Monday, 20 July 2015

Karamchedu : Past, Present and Future Part - 2


కారంచేడు – గతం వర్తమానం భవిష్యత్తు.
(పార్ట్ -2)
ఉషా యస్ డానీ











పార్టీ రీజినల్ కమిటీ (ఆర్ సి) సెక్రటరీ మల్లిక్ (నెమలూరి భాస్కర రావు) నుండి “వెంటనే కారంచేడు వెళ్లండి అక్కడ మీ అవసరం వుంది” అని కబురు వచ్చినపుడు చాలా ఆనందం వేసింది. “మీరు మాత్రమే చేయగలరు” అంటే చాలు ఎవరికైనా అహం చాలా సంబరపడిపోతుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించడం కోసం మనుషులు అనేక సాహసాలు దుస్సాహసాలు కూడా చేస్తారు. అలాంటి అతి ఉత్సాహంతోనే నేను చీరాల (కారంచేడు) చేరుకున్నాను.

అప్పుడు నాకు పెళ్లయి రెండేళ్ళు. పెద్దబ్బాయి పుట్టి మూడు నెలలు. అప్పట్లో నేను ఆటోమోబైల్స్ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. విజయవాడ సున్నపుభట్టీల సెంటరులో మా పూరిల్లును పడగొట్టి డాబా కట్టే ప్రయత్నంలో వున్నాం.  గోడలు వరకు పూర్తి చేసి, శ్లాబ్ వేసే ప్రయత్నంలో డబ్బుల కోసం తిరుగుతున్నాము. అంటే మా కుటుంబం దాదాపు రోడ్డు మీద వుంది. చిత్తూరు క్యాంపులో వుండగా  ఆర్ సి కబురు వచ్చింది. ఆఫీసుకు చెప్పలేదు. నా భార్య అజితకు మాత్రం కబురు చేశాను. “పిల్లోడి గురించి భయపడకు నేను చూసుకుంటాను” అంది. సెల్ ఫోన్ లేని ఆరోజుల్లో విప్లవ సమూహాల మధ్య ఒక అద్భుత కొరియర్ సర్విస్ వుండేది.

వైచిత్రి ఏమంటే కారంచేడులో దాడి చేసినవారిదీ, నా భార్యదీ ఒకటే సామాజికవర్గం. వర్గంలో కులం వున్నట్టే కులంలోనూ వర్గం వుంటుంది. సమాజసేవకుల ఇల్లాళ్ళు భర్తలవల్ల తరచూ ఇబ్బందులుపడే మాట వాస్తవమేగానీ, ఉద్యమ నాయకుల భార్యగా వుండడాన్ని ఆడవాళ్ళు గొప్పగా ఆస్వాదిస్తారు.

కారంచెడులో దాడి జరగడానికి ఓ ఏడాది ముందు నుండే ఆ గ్రామంలో రాడికల్ యూనిట్ వుంది. అక్కడి వ్యవసాయ కూలీల్లో విప్లవ చైతన్యాన్ని తీసుకు రావడానికి పరిమితస్తాయిలో పనిచేస్తున్నది.  1985 ఫిబ్రవరిలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రాండ్స్ లో జరిగిన అఖిల భారత విప్లవ విద్యార్ధి సమాఖ్య (ఏఐఆర్ ఎస్ ఎఫ్) మహాసభల్లో కారంచెడు గ్రామం నుండి నలుగురు యువకులు పాల్గొన్నారు. దాడి జరగ్గానే చీరాల హాస్పిటల్లో ఫొటోలు తీయించి మీడియాను కలిసింది కూడా వాళ్ళే.  ఆ తరువాత హాస్పిటల్ దగ్గరకు వచ్చిన కత్తి పద్మారావు  గొప్ప చొరవను ప్రదర్శించారు.
కత్తి పద్మారావు ఆర్తీ, ఆవేదన వున్న మనిషి. ప్రేమాస్పదులు. సామాజికవర్గ (కుల) దృక్పథం అప్పట్లో ఆయనకూ కొత్తే. మాకూ కొత్తే. సైధ్ధాంతిక అంశాలపై అప్పట్లో వారితో సాగించిన వాదోపవాదాలు నిర్మాణానికి, ఉద్యమానికి సంబంధించినవేతప్ప వ్యక్తిగతమైనవి కానేకావు. భిన్న తాత్విక దృక్పథాలు కలిగినవాళ్ళు ఒక ఉద్యమంలో కలిసి పనిచేసినపుడు ఐక్యతతోపాటూ కొంత ఘర్షణ కూడా వుంటుంది. వాటిని వ్యక్తిగత వ్యవహారంగా చూడకూడదు. కత్తి పద్మారావుతో కలిసి పనిచేయడాన్ని నేను గొప్పగా ఆస్వాదించాను. ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకు వచ్చినపుడు చాలా ఆనందంగా వుంటుంది.

