వంగవీటి సోదరులు
-
డానీ
(ఈ వ్యాసాన్ని ఇతర పత్రికలు ఏవీ
ప్రచురించవు అనే ఉద్దేశ్యంతో నేరుగా Facebook లో పెడుతున్నాను.)
నేను విజయవాడకు మకాం మారడానికి
ముందే వంగవీటి సోదరులు రాధా-రంగాలతో స్వల్ప
పరిచయం వుంది.
విజయవాడ బిసెంట్ రోడ్డు సెంటర్
లోని మోహన్ ఫ్యాన్సీ ఎంపోరియం భాగస్వామి యర్రంశెట్టి మోహనరావుగారు చిన్నప్పుడు నరసాపురంలో మానాన్నకు క్లాస్ మేట్. ఆ అనుబంధం వాళ్ళ
జీవితకాలం కొనసాగింది.
హత్యకు గురి కావడానికి రెండు నెలల
ముందు 1974 అక్టోబరులో వంగవీటి రాధా బృందం అంతర్వేదిలో ఆలయ దర్శనానికి వచ్చారు. నరసాపురం
నుండి అంతర్వేదికి లాంచీ ప్రయాణ ఏర్పాట్లు, భోజన వసతి వగయిరాలు మోహనరావుగారు పర్యవేక్షించారు.
వంటలు మా ఇంట్లోనే చేయించారు. సాధారణంగా ఇంటికి చుట్టాలు వచ్చినపుడు పిల్లల హడావిడి
వుంటుంది. అలాంటి హడావిడి లేకుండా అసలు వాళ్ళెవరో బయటికి తెలియకుండా రహాస్యంగా వుంచడం
మాకు కొత్తగానూ, ఆశ్చర్యంగానూ అనిపించింది. నేను రాధను చూడడం అదొక్కసారే. ఆయన పొట్టిగా,
చామన ఛాయలో వుండేవారు. కొంచెం ముందుకు వంగి కొద్దిగా వూగుతూ నడిచేవాళ్ళు. సన్నిహితులు
ఆయన్ని “గూని రాధ” అని ప్రస్తావించేవారు.
రాధకు రాబిన్ హుడ్ వంటి ఇమేజ్ వుండేది. విజయవాడ కృష్ణలంక
ఆయన కార్యక్షేత్రం. అప్పట్లో అది చాలా పెద్ద మురికివాడ. అక్కడి జనం ఆయన్ని పేదల పాలిటి పెన్నిధిగా భావించేవారు.
విజయవాడ రౌడియిజానికి సుదీర్ఘచరిత్ర
వుంది. దీని బీజాలు స్వాతంత్రోద్యమ కాలంలోనే పడ్డాయి. కాంగ్రెస్ అగ్రనేతలైన టంగుటూరి
ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆచార్య యన్ జీ రంగా, నీలం సంజీవరెడ్డి
లకు పార్టీ దిగువ శ్రేణుల్లో వేరువేరు గ్రూపులు వుండేవి. . ఈ విబేధాలకు సామాజికవర్గ కోణం కూడా వుండేది. బ్రాహ్మణులు ప్రకాశం పంతులు,
పట్టాభి సీతారామయ్యల వెంట వుండేవారు. కమ్మ సామాజికవర్గానికి చెందినవాళ్ళు రంగా వెంట
వుండేవారు. రెడ్డి సామాజికవర్గానికి చెందినవాళ్ళు సంజీవరెడ్డి వర్గంగా వుండేవాళ్ళు.
ప్రతివర్గంలోనూ ఇతర కులాలవాళ్ళు కూడా వుండేవారుగానీ వారెప్పుడూ నిర్ణయాత్మక శక్తికాదు.
కాంగ్రెస్ ముఠాతగాదాలు అప్పుడప్పుడు
హింసాత్మకంగానూ మారేవి. కొన్నిసందర్భాలలో కాంగ్రెస్ నాయకులు తమ ప్రత్యర్ధుల్ని దెబ్బ
తీయడానికి కొందరు రౌడీల సహకారాన్ని కూడా తీసుకునేవారు.
