కారంచేడు
– గతం వర్తమానం భవిష్యత్తు.
(పార్ట్
-3)
నిందితులకు బెయిలు
సంపాదించడానికి ఆ రాత్రి, మరునాడు ఉదయం అనేక మంది లాయర్ల ఇంటికి తిరిగాము. కారంచేడు పెత్తందార్లకు భయపడి ఎవ్వరూ మా కేసును స్వీకరించడానికి
సిధ్ధంగాలేరు. అదీగాక, వంద మందికి బెయిల్ తేవడానికి ధరావత్తు కోసం చాలా డబ్బు కావాలి.
లాయర్లు మనల్ని పట్టించుకోకపోతే మనమూ న్యాయస్థానాల్ని
పట్టించుకోవద్దు అని ఒక తార్కిక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా న్యాయమూర్తి
బెంచి మీద వుండగానే నినాదాలు చేసుకుంటూ కోర్టు బోనులో వున్నవాళ్లందరినీ బయటికి తీసుకుని
వచ్చేశాను. ఇది సెప్టెంబరు 12 ఉదయం సన్నివేశం.
పోలీసులు అరెస్టు
చేసిన 50 మందిని బెయిల్ లేకుండానే బయటికి తెచ్చివేయడం, జడ్జీ ముందే కోర్టుల్ని బహిష్కరించడం
చీరాలలో పెద్ద సంచలనంగా మారిపోయింది. రెండు
రోజులు ప్రశాంతంగా గడిచాయి. కోర్టుల మీద విజయం సాధించాం అనుకున్నాం. ఆ దర్పంలో 13వ
తేదీ రాత్రి కొంచెం అలసత్వంతో, ఏమీ జరగదనే ధీమాతో నా కోళ్ల గూటికి వెళ్ళకుండా పరంజ్యోతి
వాళ్ల ఇంట్లో పడుకున్నాను. ఆ రాత్రే నాతోపాటు
పరంజ్యోతిని అరెస్టు చేశారు. ఆరోజే ఊరి నుండి వచ్చిన పరంజ్యోతి వాళ్ల అన్నయ్యనూ
అరెస్టు చేశారు. పాపం ఆయనకు ఉద్యమంతో సంబంధంలేదు.
ఆ రాత్రి ఊర్లో అక్కడక్కడ అరెస్టు చేసిన ఇతరులతో కలిపి మొత్తం ఎనిమిది మంది
అయ్యాము. మమ్మల్ని పోలీసు జీపుల్లో చాలా చోట్ల తిప్పారు. ఎన్ కౌంటర్ చేసేస్తారేమో అన్నంత
భయోత్పాతం సృష్టించారు.
ఆ రాత్రంతా మమ్మల్ని
విడివిడిగా వేరువేరు గదుల్లోవుంచి ఇంటరాగేషన్ చేశారు. పీపుల్స్ వార్ పంపిన ప్రతినిధి
నేనే అని పోలీసు అధికారులకు ముందే సమాచారం వుంది. నాకు ఆదేశాలిచ్చే మరో నాయకుడు ఒకడు
చీరాల పరిసరాల్లోనే వుండి వుంటాడని వాళ్లకు గట్టి నమ్మకం. దానితో నన్ను రెండు మూడుసార్లు విడిగా కూర్చోబెట్టి ప్రశ్నించారు.
ఒక్కోసారి పోలీసు
ఇంటరాగేషన్ కూడ చిత్రంగా వుంటుంది. డీయస్పీ (నరసింహారావు అని గుర్తు) దగ్గర మార్కులు
కొట్టేయాలనేమో సిఐ (ఏదో జే. రెడ్డి) నన్ను బూతులు తిట్టాడు. ఆ డీయస్పీ మర్యాదస్తుడు.
సిఐను వారించాడు. “ప్రశ్నలు అడుగు. కానీ తిట్టవద్దు.
వాళ్ళూ చదువుకున్నవాళ్ళే” అన్నాడు. డీయస్పీ ఆ మాట అనగానే సిఐ మరీ తగ్గిపోయాడు. అలా
ఆరాత్రి గడిచింది గానీ మా భవిష్యత్తు మరునాడు ఉదయం జిల్లా ఎస్పీ తేలుస్తాడు అని తెలిసింది.
అంతవరకు ఎన్ కౌంటర్ ఆప్షన్ వున్నట్టే!
