరీ అడిగి మూడు వ్యాసాల సీరీస్ ను రాయించిన avaninews.com వెబ్ సైట్ నిర్వాహకుడు యం.వి. రమణకు ధన్యవాదాలు)

          ముఫ్ఫయి యేళ్ల తరువాత మూడు ప్రశ్నలకు ‘కారంచేడు’లో సమాధానాల్ని  వెతకాల్సి వున్నది. కారంచేడులోనే దళితుల నెత్తురు ఎందుకు కారింది? తెలుగువాళ్ల సాంఘీక రాజకీయాలపై కారంచేడు ఉద్యమం వేసిన ప్రభావంలో మంచిచెడులు ఏమిటీ? అస్తిత్వవాద ఉద్యమాల భవిష్యత్తు ఏమిటీ?

కారంచేడులోనే దళితుల నెత్తురు ఎందుకు కారింది?
          కృష్ణనది మీద ఆనకట్ట కట్టిన తరువాత  కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించిన కృష్ణా తూర్పు డెల్టా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన కృష్ణా పశ్చిమ డెల్టాలు బ్రిటీష్ ఆంధ్రా ప్రాంతంలో బలమైన ఆర్ధిక వ్యవస్థలుగా అవతరించాయి. కాకినాడ – మద్రాసు రేవు పట్టణాలను కలుపుతూ నిర్మించిన బకింగ్ హామ్ కాలువ కారంచేడును తాకుతూ సాగుతుంది.  కాలువల వ్యవస్థ ద్వార కలిగిన వెసులుబాటువల్ల మరింత లబ్దిపొందిన గ్రామాల్లో కారంచేడు ఒకటి.

          ప్రపంచంలో ఎక్కడయినా ధనికపేద వర్గాల మధ్య సహజంగానే వైరుధ్యం వుంటుంది. వెనుకబడిన ప్రాంతాల్లో ఈ వైరుధ్యం ఘర్షణ రూపం తీసుకుంటుందనీ, అభివృధ్ధి చెందిన ప్రాంతాల్లో ఇది సామరస్యంగా మారుతుందనీ నమ్మేవాళ్ళు చాలామంది వుంటారు.  అదే  నిజమయితే  ధనిక పేద వర్గాలమధ్య అంతరం చాలా ఎక్కువగా వున్న మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో దళిత, పెత్తందారీ కులాల మధ్య ఏనాడో ఘర్షణలు జరిగివుండాలి; అభివృధ్ధి చెందిన కృష్ణా-గుంటూరు-ప్రకాశం జిల్లాల్లో అస్సలు జరక్కూడదు. ఇలాంటి భ్రమల్ని కారంచేడు నరమేధం పటాపంచలు చేసింది.

          ధనిక- పేద వర్గాలమధ్య, పెత్తందారీ-అణగారిన సామాజికవర్గాల మధ్య అంతరం తక్కువగావున్న ప్రాంతాల్లోనే ఆర్ధిక ఘర్షణ  సాంస్కృతిక రూపంలో చెలరేగే అవకాశాలు ఎక్కువని కారంచేడు నిరూపించింది. ఆ తరువాత జరిగిన చుండూరు, వేంపెంట నరమేధాలు ఈ అంశాన్నే నిరూపించాయి. చుండూరు కూడా కాలవల వ్యవస్థవల్ల లబ్దిపొందిన ప్రాంతం. వేంపెంట కేసీ - కేనాల్ గట్టున వున్న గ్రామం. ఈ సామాజికార్ధిక సూత్రం అర్ధం కాకపోతే ఆగ్రా, మీరట్, మాలెగావ్, అహ్మదాబాద్, హైదరాబాద్ లలోనే మతఘర్షణలు ఎందుకు జరుగుతాయో మనకు ఎన్నటికీ అర్ధం కాదు. 

తెలుగువాళ్ల సాంఘీక రాజకీయాలపై కారంచేడు ఉద్యమం వేసిన ప్రభావంలో మంచి చెడులేమిటీ?

