Wednesday, 19 July 2017

MADARASA LAMB

MADARASA LAMB  
మదర్సా మేకపిల్ల
ఉషా యస్ డానీ

         
కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందం నుండి ట్రంప్ గారి అమెరికా తప్పుకున్నాక,

భూతాపం పెరిగి మాననజాతి మొత్తం అంతరించిపోయాక,

భూగ్రహం తోడేళ్లలోకంగా మారిపోయాక-

మన కథ మొదలయింది.



భూమి మీద మనుషులు వున్న రోజుల్లో  ఏలినవారు స్వాతంత్ర్యదినం, వంటి పండగలు చేసుకునేవారు. బీదాబిక్కి జనం కార్మికదినం వంటి పండగలు చేసుకునేవారు.

మనుషులు చచ్చి తోడేళ్ళ రాజ్యం వచ్చినా పండగల  నియమం మారలేదు. తోడేళ్ళ పండగలు జాతీయ దర్పంగా మారాయి. మేకల పండగలు అజ్ఞాతానికి వెళ్ళిపోయాయి 

          అయినా దేశంలో తోడేళ్ళు తినేయగా మిగిలిన మేకలకు తమ పండగలు చేసుకోవాలనే సరదా మనసులో ఎక్కడో దాగివుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి, మేకలు పండగలు చేసుకోరాదని తోడేళ్ళ రాజు ఎప్పుడూ అనలేదు. అయినా, పండగలు చేసుకోవాలంటే మేకలకు చచ్చేంత భయం.    

అలా ఒకసారి మేకలకు ఓ పండగ వచ్చింది. పెద్ద మేకలకు అనుభవం ఎక్కువ గాబట్టి ముందు జాగ్రత్తగా పండగ వద్దనుకున్నాయి. పిల్లమేకలకు అనుభవం లేదు గాబట్టి సరదాగా పండుగ చేసుకుందా మనుకున్నాయి.

పండుగ ముందు రోజు  ఖద్దౌలీ నుండి  నాలుగు తెల్లటి పిల్లమేకలు పొద్దున్నే టిఫిన్ బాక్సుల్లో రెండు కట్టలు గడ్డి కట్టుకుని ఢిల్లీ  వెళ్ళాయి.
 
ఖద్దౌలీ గ్రామం  ఫరీదాబాద్ లో వుందిఫరీదాబాద్ జిల్లా హర్యాణాలో వుంది. హర్యాణా రాష్ట్రం పరువు మర్యాదలకు ధర్మభూమిగా వుంది.

ఢిల్లీ చాందినీ చౌక్ లో కొత్త బట్టలు కొనుక్కుని, ఇంటి నుండి తెచ్చుకున్న గడ్డిని ఎర్రకోట ముందు నిలబడి తిని,  హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ లో గుక్కెడు నీళ్ళు  తాగి మథుర ప్యాసింజరు ఎక్కాయి ఆ తెల్లటి పిల్ల మేకలు.

అప్పుడు దేవుడు మంచి మూడ్ లో వున్నట్టున్నాడు. నిండా తోడేళ్ళున్న రైల్లోనూ పిల్లమేకలు నాలుగూ సర్దుకు కూర్చోవడానికి కొంచెం జాగా చూపించాడు.

పిల్ల మేకల ఆనందానికి హద్దులు లేవు. కొత్త బట్టల క్యారీ బ్యాగులు జాగ్రత్తగా ఒళ్ళో పెట్టుకుని, చేతుల్లో ఖాళీ టిఫిన్ బాక్సులు పట్టుకుని దేవునికి ధన్యవాదాలు చెప్పుకున్నాయి.  

తోడేళ్ళ రాజ్యంలో మేకలకు దేవుడే దిక్కు. ఎప్పుడయినా తినడానికి ఇంత తిండి దొరికినా, తాగడానికి ఇంత నీళ్ళు దొరికినా, చివరకు పీల్చడానికి ఇంత గాలి దొరికినా అవి తలపైకెత్తి  దేవుడు గొప్పవాడుఅంటాయి.

లోకంలో దురదృష్టవంతుల ఆనందం ఎక్కువ సేపు నిలవదు. పది నిమిషాల్లో ఓఖ్లా స్టేషన్ వచ్చేసింది. పెట్టెలోనికి ఒక పెద్ద తోడేళ్ల గుంపు ఎక్కింది.  పెట్టెలో సీట్లు లేకపోవడంతో ఆ గుంపులోని తోడేళ్ళు అటూ ఇటూ చూశాయిఎక్కడా జాగా కనిపించలేదు.

బండి కదిలి వేగాన్ని పుంజుకుంది.

నిలబడి ప్రయాణం చేస్తున్న కొత్త తోడేళ్ల గుంపుకు  ఓ మూల నక్కి కూర్చున్న పిల్ల మేకలు కనిపించాయి.  

మేకపిల్లలు సీట్లలో కూర్చోవడం తోడేళ్ళకు నచ్చలేదు. మేకల ముందు తాము నిలబడి వుండడం నచ్చలేదు. మేకలు తెల్లగా వుండడం నచ్చలేదు. వాటికి చిన్నగా గడ్డాలు వుండడం నచ్చలేదు. మేకల ఒళ్ళో కొత్తబట్టలు వుండడం నచ్చలేదు. టోటల్ గా ఆ రైలులో  మేకలు వుండడం నచ్చలేదు.

