గోగ్రవాదాన్ని
ఆపలేమా?
-
ఏయం
ఖాన్ యజ్దానీ (డానీ)
వర్తమాన భారత దేశంలో అణగారినవర్గాలు ఏవీ ప్రశాంతంగా, సంతృప్తిగా లేవు. ప్రజల
సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వాలు ప్రజల మధ్య చీలికలు తెచ్చి వాళ్ల మధ్య తగవులు సృష్టించి తమ ప్రధాన బాధ్యతల నుండి
తప్పుకుని కార్పొరేట్ల సేవల్లో తరిస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం
ఏర్పడిన తరువాత ప్రజల మధ్య చీలికలు తెచ్చే రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంత ప్రమాదకర
ధోరణుల్ని అనుసరిస్తున్నాయి. వీటికి ముఖ్యంగా బలవుతున్నది ముస్లింలు, దళితులు,
ఆదివాసులు.
సంఘ్ పరివారపు రాజకీయ విభాగమైన భారతీయ జనతా
పార్టి బాబ్రీ మసీదు – రామజన్మభూమి
వివాదాన్ని రెచ్చగొట్టి దాదాపు పాతికేళ్ళు రాజకీయ లబ్దిపొందింది. ఇప్పుడు నిమ్న
కులాలతో కలుపుకుని దాదాపు 65 శాతంగావున్న హిందూ సమాజాన్ని తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి కౄరమైన చీలిక
సిధ్ధాంతాలను ప్రచారం చేస్తోంది. దానికోసం అది అనైతిక పధ్ధతుల్లో ముస్లింలు,
దళితులు, ఆదివాసుల్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శతృవర్గంగా చిత్రించి
ప్రజల్లోని భావోద్వేగాలను భావోద్రేకాలుగా మారుస్తోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య
వ్యవస్థ పతనానికి ఇది పరాకాష్ట.
ముస్లిం సమాజం మీద సంఘ్ పరివార శక్తులు ప్రధానంగా మూడు
ఆరోపణలు చేస్తున్నాయి. పాకిస్తాన్ అభిమానం, ట్రిపుల్ తలాఖ్, బీఫ్. ఇవి మూడూ పూర్తిగా
నిరాధారమైన ఆరోపణలు.
భారత
స్వాతంత్యం కోసం సాగిన జాతియోద్యమంలో
సంఘ్ పరివార శక్తులు ఒక్కటంటే ఒక్కటీ పాల్గొనలేదు. పైగా అవి అప్పట్లో బ్రిటీష్
పాలకులకు అనుకూలంగా వున్నాయి. జాతియోద్యమంలో ప్రాణాల్ని సహితం ఫణంగా పెట్టి
పోరాడిన ముస్లీంలు వందల సంఖ్యలో కనిపిస్తారు. దేశ విభజన సందర్భంగా ముస్లింలలో
అత్యధికులు భారత దేశాన్ని అభిమానించి ఇక్కడే వుండిపోయారన్నది వాస్తవం. ఆ విభజన ఏ
విధంగానూ మత విభజనకాదు. బహుకొద్ది మంది ముస్లింలు మాత్రమే పాకిస్తాన్ కు వలస వెళ్ళారు. 1947లో విభజన
జరిగింది పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే. మిగిలిన రాష్ట్రాలన్నీ సమైక్యంగానే
వున్నాయి. కానీ, భారతదేశాన్ని మాతృభూమిగా అభిమానించి ఇక్కడే వుండిపోయిన ముస్లింల మీద ఇప్పుడు
అనైతిక దాడులు జరుగుతున్నాయి. ఇది జాతియోద్యమానికి అవమానకరం.
1990వ దశాబ్దంలో సరళీకృత ఆర్ధికవిధానం, ప్రైవేటైజేషన్,
గ్లోబలైజేషన్ (LPG) ప్రవేశించాక మానవ విలువల్లో, సంబంధాల్లో అనేక మార్పులు
వచ్చాయి. మనుషులు వ్యక్తులుగా (Man and individual) మారిపోయారు. ఆమేరకు వ్యక్తిగత స్వార్ధం
పెరిగిపోయింది. ఆ ప్రభావం దాంపత్య జీవితం మీద కూడా బలంగా పడింది. 20వ శతాబ్దం
ఆరంభంలో పుట్టినవాళ్ళు భార్యాభర్తలు అంటే జీవితకాలబంధం
అనుకునేవారు. 20వ శతాబ్దం మధ్యలో పుట్టినవాళ్ళు దాన్ని సుదీర్ఘ అనుబంధంగా భావించేవారు.