          రావలసినవాళ్ల ద్వారా కాకుండా రాకూడనివాళ్ల ద్వార భారత దేశంలోనికి కమ్యూనిజం ప్రవేశించింది. మరోమాటల్లో చెప్పాలంటే అవసరంవున్నవాళ్ళ ద్వార కాకుండా అవసరం లేనివాళ్ల ద్వార కమ్యూనిజం మన దేశంలోనికి వచ్చింది. అందుకు తగిన మూల్యాన్ని కూడా అది చెల్లించాల్సి వచ్చింది. కమ్యూనిస్టు పార్టిల అగ్రనేతల వ్యక్తిగత నిజాయితీని శకించాల్సిన పనిలేదుగానీ, వాళ్ల ఆర్థిక-సాంస్కృతిక జీవన  నేపథ్యానికి  కమ్యూనిజం ప్రాణరక్షణ ఔషధం కాదనిమాత్రం కఛ్ఛితంగా చెప్పవచ్చు.

          అణగారినవర్గాలకు కమ్యూనిజం ప్రాణరక్షణ మందు. అయితే, అణగారినవర్గాలకు శ్రామికవర్గం వర్గం అనే ఏకైక అస్తిత్వం మాత్రమే వుండదు. అనేకానేక ఇతర అస్తిత్వాలు కూడ ఏకసమయంలో వుంటాయి. వర్తమాన సమాజంలో బహుళ అస్థిత్వాలవల్ల తలెత్తే అనేకానేక సమస్యలకు (పెత్తందారీ కులాలకు చెందిన) కమ్యూనిస్టు నాయకులు సృజనాత్మకంగా పరిష్కారాల్ని చూపించలేకపోయారు. కేవలం శ్రామికవర్గం అనే అస్తిత్వాన్ని మాత్రమే వాళ్ళు మొరటుగా మొండిగా గుర్తించేవారు. ఈ పరిమితికి  విప్లవ కమ్యూనిస్టు నాయకులు కూడా మినహాయింపు ఏమీ కాదు. కుల, మత, లింగ, ప్రాంత తదితర వైరుధ్యాలని వర్గ ప్రాతిపదికన విశ్లేషణ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు.  అంతేకాదు; అలాంటి అస్తిత్వవాదనలు విప్లవోద్యమాన్ని బలహీనపరుస్తాయని భావించేవారు.  అలా వర్గేతర అణిచివేత  భావనలకు కమ్యూనిస్టు నాయకులు అడ్డుపడిన సందర్భాలూ వున్నాయి. వ్యక్తిగత స్థాయిల్లో వర్గేతర ఘర్షణల్ని వర్గదృక్పధంతో విశ్లేషణ చేసిన కమ్యూనిస్టు నాయకులు కొందరు లేకపోలేదుగానీ. అయితే, అది అప్పటికి కమ్యూనిస్టు పార్టీల అధికార  విధానం మాత్రం కాదు. ఇప్పటికీ కాదు.

          మొరటు కమ్యూనిస్టు నాయకుల మీద ముందుగా మహిళా ప్రపంచంలో మొదలయిన అభ్యంతరం క్రమంగా ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనార్టీ మతాల వరకు విస్తరించింది. వర్గేతర నిరసనలు, ఘర్షణలకు తాత్విక రాజకీయ రంగాల్లో ఒక ఆమోదాంశాన్ని తెచ్చిన తొలి ఉద్యమం కారంచేడు. ఆ కోణంలో అది చారిత్రకంగా మహత్తరమైనది.

          (అవిభక్త) ఆంధ్రప్రదేశ్ రాజకీయ సాంఘీక రంగాల్లో 1985 ఒక మైలురాయి. ఒక మలుపు. ఒక కుదుపు. అత్యయిక పరిస్థితి నుండి మొదలయిన సామ్యవాదభావాల వ్యాప్తి అప్పటికి పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్రంలో ప్రజలందరూ సామ్యవాదులుగా మారిపోయారా? అన్నంతగా వుండేది పరిస్థితి. అణగారినవర్గాలకు అప్పటి పీపుల్స్ వార్ ఒక ఆశాజ్యోతిగా వుండేదంటే అతిశయోక్తికాదు. దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం తన ఇనప కోరల్ని చాచిన కాలం కూడా అదే. విప్లవోద్యమంలో దళసభ్యులు, వృత్తివిప్లవకారుల్ని మాత్రమేకాక పౌరహక్కుల నేతలు, సాధారణ సానుభూతిపరుల్ని సహితం ఎన్టీఆర్ ప్రభుత్వం పిట్టల్లా కాల్చిపడేసిన కాలం కూడా అదే.

