స్విస్ బ్యాంక్ మీద సర్జికల్ స్ట్రైక్స్
చేయాలి !
-
డానీ
అధికారం, అవినీతి, నల్లధనం పరస్పరాశ్రయాలు. అవినీతి నల్లధనాన్ని సృష్టిస్తుంది;
నల్లధనం అవినీతిపరుల్ని మరింత శక్తిమంతులుగా మారుస్తుంది. వీలు కుదిరినపుడు అధికారాన్నికూడా
కట్టబెడుతుంది. ఆ అధికారం మళ్ళీ అవినీతిని
పెంచుతుంది.
అవినీతి అనేది ఒక వ్యవస్థ. చేతిలో అధికారంలేకుండా, అధికారంలో వున్నవారితో
సాన్నిహిత్యం (క్రోనీ కేపిటలిజం) లేకుండా,
అధికారుల్ని మచ్చిక చేసుకునే నైపుణ్యం (లాబీయింగ్) లేకుండా ఎవరూ అవినీతికి పాల్పడలేరు.
ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల
మీద ఒక్కసారిగా తనిఖీలు నిర్వహిస్తే ఆదిమూలం మోహన్ (తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్), డీఏ. సత్యప్రభ (చిత్తూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే)
వంటివారు ఒకరు ఇద్దరు కాదు వేలు లక్షల్లో బయటపడతారు. దేశంలో అవినీతి సంపద
తొంభై శాతం బయటపడిపోతుంది. ప్రభుత్వాలతో అంట కాగుతూ అవినీతి సంపదను పెంచుకుంటున్న మీడియా
అధిపతులు తదితరుల్ని కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు.
ప్రత్యక్ష, పరోక్ష పన్నులు కట్టని చిల్లర వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా వుంటారుగానీ
వాళ్ల అవినీతి అంత చెప్పుకో దగ్గదికాదు. దాన్ని కూడా అరికడతామంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన
పనిలేదుగానీ పెద్ద తిమింగలాల్ని వదిలేసి పెద్ద నోట్లను రద్దు చేస్తామంటేనే ప్రభుత్వాధినేతల
నిజయితీని శంకించాల్సి వస్తున్నది.
నల్లధనం అనే అవినీతి సంపద నగదు రూపంలోనే వుంటుందనేది ఒక అబధ్ధం. అవినీతిపరులు అతి
తెలివైనవాళ్ళు. వాళ్ళు సంపదను ఎక్కువ కాలం నగదు రూపంలో నిల్వపెట్టరు. ఎందుకంటే ద్రవ్యోల్బణం
కారణంగా నగదు విలువ క్రమంగా అంతరించిపోతుంటుంది. అసలు కరెన్సీ అంటేనే నిరంతరం చలనంలో
వుండేది అని అర్ధం. సాధారణంగా అవినీతి సంపద భూమి, భవనాలు, బంగారం రూపంలో వుంటుంది.
ఈ మూడు రంగాలలో మదుపు చేసినపుడే వాటి విలువ పెరుగుతూ వుంటుంది. అంతిమంగా నగదు రూపంలో
వుండే అవినీతి సంపద పది శాతం కూడా వుండదు.
అయితే కొందరికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పెద్ద మొత్తంలో నల్లధనం
నగదు రూపంలో అవసరం అవుతూ వుంటుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో నల్లధనం లేకుండా
బతకలేవు. పార్టీల విధానాలు, అవి చేసే వాగ్దానాలతోపాటూ,
అవి పంచే డబ్బు కూడా ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుంటాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే
అభ్యర్ధులు సగటున 8 కోట్ల రూపాయలు, యంపీ అభ్యర్ధులు సగటున 12 కోట్ల రూపాయలు చొప్పున
ఖర్చుపెట్టారని అనేక పరిశోధనా సంస్థలు అంచనా వేశాయి. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా ఏమీలేదు. అన్ని పార్టీలూ తమ దగ్గరఉన్న వనరుల
మేరకు భారీగా ఖర్చుపెట్టి అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తాయి. “ఈ డబ్బును అవి మదుపుగా భావిస్తాయి గనుక వీటి మీద
కనీసం ఐదారు రెట్లు సంపాదించుకొవడానికి పదవీ కాలంలో అనేక అవినీతి చర్యలకు పాల్పడతాయి.