ఆ రౌడీలు నగరంలో అక్కడక్కడ వ్యాయామశాలలు నడుపుతూ యువ రౌడీలకు శిక్షణ ఇస్తుండేవారు.
సిధ్ధాంతపరంగా కులాన్ని విస్మరించే
కమ్యూనిస్టులకూ సామాజికవర్గ కోణం ఏర్పడింది. కమ్మ సామాజిక వర్గం సాంస్కృతిక వికాసం
ఆరంభం దశలో రెండు వ్యూహాలను పాటించింది. సాంస్కృతికంగా బ్రాహ్మణ వ్యతిరేక హేతువాదాన్నీ,
రాజకీయంగా కాంగ్రెస్ వ్యతిరేక సామ్యవాదాన్నీ ఆచరించింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ మీద బ్రాహ్మణ
సామాజికవర్గానికి తిరుగులేని ఆధిపత్యం వున్నకారణంగా
కమ్మ సామాజికవర్గానికి చెందిన రాజకీయ నాయకులు మొదట్లో జస్టీస్ పార్టీ వైపు ఆ తరువాత
కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గు చూపారు. బ్రాహ్మణ వతిరేకులయిన రెడ్లదీ దాదాపూ అదే చరిత్ర.
“కామ్రేడ్ అంటే కమ్మ-రెడ్డి” అనే మాట ఈ నేపథ్యం నుండి పుట్టిందే.
కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తుండిన
1950లలో విజయవాడ నగరంలోని రౌడీల్ని కూడా వాళ్ళు అదుపుచేశారు. ప్రధానంగా చండ్ర రాజేశ్వరరావు,
కొండపల్లి సీతారామయ్యలు విజయవాడ రౌడీల్ని కర్రలతో కొట్టుకుంటూ నగర శివార్ల వరకూ తరిమేసిన
ఉదంతాన్ని పాత కామ్రేడ్లు కథలుకథలుగా చెప్పుకుంటారు. అప్పట్లో అది కమ్యూనిస్టుల స్వర్ణయుగం. దాని ఫలితంగానే
ఇటీవలి కాలం వరకూ విజయవాడ ఎర్రగా వుండగలిగిందంటే అతిశయోక్తికాదు.
ఎన్నికల్లో పాల్గొనడం మొదలుపెట్టాక
కమ్యూనిస్టుపార్టీకీ కాంగ్రెస్ పార్టికి వుండే అవలక్షణాలన్నీ వచ్చేశాయి. ఉమ్మడి కమ్యూనిస్టుపార్టి
1964లో చీలిన తరువాత ఆ రెండు పార్టీల మధ్య పోటీ పెరిగింది. ఇరువర్గాలూ తమదే పైచేయి
అనిపించుకోవడానికి అన్నిరకాల అవలక్షణాల్ని విపరీతంగా ప్రోత్సహించాయి. వాణిజ్యవేత్తలు,
పారిశ్రామికవేత్తలేగాక వడ్డీవ్యాపారులు, సారావ్యాపారులు, చివరకు వేశ్యాగృహాలు నడిపేవారు సహితం కమ్యూనిస్టు
జెండాలు పట్టేసుకున్నారు. వాళ్ళతోపాటూ అతి సహజంగానే ఎర్ర రౌడీలు ఆవిర్భవించారు. ఈ సందర్భాంగానే చలసాని వెంకట రత్నం పేరును ప్రముఖంగా
ప్రస్తావిస్తుంటారు. కృష్ణలంకకు ఆనుకునివున్న భాస్కరరావుపేట వెంకటరత్నం కార్యక్షేత్రం.