          బయట ఇంతటి అణిచివేత సాగుతున్న కాలంలోనే పీపుల్స్ వార్ లో చీలిక వచ్చింది. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి విడిపోయారు. సరిగ్గా అప్పుడే కారంచేడు బద్దలయింది. సామాజిక సమస్యలకు కేవలం ఆర్ధికవర్గ పరిష్కారం మాత్రమేకాక సాంస్కృతికవర్గ పరిష్కారాల్ని సహితం అన్వేషించాల్సిన అవసరాన్ని అది ముందుకు తెచ్చింది.

          కారంచేడు నరమేధం హతులు, బాధితులు మరీ పేదవారేమీకాదు. యజమాని కులాలవాళ్ల బీరువాలు నిండాక జాలువారిన చిల్లరతో జీవితాల్లో స్థిరపడుతున్నవాళ్ళు. దీన్నే ఇటీవల ఎద్దేవగా ట్రికిలింగ్-డౌన్  ఎఫెక్ట్ అంటున్నారు. కులపరంగా దాదాపు అందరూ మాదిగ సామాజికవర్గానికి చెందినవారు. మతపరంగా క్రైస్తవులు. జులై 17, 1985న కారంచేడు పరిసర ప్రాంతాల యజమాని కులాలకు చెందిన కమ్మ సామాజికవర్గం మాదిగవాడ మీద సాగించిన దాడిలో చనిపోయినవాళ్ళు చేలల్లోనే ఒరిగిపోగా, మిగిలినవాళ్లంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని చీరాల పట్టణానికి చేరుకున్నారు. వారి తొలి ఆశ్రయం ప్రభుత్వాసుపత్రికాగా, మలి ఆశ్రయం ఆ సమీపాన్నే వున్న చర్చి అయింది.

          దాడికి నాయకత్వం వహించారని భావిస్తున్న కులపెద్ద దగ్గుబాటి చెంచురామయ్య అప్పటి ముఖ్యమంత్రి యన్టీ రామారావుకు స్వయాన వియ్యంకుడు. చెంచురామయ్య కొడుకు, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. అందువల్ల, బాధితుల శిబిరంలో భూస్వామ్య వ్యతిరేకత, కమ్మసామాజికవర్గ వ్యతిరేకత, తెలుగుదేశం పార్టి వ్యతిరేకత, దళిత-క్రైస్తవ సానుభూతి వ్యక్తంకావడంలో అనూహ్యమైనది ఏదీలేదు. భూస్వామ్య వ్యతిరేకతతో కొందరు రాడికల్స్, కమ్మ వ్యతిరేకతతో కొందరు అంబేడ్కరిస్టులు, తెలుగుదేశం వ్యతిరేకతతో కొందరు కాంగ్రెస్ నాయకులు, క్రైస్తవ బాధితుల్ని ఆదుకోవడానికి కొందరు చర్చిపెద్దలు ముందుకు వచ్చారు. ఈ నాలుగు సమూహాల సమీకరణే ఆ ఉద్యమ నాయకత్వం.

          బాధితుల్ని పరమర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రిని రాడికల్స్ అడ్డుకుంటే, వామపక్షాలు, విప్లవపార్టీల ప్రతినిధుల్ని సహితం కొందరు యస్సీ నాయకులు పెత్తందారీ కులప్రాతిపదికన  అడ్డుకున్నారు. చర్చి బాధ్యుల్లో ఒకరయిన ముకిరి విక్టర్ శ్యాంసన్ , పట్టణ కాంగ్రెస్ ప్రముఖుడు సలగల రాజశేఖర్ తొలిదశలో బాధితుల్ని ఆదుకోవడానికి ప్రయత్నించినా పాత రాజకీయ ఫార్మూలాలు ఏవీ ఆ ఉద్యమంలో పనికిరాకుండా పోయాయి. అప్పటికి పేరుమోసిన యస్సీ నాయకులు ఏదో ఒక రాజకీయ పార్టీలో వుండడంవల్ల వాళ్లను కూడ బాధితులు నమ్మలేదు. దేవుని ఆలయం రాజకీయ వేదికగా మారడంతో చర్చీ పెద్దలు కూడా నాలుగు రోజుల తరువాత  బాధితుల్ని బయటికి పొమ్మన్నారు.

          అక్కడి నుండి కొత్త నాయకత్వం, కొత్త తరహా వుద్యమం ఆరంభమయింది.. ఉద్యమ స్థావరం ఏర్పడింది. రాత్రికిరాత్రి శాంతి నగర్ లో ఆరెకరాల పర్ర కొని బాధితులకు పాకలూ, పందిళ్ళూ వేశారు.