ఉదయం టాయ్ లెట్ దగ్గర
ఒక విచిత్రం జరిగింది. నేను లోపల వుండగా నన్ను తీసుకుని వచ్చిన కానిస్టేబుళ్ళలో ఒకడు
“నీకూ నాకూ తేడాలేదన్నో ఓ పోలీసన్నా. పోరుతప్ప దారిలేదన్నో ఓ పోలీసన్న” పాట కూనీరాగం
తీస్తున్నాడు. అతను మన మీద సానుకూల వైఖరితో వున్నాడనిపించింది. బయటికి రాగానే అతని
దగ్గరే చిన్న కాగితం తీసుకుని విజయవాడ ఆంధ్రప్రభలో
పనిచేస్తున్న మా విరసం సహచరుడు బీ. జగన్ ఫోన్
నెంబరు రాసిచ్చాను. “నాకో సహాయం చేయండి. నన్ను ఈ పోలీస్ స్టేషన్లో వుంచారని ఈ ఫోన్ నెంబరుకు ఎస్టీడి చేసి చెప్పండి.
మీకివ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు” అని అభ్యర్ధించాను.
ఆరోజుల్లో సెల్ ఫోన్లు
లేవు. ఎస్టీడీ చేయాలంటే సయమం డబ్బూ రెండూ వెచ్చించాలి. అయినా ఆ పని ఆ కానిస్టేబుళ్ళు
చేసిపెట్టారు. ఎస్పీ చీరాల చేరక ముందే, 12
గంటల ఆకాశవాణి విజయవాడ వార్తల్లో నన్ను అరెస్టు చేసినట్టు వచ్చేసింది. పైగా నా అరెస్టును
నాగార్జున యూనివర్శిటీ నుండి అమంచర్ల సుబ్రహ్మణ్యం ఖండించినట్టూ వచ్చింది. రెండు గంటల
వార్తల్లో అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ విద్యార్ధులు కొందరు నా విడుదల కోరుతూ నిరసన ప్రదర్శన చేశారని, అనంతపురం-బెంగుళూరు రోడ్డు
మీద రాస్తారోకో చేశారని వచ్చింది. అలా చేయమని వారికి అప్పటి తెలుగు విభాగం అధిపతి కొలకలూరి
ఇనాక్ చెప్పారని, హైకోర్టులో కొందరు లాయర్లు నాకోసం హెబియస్ కార్పొస్ పిటీషన్ వేశారనీ, ఢిల్లీలో కూడా కదిలిక వచ్చిందని, కొందరు సుప్రీంకోర్టును
అప్రోచ్ అయ్యారని నాకు తరువాతి కాలంలో తెలిసింది.
ఏమైనా రాత్రి అయ్యేసరికి పోలీస్ స్టేషన్ లో మా టెన్షన్ తగ్గి పోలీసుల టెన్షన్ పెరిగింది.
అప్పుడు కేంద్రంలో
కాంగ్రెస్ అధికారంలో వుంది. రాజీవ్ గాంధి ప్రధానమంత్రి. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో
వుంది. సలగల రాజశేఖర్ సెప్టెంబరు మొదటి వారంలో కొందరు బాధితుల్ని రాజీవ్ గాంధి దగ్గరికి
తీసుకుని వెళ్ళారు. అలా ప్రధానికి చీరాల పరిణామాలు కొంత తెలుసు. కేంద్రంలో రాష్ట్రంలో
భిన్నమైన ప్రభుత్వాలు వుండడం కూడ కారంచేడు ఉద్యమానికి ఒక సానుకూల అంశం.
మరునాడు చీకటి పడ్డాక ఎస్పీ చీరాల పోలీసు స్టేషన్
కు వచ్చారు. “వీళ్ళ నెట్ వర్క్ ఢిల్లీ వరకు
వుంది సార్ !” అని డీయస్పీ ఎస్పీకీ వివరించారు. ఆ తరువాత ఎస్పీ ఆదేశాల మేరకు మమ్మల్ని
అర్ధరాత్రి మెజెస్ట్రేట్ ఇంట్లో ప్రవేశపెట్టారు. ఆ రాత్రికి మళ్ళీ చీరాల పోలీసు స్టేషన్
లో వుంచారు. మరునాడు ఉదయం ఆంధ్రప్రభ మొదటి పేజీలో “డానీ ఎక్కడా?” అని పెద్ద వార్తను
ప్రచురించింది.
మా కేసును వాదించడానికి
గుంటూరు నుండి వై కోటేశ్వర రావు (వైకే) తదితర ప్రముఖ లాయర్లు చీరాల చేరుకున్నారు. ఈలోపులే
చీరాల జడ్జి మాకు ఒంగోలు జిల్లా జైలులో పదిహేను రోజుల రిమాండ్ వేశారు. మేము జిల్లా
జైలుకు చేరే లోపులో వైకే బృందం ఒంగోలు చేరుకుని జిల్లా జడ్జీ దగ్గర బెయిలు సాధించాలనేది
మా ఆలోచన. అందుకు వీలుగా ఓ రెండు గంటలు ఆలస్యంగా ఒంగోలు చేరాలని భావించాం. అప్పటికే
ఆ పోలీసు వ్యాన్ డ్రైవర్ కూ, ఎస్కార్ట్ పోలీసులకు మా మీద అభిమానం పొంగిపొర్లుతోంది.