ఎర్రకోట మీద ఎగురవేద్దామని దాచుకున్న ఎర్రజెండాలు
సారా పాకల మీద ఎగురుతుంటే కమ్యూనిస్టు వృధ్ధులు
చండ్ర రాజేశ్వర రావు, తమ్మిన పోతరాజు వంటివారు చూడలేక బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేసేవారట.
1969లో నక్సలైటు భావాల ఆవిర్భావంతో
విజయవాడ కమ్యూనిస్టు శిబిరంలోనూ కలకలం మొదలయింది. కొందరు యువకులు చలసాని వెంకటరత్నం
ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మొదలెట్టారు. అలాంటివాళ్ళలో వంగవీటి రాధ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
మొదట్లో వెంకటరత్నం శిష్యునిగా కమ్యూనిస్టుపార్టీకి
చెందిన టాక్సీ డ్రైవర్ల సంఘాల్లో పనిచేసిన రాధా 1970లో నక్సలైట్ రాజకీయల మీద కొంత ఆసక్తి
కనపరిచారు. శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటంలో పాల్గొనడానికి విజయవాడ నుండి రైలెక్కి
వెళ్ళాల్సిన బృందంలో దాసరి రమణ, చిత్రకారుడు
టీవీ, అరుణ, షేక్ మసూద్ బాబా, కళ్యాణ (బాంబుల) కృష్ణ, కడియాల రాఘవేంద్రరావు తదితరులతోపాటూ
వంగవీటి రాధా పేరు కూడా వుంది. ఎందుకో ఆయన చివరి క్షణంలో ఆగిపోయారని అప్పటి సన్నిహితులు
అంటారు.
టాక్సీ స్టాండులో రాధా పోటీ సంఘాన్ని
పెట్టడంతో గురువు వెంకటరత్నంతో ఘర్షణ పెరిగింది. 1972లో వెంకటరత్నం హత్యతో అది కొత్త
మలుపు తిరిగింది. కమ్యూనిస్టు శిబిరంలో మొదలయిన ఘర్షణ కుల ఘర్షణగా మారింది. రాధా కాపు
సామాజికవర్గానికీ, వెంకటరత్నం కమ్మ సామాజికవర్గానికీ చెందినవాళ్ళు కావడంతో వెంకటరత్నం
హత్యకు కుల కోణం కూడా వచ్చిచేరింది.
రాధ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కమ్యూనిస్టు పార్టీయేగాక, కమ్మ సామాజికవర్గానికి
చెందిన వ్యాపారవేత్తలు కూడా పథకాలు రచించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో
గన్నవరం సీమపందుల మాసం (బెకన్) ఫ్యాక్టరీ ఆవరణలో ఒకరాత్రి జరిగిన ఒక రహాస్య
సమావేశం విజయవాడ సామాజిక చరిత్రను మలుపు తిప్పింది.
రౌడీయిజం సిధ్ధాంతాల నుండో, ప్రతీకారాల
నుండో పుట్టదు. వాణిజ్య వ్యాపారాల నుండి పుడుతుంది.
పెద్దగా పరిశ్రమలు లేని విజయవాడ ఆర్ధిక జీవితం మొత్తం ఆటోమోబైలు రంగం మీదనే ఆధారపడి
వుండేది. లారీలకు ఫైనాన్స్ చేసే సంస్థల అధిపతులు మొండి బకాయిల వసూళ్ళ కోసం కొంతమంది
యువకుల్ని పెంచిపోషించేవాళ్ళు. వాళ్ళే కొత్తతరం రౌడీలుగా మారారు. వాళ్ల అనుచరులే తరువాతి
కాలంలో బ్యాంకుల రికవరీ టీంలుగా మారారు.