ఇంతలో రైలు తుగ్లకాబాద్ దాటి ఫరీదాబాద్ చేరుకుంది. బండి ఢిల్లీ సరిహద్దు దాటి హర్యాణాలో ప్రవేశించింది. హర్యాణా గాలిసోకగానే తోడేళ్ళ గుంపుకు పరువు ప్రతిష్టలు గుర్తుకొచ్చాయి.

హర్యాణా తోడేళ్ళకు ప్రాణంకన్నా పరువు మిన్న అని చెప్పుకుంటారు. అంటే పరువు కోసం అవి చచ్చిపోతాయని కాదు; చంపేస్తాయి అని

తోడేళ్ల రాజ్యంలో మేకలు  సీట్లో కూర్చోగా తోడేళ్ళు నిలబడి ప్రయాణం చేయడం ఎంత అప్రదిష్ట? ఎంత నామోషీ? అదీ హర్యాణాలో!

కొత్తగా బండి ఎక్కిన తోడేళ్ళ గుంపుకు ఒక్కసారిగా అసహనం ముంచుకొచ్చింది.

పరువు పూనకంలా మారడంతో ఆ గుంపులోని నాయక తోడేలు ఒకటి బోర విరుచుకుంటూ పిల్ల మేకల దగ్గరికి వెళ్ళి  నిలబడింది. పిల్లమేకలు కంగారుగా చూశాయి.  ఆ కంగారులో ఓ మేకపిల్ల తన ఒళ్ళోపెట్టుకున్న కొత్త బట్టల్నీ,  ఖాళీ టిఫిన్ బాక్సును  కింద పడేసుకుంది. 

లెగండ్రాఅని గద్దించింది బోరతోడేలు.

పిల్ల మేకలకు ఏమీ అర్ధం కాలేదు. అవి బిత్తరపోయి ఆ బోరతోడేలు కేసి చూశాయి.

లెగండ్రా. ఇవి మా రిజర్వుడు సీట్లుఅని గద్దించింది.

ఆ మేకపిల్లలు కూర్చున్న  బల్ల ఒక్కసారి అదిరిందిపిల్ల మేకలు మరింత కంగారు పడ్డాయి.

పెట్టెలోవున్న తోడేళ్ళన్నీ ముసిముసిగా నవ్వేయి.
తోడేళ్ళకు నవ్వు వచ్చినా ఊళ వేస్తాయి. కోపం వచ్చినా ఊళ వేస్తాయి.

ఆ నలుగురిలో అందరికన్నా చిన్నదయిన బుజ్జి మేకపిల్ల కొంచెం ధైర్యం చేసి గొంతు సవరించుకుంది.    

వ్హాట్ రిజర్వేషన్? దిసీజ్ పాసింజర్ ట్రైన్. అండ్ దిస్ ఒన్ ఈజ్ జనరల్ కంపార్ట్ మెంట్అంది

ఈసారి  రైలుపెట్టే అదిరింది.

మేకలకు చదువు అబ్బదని తోడేళ్లకు గట్టినమ్మకం. మేకపిల్లలకు ఈమధ్య మదర్సాల్లో ఇంగ్లీషు కూడా నేర్పుతున్నట్టు వాటికి ఇన్ఫర్మేషన్ లేదు.

బోరతోడేలుకు చిర్రెత్తుకొచ్చింది. తోడేలు ముందు మేకపిల్ల నోరు తెరచి మాట్లాడడమే నేరం. తర్కం  మాట్లాడడం  ఇంకా పెద్ద నేరం. ఇంగ్లీషులో మాట్లాడడం ఇంకాఇంకా పెద్ద నేరం.

ఒక బుజ్జి మేకపిల్ల ఇన్ని నేరాలు ఒక్కసారిగా చేసేస్తుంటే   ఆ బోర తోడేలుకు పట్టరానంత కోపం వచ్చింది.

లోకంలో ఎవరి రాజ్యంలో వాళ్ళు నేరాలు చేసుకుంటారు. అది రివాజు. అలాగే తోడేళ్ళ రాజ్యంలో తోడేళ్ళే నేరాలు చేసుకుంటాయి. అది సాంప్రదాయం. కానీ, తోడేళ్ళ రాజ్యంలో  మేకలు నేరాలు చేస్తానంటే మాత్రం కుదరదుఅది చట్టం.

రేయ్పిల్ల మేకా! ప్యాసింజర్ రైల్లో సీట్లే కాదురా ఈ రాజ్యంలో ప్రతీదీ  తోడేళ్లకే రిజర్వ్ చేసిపెట్టారురాఅని జ్ఞానబోధ చేసింది బోరతోడేలు.

వివాదం ముదురుతున్నట్టు పిల్లమేకలకు నెమ్మదిగా అర్ధమయింది. సీట్లు వదిలేద్దాం అన్నట్టు ఆ  పిల్ల మేకల్లో పెద్ద మేక మిగిలిన పిల్ల మేకలకు సౌంజ్ఞలు చేసింది. వెంటనే ఇంకో రెండు పిల్లమేకలు బట్టల సంచులు, టిఫిన్ బాక్సులు పట్టుకుని లేచి నిలబడ్డాయి.  

బుజ్జి పిల్లమేక లేవలేదు. బట్టల క్యారీ బ్యాగ్ ను, టిఫిన్ బాక్సును ఒళ్ళో గట్టిగా అదిమి పట్టుకుని కూర్చుంది.

