కారంచేడు
– గతం వర్తమానం భవిష్యత్తు.
(నన్ను
మరీమరీ అడిగి మూడు వ్యాసాల సీరీస్ ను రాయించిన avaninews.com వెబ్ సైట్ నిర్వాహకుడు
యం.వి. రమణకు ధన్యవాదాలు)
ముఫ్ఫయి
యేళ్ల తరువాత మూడు ప్రశ్నలకు ‘కారంచేడు’లో సమాధానాల్ని వెతకాల్సి వున్నది. కారంచేడులోనే దళితుల నెత్తురు
ఎందుకు కారింది? తెలుగువాళ్ల సాంఘీక రాజకీయాలపై కారంచేడు ఉద్యమం వేసిన ప్రభావంలో మంచిచెడులు
ఏమిటీ? అస్తిత్వవాద ఉద్యమాల భవిష్యత్తు ఏమిటీ?
కారంచేడులోనే
దళితుల నెత్తురు ఎందుకు కారింది?
కృష్ణనది
మీద ఆనకట్ట కట్టిన తరువాత కృష్ణా, పశ్చిమగోదావరి
జిల్లాల్లో విస్తరించిన కృష్ణా తూర్పు డెల్టా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన
కృష్ణా పశ్చిమ డెల్టాలు బ్రిటీష్ ఆంధ్రా ప్రాంతంలో బలమైన ఆర్ధిక వ్యవస్థలుగా అవతరించాయి.
కాకినాడ – మద్రాసు రేవు పట్టణాలను కలుపుతూ నిర్మించిన బకింగ్ హామ్ కాలువ కారంచేడును
తాకుతూ సాగుతుంది. కాలువల వ్యవస్థ ద్వార కలిగిన
వెసులుబాటువల్ల మరింత లబ్దిపొందిన గ్రామాల్లో కారంచేడు ఒకటి.
ప్రపంచంలో
ఎక్కడయినా ధనికపేద వర్గాల మధ్య సహజంగానే వైరుధ్యం వుంటుంది. వెనుకబడిన ప్రాంతాల్లో
ఈ వైరుధ్యం ఘర్షణ రూపం తీసుకుంటుందనీ, అభివృధ్ధి చెందిన ప్రాంతాల్లో ఇది సామరస్యంగా
మారుతుందనీ నమ్మేవాళ్ళు చాలామంది వుంటారు.
అదే నిజమయితే ధనిక పేద వర్గాలమధ్య అంతరం చాలా ఎక్కువగా వున్న
మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో దళిత, పెత్తందారీ కులాల మధ్య ఏనాడో ఘర్షణలు జరిగివుండాలి;
అభివృధ్ధి చెందిన కృష్ణా-గుంటూరు-ప్రకాశం జిల్లాల్లో అస్సలు జరక్కూడదు. ఇలాంటి భ్రమల్ని
కారంచేడు నరమేధం పటాపంచలు చేసింది.
ధనిక-
పేద వర్గాలమధ్య, పెత్తందారీ-అణగారిన సామాజికవర్గాల మధ్య అంతరం తక్కువగావున్న ప్రాంతాల్లోనే
ఆర్ధిక ఘర్షణ సాంస్కృతిక రూపంలో చెలరేగే అవకాశాలు
ఎక్కువని కారంచేడు నిరూపించింది. ఆ తరువాత జరిగిన చుండూరు, వేంపెంట నరమేధాలు ఈ అంశాన్నే
నిరూపించాయి. చుండూరు కూడా కాలవల వ్యవస్థవల్ల లబ్దిపొందిన ప్రాంతం. వేంపెంట కేసీ -
కేనాల్ గట్టున వున్న గ్రామం. ఈ సామాజికార్ధిక సూత్రం అర్ధం కాకపోతే ఆగ్రా, మీరట్, మాలెగావ్,
అహ్మదాబాద్, హైదరాబాద్ లలోనే మతఘర్షణలు ఎందుకు జరుగుతాయో మనకు ఎన్నటికీ అర్ధం కాదు.
తెలుగువాళ్ల
సాంఘీక రాజకీయాలపై కారంచేడు ఉద్యమం వేసిన ప్రభావంలో మంచి చెడులేమిటీ?
రావలసినవాళ్ల
ద్వారా కాకుండా రాకూడనివాళ్ల ద్వార భారత దేశంలోనికి కమ్యూనిజం ప్రవేశించింది. మరోమాటల్లో
చెప్పాలంటే అవసరంవున్నవాళ్ళ ద్వార కాకుండా అవసరం లేనివాళ్ల ద్వార కమ్యూనిజం మన దేశంలోనికి
వచ్చింది. అందుకు తగిన మూల్యాన్ని కూడా అది చెల్లించాల్సి వచ్చింది. కమ్యూనిస్టు పార్టిల
అగ్రనేతల వ్యక్తిగత నిజాయితీని శకించాల్సిన పనిలేదుగానీ, వాళ్ల ఆర్థిక-సాంస్కృతిక జీవన నేపథ్యానికి
కమ్యూనిజం ప్రాణరక్షణ ఔషధం కాదనిమాత్రం కఛ్ఛితంగా చెప్పవచ్చు.