వాళ్ళు మాకు చాలా సహకరించారు. దారిలో రెండు మూడు చోట్ల ఆగి టీలు తాగి ముందుగా అనుకున్నట్టు చీకటి పడ్డాక ఒంగోలు చేరాం.
మేము ఒంగోలు జైలుకు
చేరే సమయానికి అక్కడ ఖైదీలకు రాత్రి భోజనాలు
వడ్డిస్తున్నారు. ఆ ఖైదీల్లో కారంచేడు నిందితులూ వున్నారు. వాళ్ళూ మేమూ ఎదురుపడితే
కొత్త ఘర్షణ జరుగుతుందని జైలు అధికారులు ఆందోళన చెందారు. మమ్మల్ని కాస్సేపు బయట ఆగమన్నారు.
పక్కన మన ప్రత్యర్ధులు
వున్నారంటే వాళ్లను చూడాలనే ఆసక్తి సహజంగానే కలుగుతుంది. వాళ్ళేమీ పెద్ద భూస్వాములుగా
దర్పంతో కనిపించలేదు. చిన్నా చితకా రైతులే అయ్యుంటారు అనిపించింది. ఒక విచిత్రం ఏమిటంటే
పెద్ద భూస్వాములకు కులాభిమానంవున్నా దాన్ని వాళ్ళు బాహాటంగా ప్రదర్శించరు. వాళ్ళ సంపదే
వాళ్ళ అధికారాన్ని ప్రదర్శిస్తూ వుంటుంది. చిన్న సన్నకారు రైతులకు ప్రదర్శించడానికి
సంపద వుండదు. వాళ్ళే వీలున్నప్పుడు కులాభిమానాన్నేకాక కులాహంకారాన్ని కూడా ప్రదర్శిస్తూవుంటారు.
వాళ్ళు భోజనాలు పూర్తిచేసి
గదుల్లోనికి వెళ్ళేలోపే మాకు బెయిళ్ళు వచ్చేశాయి. అలా జైలు గది లోనికి అడుగుపెట్టకుండానే
బయటికి వచ్చేశాం. అప్పటి వరకు మా మీద పెట్టిన
కేసు ఏమిటో కూడా మాకు తెలీదు. “నేరం చేశారా?” అని జడ్జీ అడిగారు. “నేరం చేయలేదు” అని
మేము సమాధానం చెప్పాం. అంతే. ఆర్టీసి బస్సుల్ని తగలెట్టిందీ, రైల్వే స్టేషన్లను ధ్వంసం చేసిందీ మేమే అని మా మీద కేసి పెట్టారట.
ఆ కేసులో నేను ఏ-ఒన్ అనగా మొదటి నిందితుడ్ని.
మాకు కోర్టువారు ఇచ్చింది
షరతులతో కూడిన బెయిలు. దానిప్రకారం మేము చీరాల దాటి బయటికి వెళ్ల కూడదు. ప్రతిరోజూ సాయంత్రం చీరాల పోలీసు స్టేషన్ లో సంతకం
పెట్టాలి. అదీ గాక పగటి పూట నా కదలికల్ని గమనించడానికి విజయనగర్ శిబిరం వద్ద ఒక పోలీసును ప్రత్యేకంగా నియమించారు.
అతనూ నేను మొదట్లో ప్రత్యర్ధులుగా వుండేవాళ్లం. ఇక రోజూ ఇద్దరమే కలిసి బతకాలి కనుక
నాలుగు రోజుల తరువాత స్నేహితులమై పోయాము.
ఈలోపు, ప్రభుత్వం
ఒక ద్విముఖ వ్యూహాన్ని రచించింది. బాధితుల కోరికల మేరకు పక్కా ఇళ్ళ నిర్మాణం, వ్యవసాయ
భూమి పంపిణి, ఉపాధికల్పన కోసం ఒక బహుళ ఉత్పత్తుల ఫ్యాక్టరీ, విద్యార్హతలు వున్నవారికి
ప్రభుత్వ ఉద్యోగం వంటి భారీ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. ఈ ప్యాకేజీ రూపకల్పనలో స్టేట్ సెక్రటేరియట్ లో సంక్షేమశాఖ
ముఖ్యకార్యదర్శి శంకరన్ కీలకంగా వ్యవహరించారు. వీటి అమలు బాధ్యతను ఇప్పటి లోక్ సత్తా
అగ్రనేత, అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎన్. జయప్రకాశ్ నారాయణకు అప్పచెప్పారు. ఉద్యమ
నాయకులను ఉద్యమానికి దూరం చేయడం కూడ ఈ ప్యాకేజీలో కనిపించని భాగం.
అక్టోబరు 6 న (5న?)