 కారంచెడు ఉద్యమంలో దళితమహాసభ ఒక ఫ్యాక్టర్; పీపుల్స్ వార్ ఇంకో ఫ్యాక్టర్. ఇటీవల అంబేడ్కరిస్టులు కొందరు పీపుల్స్ వార్ ఫ్యాక్టర్ ను తీసివేయడానికో తగ్గించడానికో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పీపుల్స్ వార్ అభిమానులు కొందరు దళితమహాసభ ఫ్యాక్టర్ ను తీసివేయడానికో తగ్గించడానికో ప్రయత్నిస్తున్నారు. ఇవి రెండూ వీరాభిమానంతో చేసే చారిత్రక తప్పిదాలే. ఇలాంటి పనులు భవిష్యత్ ఉద్యమాల్లో ఐక్య సంఘటనకు విఘాతం కలిగిస్తాయి.
 
అప్పటి నిర్భంధ వాతావరణంలో బహిరంగంగా పనిచేసే అవకాశాలు పీపుల్స్ వార్ కార్యకర్తలకు ఏమాత్రం లేవు. కత్తి పద్మారావును బలపరచడంతప్ప ఆ పార్టీకి మరో మార్గంలేదు. మరోవైపు కత్తి పద్మారావుకు ఉద్యమాలని నడిపిన పూర్వానుభవమూలేదు. ముకిరి విక్టర్ శ్యాంసన్ చర్చి ప్రతినిధి. సలగల రాజశేఖర్ కాంగ్రెస్ నాయకుడు. వాళ్ళిద్దరి పోటీని తట్టుకుని ఉద్యమానికి ప్రధాన నేతగా నిలబడాలంటే పీపుల్స్ వార్ సహకారం తీసుకోవడంతప్ప కత్తి పద్మారావుకు మరో మార్గంలేదు. సంస్థ నిర్మాణం విషయంలోగానీ, బహిరంగ-రహాస్య పనివిధానాల విభజనతో ఫలితాలను రాబట్టడంలోగానీ, మీడియా మేనేజ్ మెంటులోగానీ పీపుల్స్ వార్ కు వున్న అపార అనుభవం ఎవ్వరూ నిరాకరించలేనిది.

కారంచెడు ఉద్యమానికి మీడియా సపోర్టు చాలా గొప్పగా వుంది. నెంబర్ ఒన్ న్యూస్ పేపర్ ఈనాడు అయినప్పటికీ అప్పట్లో దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో వచ్చిన ఉదయం దినపత్రిక గొప్ప వెలుగులో వుంది. నక్సలైట్ ఉద్యమ అభిమానులు అనేకులు ఉదయం, ఆంధ్రప్రభ దినపత్రికల్లో అనేక కీలక స్థానాల్లో వున్నారు. వీరిలో  కే శ్రీనివాస్, వేమన వసంతలక్ష్మి, బుధ్ధా జగన్ ముఖ్యులు. ‘ఉదయం’ ఎడిటర్ గా ఏబికే ప్రసాద్ వున్నారు. వారు తొలిరోజే ‘కారంచెడు కండకావరం అనే ఎడిటోరియల్ రాశారు. ‘ఉదయం’ విజయవాడ ఎడిషన్ ఇన్ చార్జీ కే రామచంద్రమూర్తి ఉద్యమం మీద సానుకూల వైఖరితో వున్నారు. న్యూస్ డెస్క్ లో తాడి ప్రకాష్, మురళి, నాంచారయ్య, ఖాదర్ వంటి సానుభూతిపరులు వున్నారు. ప్రాంతీయ, జాతీయ పత్రికలు ఆ ఉద్యమానికి  గొప్ప కవరేజి ఇచ్చాయి. జిల్లాస్థాయి నుండి సుప్రీం కోర్టు వరకు ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఏపిసిఎల్ సి) నెట్ వర్క్ చాలా పటిష్టంగా వుంది.  మరోవైపు ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది గాబట్టి పోలీసులు కూడా సెప్టెంబరు 10 వరకు మౌనంగా వున్నారు. ఉద్యమ వుధృతికీ, వ్యాప్తికి  ఇవన్నీ కలిసివచ్చాయి.