అవమానం చిత్రమైన బాక్టీరియా లాంటిది. చదువుకోని మొద్దులకు అవమానం జరిగినా జరిగినట్టే తెలీదు. చదువుకున్న సున్నితులకు మాత్రం  అవమానం జరక్కముందే జరుగబోతున్నట్టు తెలిసిపోతుంది. బుజ్జి పిల్లమేక చదువుకోవడం తప్పయింది. తనకు అవమానం జరిగిందని దానికి అర్ధం అయింది. అది లేవనని మొండికేసింది

“సార్ !  మీకు సీట్లేగా కావలసిందీ? మా ముగ్గురి సీట్లో మీరే కూర్చోండి” అంది ఆ  పిల్లమేకల్లో పెద్ద మేక.

అప్పుడయినా ఆ బోరతోడేలు శాంతిస్తుందని పెద్ద మేకపిల్ల  అనుకుంది. కానీ, శాంతి ప్రతిపాదన బోరతోడేలుకు నచ్చలేదు.
అది బిగ్గరగా నవ్వింది.

“ తోడేళ్ళ రైలులో  ఒక మేక పిల్ల ఒక తోడేలుకు సీట్లు దానం చేస్తుందట!”  అంటూ అది ఇంకోసారి నవ్వింది.  

మూడు సీట్లు దక్కినందుకు దానికి ఏమాత్రం ఆనందంగాలేదు. ఆ బుజ్జిమేక పిల్ల అదురూ బెదురూ లేకుండా కూర్చోవడం దానికి అవమానంగా వుంది.

లేవరాబోరతోడేలు గట్టిగా ఊళ వేసింది

తోడేళ్ళు అంత గట్టిగా ఊళవేస్తే కొమ్ములు తిరిగిన పెద్దపెద్ద మేకలే భయంతో వణికిపోతాయి. కానీ బుజ్జి మేకపిల్ల తొణకలేదు.
 లేవనుఅంది.  

బుజ్జి మేకపిల్ల మొండి ధైర్యానికి మిగిలిన మూడు మేకపిల్లలు కంగారు పడ్డాయి.

హర్యాణా నేల మీద ఆ రైలుపెట్టెలో  బోరతోడేలు పరువుపోయింది
క పెద్ద తోడేలుకు ఒక పిల్లమేక ఎదిరించి జవాబు చెప్పేసింది.

తను అవమానిద్దామనుకున్నమేకపిల్లే తనను అవమానించడంతో బోరతోడేలు ఖంగు తిన్నది. తన గుంపు మనోభావాలను  తెలుసుకోవడానికి అది ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. బోరతోడేలుతో వచ్చిన  గుంపుతోపాటు పెట్టెలో వున్న తోడేళ్ళన్నీ ధర్మం దారి తప్పినట్టు  ఆవేశంతో ఊగిపోతున్నాయి.

దారితప్పిన ధర్మాన్ని తిరిగి పట్టాలు ఎక్కించే బాధ్యత ఇప్పుడు తన భుజాల మీదే వుందనుకుంది బోరతోడేలు. ఇక ఆ బుజ్జి మేకపిల్ల పని పట్టాలనుకుంది. రిజర్వేషన్ పాచిక పారక పోవడంతో కొత్త పాచికను బయటికి తీసింది.

తోడేళ్ళకు తెలివి తక్కువగానూ అతితెలివి ఎక్కువగానూ వుంటుంది. అలాగే తర్కం తక్కువగానూ కుతర్కం ఎక్కువగానూ వుంటుంది.

ఆ టిఫిన్ బాక్సు మూత తీసి చూపించుఅంది అధికార స్వరంతో.
తోడేళ్ళ రాజ్యంలో ప్రతితోడేలు తానే ఒక పోలీసు అనుకుంటుంది.
దేనికీ?” అనడిగింది బుజ్జి మేకపిల్ల.
నేను చూడాలి
బోరతోడేలు వైపు బుజ్జి పిల్లమేక తీక్షణంగా చూసింది.
కొన్ని సందర్భాల్లో కొన్ని చూపులకు చాలా అర్ధాలు వుంటాయి. కొందరు నోరు మెదపకుండానే చాలా మాట్లాడేస్తారు.
 “నా టిఫిన్ బాక్సు చూడ్డానికి నువ్వెవరుచెకింగ్ అధికారివాఐడెంటిటీ కార్డు వుందా? వుంటే చూపించువగయిరా పది ప్రశ్నలు వరుసపెట్టి అడిగేశాయి ఆ బుజ్జి మేకపిల్ల చూపులు.
ఆ చూపుల్ని బోరతోడేలు తట్టుకోలేకపోయింది.
దానికి ఉక్రోషం పొంగుకొచ్చింది.

ఏముంది అందులో?” మళ్ళీ గదమాయించింది.
మా భోజనం
మాంసమా?”
మేము మాసం తినం
మీ నాన్న తినేవాడా
మా నాన్న కూడా తినడు

రైలు ఫరీదాబాద్ న్యూటౌన్ స్టేషన్ లో ఆగింది.
పెట్టెలో ఉత్కంఠ పెరిగి ఉద్రిక్తంగా మారింది.

మరో డజను తోడేళ్ళు ఆ పెట్టెలో ఎక్కాయి. బోరతోడేలుకు మందిబలం అంతకంతకూ పెరుగుతోంది. బుజ్జిమేకపిల్ల జట్టుబలం అంతకంతకూ తగ్గుతోంది.