అణగారినవర్గాలకు
కమ్యూనిజం ప్రాణరక్షణ మందు. అయితే, అణగారినవర్గాలకు శ్రామికవర్గం వర్గం అనే ఏకైక అస్తిత్వం
మాత్రమే వుండదు. అనేకానేక ఇతర అస్తిత్వాలు కూడ ఏకసమయంలో వుంటాయి. వర్తమాన సమాజంలో బహుళ
అస్థిత్వాలవల్ల తలెత్తే అనేకానేక సమస్యలకు (పెత్తందారీ కులాలకు చెందిన) కమ్యూనిస్టు
నాయకులు సృజనాత్మకంగా పరిష్కారాల్ని చూపించలేకపోయారు. కేవలం శ్రామికవర్గం అనే అస్తిత్వాన్ని
మాత్రమే వాళ్ళు మొరటుగా మొండిగా గుర్తించేవారు. ఈ పరిమితికి విప్లవ కమ్యూనిస్టు నాయకులు కూడా మినహాయింపు ఏమీ
కాదు. కుల, మత, లింగ, ప్రాంత తదితర వైరుధ్యాలని వర్గ ప్రాతిపదికన విశ్లేషణ చేయడంలో
వాళ్ళు విఫలమయ్యారు. అంతేకాదు; అలాంటి అస్తిత్వవాదనలు
విప్లవోద్యమాన్ని బలహీనపరుస్తాయని భావించేవారు. అలా వర్గేతర అణిచివేత భావనలకు కమ్యూనిస్టు నాయకులు అడ్డుపడిన సందర్భాలూ
వున్నాయి. వ్యక్తిగత స్థాయిల్లో వర్గేతర ఘర్షణల్ని వర్గదృక్పధంతో విశ్లేషణ చేసిన కమ్యూనిస్టు
నాయకులు కొందరు లేకపోలేదుగానీ. అయితే, అది అప్పటికి కమ్యూనిస్టు పార్టీల అధికార విధానం మాత్రం కాదు. ఇప్పటికీ కాదు.
మొరటు కమ్యూనిస్టు నాయకుల మీద ముందుగా మహిళా
ప్రపంచంలో మొదలయిన అభ్యంతరం క్రమంగా ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనార్టీ మతాల వరకు విస్తరించింది.
వర్గేతర నిరసనలు, ఘర్షణలకు తాత్విక రాజకీయ రంగాల్లో ఒక ఆమోదాంశాన్ని తెచ్చిన తొలి ఉద్యమం
కారంచేడు. ఆ కోణంలో అది చారిత్రకంగా మహత్తరమైనది.
(అవిభక్త)
ఆంధ్రప్రదేశ్ రాజకీయ సాంఘీక రంగాల్లో 1985 ఒక మైలురాయి. ఒక మలుపు. ఒక కుదుపు. అత్యయిక
పరిస్థితి నుండి మొదలయిన సామ్యవాదభావాల వ్యాప్తి అప్పటికి పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్రంలో
ప్రజలందరూ సామ్యవాదులుగా మారిపోయారా? అన్నంతగా వుండేది పరిస్థితి. అణగారినవర్గాలకు
అప్పటి పీపుల్స్ వార్ ఒక ఆశాజ్యోతిగా వుండేదంటే అతిశయోక్తికాదు. దీన్ని అడ్డుకోవడానికి
ప్రభుత్వం తన ఇనప కోరల్ని చాచిన కాలం కూడా అదే. విప్లవోద్యమంలో దళసభ్యులు, వృత్తివిప్లవకారుల్ని
మాత్రమేకాక పౌరహక్కుల నేతలు, సాధారణ సానుభూతిపరుల్ని సహితం ఎన్టీఆర్ ప్రభుత్వం పిట్టల్లా
కాల్చిపడేసిన కాలం కూడా అదే.
బయట
ఇంతటి అణిచివేత సాగుతున్న కాలంలోనే పీపుల్స్ వార్ లో చీలిక వచ్చింది. కొండపల్లి సీతారామయ్య,
కేజీ సత్యమూర్తి విడిపోయారు. సరిగ్గా అప్పుడే కారంచేడు బద్దలయింది. సామాజిక సమస్యలకు
కేవలం ఆర్ధికవర్గ పరిష్కారం మాత్రమేకాక సాంస్కృతికవర్గ పరిష్కారాల్ని సహితం అన్వేషించాల్సిన
అవసరాన్ని అది ముందుకు తెచ్చింది.