కారంచేడు ఉద్యమంలో పీపుల్స్ వార్ పక్షాన రాజకీయ విభాగంలో సెంట్రల్ ఆర్గనైజర్ (సివో)గా విరపని వేంకటేశ్వర రావు వుండగా. సాంస్కృతిక విభాగంలో దివాకర్, డప్పు రమేష్, కుమారి, కలైకూరి ప్రసాద్ (యువక) వుండేవారు. చంద్రశ్రీ అప్పుడు కొత్తగా పాటలు పాడుతున్నది.  

కారంచేడు ఉద్యమంలో నాకు ప్రధాన అండ బి. పరంజ్యోతి. తను ఆంధ్రా యూనివర్సిటీలో రాడికల్ విద్యార్ధిగా చురుగ్గా పనిచేశాడు. శాంతినగర్ లో వాళ్లది విద్యావంతులయిన గౌరవనీయ కుటుంబం. నేను బహిరంగంగా వున్నప్పుడు పరంజ్యోతి ఇంట్లోనే భోజనం చేసేవాడిని. వాళ్ల అమ్మ రాజమ్మగారు చాలా ఆప్యాయంగా భోజనం వడ్డించేవారు. రహాస్యంగా వుండాల్సినపుడు ఇసాక్, ప్రభాకర్ ల ఇంట్లో వుండేవాడిని. అప్పుడప్పుడు ఆరు బయట ఇసకలో ఆకాశం కింద పడుకునేవాడిని. నిఘా ఎక్కువగా వుందనుకున్నప్పుడు కోళ్ల ఫారంలో పడుకోవాల్సి వచ్చేది. వెళ్ళింది నేను ఒక్కడ్నే కాదుగా; నీతోనే నేనూ అంటు నా అస్థమా కూడా నాతో వచ్చింది. వర్షాకాలం ముసురు కమ్మినపుడు అస్తమా రెచ్చిపోతుంది. రాత్రుళ్ళు జ్వరం వచ్చేది. పోలీసుల కళ్ళు గప్పడానికి నేనూ ఇరపని అప్పుడప్పుడు తలపాగ, పంచ చుట్టి  మారువేషాల్లో మారు పేర్లతో పరిసర గ్రామాల్లో తిరిగేవాళ్ళం.  

రాజకీయ తాత్విక రంగాల్లో కారంచేడు ఉద్యమం శక్తివంతంగా ముందుకు తెచ్చిన పదం ‘దళిత’. తరువాతి కాలంలో కొందరు దీనికి సంకుచిత అర్ధం చెప్పండం మొదలెట్టారుగానీ, తొలి దశలో దళితులంటే అణగారిన కులాలు, తెగలూ, మతాలు అనే విస్తృత అర్ధమే వుండేది. శ్రామికవర్గంతో సహా అందరి అన్నిరకాల అస్థిత్వాలు ఇందులో వున్నాయి. సమాజాన్ని కేవలం ఆర్ధికవర్గం దృష్టితో చూడడం తగదనీ, ఆర్ధికవర్గేతర  అస్థిత్వాలు అనేకం వుంటాయనే అవగాహనని ఈ ఉద్యమం ముందుకు తెచ్చింది.  ఆ తరువాత తెలుగు రాజకీయాలు, సాంఘీక పరిణామాలూ కారంచెడు ఉద్యమం ముందుకు తెచ్చిన ఎజెండా చుట్టే తిరిగాయంటే అతిశయోక్తికాదు.

కారంచెడు ఉద్యమ నాయకశ్రేణి ప్రధానంగా మూడు సంఘాల సమాఖ్య.   ఇందులో మొదటిది; బాధితుల సంఘం. ఇదే కీలమైనది. దీనికి తేళ్ళ జడ్సన్ నాయకుడు. ఆయన మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు. కారంచేడు బాధితులకు సంఘీభావంగా మరో రెండు సంఘాలు ఏర్పడ్డాయి. వాటిల్లో మొదటిది కత్తి పద్మారావు నాయకత్వంలోని సంఘీభావ సంఘం, రెండవది; పీపుల్స్ వార్ నాయకత్వంలోని సంఘీభావ సంఘం. దానికి నేను నాయకుడ్ని. ఈ మూడు సంఘాల మధ్య మంచి సమన్వయం వుండేది.