అలా అవినీతి డబ్బు ఎన్నికలు ఎన్నికలకు ఐదారు రెట్లు పెరిగిపోతుందని ప్రెస్ కౌన్సిల్ఆఫ్
ఇండియా మాజీ అధ్యక్షులు జస్టిస్ మార్కండేయ కట్జు వంటివాళ్ళు తమ నివేదికల్లో పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం ఎంతడబ్బు చెలామణిలో వున్నదో సులువుగానే లెఖ్ఖలు
కట్టి చెప్పవచ్చు. ఇప్పటి వరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోట్ల విలువ
వివరాలు కచ్చితంగా రికార్డుల్లో నమోదు అవుతూవుంటాయి.
అలాగే శిధిలమైపోయి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు
తిరిగి వచ్చిన నోట్ల విలువ కూడా కచ్చితంగా
రికార్డుల్లో నమోదు అవుతూ వుంటుంది. మొదటిదానిలో నుండి రెండోదాన్ని తీసేస్తే ప్రస్తుతం
దేశంలో చెలామణిలో వున్న కరెన్సీ నోట్ల విలువను కచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇందులో
నల్లధనంగా మారిన నోట్ల మొత్తం విలువను కచ్చితంగా చెప్పడం సాధ్యంకాదు; అది అప్రకటిత
ధనం కనుక.
ఒక అంచనా ప్రకారం దేశంలో ప్రస్తుతం 18 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో
వుండగా అందులో సగభాగం నల్లధనంగా మారిందని అంచనా. అంటే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల
నల్లధనం కరెన్సీ రూపంలో వుందనేది కేంద్ర ప్రభుత్వ
వర్గాలు ఇస్తున్న సంకేతాలు.
ఇది కాకుండా నకిలీ నోట్లు కూడా పెద్ద మొత్తంలో చెలామణిలోనికి వస్తున్నాయి.
మన కరెన్సీలో పెద్ద నోట్లను విదేశాల్లో ముద్రిస్తారని చాలా మందికి తెలీదు. యూపీఏ హయాంలో ఇంగ్లండ్ హ్యాంప్ షైర్ కు చెందిన డె
లా రూయి సంస్థకు 500, 1000 రూపాయల కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కాంట్రాక్టు ఇచ్చారు. ఇంకో
విచిత్రం ఏమంటే పాకిస్తాన్ కు చెందిన పెద్ద కరెన్సీ నోట్ల ముద్రణ కాంట్రాక్టును కూడా
ఈ సంస్థే దక్కించుకుంది. వీటి దుష్ఫలితాలను ఊహించుకోవచ్చు.
ఆధిపత్యం, ప్రాబల్యం గలవర్గాలు మాత్రమే అవినీతికి పాల్పడి నల్లధనాన్ని
సృష్టిస్తాయని అనుకోవడానికి కూడా లేదు. చట్టాల నియమాలకూ, సమాజ సాంప్రదాయాలకూ పొంతన
కుదరని సందర్భాల్లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కూడా నల్లధనాన్ని సేకరిస్తుంది. వరకట్నం దీనికి పెద్ద
ఉదాహరణ. వరకట్నం ఇవ్వడం తీసుకోవడం కూడా చట్ట ప్రకారం నేరమే. కానీ, దేశంలో జరిగే దాదాపు
అన్ని పెళ్ళిళ్ళలోనూ వరకట్నం వుంటుంది. వరకట్నం
కోసం అనేక కుటుంబాలు నల్లధనాన్ని పోగుపెడుతుంటాయి. ఇంకా దిగువ తరగతికి చెందిన పేదలు,
బిచ్చగాళ్ల దగ్గర కూడా ఏదో ఒకస్థాయిలో నల్లధనం వుండే అవకాశాలున్నాయి. అంచేత నల్లధన్నానీ,
అవినీతినీ వర్గీకరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. జరుగుబాటు కోసం చేసే అవినీతినీ, అత్యాశతోనూ,
అధికారాన్ని చేపట్టే లక్ష్యాలతోనూ చేసే అవినీతిని విడగొట్టాల్సిన అవసరం వుంది. ఎవరిని
శిక్షించాలి, ఎవరిని క్షమించాలీ అనే విషయంలో ఒక విధాన నిర్ణయం జరగాల్సిన సమయం ఇది.