చీరాల డీయస్పీ నన్ను పిలిచి నువ్వు చీరాల మళ్ళీ రానని రాసిస్తే, ఈ కేసులో అందరి మీదా
బెయిల్ కండీషన్ తీసేస్తాను అన్నారు. ఆ రోజు అప్పటికి మరో రెండు గంటల్లో విజయవాడలో దళిత
మహాసభ బహిరంగ సభ జరగబోతోంది. 25 రోజులుగా గుంటూరులో అజ్ఞాతంలో వుంటున్న కత్తి పద్మారావు
ఆ సభకు వస్తున్నారు. అక్కడ వారిని అరెస్టు
చేసి ఉద్యమానికి ముగింపు పలకాలనేది ప్రభుత్వ ఆలోచన అని డిఎస్పీ వివరించారు.
పునరావాస (ఆర్ ఆర్) ప్యాకేజిమి రూపొందిస్తున్నట్టు
ప్రకటన వచ్చేసింది కనుక నేను చీరాల వచ్చిన పని పూర్తి అయిపోయింది. ఇక అవతారం చాలించాల్సిన
సమయం అది. అప్పుడు నా తోటి నిందితుల అభిప్రాయం కూడ అలాగే వుంది. ప్రభుత్వ ఉద్యోగాలు
చేస్తున్న పరంజ్యోతి, వాళ్ళ అన్నయ్యలు ఈ కేసు మూలంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో
చీరాల వదిలేస్తానని పోలీసులకు రాసిచ్చాను. ఆ రాత్రే విజయవాడ తిరుగు ప్రయాణం అయ్యాను.
కారంచేడు దాడికి సూత్రధారిగా
ఆరోపణలు వున్న దగ్గుబాటి చెంచురామయ్యను 1989 ఏప్రిల్ నెలలో ఉగాది రోజున పీపుల్స్ వార్
దళం చంపేసింది. నా అంచనా ప్రకారం చెంచురామయ్య నేరుగా కారంచేడు దాడిలో పాల్గొని వుండకపోవచ్చు,
అసలు అతను దాడిని ప్రోత్సహించి వుండకపోనూవచ్చు. గానీ, అతను పోలీసు కేసుల నుండి తమను
తప్పించగలడనే ధీమాతోనే కారంచేడులోని ఆయన స్వీయసామాజికవర్గం దళితుల మీద తెగబడి దాడికి
పాల్పడింది అనడం ఏమాత్రం సత్యదూరంకాదు. ఈ దాడికి legal impunity factor గా ఆయన వున్నాడు.
వాళ్లకు ఆయన సింబాలిక్ నాయకుడు అయినట్టే పీపుల్స్
వార్ కూడా ఆయన్ని సింబాలిక్ గానే చంపింది అంటారు.
సెప్టెంబరు 10న నేను
బస్ స్టాండుకే వెళ్ళలేదు. మా మీద బస్సుల్ని తగలబెట్టినట్టు కేసులు పెట్టారు. ఈ కేసుల్లో
ప్రత్యక్ష సాక్షులయిన ఆర్టీసి బస్సు డ్రైవర్లు “నిరసనకారులు పారిపోతుండగా వెనుక నుండి
చూడడంవల్ల వాళ్ళ ముఖాలను గుర్తుపట్టలేం” అని కోర్టులో సాక్ష్యం చెప్పారు. “ప్రాసిక్యూషన్ వారు నేరాన్ని రుజువు చేయలేకపోవడంవల్ల”
మా కేసును 1989 జులై నెలలో కోర్టు కొట్టి వేసింది.
ఇంతవరకే చెప్పివదిలేస్తే
ఉద్యమం గురించి సంపూర్ణంగా చెప్పినట్టుకాదు. ప్రతి ఉద్యమం వర్తమానం మీదనేకాదు భవిష్యత్తు,
గతాల మీద కూడా ప్రభావాన్ని వేస్తుంది. కారంచేడు తరువాత అంబేడ్కర్, జ్యోతీబా ఫూలే ఆలోచనలకూ
ఆంధ్రా ప్రాంతంలో గొప్ప ఆదరణ మొదలయింది. మార్క్స్, అంబేడ్కర్, జ్యోతీబా ఫూలేల ఆలోచనల మధ్య ఒక
తాత్విక ఐక్యతను సాధించే ప్రయత్నాలు కూడ ఆరంభమయ్యాయి. అంబేడ్కరిస్టులు ‘దేశీయ మార్క్సిజం’ అనే భావాల్ని
ముందుకు తెచ్చారు. మార్క్సిస్టులు అంబేడ్కర్ ను అధ్యయనం చేయడం మొదలెట్టారు.