 పీపుల్స్ వార్ విభాగానికి చెందిన సంఘీభావ సంఘం ఆగస్టు 15ను ‘నల్లదినంగా’ ప్రకటించి చీరాల గడియారం స్థంభం సెంటరులో పెద్ద బహిరంగ సభ నిర్వహించింది. కారంచెడు ఉద్యమంలో అదే మొట్టమొదటి బహిరంగ సభ. కత్తి పద్మారావు నాయకత్వంలోని సంఘీభావ సంఘం బొజ్జా తారకంతో కలిసి 1985 సెప్టెంబరు 1న దళిత మహాసభగా ఆవిర్భవించింది. మరోవైపు,   పీపుల్స్ వార్ విభాగానికి చెందిన సంఘీభావ సంఘమే తరువాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్య గా మారింది. దళిత మహాసభది వర్గేతర దృక్పథంకాగా, బలహీనవర్గాల సమాఖ్యది వర్గమూ, వర్గేతరము కలిసిన సంయుక్త దృక్పధం. ఆంధ్రప్రదేశ్ బలహీన వర్గాల సమాఖ్యకు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. గోసాల ఆశీర్వాదం ప్రధాన కార్యదర్శి. బి. పరంజ్యోతి కోర్ కమిటి కన్వీనర్.  

దాదాపు రెండు వందల కుటుంబాలు, ఆరు వందల మంది బాధితులకు చీరాలలో నివాసాలు ఏర్పాటు చేయడం, వంద రోజుల పాటు  వాళ్లకు భోజన వసతి కల్పించడం కారంచేడు ఉద్యమం ఎదుర్కొన్న తక్షణ  సమస్య. తొలి ప్రయత్నమే అయినా అది చాలా సమర్ధంగా సాగింది. ఉద్యమ వ్యూహం, కార్యాచరణ, న్యాయపోరాటం రెండో సమస్య. నాయకులతో సహా అందరికీ అన్నీ కొత్తే. అప్పటికి ఎస్టీ, ఎస్సీ లపై అత్యాచారాల నిరోధక చట్టం లేదు. మేము అనుసరించడానికి మా ముందు మరో ఉద్యమ నమూనా లేదు. మేమే తరువాతి ఉద్యమాలకు నమూనా అయ్యాం. సినిమా భాషలో చెప్పాలంటే “మేము ట్రెండ్ ను ఫాలో కాలేదు; మేమే ట్రెండ్ ను సృష్టించాం”.  

ఉద్యమాలకు సంబంధించి ఒక నిర్మాణ సూత్రం నియమం ఏమంటే ఒకరు అంకిత భావంతో పోరాటానికి సిధ్ధం అయి రోడ్డు మీద నిలబడినపుడు జనం, డబ్బు వాటికవే వచ్చి చేరుతాయి. ఒకరి పోరాట పటిమ ఇతరుల్లో పోరాట స్వభావాన్నీ, దానగుణాన్ని మేల్కొలుపుతుంది. మనం ఎన్నడూ ఊహించని వ్యక్తులు సహితం వచ్చి స్వచ్చందంగా సహాయ సహకారాలు అందిస్తారు. కారంచెడులో అదే జరిగింది. అనేక మంది తమకు చేతనయిన సహాయం చేశారు.

దాడి జరిగిన కొత్తలో రక్షణత్మకంగా వ్యవహరించి, దాదాపు ముఖం చాటేసిన ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమం ఉదృతం కావడంతో నిర్బంధాన్ని తీవ్రం చేసింది. అప్పటి వరకు కనిపించని పోలీసులు హఠాత్తుగా బూట్ల నాడాలు ముడివేసి, నడుముకు బెల్టులు బిగించి, తుపాకి గొట్టాలు శుభ్రం చేసుకున్నారు. నిర్బంధం లేనప్పుడు ఉద్యమాన్ని నడపడం వేరు; నిర్బంధ కాలంలో ఉద్యమాన్ని నడపడం వేరు. ఆ నైపుణ్యం ఆనాడు నక్సలైట్ల దగ్గరే వుంది.   

సెప్టెంబరు 10న నిర్వహించిన రాష్ట్ర బంద్ ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ రోజు ప్రకాశం, గుంటూరు జిల్లాలో అనేక చోట్ల ఆర్టీసీ బస్సుల్ని నిరసనకారులు తగలబెట్టారు.  బాపట్ల తదితర రైల్వేస్టేషన్లలో  సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. మదరాసు-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నిలిపేశారు. ఆరోజు రాత్రి చీకటిపడ్డాక  చీరాలలో రైల్వే పట్టాల మీద ధర్ణా చేస్తున్న నిరసనకారులు వంద మందిని అరెస్టు చేయడంతో వాతావరణం బాగా వేడెక్కింది. రైల్వే పట్టాల మీద అరెస్టు చేసినవారిలో సలగల రాజశేఖర్ వున్నారు.