పోనీ మీ తాత, వాడూ కాకపోతే మీ ముత్తాత, వాడూ కాకపోతే వాళ్ల తాత. మాంసం తినేవారా? కాదా?” గట్టిగా ఊళవేస్తూ  అడిగింది బోరతోడేలు.

మేకలు ఎప్పుడూ మాంసం తినవు. మేక మాంసాన్నే తోడేళ్ళు తింటాయిఅనేసింది బుజ్జి మేకపిల్ల.

రైలు పెద్ద కుదుపుతో బయలుదేరింది.

బోరతోడేలు బిత్తరపోయింది. ఇంత చిన్న మేకపిల్ల అంత పెద్ద మాట అనేస్తుందని అది అనుకోలేదు. తన మీదే కాదు ఏకంగా తోడేలు జాతి మీదే నింద వేసేసింది ఓ పిల్లమేక.

హర్యాణా గాలిని ఛాతీ నిండా గట్టిగా పీల్చుకుని నిటారుగా నిలబడింది బోరతోడేలు. దాని ఛాతీ అసలే అరవై అంగుళాలు. కొలవాలంటే ఒక టేపు పూర్తిగా కావాలి.

మాటల యుధ్ధంలో గెలవలేనపుడు తోడేళ్ళు ఈటెల యుధ్ధం మొదలెడతాయి.
ముంచుకు వచ్చేస్తున్న ప్రమాదాన్ని మిగతా  మేకపిల్లలు పసికట్టాయి. బుజ్జి మేకపిల్ల చేయిపట్టుకుని డోరు వైపుకు లాక్కెళ్ళిపోయాయి.  

ఆ కంగారులో అవి ఢిల్లీలో కొన్న పండగ బట్టల్నీ, ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ బాక్సుల్ని కూడా పెట్టెలో వదిలేశాయి. వేగాన్ని పుంజుకుంటున్న రైల్లో నుండి వేగంగా దిగిపోయి అంతే వేగంగా వెనక పెట్టెలోకి ఎక్కేశాయి.

కొత్తపెట్టెలో కూర్చోవడానికి సీటు దొరక్కపోయినా తలదాచుకోవడానికి ఇంత చోటు దొరికింది. గండం గడిచినందుకు ఆ నాలుగు పిల్లమేకలూ గట్టిగా ఊపిరి పీల్చుకుని ఒక్కసారి నిట్టూర్చాయి. తల పైకెత్తి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి.

దేవుడు గొప్పవాడు అనడానికి మేకలు  అల్లాహో అక్బర్అంటాయి

లోకంలో ఎవరి భాష వారికి వుంటుంది. తోడేళ్ళ భాష మేకలకు అర్థం కాదు. మేకల భాష తోడేళ్ళకు అర్థంకాదు. మేకలు దేవుడ్ని తలుచుకున్నప్పుడల్లా తోడేళ్ళకు తెగ అసహనంగా వుంటుంది.  రాజ్యంలో మళ్ళీ అక్బర్ చక్రవర్తి పాలన రావాలని మేకలు కోరుకుంటున్నట్టు  తోడేళ్ళకు అనుమానం వస్తుంది.   

పరుగెత్తుకు  వచ్చిన ఆయాసం తీరేలోగానే మేకపిల్లలకు మరో ఆపద ముంచుకు వచ్చింది. ఆ పెట్టెలోనూ నిండా తోడేళ్ళే వున్నాయి. తోడేళ్ళ ముందు మేకలు తమ దేవుడ్ని తలుచుకోవడం ఎంత పెద్ద తప్పో  ఆ  పిల్ల మేకల్లో పెద్ద మేకకు గుర్తుకు వచ్చింది.

వచ్చేది బల్లభ్ ఘర్. మనం అక్కడ దిగిపోయి అసౌటీ వరకు నడిచిపోదాం. పది కిలోమీటర్లు. అయినాపరవాలేదుఅంది ఆ  పిల్ల మేకల్లో పెద్ద మేక. మిగతా మేకపిల్లలు సరేనంటూ తలాడించాయి.

 అది చాలా జాగ్రత్తలు తీసుకునే తన మాటలు ఇతర ప్యాసింజర్లకు వినపడకుండా చాలా నెమ్మదిగా చెప్పింది. అయితే, తోడేళ్ళకు మేకల లిప్ రీడింగు వచ్చని దానికి తెలియదు.

బల్లభ్ ఘర్ వచ్చేసింది. బండి పూర్తిగా ఆగక ముందే మూడు పిల్లమేకలు రైలు దిగేశాయి. బుజ్జి మేకపిల్ల రైలు దిగబోతుండగా ముందు కంపార్టుమెంటులోని తోడేళ్ళ గుంపు అక్కడికి వచ్చేసి వాళ్ళను చుట్టు ముట్టింది.

పది తోడేళ్ళు బుజ్జి మేకపిల్ల రెక్కలు పట్టి గాల్లోకి ఎత్తి తమ పెట్టెలోకి విసిరి పడేశాయి

ప్లాట్ ఫామ్ మీదున్న  మూడు పిల్లమేకలు భయపడిపోయి మే...మే.. అంటూ అరవడం మొదలెట్టాయి. పిల్ల మేకల్లో పెద్ద మేక పిల్ల పరుగు పరుగున వెళ్ళి అక్కడే నిలబడివున్న రైల్వే పోలీసుకు కంగారు కంగారుగా విషయం చెప్పింది.  బుజ్జి మేకపిల్లను కాపాడమని బతిమిలాడింది. మిగిలిన రెండు మేక పిల్లలు కూడా వచ్చి  రైల్వే పోలీసు కాళ్ళు పట్టుకుని ఏడ్వడం మొదలెట్టాయి.