21వ శతాబ్దం ఆరంభంలో పుట్టినవాళ్ళు దాన్ని
తాత్కాలిక బంధంగా భావిస్తున్నారు. ఫలితంగా, పెళ్ళికి ముందే ప్రేమికుల బ్రేక్-అప్
లు, పెళ్ళి తరువాత దంపతుల విడాకులు ఎక్కువైపోయాయి. ప్రపంచం అంతా ఇదే తీరున వుండడంతో
ఆదుష్ప్రభావం ముస్లిం సమాజంలోనూ ప్రవేశించింది.
ఇప్పుడు మనం విమర్శించాల్సింది ఎల్.పీ.జీ. విధానాలను. కానీ, అందుకు
విరుధ్ధంగా జరుగుతోంది. ఎల్.పీ.జీ. విధానాలను గట్టిగా సమర్ధిస్తున్నవారు తమ
తప్పును కప్పిపుచ్చుకోవడానికి ముస్లింలలో మాత్రమే విడాకుల విధానం వున్నట్టు ఒక
తప్పుడు ప్రచారం మొదలెట్టారు. సెల్ ఫోన్, యస్సెమ్మెస్, వాట్స్ అప్, ఈ-మెయిల్ ద్వార
చెప్పే ట్రిపుల్ తలాఖ్ లు చెల్లవని, అలా చెప్పేవాళ్లని సంఘ బహిష్కరణ చేయాలని
ముస్లిం ధార్మిక సంస్థలు చేస్తున్న ప్రకటనల్ని సహితం కప్పిపుచ్చే ప్రయత్నాలు
జరుగుతున్నాయి.
బీఫ్ అంటే ఆవుమాసం మాత్రమే కాదు. గేదె, దున్నపోతు,
ఎద్దు, ఆవు తదితర మాంసాల్ని కలిపి బీఫ్ అంటారు. సాధారణంగా భారత మార్కెట్లలో
దొరికేది మొదటి మూడు మాంసాలే. బీఫ్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో వున్న దేశాల్లో భారత
దేశం ఒకటి. ఆ ఎగుమతి సంస్థల్లో అత్యధిక భాగం ముస్లిమేతరుల ఆధీనంలోనే వున్నాయి.
దేశంలోని దళిత, ముస్లీం సమాజాల్లో బీఫ్ తినే
సాంప్రదాయం వుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, బీఫ్ తినడం ముస్లింలకు
ధార్మిక విధి ఏమీకాదు. కేవలం ఇష్టాఇష్టాలకు సంబంధించిన అంశం. భారత ముస్లిం కుటుంబాలలో
60 శాతం బీఫ్ తినరు. మిగిలిన 40 శాతం కూడా
పేదరికం కారణంగా మటన్ కొనుక్కోలేక బీఫ్ తింటారని ఆర్ధిక, సాంస్కృతిక పరిశోధనలు
చెపుతున్నాయి. పేదవాళ్ళకు చవకగా దొరికే
మాంసాహారం గొడ్డుమాంసమే. ఏదో ఒక విధంగా ముస్లింలను దోషులుగా ప్రచారం చేయాలనే
దురుద్దేశ్యమే తప్ప నిజానిజాలను అర్ధంచేసుకునే స్థితి ఎక్కడా కనిపించడంలేదు.
ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ దుష్ప్రచారం నిజానికి కేంద్రంలోని అధికార పార్టీ ప్రాయొజిత కార్యక్రమంగానే
సాగుతున్నది. దాడులు, హత్యలు కొనసాగిస్తున్నవారిలో
బీజేపి, భజరంగ్ దళ్, విశ్వహిందూపరిషత్ కార్యకర్తలే ఎక్కువ మంది వుండడం విశేషం.
ఇలాంటి గోగ్రవాదుల మూక దాడులు ముడేళ్ళ క్రితం వరకూ ఒకటి రెండే
నమోదు అయ్యాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక గడిచిన మూడేళ్ళలో ఇలాంటి
దాడులకు సంబంధించిన కేసులు 63 నమోదయ్యాయి. వీటిల్లో 28 మంది చనిపోగా, కొన్ని వందల
మంది తీవ్రగాయాల పాలయ్యారు. హతుల్లో 24 మంది ముస్లింలు కాగా, నలుగురు దళితులు.