అంతేతప్ప అవినీతి సర్వత్రావుందనే వంకతో పెద్ద తిమింగిలాలని వెనకేసుకు రావడం క్షమార్హంకాని
నేరం.
ప్రకటిత ధనం సర్క్యూలేషన్ ను నిర్వహించడానికి ప్రకటిత బ్యాంకులు
వున్నట్టే అప్రకటిత ధనం సర్క్యూలేషన్ ను నిర్వహించడానికి కూడా అప్రకటిత బ్యాంకులు వుంటాయి.
ఈ కోణంలో ఇప్పుడు విజయమాల్య పేరు ఎక్కువగా వినిపిస్తున్నదిగానీ అలాంటి పెద్ద తిమింగలాలు
అనేకం వుంటాయి. ఎందుకో గానీ తెలుగు రాష్ట్రాల్లో
సారా, మద్యం వ్యాపారుల పేర్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తుంటాయి. వీళ్ళు సాధారణంగా
అధికార పార్టీల్లోనే వుంటుంటారు. 1995 చివర్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త
చనిపోయినపుడు పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రిసహా, కొందరు పెద్ద హీరోలు హుటాహుటిన అక్కడికి
చేరుకున్నారు. ఆ చనిపొయిన పారిశ్రామికవేత్త విజయమాల్యాకు ప్రాంతీయ ప్రతినిధి అని అప్పట్లో
బలంగా వినిపించింది.
ఇలాంటి వ్యవహారాల్లో విజయమాల్య పేరు ఇటీవల మళ్ళీ వెలుగులోనికి వచ్చింది.
ప్రస్తుతం విదేశాల్లో ప్రవాస జీవితాన్ని గడుపుతున్న విజయమాల్య కేసును దర్యాప్తు చేస్తున్న
ప్రత్యేక అధికారుల బృందం గత నెల (అక్టోబరు) మొదటివారంలో టీడీపీకీ చెందిన చిత్తూరు ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ ఇంటి మీద దాడులు
జరిపి 43 కోట్ల రూపాయల నగదుతోపాటూ దాదాపు 300 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తుల పత్రాలను
స్వాధీనం చేసుకున్నారు.
అధికారపార్టీల్లోనే తిమింగలగిలాలు వున్నప్పుడు అవినీతిని అరికట్టడం ఏ అధికారపార్టీకి
కూడా సాధ్యఅయ్యేపనికాదు. అందువల్ల కేంద్రప్రభుత్వం అప్పుడప్పుడు నల్లధనాన్ని క్రమబధ్ధం
చేసే ప్రయత్నం చేస్తుంటుంది. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం సరళీకృత ఆర్ధిక విధానాన్ని
చేపట్టినపుడు నల్లధనం స్వచ్చంద ప్రకటన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రకటించిన మొత్తంలో
మూడో భాగాన్ని అపరాధ రుసుముగా వసూలు చేసి మిగిలిన
రెండు భాగాల్ని క్రమబధ్ధం చేసేవారు. ఒక ముఖ్యమంత్రి
కుటుంబం చెన్నయిలో 450 కోట్ల రూపాయల అక్రమ ధనాన్ని ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది.
దేశంలో నల్లధనంగా మారిన దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలను తెల్లధనంగా
మార్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయ ప్రకటన పథకం- (ఐడియస్) 2016ను ప్రవేశపెట్టింది.
ప్రకటిత మొత్తంలో ఆదాయపు పన్ను, అపరాధపు పన్ను, ఇతర సెస్సులు కలుపుకుని మొత్తం 45 శాతం వసూలు చేసి మిగిలిన 55 శాతం మొత్తాన్ని తెల్లధనంగా
ప్రకటించడం ఈ స్కీము లక్ష్యం. ఈ పథకం ద్వార దేశంలో దాదాపు 6.5 లక్షల కోట్ల నల్లధనం
వెలుగులోనికి వస్తుందని ప్రభుత్వం అశించిందిగానీ అందులో ఇప్పటికి పది శాతం ఫలితాలు
మాత్రమే వచ్చాయి.
ఈ స్కీమ్ లో భాగంగా హైదరాబాద్ కు చెందిన ఓ రాజకీయ కుటుంబం పది వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనను
ప్రకటించడం నెల క్రితం పెద్ద సంచలనం గా మారింది. చిత్తూరు మహిళా ఎమ్మెల్యే డబ్బుతోసహా
దొరికిపోవడంతో నైతిక సంక్షోభంలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగు దేశంపార్టి పది వేల కోట్ల రూపాయలు
ప్రతిపక్షనేత జగన్ వే అంటూ ప్రచారం మొదలెట్టింది.