          అప్పట్లో హేతువాద సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వుంటున్న కత్తి పద్మారావు కొత్త నాయకునిగా వెలుగులోనికి వచ్చారు. రాడికల్స్ తోపాటు  హేతువాదుల్నీ చర్చి వ్యతిరేకించింది. ఈ సామాన్యాంశమే హేతువాది కత్తి పద్మారావుకూ, రాడికల్స్ కు మధ్య ఒక పొత్తును కుదిర్చింది.  అలాంటి పొత్తు కుదుర్చుకుని పనిచేయమని పీపుల్స్  నన్ను చీరాలకు పంపించింది. బాధితులు క్రైస్తవ మైనార్టీలు కావడం, నేను ముస్లిం మైనార్టి కావడం, నా పేరు డానీ కావడం, పాఠశాల విద్య రోజుల నుండి క్రైస్తవులతో (దళితులతో) సన్నిహితంగా వుండడం మొదలయిన అంశాలన్నీ నా ఎంపికకు దోహదం చేశాయి.

(ఇంకావుంది)


Sunday, 19 July 2015

ప్రభుత్వ వేతన కలం కార్మికులకు ఒక విజ్ఞప్తి

ప్రభుత్వ వేతన కలం కార్మికులకు ఒక  విజ్ఞప్తి
ఉషా యస్ డానీ

తాము గొప్పగా పాలిస్తున్నామని ప్రభుత్వాధినేతలు అనుకుంటే సరిపోదు. ప్రభుత్వం గొప్పగా పనిచేస్తున్నదని ప్రజలు కూడా అనుకోవాలి. అలా అనుకోకపోతే ఆ తరువాతి ఎన్నికల్లో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తారు. అంచేత తాము చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడానికి ప్రభుత్వాలు ఒక ప్రత్యేక మంత్రివర్గ  విభాగాన్నే ఏర్పాటు చేసుకుంటాయి. దీన్నే సమాచార, పౌరసంబంధాల శాఖ అంటారు.

ప్రభుత్వ ప్రచారంకన్నా ప్రభుత్వాధినేత  ప్రచారం మరీ ముఖ్యం కనుక ముఖ్యమంత్రి పేషీలోనూ, క్యాంపు కార్యాలయంలోనూ, సచివాలయంలోనూ ఇంకో పీఆర్వో వ్యవస్థ వుంటుంది. ఇందులోనూ కనిపించే పీఆర్వోలు కనిపించని పిఆర్వోలు వుంటారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పత్రిక నిర్వహణ పేరుతో మరో పిఆర్వో వ్యవస్థ వుంటుంది. ఇటీవల వెబ్ సైట్ పేరుతో ఒకటి, సోషల్ మీడియాలో ప్రచారం పేరుతో ఇంకొకటి కొత్త పీఆర్వో వ్యవస్థలు వచ్చాయి. ఇవికాక, ముఖ్యమంత్రికి కీలక ప్రసంగాలు రాసిపెట్టడానికీ, అడపాదడపా పత్రికల్లో ముఖ్యమంత్రి పేరునో, కీలక నేతల పేరునో ఎడిట్ పేజీ వ్యాసాలు రాయడానికీ ఘోస్టు రచయితల వ్యవస్థ కూడా వుంటుంది.

ప్రభుత్వం కాంగ్రెస్ ది అయినా, తెలుగుదేశానిది అయినా, ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి వున్నా, నారా చంద్రబాబు నాయుడు వున్నా ఈ ఏర్పాట్లన్నీ తప్పవు. సాలీన వీటి నిర్వహణ వ్యయం వందల కోట్ల రుపాయల్లోనే వుంటుంది. ప్రకటనల ఖర్చుల్ని కూడా కలుపుకుంటే అది వేల కోట్ల రుపాయల్లోనే వుంటుంది.  చంద్రబాబుకు ప్రచార యావ కొంచెం ఎక్కువ గనుక. వారి బడ్జెట్ మరింత ఎక్కువగానూ వుంటుంది.