రైల్వే పోలీసు అధికారి దుస్తుల్లోవున్న తోడేలు ఆ మేకపిల్లల్ని చూస్తూ చిద్విలాసంగా ఊళ వేసింది.
ఈలోగా రైలుబండి కూడా ఊళ వేసుకుంటూ  బయలు దేరింది.

మూడు పిల్లమేకలు యూనిఫామ్ లో వున్న తోడేలు దగ్గర వుండిపోయాయి.
బుజ్జి మేకపిల్ల పౌరదుస్తుల్లో వున్న తోడేళ్ళ మధ్య వుండిపోయింది.   

బండి వేగాన్ని పుంజుకుంది.
పరువుపోయిన రైల్లోనే  పరువు నిలబెట్టుకోవాలనుకుంది బోర తోడేలు.
శక్తి మేరకు దవడల్నితెరిచి నాలుకను బయటపెట్టి కోరలు చాచింది.

బుజ్జి మేకపిల్ల నిస్సహాయంగా తల దించుకుని నిలబడింది.

ప్రాణభయంతో వేట విలవిల్లాడుతున్నప్పుడు తోడేళ్లకు మహదానందంగా వుంటుంది. అలాంటి ఆనందాతిశయంతో చుట్టూ నిలబడిన సాటి తోడేళ్ళను ఒకసారి చూసింది బోరతోడేలు.

నువ్వు ధర్మాన్ని కాపాడు. ధర్మం నిన్ను కాపాడుతుందిఅంటూ గొంతు కలిపి ఊళలు వేయడం మొదలెట్టాయి పెట్టెలోని తోడేళ్ళు.

ఖాకీ దుస్తులేసుకుని పోలీసు అధికారులుగా వున్నా, నల్లగౌను తొడుక్కొని న్యాయమూర్తులుగా వున్నా, సూటు బూట్లేసుకుని జిల్లా కలక్టరుగా వున్నా,  మామూలు దుస్తులేసుకుని ప్రయాణికుల్లా వున్నా తోడేళ్ళ రాజ్యంలో అన్ని వేషాల్లోనూ తోడేళ్ళే వుంటాయి.

అయితే, తోడేళ్ళలోనూ కొన్ని మంచి తోడేళ్ళు వుంటాయి.  కానీ, ఆ జాతి తోడేళ్ళు ఇప్పుడు మేకలకన్నా వేగంగా అంతరించి పోతున్నాయిఅలాంటి తోడేలు  ఆ రోజు ఆ పెట్టెలో ఒక్కటీ లేదు.

ఒకడ్ని చంపితే హత్య, వంద మందిని చంపితే యుధ్ధం అని మధ్యయుగాల రాజులు అనుకునేవారు.
ఇప్పుడు కూడా చట్టాలు  పెద్దగా మారలేదు.
ఒక్కడే వెళ్ళి ఒకడ్ని చంపితే హత్య అవుతుంది.
వందమంది గుంపుగా వెళ్ళి ఒకడ్ని చంపితే దొమ్మి అవుతుంది
దొమ్మీ హత్యల్లో నేరం తక్కువ, శిక్ష తక్కువ, ఫలితం ఎక్కువ.

రైలు ఇంకా వేగాన్ని పుంజుకుంది. ఇంన్ గట్టిగా ఊళ వేస్తోంది.

బుజ్జి మేకపిల్లను రెండు చేతులతో గాల్లోకి  ఎత్తి, కోరలు చాచి, నోటి దగ్గరికి తీసుకుంది బోరతోడేలు.

మృత్యుకోరల్లో చిక్కుకున్న ఆ పిల్లమేక ముందుకాళ్ళ చిట్టి గిట్టలతో గట్టిగా కళ్ళు మూసుకుంది.
పండగ కోసం తల్లి మేక పెట్టిన గోరింటాకు  దాని చిన్ని గిట్టల మీద ఎర్రగా మెరుస్తోంది.
కొందరు భయం వేసినపుడు కళ్ళు మూసుకుంటారు.
కొందరు చిత్రహింసల్నితట్టుకోలేక కళ్ళు మూసుకుంటారు.
కానీ, భూమి మీద రాక్షసత్త్వాన్ని చూడలేక బుజ్జి మేకపిల్ల కళ్ళు మూసుకుంది.

తోడేళ్ళ రాజ్యంలో తోడేళ్ళ ధర్మం మాత్రమే వుంటుంది.

పెట్టెలోని తోడేళ్ళన్నీ కోరలు చాచి, నాలుకల్ని బయటపెట్టి, ఊళ వేస్తూ బోరతోడేలు చుట్టూ మూగాయి.

ఆ తరువాత ఏం జరిగిందో ....
ఆ రైలు వేగంలో కనిపించలేదు.
ఆ తోడేళ్ళ  ఊళల్లో వినిపించలేదు.

ఆ తరువాతి స్టేషన్ అసోటీ.