ఉద్యమాల్లో పాల్గొన్నవాళ్ళకు
తాత్కాలికంగా కొన్ని భౌతిక, ఆర్ధిక ఇబ్బందులు కలుగుతుంటాయి. నాకూ కలిగాయి. ఓ నాలుగు
నెలలు నా భార్యా పిల్లలు తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులు పడ్డారు. వాటి నుండి బయట పడడానికి
మాకు ఏడాదికి పైగా పట్టింది. అప్పటి నైతిక
విలువల ప్రకారం కమ్యూనిస్టులు భూములు కొనకూడదు అనుకునేవాళ్ళం. నాకు సంతానం కలుగుతున్నదని
తెలిసి వాళ్ళ కోసం భూమి కొనాలనుకున్నాను. 1984 మే నెలలో ప్రకాశం జిల్లా ఒంగోలు తాలుకా
చేజర్ల గ్రామంలో 5 ఎకరాల డికె పట్టా భూమి (సర్వే నెం. 169-1/333-5, 169-1/397-5) సంపాదించాను.
ఆ విషయాన్ని నా భార్యకు తప్ప. బహిరంగంగా ఎవరికీ చెప్పలేదు. అనుకోకుండ ప్రకాశం జిల్లాకే
ఉద్యమ నాయకునిగా వెళ్ళాల్సివచ్చింది. అక్కడ నాకు ఒక రకం ‘జానపద కథానాయకుని’ ఇమేజ్ వచ్చేసింది. అదొక సామాజిక పెట్టుబడి (సోషల్
కేపిటల్). దాన్ని నిలబెట్టుకోవడానికి చేజర్ల
భూమిని వదిలేశాను.
ఇప్పుడు చేజర్ల భూమి
ధర చాలా ఎక్కువ వుండవచ్చుగానీ ఈ మాట ఇప్పుడు ఎందుకు చెపుతున్నానంటే ఉద్యమాలకు నాయకత్వం
వహించే వారికి కొన్ని నైతిక విలువలుండాలి. అవసరం అయినపుడు కొంత త్యాగానికి సిధ్ధం కావాలి.
నష్టాన్ని కూడ భరించాలి. నిజానికి అది నష్టం
కూడ కాదు; అదొక సామాజిక మదుపు. ఈ భూమ్మీద ఏ బీమా కంపెనీ ఇవ్వనంత డెవిడెండ్ ను సమిష్ఠిగా
ఉద్యమాలు ఇస్తాయి. కాకపోతే వాటిని అందుకోవడానికి కొంచెం సహనం కావాలి. తరువాతి కాలంలో నేను కష్టాల్లో
వున్న సందర్భాల్లో కొందరు నన్ను గొప్పగా ఆదుకున్నారు. నా మీద వారికి అభిమానం కలగడానికి
ఒకే ఒక కారణం ఉద్యమాలలో నేను పోషించిన పాత్రే.
కారంచేడు ఉద్యమంలో
పాల్గొనడంవల్ల నేను నష్టపోయాననిగానీ, త్యాగాలు చేశాననిగానీ నేను ఎన్నడూ అనుకోలేదు. కారంచేడు, తదితర ఉద్యమాల్లో పాల్గొనడానికి నాకో
ఉత్తేజం, ప్రయోజనం వున్నాయి. అప్పటికి కొన్ని నెలల ముందు సాగిన ఢిల్లీ శిక్కుల ఊచకోత
నన్ను బాగా చలింపచేసింది. 1984 చివర్లో ఢిల్లీ వెళ్ళానుగానీ అక్కడ పనిచేసే సావకాశం
నాకు అప్పుడు లేదు. కారంచేడు వుద్యమంలో దొరికిన అవకాశాన్ని నేను వదులుకోదలచలేదు. నా
సామాజికవర్గం కూడ అణగారినవర్గం. దానికి కష్టం వచ్చినపుడు ఇతర అణగారినవర్గాలు సంఘీభావాన్ని
తెలుపుతాయనే నమ్మకం నాకుండింది. అది ఇప్పుడూ వుంది.
మార్క్సిజం
అణగారినవర్గాలకు ఒక చారిత్రాత్మక మేలు చేసింది.
అప్పటి వరకు ఎన్నడూ కలవని సమూహాలని అది వర్గ ప్రాతిపదిక మీద ఒక వేదిక మీదకు
తీసుకుని వచ్చింది. శ్రామికరాజ్యం అనే ‘సార్వజనీన కల’ను వాళ్ల ముందు వుంచి గొప్ప బైండింగ్
వైర్ గా పనిచేసింది. అయితే కులం, మతం తదితర
అస్తిత్వ సమస్యలను కమ్యూనిస్టు పార్టీల నాయకులు స్థూల స్థాయిలో మాత్రమే పట్టించుకుని సూక్ష్మస్థాయికి
వెళ్ళలేకపోయారు. ఇది మితవాద దోషం.
