కాపుమహానాడుతో రంగాకు సంబంధంలేదు.
వంగవీటి సోదరులు కాపు సామాజికవర్గానికి చెందిన వారయినప్పటికీ
వాళ్లను కాపు నాయకులు అనడం సరికాదు. రాధా అనుచరుల్లో
కమ్మ సామాజికవర్గానికి చెందిన వారున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. రంగా కొలువులో
కూడా బ్రాహ్మణులు, దళితులు, బీసీలు, ముస్లింలు, క్రైస్తవులతోపాటూ కమ్మ సామాజికవర్గానికి
చెందినవారు కూడా అనేకులు వుండేవారు. 1985 ఎన్నికల్లో రంగాకూ, 1989, 1994 ఎన్నికల్లో
రత్నకుమారికీ చీఫ్ పోలింగ్ ఏజెంట్ గా వున్న ఏకే అన్సారీ ముస్లిం. అంతేగాక, రంగాకు
రాజకీయసలహాదారు కాట్రగడ్డ రాజగోపాలరావు, న్యాయసలహాదారు కర్ణాటి రామ్మోహన రావు కూడా
కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. రంగా హత్యానంతరం ఆయన భార్య రత్నకుమారికి కూడా కాట్రగడ్డ
రాజగోపాలరావు రాజకీయ గురువుగానే వున్నారు.
అంతకు ముందు
టిడిపి మహానాడు జరిపిన కృష్ణా నది గర్భంలోనే 1988 జులై రెండవ వారంలో కాపుమహానాడు నిర్వహించారు.
అయితే ఆ సభను నిర్వహించింది వంగవీటి రంగా కాదు. అప్పుడు ఆయన ఒక హత్యకేసులో నిందితునిగా
విజయవాడ సబ్ జైల్లో వున్నారు. రంగాను కాపు నాయకునిగా ప్రచారం చేసింది బందరుకు చెందిన
చిలంకుర్తి వీరాసామీ అంబులు, మిరియాల వెంకట రావు, ముద్రగడ పద్మనాభం. ఈ జాబితాలో దాసరి
నారాయణ రావుని కూడా చేర్చవచ్చు. ఇలాంటి ప్రచారంవల్ల రంగాకు మేలుకన్నా కీడే ఎక్కువ జరిగింది.
కాపు మహానాడు నిర్వహించడంవల్ల రంగా శిబిరంలోని ఇతర సామాజికవర్గాలు ఒకరకం సంధిగ్ధంలో
పడిపోయాయి. ఈ పరిణామాలు రంగాను సామాజికంగా ఒంటరివాడిని చేసేశాయి. వాటి ఫలితాలు ఏమిటో చరిత్ర చెప్పేసింది.
No comments:
Post a Comment