వంటి నిండా గాయాలతో నెత్తుటి ముద్దలా మారిన బుజ్జి మేకపిల్ల విసిరిన బంతిలా వచ్చి ప్లాట్ ఫామ్ మీద దబాలున పడింది.

మంచి తోడేలు ఒక్కటయినా ఆ ప్లాట్ ఫామ్ మీద కనిపిస్తుందన్న ఆశతో అది కళ్ళు పెద్దగా చేసి చూసింది.  రెండు మంచి తోడేళ్ళు అక్కడికి   చేరుకున్నాయిగానీ ఈలోపే బుజ్జిమేకపిల్ల కళ్ళు తెరిచే ప్రాణాలు వదిలింది.  

నేర పరిశోధన అధికారులకు ఇప్పుడు ఒకటే సందేహం;
బుజ్జి మేకపిల్ల రైల్లో చచ్చి, ప్లాట్ ఫామ్ మీద పడిందా?
రైల్లో నుండి పడి, ప్లాట్ ఫామ్ తగిలి చచ్చిందా? అని

అలాంటి సందేహాలులేని తోడేళ్ళ బండి గట్టిగా ఊళ వేసుకుంటూ ముందుకు సాగిపోయింది.

హైదరాబాద్

6 జులై 2017 

20 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. MADARSA MEKAPILLA
    Pre-Publication Views

    1. Pasunuri Ravunder
    రాజ్యం తోడేళ్ల ప్రతినిధిగా మారినప్పుడు అమాయకపు మేకపిల్లలు బలవుతూనే ఉంటాయి. గడిచిన మూడేళ్లలో ఇలా ఎన్ని మేక పిల్లలు నేలరాలాయో లెక్కేలేదు.
    మనిషి ప్రజాస్వామ్యం కంటే జంతుప్రజాస్వామ్యమే మతోన్మాద తోడేళ్లకు ముఖ్యమవుతున్నది. స్టేట్ బ్రూటల్నెస్ను సింబాలిక్గా చెప్పిన తీరు నచ్చింది.
    కథ ఆద్యాంతం సింబాలిక్గా సాగడంతో పాటు ఆధిపత్య శక్తుల పెత్తనాన్ని, బాధిత సమూహాల నిస్సాహయతను ఏకకాలంలో ఏకరువు పెట్టిందీ కథ.
    కథ నడిపిన తీరు బాగుంది. పాత్రల్లోకి రచయిత పరకాయ ప్రవేశం చేసి రాయడం బాగుంది. ఈ కథా రచయితకు రాజ్యస్వభావంతో పాటు చరిత్ర పట్ల, చట్టాల పట్ల యుద్ధనీతి పట్ల ఉన్న విశాల అవగాహనకు తోడు వర్తమాన రాజకీయ పరిస్థితుల పట్ల ఉన్న ప్రజాస్వామ్య దృక్పథాన్ని ఈ కథలోని ఇతివృత్తం పట్టిస్తున్నది.
    అధికారంలో ఉన్న పాలకుల అండతో పెట్రేగి పోతున్న ఫాసిస్టు శక్తుల దుర్మార్గాన్ని ఎత్తిచూపుతున్న కథ ఇది.మతం ముసుగులో ఏం చేసిన చెల్లుతుందనే తిరోగమన శక్తులకు చెంపపెట్టు ఈ కథ.
    కంగ్రాట్స్ అన్న...

    -డా. పసునూరి రవీందర్
    కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కార గ్రహీత.

    ReplyDelete
  3. 2. Afsar Mohammad
    Danny Bhai, thank you so much for sharing the story. It's an excellent piece and really enjoyed Daనny's mark of satire and critical thinking...congrats for a great work!

    Danny bhay katha raaste adi nelarojula paatu mallee mallee chaduvukoni, nemaresukune jnaapakam! Bujji meka pilla nenu naa prayaanaala hadaavudilo vindi koodaa chadavakundaa vundaleka poyaanu. Aa koradaa debbala charupulu, Danny sailee vinootna merupulu marosaari challu challu annaayi

    ReplyDelete
  4. 3. Johnson Choragudi
    డాని గారు
    కధనం చాలా బావుంది.
    మేక ప్రతీక వల్ల-
    కధలో క్రమంగా ఒక ప్యాథోస్ క్రియేట్ అయింది.
    కధ ఒక ఆశావహ సంకేతంతో ముగిస్తే బావుంటుంది.
    అది ట్రాజడీ కావడానికి వీల్లేదు.
    ఒకవేళ ఇప్పుడు అయినప్పటికి,
    భవిష్యత్తుకు ఒక భరోసా మనం ఇవ్వకపోతే ఎలా?
    -చోరగుడి

    ReplyDelete
  5. 4. Bharadwaja Rangavajhjhala
    అవసరమైన సమయంలో రాసిన అత్యవసరమైన కథ ఇది. రెండు మూడు తోడేళ్ల డైలాగులు మా నందమూరి వంశాన్ని గుర్తుకు తెచ్చి మనోబావాలు దెబ్బతీసినప్పటికిన్నీ ... దీని అవసరం చాలా ఉండడం చేత అవన్నీ పక్కన పెట్టి అద్భుతం అని అనక తప్పడం లేదు ..