మరోవైపు,
అస్తిత్వవాదం సహజంగానే అస్తిత్వ సమస్యల్ని
సూక్ష్మస్థాయి వరకు అత్యంత లోతుగా అధ్యనం చేసి పరిష్కరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో
అది ఉద్దేశ్యపూర్వకంగానో, అనాలోచితంగానో ప్రతి అణగారినవర్గాన్ని మరో అణగారినవర్గానికి
ప్రత్యర్ధిగా నిలబెట్టింది. ఇది అతివాద దోషం. దళితుల్లోని మాలమాదిగ సామాజికవర్గాల మధ్య
చెలరేగిన వివాదం దీనికి ఒక ఉదాహరణ. అట్లే, హిందూ శ్రామిక కులాలు, ముస్లిం శ్రామిక కులాల
మధ్య ‘వెనుకబడిన తరగతి’ గుర్తింపు కోసం సాగుతున్న
పెనుగులాట దీనికి మరో ఉదాహరణ.
ఇప్పుడు పరిస్థితి
ఏ దశకు చేరుకున్నదంటే అణగారిన వర్గాలు తమను అణిచివేస్తున్న వర్గాలనుకన్నా తమ సాటి అణగారినవర్గాలనే
ఎక్కువ శతృవులుగా భావిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో అవి శతృ సమూహాల మీద చేయాల్సిన
పోరాటాన్ని మానేసి, సంఘీభావం తెలపాల్సిన మిత్ర సమూహాల మీద పోరాటం చేస్తున్నాయి. గుజరాత్
నరమేధం దీనికి ఒక ఉదాహరణ. మరలా అణగారినవర్గాలను ఐక్యం చేసే ఒక సార్వజనీన ఆదర్శం, లక్ష్యం, అవసరం ఏర్పడే వరకు ఈ స్థితి తప్పకపోవచ్చు.
2004లో అప్పటి వైయస్
రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లను శాంతి చర్చలకు ఆహ్వానించినపుడు అణగారినవర్గాల
ఏకీకరణ సాగుతున్నదనే సూచనలు కొన్ని కనిపించాయి. వామపక్షాలతో విభేదించి బయటికి వెళ్ళిపోయిన
అనేక అస్తిత్వవాద సమూహాలు తమ సమస్యల పరిష్కారానికి సహకారాన్ని అందించాల్సిందిగా మార్క్సిస్టు-లెనినిస్టులను
కోరడమూ కనిపించింది. అలాంటి ఐక్యత కోసం కృషి జరగాలి.
ఆలీశమ్మ
– జార్జి ఫ్లాయిడ్
కారంచెడు దాడి కేసులో
ప్రధాన సాక్షి దుడ్డు ఆలీసమ్మ. ఆమె కళ్ళ ముందే కొడుకు దుడ్డు వందనాన్ని చంపేశారు. డాడి
జరిగిన మరునాడు కేసు నమోదు చేసే (FIR) సమయంలో పోలీసుల ముందు ఆమె వివరంగా వాగ్మూలం ఇచ్చింది. అది ఎలాగూ పోలీసు / కోర్టు / ప్రభుత్వ రికార్డుల్లో
వుంటుంది. ప్రాంతీయ, జాతీయ మీడియా ముందు ఆమె మాట్లాడింది. పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ
కమిటీ ముందు మాట్లాడింది. ప్రజాకోర్టులోనూ ఆమెతో మాట్లాడించాలి అనుకున్నాము. సమాజాన్ని
సాక్షిగా మార్చాలి. ప్రజలను కదిలించాలి. పైగా
తమకు మద్దతుగా చాలామంది వున్నారనే నమ్మకాన్నీ బాధితులకు కల్పిస్తే వాళ్లు నైరాశ్యం
నిస్పృహల నుండి బయటపడతారు. దీనికి 1985 ఆగస్టు 15 నాటి బహిరంగ సభ సరైన వేదిక అనుకున్నాము.
నేను దుడ్డు ఆలీసమ్మను
సభకు తీసుకుని వచ్చి స్వయంగా వేదిక మీదికి తీసుకుని వెళ్ళాను. “వీళ్లంతా నీ మనుషులు.
ధైర్యంగా నీ బాధ చెప్పుకో”మన్నాను. ఆమె అరగంట మాట్లాడింది. ఆమె మాట్లాడుతున్నంత సేపూ
పక్కనే నిలబడ్డాను. ఆమె మధ్యమధ్యలో భావోద్వేగంతో వణికిపోతూవుంది. నేను ధైర్యం చెపుతూ
ఆమె చేతుల్ని గట్టిగా అదిమి పట్టుకున్నాను. ఆరోజు సభలో నా ఉపన్యాసంకన్నా అలీసమ్మ చెప్పిన
కథనం పెద్ద సంచలనంగా మారింది.