ముస్లిముల తరువాత గోగ్రవాదుల లక్ష్యం దళితులే అని ఈ గణాంకాలు చెపుతున్నాయి.
బయటికి వెళ్ళినవాళ్ళు ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం లేని ఒక అభద్రతా వాతావరణంలో ఈరోజు భారత ముస్లింలు బతుకుతున్నారు. రంజాన్ పండుగకు రెండు రోజులు
ముందు దేశరాజధాని సరిహద్దుల్లో ఓ పదహారేళ్ళ యువకుడిని రైల్లో కూర్చోవడానికి సీటు కోసం తగవుపడి
చంపేశారు. గతవారం ఝార్ఖండ్, అస్సామ్ రాష్ట్రాల్లో
ఇద్దర్ని రోడ్డు మీద అడ్డగించి చంపేశారు. ఈవారం కూడా దేశంలో
ఎక్కడో ఒకచోట ఇలాంటిది జరగలేదని చెప్పలేని పరిస్థితిలొ
మనం వున్నాం.
బీఫ్ అనగానే ఏ మాంసమో తేల్చుకోకుండానే, ఆవుమాసం అనే
నిర్ణయం చేసేసి, ఇంట్లో బీఫ్
పెట్టుకున్నారంటూనో, స్కూటరులోనో, కారులోనో
బీఫ్ వుందంటూనో పాతిక ముఫ్ఫై మంది గుంపు తాము గోరక్షులమంటూ దారి కాచి దాడులు చేసేస్తున్నాయి.
నీ దగ్గర గొడ్డు మాసం వుందంటున్నాయి. లేదని డిక్కీ విప్పి చూపినా నమ్మడంలేదు. “ఈరోజు కాజపోతే నిన్న తిని వుంటావు?” “అప్పుడు
తినక పోయినా … మీకు తినే సాంప్రదాయం వుందిగా” అని నిందిస్తూ చంపేస్తున్నారు గో-ఉగ్రవాదులు! ఆరోపణ వారిదే, తీర్పూ వారిదే, తీర్పును అమలు చేసేపనీ వారిదే. విచారణలేదు, నిజ నిర్ధారణలేదు. అడిగేవాడూ లేడు.
గోగ్రవాదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోంది. మహాత్మా గాంధీజీ నివశించిన సబర్మతీ ఆశ్రమంలో చరఖా మీద నూలు వడుకుతూ ప్రధాని మోదీజీ ఈ గోగ్రవాదులకు హెచ్చరికలు జారీచేశారు. దేశంలో కొన్ని అరాచకశక్తులు గో-రక్షకుల
పేరున దుకాణలు తెరిచి కూర్చున్నాయని ఇంకో సందర్భంలో వాళ్లను తీవ్రంగా విమర్శించారు. క్షేత్ర
స్థాయిలో వాస్తవాలు ప్రధాని హెచ్చరికలకు భిన్నంగా వున్నాయి. ప్రధాని పార్టీ కార్యకర్తలే మూక దాడుల్లో కీలక పాత్ర వహిస్తున్నారు.
గోగ్రవాదుల్ని కేసుల నుండి తప్పించడానికి బీజేపికి చెందిన న్యాయవాదులు, హిందూత్వ
అభిమానులైన పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు
చివరకు న్యాయమూర్తులు సహితం తమ వంతు కరసేవ చేస్తున్నారు.
దేశంలోని ఒక సామాజికవర్గం మీద ఇంతటి వివక్షతో ప్రభుత్వ ప్రాయోజిత అనైతిక దాడి జరుగుతున్నప్పుడు
ఆలోచనాపరులందరూ తరతమ బేధాలు లేకుండా ఖండించాలి. ముస్లింలు, దళితులు, ఆదివాసులు మాత్రమేగాక, అణగారిన కులాలు, ఉదార, లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, పౌరహక్కుల, మానవ హక్కుల వాదులు అందరూ కలిసి ఒక్క గొంతుకతో నినదించాల్సిన చారిత్రక సందర్భం ఇది.
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్ – 9010757776
హైదరాబాద్, 9 జులై 2017
ప్రచురణ :
మన తెలంగాణ, 11 జులై 2017