ఇవిగాక, అధికారపార్టీలకు సహకారాన్నందించే రెండు మూడు ప్రధాన పత్రికలు, రెండు మూడు ప్రధాన న్యూస్ ఛానళ్ళు ఎలాగూ వుంటాయి. ఆ మీడియా సంస్థలకు ఎలాంటి ప్రయోజనాలు ఏ రూపంలో ఒనగూడుతాయి అన్నది ఆసక్తికర అంశం. ఈ వరస ఇంతటితో ఆగదు. ప్రభుత్వం నుండి లబ్ది పొందిన కార్పొరేట్ సంస్థలు సహితం తమ  కృతజ్ఞత ప్రకటించుకోవడానికి   సందర్భానుసారం మీడియాలో పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తుంటాయి. వీటికోసం కూడా పాత్రికేయుల కరసేవ  అవసరం అవుతుంది.  

చంద్రబాబు ఈసారి అధికారాన్ని చేపట్టిన తరువాత కొత్తగా మీడియా సలహామండలి వ్యవస్థను నెలకొల్పారు. సమాచారశాఖా మంత్రితో సమానంగా కేబినేట్ హోదా ఇచ్చి మీడియా సలహాదారునిగా పరకాల ప్రభాకర్ ను నియమించారు. వారికి సహకరించడానికి ఓ డజను మంది సమాచార అధికార్లను (Communication Officers)  నియమించారు. వీళ్లందరి జీతభత్యాలు, ఇతర సదుపాయాల గురించి సీనియర్ జర్నలిస్టు నందిరాజు రాధాకృష్ణ అప్పట్లో ఒక పోస్టు పెట్టారు.

మా నరసాపురం మేధావి మాత్రమేకాక, మేమిద్దరం కొంతకాలం ఏన్టీవీలో కలిసి పనిచేసిన అనుబంధం కూడా వుంది కనుక పరకాల ప్రభాకర్ నియామకాన్ని హర్షించినవాళ్ళలో నేనూ ఒకడ్ని. అలాగే కొందరు జర్నలిస్టు మిత్రులకు కష్టకాలంలో పునరావాస సౌలభ్యం దొరికినందుకూ నేను ఆనందించాను.

పైన చెప్పినదంతా ప్రభుత్వ వ్యవస్థ. ఇదిగాక, మీడియాలో టిడిపీ ప్రచారాన్ని సాగించడానికి అభిష్ఠ నాయకత్వాన  నారా లోకేష్ ఇంకో పిఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీన్ని ఇప్పుడు టిడిపివర్గాలు వెబ్ సైట్ టీం అంటున్నారు. దీని సభ్యులు దేశవిదేశాల్లోనూ వున్నారట.  ఈ విభాగం కోసం కూడా భారీగానే ఖర్చుపెడుతున్నారు.

పైన చెప్పిన పాత, కొత్త వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్లందరూ పెయిడ్ సర్వెంట్స్.  వేతన కలంకార్మికులు. వీళ్ళందరికీ ఒకటే వృత్తిధర్మం; చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ భూలోక స్వర్గంగా వుందనీ, రాష్ట్రంలో ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో రోజూ పండుగలు జరుపుకుంటున్నారని తమకు వీలైనన్ని పధ్ధతుల్లో, వీలైనన్ని మీడియాల్లో ప్రచారం చేయడం. అందుకువాళ్లను నిందించడంలేదు. రేపు కాలం కలిసిరాక నాకూ అక్కడ కొలువు కుదిరితే నేనూ ఆ పనే చేయాల్సి వుంటుంది.  ఆ మేరకు వాళ్ళ మీద నాకు సానుభూతి మాత్రమే వుంది.

చంద్రబాబు ప్రభుత్వానిది స్వభావసిధ్ధాంగానే కార్పొరేట్ విజన్. అంచేత, కార్పొరేట్ ప్రయోజనాలని ప్రజల ప్రయోజనంగా ప్రచారం చేయడం ఈ వేతన కలం కార్మికుల కర్తవ్యం.   విధినిర్వహణలో ఈ కలం కార్మికులు విఫలమయ్యారో, చంద్రబాబు పాలన వీళ్ళు ముసుగు వేయలేనంత అధ్వాహ్నంగావుందోగానీ రాష్ట్ర ప్రజల్లో మాత్రం నిరసన రోజురోజుకూ పెరుగుతోంది.

ప్రజల్లో నిరసన పెరుగుతోందని తెలిసినప్పుడు ప్రభుత్వాధినేతలు ముందుగా విమర్శించేది పీఆర్వో వ్యవస్థనే. అలాంటి నిస్పృహ ఇప్పుడు మన వేతన కలం కార్మికుల్లో ప్రస్పుటంగా కనిపిస్తున్నది. వాళ్ళు మేధోసంచయనాన్నీ(Intellectual articulation) మానేసి తిట్ల భాష, సారాకొట్టు భాషా వాడుతున్నారు. నిస్పృహలో వున్న వాళ్లకు సభ్యభాష రాదు.