1985
జులై 17న జరిగిన దాడి ఒక క్షణికావేశం (Abrupt) మాత్రమే అని ఇప్పుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు
వంటివాళ్ళు తేలిగ్గా కొట్టిపడేస్తున్నారు. ఇదొక పచ్చి అబధ్ధం. 1985 అక్టోబరు నెలలో
ఆర్ ఆర్ ప్యాకేజీ ప్రకటనతో ఉద్యమం ఆగిపోయింది. ఉద్యమ
నాయకులు ఇంటిదారి పట్టారు. చీరాలలో కాలనీ నిర్మాణం కూడ మొదలయింది. ఓ ఏడాది తరువాత అది
పూర్తి అయింది. గృహప్రవేశాలు కూడ జరిగిపోయాయి. ప్రశాంత
వాతావరణం నెలకొంది. అందరూ సాధారణ జీవిత కార్యకలాపాల్లో మునిగి పోయారు.
ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ప్రధాన సాక్షి దుడ్డు ఆలీశమ్మ హత్య జరిగింది. 1987 ఆగస్టు నెలలో
ఆలీసమ్మను చీరాలలోని ఆమె కాలనీ ఇంట్లోనే హత్య చేశారు. సాక్ ష్యాన్ని ఒక పథకం ప్రకారం చంపడానికి హంతకులు
కారంచేడు నుండి చీరాల వచ్చి విజయనగర్ కాలనీలో ప్రవేశించి జరిపిన హత్య ఇది. ఇదొక విధంగా అమెరికా లోని జార్జ్ ఫ్లాయిడ్ కేసు వంటిది.
అర్ధరాత్రి ఇంట్లోకి దూరి ఊపిరి ఆడకుండ తలగడతో అదిమిపట్టి వంటి మీద ఒక్క కత్తిగాటు
కూడా లేకుండ ఆ ముసలామెను చంపేశారు. సాక్షులకు
భద్రత ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేదు. అప్పుడూ ఎన్టీఆర్ ప్రభుత్వమే వుంది.
ఆలీశమ్మ హత్య కూడ క్షణీకావేశంలో abruptగా జరిగిన
హత్యే అంటారా? దగ్గుబాటి వేంకటేశ్వరరావు?
ప్రత్యర్ధులు సాక్షుల్ని చంపడానికి తెగించడంతో పీపుల్స్
వార్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఆలీశమ్మ హత్య తరువాతే దగ్గుబాటి చెంచురామయ్యను హతం
చేయాలని ఆ పార్టి నిర్ణయించిందని అంటారు. 1989లో పీపుల్స్ వార్ దళం దగ్గుబాటి చెంచురామయ్యను
హత్య చేసినపుడు కత్తి పద్మారావు కూడా హర్షం వ్యక్తం చేశారు.
కారంచేడు కేసు గుంటూరు అడిషనల్ సెషన్స్ జడ్జి
కోర్టులో 1994 వరకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1998 వరకు, ఆ తరువాత సుప్రీంకోర్టులో
2008 వరకు మొత్తం 23 ఏళ్ళు సాగింది. చివరికి ఒకరికి జీవితకాలం, 29 మందికి మూడేళ్ళ కాలం
చొప్పున సుప్రీం కోర్టు శిక్షలు ఖరారు చేసింది.
విజయాలు – గుణపాఠాలు
దాదాపు నిందితులందరూ అరెస్టు కావడం, కోరుకున్న
విధంగా పునరావాస పథకాన్ని పొందడం కారంచేడు ఉద్యమం సాధించిన తక్షణ విజయాలు. జాతీయ స్థాయిలో
ఎస్టీ ఎస్సీలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని
సాధించడం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే విజయం.
సాధారణంగా ప్రతి ఉద్యమంలోనూ ఉద్యమకారులు,
మొదటి దశలో, నిందితుల్ని అరెస్టు చేయాలనీ,
కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరుతుంటారు. కారంచేడు ఉద్యమంలో అయితే దోషుల్ని చీరాల
గడియారం స్థంభం దగ్గర బహిరంగంగా ఉరి తీయాలి అని నినదించేవారు.
నిజానికి నిందితులు అరెస్టు అయిన తరువాత
మొత్తం వ్యవహారం న్యాయవ్యవస్థ పరిథిలోనికి పోతుంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు మాట్లాడుకునే
భాషే వేరు. అక్కడ ఉద్యమకారులు చేయగలిగింది ఏమీ వుండదు; కోర్టు హాలులో మౌన ప్రేక్షకుల్లా
చూస్తూ నిలబడడంతప్ప. సుదీర్ఘ ప్రయాణాలు చేసి
వాయిదాలకు హాజరు కావడం, లాయర్లను నియమించుకోవడం చాలా ఖర్చుతో కూడిన పని. ఉద్యోగులైతే
శెలవులు పెట్టడం మరీ కష్టం. కేసులు కోర్టుల్లో దశాబ్దాలు సాగుతాయి. అనేక కోర్టులు మారుతాయి.
సుప్రీం కోర్టు వరకు వెళ్ళాల్సివుంటుంది. అన్నేళ్ళు సమయాన్ని, డబ్బును వెచ్చిస్తూ కోర్టుల
చుట్టూ తిరగడం బాధితులకు ఉద్యమకారులకు దాదాపు అసాధ్యం.