    ReplyDelete
  6. 5. Sharief Vempalli
    అద్భుతం. వర్తమానంలో భవిష్యత్తులో సాయిబూల పరిస్థితి ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టిన కథ. గ్రేట్

    ReplyDelete
  7. 6. Vasantha Lakshmi
    Very touching Dany. Humour, Sarcasm, Criticism అన్నీ సమపాళ్లలో ఉన్నాయి……… తెలుగు న్యూస్పేపర్స్ అయితే వేసుకోకపోవచ్చు.

    ReplyDelete
  8. 7. Sharief Vempalli
    ఇప్పుడే డానీ కథ "మదర్సా మేకపిల్ల" మరోసారి చదివాను.
    ఒక మైనార్టీగా ఆ కథ నాకొక గగుర్పాటు.

    ReplyDelete
  9. 8. Abdul Wahed
    చాలా బాగుంది. ప్రచురణకు పంపండి.

    9. Srivatsa Gadiyaram
    కథనం బాగుంది కానీ అన్నీ తోడేళ్ళయ్యాక ఇక కథేముంది.వ్యథ తప్ప

    ReplyDelete
  10. 10. Jaha Aara
    Mee kadha Chala bagundi sir.... You have documented the Muslim lynching in Telugu literature....which is demand of the hour. ... …… Climax lo vishadam baga establish ayyedi.

    ReplyDelete
  11. 11. Sreeramamurthy Gara (Nijnam)
    chala bagundi sir

    ReplyDelete
  12. 12. Anwar, Warangal
    కథ టెర్రిఫిక్ గా ఉంది. ఫైరింగ్!
    ఎన్ని కథలు రాశారు సర్
    కథలో ఊపు ఊపేసిందెలు
    ఊపేసిండ్లు
    పవర్ఫుల్ పొలిటికల్ స్టోరీ

    ReplyDelete
  13. 13. Santhi Sri
    చదివాను.. నడుస్తున్న చరిత్ర నడిచే రైలులో కళ్లకు కట్టారు.. మేకపిల్లను చంపేయడం నాకు నచ్చలేదు.. చిన్న మేకపిల్ల అయినా తిరగబడేలా.. మేకలన్నీ కలిసికట్టుగా తోడేళ్లను తరిమేలా చేస్తే బాగుండేది.. కానీ బుజ్జిమేకపిల్లలా ఇంకెన్నాళ్లు తోడేళ్ల చేతుల్లో మాంసం ముద్దలు కావాలి..? కానీ కన్నీరు పెట్టించింది డ్యానీజీ..

    తోడేళ్ల రాజ్యంలో మైనార్టీలు మేకలు.. దౌర్జన్యాన్ని.. ప్రతిఘటనను.. నిస్సహాయతను చెప్పారు.. కానీ.. పోరాడి గెలవాలి.. గెలిచి తీరాలి.. మనం గెలవాలి..

    ReplyDelete
  14. Mohamme Khadeerbbu
    కడుపులో సుడి తిరుగుతున్న కోపం వ్యంగ్య రూపం తీసుకుంది. సీరియస్ యెఫర్ట్ సర్. 2017లో మీది గమనించ వలసిన కథ. keep writing.
    - మొహమ్మద్ ఖదీర్ బాబు, ప్రముఖ రచయిత

    ReplyDelete
  15. 15. Dr Gangadhar Gopidesi
    డానీనీనీ నీ....'మదర్సా మేకపిల్ల'ని తల్చుకుని గొంతు పూడుకు పోయింది. ఇంత కంటే మాటలు పెగలటం లేదు..

    ReplyDelete
  16. 16. ఎన్. వేణుగోపాల్

    డానీ, మదర్సా మేకపిల్ల చాల చాల బాగుంది. బాగుందని కూడ అనగూడదేమో. శక్తిమంతంగా ఉంది. కంటతడి పెట్టించింది. ముప్పై ఏళ్ల కిందటి ప్రహ్లాదుడు, కృపాణ్ గుర్తుకొచ్చాయి.
    గుర్తుందా, ప్రహ్లాదుడు చదివి కాళోజీ నువ్వు ఎవరని అడిగి మరీ పరిచయం చేసుకున్నాడు.
    - ఎన్. వేణుగోపాల్, వీక్షణం సంపాదకులు

    ReplyDelete
  17. 17. Pardtha Saradhi Muktavaram
    It is a modern fable. A gem of rhetoric.Did you read Kurt Vonnegut,an American writer? Fantasy is the legitimate device of any one, who attempts realistic themes.

    ReplyDelete
    Replies
    1. Sir,
      Thank you very much for your positive comment on my story ‘MADARASA MEKAPILLA’. I just heard about Kurt Vonnegut and his novel ‘Slaughterhouse-Five’. But I did not read it so far.

      Delete
  18. కథలు మూడు రకాలు
    జరగబోయేది ప్రేక్షకులకూ, పాత్రలకూ తెలియని కథలు.
    జరగబోయేది పాత్రలకు తెలిసి పాఠకులకు తెలియని కథలు.
    జరగబోయేది పాఠకులకు తెలిసి పాత్రలకు తెలియని కథలు.

    నేను మూడవ తరహా కథల్ని రాయడానికి ఎక్కువ ఇష్టపడతాను. అలాంటి ఒక కథ 'మదర్సా మేకపిల్ల' .