ప్రజల పక్షాన నిలబడకపోవడమే పాత్రికేయులు చేసే మొదటితప్పు. తప్పుచేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడాలనుకోవడం అంతకన్నా పెద్దతప్పు. ప్రజల పక్షాన మాట్లాడే పాత్రికేయుల్ని విమర్శించడం అంతకన్నా మరీ పెద్దతప్పు. ప్రభుత్వ తప్పిదాలని ఎత్తిచూపుతున్న పాత్రికేయుల్ని  తిట్టడం, వాళ్ల మీద నిందలేయడం దిగజారుడుతనం. ఇంతగా దిగజారవద్దని ప్రభుత్వ కొలువు చేస్తున్న పాత్రికేయ మిత్రుల్ని కోరుతున్నాను.  మేధోసంచయనాన్నీ ఏ స్థాయిలో కొనసాగించినా అందులో పాల్గొనడానికి మేము సిధ్ధమని ప్రకటిస్తున్నాను.

ముగింపులో ఒకమాట చెప్పాలి. పైన రాసిందంతా మేము సంస్కారంగా వుండాలనుకున్నప్పుడు వాడే భాష మాత్రమే!  మా మాస్ భాష వేరేగా వుంది. మాది నరసాపురం. మాకు ఎవరిమీదనయినా మరీ ఎక్కువ ప్రేమ వచ్చినపుడు “అమ్మ లం...” “అమ్మ లం...కొడక అంటాం. అలాంటిది మాకు కోపం వచ్చినపుడు ఏ పదాలు, ఏభాష మాట్లాడతామో విజ్ఞులు ఊహించుకోవచ్చు. మమ్మల్ని మా మాస్ భాష గుర్తుచేయవద్దు!
END

19 July 2015

Thursday, 16 July 2015

Karamchedu Timeline.

To the best of my memory the following is theKaramchedu Timeline.

1. Feb 1985 AIRSU Conference Hyderabad. Radical supporters fromKaramachedu attended the conference.

2. May 1985 Village campaign was disturbed by the local landlords inKaramchedu village.

3. 17 July 1985 Ghostly  incident  occurred.  Initial    relief  work  was  done  bylocal radicals  and  it  was  furthered  by  Kathi  Padma  Rao  of Hetuvada Sangham,   Salagala  Rajasekhar  and  Mukiri Victor Shyamson. (Church Office Bearer ).

4. July End 1985 I joined the movement on the behest of People's War. Nemaluri Bhaskara Rao was RC   secretary. and there was some Com. Balaiah / Raju (name subject to verification). to  guide  me  on behalf  of  the RC. Bokka Parmajyothy,  Virapani  Venkateswara Rao were my supporters apart from Radicals among the victims such as Isac, Prabhakar and others.. There was cultural team led by Diwakar and Dappu Ramesh.Kumari,  Yuvaka  (Kalaikuri  Durga  Prasad)   and  Chandrasriwere also very active in those days.

5. 15 August 1985 Radicals, under my leadership  organised a public meeting atGadiyaram Sthambham Center in Chirala. It was the first public meeting of the movement.Yelesamma, the mother of  a  deceased  in  the  attack  wasintroduced to public. She was killed later.

6. 1 Sept 1985 Dalita Mahasabha formed at a Huge public meeting.

7. 10 Sept 1985 State  Bandh  was  organised.  Police  arrested  about  100protesters. And kept them in the Chirala Police station.

8. 11 Sept 1985 Katti Padma Rao left Chirala Vijayanagar Sibiram for Guntur to stay with Kannama Raja handing over the leadership to me.

9. 13 Sept 1985 I  was arrested along with  seven others  at  Chiral  and sent  to Ongole jail and we got condition bail the other day. And I becamethe in-charge of  Vijayanagar Sibiram  since then.  There waspolice surveillance for me at the sibiram.

10. 6 Oct 1985 Police lifted the condition of the bail on a new condition that Ishould should  leave Chirala.Same day Kathi Padma Rao was arrested at Vijayawada public meeting.

11. July 1989 The Chirala court acquitted me and others as the prosecution failed to prove our guilty in the court of law.