ఫైనాన్స్ రంగం నిర్వహణలో అంతర్గతంగా ఒక సామాజిక నియమం పనిచేస్తూ
వుంటుంది. స్థానిక ఆధిపత్య కులానికి చెందినవాళ్ళు ఫైనాన్షియర్లుగా వుంటారు. ద్వీతీయ
ఆధిపత్య సామాజికవర్గానికి చెందినవాళ్ళు రికవరీ టీమ్ సభ్యులుగా వుంటారు. ఇదంతా అచ్చంగా
తెలుగు సినిమారంగంలో సామాజికవర్గాల సమీకరణల్ని పోలి వుంటుంది. చిరంజీవి వచ్చే వరకు
తెలుగు సినీహీరోలు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. యస్వీ రంగారావు మొదలుకుని ఆర్
నాగేశ్వరరావు, రాజనాల, సత్యనారాయణ వరకు తెలుగు
సినిమా విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కాపు సామాజికవర్గానికి చెందినవారు. కొన్ని
సందర్భాల్లో ఆధిపత్య సామాజికవర్గానికి చెందినవాళ్ళు కూడా రౌడీలుగా వుంటారుగానీ వాళ్ళు
సహజంగానే ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న కుంటుంబాల నుండి వచ్చినవారై వుంటారు.
చురుగ్గా వున్నాడని మొదట్లో రాధను
చేరదీసి ప్రోత్సహించి రౌడీగా మార్చింది ఫైనాన్షియర్లే. రాధ బృందంలో ఆయన తమ్ముడు వంగవీటి మోహనరంగాతోపాటూ, దేవినేని రాజశేఖర్
నెహ్రు అన్న దేవినేని గాంధీ కూడా వుండేవారు. ఆరోజుల్లో వాళ్ల మధ్య ఆర్ధిక ఐక్యతే కొనసాగుతూ వుండేది. కుల స్పృహ అప్పటికి మొదలు కాలేదు.
విజయవాడలో గతకాలపు రౌడీలు కసరత్తులు
చేసి పెంచిన కండల్ని ప్రదర్శించుకుంటూ మొరటుగా,
కటువుగా వుండేవాళ్ళట. వాళ్ళ కాస్ట్యూమ్ 1970లలో ఒక్కసారిగా మారిపోయింది. తెల్లటి షర్టు, తెల్లటి ప్యాంటు, కాళ్ళకు తెల్లటి
చెప్పులు, నడుముకు తెల్ల బెల్టులు వేసుకోవడం మొదలెట్టారు. మనుషులతో చాలా ఆప్యాయంగా,
కొండొకచో వినయంగానూ మాట్లాడేవారు. చూడ్డానికి ‘రాముడు మంచిబాలుడు’ అన్నట్టు వుండేవారు.
ఈ కొత్త ప్యాట్రన్ వంగవీటి రాధాతో మొదలయిందో, చలసాని వెంకటరత్నంతోనే మొదలయ్యిందో పరిశోధించాల్సివుంది.
పూర్వాశ్రమంలో కమ్యూనిస్టులు కావడాన కూడా వాళ్ళ అహర్యం అలా మారివుండవచ్చు.
నైతిక రంగంలోనూ విజయవాడ రౌడీలు
కొన్ని విలువల్ని పాటించేవారు. టీతాగరు. మందు కొట్టరు. చాలామందికి సిగరెట్ అలవాటు కూడా
లేదు. పాలు తాగుతారు. వక్కపొడి కూడా తినరు. అప్పుడప్పుడు జీడిపప్పు తింటారు. అమ్మాయిల
జోలికి వెళ్ళరు. అందుకే కావచ్చు విజయవాడ రౌడీలను అమ్మాయిలు ఇష్టపడేవారు. వాళ్ళలో కొందరివి ప్రేమ వివాహాలు కావడంలో ఆశ్చర్యం ఏమీలేదు. రౌడీల్లో
ఇలాంటి ఒక విశిష్ట వ్యక్తిత్వం దాదాపు గత శతాబ్దం ముగింపు వరకూ కొనసాగింది.
Waiting for the next instalment
ReplyDeletePurthigaa cheappandi Sodara.
ReplyDelete