    రామాయణాన్ని ఇప్పటికి కొన్ని వందల మంది రాసుంటారు. జనం అవన్నీ చదువుతారు. పదుల సంఖ్యలో సినిమాలు వచ్చివుంటాయి. ప్రేక్షకులు అవన్నీ చూస్తారు. లవకుశ, సంపూర్ణ రామాయణం సినిమాలను ఏళ్ళ తరబడి చూఇన తెలుగు ప్రేక్షకులు రామాయణ్ హిందీ సీరియల్ ను రెండేళ్ళు టీవీలకు అతుక్కుపోయి చూశారు.

    రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ బంగారులేడిని వేటాడడానికి వెళ్ళాక, పర్ణశాలకు మారువేషంలో వచ్చింది రావణాసురుడని థియేటరులో వున్న ప్రేక్షకులు అందరికీ తెలుసు. తెర మీదున్న సీతాదేవికి మాత్రం ఆ విషయం తెలీదు. సీతాదేవి లక్ష్మణ రేఖను దాటుతుంటే ఆమెను అడ్డుకోవాలని ప్రేక్షకులు తపన పడతారు. "వాడు రావణాసురుడమ్మా!. నిన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు తల్లీ!" అని గట్టిగా అరిచి ఏడ్చేసిన మహిళా ప్రేక్షకుల్ని నేను చూశాను. పౌరాణిక గాధల్లోవున్న గమ్మతే అది.

    ముందుగానే ముగింపు తెలిసిపోతే కొందరు సినిమాకు వెళ్లరు. పౌరాణిక సినిమాలు విడుదల కాకముందే ముగింపు అందరికీ స్పష్టంగా తెలుసు. అయినా ప్రేక్షకులు అంతగా విరగబడి ఎందుకు చూస్తారూ ? దుర్యోధనుని పాత్రను ఎస్వీ రంగారావు ఒక విధంగా ఆవిష్కరిస్తే, ఎన్ టి రామారావు మరో రకంగా ఆవిష్కరిస్తారు. సృజనాత్మకత అంటే కొత్త విషయాన్ని చెప్పడం మాత్రమేకాదు, కొత్త కోణంలో కొత్తగా చెప్పడం కూడ.

    అందరికీ తెలిసిన కథను నాదైన శైలిలో నా దృక్పథంతో ఆసక్తిని రేకెత్తించేలా రాయడం నిజంగానే ఒక సవాలు. అలాంటి సవాలును నేను గొప్పగా ఆస్వాదిస్తాను.


    ReplyDelete
  19. DAWNY
    రావులపాటి సీతారామ్ నా ‘మదర్సా మేకపిల్ల’ కథ మీద విమర్శ రాస్తూ నన్ను DWANY అనడం గొప్ప బర్త్ డే గిఫ్ట్.

    DAWNY అంటే వెలుగును ప్రసాదించేవాడు, ఉదయాలను సృష్టించేవాడు అని అర్థం కాబోలు.

    ఒకానొక సందర్భంలో ఒక ప్రజాస్వామిక స్పేస్ కోసం తపిస్తున్న వేగుంట మోహన్ ప్రసాద్ లో తను దేవుడ్ని చూశానని సీతారామ్ రాశారు. “ఈవేళ (మదర్సా మేకపిల్ల) కథ చదివాక డానీలోనూ ఒక భగవంతుడ్ని, ఓ రాజ్యాంగ స్పూర్తిని, రాజ్యాంగ నైతికత కోల్పోయిన సమాజాన్ని, సమూహాన్ని చూసి విచారించే ప్రజాస్వామిక వాదినీ చూస్తున్నాను” అని రాశారు.

    కళాకారుల వ్యక్తీకరణల్ని వాళ్ళ భావోద్వేగాల నుండే అర్థం చేసుకోవాలి గానీ వాటికి విపరీతార్థాలు తీయడం సమంజసం కాదు. మాక్సిమ్ గోర్కి ఒక సందర్భంలో “నాకు దేవుని మీద విశ్వాసం లేదుగానీ ఒకవేళ వుంటే టాల్ స్టాయ్ ను దేవుడు అనే వాడ్నేమో” అంటాడు.

    అయితే, నేను కొంచెం చొరవ చేసి వినయపూర్వకంగా సీతారామ్ కు ఒక విన్నపం చేయదలిచాను. నన్ను భగవంతునితో పోల్చిన వాక్యాన్ని తీసివేయండి. నేను అల్లాను ఆరాధిస్తాను. నాలోనే భగవంతుడ్ని చూడడం నా విశ్వాసాలకు పొసగదు. ప్రవక్త వంటి మాటలూ వద్దు. సెయింట్ అంటే సరిపోతుందేమో ఆలోచించండి.

    వినయంగా
    మీ
    డానీ


    Ravulapati Seetharam
    వెలుగు చీకట్ల ను తెలిపేవాడనీన్నీ...సూర్యోదయంలాంటి వాడనీ అనుకున్నాను.మీ కథ గురించి ఇంత ఆలస్యంగా రాసినందుకు న న్ను నేను తిట్టుకున్నాను.మన చుట్టూ ఏమి జరుగుతూ ఉన్నదో బిగ్గరగా చెప్పటమే విప్లవాత్మక పని అని రోజా లక్సెంబర్గ్ అన్నట్టున్నారు.మీ కథ ఆపని చేసింది.

    Ravulapati Seetharam ఆ మాట లేక పోయినా అర్ధస్ఫూర్తికి భంగం లేదు కనుక తీసేద్దాం.అయిననూ నేను కదా చూస్తున్నది.మీకేల పట్టింపు?

    ReplyDelete