పది వేల కోట్ల రూపాయల్ని ప్రకటించిన వారి పేరును
ప్రకటించాలని వైయస్సార్ సీపీ అధినేత జగనే
స్వయంగా ప్రధానికి లేఖరాయడంతో ఆ వివాదం ముగిసింది. ఆ డబ్బు ఓ మాజీ ముఖ్యమంత్రి
కుటుంబానివనే గుసగుసలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇందులో రహాస్యాలు
ఏమీ వుండవు. 45 శాతం పన్ను కట్టేసిన తరువాత ఎంత నల్లడబ్బయినా సర్ఫ్ఎక్సెల్ వేసి ఉతికి ఆడేసినట్టు తళతళలాడే తెల్లని
తెలుపు డబ్బుగా మారిపోతుంది. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర వుంటాయి. సమాచార హక్కు చట్టం
ద్వార ఎవరయినా వాటిని పొందవచ్చు.
దేశంలో వున్న నల్లడబ్బుగాక విదేశీ బ్యాంకుల్లో కూడా మన దేశపు అవినీతిపరుల
నల్లడబ్బు వుంటుంది. డిపాజిట్టు నిబంధనల ప్రకారం ఆ వివరాలను విదేశీ బ్యాంకులు ప్రకటించవు.
ఇలాంటి సందర్భాల్లో పన్ను ఎగవేతదారుల స్వర్గంగా స్విస్ బ్యాంకుల్ని పేర్కొంటూంటారు.
అక్కడ కూడా ఎంత డబ్బు వుందో ఎవరి దగ్గరా అంచనాలు లేనప్పటికీ ఆ డబ్బును వెనక్కి తీసుకువస్తామని
గత ఎన్నికల్లో బీజేపి వాగ్దానం చేసింది. అధికారాన్ని చేపట్టిన తరువాత కూడా ప్రధాని
నరేంద్ర మోదీ ఈ వాగ్దానాన్ని పునర్ఉద్ఘాటించారు. ఆ డబ్బును వెనక్కి తీసుకుని వస్తే
ప్రతి భారతీయ పౌరుడికి 15 లక్షల రూపాయల చొప్పున ఆయాచితంగా ఇవ్వవచ్చని కూడా వారు మరీ
చెప్పారు. సాక్షాత్తు ప్రధాని వేసిన లెఖ్ఖల ప్రకారం స్విస్ బ్యాంకులో 18 కోట్ల కోట్లు
భారత నల్లధనం నిల్వలు వున్నాయని అర్ధం. అక్కడ
అంత ధనం వుందని తెలిసి కూడా దాన్నీ వెనక్కు తీసుకురావడానికి ప్రధాని మోదీ ఎందుకు జంకుతున్నారో
అర్ధంకాదు. ప్రపంచంలో అగ్రగామి ఆర్ధికశక్తిగా మారుతున్న చైనా పైనే సర్జికల్ స్ట్రైక్స్
చేయడానికి సిధ్ధమౌతున్న ప్రధాని స్విస్ బ్యాంకు మీద సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయలేకపోతున్నారో
దేశ ప్రజలకు వివరించాల్సిన అవసరం వున్నది. ఎందుకంటే ప్రధాని తాత్సారం చేసేకొద్దీ ఒక్కో
భారతీయుడు 15 లక్షల రూపాయల్ని ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతాడు. తలసరి 15 లక్షల రూపాయలు
అనేది ఏ విధంగానూ చిన్న విషయం కాదు.
సాధారణంగా చెయ్యాల్సిన పనులు చేయకుండా ప్రభుత్వాలు చేయాల్సిన అవసరంలేని
పనులు అనేకం చేస్తుంటాయి. వీటికి దేశ ఆర్ధిక ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం
అని ఎవరికైనా అనిపిస్తే అందులో అతిశయోక్తి ఏమీలేదు. దేశంలో 500, 1000 రూపాయలను రద్దు చేయాలని నవంబరు
8న మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ కోవకే చెందుతుంది.