కారంచేడు
నరమేధం హతులు, బాధితులు మరీ పేదవారేమీకాదు. యజమాని కులాలవాళ్ల బీరువాలు నిండాక జాలువారిన
చిల్లరతో జీవితాల్లో స్థిరపడుతున్నవాళ్ళు. దీన్నే ఇటీవల ఎద్దేవగా ట్రికిలింగ్-డౌన్
ఎఫెక్ట్ అంటున్నారు. కులపరంగా దాదాపు అందరూ
మాదిగ సామాజికవర్గానికి చెందినవారు. మతపరంగా క్రైస్తవులు. జులై 17, 1985న కారంచేడు
పరిసర ప్రాంతాల యజమాని కులాలకు చెందిన కమ్మ సామాజికవర్గం మాదిగవాడ మీద సాగించిన దాడిలో
చనిపోయినవాళ్ళు చేలల్లోనే ఒరిగిపోగా, మిగిలినవాళ్లంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని
చీరాల పట్టణానికి చేరుకున్నారు. వారి తొలి ఆశ్రయం ప్రభుత్వాసుపత్రికాగా, మలి ఆశ్రయం
ఆ సమీపాన్నే వున్న చర్చి అయింది.
దాడికి
నాయకత్వం వహించారని భావిస్తున్న కులపెద్ద దగ్గుబాటి చెంచురామయ్య అప్పటి ముఖ్యమంత్రి
యన్టీ రామారావుకు స్వయాన వియ్యంకుడు. చెంచురామయ్య కొడుకు, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి
వేంకటేశ్వరరావు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. అందువల్ల, బాధితుల శిబిరంలో భూస్వామ్య
వ్యతిరేకత, కమ్మసామాజికవర్గ వ్యతిరేకత, తెలుగుదేశం పార్టి వ్యతిరేకత, దళిత-క్రైస్తవ
సానుభూతి వ్యక్తంకావడంలో అనూహ్యమైనది ఏదీలేదు. భూస్వామ్య వ్యతిరేకతతో కొందరు రాడికల్స్,
కమ్మ వ్యతిరేకతతో కొందరు అంబేడ్కరిస్టులు, తెలుగుదేశం వ్యతిరేకతతో కొందరు కాంగ్రెస్
నాయకులు, క్రైస్తవ బాధితుల్ని ఆదుకోవడానికి కొందరు చర్చిపెద్దలు ముందుకు వచ్చారు. ఈ
నాలుగు సమూహాల సమీకరణే ఆ ఉద్యమ నాయకత్వం.
బాధితుల్ని
పరమర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రిని రాడికల్స్ అడ్డుకుంటే, వామపక్షాలు, విప్లవపార్టీల
ప్రతినిధుల్ని సహితం కొందరు యస్సీ నాయకులు పెత్తందారీ కులప్రాతిపదికన అడ్డుకున్నారు. చర్చి బాధ్యుల్లో ఒకరయిన ముకిరి
విక్టర్ శ్యాంసన్ , పట్టణ కాంగ్రెస్ ప్రముఖుడు సలగల రాజశేఖర్ తొలిదశలో బాధితుల్ని ఆదుకోవడానికి
ప్రయత్నించినా పాత రాజకీయ ఫార్మూలాలు ఏవీ ఆ ఉద్యమంలో పనికిరాకుండా పోయాయి. అప్పటికి
పేరుమోసిన యస్సీ నాయకులు ఏదో ఒక రాజకీయ పార్టీలో వుండడంవల్ల వాళ్లను కూడ బాధితులు నమ్మలేదు.
దేవుని ఆలయం రాజకీయ వేదికగా మారడంతో చర్చీ పెద్దలు కూడా నాలుగు రోజుల తరువాత బాధితుల్ని బయటికి పొమ్మన్నారు.
అక్కడి
నుండి కొత్త నాయకత్వం, కొత్త తరహా వుద్యమం ఆరంభమయింది.. ఉద్యమ స్థావరం ఏర్పడింది. రాత్రికిరాత్రి
శాంతి నగర్ లో ఆరెకరాల పర్ర కొని బాధితులకు పాకలూ, పందిళ్ళూ వేశారు.
అప్పట్లో హేతువాద సంఘానికి ప్రధాన కార్యదర్శిగా
వుంటున్న కత్తి పద్మారావు కొత్త నాయకునిగా వెలుగులోనికి వచ్చారు. రాడికల్స్ తోపాటు
హేతువాదుల్నీ చర్చి వ్యతిరేకించింది. ఈ సామాన్యాంశమే
హేతువాది కత్తి పద్మారావుకూ, రాడికల్స్ కు మధ్య ఒక పొత్తును కుదిర్చింది. అలాంటి పొత్తు కుదుర్చుకుని పనిచేయమని పీపుల్స్ నన్ను చీరాలకు పంపించింది. బాధితులు క్రైస్తవ మైనార్టీలు
కావడం, నేను ముస్లిం మైనార్టి కావడం, నా పేరు డానీ కావడం, పాఠశాల విద్య రోజుల నుండి
క్రైస్తవులతో (దళితులతో) సన్నిహితంగా వుండడం మొదలయిన అంశాలన్నీ నా ఎంపికకు దోహదం చేశాయి.
(ఇంకావుంది)
అతిశయోక్తి అనే పదం మినహా అంతా చాలా బాగుంది
ReplyDelete