పుస్తకపరిచయం
ఆవుకథ
... మరోలా
అద్దాల
మేడల్లో వుండేవాళ్ళు గుడిసెల మీద రాళ్ళు రువ్వకూడదు. అంటే, వాళ్ళ మీద జాలిచూపాలనికాదు;
ముందుజాగ్రత్తగా అన్నమాటా. గుడెసెల మీద రాయి రువ్వితే చీకిపోయిన రెండు తాటాకుముక్కలు
కిందికి రాలిపడతాయి. అంతకన్నా పోయేదేమీలేదు. అదే గుడెసెవాసులు అద్దాల మేడ మీద రాళ్ళురువ్వితే
కొల్లాటరల్ డామేజి జరిగిపోతుంది. అయితే, అద్దాల
మేడల్లో వుండేవాళ్ళకు ఇంతటి ఇంగితం వుండదు. అమావాసకీ పౌర్ణానికీ పిచ్చి ముదిరినట్టు
బీహార్ లోనో, ఉత్తర ప్రదేశ్ లోనో దేశంలోనో ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు వాళ్ళ అరచేతుల్లో
దురద పెరుగుతుంటుంది. దురద చేతులుకదా? గుడెసెల మీద నాలుగురాళ్ళు రువ్వకుండా వుండలేవు.
ఇప్పుడు
గుడిసెవాసుల వంతు వచ్చింది. ప్రతిదాడిగా వాళ్ళు అద్దాల మేడ మీద ఒక రాయి విసిరారు. దాని
పేరు ‘గోధనం’ నవల; రచయిత సతీష్ చందర్. దాడికన్నా ప్రతిదాడి తీవ్రంగా వుంటుందని కొత్తగా
చెప్పాల్సిన పనిలేదు.
గోధనం
మెడికల్ ఫిక్షన్ నవల. ఆవు ఆర్ధశాస్త్రం మీద రాసిన ఉద్యమ మార్మిక రచన అని కూడా దీన్ని
అనవచ్చు. ఆవు సాధుజంతువు. ఆవు గడ్డి తినును.
పాలు ఇచ్చును. పాలనుండి వెన్న వచ్చును. వెన్న నుండి నెయ్యి వచ్చును అంటూ సాగుతుంది
ఎలిమెంటరీ స్కూలు పాఠం. ఆవు రాజకీయ జంతువు.
ఆవు ఓట్లు తెచ్చును. ఓట్లు ఆధికారమును తెచ్చును. ఎన్నికల్లో నల్లధనముకన్నా గోధనము గొప్పగా
పనిచేయును అంటూ సాగుతుంది సతీష్ చందర్ నవల.
హిందూ
అగ్రవర్ణాలవారు గోమాంసం తినరూ అనేది ఇటీవలి పరిణామం మాత్రమే. ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యుడు వచ్చేంత వరకు భారత ఉపఖండంలో అందరూ అన్నీ తినవాళ్ళే. యాగాల్లో గోవును ఎలా వండుకుని
తినాలో సవివరంగాచెప్పే శ్లోకాలూ మనకున్నాయి. బౌధ్ధమతం ధాటిని తట్టుకోవడానికి శంకరాచార్యుడు
బ్రాహ్మణ సామాజికవర్గాన్ని శాకాహారులుగా మార్చాడు. బెంగాల్, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో
దీనికి కొన్ని మినహాయింపులున్నాయి.
కోనసీమ
అంబాజీపేటలో పుట్టి హైదరాబాద్ లో స్థిరపడిన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన గోమహాలక్ష్మి
అనే అమ్మాయి అమేరికాలో బావ కమ్ బాయ్ ఫ్రెండ్ తో ఓ రెస్టారెంట్ లో తెలీక గోర్గర్ తింటుంది.
గోర్గర్ అనగా గోవుమాసంతో చేసిన బర్గర్ అనేది
రచయిత వివరణ. ఆ విషయం తెలిశాక షాక్ కు గురయ్యి కౌ ఫోబియా ఆవరించి తనే ఆవు అయినట్టు వింతగా ప్రవర్తిస్తూ
వుంటుంది. కౌంటర్ షాక్ కోసం ఆమెను అంబాజీపేటకు
తీసుకుపోతారు. అక్కడ కథ నాటకీయ మలుపులు తిరిగి గోమహాలక్ష్మితోపాటూ పాఠకులకూ జ్ఞానోదయం
అవుతుంది.
గోదావరినది
సముద్రంలో కలిసేచోట ఆ చిత్తడి నేలల్లో వింత లవణాలు ఏవో ఉత్పన్నం అవుతాయని చెప్పుకుంటారు.
వాటి ప్రభావంవల్ల కామోసు అక్కడి రచయితల కలాలు అసమదీయుల్ని నవ్విస్తూ ఏడిపిస్తూ అలరిస్తుంటాయి.
తసమదీయుల్ని నవ్విస్తూ ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. గోధనం నవల ఆద్యంతం సతీషచందర్ మార్కు హాస్యమూ, వ్యంగ్యమూ,
కారమూ, వెటకారమూ, అనేక విషయాల పరిజ్ఞానమూ పంచుకుంటూ సాగుతుంది. రూపంలో హాస్య నవలగా
కనిపించినప్పటికీ “మేం ఆవకాయతో అన్నం తింటన్నా ఆల్లకి ఆవు మాసంతో తింటన్నట్టుంటది”
వంటి పదునైన వాక్యాలూ, లూధర్ పాల్ వంటి ఉద్వేగ పాత్రలు నవల చదివేసిన తరువాత కూడా మనల్ని
వెంటాడుతాయి.
-
డానీ
మొబైల్ – 9010757776
ప్రచురణ : ఆదివారం ఆంధ్రజ్యోతి, 25 డిసెంబరు 2016
http://epaper.andhrajyothy.com/1047520/Sunday/25.12.2016#dual/28/1
గోధనం
నవల
సతీష్ చందర్
స్మైల్స్ స్మైల్స్ ప్రచురణ, హైదరాబాద్
వెల 75 రూపాయలు
ప్రధాన బుక్ షాపులు అన్నింటిలోనూ దొరుకును
No comments:
Post a Comment