రాజకీయాల్లో ఎవరు ఏం చెపుతున్నారు అనే దానికన్నా ఎప్పుడు చెపుతున్నారు
అనేది కూడా చాలా ముఖ్యం. జాతీయ రాజకీయాల్లో
కీలక రాష్ట్రంగా భావించే ఉత్తర ప్రదేశ్ లో
మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడంతో ఇందులో
ఆర్ధిక ప్రాధాన్యతకన్నా రాజకీయ ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తున్నది. ఆర్ధిక ప్రాధాన్యతే
ముఖ్యం అనుకుంటే భారత ప్రభుత్వం ఈపాటికే స్విస్ ప్రభుత్వం మీద, ఆ దేశ ఉత్పత్తుల మీద ఆర్ధిక అంక్షల్ని
విధించి వుండేది. అంతకన్నా తీవ్రమైన చర్యలకు పాల్పడి వుండేది.
నిజానికి పెద్ద నోట్లను రద్దు చేయడం ఇదే మొదటిసారికాదు. మొదటి పపంచ
యుధ్ధం తరువాత అప్పటి బ్రిటీష్ పాలకులు కూడా భారత వలసలో పెద్ద నోట్లను రద్దు చేశారు.
ఎమర్జెన్సీ కాలంలోనూ పెద్ద నోట్ల రద్దు ప్రతిపాదన వచ్చింది. 1978లో మురార్జీ దేశాయి
కాలంలో అది అమల్లోనికి వచ్చింది. ఆ రెండు సందర్భాలోనూ సమాజపు పైపొరల్లో కొన్ని సర్దుబాట్లు
జరగడమేతప్పా పేదవాళ్లకు ఒరిగింది ఏమీలేదు. ఇప్పుడూ అంతే. కానీ, ఏదో జరిగిపోతున్నదనే
భ్రమ కొంత కాలం వుంటుంది. ఎన్నికలకు ముందు ప్రజల్ని అలాంటి భ్రమల్లో వుంచడం రాజకీయ
పార్టీలకు అవసరం.
పిల్లికి చెలగాటం ఏలక్కి ప్రాణ సంకటం అన్నట్టు ఈ రాజకీయ క్రీడ ప్రభావం
దిగువతరగతి వర్గాల మీద చాలా తీవ్రంగా వుంటుంది. నల్ల కుబేరుల్ని గట్టున పడేయడానికి
పెద్దపెద్ద ఆడిటింగ్ సంస్థలుంటాయి. అవి చొక్కా నలగకుండానే, జుట్టు చెదరకుండానే పెద్దపెద్ద
తిమింగలాల్ని దొడ్డిదారిన బయట పడేస్తుంటాయి. దిగువ తరగతి జీవులకు ఆ సంస్థలు, ఆ మతలబులు,
ఆ దొడ్డిదారులూ, ఆ కిటుకులు తెలిసే అవకాశం వుండదు. చిన్న తేడా వచ్చినా ఆ జీవితాలు ఆరిపోతాయి.
అప్పుడే మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి సంక్షోభంలో కూరుకుని ఒకామె ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలవర పెడుతోంది.
మహబూబాబాద్ కొత్తజిల్లా శెనగపురం గ్రామానికి చెందిన కందుకూరి వినోద
అనే మహిళ భర్త కందుకూరి ఉపేంద్రాచారి కొంతకాలంగా పక్షవాతంతో
మంచాన పడ్డాడు. కుటుంబ సభ్యులు వారిస్తున్నా
భర్తను ఎలాగయినా బతికించుకోవాలని పట్టుదలతోవున్న వినోద తమకున్న 12 ఎకరాల భూమినీ 56
లక్షల రూపాయలకు ఇటీవలే అమ్మేసింది. భర్తకు వైద్య ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో మరోచోట
కొంత భూమి కొని మిగిలిన జీవితం గ్డపాలనేది ఆమె వుద్దేశ్యం. భూమి అమ్మేసి సరిగ్గా డబ్బులు చేతిలో పడిన సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది.