ఆ వరుసలో కత్తి పద్మారావును, నన్నూ అరెస్టు చేస్తారనే సంకేతాలొచ్చాయి. ఆరోజు నేను మారు వేషంలో వెళ్ళి  రైల్వే పట్టాల మీద  నిరసన ప్రదర్శన చేస్తున్న వారిని పరామర్శించి వచ్చాను. అరెస్టును తప్పించుకోవడానికి చీరాల వదిలి వెళ్ళిపోవాలని కత్తి పద్మారావు నిర్ణయించుకున్నారు. ఆ మరునాడు అరెస్టులకు వ్యతిరేకంగా తలపెట్టిన నిరసన ప్రదర్శన మధ్యలో వారు  నిర్వహణ బాధ్యతను నాకు అప్పచెప్పి గుంటూరు కన్నమ రాజా దగ్గరికి  వెళ్ళిపోయారు.

ప్రధాన బాధ్యతల్ని స్వీకరించిన మరుక్షణం నేను ఊరేగింపును చీరాల పోలీస్ స్టేషన్ వైపుకు నడిపాను. అరెస్టు చేసిన వాళ్లను విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్ణా చేశాము. పొలీసులు లాఠీచార్జి చేశారు. బాధితులు, సానుభూతిపరులు చాలామంది గాయపడ్డారు. జనం కూడా పోలీసుల మీద తిరగబడ్డారు.  తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళల్ని బల్లరిక్షాలో వేసుకుని నేను చీరాల ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాను.

ప్రతి ఉద్యమంలోనూ ఇలాంటి భీభత్స సంఘటనలు వుంటాయి. వీటిల్లో ఒక అనిర్వచనీయమైన గొప్ప ఉద్వేగమూ వుంటుంది. నాకు ఆ గాయపడ్డవారూ తెలీదు. రిక్షాను లాక్కొని వచ్చినవాడూ తెలీదు. రిక్షాను తొక్కినవాడూ తెలీదు. అసలు ఆ పట్టణంలో  ప్రభుత్వాసుపత్రికి వెళ్ళే దారి కూడా తెలీదు.  అందరూ నా రక్తసంబంధీకుల్లా ప్రవర్తించారు. ఏదో మంత్రం వేసినట్టు నాకు తెలీకుండానే నేను చేయాల్సిన పనులన్నీ వరుసగా జరిగిపోయాయి.

  హాస్పిటల్ లోనూ అంతే ఒక డాక్టర్ పరుగున  వచ్చి “వీళ్లకు నేను ట్రీట్ మెంట్ చేస్తానుగానీ. ముందు మీరు ఇక్కడి నుండి పారిపొండి. యస్పీ, కలెక్టర్ ఇద్దరూ వస్తున్నారు” అన్నారు. నా చేతి గాయానికి చిన్న కట్టుకట్టిన నర్సు నా భజం పట్టుకు లాక్కొని పోయి ఆ చీకట్లో ఒక గోడను చూపెట్టి “అది ఎక్కి దూకేయండి. అటు ఇసకే వుంది. ఆ మామిడి తోటలో నుండి లైట్లు వున్న వైపుకు పోతే బాపట్ల రోడ్డు ఎక్కుతారు అంది” గోడ దూకి రోడ్డెక్కిన తరువాత నాకో జ్ఞానోదయం అయింది. మనం గమనించంగానీ, ఉద్యమాలకు తోడ్పడడానికి పైకి కనిపించని ఒక బలమైన నెట్ వర్క్ ఈ సమాజంలో ఎప్పుడూ వుంటుంది. మనకు ఉద్యమించే మనసే లేనపుడూ అది లేనట్లుగా వుంటుంది. మనం ఉద్యమించడానికి సిధ్ధమైనపుడు అది మన కళ్లముందు ప్రత్యక్షం అవుతుంది. అంతేకాదు; మనం ఊహించిన దానికన్నా గొప్పగా చకచకా పనులు చేసేస్తుంది.

(ఇంకావుంది)

1 comment:

  1. భారతదేశంలో ఉన్న అస్తిత్వాలో 6 పేరాలో మిరు ప్రస్తావించిన అస్తిత్వం కూడా ముఖ్యమైనది.ఇక చివరి పేరాలో చేయాలి అని ఉండాలేగానీ చేసేవాడికి సమాజం ఎప్పుడూ తన సహకారం తప్పకుండా ఉంటుందని అని రాశారు చూడండి అది చాలా బాగుంది ఈ వాక్యం కూడా ట్రెండ్ సెట్టింగ్ వాక్యమే

    ReplyDelete