ఉద్యమాల్లోనీ ఈ ఆర్థిక బలహీనతల్ని తెలుసుకున్న
ధనిక దోషులు తెలివితో స్వచ్చందంగా అరెస్టు అయ్యి బెయిల్ తీసుకుని బయటికి వచ్చేసిన సందర్భాలూ
వున్నాయి. అక్కడి నుండి బాధితులు, సాక్షులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వుంటుంది. దోషులకు
కోర్టులు శిక్షలు విధిస్తాయోలేదోగానీ కోర్టుల ఏళ్ళ తరబడి కోర్టుల చుట్టూ తిరగడం బాధితులకు,
సానుభూతిపరులకు చాలా పెద్ద శిక్ష. మొదట్లో సానుభూతితో వున్న లాయర్లు కూడ కొన్నాళ్ళకు
నీరసపడిపోతుంటారు. వాయిదాలకు సరిగ్గా హాజరుకారు.
ఈ ఇబ్బందులు పడలేక కొన్ని కేసుల్లో పిర్యాదిదారులు కేసు మీద అశలు వదులుకుంటారు.
కొన్ని కేసుల్లో లొంగిపోతారు కూడ.
చుండూరు కేసులో స్థానిక కోర్టులో న్యాయం
జరిగినట్టు కనిపించింది. పైకోర్టులో అందుకు వ్యతిరేకమైన తీర్పులు వచ్చాయి. పైగా న్యాయ
వ్యవస్థలో డబ్బుతోపాటూ కులం, మతం కూడ వుంటాయి.
కొన్ని అతి అరుదైన కేసుల్లోతప్ప, న్యాయవ్యవస్థలో అంతిమంగా ధనవంతులే గెలుస్తుంటారు. మనం ఇప్పటికిప్పుడు న్యాయవ్యవస్థను మార్చలేం. ఆర్ధిక
వ్యవస్థనూ మార్చలేం. కులవ్యవస్థనూ మార్చలేం. ఉద్యమాలన్నింటిలోనూ అప్పటి నుండి ఇప్పటి
వరకు న్యాయ విభాగంలో ఈ అన్యాయం కొనసాగుతూనే
వుంది.
గత ఏడాది భారత పార్లమెంటు
పౌరసత్వ సవరణ బిల్లును పాస్ చేయడాన్ని నిరసిస్తూ
డిసెంబరు 11 తరువాత దేశమంతటా ‘షాహీన్ బాగ్’ ఉద్యమం చెలరేగింది. ఇందులో సమస్త అస్తిత్వవాద
సమూహాలే కాకుండ, సామ్యవాదులు, మతసామరస్యవాదులు, మానవతావాదులు, మానవహక్కులవాదులు అందరూ
పాల్గొన్నారు. ఈ ఉద్యమం వెంటనే ‘భారత లౌకిక రాజ్యంగ పరిరక్షణ ఉద్యమం’గా రూపాంతరం చెందింది. భారత రాజ్యాంగపు ప్రవేశిక, న్యాయము, స్వేఛ్ఛ, సమానత్వము,
సోదరభావం అనే నినాదాలు అణగారిన సమూహాలకు బైండింగ్
వైర్ గా మారాయి. కరోనా వచ్చి ఆ ఉద్యమం ఆగిందిగానీ,
కరోనా గ్రహణం తొలగగానే ‘భారత లౌకిక రాజ్యంగ పరిరక్షణ ఉద్యమం’ ఊపందుకుంటుందని ఆశిద్దాం.
(దుడ్డు ఆలీశమ్మ,
బొక్క రాజమ్మలకు అంకితం)
(ఆలీసమ్మ-
జార్జి ఫ్లాయిడ్, విజయాలు గుణపాఠాలు అనే అధ్యాయాల్ని 17 జులై 2020న చేర్చాను)
(అయిపోయింది)
మంచి ప్రయత్నం .ఉద్యమాలు బలంగా ఉన్నప్పుడు తెలియకుండానే చాలామంది చాలా సాహసాలు చేస్తుంటారు . ఇది ఎందుకు అంటున్నానంటే మీరు కోర్టు సన్నివేశం గురించి రాశారు కదా నాకు కూడా ఒక విషయం గుర్తుకు వచ్చింది బహుశా 1980,82 మధ్యలో అనుకుంటా PDSU వాళ్ళు కావలిలో జడ్జ్ మీదనే చెప్పుతో దాడిచేశారు అప్పటి నుండి కావాలి కోర్టులోకి చెప్పులతో అనుమతించేవాళ్ళుకాదు .ఇటువంటి ఉద్యమ చరిత్ర సంబంధిత రాతలు ఇప్పుడు చాలా అవసరం ధన్యవాదాలు
ReplyDelete