అమె చేతికి అరకోటి వచ్చివుండవచ్చుగానీ అందులో చాలా తక్కువ మొత్తానికి భూమి రిజిస్ట్రేషన్
జరిగివుంటుంది. అందులో వైట్ ఎంత? బ్లాక్ ఎంత? బ్లాక్ ను వైట్ చేసుకునే మార్గాలేమిటీ? వాళ్ళకు
తెలిసే అవకాశంలేదు. “ఈ నోట్లన్నీ ఇక చిత్తు కాగితాలే” అని నమో భక్తులు చేసిన ప్రచారం
ఆ కుటుంబంలో విషాదంగా మారింది. భూమిని అమ్మి చిత్తుకాగితాలు తెచ్చిందని కొడుకు, కూతురు,
బంధువులు నిందించడంతో వినోద హతాశురాలైంది. చివరకు భర్త కూడా అసహనాన్ని వ్యక్తం చేయడంతో
వినోద తన ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. ఇలాంటి విషాదాలు మరికొన్నింటిని మనం సమీప
భవిష్యత్తులో చూడబోతున్నాం.
గతంలో పెద్ద నోట్లను రద్దుచేసినపుడు ఇలాంటి విషాద సంఘటనలు లేవు.
నల్లకుబేరులకన్నా దిగువతరగతి జీవులే ఎక్కువ ఇబ్బందుల్ని ఎదుర్కోవడం ఈసారి విశేషం.
నల్లధనం పెరిగిపోవడానికి కారణం పెద్దనోట్లే అని ఏపీ ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు చేస్తున్న వాదన కూడా చిత్రమైనది. మురార్జీ దేశాయి రద్దుచేసిన 1000
రూపాయల నోటును తిరిగి ప్రవేశ పెట్టింది బీజేపి ప్రధాని వాజ్ పాయే. 2000లో ఇది జరిగింది. అప్పటి యన్డీయే ప్రభుత్వంలో
టిడిపి భగస్వామ్యపార్టీ మాత్రమేకాక దాదాపు
చంద్రబాబు సూచనల ప్రకారమే వాజ్ పాయి ప్రభుత్వం నడుస్తున్నట్టు గట్టిగా ప్రచారం జరిగేది.
అలా తార్కికంగా ఆ తప్పులో వారికీ భాగం వుందనుకోవాలి.
మొన్న 500, 1000 రూపాయల నోట్ల ను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించినపుడు
వాజ్ పాయి చేసిన తప్పును నరేంద్ర మోదీ సరిదిద్దదలిచారేమో
అనిపించింది. అయితే, వెయ్యి రూపాయల నోట్ల స్థానంలో 2 వేల రూపాయల నోటును ప్రవేశపెట్టి
వారు వాజ్ పాయి చేసిన తప్పును రెట్టింపు చేయదలిచారు. మన రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో
దొంగ ఓట్లకు అప్పటికి సవరించిన ధర ప్రకారం వెయ్యి రూపాల నోటుకు బదులు రెండు వేల రూపాయలు
నోటు ఇస్తారేమో. ప్రైస్ అప్రిసియేషన్!
భారత కరెన్సీ మీద గాంధీజీ బొమ్మ వున్నంత కాలం దేశ రాజకీయాల్లో గాంధీ-నెహ్రు
కుటుంబం అంతరించిపోదని కమలనాధులు భావిస్తున్నారనే
అభిప్రాయం ఒకటుంది. సమీప భవిష్యత్తులో మన కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బదులు కమలనాధులు
అభిమానించే వల్లభాయి పటేల్ బొమ్మలు ప్రత్యక్షం కావచ్చు.
మనం జాతీయ బ్యాంకులకు వెళ్ళినపుడు అక్కడి అందమైన అమ్మాయిలు ఎంతో అభిమానంతో ఫిక్సిడ్
డిపాజిట్టు స్కీముల లాభాల్ని వివరించి “ఏమైనా ప్లాన్ వుందా।“ అని అడుగుతుంటారు. వాళ్లను
తప్పించుకోవడం చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇప్పుడు వాళ్లకు ఆ శ్రమ అక్కర లేదు. జనం తమంత
తాముగా బ్యాంకుల ముందు క్యూలు కట్టి డబ్బును దిపాజిట్టు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోది
ఇప్పుడు జాతీయ బ్యాంకుల ఫిక్సిడ్ డిపాజిట్ స్కీములకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.
బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ఒక వాస్తవం ఏమంటే చేపలు బ్యాంకుల్లో
డబ్బును దాచుకుంటాయి. తిమింగలాలు బ్యాంకుల్ని దోచుకుంటాయి.
(రచయిత సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం కన్వీనర్)
మొబైల్ : 9010757776
నవంబరు 11, 2016